1. యిస్రాయేలీయులందరు ప్రోగైవచ్చిరి. దాను నుండి బేర్షెబా వరకును గిలాదు వరకునుగల ప్రజలందరును ఒక్కుమ్మడిగా గుమిగూడివచ్చి మిస్ఫా వద్ద యావే ఎదుట సమావేశమైరి.
2. దైవ ప్రజయగు యిస్రాయేలు తెగలవారందరు అచట ప్రోగైరి. వారి పెద్దలందరు హాజరైరి. అచట ఖడ్గమును ఝళిపింప గల కాలిబంట్లు నాలుగులక్షల మంది ఉండిరి.
3. యిస్రాయేలీయులు మిస్పాకు వెళ్లారని బెన్యామీనీయులు వినిరి. యిస్రాయేలీయులు లేవీయునితో “ఈ దుష్కార్యమెట్లు జరిగినదో వివరింపుము" అనిరి.
4. అసువులు బాసిన స్త్రీ భర్త లేవీయుడు వారితో “నేను నా భార్య బెన్యామీను గిబియా చేరి రాత్రి అచట నిద్రింపదలచితిమి.
5. గిబియా పౌరులు వచ్చి నా మీదపడిరి. రేయి వచ్చి నేనున్న ఇంటిని చుట్టుముట్టిరి. ఆ దుర్మార్గులు నన్ను వధింపగోరిరి. నా భార్యను చెరచగా ఆమె చనిపోయినది.
6. కనుక నేనామెను ముక్కలు ముక్కలుగా కోసి యిస్రాయేలు దేశము నలుమూలలకు పంపితిని. వారు యిస్రాయేలు నేలమీద ఇంతటి దుష్కార్యము చేసిరి. యిస్రాయేలీయులారా!
7. మీరందరు ఇచట గుమిగూడితిరిగదా! ఇపుడేమి చేయుదమో మీరే ఆలోచించి చెప్పుడు” అనెను.
8. ఆ జనులందరు లేచి నిలుచుండి ఏకగ్రీవముగా “మనలో ఒక్కడును తన గుడారమునకు తిరిగి పోకూడదు. ఒక్కడును తన ఇంటికి మరలి పోకూడదు.
9. గిబియాకు ఇట్లు బుద్ది చెప్పుదము. వంతులు వేసి గిబియాను ముట్టడింతము.
10. యిస్రాయేలు తెగల నుండి నూటికి పదిమందిని, వేయికి నూరు మందిని, పదివేలకు వేయిమందిని ఎన్నుకొందము. యిస్రాయేలు నేలమీద ఈ దుష్కార్యము చేసిన బెన్యామీను గిబియా పౌరుల పీచమణచుటకై యుద్ధమునకు పోయిన సైనికులకు వీరు ఆహారము సమకూర్ప వలయును” అని అనుకొనిరి.
11. కనుక యిస్రా యేలీయులందరు ఒక్కుమ్మడిగా గిబియాను ఎదుర్కొన బోయిరి.
12-13. యిస్రాయేలీయులు బెన్యామీనీయుల మండలము నాలుగుచెరగులకు దూతలనంపి “మీ జనము ఎంత పాడుపనిచేసెనో చూడుడు. ఈ జనులను, ఈ గిబియా పట్టణ దుర్మార్గులను మాకు అప్పగింపుడు. మేము వారిని చిత్రవధ చేసి యిస్రాయేలు నేలమీది నుండి దుష్టులనెల్లరను తుడిచివేసెదము” అని కబురు పెట్టించిరి. కాని బెన్యామీనీయులు తమ సోదరులగు యిస్రాయేలీయుల మాట పాటింపలేదు.
14. బెన్యామీనీయులు తమ పట్టణముల నుండి గిబియా వద్ద ప్రోగై యిస్రాయేలీయులతో యుద్ధమునకు తలపడిరి.
15. అటుల వెడలివచ్చిన బెన్యామీనీయులను లెక్కించిచూడగా ఖడ్గము ఝుళిపింపగల యోధులు ఇరువది ఆరు వేలమంది తేలిరి. గిబియా పౌరులు ఈ లెక్కలో చేరలేదు.
16. ఆ సైన్యమున ఏడు వందలమంది యోధులు ఎడమచేతితో గూడ పోరుసల్పగలరు. ఒడిసెలతో తలవెంట్రుకకు గూడ గురి పెట్టి తప్పిపోకుండ కొట్టగలరు.
