ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యెహోషువ

1. దేవుడైన యావే తన సేవకుడైన మోషే మరణించిన పిమ్మట, మోషే పరిచారకుడును, నూను కుమారుడైన యెహోషువను ఇట్లు ఆజ్ఞాపించెను:

2. “నా సేవకుడు మోషే గతించెను. కనుక లెమ్ము! నీవు ఈ జనులందరితో యోర్దాను నది దాటి, నేను యిస్రాయేలీయులకిత్తునని ప్రమాణము చేసిన దేశమునకు పొమ్ము.

3. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టిన భూమినెల్ల మీకిచ్చెదను.

4. మహారణ్యము, లెబానోను మొదలుకొని యూఫ్రటీసు మహానదివరకు, పశ్చిమమున హిత్తీయుల దేశము మీదుగా మహా సముద్రము వరకును విస్తరించిన భూమి అంతయు మీకే చెందును.

5. నీ జీవితకాలములో ఎవ్వరును నిన్ను ఎదిరింపజాలరు. మోషేకువలె నీకును నేను తోడైయుందును. నిన్ను విడువను. నిన్ను ఎడబాయను.

6. ధైర్య స్టెర్యములు కలిగివుండుము. నేను ఈ జనుల పితరులకు ఈ దేశమును ఇత్తునని ప్రమాణము చేసితిని, అట్లే నీవు దానిని యిస్రాయేలీయులకు పంచియిత్తువు.

7. ధైర్యస్తైర్యములు మాత్రము కోల్పోకుము. నా సేవకుడు మోషే నీకిచ్చిన ధర్మశాస్త్రమును తు.చ. తప్పక అనుసరింతువేని నీవు కృతార్థుడవగుదువు.

8. ఈ ధర్మశాస్త్రమును నిత్యము పఠింపుము. అహోరాత్రములు మననము చేసికొనుము. దానిలో చెప్పిన న్యాయములన్నిటిని పాటింపుము. అప్పుడు నీ కార్యములు సంపూర్ణముగా నేరవేరును. నీవు కృతార్థుడవగుదువు.

9. నేను చెప్పినట్లు ధైర్యస్థైర్యములు అవలంబింపుము. నిర్భయముగా నిస్సంశయముగా ప్రవర్తింపుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన ప్రభువు ఎల్లవేళల నీకు తోడైయుండును”

10-11. అంతట యెహోషువ ఈ విధముగా జనులకు చెప్పవలసినదిగా నాయకులను ఆజ్ఞాపించెను. “సరిపడు ఆహారపదార్ధములు సమకూర్చు కొనుడు. ఎందుకనగా మూడు దినములలో యావే మీకిత్తునని వాగ్దానము చేసిన దేశమును వశము చేసుకొనుటకు యోర్దాను నదిని దాటవలయును"

12. యెహోషువ రూబేను, గాదు సంతతివారిని, మనష్షే సంతతివారిలో సగముమందిని పిలచి

13. “మీ దేవుడైన ప్రభువు ఈ భూమిని మీకు ఒసగును. మీకు విశ్రాంతిని ప్రసాదించును” అని ప్రభువు దాసుడు మోషే మీతో చెప్పిన విషయము జ్ఞప్తికి తెచ్చుకొనుడు.

14. మీ ఆలుబిడ్డలు, పశువుల మందలు మోషే మీకిచ్చిన యోర్ధాను ఈవలితీరమున నిలువవచ్చును. కాని మీరు మీ బలగముతో నది దాటి పోవలయును. మీలో వీరులైనవారు ఆయుధములతో ముందుగా నడచి మీసోదరులకు సహాయము చేయవలయును. మీకువలె మీసోదరులకును ప్రభువు విశ్రాంతి దయచేయువరకు, వారు ప్రభువు ఇచ్చెదనన్న భూమిని వశము చేసికొనునంతవరకు వారితో కలసి పోరాడుడు.

