1. యూదాసీమలో ఆహాసు పరిపాలనా కాలము పండ్రెండవయేట ఏలా కుమారుడు హోషేయ యిస్రాయేలుకు రాజై సమరియా నుండి తొమ్మిదేండ్లు పరిపాలించెను.
2. అతడును యావే ఒల్లని దుష్కార్యములు చేసెను. అయినను అతడు పూర్వపు యిస్రాయేలు రాజులంతటి దుర్మార్గుడు కాదు.
3. అస్సిరియా రాజు షల్మనేసెరు అతనిమీదికి దండెత్తివచ్చెను. హోషేయ అతనికి లొంగి ఏటేట కప్పము కట్టుటకు అంగీకరించెను.
4. కాని ఒక యేడు హోషేయ ఐగుప్తు రాజు సో వద్దకు దూతలనంపి షల్మనేనెరునకు కట్టవలసిన కప్పమును ఎగగొట్టెను. ఈ గోడమీదిపిల్లి వాలకమును చూచి అస్సీరియారాజు హోషేయను అతని కుతంత్రమునకు గాను బంధించి చెరలో వేయించెను.
5. అంతట షల్మనేసెరు యిస్రాయేలు మీదికి దండెత్తివచ్చి సమరియాను ముట్టడించి మూడేండ్ల పాటు దానిని ఆక్రమించుకోజూచెను.
6. మూడవ యేట, అనగా హోషేయ యేలుబడి తొమ్మిదవయేట, అస్సిరియా రాజు సమరియాను పట్టుకొనెను. అతడు యిస్రాయేలీయులను అస్సిరియాకు బందీలుగా కొనిపోయి కొందరికి హాల నగరమునను, కొందరికి గోజాను సీమలోని హాబోరు నదీప్రాంతమునను, కొందరికి మేదియా సీమలోను నివాసములు కల్పించెను.
7. ప్రభువు ఐగుప్తునుండి, ఫరో దాస్యము నుండి యిస్రాయేలీయులను విడిపించెనుగదా! అయినను వారు ప్రభువును లక్ష్యము చేయలేదు. కనుక సమరియా కూలిపోయెను.
8. వారు అన్యదేవతలను కొలిచిరి. ఆ ప్రభువు యిస్రాయేలీయుల సమక్షమునుండి తరిమి వేసిన స్థానిక జాతుల దుష్టాచారములను పాటించిరి.
9. యిస్రాయేలు ప్రజలు నియమించుకొనిన రాజులు, యావే సహింపని పాపకార్యములు చేసిరి. వారు చిన్న పల్లెలు మొదలుకొని పెద్ద పట్టణముల వరకు అన్ని తావులందు అన్యదైవములకు బలిపీఠములు నిర్మించిరి.
10. ప్రతి కొండమీద ప్రతి పచ్చని చెట్టు క్రింద అషేరా దేవతస్తంభములు, ప్రతిమలు స్థాపించిరి.
11. ప్రభువు ఆ నేల మీదినుండి వెడలగొట్టిన స్థానిక జాతుల ఆచారము ననుసరించి అన్యదైవములకు ధూపమువేసిరి. పలు దుష్కార్యములుచేసి ప్రభువు కోపము రెచ్చగొట్టిరి.
12. ప్రభువు ఆజ్ఞ మీరి విగ్రహముల నారాధించిరి.
13. ప్రభువు తన దూతలద్వారా, ప్రవక్తల ద్వారా యిస్రాయేలీయులను, యూదీయులను హెచ్చరించెను. “మీ దుష్కార్యములనుండి వైదొలగి నేను ప్రవక్తల ద్వారా మీ పితరులకిచ్చిన ధర్మాజ్ఞలను పాటింపుడు” అని మందలించెను.
14. అయినను వారు ప్రభువు మాట పాటింపరైరి. తమ పితరులవలె తామును తలబిరుసుతనముతో యావేను నమ్మరైరి.
