1-2. ప్రభువు మోషేతో “యిస్రాయేలీయులు ఒక్కొక్క తెగకు ఒక్కొక్కటి చొప్పున మొత్తము పండ్రెండు చేతికఱ్ఱలను కొనిరావలెనని చెప్పుము. ఏ తెగకఱ్ఱమీద ఆ తెగ పేరు వ్రాయింపుము.
3. లేవీయ తెగ కఱ్ఱమీద అహరోను పేరు వ్రాయింపుము. ఏలయనగ పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కఱ్ఱయే ఉండవలెనుగదా!
4. ఈ కఱ్ఱలన్నింటిని సాన్నిధ్యపుగుడారమున నేను మిమ్ము కలసికొను మందసము ఎదుటపెట్టుడు.
5. అచట నేను ఎవరిని ఎన్నుకొందునో వాని కఱ్ఱ చిగురించును. యిస్రాయేలీయులు మీకు విరోధముగా గొణుగు సణుగులు నాకు వినబడకుండ మాన్పివేయుదును” అని చెప్పెను.
6. మోషే ఈ సంగతిని యిస్రాయేలీయులకు తెలియజేయగా వారు తెగకు ఒక్క కఱ్ఱ చొప్పున మొత్తము పండ్రెండు కఱ్ఱలు కొనివచ్చిరి. అహరోను కఱ్ఱగూడ వానియందుగలదు.
7. మోషే వానిని అన్నిటిని సాన్నిధ్యపుగుడారమున దైవమందసము ఎదుటనుంచెను.
8. మరునాడు మోషే గుడారమునందు ప్రవేశించి చూడగా లేవీ తెగకు చెందిన అహరోను కఱ్ఱ చిగురించియుండెను.
9. అది చిగురించి, పూలు పూచి బాదముపండ్లు కాచెను. మోషే ఆ కఱ్ఱలన్నింటిని యిస్రాయేలు ప్రజలయొద్దకు కొనిపోయెను. వారు ఆ కఱ్ఱలను పరిశీలించి, ఎవరి దానిని వారు తీసికొనిరి.
10. ప్రభువు మోషేతో “అహరోను కఱ్ఱను సమావేశపు గుడారమున దైవమందసము ఎదుట ఉంచుము. అది తిరుగుబాటుదారులకు హెచ్చరిక సూచికముగా నుండును. అటులచేసిన వారు చావకుండునట్లు, వారి గొణుగుడు నాకు వినపడకుండా నీవు అణచి మాన్పివేసిన వాడవుదువు.
11. మోషే ప్రభువు చెప్పినట్లే చేసెను.
12. యిస్రాయేలీయులు మోషేతో “మేమిక సర్వనాశమైపోయెదము.
13. ప్రభుమందిరము దగ్గరికి వచ్చువారందరు చత్తురు. ఈ రీతిగా మేమందరము నాశమైపోవలెనా?” అని అనిరి.