ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సంఖ్యాకాండము 11

 1. ప్రజలు తమ దురదృష్టమునకు ప్రభువు మీద నిష్టూరములాడసాగిరి. ప్రభువు వారి నిష్టూరములు విని కోపించి అగ్నిని పంపగా అది భగభగ మండి శిబిరమున ఒక భాగమును కాల్చివేసెను.

2. అపుడు ప్రజలు మోషేకు మొర పెట్టగా అతడు ప్రభువును ప్రార్ధించెను. మంటలు ఆగిపోయెను.

3. ప్రభువు పంపిన నిప్పులు ప్రజల మధ్య ధగధగ మండినవి కావున ఆ తావునకు తబేరా' అని పేరు వచ్చినది.

4. యిస్రాయేలీయులతో పయనించు అన్యదేశీయులకు మాంసముపై కోరికపుట్టెను. యిస్రాయేలీయులు కూడ మాకు ఇక మాంసము దొరకదుగదా అని నిష్ఠూరోక్తులాడసాగిరి.

5. "మేము ఐగుప్తులో నుండగా అక్కడ చేపలు విరివిగ లభించెడివి. అచట మేము కడుపార తినిన దోసకాయలు, పుచ్చకాయలు, కందములు, ఉల్లి, వెల్లుల్లి ఇప్పుడు జ్ఞప్తికివచ్చుచున్నవి.

6. ఈ ఎడారిలో ఏమియు దొరకక తల్లడిల్లిపోవుచున్నాము. ఇక్కడ ఈ దిక్కుమాలిన మన్నా ఒక్కటి దప్ప యింకేమి దొరకదుగదా!” అని గొణగుకొనిరి.

7. మన్నా కొత్తిమీరగింజలవలె ఉండెడిది. తెల్లని పసుపువన్నె కలది.

8. ప్రజలు బయటికి వెళ్ళి దానిని ప్రోగుచేసికొని వచ్చి తిరుగటనో, రోకటనో పిండి చేసెడివారు. ఆ పిండిని పెనముమీద కాల్చి రొట్టెలు చేసికొనెడివారు. అవి ఓలివునూనెతో చేసిన రొట్టెలవలె రుచిగా నుండెడివి.

9. రాత్రివేళ శిబిరమున మంచు కురిసినపుడు మన్నా కూడ కురిసెడిది.

10. ప్రజలు వారివారి గుడారముల ముందట నిలుచుండి నిష్ఠూరోక్తులాడుచుండగా మోషే వినెను. ప్రభువు వారిమీద మండిపడుటను చూచి మోషే భయపడెను.

11. అతడు ప్రభువుతో “ప్రభూ! నీ సేవకుని ఇంతగా బాధపెట్టనేల? నేను నీ అనుగ్రహమునకు ఏల నోచుకోనైతిని? ఈ ప్రజలను పరామర్శించు బాధ్యతను నా నెత్తిన పెట్టనేల?

12. నేను వీరిని కంటినా! ఏమి? పాలుకుడుచు పిల్లలను రొమ్ముపై మోసుకొనిపోవు దాదివలె నేను వీరిని, నీవు పితరులకు వాగ్దానము చేసిన నేలకు, చేర్పవలెనని నిర్బంధము చేసెదవేల?

13. వీరు గంపెడాశతో మాకు మాంసము ఇప్పింపుము, కడుపార తినెదము అని నన్ను విసిగించుచున్నారు. ఇంతమందికి కావలసినంత మాంసమును నేనెక్కడినుండి కొనిరాగలను?

14. ఈ ప్రజల బాగోగులను పరామర్శింపవలసిన బాధ్యతను నేనొక్కడినే భరింపజాలను. అది నా తలకు మించిన పని.

15. నీవు నాయెడల ఇంత క్రూరముగా ప్రవర్తించుటకంటె, నా మీద కరుణగలిగి నన్ను చంపివేయుట మేలు. అప్పుడు నేను ఈ ఇక్కట్లను కన్నులార చూడకుందునుగదా!” అని మొరపెట్టెను.

16. ప్రభువు మోషేతో, “యిస్రాయేలు ప్రజలు గౌరవించు పెద్దలను డెబ్బదిమందిని ప్రోగుజేసికొని సమావేశపు గుడారమునకు రమ్ము, వారిని నీ ప్రక్కన నిలుచుండుడని చెప్పుము.

17. నేను నీతో మాట్లాడ దిగి వచ్చెదను. నేను నీ ఆత్మను కొంత తీసికొని వారికిచ్చెదను. ఇక మీదట నీతోపాటు వారును ఈ ప్రజలను నడిపింపవలసిన బాధ్యత వహింతురు. నీవొక్కడివే వారి బాధ్యత వహింపవలదు.

18. మరియు నీవు ప్రజలతో ఇట్లు చెప్పుము: “మీరు రేపటిదినమునకు శుద్ధిచేసికొని సిద్ధముకండు. రేపు మీరు మాంసము తిందురు. మనము ఐగుప్తున ఎంత సుఖముగానుంటిమి! ఇట మాంసము దొరకక పోయెనుగదా, అని మీరు ఏడ్చుట ప్రభువు వినెను. ఇకనేమి, మీరు కోరుకొన్నట్లే ప్రభువు మీకు మాంసము నిచ్చును.

