ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సంఖ్యాకాండము చాప్టర్ 18

 1. ప్రభువు అహరోనుతో ఇట్లనెను: “నీవును, నీ కుమారులును, నీతండ్రి కుటుంబపువారును పవిత్రస్థలపు పరిచర్యలో చోటుచేసుకున్న దోషములకు బాధ్యులగుదురు. కాని నీవును, నీ తనయులును మాత్రమే యాజకపరిచర్యలలో కలిగిన దోషములకు బాధ్యులు అగుదురు.

2. మీకు సాయము చేయుటకు మీ తండ్రి తెగవారు అనగా లేవీ తెగవారైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసికొనిరమ్ము. వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును, నీ కుమారులును సాక్ష్యపు గుడారము ఎదుట పరిచర్య చేయవలయును.

3. వారు నిన్నును, గుడారమంతటిని కాపాడుచుండవలయును. అయితే వారును, మీరును చావకుండునట్లు వారు పవిత్రస్థలమునందలి పాత్రములనుగాని, బలిపీఠమునుగాని తాకరాదు. తాకినచో నీవును, వారును చత్తురు.

4. వారు నీతో కలసి పనిచేయుచు సమావేశపు గుడారపు పరిచర్యలెల్ల చేయుదురు. కాని ఇతరులు మీచెంతకు రాకూడదు.

5. నీవును, నీ తనయులును మాత్రమే పవిత్ర స్థలమునకు, బలిపీఠమునకు పూచీపడవలయును. అప్పుడు నా కోపము యిస్రాయేలీయుల మీద రగుల్కొనదు.

6. నేను యిస్రాయేలీయులనుండి మీ సహోదరులైన లేవీయులను ఎన్నుకొని, వారిని నీకు కానుకగా ఇచ్చితిని. వారు నాకు అంకితులై సమావేశపు గుడారముయొక్క సేవలు చేయుదురు.

7. కాని బలిపీఠపు పరిచర్య విషయములో నీవును, నీ తనయులును, అడ్డతెర అవతలి పరిచర్య విషయములో నీవు మాత్రమే యాజకపరిచర్య చేయవలయును. నేను మీకు యాజకత్వమను వరమును ఇచ్చితిని గనుక ఈ పరిచర్య మీ బాధ్యత. ఇతరులు ఎవడైనను పవిత్ర స్థలమును సమీపించిన యెడల ప్రాణములు కోల్పోవును.”

8. ప్రభువు అహరోనుతో “యిస్రాయేలీయులు నాకు సమర్పించు భాగములు, కానుకలు అన్నియు నీవే. అవి నీకును, నీ సంతతి వారికిని దక్కునట్లు శాశ్వతనియమము చేయుచున్నాను.

9. పవిత్రములైన నైవేద్యములలో ఈ క్రిందివి నీకు లభించును. యిస్రాయేలీయులు అర్పించు ధాన్య సమర్పణములు, పాప పరిహార సమర్పణములు, ప్రాయశ్చిత్త సమర్పణములు అన్నియు నీకును, నీ కుమారులకును లభించును.

10. ఈ నైవేద్యములను మీరు భుజింపవచ్చును. ప్రతి పురుషుడు వానిని భుజింపవలెను. అది నీకు పవిత్రమైనది.

11. యిస్రాయేలీయులు నా ఎదుట అర్పించు అల్లాడింపు అర్పణలన్నియు మరియు ప్రత్యేక సమర్పణలన్నియు మీకే లభించును. మీ కుటుంబమున మైలపడని సభ్యులందరు వానిని భుజింపవచ్చును. ఇవి నీకు, నీ పుత్రులకు, నీ పుత్రికలకు లభించునట్లు శాశ్వత నియమము చేయుచున్నాను.

12. ఏటేట సమర్పించు శ్రేష్ఠములైన ఓలీవు, ద్రాక్ష, ధాన్య ప్రథమ ఫలములుకూడ మీకే లభించును.

13. ప్రభువునకు సమర్పించిన పంటలోని ప్రథమఫలములన్నియు మీకే దక్కును. మీ కుటుంబమున మైలపడని వారందరు వీనిని భుజింపవచ్చును.

14. ఇంకను శాపము పేర నాకు సమర్పింపబడిన వస్తువులు కూడ మీకే దక్కును.

15. యిస్రాయేలీయులు ప్రభువునకు సమర్పించు తొలికాన్పు శిశువునుగాని, పశువుల తొలియీత పిల్లగాని మీకే లభించును. కాని తొలికాన్పు శిశువుల కొరకును, అపవిత్ర పశువుల పిల్లలకొరకును డబ్బు సమర్పించి వానిని విడిపించుకొనిపోయెదరు.

