1. యిప్రాయేలు సమాజము మొదటి నెలలో సీను ఎడారి చేరి కాదేషున శిబిరము షన్నెను. అక్కడ మిర్యాము చనిపోగా యిస్రాయేలీయులు ఆమెను పాతిపెట్టిరి.
2. అచట ప్రజలకు నీళ్ళు లభింపలేదు. వారు గుమిగూడి వచ్చి మోషేపై, అహరోనుపై తిరుగబడిరి.
3. వారు మోషేతో “నాడు మా సోదరులు ప్రభువు గుడారము ముందట నాశనమైపోయినపుడు. మేము కూడ వారితోపాటు చచ్చియుండవలసినది.
4. నీవు ప్రభువు ప్రజలను ఇక్కడికి తోడ్కొనిరానేల? మేమును, మా పశువులును చచ్చుటకేగదా?
5. నీవు మమ్ము ఐగుప్తునుండి తరలించుకొనిరానేల? ఈ పాడునేలకు చేర్చుటకొరకేనా? ఇచట ధాన్యము, అత్తిపండ్లు, ద్రాక్షపండ్లు, దానిమ్మపండ్లు లభింపవాయె! అసలు త్రాగుటకు చుక్కనీళ్ళయిన దొరుకుటలేదే” అని గొణగుకొనిరి.
6. మోషే అహరోనులు.ప్రజలను వీడి సాన్నిధ్యపు గుడారము ఎదుటికి వచ్చి నేలపై బోరగిలబడిరి. అపుడు ప్రభు సాన్నిధ్యపు ప్రకాశము వారికి గోచరించెను.
7. ప్రభువు మోషేతో మాట్లాడెను.
8. “నీవు నీ కఱ్ఱను తీసికొనుము. నీవును, నీ సహోదరుడైన అహరోను ప్రజలను సమావేశపరుపుడు. వారందరు చూచుచుండగా ఆ ఎదుటనున్న బండతో మాట్లాడుము. అది నీళ్ళిచ్చును. ఈ రీతిగా నీవు బండనుండి నీళ్ళు పుట్టింపుము. ఈ ప్రజలు, వారి పశువులు ఆ నీళ్ళు త్రాగవచ్చును” అనెను
9. ప్రభువు ఆజ్ఞాపించినటులనే మోషే ప్రభు సాన్నిధ్యమునుండి ఆ కఱ్ఱను తీసికొనెను.
10. మోషే అహరోనులు ప్రజలను బండయెదుట ప్రోగుజేసిరి. మోషే వారితో “ద్రోహులారా! మేము మీకు బండ నుండి నీళ్ళు పుట్టింపవలెనా?” అనెను.
11. అంతట మోషే తన చెయ్యినెత్తి కఱ్ఱతో రెండు సార్లు బండను. మోదగా దానినుండి జలము పుష్కలముగా వెలువడెను. ప్రజలు, పశువులు ఆ నీళ్ళు త్రాగిరి.
12. అప్పుడు ప్రభువు మోషే అహరోనులను మందలించి “యిస్రాయేలు ప్రజలకన్నుల యెదుట నా పవిత్రతను మీరు విశ్వసించరైరి. కనుక నేను వాగ్దానముచేసిన భూమికి మీరు వీరిని నడిపించుకొని పోలేరు” అనెను.
13. ఈ సంఘటన మెరిబా వద్ద జరిగెను. అచట యిస్రాయేలీయులు ప్రభువుతో వాదులాడిరి. ప్రభువు వారి ఎదుట తన పవిత్రతను వెల్లడిచేసెను.
14. మోషే కాదేషునుండి ఎదోమురాజు వద్దకు దూతలను పంపెను.
