ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజుల దినచర్య రెండవ గ్రంధము 14

 1. అబీయా తన పితరులతో కూడా నిద్రింపగా, అతనిని దావీదునగరమున పాతి పెట్టిరి. తరువాత అతని కుమారుడు ఆసా రాజయ్యెను. అతని కాలమున దేశము పదియేండ్లపాటు పూర్ణశాంతిని అనుభవించెను.

2. ఆ రాజు ధర్మబద్దముగా ప్రవర్తించి యావేకు ఇష్టుడయ్యెను.

3. అతడు అన్యదేవతల బలి పీఠములను తొలగించెను. ఉన్నత స్థలముల మీది పూజామందిరములను పడగొట్టించెను. దేవతా ప్రతిమలను పెరికించెను. అషీరా' కంబములను నరికించెను.

4. యూదీయులు తమ పితరుల దేవుడైన ప్రభుని ఆజ్ఞలు అనుసరింపవలయుననియు, ఆయన చిత్తమును పాటింపవలయుననియు కట్టడచేసెను.

5. ఆసా యూదామండలములో ఉన్నత స్థలములోని సూర్యదేవత స్తంభములను యూదా నగరములన్నింటి నుండి తొలగించెను. కనుక అతనికాలమున దేశమున శాంతి నెలకొనెను.

6. ప్రభువు ఆసా కాలమున యుద్ధములను ఆపివేసి శాంతిని దయచేసెను గనుక అతడు యూదా నగరములకు ప్రాకారములను నిర్మించెను.

7. అతడు యూదీయులతో, “మన నగరములకు ప్రాకారములు, బురుజులు నిర్మింతము. ద్వారములకు గడెలు బిగింతము. మనము దైవచిత్తమును పాటించితిమి కనుక ఈ దేశము మీద ఆధిపత్యమును నెరపుచున్నాము. అతడు మనలను రక్షించి శాంతిభద్రతలు దయచేసెను” అని చెప్పెను. ఆ రీతిగా వారు ప్రాకారములు కట్టి అభివృద్ధిని సాధించిరి.

8. ఆసాకు డాళ్ళు, బల్లెములు తాల్చిన యోధులు యూదా నుండి మూడులక్షల మంది యుండిరి. బెన్యామీను మండలము నుండి డాళ్ళు, ధనుస్సులు ధరించిన వారలు రెండు లక్షల ఎనుబదివేల మందియుండిరి. వీరందరు పరాక్రమవంతులైన యోధులు.

9. కూషీయుడైన జేరా పదిలక్షల మంది యోధులతో మూడువందల రథములతో దండువెడలి మరేషా వరకు వచ్చెను.

10. ఆసా సైన్యముతోపోయి అతనిని ఎదిరించెను. ఇరుపక్షముల సైన్యములు మరేషావద్ద జెపాతా లోయలో బారులు తీరెను.

11. ఆసా తన ప్రభువునకు ప్రార్థనచేసి “దేవా! నీవు బలవంతులకును, బలహీనులకును గూడ సాయము చేయువాడవు. ఇప్పుడు మాకు తోడ్పడరమ్ము. నిన్నునమ్మి మేము ఈ మహాసైన్యమును ఎదిరించుచున్నాము. నీవే మా ప్రభుడవు. ఏ నరుడును నిన్ను జయింపజాలడు” అని వేడుకొనెను.

12. యూదీయులు ఆసా నాయకత్వమున పోరు ప్రారంభింపగా, ప్రభువు కూషీయులను ఓడించెను. వారు రణరంగము నుండి పారిపోయిరి.

13. ఆసా వారిని గెరారు వరకు తరిమికొట్టెను. కూషీయులు చాలమంది హతమైరి. కనుక వారి సైన్యము పోరు కొనసాగింపజాలదయ్యెను. ప్రభువు తన సేనలతో వారిని మట్టుపెట్టించెను. యూదా సైనికులు వారి నుండి కొల్లసొమ్ము విస్తారముగా దోచుకొనిరి.

14. వారు గెరారు చుట్టుపట్ల గల నగరములనుగూడ నాశనము చేసిరి. ఆ ప్రాంతపు ప్రజలెల్ల ప్రభువునకు భయపడి గడగడవణకిరి. యూదీయులు ఆ నగరములను దోచుకొని కొల్లసొమ్ము మిక్కుటముగా ప్రోగుచేసికొనిరి.

15. మరియు వారు అచటి పశువుల శాలల మీదబడి, చాల గొఱ్ఱెలను, ఒంటెలను తోలుకొని వచ్చిరి. అటుపిమ్మట ఎల్లరును యెరూషలేమునకు తిరిగివచ్చిరి.