ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజుల దినచర్య రెండవ గ్రంధము 13

 1. యరోబాము పరిపాలనకాలము పదునెనిమిదవ సంవత్సరమున అబీయా యూదాకు రాజయ్యెను.

2. ఆ రాజు మూడేండ్లు పరిపాలించెను. అతని తల్లి గిబియా పౌరుడైన ఊరీయేలు కుమార్తె మీకాయా, అబీయాకును, యరోబామునకును పోరు మొదలయ్యెను.

3. అబీయా మెరికల వంటి వీరులను నాలుగు లక్షలమందిని ప్రోగుజేసికొని వచ్చెను. యరోబాము కూడ పరాక్రమవంతులను ఎనిమిది లక్షలమందిని సమకూర్చుకొని శత్రువు నెదిరించెను.

4-5. అబీయా ఎఫ్రాయీము మన్నెమునందలి సెమరాయీము కొండనెక్కి ఇట్లు ప్రకటించెను: “యరోబామూ! యిస్రాయేలీయులారా! మీరెల్లరు నా పలుకులాలింపుడు. ప్రభువు దావీదుతో నిత్యనిబంధనము చేసికొని అతనికిని, అతని సంతతికిని యిస్రాయేలు రాజ్యాధికారమును ఒప్పగించెనని మీరెరుగరా?

6. అయినను నెబాతు కుమారుడైన యరోబాము తాను సొలోమోను దాసుడయ్యు తన ప్రభువు మీద తిరుగు బాటు చేసెను.

7. అతడు ఎందుకు పనికిరాని దుర్మార్గులను కొందరిని ప్రోగుచేసి కొనివచ్చి రెహబామును ఎదిరించెను. అప్పుడు రెహబాము చిన్నవాడైయుండి అనుభవము చాలనందున వారిని ఓడింపలేకపోయెను.

8. ఇప్పుడు మీరు దావీదు సంతతికి ప్రభువు దయచేసిన రాజ్యాధికారమును సవాలు చేయవచ్చితిరి. మీరు పెద్ద సైన్యముతోనే వచ్చితిరి. యరోబాము మీకు వేల్పులుగా చేసిన బంగారు దూడలను గూడ సిగ్గు సెరములేక మీ వెంట తెచ్చుకొంటిరి.

9. మీరు అహరోను సంతతి వారైన యాజకులను మరియు లేవీయులను తరిమివేసితిరి. వారికి బదులుగా, అన్య జాతులవలె, మీ ఇష్టమువచ్చినవారిని యాజకులనుగా నియమించు కొంటిరి. ఎవడైన ఒక కోడెనో లేక ఏడు పొట్టేళ్ళనో కొనివచ్చిన చాలు మీరతనిని శుద్ధిచేసి దేవుడు కాని దేవునికి యాజకునిగా నియమించు చున్నారు.

10. కాని మాకు యావేయే దేవుడు. మేము ఆయనను పరిత్యజింపలేదు. అహరోను సంతతివారైన యాజకులు, లేవీయుల సహాయముతో మా దేవుని పరిచర్యచేయుదురు.

11. మా యాజకులు ప్రతిదినము ఉదయాస్తమయములందు ప్రభువునకు దహన బలులర్పింతురు. కమ్మని సాంబ్రాణి పొగ వేయుదురు. దేవునిసన్నిధిలో శుద్ధమైన బల్లపైని రొట్టెలర్పింతురు. ప్రతిరాత్రి బంగారు దీపస్తంభముమీద ప్రమిదలు వెలిగింతురు. మేము ప్రభువు ఆజ్ఞాపించిన సేవలనెల్ల చేయుదుము. కాని మీరు ఆయనను విడనాడితిరి.

12. ఈ యుద్ధమున ప్రభువే మాకు సైన్యాధిపతి. ఆయన యాజకులు బాకాలు చేపట్టి యున్నారు. యుద్ధనాదము చేసి మమ్ము మీ మీదికి పోరునకు పిలవసిద్ధముగానున్నారు. కావున యిస్రాయేలీయులారా! మీరు మీ పితరుల దేవుడైన ప్రభువుతో పోరాడెదరేని తప్పక ఓడిపోయెదరు.”

13. యరోబాము యూదీయులకు వెనుకవైపున తన సైన్యమును మాటుగానుంచెను. వారికి ముందు ప్రక్కగూడ తన సైన్యమును నిలిపెను.

14. యూదీయులు అటునిటు కలయజూడగా ముందు వెనుకల గూడ శత్రుసైన్యములు మోహరించియుండెను. వారు ప్రభువునకు మొరపెట్టిరి. వారి యాజకులు బాకాల నూదిరి.

15. యూదీయులు యుద్దనాదము చేసి అబీయా నాయకత్వమున పోరు ప్రారంభించిరి. ప్రభువు యరోబామును, యిస్రాయేలీయులను ఓడించెను.

16. యిస్రాయేలీయులు బ్రతుకు జీవుడాయని పలాయనము చిత్తగించిరి. కాని ప్రభువు వారిని యూదీయుల చేతికి చిక్కించెను.

17. అబీయా మరియు అతని సైనికులు యిస్రాయేలీయులను ఊచకోతకోసిరి. వారి వీరులు ఐదులక్షల మంది హతులైరి.

18. ఆ రీతిగా యిస్రాయేలీయులు ఓడి పోయిరి. యూదీయులు ప్రభువును నమ్ముకొనిరి కనుక విజయమును బడసిరి.

19. అబీయా యరోబాము సైన్యమును వెన్నాడెను. అతని నగరములైన బేతేలు, యెషానా, ఎఫోనులను వాని చుట్టుపట్లగల పల్లెలను ఆక్రమించుకొనెను.

20. అబీయా పరిపాలించినంత కాలము యరోబాము మరల కోలుకొననే లేదు. ప్రభువు యరోబామును మట్టుపెట్టగా అతడు కన్నుమూసెను.

21. కాని అబీయా నానాటికి ప్రవర్ధమానుడయ్యెను. అతడు పదునలుగురు స్త్రీలను పెండ్లియాడి ఇరువది యిద్దరు తనయులను, పదునారుగురు కుమార్తెలను కనెను.

22. అబీయాను గూర్చిన యితరాంశములు అతని మాటలును, చేతలన్నియు ఇదో ప్రవక్త రచించిన చరితమున లిఖింపబడియేయున్నవి.