1. షెజారాణి సొలోమోను ప్రసిద్ధిని గూర్చి విని అతనిని చిక్కుప్రశ్నలతో పరీక్షింపవచ్చెను.
2. ఆమె చాలమంది సేవకులను వెంటనిడుకొని సుగంధ ద్రవ్యములను ఒంటెల పైకి ఎక్కించుకొనివచ్చెను. రత్నములను, పెద్దమొత్తము బంగారమును గూడ కొని వచ్చెను. రాణి సొలోమోనును కలిసికొని తాను అడగ గోరిన ప్రశ్నలన్నియు అడిగెను.
3. అతడు ఆమె ప్రశ్నలన్నిటికి జవాబు చెప్పెను. ఆ ప్రశ్నలలో అతనికి తెలియనిదేదియులేదు.
4-5. సొలోమోను విజ్ఞానము, అతడు నిర్మించిన ప్రాసాదము, అతని భోజనశాలలో భోజనము, అతనికి కొలువుచేయు ఉద్యోగులు, అతని పరిచారకుల నేర్పరితనము, వారు తాల్చిన వస్త్రములు, అతనికి ద్రాక్షసారాయము అందించు సేవకులు, అతడు సమర్పించు దహనబలులను చూచుసరికి ఆమెకు నోటమాట రాలేదు.
6. ఆమె అతనితో “నిన్నుగూర్చి, నీ విజ్ఞానము గూర్చి నేను మా దేశమున విన్నవారలెల్ల నిజములే.
7. కాని నేనిచటికి వచ్చి నా కళ్ళతో చూచు వరకు ఆ వార్తలను నమ్మలేదు. అయినను వారు నాకు నీ గొప్పతనములో సగమైనను తెలుపలేదు. నీ విజ్ఞానమును, వైభవమును నేను వినిన దానికంటెను ఎక్కువగానున్నవి.
8. నిత్యము నీ ఎదుట నిలిచి నీ విజ్ఞానసూక్తులు ఆలకించుచున్న నీ జనులు, నీ సేవకులెంత అదృష్టవంతులో!
9. నిన్ను చల్లనిచూపు చూచి యిస్రాయేలు సింహాసనముపై నిలిపిన యావే ప్రభువు స్తుతింపబడునుగాక! ప్రభువు యిస్రాయేలును శాశ్వతముగా ప్రేమించెను. కనుకనే వారిని నీతి నియమములతో, న్యాయముతో పరిపాలించుటకు నిన్ను రాజునుచేసెను” అనెను.
10. షెబారాణి సొలోమోనునకు పండ్రెండు బారువుల బంగారము, సుగంధ ద్రవ్యములు, రత్నములను బహుమతిగా ఇచ్చెను. ఆ రాణి కానుకచేసినన్ని సుగంధ ద్రవ్యములను మరెవ్వరును సొలోమోనునకు ఇచ్చియుండలేదు.
11. హీరాము నావికులు ఓఫీరునుండి బంగారమునే గాక వారు అక్కడినుండి విస్తారమైన మంచి గంధపు చెక్క రత్నములను గూడ కొనివచ్చిరి.
12. సొలోమోను ఆ గంధపుకొయ్యతో దేవాలయమునకు, రాజనగరునకు పైకప్పులను చేయించెను. మరియు దానితో సంగీతకారులకు పిల్లనగ్రోవులు, వీణలు చేయించెను. నేటివరకు అటువంటి చందనపుకొయ్య మరల ఇక్కడ కనిపింపలేదు.
13. సొలోమోను కూడ షెబారాణి కోరుకొనిన వస్తువులెల్ల ఆమెకు బహుమతిగా ఇచ్చెను. అతడు తన రాజవైభవమునకు తగినట్లుగా ఆమెకు కానుకలు ఇచ్చెను. అటుతరువాత రాణి తన సేవకులతో షెబా రాజ్యమునకు వెడలిపోయెను.
14. సొలోమోనునకు ఏటేటా ఇంచుమించు అరువది ఆరు బారువుల బంగారము లభించెడిది.
15. వర్తకులమీద విధించిన కప్పములనుండి, వర్తకుల నుండి, అరేబియా రాజునుండి, రాష్ట్ర పాలకులనుండి లభించిన బంగారము ఈ లెక్కలో చేరలేదు.