19-20. ఒక రోజుకాదు, రెండు రోజులు కాదు, ఐదు, పది, ఇరువది రోజులుకాదు, ఒకనెల రోజుల పాటు మీరు మాంసము తిందురు. మొగము మొత్తువరకు మాంసమును భుజింతురు. మీ మధ్య నెలకొనియున్న ప్రభువునుగూడ లెక్కచేయక ఐగుప్తు నుండి ఏల వెడలి వచ్చితిమని సణుగుకొనుచున్నారు కావున మీకు ఈ శిక్ష కలుగును.”

21. మోషే ప్రభువుతో “ఇక్కడ ఆరు లక్షలమంది ఉన్నారు. ఇంత మందికి నీవు ఒకనెలకు సరిపడునంత మాంసము ఇచ్చెదనని చెప్పుచున్నావు.

22. గొడ్లమందలను, గొఱ్ఱెమందలను చంపినను వీరికి సరిపోవునా? సముద్రములోని చేపలన్నిటిని పట్టుకొని వచ్చినను వీరికి సరిపోవునా?” అనెను.

23. ప్రభువు మోషేతో “నా బాహువు కురచయైనదా? నేనాడిన మాటలను చెల్లించుకొందునో లేదో నీవే చూచెదవుగాక!” అనెను.

24. మోషే వెడలిపోయి ప్రభువు చెప్పిన మాటలు ప్రజలకు తెలియజేసెను. పెద్దలను డెబ్బదిమందిని ప్రోగుచేసికొని గుడారముచుట్టు నిలబెట్టెను.

25. అపుడు ప్రభువు మేఘముపై దిగివచ్చి మోషేతో మాట్లాడెను. తాను మోషేకిచ్చిన ఆత్మను కొంతతీసికొని ఆ డెబ్బదిమంది పెద్దలకు ఇచ్చెను. ఆత్మను పొందగానే వారు ప్రవచనములు పలికిరి. ఆ ఆత్మ వారిపై నిలిచియున్నపుడు మాత్రమే వారు ప్రవచించిరిగాని మరల వారు ప్రవచింపలేదు.

26. పై డెబ్బదిమంది పెద్దలలో ఎల్దదు, మేదాదు అనువారు ఇద్దరు శిబిర ననే ఉండిపోయిరి. వారు గుడారమునకు వెళ్ళకున్నను ఆత్మ వారిమీదికి గూడ దిగివచ్చెను. వారును వెంటనే ప్రవచనములు పలికిరి. 

27. అప్పుడు ఒక యువకుడు మోషే యొద్దకు పరుగెత్తుకొని వచ్చి శిబిరమునందలి వారుకూడ ప్రవచనములు, పలుకుచున్నారని అతనితో చెప్పెను. 

28. అపుడు బాల్యము నుండి మోషేకు పరిచర్యలు చేయుచు వచ్చిన యెహోషువ "అయ్యా! వారిని ప్రవచింపవలదని చెప్పుము” అనెను.

29. కాని మోషే అతనితో “ఓయి! నా యెడలగల అభిమానముచే నీవు వారిమీద అసూయపడుచున్నావు. ప్రభువు ఈ ప్రజలందరికి ఆత్మను అనుగ్రహించి వీరిచే గూడ ప్రవచనములు పలికించిన ఎంత బాగుండెడిది!” అనెను.

30. అంతట మోషే, పెద్దలు శిబిరమునకు తిరిగిపోయిరి.

31. అపుడు ప్రభువు ఒక గాలిని పంపగా అది సముద్రము నుండి పూరేడు పిట్టలను తోలుకొనివచ్చెను. అవి నేలకు మూడడుగుల ఎత్తున ఎగురుచు నరులు ఒకరోజు ప్రయాణముచేయునంత దూరమువరకు శిబిరము చుట్టుప్రక్కల దట్టముగా క్రమ్ముకొనెను.

32. ఆ రోజు పగలు, రాత్రి, మరుసటిరోజు పగలు ప్రజలందరు పిట్టలను పట్టుకొనిపోయిరి. ఏబది బుట్టలకు తక్కువగా పట్టుకొనినవాడు ఎవడును లేడు. వారు ఆ పిట్టలను శిబిరము చుట్టు ఎండవేసిరి.

33. కాని జనులు ఆ పక్షుల మాంసమును నోటబెట్టుకొని పంటితో కొరికిరో లేదో ప్రభువు ఉగ్రుడై వారిని గొప్ప తెగులుపాలు చేసెను.

34. కావున ఆ తావునకు కిబ్రోతుహట్టావా' అని పేరు. మాంసమును ఆశించి మృత్యువువాతబడిన వారిని అక్కడనే పాతి పెట్టిరి.

35. అంతట ప్రజలు అక్కడనుండి కదలి హాసెరోతు చేరి అక్కడ విడిదిచేసిరి.