1. లేవీ తెగకు చెందినవాడును, కోహాతునికి మనుమడును, ఈసాహారు కుమారుడునగు కోరా,
2. రూబేను తెగవారైన ఎలీయాబు కుమారులగు దాతాను, అబీరాములు, పేలేతు కుమారుడగు ఓను యోచించుకుని రెండువందలయేబది మంది పేరుమోసిన యిస్రాయేలీయుల సమాజపెద్దలతో మోషేకు ఎదురుగాలేచి
3. మోషే అహరోనులకు వ్యతిరేకముగా జతకట్టి, “మీ గొప్పలు మా ఎదుట చెల్లవు. యిస్రాయేలు సమాజమంతయు పరిశుద్ధమైనదేకదా! ఈ ప్రజలందరు ప్రభువునకు చెందినవారేకదా! మరి ప్రభువు ప్రజలకు మీరు మాత్రమే పెద్దలు కానేల?” అని అడిగిరి.
4. ఆ మాటలువిని మోషే నేలమీద బోరగిలబడి దేవునికి మనవి చేసెను.
5. అతడు కోరాను, అతని అనుచరులను చూచి “ప్రభువు తనకు చెందిన వారెవరో, పవిత్రులెవరో రేపు ప్రొద్దున నిర్ణయించును. ఆయన తనకు చెందినవారినే తన చెంతకు రానిచ్చును.
6-7. రేపు నీవును, నీ అనుచరులును మీ ధూపపాత్రములను నిప్పులతో నింపి, సాంబ్రాణివేసి యావే సన్నిధిని ధూపమువేయుడి. పవిత్రులైనవారిని ప్రభువే ఎన్నుకొనును. లేవీయులారా! మీ ఆగడములు మా యెదుట చెల్లవు” అనెను.
8. మరియు మోషే కోరాతో “లేవీ కుమారులారా! నామాటలు వినుడు.
9. యిస్రాయేలు సమాజము నుండి ప్రభువు మిమ్ము తన సేవకు ఎన్నుకొనెను. మీరు ఆయన ఎదుటికివచ్చి ఆయన గుడారమున పరిచర్యచేయుచున్నారు. ప్రభువు సమాజమునకు ఊడిగము చేయుచున్నారు. ఇది ఎంతటి భాగ్యమో ఊహించితిరా?
10. ప్రభువు నిన్ను నీ అనుచరులైన లేవీయులను తనచెంతకు రానిచ్చుట చాలదా? మీరు ఇపుడు యాజకత్వమునకు కూడ అఱ్ఱులు చాపవలెనా?
11. దీనికై నీవును, నీతో జతకట్టినవారు ప్రభువునకు విరోధముగా పోగైయున్నారు. అహరోను ఏపాటివాడు? అతనికి విరోధముగా మీరు గొణగనేల?” అనెను.
12. మోషే ఎలీయాబు కుమారులు దాతానును అబీరాముని పిలువనంపెను. కాని వారు “మేము రాము,
13. నీవు మమ్ము పాలుతేనెలుజాలువారు ఆ ఐగుప్తుదేశము నుండి తరలించుకొని వచ్చినది ఈ నిర్జన ప్రదేశమున చంపివేయుటకే కదా? పైగా మా మీద పెత్తనముకూడా చేసెదవా?
14. నిశ్చయముగా నీవు మమ్ము పాలుతేనెలు జాలువారు నేలకు కొని రాలేదు. మాకు పొలములు, ద్రాక్షతోటలు పంచి ఈయలేదు. ఈ ప్రజలు అంత గ్రుడ్డివారనుకొంటివా యేమి? మేము నీయొద్దకు రాము ” అనిరి.
15. ఆ మాటలకు మోషే ఉగ్రుడై “ప్రభూ! నీవు వీరి సమర్పణములను అంగీకరింపవలదు. నేను వీరికి ఎట్టి అపకారమును చేయలేదు. తుదకు వీరి గాడిదనైనను తీసికొని ఎరుగను” అనెను.
16. మోషే కోరాతో “రేపు నీవు నీ అనుచరులును, అహరోనును ప్రభువు సన్నిధికి రండు.
