ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

న్యాయాధిపతులు 13

 1. యిస్రాయేలీయులు మరల దుష్కార్యములు చేసిరి. యావే నలువదియేండ్లపాటు వారిని ఫిలిస్తీయుల వశముచేసెను.

2. ఆ కాలమున జోరాసీమలో మనోవా అను దాను వంశస్థుడొకడు వసించుచుండెను. అతని భార్య గొడ్రాలు.

3. ఒకనాడు యావేదూత ఆమెకు ప్రత్యక్షమై "నీవు గొడ్రాలవు. కాని ఇక గర్భవతివై బిడ్డను కందువు.

4. ఇకమీదట జాగ్రత్తగా నుండుము. ద్రాక్షసారాయమును గాని ఘాటైన మద్యమునుగాని సేవింపకుము. అశుచికరమయిన పదార్ధములను ముట్టుకొనకుము.

5. నీవు గర్భవతివై బిడ్డను కందువు. ఆ శిశువు తలజుట్టు కత్తిరింపరాదు. ఆ బిడ్డడు నీ కడుపున పడినప్పటి నుండియు వ్రతతత్పరుడై ఉండును'. అతడు యిస్రాయేలును ఫిలిస్తీయుల బారినుండి కాపాడును" అని చెప్పెను.

6. ఆమె భర్తచెంతకు వచ్చి “నాకు దివ్యపురుషుడొకడు కన్పించెను. అతని మొగము దేవదూత మొగమువలె మిలమిలమెరయుచు భీతి గొలుపుచుండెను. అతడెక్కడి నుండి వచ్చినది నేనడుగ లేదు. అతడు తన పేరుకూడా తెలుపలేదు.

7. కాని ఆ దివ్యపురుషుడు నాతో “నీవు గర్భవతివై బిడ్డను కందువు. ఇక మీదట ద్రాక్షసారాయమును గాని, ఘాటయిన మద్యమును గాని సేవింపకుము. అశుచికరమయిన పదార్థములను ముట్టుకొనకుము. నీకు జన్మింపబోవు శిశువు గర్భమునుండి ఆమరణాంతము వ్రతతత్పరుడై జీవించును అని పలికెను” అని చెప్పెను.

8. మనోవా దేవునికి మనవిచేసి "ప్రభూ! నీవు పంపిన దివ్యపురుషుడు మరల మాకు దర్శనమిచ్చి ఆ పుట్టబోవు శిశువుకు మేమేమి చేయవలయునో తెలియజెప్పుగాక!” అని ప్రార్థించెను.

9. ప్రభువు మనోవా మొరనాలించెను. ఒకనాడు అతని భార్య పొలముననుండగా దివ్యపురుషుడు మరల ప్రత్యక్షమయ్యెను. అపుడు మనోవా దగ్గరలేడు.

10. ఆమె వడివడిగా పెనిమిటియొద్దకు పరుగెత్తికొనివచ్చి మునుపు తనకు దర్శనమిచ్చిన దివ్యపురుషుడు మరల కనిపించే నని చెప్పెను.

11. మనోవా తన భార్య వెంటబోయి దివ్యపురుషుని కనుగొని “ఈమెతో మాటాడినది  నీవేనా?" అని అడిగెను. అతడు “అవును నేనే” అనెను.

12. మనోవా “నీ మాట ప్రకారముగా శిశువు జన్మించిన పిదప ఆ బిడ్డ ఎట్లునడుచుకోవలయును? ఏమి చేయవలయును?” అని అడిగెను.

13. ప్రభువు దూత మనోవాతో “నేను ముట్టుకోవలదన్న వస్తువులు ఈమె ముట్టుకోరాదు. ఈమె ద్రాక్షవల్లినుండి పుట్టినదేదియు తినకూడదు.

14. ద్రాక్షసారాయముగాని, ఘాటైన మద్యమునుగాని, అశుచికరమయిన పదార్థములను గాని సేవింపరాదు. నేను చెప్పిన నియమమునే ఈమె పాటింపవలెను” అనెను.

15. మనోవా ప్రభువు దూతతో "అయ్యా! నీకొక మేకకూనను కోసి విందు సిద్ధము చేసెదము. మమ్ము కరుణించి కొంచెము సేపిట నిలువుము” అనెను.

16. అతడు ప్రభువుదూత యని మనోవాకు తెలియదు. ప్రభువుదూత అతనితో నేను కొంచెము సేపు ఇట నిలిచినను మీ భోజనము ముట్టుకొనను. కాని మీరు దహనబలిని అర్పింపగోరెదరేని యావేకు సమర్పింపుడు” అనెను.

17. మనోవా యావేదూతతో "అయ్యా! నీ పేరేమో చెప్పుము. నీవు చెప్పినట్లుగా శిశువు జన్మించిన పిదప నిన్ను గౌరవించి నీ ఋణము తీర్చుకొందుము” అనెను.

18. కాని ప్రభువుదూత అతనితో “నీవు నా పేరు అడుగనేల? నా నామము వచింపశక్యముకానిది” అని పలికెను.

19. అంతట మనోవా మేకకూనను బలిభోజ్యమును గైకొని అద్భుతకార్యములనుచేయు యావేకు రాతిబండపై దహనబలిగా సమర్పించెను.

20. మనోవాయు, అతని భార్యయు చూచుచుండగనే బలిపీఠమునుండి మంట గుప్పునలేచెను. ప్రభువుదూత ఆ మంటలలో పైకెగసి పోయెను. ఆ దృశ్యముచూచి దంపతులిద్దరును నేలపై బోరగిలబడిరి.

21. అటు తరువాత ప్రభువుదూత వారికి మరల దర్శనమీయలేదు. అతడు ప్రభువుదూతయని మనోవా అప్పుడు తెలిసికొనెను.

22. మనోవా తన భార్యతో “మనము దేవుని కన్నులార జూచితిమి. ఇక మనకు చావు నిక్కము” అనెను.

23. కాని ఆమె అతనితో “యావే మనలను చంపువాడయినచో మన దహనబలిని, బలిభోజ్యమును స్వీకరించియుండడు. శిశువును గూర్చి ఈ వృత్తాంతమంతయు చెప్పి ఉండడు” అనెను.

24. అంతట ఆమె కొడుకును కని ఆ శిశువునకు సంసోను అను పేరు పెట్టెను. ఆ శిశువు పెరిగి పెద్ద వాడయ్యెను. యావే అతనిని చల్లనిచూపు చూచెను.

25. సంసోను జోరా, ఎష్టావోలు నగరముల మధ్య గల దాను మైదానముననుండగా యావే ఆత్మ అతనిని పురికొల్పెను.