ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజులు మొదటి గ్రంధము 14

 1. యరోబాము కుమారుడైన అబీయాకు జబ్బుచేసెను.

2. యరోబాము తన భార్యతో “నీవు రాణివని గుర్తుపట్టని విధముగా మారువేషము వేసికొని షిలో నగరమునకు పొమ్ము. నేను రాజునగుదునని ముందుగనే ఎరిగించిన అహీయా ప్రవక్త అచట నివసించుచున్నాడు.

3. అతనికి పది రొట్టెలు, అప్ప ములు, దుత్తెడు తేనె కొనిపొమ్ము. మన బిడ్డకేమి సంభ వించునో అతడు నీకు తెలియజెప్పును” అనెను.

4. ఆ విధముగనే యరోబాము భార్య మారువేషము వేసుకొని నగరమునకుపోయి అహీయా ఇల్లు చేరుకొనెను. అహీయాకు పెద్దప్రాయము వచ్చినందున దృష్టి మందగించియుండెను.

5. "యరోబాము భార్య మారువేషములో మరియొక స్త్రీవలె నటించుచు జబ్బుగా ఉన్న బిడ్డకు ఏమిసంభవించునో విచారించుటకై నీ వద్దకు వచ్చుచున్నది” అని ప్రభువు ముందుగనే అహీయాకు తెలియజేసెను. ప్రవక్త ఆమెతో ఏమి చెప్పవలయునోకూడ ముందుగనే తెలిపెను.

6. కనుక రాణి తనింటికి రాగానే అహీయా ఆమె అడుగుల చప్పుడు విని “అమ్మా! లోనికి రమ్ము. నీవు యరోబాము భార్యవని నేనెరుగుదును. నీవు మరొక స్త్రీ వలె నటింపనేల? నేను నీకు దుఃఖకరమైన వార్త విన్పింపవలెను.

7. యరోబామునకు నీవు ప్రభువు పలుకులు ఇట్లు విన్పింపవలెను 'నేను సామాన్య జనులనుండి నిన్నెన్నుకొని నా ప్రజలైన యిస్రాయేలీయులకు రాజును చేసితిని.

8. దావీదువంశీయుల నుండి రాజ్యమును గైకొని నీ వశము చేసితిని. అయినను నీవు నా ఆజ్ఞలను పాటించుచు పూర్ణహృదయముతో నన్ను సేవించి, నాకు ప్రీతికరమైన కార్యములు చేసిన దావీదు చేసినట్లు చేయక,

9. నీ పూర్వరాజులకంటెను అధికముగా దుష్కార్యములు చేసితివి. నన్ను లెక్కచేయవైతివి. రాతి బొమ్మలను, పోతబొమ్మలను పూజించి నాకు కోపమును రెచ్చగొట్టితివి.

10. కనుక నేను నీ ఇంటివారిని మొదలంట నిర్మూలించెదను. పెద్దలు పిన్నలు అనక నీ కుటుంబమునకు చెందిన మగవారినందరిని మట్టుపెట్టెదను. వేయేల? నీసంతతి వారినందరిని కసవూడ్చినట్లు ఊడ్చివైచెదను.

11. నీ కుటుంబీకులెవరైన పట్టణమున చచ్చినచో వారిని కుక్కలు పీకుకొనితినును. పొలమున చచ్చినచో వారిని రాబందులు పొడిచితినును. ఇది ప్రభుడనైన నా పలుకు'.

12. అమ్మా! నీవిక మీ ఇంటికి వెడలిపొమ్ము . నీవు పట్టణము చేరగానే బిడ్డడు చనిపోవును.

13. బిడ్డ మృతికిగాను యిస్రాయేలీయులు శోకించి అతనిని పాతి పెట్టుదురు. యరోబాము కుటుంబమున గౌరవప్రదముగా భూస్థాపనము జరుగునది ఈ బిడ్డనికి ఒక్కనికే. అతని కుటుంబమంతటిలోను యిస్రాయేలు దేవుడైన ప్రభువునకు ప్రీతిపాత్రుడైనవాడు ఇతడొక్కడే.

14. ప్రభువు యిస్రాయేలీయులకు ఇంకొక రాజును నియమించును. అతడు యరోబాము వంశమును తుదముట్టించును.