15. అటుపై యావే సేవకుడగు మోషే తూర్పున యోర్దాను ఈవలి తీరమున మీకిచ్చినది, మీ స్వాధీనములో నున్నదియునగు దేశమునకు మీరు తిరిగిరావచ్చును” అని చెప్పెను.

16. అంతట వారు “నీవు చెప్పినట్లెల్ల చేయుదుము. నీవు పొమ్మన్న చోటికి పోవుదుము.

17. సర్వవిధముల మోషే మాట వినినట్లు నీ మాట విందుము. మన దేవుడైన యావే మోషేకువలెనె నీకును బాసటయైయుండునుగాక!

18. నీ ఆనతికి ఎదురుతిరిగి నీ మాట విననివారికి మరణ శిక్ష విధింపుము. ధైర్యస్థైర్యములతో ఉండుము” అని యెహోషువతో పలికిరి.

1. నూను కుమారుడగు యెహోషువ ఇద్దరు వేగుల వారిని పిలిపించెను. యెరికోకు పోయి వేగు నడపుడని షిత్తీము నుండి రహస్యముగా వారిని పంపెను. వారు వెళ్ళి, రాహాబు అను ఒక వేశ్య ఇంట ప్రవేశించి బసచేసిరి.

2. దేశములో వేగు నడపుటకు కొందరు యిస్రాయేలీయులు రాత్రి పట్టణములో ప్రవేశించిరని యెరికో రాజునకు తెలిసెను.

3. “నీ ఇంట బసచేసిన వారిని బయటికి పంపుము. వారు దేశములో వేగునడపుటకు వచ్చిన వారు” అని రాజు రాహాబు వద్దకు వార్త పంపెను.

4. ఆ స్త్రీ గూఢచారులను దాచియుంచి, “మనుష్యులు మా యింటికి వచ్చినమాట నిజమే. కాని వారెచ్చటి నుండి వచ్చిరో నేనెరుగను.

5. రాత్రి నగరద్వారము మూయువేళ వారు బయటికి వెళ్ళిరి. ఎచ్చటికి వెళ్ళిరో నాకు తెలియదు. మీరు తొందరగా వారిని వెంటాడినచో పట్టుకొనగలరు” అని పలికెను.

6. అంతక ముందే ఆమె గూఢచారులను మిద్దెమీదికెక్కించి జనుపకట్టెల ప్రోగులో దాచియుంచెను.

7. రాజభటులు వారికొరకు యోర్దాను నది వైపు రేవు మార్గముల వరకు వెంటాడిరి. రాజభటులు బయటికి పోయినంతనే కోట తలుపులు మూయబడెను.

8. వేగులవారు పండుకొనుటకు ముందు ఆమె మిద్దెమీదికి పోయి వారితో,

9. “యావే ఈ దేశము మీకిచ్చెను. మీరన్నమాకు భయము కలుగుచున్నది. ఈ దేశజనులందరు మిమ్ము చూచి భీతిచే గడగడ వణకుచున్నారు.

10. మీరు ఐగుప్తుదేశము నుండి వచ్చునపుడు మీ ఎదుట యావే ఎఱ్ఱసముద్రమును ఇంకించెను. యోర్దానునది ఒడ్డున అమోరీయ రాజులగు సీహోనును, ఓగును మీరు నాశనము చేసితిరి.

11. ఈ సంగతులన్నియు మేము వింటిమి. విన్నప్పుడు మా గుండెలు చెదరిపోయెను. మిమ్ము ఎదుర్కొనుటకు ఇక మావారిలో ఎవరికిని సాహసము లేదు. ఏలయన, మీ దేవుడైన యావే పైన ఆకాశమందును, క్రిందభూమి యందును దేవుడే.

12. నేను మీయెడ దయచూపితిని. మీరుకూడ నాతండ్రి ఇంటిలోని వారిపై కనికరము చూపింతుమని యావేపై ప్రమాణము చేయుడు.

