1. సంసోను గాజాకు వెళ్ళెను. అచట ఒక వేశ్యను చూచి ఆమె ఇంటికి పోయెను.
2. సంసోను వచ్చెనని విని పురజనులు ప్రోగైవచ్చి నగరద్వారమున కాపుండిరి, వారు ఉదయముననే సంసోనును చంపవచ్చునుగదా అనుకొని రేయంతయు ఊరకుండిరి.
3. సంసోను నడిరేయివరకు సద్దు సేయక నిద్దురపోయెను. కాని అతడు అర్ధరాత్రమున లేచి నగర ద్వారము తలుపులను, ద్వారబంధమును, అడ్డు గఱ్ఱతోపాటు ఊడబెరికి భుజములపై మోసికొని వెడలి పోయెను. హెబ్రోనునకు ఎదురుగానున్న కొండపైకి ఎక్కిపోయి వానినచట వదలివేసెను.
4. అటు తరువాత అతడు సోరేకు లోయలో వసించు వనితను ఒకతెను వలచెను. ఆమె పేరు డెలీలా.
5. ఫిలిస్తీయ దొరలు డెలీలా చెంతకు వచ్చి “నీవు సంసోనును లాలించి అతని విచిత్రబలమునకు కారణమేమో తెలిసికొనుము. అతనిని లోగొని త్రాళ్ళతో కట్టి చెరపట్టు మార్గమేమో కనుగొనుము. నీ మట్టుకు నీకు మేమొక్కొక్కరము పదునొకండు వేల వెండికాసులు కానుకగానిత్తుము” అని చెప్పిరి.
6. డెలీలా సంసోనును “నీ విచిత్రబలమునకు కారణమేమి? నిన్ను చెరపట్టుట ఎట్లు?” అని అడిగెను.
7. సంసోను “పచ్చిపచ్చిగానున్న అల్లెత్రాడులు ఏడింటితో నన్ను బంధింతురేని నాబలమంతయు ఉడిగిపోయి సామాన్యజనునివలె అయ్యెదను” అని చెప్పెను.
8. ఫిలిస్తీయదొరలు వచ్చి అల్లెత్రాడులు ఏడింటిని డెలీలా కిచ్చిరి. ఆమె వానితో సంసోనును బంధించెను.
9. ఫిలిస్తీయులు డెలీలా ఇంట దాగి యుండిరి. ఆమె “సంసోను! ఇదిగో ఫిలిస్తీయులు నీ మీదికి వచ్చుచున్నారు” అని కేకపెట్టెను. సంసోను ఆ అల్లెత్రాళ్ళనన్నింటిని నిప్పంటుకొనిన నారత్రాళ్ళను వలె సునాయాసముగా ట్రెంచివేసెను. కనుక అతని బలమునకు కారణమేమో తెలియలేదు.
10. డెలీలా మరల సంసోనుతో “నీవు కల్లబొల్లి కబుర్లు చెప్పి నన్ను గేలిచేసితివి. నిన్ను బంధించుట ఎట్లో చెప్పవైతివిగదా!" అనెను.
11. అతడు “ఇంత వరకు ఎవ్వరును వాడని క్రొత్త త్రాళ్ళతో నన్ను కట్టుదురేని నా బలమంతయు ఉడిగిపోయి సామాన్య నరుని వలె నయ్యెదను” అని చెప్పెను.
12. కనుక డెలీలా అతనిని క్రొత్త తాళ్ళతో బంధించి “సంసోనూ! ఇదిగో ఫిలిస్తీయులు నీ మీదికి వచ్చుచున్నారు” అని కేక పెట్టెను. ఫిలిస్తీయులు ఆమె యింట దాగియుండిరి. కాని సంసోను తనచేతి కట్టులన్నిటిని దారములవలె ట్రెంచివేసెను.
13. డెలీలా మరల సంసోనుతో “ఇంతవరకు అల్లిబిల్లిమాటలు చెప్పి నన్ను గేలిసేసితివిగదా! ఇకనైన నిన్ను బంధించుట ఎట్లో నాతో చెప్పవా?” అనెను.
14. అతడు ఆమెతో “నా తలజడలు ఏడు పడుగువలె నేసి మేకునకు బిగగట్టెదవేని నా బలమంతయు ఉడిగి సామాన్య జనునివలెనయ్యెదను” అని చెప్పెను. ఆమె సంసోనును నిదురబుచ్చి అతని జడలు ఏడింటిని పడుగువలె నేసి మేకునకు బిగగట్టి “సంసోనూ! ఇదిగో ఫిలిస్తీయులు నీ మీదికి వచ్చుచున్నారు” అని కేక వేసెను. అతడు నిద్దురలేచి తలవెండ్రుకలను వానిని కట్టిన మేకును ఒక్క ఊపున ఊడబెరికెను. కనుక అతని బలమునకు కారణమేమియో తెలియలేదు.
15. అంతట డెలీలా అతనితో “నీవు నన్ను వలచితివన్నమాట కల్ల. అసలు నీకు నాపై నమ్మకమే లేనపుడు ఇక వలపెక్కడిది? నీవు నన్ను ముమ్మారు గేలి సేసితివి. నీ విచిత్రబలమునకు కారణమేమో ఇంతవరకు నాకు తెలుపవైతివిగదా!” అని వాపోయెను.
16. ఆమె రేపుమాపు సంసోనును గ్రుక్క తిప్పుకొన నీయకుండ అదే ప్రశ్నతో పీడించి తొందర పెట్టజొచ్చెను. అతడు విసిగివేసారిపోయెను.
