ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజులు మొదటి గ్రంధము 16

 1. ప్రభువు హనానీ కుమారుడైన యెహూకు ప్రత్యక్షమై బాషాను గూర్చి ఈలాగు సెలవిచ్చెను.

2. “నేను నిన్ను దీనదశనుండి పైకి తీసికొనివచ్చి నా ప్రజలకు రాజుగా నియమించితిని. అయినను నీవు యరోబామువలె దుష్కార్యములుచేసి ప్రజలచే కూడ పాపము చేయించితివి. ప్రజలపాపములు నా కోపమును రెచ్చగొట్టినవి.

3. కనుక యరోబాము వంశమునువలె నిన్నును, నీ వంశమును నామరూపములు లేకుండా చేసెదను.

4. నీ కుటుంబీకులెవరైన పట్టణమున చచ్చినచో వారిని కుక్కలు పీకుకొనితినును. పొలమున చచ్చినచో వారిని రాబందులు పొడిచి తినును.”

5. బాషా చరిత్రలోని ఇతరాంశములు, అతని సాహసకృత్యములు యిస్రాయేలు రాజుల చరిత్రలో లిఖింపబడియే ఉన్నవి.

6. బాషా తన పితరులతో నిద్రించి తీర్సాలో సమాధిచేయబడెను. అతని తరు వాత అతని కుమారుడు ఏలా రాజయ్యెను.

7. ప్రభువు బాషాకును, అతని వంశమునకును ముప్పుదెచ్చుటకై యెహూ ప్రవక్తద్వారా తన సందేశమును వినిపించెను. బాషా దుష్కార్యములు చేసెను గదా! అతడు యరోబామువలె దుష్కార్యములుచేసి ప్రభువు కోపమును రెచ్చగొట్టుట మాత్రమేగాదు, యరోబాము కుటుంబమును కూడ నాశనము చేసెను.

8. యూదా రాజ్యమున ఆసా రాజు పరిపాలన కాలము ఇరువదియారవయేట యిస్రాయేలు రాజ్యమున బాషా కుమారుడు ఏలా రాజయ్యెను. అతడు తీర్సా నుండి రెండేండ్లు పరిపాలించెను.

9. అంతట రాజు రథబలమునందు అర్ధభాగమునకు అధిపతిగా నున్న సైనికోద్యోగి సిమ్రీ అనువాడు రాజైన ఏలాపై కుట్రపన్నెను. ఒకనాడు రాజు తీర్సా పట్టణమున రాజప్రాసాద సంరక్షకుడైన ఆర్సా ఇంట తప్పత్రాగి ఉండెను.

10. సిమ్రీ ఆర్సా ఇల్లుజొచ్చి రాజును హత్య చేసి తాను రాజయ్యెను. యూదా రాజ్యమున ఆసా పరిపాలనకాలము ఇరువది ఏడవయేట ఈ సంఘటనము జరిగెను.

11. సిమ్రీ రాజయి సింహాసనము ఎక్కినదే తడవుగా బాషా కుటుంబము వారినందరిని వధించెను. బాషా బంధువులలో మగవారును, అతని మిత్రులందరును చచ్చిరి.

12. ప్రభువు బాషాకు ముప్పుదెత్తునని ప్రవక్త యెహూ ముఖమున పలికినట్లే సిమ్రీ అతని వంశమునంతటిని హతమార్చెను.

13. బాషా మరియు అతని కుమారుడు ఏలా కూడా విగ్రహములను పూజించి, ప్రజలచే పాపము చేయించి యిస్రాయేలుదేవుడైన యావే కోపమును రెచ్చగొట్టిరి.

14. ఏలా జీవితములోని ఇతరాంశములు, అతడు చేసిన పనులు యిస్రాయేలు రాజులచరిత్రలో లిఖింపబడియే ఉన్నవి.

15. యూదారాజ్యమున ఆసా పరిపాలనకాలము ఇరువది ఏడవయేట యిస్రాయేలు రాష్ట్రమున సిమ్రీ  రాజై తీర్సా పట్టణమునుండి ఏడుదినములు పరిపాలించెను. అప్పుడు యిస్రాయేలు సైన్యములు ఫిలిస్తీయా లోని గిబ్బెతోను నగరమును ముట్టడించుచుండెను.

16. సిమ్రీ కుట్రపన్ని రాజును వధించెనని విని సైనికులు తమ సైన్యాధిపతియైన ఒమ్రీని నాడే శిబిరమున రాజుగా ప్రకటించిరి.

17.  ఒమ్రీ గిబ్బెతోను నుండి సైన్యముతో వెడలివచ్చి తీర్సా పట్టణమును ముట్టడించెను.