13. నా తల్లిదండ్రులను, సోదరులను, అక్కచెల్లెండ్రను, వారి బంధుమిత్రులను చంపకుండ రక్షింతుమని నాకు నిజమైన గుర్తునిండు” అని పలికెను.

14. అందుకు వారు “మా ప్రాణములు ఒడ్డి మీ ప్రాణములు కాపాడెదము. నీవు మాత్రము మా రహస్యమును వెల్లడింపకుము. యావే ఈ దేశమును మాకిచ్చినపుడు మేము నిన్ను దయతో, విశ్వాసముతో ఆదరింతుము” అనిరి.

15. రాహాబు గృహము పట్టణపు గోడకు ఆనుకొనియుండెను. అందుచే ఆమె కిటికీనుండి త్రాడువేసి వేగులవారిని క్రిందికి దింపెను.

16. “మిమ్ము తరుమబోయిన వారు తిరిగి వచ్చువరకు మూడుదినములు కొండ లలో దాగికొనుడు. పిమ్మట మీత్రోవన మీరు వెళ్ళుడు” అని చెప్పెను.

17. అంతట వారు "మేము చెప్పినట్లు చేసినగాని మేము చేసిన ప్రమాణమును నిలుపుకొని జాలము.

18. మేము మీ దేశములో ప్రవేశించునపుడు మాకు గుర్తుగా నుండుటకు మమ్ము దింపిన ఈ కిటికీకి ఎఱ్ఱనితాడును కట్టుము. నీ తల్లిదండ్రులను, సోదరులను, నీ కుటుంబము వారినందరిని నీ ఇంట చేర్చుకొనుము,

19. నీ ఇంటి నుండి బయటికిపోవు వ్యక్తి అపాయమునకు గురియగును. దానికి మమ్ము లను నిందింపరాదు. నీ ఇంటనున్నవారిలో ఎవరికైన అపాయము కలిగినచో మేము జవాబుదారులము.

20. ఈ రహస్యమును నీవు వెల్లడించినచో నీవు మాచే చేయించుకొనిన ప్రమాణమునకు బద్దులముకాము” అని పలికిరి.

21. అందులకు ఆమె “మీరు చెప్పినట్లే చేయుదును” అని వారిని పంపించెను. వారు వెళ్ళిన తరువాత ఆ ఎఱ్ఱని తాడును కిటికీకి కట్టెను.

22. గూఢచారులు కొండలపైకి పోయి మూడు రోజుల పాటు అచట దాగికొని ఉండిరి. రాజభటులు త్రోవ పొడుగున వారిని వెదకిరి. కాని వారు కనిపింపక తిరిగివచ్చిరి.

23. రాజభటులు తిరిగివచ్చిన తరువాత గూఢచారులిద్దరు కొండలు దిగి, నదినిదాటి నూను కుమారుడగు యెహోషువ దగ్గరకు వెళ్ళి జరిగిన దంతయు విన్నవించిరి.

24. “యావే ఆ దేశమునెల్ల మన చేతులకు అప్పగించియున్నాడు. మనలను తలచుకొని ఆ దేశప్రజలప్పుడే తల్లడిల్లిపోవుచున్నారు” అని చెప్పిరి.

1. యెహోషువ వేకువజామున లేచి యిస్రాయేలీయులతో షిత్తీమునుండి బయలుదేరెను. వారు యోర్దానునది ఒడ్డును చేరి దాటుటకు ముందు అచట బసచేసిరి.

2-3. మూడు రోజుల తరువాత నాయకులు శిబిరములో తిరుగుచు “మీ దేవుడైన యావే నిబంధన మందసమును లేవీయ యాజకులు మోసికొనిపోవుట మీరు చూచినంతనే మీరున్నచోటు విడిచి పెట్టి ఆ మందసము వెనుక వెళ్ళుడు.

4. కాని మీరు మందసము దగ్గరగా నడువరాదు. దానికి మీకు రెండువేల మూరల ఎడముండవలయును. ఇంతకు ముందు మీరు ఈ త్రోవలో ప్రయాణము చేయలేదు. కనుక మందసమును అనుసరించి వెళ్ళుడు” అని ఆజ్ఞా పించిరి.

