ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సంఖ్యాకాండము చాప్టర్ 2

 1. దేవుడైన యావే మోషే, అహరోనులతో ఇట్లు చెప్పెను: 

2. “యిస్రాయేలీయులలో ప్రతిపురుషుడు తమతమ పితరుల కుటుంబముల జెండాలక్రింద, తమతమ తెగల ధ్వజము క్రింద గుడారములు పాతుకోవలెను. సాక్ష్యపుగుడారము చుట్టు నియమిత దూరమున తమ గుడారములను పాతుకోవలెను.

3. తూర్పుదిక్కున యూదా శిబిరపు ధ్వజమునకు చెందినవారు తమతమ జెండాలతో తమ నాయకు లతో గుడారములను పాతుకోవలెను. యూదా తెగ నాయకుడు అమ్మినాదాబు పుత్రుడు నహషోను.

4. అతని పరివారము మొత్తముసంఖ్య-74,600.

5. అతనికి ప్రక్కన యిస్సాఖారు తెగవారుండవలెను. సూవారు పుత్రుడు నెతనేలు వారికి నాయకుడు.

6. అతని పరివారము మొత్తముసంఖ్య-54,400.

7. అతనికి ప్రక్కన సెబూలూను తెగవారు ఉండవలెను. హెలోను పుత్రుడు ఎలీయాబు వారికి నాయకుడు.

8. అతని పరివారము మొత్తముసంఖ్య-57,400.

9. యూదా శిబిరపు మొత్తము జనసంఖ్య 186,400. శిబిరము కదలునపుడు వీరు మొదట కదలవలెను,

10. దక్షిణమున రూబేను శిబిరపు ధ్వజమునకు చెందినవారు తమతమ జెండాలతో తమనాయకులతో గుడారములను పాతుకోవలెను. రూబేను తెగ నాయకుడు షెదేయూరు పుత్రుడు ఎలీసూరు.

11. అతని పరివారము మొత్తముసంఖ్య-46,500.

12. అతనికి ప్రక్కన షిమ్యోనుతెగ వారుండవలెను. సూరీషద్దయి పుత్రుడు షోలుమీయేలు వారి నాయకుడు.

13. అతని పరివారము మొత్తముసంఖ్య - 59,300.

14. అతనికి ప్రక్కన గాదుతెగ వారుండవలెను. రవూయేలు పుత్రుడు ఎలియాసపు వారి నాయకుడు.

15. అతని పరివారము మొత్తముసంఖ్య - 45,650.

16. రూబేను శిబిరపు మొత్తము జనసంఖ్య 151,450. శిబిరము కదలునపుడు వీరు రెండవ స్థానమువారుగా బయలుదేరవలెను.

17. వీరి తరువాత సాన్నిధ్యపుగుడారముతో లేవీయులు కదలవలెను. ఈ తెగల వారందరు గుడారములు పన్నుకొనినప్పటి క్రమమునే ప్రయాణము చేయునపుడును పాటింపవలెను. వారు తమ తమ ధ్వజములను పూని నడువవలెను.

18. పడమటి దిక్కున ఎఫ్రాయీము శిబిరపు ధ్వజమునకు చెందినవారు తమతమ జెండాలతో తమ నాయకులతో గుడారములను పాతుకోవలెను. ఎఫ్రాయీము తెగ నాయకుడు అమ్మీహూదు కుమారుడు ఎలీషామా.

19. అతని పరివారము మొత్తము సంఖ్య - 40,500.

20. అతనికి ప్రక్కన మనష్షే తెగ వారుండవలెను. పెదాహ్సూరు కుమారుడు గమలీయేలు వారికి నాయకుడు.

21. అతని పరివారము మొత్తముసంఖ్య-32,200.

22. అతనికి ప్రక్కన బెన్యామీను తెగవారు ఉండవలెను. గిద్యోని కుమారుడు అబీదాను వారికి నాయకుడు.

23. అతని పరివారము మొత్తముసంఖ్య-35,400.

24. ఎఫ్రాయీము శిబిరములో మొత్తము జనసంఖ్య 108,100. వారు మూడవస్థానము వారుగా పయ నింపవలెను.

25. ఉత్తరమున దాను శిబిరపు ధ్వజమునకు చెందినవారు తమతమ జెండాలతో తమ నాయకులతో గుడారములను పాతుకోవలెను. దానుతెగ నాయకుడు అమ్మీషద్దయి కుమారుడు అహియెజెరు.

26. అతని పరివారము మొత్తమునంఖ్య - 62,700.

27. అతనికి ప్రక్కన ఆషేరు తెగ వారుండవలెను. ఓక్రాను కుమారుడు ఫగియేలు వారికి నాయకుడు.

28. అతని పరివారము మొత్తముసంఖ్య - 41,500.

29. అతనికి ప్రక్కన నఫ్తాలి తెగవారు ఉండవలెను. ఏనాను కుమారుడు అకీరా వారికి నాయకుడు.

30. అతని పరివారము మొత్తముసంఖ్య - 53,400.

31. దాను శిబిరములో మొత్తము జనసంఖ్య 157,600. దాను శిబిరము వారు చివరన నడువవలెను.

32. ఈరీతిగా తెగలవారిగా, వంశములవారిగా యిస్రాయేలీయుల జనసంఖ్య నిర్ణయింపగా మొత్తము జనులు 603,550 మంది తేలిరి.

33. కాని దేవుడైన యావే మోషేను ఆజ్ఞాపించినట్లు లేవీయులను మిగిలిన యిస్రాయేలీయులతో పాటు లెక్కింపలేదు.

34. యిస్రాయేలీయులు దేవుడైన యావే మోషేను ఆజ్ఞాపించినట్లే చేసిరి. శిబిరముల వారిగా తమతమ ధ్వజములక్రింద గుడారములు పాతుకొనిరి. తెగలవారిగా వంశముల వారిగా శిబిరముల నుండి కదలిరి.