1. యిస్రాయేలున యెహోవాహాసు కుమారుడు యెహోవాసు పరిపాలనాకాలము రెండవయేట యూదాసీమలో యోవాసు కుమారుడు అమస్యా రాజయ్యెను.
2. రాజగునప్పటికి అమస్యా ప్రాయము ఇరువది ఐదేండ్లు. అతడు యెరూషలేము నుండి ఇరువది తొమ్మిది యేండ్లు యేలెను. అతని తల్లి యెరూషలేమునకు చెందిన యెహోవద్దీను.
3. అతడు ప్రభువునకు ప్రీతికలిగించు కార్యములు చేసెను. అయినను అమస్యా దావీదు వంటివాడు కాదు. అన్ని విషయములలో తన తండ్రి యెవాషు చేసిన ప్రకారము జరిగించెను.
4. అతడు ఉన్నత స్థలములను తొలగింపలేదు. ప్రజలు ఆ మందిరములలో బలులర్పించి సాంబ్రాణి పొగ వేయుచునే ఉండిరి.
5. అమస్యా తన పరిపాలనను సుస్థిరము చేసికొనగనే పూర్వము తన తండ్రిని చంపిన వారిని మట్టుపెట్టెను.
6. కాని వారి పిల్లలను వధింపలేదు. “బిడ్డలదోషములకు తండ్రులనుగాని, తండ్రుల దోషములకు బిడ్డలనుగాని వధింపరాదు. ఎవరి పాపమునకు వారినే శిక్షింపవలయును” అను మోషే ధర్మశాస్త్ర విధిని పాటించెను.
7. అతడు మృతసముద్రమునకు దక్షిణమున నున్న ఉప్పులోయలో వేయిమంది ఎదోమీయులను జయించి వారి మండలమునందలి సేలా నగరమును పట్టుకొని దానికి యోక్తేలు అని పేరు పెట్టెను. నేటికిని ఆ నగరమునకు అదియే పేరు.
8. అమస్యా యిస్రాయేలు రాజు యెహోవాషు వద్దకు దూతలనంపి అతనిని యుద్ధమునకు సవాలు చేసెను.
9. కాని యెహోవాపు ప్రతి సందేశము పంపి “ఒకమారు లెబానోను కొండమీది ముండ్లపొద 'నీ కుమార్తెను నా కుమారునకిచ్చి పెండ్లి చేయుము' అని దేవదారు వృక్షమునకు కబురంపెను. అంతలో ఒక అడవి మృగము వచ్చి ఆ పొదను కాళ్ళతో తొక్కి వేసెను.
10. ఓయి అమస్యా! నీవు ఎదోమీయులను జయించితినని పొంగిపోవుచున్నావు. నీ ఇంటిపట్టున పడియుండి విజయగర్వముతో విఱ్ఱవీగుము. మాతో చెలగాటమాడితివా నీకును, నీప్రజలకును ముప్పు తప్పదు” అని చెప్పించెను.
11. ఐనను అమస్యా ఊరుకోడయ్యెను. కనుక యెహోవాసు తన బలముతో వచ్చి యూదానందలి బెత్సెమెషు పట్టణము దగ్గర అమస్యా నెదిరించెను.
12. ఆ పోరాటమున అమస్యా ఓడిపోగా అతని భటులందరు పారిపోయిరి.
13. యెహోవాసు అమస్యాను బంధించి, యెరూషలేము మీదికి దాడి చేసి నగర ప్రాకారమును, ఎఫ్రాయీము ద్వారమునుండి మూల ద్వారము వరకు రెండువందల గజముల పొడవున పడగొట్టించెను.
14. ఆ రాజు తనకు దొరికిన వెండి బంగారములను, దేవాలయమున వాడు పరికరములను, ప్రాసాద భాండాగారమునందలి నిధులను ప్రోగు జేసికొని బందీలను వెంటనిడుకొని సమరియాకు వెడలిపోయెను.
15. యెహోవాసు చేసిన ఇతర కార్య ములు, యూదారాజయిన అమస్యాతో యుద్ధమున అతడు చూపిన పరాక్రమము, యిస్రాయేలు రాజుల చరితమున లిఖింపబడియేయున్నవి.
16. అంతట యెహోవాసు తన పితరులతో నిద్రించి సమరియా యందు రాజసమాధులలో పాతి పెట్టబడెను. అటు తరువాత అతని కుమారుడు యరోబాము రాజయ్యెను.
17.యూదా రాజు అమస్యా యిస్రాయేలు రాజు యెహోవాసు గతించిన పిమ్మట పదునైదు ఏండ్లు జీవించెను.
18. అతడు చేసిన కార్యములు యూదా రాజులచరితమున వ్రాయబడియే ఉన్నవి.
19. శత్రువులు అమస్యాను యెరూషలేమున హత్యచేయబోగా అతడు లాకీషునకు పారిపోయెను. కాని శత్రువులు లాకీషునకు కొందరిని అతనితో పంపగా, వారుపోయి అచట అమస్యాను వధించిరి.
20. అతని శవమును గుఱ్ఱముమీద కొనివచ్చి దావీదు నగరమున అతని పితరుల సమాధులలో పాతి పెట్టిరి.
21. యూదీయులందరు అమస్యా కుమారుడు అజర్యాను రాజునుచేసిరి. అతనికి అప్పుడు పదునారేండ్లు.
22. అతడు తండ్రి మరణానంతరము ఏలతు నగరమును జయించి పునర్నిర్మించెను.
23. యూదా రాజ్యమున, యోవాషు కుమారుడు అమస్యా పరిపాలనాకాలము పదునైదవయేట, యెహోవాషు కుమారుడు యరోబాము యిస్రాయేలునకు రాజై సమరియానుండి నలువది ఒకయేండ్లు పరిపాలించెను.
24. పూర్వము యిస్రాయేలును పాపమునకు పురికొల్పిన నెబాతు కుమారుడు యరోబాము వలె ఇతడును యావేకు గిట్టని దుష్కార్యములు చేసెను.
25. ఈ యరోబాము ఉత్తరమున హమాతు దిక్కు నుండి దక్షిణమున మృతసముద్రమువరకు గల యిస్రాయేలు దేశభాగములను శత్రువులనుండి మరల స్వాధీనము చేసికొనెను. యిస్రాయేలు దేవుడైన ప్రభువు, గాతుహేఫేరునకు చెందిన అమిత్తయి కుమారుడగు యోనా ప్రవక్త ద్వారా, ఈ విజయము గురించి ముందుగనే ఎరిగించెను.
26. యిస్రాయేలీయులు పడు అగచాట్లను వారిని ఎవ్వరును ఆదుకొనుటకు రాకపోవుటను ప్రభువు గుర్తించెను.
27. ప్రభువు యిస్రాయేలీయులను నేలమీదినుండి తుడిచి వేయదలచుకోలేదు. కనుక యరోబాము ద్వారా వారిని రక్షించెను.
28. యరోబాము చేసిన ఇతర కార్యములు, పరాక్రమవంతమైన అతని యుద్ధములు, అతడు దమస్కు హమాతులను యిస్రాయేలునకు సంపాదించి పెట్టిన తీరు యిస్రాయేలు రాజుల చరితమున లిఖింపబడియే ఉన్నవి.
29. యరోబాము తన పితరులతో నిద్రించిన తరువాత అతని కుమారుడు జెకర్యా రాజయ్యెను.