5. “మిమ్మును మీరు పవిత్ర పరచుకొనుడు. ఎందుకనగా రేపు యావే మీ మధ్య అద్భుతకార్యములు చేయును” అని యెహోషువ ప్రజలకు చెప్పెను.

6. యెహోషువ “మీరు నిబంధనమందసమును యెత్తుకొని ప్రజలకు ముందు నడువుడు” అని యాజకులతో పలికెను. యాజకులు నిబంధన మందసమును మోయుచు ప్రజలకు ముందునడిచిరి.

7. యావే యెహోషువతో "నేడు నిన్ను యిస్రాయేలు ప్రజల ముందు గొప్పవానిని చేసెదను. నేను మోషేకువలెనె నీకును తోడైయుందునని ఈ ప్రజలు తెలిసికొందురు.

8. నీవు నిబంధనపు పెట్టెను మోయు యాజకులకు 'మీరు యోర్దాను గట్టును సమీపించి నిలబడుడు' " అని ఆనతివ్వవలెను.

9. అప్పుడు యెహోషువ “నా దగ్గరకు రండు. మీ దేవుడైన యావే మాటలు వినుడు.

10. సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాట బోవుచున్నది.

11. కనుక సజీవుడైన దేవుడు మీతో నున్నాడని తెలిసికొనుడు. అతడు కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిస్సీయులను, గెర్గాషీయులను, అమోరీయులను, యెబూసీయులను మీ ఎదుటినుండి తప్పక వెళ్ళగొట్టునని గ్రహింపుడు.

12. కనుక ఇప్పుడు యిస్రాయేలు ప్రజల నుండి తెగనకు ఒకని వంతున పండ్రెండుమందిని ఎన్నుకొనుడు. .

13. సర్వలోకనాథుడగు యావే నిబంధన మందసము నెత్తుకొనిన యాజకుల పాదములు యోర్దాను నీటిలో దిగగనే, యెగువనుండి ప్రవహించు నీరు దిగువ నీరునుండి వేరయి ఒకచోట ప్రోవై నిలుచును” అనెను.

14. యెహోషువ ఆజ్ఞ ప్రకారము యోర్దాను నదిని దాటుటకు ప్రజలు శిబిరము నుండి బయలు దేరిరి. యాజకులు నిబంధన మందసము నెత్తుకొని ప్రజల ముందు నడచిరి.

15-16. యోర్దాను నది కోత కాలమున పొంగి ప్రవహించును. నిబంధన మందసము మోయువారు యోర్ధానులో దిగిరి. వారి పాదములు నీళ్ళనంటగనే యెగువనుండి పారునీరు ఆగిపోయెను. సారెతాను చెంతనున్న ఆదాము వట్టణము వరకు చాలదూరము నీళ్లోకరాశిగా ఏర్పడెను. దిగువవైపు అరబా అనబడు ఉప్పుసముద్రములోనికి ప్రవహించు నీరు పూర్తిగా ఆగిపోయెను. యిస్రాయేలు ప్రజలు యెరికో పట్టణమునకు ఎదురుగా నదిని దాటిరి.

17. యిస్రాయేలీయుల ప్రజలు అందరును ఆరిన నేలపై నదిని దాటిపోవు వరకు నిబంధన మందసమును మోయు యాజకులు నది నడుమ ఎండిన నేలపై నిలబడిరి.

1. జనులందరు యోరాను నదిని దాటుట పూర్తియైన తరువాత యావే యెహోషువతో

2-3. “ఈ జనులనుండి తెగకు ఒక్కని చొప్పున పండ్రెండు మందిని ఎన్నుకొనుము. యోర్దాను నడుమ యాజకులు నిలిచిన చోటునుండి పండ్రెండురాళ్ళను తీసికొని పోయి, రాత్రి బసచేయుచోట ఉంచుడని వారిని ఆజ్ఞాపింపుము" అని పలికెను.

