ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజులు మొదటి గ్రంధము 1

 1. దావీదు పండు ముదుసలి అయ్యెను. కంబళ్ళతో కప్పినను అతని దేహమునకు వేడి పుట్టదయ్యెను.

2. కావున దావీదు కొలువుకాండ్రు అతనితో “ప్రభూ! నీకొక పడుచును కొనివత్తుము. ఆమె మీ యొద్దనే యుండి మీకు పరిచారము చేయును. మీ ప్రక్కలో పరుండి మీ మేనికి వేడి పుట్టించును” అని చెప్పిరి.

3. వారు అందమైన పడుచు కొరకై యిస్రాయేలు దేశమెల్ల గాలించిరి. కడన షూనేమున అబీషగు అను యువతి దొరకగా ఆమెను రాజు వద్దకు కొనివచ్చిరి.

4. అబీషగు మిక్కిలి అందగత్తె. ఆమె రాజు వద్దనే ఉండి అతనికి పరిచర్యలు చేసెను. రాజు అబీషగును కూడలేదు.

5. దావీదునకు హగ్గీతు వలన కలిగిన కుమారుడు అదోనీయా. అతనికి పొగరెక్కగా తానే రాజు కావలెనని కోరుకొనెను. కావున అదోనియా రథమును, గుఱ్ఱములను చేకూర్చుకొనెను. తన ముందు హెచ్చరికలు చేయుటకై ఏబదిమంది బంటులను నియమించెను.

6. దావీదు అదోనీయాను ఎప్పుడును మందలించి ఎరుగడు. అతడు మిగుల రూపవంతుడు. అబ్షాలోము తరువాత హగ్గీత్తు అతనిని కనెను.

7. అదోనియా సెరూయా కుమారుడగు యోవాబును, యాజకుడగు అబ్యాతారును రాజ్యవిషయమై సంప్రదించెను. వారు అతని సహాయము తీసికొనిరి.

8. కాని యాజకుడైన సాదోకు, యెహోయాదా కుమారుడగు బెనాయా, ప్రవక్తయగు నాతాను, షిమీ, రేయి, దావీదుని యోధులు అతనివైపు చేరలేదు.

9. ఒకనాడు అదోనీయా ఎన్రోగేలు చెంతనున్న “సర్పశిల" అను చోట పొట్టేళ్ళను, ఎద్దులను, బలిసిన కోడెలను వధించి బలిఅర్పించెను. అతడు తన సోదరులగు రాజకుమారులను, యూదా సీమనుండి రాజు కొలువున కుదిరిన ఉద్యోగులను విందుకు ఆహ్వానించెను.

10. కాని ప్రవక్త నాతానును, బెనాయాను, రాజు యోధులను, సోదరుడగు సొలోమోనును పిలువలేదు.

11. నాతాను సొలోమోను తల్లి బత్షెబ వద్దకు వెళ్ళి “మన ప్రభువగు దావీదునకు తెలియకుండగనే హగ్గీతు కుమారుడు అదోనియా రాజయ్యెను. ఈ సంగతి నీవు వింటివా?

12. ఇపుడు నీ ప్రాణమును, నీ కుమారుని ప్రాణమును దక్కించుకోగోరెదవేని నా మాటలు వినుము.

13. నీవు వెంటనే రాజు చెంతకు వెళ్ళి 'ప్రభూ! మీ తరువాత నా కుమారుడు సొలోమోను రాజగుననియు, అతడే మీ సింహాసనముపై అధిష్ఠించుననియు ప్రభువులవారు మాట ఈయలేదా? మరి ఇప్పుడు అదోనియా రాజగుట ఎట్లు?' అని అడుగుము.

14. నీవు ప్రభువుతో మాటలాడుచుండగనే నేనును వచ్చి నీ పలుకులు సమర్ధింతును" అని చెప్పెను.

15. కనుక బత్షెబ రాజుతో మాట్లాడుటకై అతని పడకగదికి వెళ్ళెను. అప్పటికి దావీదు ముదుసలి. షూనేమునుండి వచ్చిన పడుచు అబీషగు అతనికి పరిచర్య చేయు చుండెను.

16. బత్షెబ సాగిలపడి రాజునకు నమస్కరించెను. అతడు ఏమి పనిమీద వచ్చితివి అని అడిగెను.

17. ఆమె “ప్రభూ! మీ తరువాత నా కుమారుడు సొలోమోను రాజగునని, అతడే మీ సింహాసనముపై కూర్చుండునని ప్రభువుల వారు యావే పేర బాస చేయలేదా?

18. అయినను ఇప్పుడు అదోనియా రాజయ్యెనుకదా! ఏలినవారికి ఈ సంగతి ఏమియు తెలియనట్లున్నది.