15. 'ఎదోము రాజునకు నీ సోదరులగు యిస్రాయేలీయులు పంపువర్తమానము: మేము ఎన్ని కష్టములపాలయితిమో నీకు తెలియును. మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి. అచ్చట మేము చాన్నాళ్ళు వసించితిమి. కాని ఐగుప్తీయులు మా పితరులను, మమ్ములను పెట్టరానిబాధలు పెట్టిరి.
16. మేము ప్రభువునకు మొర పెట్టితిమి. ఆయన మా మనవిని ఆలించి ఐగుప్తునుండి మమ్ము తరలించుకొని వచ్చుటకై ఒక దూతను పంపెను. కనుక మేము నీ పొలిమేరలలోనున్న కాదేషునొద్దకు వచ్చి చేరితిమి.
17. మమ్ము నీ దేశముగుండ ప్రయాణము చేయనిమ్ము. మేము మీ పొలములకు, ద్రాక్షతోటలకు అడ్డముగా పడిపోము. మీ బావులలోని నీరు ముట్టు కోము. వేయేల, నీ పొలిమేరలు దాటువరకు మా పశువులును, మేమును రాజమార్గమునుండి బెత్తెడైనను వైదొలగము” అని చెప్పి పంపెను.
18. కాని ఎదోము రాజు "మీరు మా దేశముమీదుగా ప్రయాణము చేయరాదు, చేసెదరేని మేము మిమ్ము కత్తితో ఎదిరింతుము” అని సమాధానము పంపెను.
19. యిస్రాయేలీయులు మరల “మేము రాజమార్గము నుండి వైదొలగము. మా పశువులు కాని, మేముగాని మీ నీళ్ళు ముట్టు కొందుమేని మీకు పన్ను చెల్లింతుము. మీ దేశము గుండ మమ్ము కాలినడకన సాగిపోనిండు. మాకు ఈ మాత్రము అనుమతినిచ్చినచాలు” అని కబురంపిరి.
20. ఎదోమురాజు మరల “మీరు మా దేశమున అడుగు పెట్టరాదు” అని సమాధానము పంపెను. పైపెచ్చు ఎదోమీయులు పెద్దదండుగా గుమిగూడి యిస్రాయేలీయుల మీదికి దండెత్తివచ్చిరి.
21. ఈ రీతిగా ఎదోము అడ్డుతగిలినందున యిస్రాయేలీయులు వైదొలగి మరియొక మార్గము పట్టిరి.
22. యిస్రాయేలు సమాజము కాదేషు నుండి బయలు దేరి ఎదోము పొలిమేరలలో ఉన్న హోరు పర్వతము చేరెను.
23. అచట ప్రభువు మోషే అహరోనులతో మాట్లాడెను.
24. “మీరిరువురు మెరిబా వద్ద నామాట పాటింపలేదు. కనుక నేను యిస్రాయేలీయులకు ఇచ్చెదననిన భూమిని అహరోను చేరుకోజాలడు. అతడు ఇక్కడనే చనిపోయి తన పూర్వులను కలిసికొనును.
25. అహరోనును, అతని కుమారుడు ఎలియెజెరును, హోరు కొండ మీదికి కొనిరమ్ము.
26. ఆ కొండమీద అహరోను యాజక వస్త్రములను తొలగించి వానిని అతని కుమారునికి తొడుగుము. అహరోను అక్కడనే కన్నుమూయును” అని చెప్పెను.
27. మోషే ప్రభువు చెప్పినట్లే చేసెను. సమాజమంతయు చూచుచుండగా వారు హోరు కొండమీదికి ఎక్కిపోయిరి.
28. మోషే అహరోనునుండి యాజక వస్త్రములను తొలగించి ఎలియెజెరునకు తొడిగెను. అహరోను ఆ కొండమీదనే ప్రాణము విడిచెను. మోషే, ఎలియెజెరులు కొండమీదినుండి దిగివచ్చిరి.
29. అహరోను చనిపోయెనని విని యిస్రాయేలు సమాజమంతయు అతనికొరకు ముప్పది రోజులు విలపించెను.