ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

న్యాయాధిపతులు 18

 1. ఆ రోజులలో యిస్రాయేలీయులకు రాజు లేడు. ఆ కాలమున దాను తెగవారు నివాస ప్రదేశము కొరకు వెదకుచుండిరి. యిస్రాయేలు తెగలందు దాను తెగవారికి స్వాస్త్యభూమి ఇంకను లభింపలేదు.

2. దానీయులు తమ జనమునుండి ఐదుగురు వీరులను ఎన్నుకొనిరి. దేశమును వేగుజూచుటకై జోరా, ఎష్టావోలు నగరమునుండి ఆ ఐదుగురను పంపించిరి. “మీరు పోయి ఈ దేశమును పరిశీలించిరండు” అని చెప్పిరి. ఆ వేగులవాండ్రు ఎఫ్రాయీము పర్వతసీమ  చేరుకొని రేయి మీకా ఇంట బసచేయవచ్చిరి.

3. వారు మీకా ఇంటిపట్టునకు రాగానే అతని యాజకుడైన లేవీయ యవ్వనస్తుని స్వరమును గుర్తుపట్టిరి. ఆ ఇల్లు సొచ్చి “నిన్నిచటికి ఎవ్వరు కొనివచ్చిరి? ఇచట ఏమి చేయుచున్నావు? నీ పనియేమి?" అని ప్రశ్నించిరి.

4. అతడు “ఈ మీకా నన్ను పరామర్శించుచున్నాడు. ఇతడు జీతము బత్తెము ఇచ్చి నన్ను తన యాజకునిగా నియమించుకొనెను” అని చెప్పెను.

5. వారు అతనితో “మేము చేయు ప్రయాణము సఫలమగునేమో యావేను సంప్రతించిచూడుము” అనిరి.

6. అతడు వారితో “యావే మీకు బాసటయైయుండును. నిశ్చింతగా పోయి రండు” అని చెప్పెను.

7. ఆ ఐదుగురు అటనుండి పయనమైపోయి లాయీషు చేరుకొనిరి. అచటి జనులు సీదోనీయులవలె చీకుచింతలేక నిర్భయముగా జీవించు చుండిరి. పొలమున పంటకేమియు కొదువలేదు. సీదోనీయులకు, వారికి చాలదూరము. అరామీయులతో వారికి అసలు సంబంధమేలేదు.

8. ఆ తావును పరిశీలించి వేగువాండ్రు జోరా, ఎష్ణావోలు పట్టణములకు తిరిగివచ్చిరి. పట్టణవాసులు “ఏమి వార్తలు తెచ్చితిరి?” అని అడిగిరి.

9. వారు “మేము దేశమంతయు గాలించి లాయీషువరకు పోయితిమి. అచటి ప్రజలు చీకుచింతలేక నిర్భయముగా జీవించుచున్నారు. సీదోనీయులకు వారికి చాలదూరము. అరామీయులతో వారికి అసలు పొత్తులేదు. పోయి వారిమీద పడుదమురండు. మేము ఆనేలను కన్నులార చూచివచ్చితిమి. అది కంటికి ఇంపయిననేల. ఇక ఆలోచింపనక్కరలేదు. జాగు సేయకపోయి లాయీషు మీదపడి ఆ నేలను గెలుచుకొందము.

10. ఆ జనమునకు అక్కడ దిక్కుదివాణము లేదు. ఆ దేశముకూడ చాల విశాలమైనది. ఇంతయేల? భూమిమీద నరుడు కోరుకొనువస్తువు దేనికిని కొరత కలుగని నేలను యావే మనకు అందునట్లు చేసెను” అని చెప్పిరి.

11. జోరా, ఎష్టావోలు పట్టణములనుండి దాను వంశీయులు ఆరువందలమంది సాయుధులై యుద్ధమునకు బయలుదేరిరి.

12. వారు కిర్యత్యారీమున విడిదిచేసిరి. కనుకనే ఆ తావునకు నేటికిని దానీయుల శిబిరము అని పేరు. ఆ చోటు కిర్యత్యారీమునకు పడమట కలదు.

13. అచటినుండి వారు ఎఫ్రాయీము పర్వతసీమ చేరి మీకా ఇల్లుసొచ్చిరి.

14. అపుడు దేశమును వేగుచూచుటకు వెళ్ళివచ్చిన ఐదుగురు తమ అనుచరులతో “చూచితిరా! ఈ ఇంట ఏఫోదు, తెరాఫీము, పోతవిగ్రహమును గలవు. ఇపుడు మనము చేయవలసినదేమో లెస్సగా విచారింపుడు” అని చెప్పిరి.

15. అంతట వారు త్రోవనుండి ప్రక్కకు తొలగి మీకా ఇంటనున్న లేవీయునియొద్దకు వచ్చి అతనిని కుశలమడిగిరి.

