1. ఆ మాటలు విని ప్రజలందరు బిగ్గరగా కేకలువేసిరి. వారు రాత్రియెల్ల విలపించుచునేయుండిరి.
2. యిస్రాయేలు ప్రజలు మోషే, అహరోనులమీద గొణగుకొనిరి.
3. “మనమందరము ఆ ఐగుప్తుననో, ఈ ఎడారియందుననో చచ్చిన ఎంత బాగుండెడిది! ప్రభువు మనలను ఇక్కడికి తోడ్కొనిరానేల? ఈ శత్రువుల కత్తికి అప్పగించుటకా? మన ఆడపడుచులు, పిల్లలు వారిచేతికిచిక్కి చెఱపోవుటకా? మనము తిరిగి ఐగుప్తునకు వెళ్ళిపోవుట మేలుకదా!” అనిరి.
4. వారు ఒక క్రొత్త నాయకుని ఎన్నుకొని ఐగుప్తునకు వెళ్ళిపోవలెనని మధనపడసాగిరి.
5. అపుడు మోషే అహరోనులు అచట గుమిగూడియున్న యిస్రాయేలు సమాజము ముందట సాష్టాంగపడిరి.
6. వేగు నడపి వచ్చిన నూను కుమారుడు యెహోషువ, యెఫున్నె కుమారుడు కాలేబు కట్టుబట్టలు చించుకొనిరి.
7. వారు ప్రజలతో “మేము చూచి వచ్చిన నేల చాల మంచిది.
8. ప్రభువునకు దయ కలిగినచో మనలను అక్కడికి కొనిపోయి ఆ నేలను మన వశము చేయును. అది పాలుతేనెలు జాలువారు నేల.
9. మీరు మాత్రము ప్రభువుమీద తిరుగబడవలదు. ఆ దేశప్రజలకు భయపడవలదు. వారిని మనము అవలీలగా జయింపవచ్చును. ఆ ప్రజల రక్షణ వారినుండి తొలగిపోయినది. ఏలయన, ప్రభువు మనకు అండగా ఉండును. కనుక మీరు భయపడనక్కరలేదు” అనిరి.
10. యిస్రాయేలు సమాజము మోషే అహరోనులను రాళ్ళతో కొట్టి చంపవలెనని తలంచుచుండగా హఠాత్తుగా, సమావేశపు గుడారముమీద ప్రభువు తేజస్సు ప్రకాశించెను.
11. ప్రభువు మోషేతో “వీరు ఇంకను ఎంతకాలము నన్ను నిరాకరింతురు? నేను చేసిన అద్భుతకార్యములు కన్నులార జూచియు ఎంతకాలమని విశ్వసించక నన్ను ఉపేక్షింతురు?
12. నేను అంటురోగములతో వీరిని నిర్మూలింతును, నీ నుండి మరియొక క్రొత్త జాతిని కలిగింతును. ఆ ప్రజలు వీరికంటె అధికులు, బలవంతులు అగుదురు” అని అనెను.
13. మోషే ప్రభువుతో “ప్రభూ! నీవు స్వీయ బలముతో ఈ ప్రజలను ఐగుప్తునుండి తరలించు కొనివచ్చితివిగదా! నీవు ఈ యిస్రాయేలు ప్రజలకు ఏమిచేసితివో తెలిసికొని ఆ విషయమును ఐగుప్తీయులు ఈ దేశవాసులకు ఎరిగింతురు.
14. నీవు మా మధ్య నెలకొనియున్నావనియు, నీ మేఘము మా మీద ఆగినపుడు నీవు మాకు ప్రత్యక్షముగా దర్శనమిత్తు వనియు, నీవు పగలు మేఘస్తంభములోను, రాత్రి అగ్నిస్తంభములోను మాముందు నడుచుచున్నావని ఈ ప్రజలు వినియేయున్నారు.
15. ఇప్పుడు నీవు తొందర పడి ఈ ప్రజలందరిని చంపివేసినచో నీ కీర్తిని వినిన ఈ దేశీయులు ఏమనుకొందురు?
16. 'చూచితిరా! ప్రభువు యిస్రాయేలు ప్రజలను తాను వాగ్దానము చేసిన భూమికి చేర్చలేకపోయెను. కనుకనే వారిని ఎడారిలో చంపివేసెను' అని ఆడిపోసుకోరా?
17. కనుక ప్రభూ! నీ బలమును ప్రదర్శింపుము.
18. ప్రభువు సులభముగా కోపపడువాడుకాడు. మిగుల దయగలవాడు. అతడు ప్రజల పాపములను తిరుగుబాటును మన్నించును. అయినను ఆయన అపరాధిని నిరపరాధిగా యెంచక, పితరుల పాపమునకై వారి సంతానమును మూడు నాలుగు తరముల వరకు శిక్షించును, అని నీవే స్వయముగా చేసిన ప్రమాణమును జ్ఞప్తికి తెచ్చుకొనుము.
19. నీ దయ అపారమైనది. కనుక ఐగుప్తునుండి బయలుదేరినది మొదలుకొని ఇంతవరకు నీవు ఈ ప్రజలను మన్నించినట్లే ఇప్పుడును వీరి తప్పిదములు మన్నింపుము” అని మనవి చేసెను.
20. ప్రభువు మోషేతో “నీవు కోరినట్లే నేను వీరిని క్షమింతును.
21-22. కాని నేను సజీవుడను, భూమియంతయు ప్రభువు మహిమతో నిండియున్నది అనుట ఎంతసత్యమో ఈ ప్రజలును వాగ్దత్త భూమిని చేరరనుటయు అంతే సత్యము, వీరు నా సాన్నిధ్యమును చూచిరి. ఐగుప్తుననేమి, ఎడారిలో నేమి నేను చేసిన అద్భుత కార్యములను కన్నులార చూచిరి. కాని వీరు పదేపదే నన్ను పరీక్షించుచున్నారు. నా మాట పెడచెవిని పెట్టుచున్నారు.
23. కనుక వీరిలో ఒక్కడును నేను పితరులకు వాగ్ధానము చేసిన నేలను చేరుకొనడు. నా ఆజ్ఞను త్రోసివేసినవారు ఎవ్వరును ఆ భూమిని కంటితో చూడరు.
24. కాని నా సేవకుడైన కాలేబు మాత్రము వారివంటివాడు కాడు. అతడు నా మాట జవదాటి ఎరుగడు. కనుక కాలెబు తాను వేగు నడపి వచ్చిన దేశమున అడుగిడితీరును. అతని సంతతివారు ఆ నేలను భుక్తము చేసికొందురు.
25. ప్రస్తుతము అచ్చట అమాలేకీయులు, కనానీయులు వసించుచున్నారు. రేపు మీరు రెల్లు సముద్రము వైపుగా బయలుదేరి ఎడారికి మరలిపొండు” అనిచెప్పెను.
26-27. ప్రభువు మోషే అహరోనులతో ఇట్లనెను: “నాకు వ్యతిరేకముగా గొణుగుకొను ఈ సమాజమును నేను ఎంతకాలము సహింపవలెను? ఈ దుష్టుల సణుగుడును నేనువింటిని.
28. మీరు వారితో ఇట్లు చెప్పుడు: నేను సజీవుడననుట ఎంత నిక్కమో అంతే నిక్కముగా మీ మాటలకు తగినట్లే మిమ్ము దండింతును. ప్రభుడనైన నేను చెప్పుచున్నాను, వినుడు.
29. మీరు చత్తురు. మీ శవములు ఈ ఎడారిలో చిందరవందరగా కూలిపడును. మీరు నా మీద గొణగితిరి. కావున మీలో ఇరువదియేండ్లు అంతకు పైబడినవారందరును ఇచటనే చత్తురు.