15. ప్రభువు ఉపదేశమును పెడచెవిన పెట్టిరి. ప్రభువు పితరులతో చేసికొనిన నిబంధనను మీరిరి. అతని హెచ్చరిక లను లక్ష్యము చేయరైరి. వ్యర్థమైన విగ్రహములను అనుసరించుచు తామును వ్యర్ధులైరి. ప్రభువు వలదన్నను వినక ఇరుగుపొరుగు జాతుల ఆచారములను అనుసరించిరి.
16. ప్రభువు ఆజ్ఞలన్నిటిని కాదని లోహముతో రెండు కోడెదూడలను చేయించి పూజించిరి. పైగా అషీరాదేవత విగ్రహమును చేయించిరి. ఆకాశములోని నక్షత్రములను కొలిచిరి. బాలును పూజించిరి.
17. తమ కుమారులను, కుమార్తెలను అన్యదైవములకు దహనబలిగా అర్పించిరి. శకునములు చెప్పించు కొనిరి. జ్యోతిష్కులను సంప్రతించిరి. చేయరాని దుష్కార్యములెల్ల చేసి ప్రభువు కోపమును రెచ్చగొట్టిరి.
18. కనుక ప్రభువు యిస్రాయేలీయులమీద మండి పడి, వారిని తన సమక్షమునుండి గెంటివేసెను. యూదా తెగగాక మరియ ఏ తెగయు శేషించియుండలేదు.
19. యూదీయులు కూడ ప్రభువు ఆజ్ఞలను లెక్కచేయలేదు. వారు కూడ యిస్రాయేలీయులవలె చెడుబ్రోవన పోయిరి.
20. కనుక ప్రభువు యిస్రా యేలీయులనందరిని చేయివిడిచెను. వారిని కఠినముగా శిక్షించి దోపిడిగాండ్ర వశముచేసెను. వారిని తన యెదుటినుండి త్రోసివేసెను.
21. ప్రభువు యిస్రాయేలును యూదా రాజ్యమునుండి వేరుచేసెను. యిస్రాయేలీయులు నెబాతు కుమారుడు యరోబామును రాజును చేసిరి. అతడు యిస్రాయేలీయులను ప్రభువు నుండి వైదొలగించి వారిచేత ఘోరపాపము చేయించెను.
22. వారు యరోబామును అనుకరించి అతడు చేసిన పాడు పనులెల్ల చేసిరి.
23. కట్టకడకు ప్రభువు వారిని తన సన్నిధినుండి బహిష్కరించెను. ప్రభువు ఈ శిక్షను ప్రవక్తలద్వారా ముందుగనే యెరిగించెను. కనుక యిస్రాయేలీయులు అస్సిరియాకు బందీలుగా పోయి నేటివరకు అక్కడనే నివసించుచున్నారు.
24. అస్సిరియా రాజు బబులోనియా, కూతా, అవ్వా, హమాతు, సెఫర్వాయీము నగరముల నుండి రప్పించిన ప్రజలు యిస్రాయేలీయులకు మారుగా సమరియా సీమలో స్థిరపడిరి. ఆ దేశనగరములలో కాపురముండిరి.
25. అయితే వారు కాపురముండ ఆరంభించినపుడు యావే యెడల భయభక్తులు లేని వారు కనుక ప్రభువు వారిమీదికి సింహములను పంపగా అవి వారిలో కొందరిని చంపెను.
26. తాను సమరియా మండలమునకు పంపిన ప్రజలు ఆ దేశపు దేవుని పూజింపలేదని, కనుక ఆ దేవుడు సింహములను పంపి ఆ క్రొత్త ప్రజను నాశనము చేయించెనని అస్సిరియా రాజు వినెను.