17. యిస్రాయేలీయులు కూడ తమ జనమును లెక్కింపగా ఖడ్గము ఝుళిపింపగల వీరులు నాలుగులక్షలమంది తేలిరి. వారందరు పోరున కాకలుతీరిన వీరులు. ఈ లెక్కలో బెన్యామీనీయులు చేరలేదు.
18. యిస్రాయేలీయులందరు బేతేలు దేవళమునకు వెళ్ళి యావేను సంప్రతించిరి. “మాలో మొట్టమొదట బెన్యామీనీయులను ఎవరు ఎదుర్కోవలయును?” అని యావేను అడిగిరి. యావే “మొట్టమొదట యూదీయులు బెన్యామీనీయులను ఎదుర్కోవలయును” అని జవాబు చెప్పెను.
19. యిస్రాయేలీయులు వేకువనే పోరుకు ఆయత్తమై గిబియాకెదురుగా గుడారముపన్నిరి.
20. బెన్యామీనీయులను తాకుటకై తమపౌరులను నగరమునకు ఎదురుగా బారులు తీర్చిరి. కాని బెన్యామీనీయులు నగరము వెడలివచ్చి యిస్రాయేలీయులను ఇరువది రెండువేలమందిని రణరంగమున కూల్చిరి.
21. యిస్రాయేలీయులు వెనుదిరిగిపోయి యావే సముఖమున చేరి మాపటిజాము వరకు బోరున ఏడ్చిరి. యావేను సంప్రతించి "మా సోదరులైన బెన్యామీనీయులతో మరల పోరాటమునకు పొమ్మందువా?” అని అడిగిరి. యావే “పొండు, వారితో పోరాడుడు” అనెను.
22. యిస్రాయేలు సైన్యము ధైర్యము తెచ్చుకొని ముందటి రోజువలె మరల తమ దండులను బారులు తీర్చిరి.
23. రెండవనాడు బెన్యామీనీయులను మరల తాకిరి.
24-25. కాని బెన్యామీనీయులు మరల నగరము వెడలివచ్చి యిస్రాయేలీయులను పదునెనిమిది వేలమందిని రణరంగమున కూల్చిరి. మడిసిన వారందరును ఆరితేరిన శూరులు, ఖడ్గము ఝళిపింపగల వీరులు.
26. యిస్రాయేలు ప్రజలందరు బేతేలునకు వెళ్ళి దేవుని సముఖమున కూర్చుండి పెద్దపెట్టున ఏడ్చిరి. సాయంత్రము వరకు ఉపవాసముండిరి. సమాధానబలిని, దహనబలిని సమర్పించు కొనిరి.
27. యావేను సంప్రతించిరి. ఆ రోజులలో దైవమందసము బేతేలుననే యుండెడిది.
28. అహరోను మనుమడును, ఎలియెజెరు కుమారుడునగు ఫీనెహాసు అచట యాజకుడుగా నుండెను. వారు “మమ్ము మా సోదరులైన బెన్యామీనీయులతో మరల పోరాడమందువా లేక ఇంతటితో పోరు విరమింపమందువా?” అని ప్రశ్నించిరి. యావే “పోరాడుడు, రేపు వారిని మీ వశము చేసెదను” అని చెప్పెను.
29. యిస్రాయేలీయులు కొందరు వెళ్ళి గిబియా ప్రక్క దాగుకొనిరి.
30. మూడవదినము యిస్రాయేలీ యులు బెన్యామీనీయులపై పోరుకు వెడలి మునుపటి రీతిగనే తమ దండులను బారులు తీర్చిరి.
31. బెన్యామీనీయులు నగరము వెడలివచ్చి యిస్రాయేలీయులను తాకిరి. వారు పూర్వపురీతినే బేతేలు గిబియా నగరములకు వెడలు మార్గములలోనున్న యిస్రాయేలీయులను చంపవచ్చిరి. అటులవచ్చి మైదానమున యిస్రాయేలీయులను ముప్పది మందిని చంపిరి.
32. బెన్యామీనీయులు వీరు మునుపటివలె మనచేతబడి చత్తురులెమ్మను కొనిరి. కాని యిస్రాయేలీయులు “మనము పారిపోయినట్లు నటించి ఈ బెన్యామీనీయులను రాచబాటలవెంట నగరము నుండి వెలుపలికి రప్పింతము.