4. అంతట యెహోషువ, యిస్రాయేలీయుల నుండి తెగకు ఒకని వంతున పండ్రెండు మందిని ఎన్నుకొని వారిని పిలచి ఇట్లు చెప్పెను.

5. “యోర్దాను నది మధ్యకు పోయి మీ దేవుడైన యావే మందసము నిలిచిన స్థలము నుండి యిస్రాయేలీయుల తెగల లెక్క చొప్పున మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క రాతిని భుజమున పెట్టుకుని తీసుకొనిరండు” అని చెప్పెను.

6. ఈ రాళ్ళు మీకు జ్ఞాపకచిహ్నముగా నుండును. రాబోవు కాలమున ఈ రాళ్ళెందుకని మీ పిల్లలు అడిగినప్పుడు,

7. 'యావే నిబంధన మందసము యోర్దాను నదిని దాటుచుండగా ఆ మందసము ఎదుట నదీ ప్రవాహము ఆగిపోయెను. ఆ రాళ్ళు యిప్రాయేలీయులకు ఆ విషయమును ఎల్లప్పుడును గుర్తుచేయుచుండును' అని వారికి చెప్పుడు.”

8. యిస్రాయేలీయులు యెహోషువ చెప్పినట్లు చేసిరి. యావే యెహోషువతో చెప్పినట్లు తెగల లెక్క చొప్పున యోర్దాను నది నడుమనుండి పండ్రెండు రాళ్ళను తీసికొని శిబిరమునకు మోసికొనిపోయి అచ్చటపాతిరి.

9. యెహోషువ యోర్దానునది నడుమ నిబంధన పెట్టె మోయు యాజకులు నిలబడిన చోట కూడ పండ్రెండు రాళ్ళను పాతించెను. అవి నేటికిని అక్కడ కలవు.

10. ప్రజలతో చెప్పుమని యావే యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు, అనగా మోషే యెహోషువకు ఆజ్ఞాపించిన ప్రకారము నెరవేరు వరకు యాజకులు నిబంధనమందసమును మోయుచు యేటినడుమ నిలుచుండిరి. ప్రజలు తొందరగా నదిని దాటిరి.

11. జనులందరు దాటిన తరువాత నిబంధన మందసముతో యాజకులు దాటిరి.

12. రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధ తెగలవారిలో జనులు మోషే వారిని ఆజ్ఞాపించినట్లు ఆయుధములు ధరించి, యిస్రాయేలు ప్రజల ఎదుట యుద్ధసన్నద్దులై నదిని దాటిరి.

13. యుద్ధమునకు యోగ్యులైన యోధులు దాదాపు నలువదివేల మంది ఆయుధములు ధరించి ప్రభువు సన్నిధిలో యెరికో మైదానము వైపు యుద్ధముచేయుటకే నదిని దాటిరి.

14. ఆనాడు యిస్రాయేలీయుల ముందు యావే యెహోషువను ఘనపరచి, వారు మోషేను గౌరవించినట్లు అతనియెడలను జీవితకాలమంతయు గౌరవము కలిగియుండునట్లు చేసెను.

15-16. “నిబంధన పెట్టెను మోయుచున్న యాజకులను యోర్దాను నది నుండి బయటికి రమ్మని చెప్పుము” అని యావే యెహోషువను ఆజ్ఞాపించెను.

17. "నది నుండి వెలుపలకురండు” అని యెహోషువ యాజకులతో పలికెను.

18. యావే నిబంధనపు పెట్టెను మోయుచున్న యాజకులు నదినుండి పైకివచ్చి గట్టుపై కాలుమోపగానే నదిలోని నీరు మునుపటి చోటికి చేరుకొని పూర్వపురీతినే గట్లు పొర్లి ప్రవహించెను.

