ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఉపదేశకుడు 1

 1. దావీదు కుమారుడును, యెరూషలేము నుండి పరిపాలన చేయువాడునగు ఉపదేశకుని పలుకులివి.

2. వ్యర్థము, వ్యర్ధము, అంతయు వ్యర్థమేయని ఉపదేశకుడు చెప్పుచున్నాడు.

3. సూర్యుని క్రింద ఈ ధరణిపై నరుడుపడు నానాశ్రమలకు ఫలితమేమున్నది?

4. ప్రాతతరములు గతించి క్రొత్తతరములు వచ్చుచున్నవి. అయినను ఈ లోకము మాత్రము ఎప్పుడును ఒకే రీతిని కొనసాగిపోవుచున్నది. 

5. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తాను ఉదయించు స్థలమునకు మరల చేరుటకు త్వరపడును.

6. గాలి దక్షిణమునకు వీచి, అచటి నుండి ఉత్తరమునకు మరలి, అచట గుండ్రముగా తిరిగి మరల పూర్వస్థానమును చేరుకొనుచున్నది.

7. నదులన్నియు సముద్రములోనికి ప్రవహించును. అయినను, వానివలన సముద్రము నిండదు. జల ములు మరల నదీజన్మస్థానమును చేరుకొని అచటి నుండి మరల ప్రవహింప మొదలిడును.

8. ప్రతి దినము సమస్తమును ఎడతెరిపిలేకుండా జరుగు చున్నవి. మానవులు దానిని వివరింపజాలరు. మన కన్నులు తాము చూచినవానితోగాని, మన చెవులు తాము విన్నవానితోగాని సంతృప్తి చెందుటలేదు.

9. పూర్వము జరిగిన కార్యములే ఇప్పుడును జరుగు చున్నవి. నరులు పూర్వము చేసిన పనులే మరల చేయు చున్నారు. సూర్యునిక్రింద క్రొత్తది ఏదియును లేదు.

10. “ఇది క్రొత్తది” అనిపించుదానిని దేనినైనను పరిశీలింపుడు. అది మనము పుట్టక పూర్వము నుండియు ఉన్నదేనని విశదమగును.

11. పూర్వము జరిగిన కార్యములను ఇప్పుడెవరును జ్ఞప్తియందుంచు కొనరు. అట్లే ఇక జరుగువానిని గూడ భావితరముల వారు జప్తియందుంచుకొనరు.

12. ఉపదేశకుడనైన నేను యెరూషలేము నుండి యిస్రాయేలీయులను పరిపాలించితిని.

13. నేను విజ్ఞానబలముతో ఈ లోకమున జరుగు కార్యము లన్నిటిని పరిశీలించుటకు నా మనస్సును లగ్నము చేసితిని. నరుడు సాధనమొనరింప దేవుడు వారికి ఏర్పాటుచేసిన శ్రమ బహువేదనకరమైనది.

14. నేను సూర్యుని క్రింద నరులుచేయు కార్యములెల్ల గమనించి తిని. అది అంతయూ వ్యర్ధమే. గాలికై ప్రయాస పడుటయే.

15. వంగిన దానిని వంకర తీయలేము, లోపము కలది లెక్కకు రాదు.

16. యెరూషలేమున రాజ్యము చేసిన రాజు లందరికంటెను నేనెక్కువ విజ్ఞానము గడించితిననియు, విద్యయందును, విజ్ఞానమునందును అందరికంటెను నాకు ఎక్కువ అనుభవము కలదనియు నేను భావించితిని.

17. నేను జాగ్రత్తగా విజ్ఞానమును అలవర్చుకో గోరితిని. వెట్టితనమును, బుద్ధిహీనతనుగూడ జాగ్రత్తగా పరిశీలించి చూడగోరితిని. కాని ఈ శ్రమగూడ గాలికై ప్రయాసపడుటయేనని గ్రహించితిని.

18. ఎక్కువ విజ్ఞానము ఎక్కువ విచారమును తెచ్చును; ఎక్కువవిద్య ఎక్కువ సంతాపమును తెచ్చును.