15. ప్రభువు యిస్రాయేలీయులను శిక్షించును. వారు ఏటిలోని రెల్లువలె భయముతో కంపించిపోదురు. ప్రభువు పితరులకిచ్చిన ఈ బంగారు నేలమీదినుండి యిస్రాయేలీయులను కూకటి వ్రేళ్లతో పెకిలించివేయును. వారిని యూఫ్రటీసు నదికి ఆవలివైపున చెల్లాచెదరుచేయును. ఆ ప్రజలు అషేరా దేవతను పూజించి ప్రభు కోపమును రెచ్చగొట్టిరి.

16. యరోబాము తాను పాపము చేసినది చాలక యిస్రాయేలీయుల చేతను పాపముచేయించెను గనుక ప్రభువు వారిని చేయివిడిచెను" అనెను.

17. అంతట యరోబాము భార్య తీర్సా పట్టణమునకు వెడలి పోయెను. ఆమె తన ఇంట అడుగిడుచుండగనే బిడ్డ చనిపోయెను.

18. ప్రభువు తన సేవకుడైన అహీయా ప్రవక్త ముఖమున నుడివినట్లే యిస్రాయేలీయులు ఆ బిడ్డ మృతికి శోకించి అతనిని పాతి పెట్టిరి.

19. యరోబాము జీవితమునందలి ఇతరాంశములు, అతడు చేసిన యుద్ధములు, పరిపాలించినతీరు, యిస్రాయేలు రాజులచరిత్రలో లిఖింపబడియే యున్నవి.

20. యరోబాము ఇరువది రెండేండ్లు పరిపాలించెను. అతడు తన పితరులతో నిద్రించగా అతని తరువాత అతని కుమారుడు నాదాబు రాజయ్యెను.

21. యూదామండలమున సొలోమోను కుమా రుడు రెహబాము రాజ్యము చేసెను. రాజగునప్పటికి అతని వయస్సు నలుబది ఒకటేండ్లు. అతడు యెరూషలేము నుండి పదిహేడేండ్లు పరిపాలించెను. యిస్రాయేలు దేశమంతటినుండి ప్రభువు తన నామమును నివాసస్థానముగా ఎన్నుకొనిన నగరమిది. రెహబాము తల్లి అమ్మోనీయురాలగు నామా.

22. యూదీయులు తమ పితరులకంటె అధికముగా దుష్కార్యములు చేసి ప్రభువు కోపమును రెచ్చగొట్టిరి.

23. వారు ఉన్నతస్థలములపై బలిపీఠములను నిర్మించిరి. కొండలమీదను, వృక్షముల క్రిందను రాతి స్థంభములను, కొయ్య స్తంభములను పాతి వానికి పూజలు చేసిరి.

24. వేశ్యలవలె ప్రవర్తించు పురుషులు నాడు ఆ దేశముననుండిరి. యిస్రాయేలీయులు ఆ భూమిని ఆక్రమించుకొనినపుడు ప్రభవు అచటినుండి తరిమి వేసిన అన్యజాతిజనులు చేయు పాపకార్యములెల్ల యూదీయులును చేసిరి.

25. రెహబాము పరిపాలనాకాలము అయిదవ ఏట ఐగుప్తు రాజగు షీషకు యెరూషలేము మీదికి దండెత్తివచ్చెను.

26. అతడు దేవాలయమునుండియు రాజప్రాసాదము నుండియు ద్రవ్యమెల్ల దోచుకొని పోయెను. సొలోమోను చేయించిన బంగారుగాలులను గూడ కొల్లగొట్టెను.

27. వానికి మారుగా రెహబాము ఇత్తడి డాలులను చేయించి వానిని రాజప్రాసాద ద్వారమునకు కాపుండు బంటుల అధీనమునుంచెను.

28. యావే మందిరమునకు రాజు పోయినపుడెల, వారు ఆ ఇత్తడి డాలులను మోసికొని పోయెడివారు. తరువాత వానిని యథాస్థానమునకు చేర్చెడివారు.

29. రెహబాము జీవితమునందలి ఇతరాంశములు, అతడు చేసిన పనులు యూదా రాజుల చరిత్రలో లిఖింపబడియేయున్నవి.

30. రెహబాము, యరోబాము బ్రతికియున్నన్నినాళ్లు ఇరువురును ఒకరితో ఒకరు పోరాడుకొనుచునే యుండిరి.

31. రెహబాము తన పితరులతో కూడ నిద్రించి దావీదుపురమందున్న తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతని తల్లి అమ్మోనీయురాలగు నామా. అతని తరువాత అతని కుమారుడు అబీయాము రాజయ్యెను.