ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సంఖ్యాకాండము చాప్టర్ 12

 1. మోషే కూషుదేశపు స్త్రీని పెండ్లియాడుట వలన మిర్యాము, అహరోనులు అతనిని విమర్శించిరి.

2. “ఏమి, ప్రభువు మోషే ముఖముననే మాట్లాడేనా? మా వలనను మాట్లాడలేదా?" అనిరి. ప్రభువు వారి గొణగుడు వినెను.

3. భూమిమీద సంచరించు నరులందరిలోను మోషే మహావినయవంతుడు.

4. ప్రభువు తలవనితలంపుగా మోషే, అహరోను మిర్యాములతో మాట్లాడెను. ఆ ముగ్గురిని సాన్నిధ్యపు గుడారమునకు రమ్మని పిలిచెను. వారు వెళ్ళిరి.

5. ప్రభువు మేఘస్తంభముగ దిగివచ్చి గుడారము తలుపునొద్ద నిలుచుండి అహరోను, మిర్యాములను పిలువగా వారు ముందటికి వచ్చిరి.

6. ప్రభువు వారితో “మీరు నా పలుకులు ఆలింపుడు. మీలో ఎవరైన ప్రవక్తలు ఉన్నచో నేను వారికి దర్శనములందు కనిపింతును. కలలో వారితో మాట్లాడుదును.

7. కాని నా సేవకుడైన మోషేతో మాత్రము అటుల మాట్లాడను. అతనిని నా ప్రజలందరికిని పెద్దగా నియమించితిని.

8. నేను అతనితో ప్రత్యక్షముగా దర్శన మిచ్చి మాట్లాడుదును. గూఢార్థములతో గాకుండ సూటిగనే అతనితో సంభాషింతును. అతడు నా రూపమును నిమ్మళించి చూచెను. ఇట్టి నా సేవకుడు మోషేకు వ్యతిరేకముగా మాట్లాడుటకు మీరేల భయపడరైరి?” అని ఉగ్రుడైపోయెను.

9-10. అంతట ప్రభువు అదృశ్యుడయ్యెను. అటుపిమ్మట మేఘము గుడారము మీదినుండి లేచిపోగానే, అదిగో మిర్యాము శరీరము మంచువలె తెల్లగానయ్యెను. ఆమె కుష్ఠరోగి అయ్యెను. అహరోను మిర్యామువైపు చూడగా ఆమెకు కుష్ఠవ్యాధి సోకియుండెను.

11. అహరోను మోషేతో "అయ్యా! మేము మా తెలివితక్కువతనము వలన పాపము' మూటగట్టు కొంటిమి. మమ్ము శిక్షింపకుము.

12. ఈమె శరీరము సగము మాంసము క్షీణించి పుట్టిన శిశువు శవమువలె నున్నది, కరుణింపుము” అనెను.

13. మోషే ప్రభువునకు మొర పెట్టి “ప్రభూ! ఈమెకు స్వస్థత దయచేయుము” అని వేడెను.

14. ప్రభువు అతనితో “ఆమె తండ్రి ఆమె ముఖముమీద ఉమిసినచో ఆమె ఏడురోజులపాటు అవమానముతో ఉండిపోదా? కనుక మిర్యామును ఒక వారముపాటు శిబిరమునుండి వెళ్ళగొట్టుడు. తరువాత ఆమెను మరల కొనిరావచ్చును” అని చెప్పెను,

15. ఆ విధముననే మిర్యామును వారముపాటు శిబిరమునుండి బయటికి పంపివేసిరి. ఆమె మరల శిబిరమునకు తిరిగి వచ్చు వరకు ప్రజలు ఆ విడిదినుండి కదలిపోలేదు.

16. మిర్యాము తిరిగివచ్చిన తరువాత ప్రజలు హాసెరోతు నుండి కదలిపోయి పారాను ఎడారిలో దిగిరి.