16. సాయుధులై వచ్చిన ఆరువందల మంది పురద్వారముచెంత నిలుచుండిరి.

17. వేగు జూచి వచ్చిన ఆ ఐదుగురు ఇల్లుసొచ్చి విగ్రహమును, ఏఫోదు తెరాఫీములను కొనివచ్చిరి. అపుడు యాజకుడు సాయుధులతోపాటు పురద్వారము ఎదుట నిలు చుండియుండెను.

18. ఇంటి లోపలికి వెళ్ళినవారు విగ్రహమును, ఏఫోదు తెరాఫీములను కొనివచ్చుట జూచి యాజకుడు “ఇది ఏమి పని?” అని ప్రశ్నించెను.

19. వారు అతనితో “నీవు చప్పుడు చేయవలదు. నోటిపై చేయిమూసికొని మా వెంటరమ్ము. నీవు మాకు యాజకుడవై మాపట్ల తండ్రివలె ప్రవర్తింపవలెను. నీవు ఒక్క కుటుంబమునకు అర్చకుడవగుట మేలా లేక ఒక యిస్రాయేలు వంశమునకు, ఒక తెగ వారందరికి యాజకుడవగుట మేలా?" అని అనిరి.

20. ఆ మాటలకు యాజకుడు సంతసించెను. వారియొద్ద నుండి విగ్రహమును, ఏఫోదు తెరాఫీములను గైకొని తాను ఆ జనుల నడుమ నడువజొచ్చెను.

21. వారు తమ సేవకులు, సామగ్రి, మందలు ముందు నడువగా మునుపు వచ్చిన త్రోవవెంటనే పయనము సాగించుచుండిరి.

22. ఆ ప్రజలు కొంత దూరము సాగిపోగానే మీకా ఇరుగుపొరుగు వారిని ప్రోగుచేసికొని దానీయుల వెంటబడెను.

23. వారు దానీయులను పొలికేకలువెట్టి పిలిచిరి. దానీయులు వెనుదిరిగి చూచి మీకాతో "ఓయి! నీకేమి పొగరు? ఇట్లు మా వెంట బడెదవేల?” అని అడిగిరి.

24. అతడు “మీరు నేను స్వయముగా నా చేతులతో చేసికొనిన దేవతా విగ్రహమును గొనిపోవుచున్నారు. నా యాజకునిగూడ తీసికొనిపోవుచున్నారు. మీ త్రోవను మీరు హాయిగా వెళ్ళుచున్నారు. కాని నాకిక ఏమి మిగిలినది? పైపెచ్చు నాకేమి పొగరని అడుగు చున్నారా?” అనెను.

25. దానీయులు “ఇక నోరు తెరవకుము. వీరికి కోపము రప్పింతువేని తప్పక నీ మీదబడెదరు. నీవును నీ కుటుంబమును ప్రాణములు కోల్పోవలసివచ్చును” అని పలికిరి.

26. అటుల పలికి దానీయులు సాగిపోయిరి. వారు తనకంటెను బలవంతులు కనుక మీకా ఏమియు చేయజాలక వెను దిరిగి ఇంటిమొగము పట్టెను.

27. ఆ రీతిగా దానీయులు మీకా విగ్రహమును, అతని యాజకునిగొనివచ్చి లాయీషు మీదపడిరి. చీకుచింత లేక నిరాడంబరముగా జీవించుచున్న ఆ నగర వాసులనెదుర్కొని అందరిని మట్టుపెట్టిరి. నగరమును కాల్చివేసిరి.

28. లాయీషు పౌరులకు సాయపడుటకు ఎవ్వరును రాలేదు. సీదోను అచటికి చాలదూరము. అరామీయులతో వారికి పొతులేదు. ఆ పట్టణము బేత్-రెహోబు వైపున ఒక లోయయందు నిర్మింపబడియుండెను.

29. దానీయులు పట్టణమును మరల కట్టుకొని అటవసించిరి. తమ వంశకర్తయు, యిస్రాయేలు కుమారుడునగు దాను పేరు మీదుగా ఆ నగరమునకు దాను అని పేరిడిరి. కాని దాని మొదటి పేరు లాయీషు.

30. దానీయులు తాము కొనివచ్చిన పోత విగ్రహమును అచట ప్రతిష్టించుకొనిరి. మోషే కుమారుడగు గెర్షోము పుత్రుడు యోనాతాను, అతని తరువాత అతని కుమారులు దానీయులకు యాజకులైరి. ప్రవాసకాలము వరకు వారే యాజకులుగా పని చేసిరి.

31. మీకా తయారుచేసికొనిన పోతవిగ్రహమును దానీయులు తమ దేవళమున ప్రతిష్ఠించు కొనిరి. దైవమందసము షిలో నగరమున ఉన్నంత కాలము ఆ విగ్రహము అచటనేయుండెను.