33. అపుడు యిస్రాయేలు సైన్యమున ప్రధానాంగము బాల్తమారు వద్ద శత్రువులను ఎదిరించును. అంతలో దాగియున్న యిస్రాయేలు కూడ గిబియాకు పడమటివైపు నుండి రావలెను” అని కూడ బలుకుకొనిరి.
34. ఆ రీతిగా కలియబలుకు కొని యిస్రాయేలీయులు పదివేలమంది వీరులను ఎన్నుకొని గిబియామీదికి పంపిరి. అచట పోరు ముమ్మరమయ్యెను. కాని బెన్యామీనీయులకు తమ వినాశము దాపురించినదని తెలియదు.
35. యావే బెన్యామీనీయులను ఓడింపగా యిస్రాయేలీయులు శత్రువులను ఇరువదిఅయిదువేల నూరుగురిని తునుమాడిరి. వారందరును కత్తి దూయగల వారే.
36. అప్పుడు బెన్యామీనీయులు ఓడిపోయితిమి గదా అనుకొనజొచ్చిరి. యిస్రాయేలీయులు గిబియా మాటున పొంచియున్న తమ సైన్యముతో ముందుగనే అన్ని ఏర్పాట్లు చేసికొని బెన్యామీనీయులు ముందు పారిపోయినట్లు నటించిరి.
37. అంతలో దాగి యున్న యిస్రాయేలీయులు వెలుపలికి వచ్చి పట్టణము మీదబడి అచటి జనులనెల్లరను కత్తివాదరకు ఎరజేసిరి.
38. గిబియామాటున దాగియున్నవారు నగరమును కాల్చి పొగ ఆనవాలు చూపింతుమని ముందుగనే యిస్రాయేలీయులకు చెప్పిరి.
39. అపుడు పారివచ్చిన యిస్రాయేలీయులు బెన్యామీనీయులను ఎదిరించి పోరాడిరి. బెన్యామీనీయులు యిస్రాయేలీయులను ముప్పదిమందిని కూల్చిరి. వారు “మునుపటివలెనే శత్రువులను ఎదిరించి పారద్రోలవచ్చును గదా!" అనుకొనిరి.
40. అంతలోనే నగరము నుండి పొగవెలువడెను. బెన్యామీనీయులు వెనుదిరిగి చూచి పొగమంటలు మింటికెగయుచుండగా తమ నగరము కాలి బుగ్గియగుటను గాంచిరి.
41. వారు యిస్రాయేలీయులు ఒక్కుమ్మడిగా తమపై పడుటను జూచి ఇక నాశనము తప్పదనుకొని చెల్లాచెదరైపోయిరి.
42. బెన్యామీనీయులు బ్రతుకుజీవుడాయని ఎడారిత్రోవలు పట్టి పారిపోజొచ్చిరి. కాని యిప్రాయేలు సైన్యములు వారిపై బడెను. పట్టణము మాటున పొంచియున్న వారును వచ్చి బెన్యామీనీయులు ఎదుర్కొనిరి.
43. వారందరు బెన్యామీనీయులను చుట్టుముట్టి తరుముకొనిపోయి గిబియాకు తూర్పున చిత్రవధ చేసిరి.
44. బెన్యామీనీయులు పదునెనిమిది వేలమంది కూలిరి. చచ్చిన వారందరును మహావీరులే.
45. చావక మిగిలినవారు తప్పించుకొని ఎడారివెంట పలాయితులై రిమ్మోను తిప్పకు పారిపోవుచుండగా వారిలో ఐదువేలమందిని ప్రధాన మార్గములలో మట్టుబెట్టిరి. వారిని గిదోము వరకును తరుముకొని మరి రెండువేలమందిని చంపిరి.
46. ఆ దినమున మడిసిన బెన్యామీనీయులు మొత్తము ఇరువది ఐదువేలమంది, వారందరును కత్తిదూయ గల మహా వీరులు.
47. ఆరువందలమంది మాత్రము ఎడారిని బడి పారిపోయి రిమ్మోనుతిప్ప చేరుకొని నాలుగు మాసముల వరకు దాగుకొనిరి.
48. యిస్రాయేలీయులు తిరిగిపోయి బెన్యామీను పట్టణముల మీద బడి నరులనక, పశువులనక, కంటికి కనుపించిన ప్రాణులనన్నింటిని మట్టు పెట్టిరి. వారి నగరములన్నిటిని కాల్చివేసిరి.