17. ఆమె పోరు పడలేక చివరకు తన రహస్యమును చెప్పివేసెను. “ఇంతవరకు క్షురకత్తి నా తలవెంట్రుకలను తాకలేదు. పుట్టుక నుండి నేను వ్రతతత్పరుడనై జీవించుచుంటిని. నా తలజుట్టు కత్తిరింతురేని నా బలమంతయు ఉడిగిపోయి సామాన్య నరునివలె అయ్యెదను” అని చెప్పెను.
18. డెలీలా చిట్టచివరకు సంసోను తన రహస్యము తెలియజెప్పెనని గ్రహించెను. వెంటనే ఆమె “ఇంకొక మారు మీరు ఇచ్చటికిరండు. సంసోను తన మర్మమును తెలియజెప్పెను” అని ఫిలిస్తీయ దొరలకు వర్తమాన మంపెను. ఆ కబురందుకొని ఫిలిస్తీయదొరలు రూకలతో వచ్చిరి.
19. ఆమె సంసోనునులాలించి తన ఒడిలో నిద్రబుచ్చి, ఒక మనుష్యుని పిలిపించి అతని తలజడలు ఏడుకత్తెరలు వేయించి, అతనిని బాధింప మొదలిడెను. వెంటనే అతనిబలము ఉడిగిపోయెను.
20. డెలీలా “సంసోనూ! ఇదిగో ఫిలిస్తీయులు నీ మీదికి వచ్చుచున్నారు” అని కేక పెట్టెను. అతడు నిద్రమేల్కొని మునుపటివలెనె బయటపడుటకు భుజములు జాడింపవచ్చును గదా అనుకొనెను. కాని ప్రభువు తనను విడనాడెనని సంసోనునకు తెలియదు.
21. అంతట ఫిలిస్తీయులు సంసోనును బంధించి అతని కన్నులు పెరికివేసి గాజాకు నడిపించుకొని పోయిరి. రెండుకట్ల ఇత్తడి గొలుసుతో అతనికి సంకెళ్ళు వేసిరి. సంసోను వారి చెరలో తిరగలి విసురు వాడయ్యెను.
22. కాని కత్తిరింపబడిన అతని తలవెంట్రుకలు మరల పెరుగజొచ్చెను.
23. అంతట ఫిలిస్తీయ సర్దారులు వారి దేవుడైన దాగోనునకు మహావైభవముతో బలి సమర్పించి ఉత్సవము చేసికొనుటకై ప్రోగైవచ్చిరి. వారు “మనము కొలుచుదేవుడు మన పగతుడైన సంసోనును మన చేతికి అప్పగించెనుగదా!” అనుకొని పొంగిపోయిరి.
24. ఆ ప్రజలు దాగోను విగ్రహము కంటబడగనే అతనిని స్తుతించుచు: “మన దేశమును సర్వనాశనము చేసి మనవారినెందరినో మట్టుపెట్టిన మన పగతుడైన సంసోనును మన దేవుడు నేడు మనచేతికి అప్పగించెను” అని అరచిరి.
25. వారి హృదయములు ఆనందము నొందగా “మనమాతని ఆటపట్టింప పిలిపింపుడు, అతని కార్యములనుజూచి వినోదింతుము” అని చెరసాల నుండి సంసోనును కొనివచ్చిరి. అతడు వారి ఎదుట వీరకార్యములు చేసెను. ఫిలిస్తీయులు అతనిని తమ దేవళమునందలి స్తంభములమధ్య నిలిపి పరిహసించిరి.
26. సంసోను తనను నడిపించు బాలకునితో “ఈ మందిరమును మోయు స్తంభములను తడవి చూడనిమ్ము. నేను వానిపై కొంచెము ఆనుకోవలయును” అనెను.
27. దేవళము స్త్రీపురుషులతో క్రిక్కిరిసియుండెను. ఫిలిస్త్రీయ దొరలందరు అచట సమావేశమై సంసోనును ఎగతాళిచేయగా మీది అంతస్తున రమారమి మూడు వేలమంది స్త్రీపురుషులు తిలకించుచుండిరి.
28. అపుడు సంసోను యావేను స్మరించుకొని “ప్రభూ! నన్ను జ్ఞప్తియుంచుకొనుము. ఇంకొక్కమారు నీ బలమును నాకు ప్రసాదింపుము. నా రెండుకన్నులను పెరికివేసినందులకై ఈ ఫిలిస్తీయులపై ఒక్క దెబ్బతో పగతీర్చుకోనిమ్ము" అని ప్రార్థించెను.
29. అతడు మందిరమును మోయు మూలస్తంభములు రెండింటిమీద చేతులు మోపెను. కుడిచేతిని ఒకదాని మీద, ఎడమచేతిని మరొకదానిమీద మోపి రెండు స్తంభములపై తన బలమును చూపెను.
30. "ఈ ఫిలిస్తీయులతోపాటు నేనును చత్తునుగాక!” అని అరచి ముందటికి వంగి స్తంభములను శక్తికొలది నెట్టెను. ఆ నెట్టుడుకు మందిరము పెళ్ళున కూలి దొరల మీదను, ప్రేక్షకులమీదను విరుచుకొనిపడెను. సంసోను తాను బ్రతికియుండగా చంపిన వారికంటె చనిపోవుచు చంపినవారే అధికులు.
31. అంతట సంసోను సోదరులు, బంధువులు వచ్చి అతని మృతదేహమును కొనిపోయిరి. జోరా, ఎష్టావోలు నగరముల మధ్య నున్న అతని తండ్రి మనోవా సమాధిలోనే అతనిని గూడ పాతిపెట్టిరి. సంసోను ఇరువదియేండ్ల పాటు యిస్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను.