1. ఆ రోజులలో జనులకు మోషే ధర్మశాస్త్రమును చదివి వినిపించుచుండగా “అమ్మోనీయులనుగాని, మోవాబీయులనుగాని దేవుని ప్రజలతో కలియనీయరాదు”అను వాక్యము విన్పించెను.
2. యిస్రాయేలీయులు ఐగుప్తునుండి వెడలివచ్చునపుడు అమ్మోనీయులు, మోవాబీయులు వారికి ఆహారపానీయములు ఒసగరైరి. పైగా వారు బలాముతో మాట్లాడుకొని అతనిచే యిస్రాయేలీయులను శపింపచేసిరి. కాని మన దేవుడు ఆ శాపమును దీవెనగా మార్చెను.
3. పై వాక్యమును చదువగా విని యిస్రాయేలీయులు అన్యజాతి వారినందరిని తమ చెంతనుండి అవతలికి పంపివేసిరి.
4. యాజకుడగు ఎల్యాషిబు దేవాలయ భాండాగారమునకు అధిపతి. అతడు తోబియాకు బంధువు.
5. కనుక అతడు తోబియాను దేవాలయమున ఒక పెద్ద గదిని ఆక్రమించుకొననిచ్చెను. ఆ గదిలో అంతకు ముందు దేవాలయమునకర్పించిన ధాన్యము, సాంబ్రాణి, పాత్రలు, యాజకులకిచ్చిన పదయవ వంతు ధాన్యము, లేవీయులు, గాయకులు, ద్వారపాలకులకొరకిచ్చిన పదియవవంతు పంట ధాన్యము, ద్రాక్షసారాయము, ఓలీవునూనెను భద్రపరచియుంచెడివారు.
6. తోబియా ఆ గదిని ఆక్రమించుకొనినపుడు నేను యెరూషలేము నందు లేను. అర్తహషస్త బబులోనియాను ఏలుచున్న ముప్పది రెండవయేట నేను ఆ రాజును చూడబోయితిని. కొంతకాలము గడచిన పిదప నేనతని ఆజ్ఞ గైకొని,
7. యెరూషలేమునకు తిరిగివచ్చితిని. అప్పుడు ఎల్యాషిబు తోబియాకు దేవాలయమున ఒక గది ఏర్పరచి దుష్కృత్యము చేసెనని బహుగా దుఃఖపడి,
8. తోబియా వస్తువులన్నిటిని ఆ గదినుండి బయట వేయించితిని.
9. గదిని శుద్ధిచేయించితిని. దేవాలయ వంట పాత్రలను, ధాన్యమును, సాంబ్రాణిని మరల యథాస్థానమునకు చేర్పుడని ఆజ్ఞాపించితిని. "
10. లేవీయులకు చెందవలసినవంతు వారికి అందకపోవుటచే సేవచేయు లేవీయులు, గాయకులు యెరూషలేమును విడనాడి పల్లెలలోని వారి పొలములను సాగుచేసి కొనబోయిరి.
11. నేను దేవాలయమును ఇట్లు గాలికి వదలివేయుదురా అని పెద్దలను మందలించితిని. లేవీయులను, గాయకులను మరల తీసుకొని వచ్చి దేవాలయమున చేర్పించితిని.
12. అప్పుడు యిస్రాయేలీయులందరు పంటలో పదియవ వంతు, ద్రాక్ష సారాయము, ఓలివు నూనెను కొనివచ్చి దేవాలయమునకర్పించిరి.
13. నమ్మకము గల వ్యక్తులు అని పేరు పొందిన షెలెమ్యా అను యాజకుని, సాదోకు అను పండితుని, లేవీయులలో పెదాయాను దేవాలయ భాండాగారమునకు కాపరులుగా నియమించితిని. మత్తన్యా మనుమడును సక్కూరు కుమారుడునగు హానాను వారికి సహాయకుడు. వారెల్లరు నమ్మదగినవారు. భాండాగారము నుండి తోడిపనివారికి ఆయా వస్తువులను పంచి ఇచ్చుట వారి బాధ్యత.
14. ప్రభూ! ఈ సత్కార్యమునకుగాను నన్ను గుర్తుంచుకొనుము. నీ దేవాలయము, దేవాలయారాధనము కొరకు నేను చేసిన కృషిని విస్మరింపకుము.
15. ఆ రోజులలో యూదీయులు కొందరు విశ్రాంతిదినమున ద్రాక్షసారాయము తయారుచేయుట గమనించితిని. మరికొందరు ధాన్యమును, ద్రాక్షసారాయమును, ద్రాక్షపండ్లను, అత్తిపండ్లను, వివిధ బరువులను గాడిదల పైకెక్కించి యెరూషలేములోనికి కొనిపోవుట గూడ చూచితిని. విశ్రాంతిదినమున వానిని అమ్మవలదని హెచ్చరించితిని.
16. తూరు దేశస్తులు కొందరు యెరూషలేమున మకాము చేయుచు చేపలు మరియు వివిధ వస్తువులు యెరూషలేమునకు తీసికొని వచ్చి విశ్రాంతిదినమున యూదులకు అమ్ముచుండిరి.
17. నేను యూద నాయకులను చీవాట్లు పెట్టి “మీరు ఎంత పాడుపని చేయుచున్నారు! విశ్రాంతి దినమును అమంగళ పరచుచున్నారుగదా!
18. మునుపు మన పితరులిట్టి దుష్కార్యము చేయుటవలననే గదా ప్రభువు ఈ నగరమును నాశనము చేసినది? ఇపుడు మీరు మరల పవిత్రదినమును అపవిత్ర పరచినచో ప్రభువు కోపించి మునుపటికంటె అధికముగా యిస్రాయేలీయులను నాశనము చేయడా? అని హెచ్చరించితిని.
19. కనుక విశ్రాంతిదినము ప్రారంభమై చీకట్లు అలుముకొనగనే నగరద్వారములను మూసివేయవలెనని పవిత్రదినము ముగియువరకు వానిని మరల తెరువరాదని ఆజ్ఞాపించితిని. విశ్రాంతిదినమున బరువులను నగరములోనికి తీసికొని రాకుండుటకై సేవకులను కొందరిని ద్వారమునొద్ద కాపుంచితిని.
20. వివిధ వస్తువులను అమ్ము వ్యాపారులు ఒకటి రెండుసారులు విశ్రాంతిదిన సాయంత్రమున నగర ద్వారమునొద్ద పడిగాపులు కాసిరి.
21. నేను “మీరు రేయి ద్వారమునొద్ద కనిపెట్టికొనియుండనేల? ఇట్టి కార్యము మరల చేయుదురేని మిమ్ము శిక్షించి తీరుదును”అని వారిని బెదిరించితిని. నాటినుండి వారు మరల పవిత్రదినమున రాలేదు.
22. లేవీయులు విశ్రాంతిదినమును అమంగళ పరపకుండుటకై తమను తాము శుద్ధిచేసికొని నగరద్వారము వద్ద కాపుండవలెనని ఆజ్ఞాపించితిని. ప్రభూ! ఈ సత్కార్యమునకు గూడ నన్ను గుర్తుంచుకొనుము. నీవు కృపామయుడవు గనుక నన్ను రక్షింపుము.
23.ఆ కాలమున యూదులు అష్టోదు, అమ్మోను, మోవాబు, పడుచులను పెండ్లియాడుటగూడ గమనించితిని.
24. వారికి పుట్టిన పిల్లలలో సగముమంది అష్టోదు భాష మాట్లాడెడివారు. కాని వారు యూదా భాష మాట్లాడలేకపోయిరి. వారు నానా భాషలలో మాట్లాడిరి.
25. నేను వారినందరిని చీవాట్లు పెట్టి శపించితిని. కొందరిని కొట్టి వారి తలవెంట్రుకలను పెరికివేసితిని. ఇక మీదట వారుగాని, వారి బిడ్డలుగాని అన్యజాతివారిని పెండ్లియాడకుండునట్లు ప్రభువు పేర బాస చేయించితిని.
26. “సొలోమోను అన్యజాతి రాజులందరికంటెను గొప్పవాడు. ప్రభువతనిని ఆదరించి యిస్రాయేలులందరికి రాజుగా చేసెను. అయినను అన్యజాతి భార్యలతనిని పాపమునకు పురికొల్పిరిగదా?
27. ఇప్పుడు మీరును యిట్టి దుష్కార్యము చేయవలయునా? అన్యజాతి స్త్రీలను పెండ్లియాడి దేవునికి ద్రోహము చేయుదురా? మీ వంటి వారి మాటలు మేము ఆలకించవచ్చునా?” అని ప్రశ్నించితిని.
28. ప్రధాన యాజకుడును ఎల్యాషిబు కుమారుడునైన యెహోయాదా. ఇతని కుమారుడొకడు బేత్ హోరోనునకు చెందిన సన్బల్లటు కుమార్తెను పెండ్లియాడెను. కనుక నేనతనిని నా వద్దనుండి వెళ్ళగొట్టించితిని.
29. ప్రభూ! ఈ ప్రజలు యాజకత్వమునకు తలవంపులు తెచ్చిరి. యాజకులతో, లేవీయులతో నీవు చేసిన నిబంధనను అవమానపరచిరి. కనుక వారిని జ్ఞాపకముంచుకొనుము.
30. ఆ రీతిగ నేను అన్యజాతి జనులనుండి మన ప్రజలను వేరుజేసి వారిని పవిత్రపరచితిని. యాజకుల, లేవీయుల బాధ్యతలు తెలియజేసితిని.
31. ఆయా కాలములలో దేవాలయమునకు వంట చెరకు, ప్రథమ ఫలములు సమర్పణకై కొనిరావలెనని నియమములు చేసితిని. ఈ మంచి పనులన్నిటికిగాను ప్రభూ! నీవు నన్ను గుర్తుంచుకొనుము.