ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సంఖ్యాకాండము చాప్టర్ 19

 1-2. ప్రభువు మోషే అహరోనులతో “యిస్రాయేలీయులకు ఈ క్రింది ఆజ్ఞలనిండు. ఇప్పటి వరకు కాడిని మోయనిదియు, ఎట్టి అవలక్షణములు లేనిదియునగు ఎఱ్ఱని ఆవు పెయ్యను ఒక దానిని కొనిరండు.

3. దానిని యాజకుడగు ఎలియెజెరునకు అర్పింపుడు. ఆ పెయ్యను శిబిరమువెలుపల అతని యెదుటనే వధింపవలెను.

4. ఎలియెజెరు దాని నెత్తురును కొనగోళ్ళతో సమావేశపు గుడారపువైపు ఏడుసార్లు చిలుకరింపవలెను.

5. చర్మము, మాంసము, నెత్తురు, ప్రేవులతో పాటు ఆ పెయ్యను యాజకుని ముందటనే పూర్తిగా కాల్చివేయవలెను.

6. అతడు దేవదారు కొయ్యను, నెత్తురు చిలుకరించు హిస్సోపు మండను, ఎఱ్ఱనినూలును తీసికొని ఆ పెయ్యను కాల్చుచున్న నిప్పులో పడవేయవలెను.

7. అటు పిమ్మట అతడు తన బట్టలు ఉతుకుకొని తలస్నానము చేసి శిబిరమునకు వెళ్ళిపోవచ్చును. అయినను అతడు సాయంకాలమువరకు మైలపడియుండును.

8. ఆవు పెయ్యను దహనము చేసినవాడు కూడ తన బట్టలు ఉతుకుకొని తలస్నానము చేయవలెను. అతడు కూడ సాయంకాలము వరకు మైలపడియుండును.

9. శుద్ధుడైన నరుడు ఒకడు దహింపబడిన ఆ ఆవు పెయ్య బూడిదను ప్రోగుజేసి శిబిరమునకు వెలుపల ఒక శుభ్రమైన స్థలమున ఉంచవలెను. యిస్రాయేలీయులలో మైలపడిన వారిని శుద్ధిచేయుటకై పాపపరిహార జలముగా వారికొరకు దానిని పదిలపరుపవలెను. నరులను పాపమునుండి శుద్ధిచేయుటకై ఇట్లు చేయవలెను.

10. ఆవు పెయ్య బూడిదను ప్రోగుచేసిన వాడు తన బట్టలు ఉదుకుకోవలెను. కాని అతడు సాయంకాలము వరకు మైలపడియుండును. యిస్రాయేలీయులకు గాని వారితో జీవించు పర దేశీయులకు గాని ఈ నిత్యమైనకట్టడ కలకాలము వర్తించును.

11. శవమును ముట్టుకొనినవాడు ఏడురోజుల వరకు మైలపడియుండును.

12. అతడు మూడవ దినమునను మరియు ఏడవ దినమునను శుద్ధీకరణ జలముతో శుద్ధి చేసుకొనినపిదప శుద్ధినొందును. అటుల చేయనివారు శుద్ధినొందరు.

13. శవమును ముట్టుకొని శుద్ధిచేసికొనని వారు ప్రభుమందిరమును మైలపరుతురు. శుద్ధీకరణ జలము వారిమీద చిలుకరింపబడలేదు. కనుకవారిని సమాజము నుండి వెలివేయవలెను, వారిమైల వారిని వదలదు.

14. మీ గుడారమునందు ఎవరైనను చనిపోయినపుడు అక్కడ ఉన్నవారును, అందు ప్రవేశించువారును ఏడుదినములవరకు మైలపడుదురు.

15. ఆ గుడారమున ఉన్న పాత్రలు మూతవేయబడక తెరిచియున్నచో అవియును మైలపడిపోవును.

16. వెలుపలి పొలమున ఎవరైనను మృతదేహమును గాని, హతునిదేహమును గాని, మృతుల ఎముకలనుగాని, సమాధులను గాని ముట్టుకొనినచో ఏడుదినములవరకు మైలపడుదురు.

17. ఇటువంటిమైలను తొలగింపవలెనన్న పాపపరిహారముగా దహనము చేయబడిన ఆవు పెయ్య బూడిదను. తీసికొని ఒక మట్టిపాత్రలో ఉంచి పారుచున్న యేటినీరును దానిలో పోయవలెను.

18. అంతట మైలసోకని నరుడొకడు ఆ నీటిలో హిస్సోపు మండలను ముంచి గుడారముమీదను, దానిలోని నరులమీదను, కుండలమీదను చిలుకరింపవలెను. మృతదేహమునుగాని, హతుని దేహమునుగాని, ఎముకలనుగాని, సమాధులనుగాని ముట్టుకొని మైలపడిన వానిమీదగూడ ఆ నీటిని చిలుకరింపవలెను.

19. పవిత్రుడొకడు మైలసోకిన వానిమీద మూడవ దినమున, ఏడవదినమున నీళ్ళు చిలుకరింపవలెను. అతడు ఏడవదినమున శుద్దుడగును. అతడు బట్టలు ఉతుకుకొని స్నానముచేసిన పిదప సాయంకాలమున శుద్దుడగును.

20. మైలసోకినవారు. ఈ రీతిగా శుద్ధిచేయించుకొనని యెడల వారిని సమాజమునుండి వెలివేయవలెను. లేదేనివారు ప్రభుని గుడారమును మైలపరతురు. వారిమీద శుద్ధీకరణ జలము చిలుకరింపబడలేదు కదా! కనుక వారు అపవిత్రులు.

21. ఇది. మీకు శాశ్వతనియమముగా ఉండవలెను. శుద్ధీకరణ జలము చిలుకరించువాడు , తన బట్టలు ఉతుకుకొనవలెను. ఈ జలములు ముట్టు కొనినవాడు సాయంకాలమువరకు మైలపడియుండును.

22. మైలపడినవాడు ముట్టుకోనిన వస్తువులును మైలపడిపోవును. ఆ వస్తువులను ముట్టుకొనినవారును మైలపడిపోవుదురు” అనెను.