27. కనుక అతడు “మనము ఇచటికి బందీలుగా కొనివచ్చిన యాజకులలో ఒకనిని సమరియాకు పంపుడు. అతడు ఆ మండలమునకు పోయి అచటి ప్రజలతో వసించి ఆ దేవుని విధివిధానముల తీరును వారికి తెలియజేయును” అని చెప్పెను.
28. కావున సమరియా నుండి బందీగా కొనిపోబడిన యిస్రాయేలు యాజకుడొకడు బేతేలు క్షేత్రమునకువచ్చి యావే యెడల భయ భక్తులు చూపవలసిన తీరును ప్రజలకు తెలియజేసెను.
29. కాని సమరియా మండలమున స్థిరపడిన క్రొత్త జాతులు తమకు నచ్చిన విగ్రహములను తయారు చేసికొని వానిని ఇంతకు పూర్వము యిస్రాయేలీయులు నిర్మించిన దేవళములలో ప్రతిష్ఠించిరి. ప్రతి జాతి తాను వసించుచున్న నగరములలో క్రొత్త దేవతా విగ్రహములను చేయించెను.
30. బబులోనియా నగరమునుండి వచ్చినవారు సూక్కోత్బెనోత్తును, కూతా నగరవాసులు నెర్గలును, హమాతువాసులు అషీమాను చేయించిరి.
31. అవ్వా నివాసులు నిబహసును, తర్తాకును వారివారి దేవతలను చేసుకొనిరి. సెఫర్వాయీము పురవాసులు తమ బిడ్డలను అద్రెమ్మెలెకు, అనమ్మెలెకు దేవతలకు దహనబలిగా అర్పించిరి.
32. వీరు యావే ప్రభువునుగూడ ఆరాధించిరి. పైగా వారు తమ జాతివారినే ఉన్నతస్థలములమీది మందిరములలో యాజకులనుగా నియమించిరి. ఆ యాజకులు వీరి తరపున బలులు అర్పించిరి.
33. ఆ రీతిగా వారు ఒక వైపు యావే యెడల భయము కలవారైయుండియు మరియొకవైపు తాము పూర్వముండిన స్థలములలోని ఆయా దేవతలను గూడ కొలిచిరి.
34. ఈనాటికిని వారు తమ సంప్రదాయములను పాటించుచునేయున్నారు. వారు ప్రభువుయెడల భయ భక్తులు చూపలేదు. యిస్రాయేలు అనబడిన యాకోబు సంతతివారికి ప్రభువు అనుగ్రహించిన కట్టడలు పాటింపరు.
35. “మీరు అన్యదైవములను కొలువవలదు. వారిని ఆరాధించి బలులర్పింపవలదు.
36. మీరు నన్ను సేవింపుడు. మహాబలసామర్థ్యములతో నాడు ఐగుప్తునుండి మిమ్ము విడిపించుకొని వచ్చినది నేనే. కనుక మీరు నన్ను ఆరాధించి నాకు బలులర్పింప వలయును.
37. నేను మీకు వ్రాసియిచ్చిన ఆజ్ఞలను మీరు సదా పాటింపవలయును. అంతేగాని మీరు అన్యదైవములను కొలువరాదు.
38. నేను మీతో చేసి కొనిన నిబంధనను విస్మరింపరాదు. అన్యదేవతలను ఆరాధింపరాదు.
39. మీ ప్రభువును, దేవుడనైన నన్నే మీరు సేవింపవలయును. శత్రువులనుండి మిమ్ము కాపాడువాడను నేనే” అని యిస్రాయేలీయులతో ఆయన నిబంధనము చేసికొనెను.
40. అయినను ఆ ప్రజలు ప్రభువు మాట లక్ష్యపెట్టక తమ పూర్వ సంప్రదాయమునే పాటించిరి.
41. ఆ రీతిగా వారు యావే యెడల భయభక్తులు చూపినను, తమకు ఇష్టమొచ్చిన దైవములనుగూడ పూజించిరి. వారి వంశీయులును ఈనాటికిని అదేపని చేయుచున్నారు.