ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఎజ్రా 1

 1. పారశీకదేశరాజైన కోరెషు ఏలుబడి మొదటి యేట ప్రభువు ఆ రాజు అంతరంగమున ప్రబోధించెను. కనుక అతడొక లిఖితరూపమైన చట్టమును జారీచేసి దానిని తన రాజ్యము నలుమూలల ఈ క్రింది విధముగా ప్రకటన చేయించెను. ప్రభువు ముందుగానే యిర్మియా ద్వారా పలికినపలుకు నెరవేరునట్లు ఈ సంఘటన జరిగెను.

2. "పారశీక ప్రభువైన కోరెషు ఆజ్ఞ ఇది. ఆకాశమందలి దేవుడు నన్ను ఈ భూలోకమంతటికిని అధిపతిని చేసెను. ఆయన యూదా రాజ్యమందలి యెరూషలేమున నన్నొక దేవాలయము నిర్మింపుమని ఆజ్ఞను ఇచ్చెను.

3. మీలో ఆ ప్రభువును కొలుచు ప్రజలెల్లరికిని ఆయన బాసటయైయుండునుగాక! ఆ ప్రభువును సేవించు ప్రజలెల్లరును యెరూషలేమునకు తిరిగిపోయి ఆయన దేవాలయమును పునర్నిర్మింపుడు.

4. మీ మధ్య నివసించువారు యూదా దేశమందున్న యెరూషలేమునకు పోవువారికి స్వేచ్చార్పణగాక, వెండి బంగారములను, వస్తుసామాగ్రిని, పశుగణమును, యెరూషలేము దేవాలయము నిర్మించుటకు సహాయము చేయవలయును.”

5. అపుడు యూదా బెన్యామీను తెగల అధిపతులును, యాజకులును, లేవీయులును, ప్రభువువలన ప్రేరేపింపబడిన వారందరును ప్రభుమందిరమును పునర్నిర్మించుటకై యెరూషలేమునకు వెళ్ళుటకు సంసిద్దులైరి.

6.ఇరుగుపొరుగువారు ఆ భక్తులకు వెండి బంగారములు, వస్తుసామాగ్రి, పశువులు, విలువగల బహుమతులు ఇచ్చివారికి సహాయము చేసిరి.

7.మునుపు నెబుకద్నెసరురాజు యెరూషలేము నుండి కొనివచ్చి తన దేవళమున అర్పించిన పాత్ర లను గూడ కోరెషురాజు ఆ భక్తులకు తిరిగి ఇచ్చి వేసెను.

8. రాజు పాత్రములను తన కోశాధికారియైన మిత్రెదాతుకు ఈయగా, అతడు వానినన్నిటిని లెక్కిడి యూదాపాలకుడగు షేష్బస్సరునకు ఒప్పచెప్పెను.

9-10. ఆ లెక్కల వైనమిది: బంగారుపాత్రలు-30 వెండి పాత్రలు-1000 ధూపపాత్రలు-29 పానీయార్పణమునకు వాడు బంగారుపాత్రలు-30 పానీయార్పణమునకువాడు వెండిపాత్రలు-410 ఇతర పాత్రలు-1000

11. ఇవి మొత్తము కలిపి 5,400 వెండి, బంగారు పాత్రలు. షేష్బస్సరు, ఇతర భక్తులు బబులోనియా ప్రవాసమునుండి యెరూషలేమునకు తిరిగివచ్చినప్పుడు ఈ పాత్రములన్నింటిని తమతో కొనివచ్చిరి.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services