17. మీ రెండువందల యేబదిమందిలో ప్రతివాడు తన ధూపకలశములను సాంబ్రాణితో నింపి ప్రభువు ఎదుటికి కొనిరావలెను. అట్లే నీవు, అహరోను మీ యిరువురి కలశములను కొనిరండు” అని చెప్పెను.
18. ఆ రీతిగనే ప్రతివాడును సాంబ్రాణి నిండిన తన ధూపకలశముతో నిబంధనపు గుడారము ఎదుట ప్రోగయ్యెను. మోషే అహరోనులు కూడ వచ్చిరి.
19. కోరా ఆ జనులనందరిని మోషే అహరోనులకు వ్యతిరేకముగా గుంపుగా చేర్చి సమావేశపు గుడారము ద్వారమువద్ద నిలుపగా, ప్రభువు సాన్నిధ్యపు ప్రకాశము ఒక్కసారిగా వారి ఎదుట ప్రత్యక్షమయ్యెను.
20-21. ప్రభువు మోషే అహరోనులతో మాటలాడెను. “మీరు ఈ ప్రజలకు దూరముగా నిలువుడు. నేను వారినందరిని ఒక్కక్షణములో నాశనము చేసెదను” అనెను.
22. కాని మోషే అహరోనులు నేలపై బోరగిలబడి “దేవా! నీవు జీవులన్నిటికి ప్రాణము ఇచ్చువాడవు. ఒక్కని పాపము కొరకు ఈ సమాజము నంతటిని శిక్షింతువా!” అనిరి.
23-24. ప్రభువు, మోషేతో “కోరా, దాతాను, అబీరాముల గుడారముల నుండి అవతలకు పోవలెనని ఈ ప్రజలను ఆజ్ఞా పింపుము” అనెను.
25. మోషే నేలమీదనుండి పైకిలేచి దాతాను, అబీరాముల వద్దకు వెళ్ళెను. ప్రజానాయకులును వారి వెంట వెళ్ళిరి.
26. అతడు ప్రజలతో “మీరు ఈ దుర్మార్గుల గుడారములకు దూరముగా ఉండుడు. వారి వస్తువులు వేనిని ముట్టుకోవలదు. లేదేని మీరును వారి పాపముల వలన బుగ్గియైపోవుదురు” అనెను.
27. కనుక ప్రజలు కోరా, దాతాను, అబీరాముల గుడారములనుండి దూరముగా తొలగిరి.
28. దాతాను, అబీరాములు తమ గుడారముల ముందట నిలబడియుండిరి. వారి భార్యలు, పుత్రులు, పసిబిడ్డలు అక్కడనే నిలిచియుండిరి.
29. అప్పుడు మోషే ప్రజలతో “ఈ కార్యములన్నిటిని ప్రభువు నాచేత చేయించెనేగాని నేను స్వయముగా ఏమియు చేయలేదని మీకిప్పుడే తేటతెల్లమగును. వీరు నరులందరివలెనే సహజమైన చావు చచ్చినచో ప్రభువు నన్ను పెద్దగా నియమింపలేదనుకొనుడు.
30. కాని ప్రభువు ఇపుడొక అద్భుతకార్యము చేసినచో, భూమి నోరువిప్పి వీరిని, వీరికి చెందినవారిని మ్రింగివేసినయెడల, వీరందరు జీవముతోనే పాతాళలోకము చేరుకొనినచో, వీరు ప్రభువును పరిత్యజించిరని తెలిసికొనుడు” అనెను.
31. మోషే ఈ రీతిగా మాట్లాడి ముగించెనో లేదో దాతాను, అబీరాముల కాళ్ళక్రిందటి నేల బ్రద్దలయ్యెను.
32. భూమి నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను మ్రింగివేసెను. కోరాను, అతని అనుచరులను వారి వస్తువులను కబళించివేసెను.
33. వారును, వారివస్తువులును పాతాళమునకు చేరుకొనెను. భూమి వారిని మ్రింగివేసెను. ఇకవారు ఎవరి కంటనుపడలేదు.
34. అక్కడ గుమిగూడియున్న యిస్రాయేలీయులందరు ఆ మంటిలో కలసి పోవుచున్న వారి ఏడ్పులువిని భూమి తమను గూడ మ్రింగి వేయునేమోయని భయపడిపారిపోయిరి.
