1. తన ఆధిపత్యమును సుస్థిరము చేసికొనగనే రెహబాము, అతని ప్రజలు ప్రభువు ధర్మశాస్త్రమును అనాదరము చేసిరి.
2. రెహబాము పరిపాలనకాలము ఐదవయేట అతని పాపమునకు తగిన శిక్షప్రాప్తించెను. ఐగుప్తురాజు షీషకు యెరూషలేము మీదికి దండెత్తి వచ్చెను.
3. అతడు పండ్రెండు వందల రథబలములతోను, అరువదివేల గుఱ్ఱపు బలముతోను, లిబియా, సుక్కీము, ఇతియోపియాల నుండి ప్రోగైవచ్చిన అసంఖ్యాక సైనికులతోను దాడిచేసెను.
4. యూదాలోని సురక్షిత పట్టణములను ఆక్రమించుకొని యెరూషలేము మీదికి దండెత్తెను.
5. ఆ దాడిని పురస్కరించుకొని రెహబాము మరియు యూదా నాయకులు యెరూషలేమున సమావేశమై యుండగా షెమయా ప్రవక్త వారి చెంతకు వచ్చి “ప్రభువు ఇట్లు నుడువుచున్నాడు. మీరు నన్ను విడనాడితిరి గనుక నేనును మిమ్ము విడనాడితిని. మిమ్మెల్లరను షీషకు చేతికప్పగింతును” అని ప్రవచించెను.
6. ఆ మాటలకు రాజు, నాయకులు 'మనము తప్పు చేసిన మాట నిజమే. ప్రభువు చేసిన పని ఉచితముగనే ఉన్నది' అని ఒప్పుకొనిరి.
7. అట్లు వారు తనకు లొంగుటను చూచి ప్రభువు షేమయాతో “వారు తమ తప్పిదములను ఒప్పుకొనిరి కనుక నేను వారిని నాశనము చేయను. షీషకు ముట్టడినుండి వారిని కొంతవరకు కాపాడుదును. యెరూషలేము నా కోపమును పూర్ణముగా చవిచూడదు.
8. అయినను వీరు షీషకునకు దాసులగుదురు. అప్పుడుగాని నన్ను సేవించుటకును, భూరాజులకు దాసులగుటకును గల వ్యత్యాసము వీరికి తెలిసిరాదు” అని నుడివెను.
9. షీషకు యెరూషలేము మీదికి దండెత్తివచ్చి దేవాలయ బొక్కసమును, రాజప్రాసాదపు కోశాగార మును కొల్లగొట్టెను. అతడు సొలోమోను చేయించిన బంగారుడాళ్ళతోపాటు మేలివస్తువులనన్నిటిని తీసికొని పోయెను.
10. రెహబాము ఆ పోయినవానికి బదులుగా ఇత్తడి డాళ్ళను చేయించి ప్రాసాద రక్షకుల ఆధీనమున ఉంచెను.
11. రాజు దేవళమునకు వెళ్ళినపుడెల్ల ప్రాసాదరక్షకులు ఈ డాళ్ళను వెలుపలికి తెచ్చెడివారు. తరువాత వానిని యథాస్థానమున భద్రపరచెడివారు.
12. రెహబాము ప్రభువునెదుట తలవంచెను గనుక ప్రభువు కోపము చల్లారి అతనిని పూర్తిగా నాశనము చేయడయ్యెను. అతడు యూదా మండలమునకు పెంపును గూడ దయచేసెను.
13. రెహబాము బలసంపన్నుడై యెరూషలేము నుండి పరిపాలనము చేసెను. అతడు తన నలువది ఒకటవ యేట రాజై పదునేడేండ్లపాటు యెరూషలేమున రాజ్యము చేసెను. ప్రభువు తనను ఆరాధించుటకుగాను యిస్రాయేలు దేశమంతటిలో ఈ నగరమును ఎన్నుకొనెను.
14. రెహబాము తల్లి అమ్మోనీయుల ఆడపడుచు నామా. అతడు ప్రభువును లక్ష్యము చేయక దుష్కార్యములు చేసెను.
15. రెహబాము ఉదంతము మొదటినుండి తుదివరకు షేమయా, ఇద్ధో ప్రవక్తలు రచించిన చరితమున లిఖింపబడియేయున్నది. అతడును, యరోబాము నిరంతరము పోరాడుకొనిరి.
16. అంతట రెహబాము తన పితరులతో నిద్రించి దావీదు నగరమున పాతి పెట్టబడెను. అటు తరువాత అతని కుమారుడు అబీయా రాజయ్యెను.