16. అతడు సుత్తితో కొట్టిన బంగారముతో రెండువందల పెద్దడాలులను చేయించెను. వానికి ఒక్కొక్కదానికి ఆరువందల తులముల బంగారమువాడెను.
17. సుత్తితో కొట్టిన బంగారముతోనే మూడు వందల చిన్న డాలులనుగూడ చేయించెను. వానికి ఒక్కొక్కదానికి నూటఏబది తులముల బంగారమువాడెను. వానినన్నిటిని “లెబానోను అరణ్యము” అను పేరుగల మందిరమున నుంచెను.
18. అతడు దంతముతో సింహాసనము చేయించి దానిని మేలిమి బంగారమున పొదిగించెను.
19-20. ఈ సింహాసనమునకు ఆరుమెట్లు కలవు. ఒక్కొక్క మెట్టునకు రెండు సింహముల చొప్పున మొత్తము పండ్రెండు సింహముల బొమ్మలు కలవు. సింహాసనమునకు వెనుకతట్టున ఎద్దు తలను చెక్కించెను. సింహాసనము రెండు చేతులకు ప్రక్క రెండు సింహముల బొమ్మలు కలవు. ఏ రాజు ఇటువంటి సింహాసనము చేయించి ఎరుగడు.
21. సొలోమోను పానపాత్రములన్నియు, 'లెబానోను అరణ్యము' అనుపేరుగల మందిరములోని పాత్రములన్నియు మేలిమి బంగారముతోనే చేయబడెను. సొలోమోను కాలమున వెండికి విలువలేదు గనుక దానితో అతడు వాడిన పాత్రలలో దేనిని చేయరైరి.
22. సొలోమోనునకు నావలు గలవు. అవి హీరాము నావలతోపాటు సముద్ర యానము చేసెడివి. ప్రతి మూడేండ్లకొకసారి అతని ఓడలు వెండి బంగారములతో, దంతములతో, రకరకముల మర్కటములు, నెమళ్ళతో తిరిగివచ్చెడివి.
23. విజ్ఞానముననేమి, వైభవమున నేమి సొలోమోను ఈ నేలను పాలించిన రాజులలోకెల్ల గొప్పవాడు.
24. ప్రభువు అతనికి అనుగ్రహించిన విజ్ఞాన సూక్తులను వినుటకై ప్రపంచములోని జనులెల్లరు వచ్చెడివారు.
25. అతనిని చూడవచ్చినవారు వెండి బంగారు వస్తువులను, ఆయుధములను, సుగంధ ద్రవ్యములను, గుఱ్ఱములను, గాడిదలను బహుమతులుగా కొనివచ్చిరి. ఏటేట ఇట్లే జరుగుచుండెడిది.
26. సొలోమోనునకు గొప్పరథబలమును గలదు. అతడు పదునాలుగు వందల రథములను తయారు చేయించెను. పండ్రెండువేల గుఱ్ఱములను సంపాదించెను. వానిలో కొన్నిటిని రథనగరములందు నిలిపియుంచెను. కొన్నిటిని యెరూషలేముననే ఉంచెను.
27. అతనికాలమున యెరూషలేమున వెండి రాళ్ళవలె లభించెడిది. దేవదారుకొయ్య సాదా మేడికఱ్ఱవలె దొరకెడిది.
28. ఐగుప్తునుండి, సిలీష్యా నుండి అతనికి గుఱ్ఱములను కొనితెచ్చెడివారు. అతని ఉద్యోగులు సిలీష్యా నుండి నిర్ణీతమూల్యమునకు గుఱ్ఱములు కొని పంపిడివారు.
29. ఆ కాలమున ఐగుప్తునుండి దిగుమతి చేయబడిన రథములకు ఒక్కొక్కదానికి ఆరు వందల వెండినాణెములు, గుఱ్ఱములకు ఒక్కొక్కదానికి నూటయేబది వెండినాణెములు చెల్లించిరి. ఇట్లు దిగుమతియైన గుఱ్ఱములను రాజోద్యోగులు మరల హిత్తీయరాజులకు, సిరియా రాజులకు అమ్మెడివారు.