35. అప్పుడు ప్రభువు సన్నిధినుండి ఒక మంట దిగివచ్చి ధూపము అర్పింపవచ్చిన ఆ రెండువందల యేబది మందిని గూడ కాల్చిబూడిద చేసెను.
36-37. ప్రభువు మోషేతో "యాజకుడగు అహరోను కుమారుడు ఎలియెజెరును పిలిచి, ధూప కలశములను బుగ్గినుండి వెలికిదీయుమని చెప్పుము. ఈ ధూపకలశములు పవిత్రములైనవి. ఆ బుగ్గిని దూరముగా చల్లుము.
38. వీనిని ప్రభువు ఎదుటికి కొనివచ్చినందున పవిత్రములైనవి. కనుక వీనిని రేకులుగా సాగగొట్టి బలిపీఠమును కప్పునట్లు వానిని బిగగొట్టుము. అది యిస్రాయేలీయులకు ఒక హెచ్చరిక సూచికముగా నుండగలదు” అని చెప్పెను.
39. యాజకుడగు ఎలియెజెరు, అగ్గిలో బుగ్గి యైన వారు కొనివచ్చిన ఆ కంచుకలశములను వెలికిదీసి వాటిని రేకులుగా సాగగొట్టి బలిపీఠమును కప్పుచు బిగగొట్టెను.
40. అహరోను వంశీయులు తప్ప అన్యులు ప్రభువు సాన్నిధ్యమున ధూపము సమర్పింపరాదనుటకు ఇది హెచ్చరిక అయ్యెను. , ఎవరైనను ఇట్టి కార్యమునకు తలపడెదరేని వారును , కోరా వలెను, అతని అనుచరులవలెను సర్వనాశనమగుదురు. మోషే ద్వారా ప్రభువు ఎలియెజెరును ఆజ్ఞాపించిన రీతిగనే ఇది అంతయు జరిగెను.
41. ఆ మరునాడు యిస్రాయేలు సమాజమంతా మోషే, అహరోనుల మీద గొణిగి “మీ వలన ప్రభువు ప్రజలకు ఇంతటి ముప్పువాటిల్లినదిగదా!” అనెను.
42. ఈ రీతిగా ప్రజలు మోషే, అహరోనులమీద తిరుగబడగా వారిరువురును సమావేశపు గుడారము వైపు చూచిరి. అపుడు మేఘము గుడారమును క్రమ్ముకొనగా, ప్రభు సాన్నిధ్యపు ప్రకాశము ప్రత్యక్షమయ్యెను.
43. మోషే, అహరోనులు సాన్నిధ్యపు గుడారము ఎదుటకు వచ్చిరి.
44-45. ప్రభువు మోషేతో “మీరు ఈ ప్రజల నడుమ నుండి ప్రక్కకు తొలగుడు. వీరిని నేను ఉన్న వారినున్నట్లుగా క్షణములో నాశనము చేసెదను” అనెను. వెంటనే మోషే, అహరోనులు నేలపై బోరగిలబడిరి.
46. మోషే అహరోనుతో “నీ ధూపకలశమును బలిపీఠముమీది నిప్పుకణికలతో నింపి సాంబ్రాణి వేయుము. నీవు త్వరత్వరగా ప్రజల యొద్దకు వెళ్ళి వారికొరకు ప్రాయశ్చిత్తము చేయుము. ప్రభువు కోపము ప్రజ్వరిల్లినది. అంటురోగము ప్రారంభమైనది” అనెను.
47. అహరోను మోషే ఆజ్ఞాపించినట్లే ధూప కలశము గైకొని గబగబ ప్రజల యొద్దకు వెళ్ళెను. కాని అప్పటికే ప్రజలకు అంటురోగము సోకియుండెను. అతడు ధూపమున సాంబ్రాణి వేసి ప్రజల పాపమునకు ప్రాయశ్చిత్తము చేసెను.
48. అహరోను చనిపోయినవారికి బ్రతికియున్నవారికి నడుమ నిలువబడగా అంటురోగము ఆగిపోయెను.
49. కోరా తిరుగుబాటువలన చచ్చినవారుకాక ఈ తెగులు వలన మడిసినవారు 14,700 మంది.
50. ఈ విధముగా అంటురోగము సమసిపోయిన పిదప అహరోను సాన్నిధ్యపుగుడారము ద్వారమునొద్దనున్న మోషేను తిరిగి కలసికొనెను.