19. అతడు గొఱ్ఱెపోతులను, ఎడ్లను, బలిసినకోడెలను మిక్కుటముగా వధించి బలి అర్పించెను. రాజకుమారులను, యాజకుడగు అబ్యాతారును, సైన్యాధిపతియగు యోవాబును విందునకు ఆహ్వానించెను. కాని మీ కుమారుడు సొలోమోనును మాత్రము పిలువడయ్యెను.

20. ప్రభూ! మీ తరువాత ఎవరు రాజు అగుదురో తెలిసికోవలయునని యిస్రాయేలీయులందరు ఉవ్విళ్ళూరుచున్నారు.

21. ఈ సంగతిని ప్రభువులవారు ఇప్పుడే నిర్ణయింపరేని తమరు కన్నుమూసిన పిదప నేను నా కుమారుడు సొలోమోను రాజద్రోహులముగా లెక్కింపబడుదుము" అని పలికెను.

22. ఆమె రాజుతో ఇట్లు మాట్లాడుచుండగనే ప్రవక్త నాతాను కూడ వచ్చెను.

23. ప్రవక్త వచ్చెనని పరిచారకులు రాజునకు విన్నవించిరి. నాతాను రాజు ఎదుటికి వచ్చి తలవంచి దండము పెట్టెను.

24. అతడు “ప్రభూ! మీ తరువాత అదోనీయా రాజు కావలెనని తమరు ఆజ్ఞాపించితిరా?

25. అతడు నేడే పొట్టేళ్ళను, ఎడ్లను, బలిసిన కోడెలను మిక్కుటముగా వధించి బలిఅర్పించెను. రాజకుమారులను సైన్యాధిపతియగు యోవాబును, యాజకుడగు అబ్యాతారును విందునకు ఆహ్వానించెను. అదిగో! చూడుడు! వారిప్పుడే విందారగించుచున్నారు. మా రాజు అదోనియాకు దీర్ఘాయువు అని అరచుచున్నారు.

26. కాని వారు నన్నుగాని, యాజకుడు సాదోకునుగాని, బెనాయాను గాని, సొలోమోనునుగాని ఆహ్వానింపరైరి.

27. ప్రభూ! ఇది అంతయు మీ అనుమతితోనే జరిగినదా? అట్లయిన ఏలినవారు తమ కొలువుకాండ్రకు ఈ సంగతి తెలుపరైతిరేమి?" అని అడిగెను.

28. దావీదు బత్షెబను పిలిపింపగా ఆమె వచ్చి అతనియెదుట నిలుచుండెను.

29. అతడు ఆమెతో “నన్ను సకల ఆపదలనుండి కాపాడిన సజీవుడగు దేవుని పేర ప్రమాణము చేయుచున్నాను వినుము.

30. నా తరువాత నా కుమారుడు సొలోమోను నిక్కముగా రాజగునని యిస్రాయేలు దేవుని పేర మునుపు నేను నీకిచ్చిన మాట ఈ దినముననే నెరవేర్చుదును” అని చెప్పెను.

31. బత్షెబ సాగిలపడి రాజునకు నమస్కరించి “ప్రభువులవారు కలకాలము జీవింతురు గాక!” అని అనెను.

32. అంతట రాజు యాజకుడైన సాదోకును, ప్రవక్తయైన నాతానును, బెనాయాను పిలిపింపగా వారు అతని చెంతకు వచ్చిరి.

33. రాజు వారితో “నా కుమారుడు సొలోమోనును నా కంచర గాడిదపై ఎక్కించుకొని గీహోను చెలమవద్దకు తీసికొనిపొండు. నా కొలువుకాండ్రను కూడ మీ వెంట కొనిపొండు.

34. అచట యాజకుడైన సాదోకు, ప్రవక్తయైన నాతాను సొలోమోనును యిస్రాయేలు రాజుగా అభిషేకింపవలయును. తరువాత బాకాను ఊదించి 'సొలోమోనునకు దీర్ఘాయువు!' అని ప్రకటన చేయుడు.

35. అటుపిమ్మట మీరందరు సొలోమోను వెంటనడచుచు, సింహాసనముపై కూర్చుండబెట్టుటకై అతనిని ఇచటకు కొనిరండు. అతడు నాకు బదులుగా రాజగును. యిస్రాయేలును, యూదాను పరిపాలించుటకై నేను సొలోమోనును నియమించితిని” అని చెప్పెను.

36. ఆ మాటలకు బెనాయా “ఏలినవారు చెప్పినట్లే చేయుదుము. మీరు కొలుచు యావే ప్రభువు మీ మాటను స్థిరపరచునుగాక!

37. ప్రభువు మీకు తోడైయున్నట్లే సొలోమోనునకు కూడ తోడైయుండు గాక! అతడు మీకంటెను ప్రసిద్ధుడగును గాక!” అని అనెను.

