ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజులు మొదటి గ్రంధము 17

 1. గిలాదు మండలమునందలి తిష్బీ నగర వాసియైన ఏలీయా ప్రవక్త అహాబు రాజుతో “నేను యిస్రాయేలు దేవుడగు యావేను కొలుచు భక్తుడను, నా పలుకులు వినుము. యావే జీవముతోడు, నేను ఆజ్ఞాపించిననే తప్ప ఈ దేశమున కొంతకాలము పాటు వానకాని, మంచుకాని కురియదు” అనెను.

2-3. ప్రభువువాణి ఏలీయాతో “నీవు ఇచటి నుండి వెళ్ళి తూర్పుదిక్కుగా పోయి యోర్దానునకు తూర్పున నున్న కెరీతు వాగు వద్ద దాగుకొనుము.

4. నీవు ఆ వాగులో నీళ్ళు త్రాగుము. నా ఆజ్ఞ ప్రకారముగా కాకులు నీకు భోజనము కొనివచ్చును” అని చెప్పెను.

5. అతడు యావే చెప్పినట్లే చేసి యోర్దానునకు తూర్పుననున్న కెరీతు వాగువద్ద వసించెను.

6. ప్రతిదినము ఉదయ సాయంకాలములందు కాకులు అతనికి రొట్టెను, మాంసమును కొనివచ్చెను. అతడు యేటిలోని నీళ్ళు త్రాగుచుండెను.

7. కాని వానలు లేనందున కొంతకాలమైనపిదప ఆ యేరుకూడ ఎండి పోయెను.

8-9. ప్రభువువాణి ఏలీయాతో “నీవు సీదోను చెంతనున్న సారెఫతు ఊరికి వెళ్ళి అక్కడ నివసింపుము. అచట కాపురముండు ఒక విధవరాలిని నీకు భోజనము పెట్టవలసినదిగా ఆజ్ఞాపించితిని” అని చెప్పెను.

10. ఏలీయా అట్లే సారెఫతుకు వెళ్ళెను. అతడు నగర ద్వారమును చేరుకొనునప్పటికి అక్కడ ఒక విధవరాలు పొయ్యిలోనికి పుల్లలేరుకొనుచుండెను. ప్రవక్త ఆమెతో “అమ్మా! చెంబుతో కొంచెము నీళ్ళు తీసికొనిరమ్ము” అనెను.

11. ఆ విధవరాలు వెళ్ళబోవుచుండగా మరల అతడామెను పిలిచి “కొంచెము రొట్టెను కూడ తీసికొని రమ్ము" అని చెప్పెను.

12. ఆమె ఏలీయాతో “సజీవుడైన యావే తోడు. మా ఇంట తయారైన రొట్టె ఏమియు లేదు. కుండలో కొంచెము పిండి, పిడతలో కొంచెము నూనె మాత్రము ఉన్నవి. నేనిక్కడ రెండుమూడు పుల్ల లేరుకొనుటకు వచ్చితిని. ఆ గుప్పెడుపిండితో రొట్టె కాల్చుకొని నా కుమారుడు, నేను ఇప్పటికి తిందుము. ఆ మీదట ఆకటితో ప్రాణములు విడుతుము” అనెను.

13. ఏలీయా ఆమెతో "అమ్మా! నీవు విచారింపవలదు. నీవు చెప్పినట్లే పోయి రొట్టెకాల్చుకోవచ్చును. కాని మొదట మీ ఇంటనున్న పిండితో చిన్నిరొట్టెను చేసి నాకు పెట్టుము. అటుపిమ్మట నీకు నీ కుమారునికి రొట్టె కాల్చుకొమ్ము.

14. యిస్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లు సెలవిచ్చుచున్నాడు: “యావే నేలపై వాన కురిపించువరకు కుండలోని పిండిగాని, పిడతలోని నూనెగాని తరిగిపోవు” అనెను.

15. ఆ విధవరాలు ఏలీయా చెప్పినట్లే చేసెను. విధవరాలు, ఆమె కుమారుడు చాలనాళ్ళవరకు రొట్టె భుజించు చువచ్చిరి.

16. ప్రభువు ఏలీయాతో చెప్పినట్లే కుండలోని పిండిగాని, పిడతలోని నూనెగాని తరిగిపోలేదు.

17. తరువాత కొంతకాలమునకు ఆ విధవ పుత్రునకు జబ్బుచేసెను. ఆ వ్యాధి నానాటికి ప్రబలము కాగా బిడ్డడు చనిపోయెను.

18. ఆమె అతనితో “అయ్యా! నీవు దైవభక్తుడవై ఉండికూడ నాకు ఈ అపకారము చేసితివేమి? నీవు నా పాపములను దేవునికి జప్తికి తెచ్చి నా కుమారునికి చావు తెచ్చిపెట్టితివి గదా!” అని నిష్ఠుర వాక్యములు పలికెను.

19. ఏలీయా “అమ్మా! నీ కుమారుని నా చేతికి ఇమ్ము” అని బిడ్డను ఆమె రొమ్ము మీదినుండి తీసికొని ఇంటిమీద తాను వసించు గదిలోనికి మోసికొనిపోయి మంచముపై పరుండబెట్టెను.

20. అతడు “ప్రభూ! నేను ఈ విధవ రాలి ఇంట తలదాచుకొనుచున్నానుగదా! నీవు ఈ దీనురాలి పుత్రుని చంపి ఈమెను బాధపెట్టెదవా?” అని ప్రార్థించెను.

21. అంతట ప్రవక్త బాలుని మృత దేహముపై మూడుసారులు బోరగిలపరుండి “ఓ ప్రభూ! నా దేవా! ఈ బాలునికి ప్రాణము మరల వచ్చునుగాక!” అని ప్రార్ధించెను.

22. ప్రభువు ప్రవక్త మొరాలకించెను. బాలుని జీవము తిరిగిరాగా అతడు మరల బ్రతికెను.

23. ఏలీయా బాలుని మీదిగది నుండి క్రిందికి తీసికొని వచ్చి తల్లికి అప్పగించి “ఇదిగో! నీ కుమారునికి ప్రాణము వచ్చినది చూడుము” అనెను.

24. ఆమె అతనితో “నీవు దైవభక్తుడవని ఇపుడు గ్రహించితిని, నీ నోట దేవునిమాట పొల్లుపోదు” అనెను.