18. పట్టణము  ఒమ్రీ వశముకాగానే సిమ్రీ రాజప్రాసాదము అంతర్భాగమునందలి రక్షణ గృహమునకు పారిపోయి రాజగృహమునకు నిప్పు అంటించెను. తానును ఆ మంటలలోనే ప్రాణము కోల్పోయెను.

19. సిమ్రీగూడ యరోబామువలె యావే ఒల్లని దుష్కార్యములుచేసి ప్రజలచేతకూడ పాపము చేయించెను. కనుక అతనికి ఈ రీతిగా శాస్తి జరిగెను.

20. సిమ్రి జీవితములోని ఇతరాంశములు, అతడు పన్నిన కుట్రలు యిస్రాయేలు రాజుల చరిత్రమున లిఖింపబడియే ఉన్నవి.

21. అంతట యిస్రాయేలు ప్రజలు రెండు విభాగములయ్యెను. ఒక పక్షము వారు గీనతు కుమారుడైన తిబ్నీని రాజును చేయగోరిరి. మరియొక పక్షమువారు ఒమ్రీ ని రాజును చేయగోరిరి.

22. చివరకు ఒమ్రీ పక్షమువారిదే పైచేయి అయ్యెను. కనుక తిబ్నీ చంపబడగా ఒమ్రీ రాజయ్యెను.

23. యూదా రాజ్యమున ఆసారాజు పరిపాలనా కాలము ముప్పది యొకటవయేట యిస్రాయేలు రాజ్యమున ఒమ్రీ రాజై పండ్రెండేండ్లు పరిపాలించెను. తొలి ఆరేండ్లు అతడు తీర్సా నుండియే రాజ్యము చేసెను.

24. అటు తరువాత అతడు షెమెరు అను వానియొద్ద నుండి ఆరువేల వెండినాణెములకు షోమ్రోను కొండను కొనెను. దానిమీద ఒక నగరమును నిర్మించి దానికి షెమెరు జ్ఞాపకార్ధముగా సమరియా అని పేరు పెట్టెను.

25. ఒమ్రీ కూడ యావే ఒల్లని దుష్కార్యములు చేసెను. తన పూర్వులందరి కంటెను దుర్మార్గుడయ్యెను.

26. అతడు యరోబామువలె యావే సహింపని దుష్కార్యములు చేసెను. ప్రజలను కూడ విగ్రహారాధనకు పురికొల్పి ప్రభువు కోపమును రెచ్చ గొట్టెను.

27. ఒమ్రీ జీవితములోని ఇతరాంశములు, అతని సాహసకృత్యములు యిస్రాయేలు రాజుల చరిత్రలో లిఖింపబడియేయున్నవి.

28. ఒమ్రీ తన పితరులతో నిద్రించగా అతనిని సమరియాలోనే సమాధియందు పాతిపెట్టిరి. అతని తరువాత అతని కుమారుడు అహాబు రాజయ్యెను.

29. యూదా రాజ్యమున ఆసా రాజు పరిపాలనకాలము ముప్పది యెనిమిదవయేట ఒమ్రీ కుమారుడు అహాబు యిస్రాయేలు రాష్ట్రమునకు రాజయ్యెను. అతడు సమరియానుండి ఇరువది రెండేండ్లు పరి పాలించెను.

30. కాని అహాబు తన పూర్యులందరి కంటె కూడ అధికముగా యావే ఒల్లని దుష్కార్యములు చేసెను.

31. అతడు యరోబామువలె దుష్కార్యములు చేయుట చాలదన్నట్లు, నీదోను రాజగు ఎత్బాలు కుమార్తె యెసెబెలును వివాహమాడి బాలు దేవతను కొలిచెను.

32. ఆ రాజు సమరియాలో బాలుదేవరకొక దేవళమునుకట్టి బలిపీఠము నెలకొల్పెను.

33. పైగా అషేరా దేవతను పూజించుటకు ఒక కొయ్యస్తంభమునుకూడ నెలకొల్పెను. తన పూర్వులైన యిస్రాయేలు రాజులందరికంటె కూడ అధికముగా అహాబు యావే కోపమును రెచ్చగొట్టెను.

34. అహాబు కాలమున బేతేలు నివాసియైన హీయేలు యెరికో నగరమును పునర్నిర్మించెను. ప్రభువు నూను కుమారుడైన యెహోషువద్వారా సెలవిచ్చినట్లే హీయేలు యెరికోకు పునాదులెత్తినపుడు తన పెద్ద కొడుకు అబీరాము చనిపోయెను. నగరద్వారములు నిర్మించినపుడు కడగొట్టు కొడుకు సేగూబు చనిపోయెను.