38. అంతట యాజకుడైన సాదోకు, ప్రవక్తయైన నాతాను, యెహూయాదా కుమారుడగు బెనాయా, రాజు అంగరక్షకులగు కెరెతీయులు, పెలెతీయులు సొలోమోనును రాజుగారి కంచరగాడిదపై కూర్చుండ బెట్టి గీహోను చెలమవద్దకు తోడ్కొనిపోయిరి.

39. ప్రభు గుడారమునుండి కొనివచ్చిన కొమ్ములోని నూనెతో యాజకుడైన సాదోకు సొలోమోనును అభిషేకించెను. అటుపిమ్మట బాకానూదింపగా జనులెల్లరు 'సొలోమోను రాజునకు దీర్ఘాయువు!” అని నినాదములు చేసిరి.

40. అంతట ప్రజలు పిల్లనగ్రోవులూదుచు, సంతోషము మిన్నుముట్టగా నేల దద్దరిల్లిపోవునట్లు కేకలిడుచు సొలోమోనును రాజసౌధమునకు తీసికొనివచ్చిరి.

41. అచట చాకిరేవు చెంత అదోనియా, అతని అనుచరులు విందు ముగించుచుండగా ప్రజల పొలి కేకలు వినిపించినవి. యోవాబు బాకానాదము విని “పట్టణములో ఆ కోలాహలమేమిటి' అని ప్రశ్నించెను.

42. అతడు ఇంకను ప్రశ్నించుచుండగనే అబ్యాతారు కుమారుడు యోనాతాను వచ్చెను. అతనిని చూచి అదోనీ, “రా రమ్ము! నీవు యోగ్యుడవు కనుక మాకు మంచివార్తలనే తెచ్చియుందువు” అని అనెను.

43. యోనాతాను “అవును, మన ప్రభువగు దావీదు సొలోమోనును రాజును చేసెను.

44. సొలోమోను వెంట యాజకుడైన సాదోకును, ప్రవక్తయైన నాతానును, బెనాయాను, కెరెతీయులను, పెలెతీయులను రాజు పంపెను. వారతనిని రాజుగారి కంచర గాడిదపై ఎక్కించుకొనిపోయిరి.

45. యాజకుడైన సాదోకు, ప్రవక్తయైన నాతాను అతనిని ఊహోనున రాజుగా అభిషేకించిరి. అటు తరువాత వారందరు సంతోషముతో కేకలు వేయుచు పట్టణమునకు మరలివచ్చిరి. నగరమంతయు అల్లకల్లోలముగానున్నది. మీరు వినిన నినాదమదియే.

46. ఇపుడు సొలోమోను సింహాసనముపై ఆసీనుడైయున్నాడు.

47. పైపెచ్చు కొలువుకాండ్రు దావీదును దర్శింపవచ్చి 'దేవుడు సొలోమోనును మీకంటె అధికుని జేయుగాక! అతని రాజ్యమును మీ రాజ్యముకంటె సుప్రసిద్ధము చేయుగాక!' అని దీవించిరి.

48. ఆ మాటలకు దావీదురాజు పడుక పైనుండియే సాగిలపడి నమస్కరించి 'యిస్రాయేలు ప్రభువైన దేవునికి స్తుతి కలుగునుగాక! ప్రభువు నేను చూచుచుండగనే నేడు నా కుమారుని సింహాసనముపై కూర్చుండబెట్టెనుకదా' అని పలికెను!” అని చెప్పెను.

49. ఆ మాటలు విని అదోనీయా, అతిథులు మిగుల భయపడి ఎవరిత్రోవన వారు వెడలిపోయిరి.

50. అదోనియా సొలోమోనునకు భయపడి ప్రభు మందిరము ప్రవేశించి బలిపీఠము కొమ్ములకు' పెనవేసికొనెను.

51. అదోనీయా సొలోమోనునకు వెరచి బలిపీఠము కొమ్ములను ఆశ్రయించెననియు, రాజు తనను చంపనని మాటయిచ్చిననే కాని అచటనుండి కదలననుచున్నాడనియు సొలోమోనునకు తెలియజేసిరి.

52. సొలోమోను “అదోనియా విశ్వాసయోగ్యముగా ప్రవర్తించినచో అతనిమీద ఈగైన వ్రాలదు. కాని అతడు కపటబుద్ది అయ్యెనేని తప్పక ప్రాణములు కోల్పోవలసినదే” అని అనెను.

53. అంతట రాజు సేవకులనంపగా వారు అదోనియాను బలిపీఠము వద్దనుండి తీసికొనివచ్చిరి. అదోనియా సొలోమోనునకు సాష్టాంగపడి నమస్కరించెను. రాజతనితో “ఇక నీ ఇంటికి వెడలిపొమ్ము” అనెను.