ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజుల దినచర్య రెండవ గ్రంధము 15

 1-2. ప్రభువు ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యాను ప్రేరేపింపగా, అతడు ఆసా రాజును కలిసికొని “ఆసా! యూదీయులారా! బెన్యామీనీయులారా! మీరెల్లరు నా పలుకులాలింపుడు. మీరు ప్రభువు పక్షమున నిలచినంతకాలము ఆయన మీ పక్షమున నిలుచును. మీరు ప్రభువును వెదకుదురేని ఆయన మీకు దొరకును. కాని మీరు ఆయనను విడనాడుదురేని, ఆయన కూడ మిమ్మును విడనాడును.

3. యిస్రాయేలీయులకు చాలకాలముపాటు నిజమైన దేవుడు లేడు, ధర్మశాస్త్రమును బోధించు యాజకులు లేరు, ధర్మశాస్త్రమును లేదు.

4. కాని వారు తమకు ఆపద రాగానే యిస్రాయేలు దేవునకు మొర పెట్టు కొనిరి. వారు ప్రభువు దర్శనమును అభిలషింపగా, ఆయన వారికి సాక్షాత్కరించెను.

5. ఆ రోజులలో ప్రతిదేశమున అరాజకము ప్రబలుటచే ఎల్లరకును శాంతిభద్రతలు కరువయ్యెను.

6. ప్రభువు ప్రజలెల్లరిని పీడించెను గనుక ఒక జాతి మరియొక జాతిని, ఒక నగరము మరియొక నగరమును వేధించెను.

7. కాని ఇప్పుడు మీరు ధైర్యము వహింపుడు. నిరుత్సాహము చెందకుడు. ప్రభువు మీ ప్రయత్నమును తప్పక దీవించును" అని చెప్పెను.

8. ఆసా ఆ ప్రవక్త సందేశమును ఆలించి ధైర్యము తెచ్చుకొనెను. అతడు యూదా బెన్యామీను మండలములలోని విగ్రహములను తొలగించెను. ఆ రీతినే ఎఫ్రాయీము మండలమున తాను జయించిన పట్టణములలోని విగ్రహములనుగూడ నిర్మూలించెను. అతడు దేవాలయ ప్రాంగణములోని ప్రభువు బలిపీఠమును పునర్నిర్మించెను.

9. ప్రభువు ఆసాకు బాసటగా నుండెనని గ్రహించి ఉత్తరరాజ్యమందలి ఎఫ్రాయీము, మనష్షే, షిమ్యోను తెగల మధ్య పరదేశులుగా ఉన్న వారు చాలమంది అచటినుండి వెడలివచ్చి ఆసాతో చేరిపోయిరి. అతని దేవుడైన ప్రభువు అతనికి సహాయుడై యుండుట చూచి, యిస్రాయేలు వారిలోనుండి బహు జనులు అతనివైపు చేరిరి.

10. ఆసా పరిపాలన కాలము పదునైదవయేటి మూడవ నెలలో వారెల్లరును యెరూషలేమున సమావేశమైరి.

11. వారు తాము కొనివచ్చిన కొల్లసొమ్ము నుండి ఏడువందల ఎడ్లను, ఏడువేల పొట్టేళ్ళను ప్రభువునకు బలియిచ్చిరి.

12. తమ పితరులదేవుడైన ప్రభువుతో నిబంధనము చేసి కొనిరి. పూర్ణాత్మతోను, పూర్ణహృదయముతోను అతనిని ఆరాధింపవలెనని నిశ్చయించిరి.

13. ప్రభువును ఆరాధింపనివారిని బాలురనేమి, వృద్ధులనేమి, స్త్రీల నేమి, పురుషులనేమి చంపవలయునని నిర్ణయించిరి.

14. ఆ ప్రజలు ఎలుగెత్తి ప్రభువు నెదుట ప్రమాణము చేసిరి. అటుపిమ్మట కోలాహలముచేసి బూరలనూదిరి.

15. దేవుని ఎదుట పూర్ణహృదయముతో ప్రమాణము చేసితిమిగదా అని యూదీయులెల్లరు మిగుల సంతసించిరి. వారు నిండుమనసుతో ప్రభువును కాంక్షించిరి కనుక ఆయన వారిని కరుణించి, నలువైపుల శాంతిని దయచేసెను.

16. ఆసా పితామహియైన మాకా అషేరా కొయ్యబొమ్మలను నెలకొల్పెను . కనుక అతడు ఆమెను రాజమాత పదవినుండి తొలగించెను. ఆ విగ్రహమును ముక్కలు ముక్కలుగా నరికించి కీద్రోను లోయలో కాల్పించెను.

17. ఆ రాజు ఉన్నత స్థలములను పూర్తిగా నాశనము చేయింపలేదు. అయినను అతడు బ్రతికిన దినములన్నియు పూర్ణహృదయముతో ప్రభువును సేవించెను.

18. అతడు తన తండ్రి అబీయా దేవుని కర్పించిన వస్తుసముదాయమును, తాను స్వయముగా అర్పించిన వెండి బంగారు పరికరములను దేవాలయమున కప్పగించెను.

19. ఆసా పరిపాలనాకాలము ముప్పది ఐదవ యేటి వరకును ఎట్టి యుద్ధములు జరుగలేదు.