1. కాని ఆసా పరిపాలనాకాలము ముప్పది ఆరవ యేట యిస్రాయేలు రాజు బాషా యూదా మీద దాడిచేసెను. అతడు తన నగరమైన రామాను సురక్షితము చేసి యూదా రాజ్యమునకు రవాణా సౌకర్యములకు అంతరాయము కలిగించెను.
2-3. కనుక ఆసా తన ప్రాసాదమున, దేవళమున ఉన్నవెండి బంగారమును దమస్కున వసించు సిరియా రాజు బెన్హ్ దదునకు కానుకగా పంపి ఇట్లు సందేశము చెప్పించెను: “మన తండ్రులవలె మనముకూడ పరస్పరము పొత్తు కుదుర్చుకొందము. నేను ఈ వెండిబంగారములను కానుకగా పంపుచున్నాను. నీవు యిస్రాయేలు రాజు బాషాతో సఖ్యసంబంధములు వదలుకోవలయును. అతడు నా దేశమునుండి తన సైన్యమును మరలింపవలయును.”
4. బెన్హ్-దదు ఆసాతో పొత్తు కుదుర్చుకొని యిస్రాయేలు దేశము మీదికి తన సైన్యాధిపతులను పంపెను. వారు ఇయ్యోను, దాను, అబెల్మాయిము, వస్తుసంభారములు ఉంచిన నఫ్తాలి మండలములోని నగరములు ఆక్రమించుకొనిరి.
5. బాషా ఈ సంగతి తెలిసికొని రామా నగరమును సురక్షితము చేయుట మానివేసెను. ఆ పనిని పూర్తిగా విరమించుకొనెను.
6. ఆసా యూదీయుల నెల్లరిని పిలువనంపగా వారు పోయి బాషా రాజు రామా నగరమున ప్రోగు చేసిన రాళ్ళను, కలపను కొనివచ్చిరి. వానితో గేబా, మిస్పా నగరములను సురక్షితము చేసిరి.
7. అప్పుడు హనానీ ప్రవక్త ఆసా యొద్దకు వచ్చి “నీవు సిరియా రాజును నమ్మి ప్రభువును అలక్ష్యము చేసితివి కనుక యిస్రాయేలు సైన్యము నీ చేతులలో నుండి తప్పించుకొనిపోయెను.
8. కూషీయులును, లిబియనులు చాల రథములను, గుఱ్ఱములను, గొప్ప సైన్యములను ప్రోగుజేసికొని రాలేదా? అయినను నీవు ప్రభువును నమ్మితివి కనుక ఆయన వారిని నీ చేతికి అప్పగించెను.
9. ప్రభువునేత్రములు ప్రపంచమంతటిని పరికించుచుండును. తనను నమ్మిన భక్తులకు ఆయన బలమును దయచేయును. నీవు తెలివితక్కువ పని చేసితివి. కనుక ఇప్పటినుండి నీకు యుద్ధములు తప్పవు” అని చెప్పెను.
10. అటుల ప్రవచనము చెప్పినందుకు రాజు హనానీపై కోపగించి రౌద్రముతో అతనిని చెరలో త్రోయించెను. ఇదే సమయమున అతడు తన పౌరులను కొందరిని హింసించుటకు పూనుకొనెను.
11. ఆసా ఉదంతమెల్ల యూదా యిస్రాయేలు రాజుల చరితమున లిఖింపబడియే ఉన్నది.
12. ఆసా తన పరిపాలనాకాలము ముప్పదితొమ్మిదవ యేట అతని పాదములలో తీవ్రమైన వ్యాధిసోకెను. అప్పుడైనను అతడు ప్రభువును శరణువేడడయ్యెను. పైపెచ్చు వైద్యులను ఆశ్రయించెను.
13. అతడు తన పరిపాలనా కాలము నలువది ఒకటవ యేట మరణమునొందెను.
14. ఆసా తన పితరులతో నిద్రించగా జనులు అతనిని దావీదు నగరమున అతడు తాను స్వయముగా తొలిపించుకొనిన రాతిసమాధిలోనే పాతి పెట్టిరి. అతని శవమును సుగంధ ద్రవ్యములతోను, పరిమళతైలముల తోను లేపనము చేసిరి. సంతాప సూచనముగా పెద్ద మంటవేసిరి.