ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సంఖ్యాకాండము చాప్టర్ 15

 1-2. ప్రభువు మోషేతో ఇట్లనెను: “యిస్రాయేలీయులతో నా మాటలుగా ఇట్లుచెప్పుము.

3. మీరు నేనొసగు దేశమును చేరిన తరువాత నాకు బలులు, దహనబలులు సమర్పింతురు. ఆయా పండుగలందో లేక మీరుచేసిన మ్రొక్కుబడులను ముగించుటకో లేక స్వేచ్చగా కోరికపడియో ఆ బలులను సమర్పింతురు. కోడెనుగాని, పొట్టేళ్ళనుగాని, మేకపోతులనుగాని నాకు సమర్పింతురు. ఈ బలుల సువాసన ప్రభువునకు ప్రీతి కలిగించును.

4. ఈ బలులను అర్పించువారు రెండుకుంచముల ధాన్యము, రెండుపిడతల ఓలివునూనె కొనిరావలెను.

5. దహన బలులు అర్పించునపుడు ప్రతి గొఱ్ఱెపిల్లకు రెండు బుడ్ల ద్రాక్షసారాయము గూడ కొనిరావలెను.

6. పొట్టేలిని సమర్పించునపుడు నాలుగు కుంచముల పిండిని, మూడుపిడతల ఓలివునూనెతో తడిపి దేవునికి అర్పింపవలెను.

7. మూడుబుడ్ల ద్రాక్షసారాయము గూడ సమర్పింపవలెను. ఈ బలుల సువాసన ప్రభువునకు ప్రీతి కలిగించును.

8-9. దహనబలిగా గాని, సమాధానబలిగా గాని, మ్రొక్కుబడిబలిగా గాని కోడెదూడను సమర్పించునపుడు ధాన్యమును కూడ సమర్పింపవలెను. ఆరు కుంచముల పిండిని ఐదుపిడతల నూనెతో తడిపి సమర్పింపవలెను.

10. పైపెచ్చు. ఐదుబుడ్ల ద్రాక్షాసారాయమును గూడ సమర్పింపవలెను. ఈ బలుల సువాసన ప్రభువునకు ప్రీతి కలిగించును.

11. కోడె, పొట్టేలు, గొఱ్ఱెపిల్ల, మేకపిల్ల వీనిలో దేనిని సమర్పించినను ఈ రీతిగనే చేయవలెను.

12. ఎన్ని పశువులను సమర్పించినను, ఒక్కొక్క పశువునకును పైన చెప్పిన కొలతల ప్రకారము ధాన్యము, పానము సమర్పింపవలెను.

13. యిస్రాయేలీయులు ప్రభువునకు ప్రీతి గలిగించు సువాసనగల దహనబలులు సమర్పించు నపుడెల్ల, ఈ నియమములు పాటింపవలెను.

14. మీయొద్ద వసించు పరదేశిగాని, మీ తరతరములలో మి మధ్యనున్నవాడెవడైనను గాని ప్రభువునకు ప్రీతి కలిగించు సువాసనగల దహనబలి అర్పింపగోరినపుడు మీరు చేయునట్లే అతడును చేయవలెను.

15. సమాజమునకు అనగా మీకును, మీలో నివసించు పరదేశికిని ఒకటేకట్టడ. అది మీ తరతరములకుండు నిత్యమైన కట్టడ. దేవుని ఎదుట మీరును, పరదేశులును సమానులే.

16. కనుక మీకును వారికిని ఒకే ఏర్పాటు, ఒకే న్యాయవిధి వర్తించును” అని చెప్పెను.

17-18. ప్రభువు మోషేతో “యిస్రాయేలీయులతో నామాటగా ఇట్లు చెప్పుము:

19. మీరు నేనొసగు నేలను చేరుకొనిన తరువాత అక్కడ పంటను భుజించునపుడు దానిలో కొంతభాగమును నాకు సమర్పింపవలెను.

20. ప్రతి సంవత్సరమును క్రొత్తధాన్యము నుండి తయారుచేసిన భోజనము ప్రభువునకు కానుకగా అర్పింపవలెను. మీరు కళ్ళమున తొక్కించిన ధాన్యములో ఒకవంతు దేవునికి సమర్పించినట్లే, ఈ భోజనమును గూడ సమర్పింపుడు.

21. ఏటేట తొలిధాన్యమునుండి తయారుచేసిన భోజనమున ఒకవంతు ప్రభువునకు సమర్పింపుడు. కలకాలము ఇట్లు చేయుడు” అని చెప్పెను.

