ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సంఖ్యాకాండము 10

 1-2. ప్రభువు మోషేతో “సాగగొట్టిన వెండితో రెండు బాకాలు చేయింపుము. ప్రజలను సమావేశపరచునపుడును, గుడారమును కదలించునపుడును వానిని ఊదవలెను.

3. వానిని ఊదినపుడెల్ల ప్రజలెల్లరు సాన్నిధ్యపుగుడారమునెదుట నీచెంత చేరవలెను.

4. ఒక్క బాకానే ఊదినచో యిస్రాయేలు పెద్దలు మాత్రమే ప్రోగుగావలెను.

5. బాకాను ఊదుటతోపాటు యుద్ధనాదమును గూడ చేసినచో తూర్పువైపున శిబిరము పన్నియున్న వారు కదలవలెను.

6. రెండవమారుకూడ బాకానూది యుద్ధ నాదము చేసినచో దక్షిణమున శిబిరము పన్నియున్నవారు కదలవలెను. శిబిరమును తరలింపవలెనన్న బాకానూది యుద్ధనాదము చేయవలెను.

7. కాని ప్రజలను సమావేశపరచవలెనన్న బాకాలు మాత్రమే ఊదవలెను. యుద్ధనాదము చేయరాదు.

8. అహరోను కుమారులైన యాజకులు బాకాలు ఊదుదురు. మీకును మీ సంతతి వారికిని ఇదియే నియమము.

9. మీ దేశమునందు మిమ్ము పీడించు శత్రువులపై మీరు దాడికి వెడలునపుడు బాకానూది యుద్ధనాదము చేయుడు. మీ దేవుడైన ప్రభువు మిమ్ము జ్ఞప్తికి తెచ్చుకొని శత్రువుల నుండి మిమ్ముకాపాడును.

10. మీ ఉత్సవములందును, అమావాస్య పండుగలందును మీరు దహనబలులను, సమాధానబలులు సమర్పించునపుడు బాకాలు ఊదుడు. అపుడు నేను మిమ్ము స్మరించుకొందును. నేను మీ దేవుడనైన ప్రభుడను” అని చెప్పెను.

11. రెండవ సంవత్సరము రెండవనెల ఇరు దియవ రోజున మేఘము నిబంధన గుడారముమీది నుండి పైకి లేచెను.

12. అపుడు సీనాయి ఎడారినుండి యిస్రాయేలీయులు సైన్యములవలె నడిచిపోయిరి. పారాను ఎడారిలో మేఘము ఆగెను.

13. ప్రభువు మోషేను ఆజ్ఞాపించిన విధముగనే యిస్రాయేలీయులు నడచిరి.

14. యూదీయుల శిబిర ధ్వజము వారి సేనల ప్రకారము ముందర సాగెను. అమ్మినదాబు కుమారుడు నహషోను వారి నాయకుడు.

15. తరువాత సువారు కుమారుడు నెతనేలు నాయకత్వమున యిస్సాఖారు తెగవారు నడచిరి.

16. పిమ్మట హెలోను కుమారుడు ఎలీయాబు నాయకత్వమున సెబూలూను తెగవారు నడచిరి. .

17. వారివెనుక మడిచిన గుడారమును మోసి కొనుచు గెర్షోనీయులు, మెరారీయులు నడచిరి.

18. అటువెనుక రూబేనీయుల శిబిరధ్వజము వారి సేనల ప్రకారము సాగెను. షెదేయూరు కుమారుడు ఎలీసూరు వారి నాయకుడు.

19. సూరీషద్దయి కుమారుడు షెలుమీయేలు నాయకత్వమున షిమ్యోను తెగవారు నడచిరి.

20. రవూయేలు కుమారుడు ఎలియాసపు నాయకత్వమున గాదు తెగవారు నడచిరి.

21. అటుతరువాత పరిశుద్ధవస్తువులను మోసికొనుచు కోహాతీయులు నడచిరి. వీరు విడిదికి చేరునప్పటికే, ముందువెళ్ళినవారు గుడారమును పన్ని ఉంచెడివారు.

22. తరువాత ఎఫ్రాయీమీయుల శిబిరధ్వజము వారి సేనల ప్రకారము నడిచిరి. అమ్మీహూదు కుమారుడు ఎలీషామా. వారి నాయకుడు.

23. పెదాహ్సూరు కుమారుడు గమలీయేలు నాయకత్వమున మనష్షే తెగవారు నడచిరి.

24. గిద్యోని కుమారుడు అబీదాను నాయకత్వమున బెన్యామీను తెగవారు నడచిరి.

25. చిట్టచివరన దానీయుల శిబిరధ్వజము వారి సేనల ప్రకారము సాగెను. అమ్మీషద్దయి కుమారుడు అహియెజెరు వారి నాయకుడు.

26. ఓక్రాను కుమారుడు ఫసియేలు నాయకత్వమున ఆషేరు తెగవారు నడచిరి.

27. ఏనాను కుమారుడు అహీర నాయకత్వమున నఫ్తాలి తెగవారు నడచిరి.

28. ఈరీతిగా యిస్రాయేలీయులు సైన్యముల వలె వరుసలుకట్టి నడచిపోయిరి.

29. మోషే మిద్యానీయుడైన తన మామ రెయూవేలు కుమారుడగు హోబాబుతో “మేము ప్రభువు ప్రమాణముచేసిన భూమికి కదలిపోవు చున్నాము. ప్రభువు యిస్రాయేలునకు సిరిసంపదలు ఇచ్చును. నీవు కూడ మాతో రమ్ము, మేము మీకు మేలు చేసెదము. ప్రభువు యిస్రాయేలీయులకు తాను చేయబోవు మేలును గూర్చి వాగ్దానము చేసెను” అని అనగా,

30. అందుకు హోబాబు “నేను మీ వెంట రాను. నేను మా దేశమునకు పోయి మా చుట్టపక్కా లతో జీవింతును” అనెను.

31. మోషే “నీవు మమ్ము విడనాడవలదు. ఈ ఎడారిలో మేమెక్కడ విడిది చేయవలెనో నీకు బాగుగా తెలియును. కనుక మాకు మార్గ దర్శకుడవుగా నుండుము.

32. నీవు మా వెంట వత్తువేని ప్రభువు మాకు ఏ మేలుచేయునో, ఆ మేలునుబట్టి మేమును నీకు మేలుచేయుదము” అని చెప్పెను.

33. యిస్రాయేలీయులు ప్రభువు పర్వతము నుండి బయలుదేరి మూడునాళ్ళు ప్రయాణము చేసిరి. ఆ మూడునాళ్ళు ప్రభువు నిబంధన మందసము వారికి ముందుగా పోవుచు విడిదిని వెదుకుచుండెను.

34. ప్రయాణకాలమున పగటిపూటలందెల్ల మేఘము వారిపై నిలిచియుండెడిది.

35. నిబంధన మందసము ప్రయాణమునకు కదలినపుడెల్ల మోషే “ప్రభూ,లెమ్ము! నీ శత్రువులు చెల్లాచెదరై పోవుదురుగాక! నిన్ను ద్వేషించువారు నీ ఎదుటినుండి పారిపోవుదురుగాక!” అనెడివాడు.

36. ఆ మందసము విశ్రాంతికై ఆగినపుడెల్ల అతడు “ప్రభూ, మరలిరమ్ము! ఈ వేవేలకొలది. యిస్రాయేలు ప్రజల యొద్దకు తిరిగిరమ్ము!” అనెడివాడు.