1. రెహబాము షెకెమునకు వెళ్ళెను. అతనికి అభిషేకముచేయుటకు యిస్రాయేలీయులు కూడా అచటికిపోయిరి.
2. ఈ సమాచారమువిని నెబాతు కుమారుడగు యరోబాము ఐగుప్తునుండి తిరిగి వచ్చెను. అతడు సొలోమోనునకు భయపడి అంత వరకు ఐగుప్తుననే తలదాచు కొనుచుండెను.
3-4. యిస్రాయేలీయులు అతనిని పిలువనంపిరి. వారెల్లరు కలిసి రెహబాము వద్దకు పోయి "అయ్యా! మీ తండ్రి మా నెత్తిపై పెద్దభారము పెట్టెను. నీవు ఆ బరువును తొలగించి మేము కొంచెము ఊపిరి పీల్చుకొనునట్లు చేయుము. మేము నీకు తప్పక ఊడిగము చేయుదుము” అనిరి.
5. అతడు మీరు మూడురోజుల తరువాత తిరిగిరండని చెప్పి వారిని పంపివేసెను.
6. రెహబాము పూర్వము తన తండ్రి కొలువులో పనిచేసిన వృద్ధులను సంప్రతించి “ఈ జనులకు నన్నేమి జవాబు చెప్పమందురు?” అని ప్రశ్నించెను.
7. వారు “నీవు ఈ ప్రజలపట్ల కరుణతో ప్రవర్తింపుము. మృదువుగా మాటలాడి వారిని సంతోషపెట్టుము. అప్పుడు వారు ఎల్లకాలము నీకు ఊడిగము చేయుదురు” అని చెప్పిరి.
8. అయినా అతడు ఆ వృద్దుల హితోపదేశమును పెడచెవిని బెట్టి తనతో పెరిగి తన కొలువులో పనిచేయుచున్న యువకులను సలహా అడిగెను.
9. “మీ తండ్రి మా నెత్తిపై పెట్టిన భారమును తొలగింపుమని ఈ ప్రజలు నన్నడుగు చున్నారు. వీరికి నేనేమి జవాబు చెప్పవలయునో తెలుపుడు” అని యడిగెను.
10. ఆ యువకులు “నీవు వారితో మా తండ్రి నడుముకంటెను నా చిటికెనవ్రేలు లావు గలది.
11. మా తండ్రి మీ నెత్తిపై పెద్దభారము పెట్టినచో నేను అంతకంటే పెద్దదానినే పెట్టెదను. అతడు మిమ్ము చండ్రకోలలతో కొట్టించెను. కాని నేను మిమ్ము కొరడాలతో బాధింతునని చెప్పుము” అనిరి.
12. మూడునాళ్ళయిన పిమ్మట రెహబాము కోరినట్లే యరోబామును, ప్రజలందరును అతనియొద్దకు తిరిగివచ్చిరి.
13-14. కాని రాజైన రెహబాము పెద్దల ఉపదేశమును త్రోసిపుచ్చి యువకుల సలహాను పాటించెను. ప్రజలతో కటువుగా మాటలాడెను. “మా తండ్రి మీ నెత్తిపై పెద్దభారమును పెట్టెనుగదా! కాని నేనంతకంటే పెద్దదానినే పెట్టెదను. మా తండ్రి మిమ్ము చండ్రకోలలతో కొట్టించెను. కాని నేను మిమ్ము కొరడాలతో బాధింతును” అనెను.
15. ప్రభువు షిలో ప్రవక్తయైన అహీయద్వారా నెబాతు కుమారుడైన యరోబామున కిచ్చిన మాట నిలబెట్టుకోగోరెను. కనుకనే రెహబాము ప్రజల మొర ఆలింపడయ్యెను.
16. రాజు తమ వేడుకోలును అనాదరము చేయుట చూచి ప్రజలెల్లరు “దావీదులో మనకు పాలులేదు. యిషాయి కుమారుని వారసత్వమున పొత్తులేదు. మన నివాసములకు మనము వెళ్ళుదము రండు. ఇకమీదట దావీదు వంశజులను తమ ఇష్టము వచ్చినట్లే ఊరేగనిండు” అని యనిరి. ఆ రీతిగా యిస్రాయేలీయులు తిరుగు బాటుచేసి వెడలిపోయిరి.
17. అయితే, రెహబాము యూదా నగరములలో వశించు యిస్రాయేలీయులమీద రాజుగా మిగిలిపోయెను.
18. అతడు వెట్టిచాకిరి చేయువారికి అధిపతియైన హదోరమును యిస్రాయేలీయుల మీదికి పంపెనుగాని, వారతనిని రాళ్ళతో కొట్టిచంపిరి. రెహబాము రథమునెక్కి యెరూషలేమునకు పారిపోయి ప్రాణములు దక్కించుకొనెను.
19. నాటినుండి ఉత్తర రాష్ట్రమునందలి యిస్రాయేలీయులు దావీదు రాజు వంశమునుండి విడిపోయిరి.