22. యావే మోషే ముఖమున ఇచ్చిన ఈ ఆలను ఎవరైనా ప్రమాదవశమున మీరినచో,

23. రాబోవు తరమువారు యావే మోషే ముఖమున ఇచ్చిన ఆజ్ఞలను మీరినచోప్రాయశ్చిత్తము చేసికొనవలెను.

24. సమాజమంతయు అనాలోచితముగ ప్రభువు ఆజ్ఞమీరినచో ఒక కోడెదూడను దహనబలిగా సమర్పింపవలెను. ఆ బలి సువాసన ప్రభువునకు ప్రీతిగలిగించును. దానితో పాటు ధాన్యము, ద్రాక్షసారాయము అర్పింపవలెను. పైగా పాపపరిహారబలిగా ఒక మేకపోతును అర్పింపవలెను.

25. యాజకుడు సమాజమంతటికిని ప్రాయశ్చిత్తము జరుపవలెను. ప్రజలు అనాలోచితముగా పాపముచేసిరి కనుకను, పాపపరిహారమునకై దహనబలిని అర్పించిరి కావునను వారి పాపము మన్నింపబడును.

26. యిస్రాయేలు సమాజమంతయు వారితో జీవించు అన్యదేశీయులందరు పాపపరిహారము పొందుదురు. అందరును ఏమరుపాటున పాపము చేసినవారేకదా!

27. కాని ఎవడైనను వ్యక్తిగతముగా పొరపాటున పాపముచేసినచో, అతడు పాపపరిహారముగా ఒక యేడాది అడుమేకకూనను సమర్పింపవలెను.

28. యాజకుడు దేవుని ఎదుటనే పాపికి ప్రాయశ్చిత్తము జరుపును. అతనిపాపము పరిహరింపబడును,

29. యిస్రాయేలీయుడైన గాని, అన్యదేశీయుడైన గాని పొరపాటున పాపము చేసినపుడు ఈ నియమమునే పాటింపవలెను.

30. కాని యిస్రాయేలీయుడేగాని, పరదేశియే గాని తెగించి పాపముచేసెనేని ప్రభువును కించపరచి నట్లగును. కనుక అతనిని సమాజమునుండి వెలివేయవలెను.

31. అతడు ప్రభువును నిర్లక్ష్యము చేసి బుద్ధిపూర్వకముగా ఆయన ఆజ్ఞను మీరెను. కనుక వానిని నిశ్చయముగా వెలివేయవలెను. అతని తప్పిదములకు అతడే బాధ్యుడు.

32. యిస్రాయేలీయులు ఎడారియందున్న కాలమున ఒక మనుష్యుడు విశ్రాంతిదినమున కట్టెపుల్లలు ప్రోగుచేసికొనుటను చూచిరి.

33. అతనిని మోషే, అహరోనులు మరియు యిస్రాయేలు సమాజము గుమిగూడియున్న చోటికి కొనివచ్చిరి.

34. కాని అతనికి ఏమి శిక్షవిధింపవలెనో తెలియక కొంత కాలము బందీగానుంచిరి.

35. అప్పుడు ప్రభువు మోషేతో "ద్రోహికి మరణశిక్ష విధింపుడు. సమాజమంతయు అతనిని శిబిరము వెలుపల రాళ్ళతో కొట్టి చంపవలయును” అని చెప్పెను.

36. కనుక సమాజము అతనిని శిబిరము వెలుపలకు కొనిపోయి మోషే ద్వారా ప్రభువు ఆజ్ఞాపించిన విధముగ రాళ్ళతో కొట్టిచంపెను.

37-38. ప్రభువు మోషేతో ఇట్లు చెప్పెను: “యిస్రాయేలు ప్రజలతో కట్టుబట్టల అంచులకు కుచ్చులు కుట్టించుకోవలెనని చెప్పుము. ప్రతి కుచ్చు మీదను ఒక ఊదాపోగు ఉండవలెను. తరతరముల వరకు వారు ఈ కుచ్చులు తాల్పవలెను.

39. ఈ కుచ్చులను చూచినపుడెల్ల మీరు నా ఆజ్ఞలను జ్ఞప్తికి తెచ్చుకొని వానిని పాటింతురు. ఇకమీదట మీరు దేవునికి పవిత్రులై యుండునట్లు మీ కోరికలకు లొంగిపోయి పాడుపనులు చేయరు.

40. ఈ కుచ్చులు చూచి మీరు, నా ఆజ్ఞలు జ్ఞప్తికి తెచ్చుకొని, వానిని పాటింతురు.

41. నేను మీ దేవుడనని ఎరిగించుటకే మిమ్ము ఐగుప్తునుండి తరలించుకొని వచ్చితిని. కనుక మీ దేవుడను ప్రభుడను నేనే.”