30. నేను మీకు భుక్తము చేయుదునన్న నేలపై యెఫున్నె కుమారుడగు కాలెబు, నూను కుమారుడగు యెహోషువ తప్ప మరెవ్వరును కాలుమోపరు.
31. మీ పిల్లలు చెఱపోవుదురని మీరు వాపోతిరి. కాని మీరు నిరాకరించిన నేలకు వారిని చేర్చుదును.
32. మీరు ఈ ఎడారిలోనే చత్తురు.
33. మీ పిల్లలు నలువది యేండ్ల వరకు ఈ ఎడారిలోనే తిరుగాడుచు, మీ అవిశ్వాసమునకు వారు ప్రాయశ్చిత్తము చేయుదురు. మీ తరములవారందరు కన్ను మూయు వరకును వారిని ఈ శాపము పీడించుచునేయుండును.
34. మీరు ఆ దేశమును వేగునడిపిన నలువది రోజులు ఒక్కొక్కరోజు ఒక్కొక్క సంవత్సరముగా గణింపబడును. నలువదియేండ్లు మీరు మీ పాపఫలితమును అనుభవింతురు. అప్పుడు గాని నన్ను నిర్లక్ష్యము చేయుట అనగానేమిటో మీకు అంతుపట్టదు.
35. నను ఎదిరించిన దుష్టులకు నేను ఈ అపకారము చేసి తీరెదను. ఈ ఎడారిలో మీరందరు చత్తురు. నేను ప్రభుడను, నా మాటకు ఇక తిరుగులేదు.”
36. మోషే వేగునడుపుటకు పంపినవారు తాము చూచివచ్చిన దేశము మంచిదిగాదని చెప్పుటచే ప్రజలు మోషేమీద గొణగుకొనిరి.
37. కనుక ప్రభువు ఆ వేగులవాండ్రను రోగముతో నాశనము చేసెను.
38. వేగు నడిపినవారిలో యెహోషువ, కాలేబు మాత్రమే ప్రాణములతో బ్రతికిరి.
39. ప్రభువు తనతో చెప్పిన మాటలను మోషే యిస్రాయేలీయులకు ఎరిగింపగా, వారందరు పెద్ద పెట్టున వాపోయిరి.
40. వారు మరునాడు వేకువనే లేచి కనానును ఆక్రమించుకొనుటకై ఆ దేశములోని కొండలమీదికి ఎక్కిపోయిరి. వారు “ప్రభువు వాగ్దానము చేసిన భూమిని ఆక్రమించుకొనుటకు మనము సిద్ధముగనే ఉన్నాము గదా! మనము దేవుని ఆజ్ఞమీరి తప్పు చేసినమాట నిజమే” అనిరి.
41. కాని మోషే వారితో “మీరు ఇప్పుడు ప్రభువు ఆజ్ఞ మీరుచున్నారు. దీని వలన లాభములేదు.
42. మీరు కనానునకు వెళ్ళవద్దు. ప్రభువు మీకు తోడ్పడడు. కనుక శత్రువులు మిమ్ము జయించి తీరుదురు.
43. మీరు అచట వసించు అమాలెకీయులను, కనానీయులను ఎదిరింపగా వారు మిమ్ము నాశనము చేయుదురు. మీరు ప్రభువును ఉపేక్షించితిరి గనుక అతడు మీకు తోడ్పడడు” అని చెప్పెను.
44. అయినను వారు ఆ పలుకులు లెక్క చేయక పొగరెక్కి కనాను కొండలమీదికి ఎక్కిపోయిరి. మోషేగాని, దైవమందసముగాని వారి వెంట వెళ్ళలేదు.
45. అపుడు అచట వసించుచున్న కనానీయులు, అమాలేకీయులు, యిస్రాయేలీయులను ఎదుర్కొని ఓడించి హోర్మావరకు తరిమి హతముచేసిరి.