16. వానికి నెలప్రాయము దాటిన తరువాత ఐదు వెండి నాణెములను చెల్లించి వానిని విడిపించుకొనిపోయెదరు. ఈ నాణెములు మందిర తులామానమునకు సరిపోవలెను.

17. కాని గోవు, గొఱ్ఱె, మేక వీని తొలిచూలు పిల్లలను మాత్రము ఇట్లు విడిపించుకొని పోరాదు. అవి నాకు చెందినవి కనుక వానిని బలిగా సమర్పింపవలెను. వాని నెత్తురును బలిపీఠముపై చల్లి, క్రొవ్వును బలిపీఠముపై వ్రేల్వవలెను. ఈ దహనబలి సువాసన నాకు ప్రీతిని కలిగించును.

18. వాని మాంసము మీకే లభించును. వాని రొమ్ము, కుడితొడ నా ఎదుట అల్లాడింపు అర్పణగా సమర్పింపబడును. అవి మీకే లభించును.

19. యిస్రాయేలీయులు నాకు సమర్పించు పవిత్ర అర్పణములన్నియు మీకే లభించునట్లు శాశ్వతనియమము చేయుచున్నాను. నీతోను, నీ సంతతివారితోను నా సన్నిధిన నేను చేసికొను శాశ్వతకట్టడ ఇది” అనెను.

20. మరియు ప్రభువు అహరోనుతో “మీకు ఏ భూమియు భుక్తమునకు లభింపదు. యిస్రాయేలీయుల భూమిలో మీకు భాగము లేదు. మీ భుక్తమును, మీ భాగమును నేనే అనుకొనుడు” అనెను.

21. యిస్రాయేలీయులు అర్పించుకొను దశమ భాగమును సమావేశపు గుడారమున పరిచర్య చేసినందులకు లేవీయులకు ఇచ్చితిని.

22. ఇకమీదట యిస్రాయేలీయులు సమావేశపు గుడారమున ప్రవే శింతురేని పాపముతగిలి తప్పకచత్తురు.

23. లేవీయులు సమావేశపు గుడారముయొక్క పరిచర్య చేయుదురు. వారి పరిచర్యదోషములకు వారే బాధ్యులు. ఇది మీకందరికి శాశ్వతనియమము. యిస్రాయేలీయుల మధ్య లేవీయులకు వారసత్వముండదు.

24. యిస్రాయేలీయులు నాకర్పించు దశమభాగము లేవీయుల వశమగును, కనుక వారికి వారసత్వమేమియు లేకుండచేసితిని.

25-26. ప్రభువు మోషేతో “నీవు లేవీయులతో ఇట్లు చెప్పుము. మీరు యిస్రాయేలీయుల నుండి దశమభాగము తీసికొనినపుడు మరల దానిలో దశమ భాగమును యాజకుడైన అహరోనునకు అర్పింపుడు.

27. మీరు అర్పించు ఈ దశమభాగము ప్రజలు సమర్పించు ధాన్యమునకు ద్రాక్షసారాయమునకు తుల్యమగును.

28. ఈరీతిగా మీరు యిస్రాయేలీయుల నుండి పొందెడి దశమభాగములన్నింటినుండి ప్రభువునకు కానుకగా సమర్పింతురు. దీనినుండి ప్రభువునకు అర్పించుకానుకగా మీరు యాజకుడైన అహరోనునకు అర్పింపుడు.

29. మీరు పొందెడి కానుకలలో నుండి ఉత్తమమైనవే ప్రభువునకు తిరిగి కానుకలర్పింపుడు.

30. ఈ రీతిగా మీరు వానిలో మేలిరకములైన వాటిని ప్రభువునకు అర్పింపగ మిగిలిన కళ్ళములోని ధాన్యము, గానుగ తొట్టిలోని ద్రాక్షారసము కర్షకుడికి చెందినట్లే మీకు అవి చెందినవని భావించుకొనుడు.

31. మీకు లభించిన భాగములను మీరును, మీ కుటుంబసభ్యులును ఎక్కడనైనను ఆర గింపవచ్చును. ఆ అర్పణములు గుడారమున మీరు చేసిన ఊడిగమునకు గాను మీకు లభించిన బత్తెములు.

32. ఆ కానుకలలోని ఉత్తమభాగములను ప్రభువు నకు అర్పించిన పిదప వానిని మీరు భుజించిన యెడల దోషములేదు. యిస్రాయేలీయులు అర్పించిన కానుకలను మీరు అపవిత్రము చేయరాదు. అపుడు మీరు ప్రభువు కోపమువలన నాశనము కారు” అని అనెను.