19. మొదటినెల పదవరోజున జనులు యోర్దాను నుండి వెడలివచ్చి యెరికో పట్టణమునకు తూర్పు వైపునున్న గిల్గాలులో దిగిరి.

20. నదినుండి తెచ్చిన పండ్రెండురాళ్ళను యెహోషువ గిల్గాలులో నిలిపెను.

21. అతడు యిస్రాయేలీయులతో, “రాబోవు కాలమున మీ పిల్లలు ఈ రాళ్ళెందుకని మిమ్ము అడిగి నప్పుడు

22-23. 'యిస్రాయేలీయులు ఎండిన నేలపై యోర్దానును దాటిరి. మేము దాటు వరకు మా దేవుడైన యావే యోర్దాను నీళ్ళను ఇంకించెను. పూర్వము మా దేవుడైన యావే మేము దాటు వరకు రెల్లుసముద్రపు నీళ్ళను కూడ ఇట్లే ఇంకించెను.

24. భూమిమీద సకలజాతి జనులు యావే బాహుబలమును గుర్తించి ఆ ప్రభువుపట్ల భయభక్తులు చూపుటకొరకు అతడిట్లు చేసెను' అని చెప్పుడు” అని పలికెను.

1. యిస్రాయేలీయులు దాటువరకు వారిముందు యావే యేటి జలములను ఎండజేసిన సంగతి యోర్దానునకు పడమటనున్న అమోరీయ రాజులు, సముద్రతీరమునందలి కనానీయ రాజులు వినిరి. వినినంతనే వారి గుండెలు చెదరిపోయెను. యిస్రాయేలీయులనగానే ఆ రాజుల ఉత్సాహము అడుగంటెను.

2. అప్పుడు యావే రాతి కత్తులు చేయించి యిస్రాయేలీయులకు మరల సున్నతి చేయింపుమని యెహోషువను ఆజ్ఞాపించెను.

3. యెహోషువ రాతి కత్తులు చేయించి 'గిబియెత్ హారలోత్' సున్నతి కొండ వద్ద యిస్రాయేలీయులకు సున్నతి చేయించెను.

4. అతడు వారికి సున్నతిచేయించుటకు కారణమిది. ఐగుప్తుదేశమునుండి బయలుదేరిన వారిలో యుద్ధము చేయు ప్రాయముకలిగిన పురుషులందరు త్రోవలో ఎడారియందు మరణించిరి.

5. ఐగుప్తునుండి వెడలి వచ్చినవారందరు సున్నతి పొందినవారే. కాని ఐగుప్తు దాటి ప్రయాణము చేయునపుడు ఎడారిలో పుట్టిన వారెవ్వరు సున్నతి పొందలేదు.

6. యిస్రాయేలు ప్రజలు నలువదియేండ్లు ఎడారిలో ప్రయాణముచేసిరి. ఆ కాలమున యుద్ధముచేయు ప్రాయమువచ్చిన పురుషులందరును నశించిరి. వారందరు ప్రభువు మాట పెడచెవిని పెట్టినవారే. అందుచే తాను పూర్వులకు ప్రమాణము చేసిన భూమిని వారు కంటితో చూడజాలరని ప్రభువు శపథము చేసెను. అది పాలు తేనెలు జాలువారు నేల.

7. కావున ప్రభువు ఆ నాశనమైన వారికి బదులుగా కలిగించిన రెండవ తరమువారికి యెహోషువ సున్నతిచేసెను. వారు దారిలో సున్నతిని పొందలేదు.

8. అందరు సున్నతి చేయించుకొని ఆరోగ్యము చేకూరు వరకు శిబిరములో విశ్రమించిరి.

9. అప్పుడు యావే “నాటి ఐగుప్తు అపకీర్తిని' నేడు మీ నుండి తొలగించితిని” అని యెహోషువతో చెప్పెను. కాబట్టి నేటివరకు ఆ ప్రదేశము గిల్గాలు' అని పేరుతో పిలువబడుచున్నది.

10. యిస్రాయేలీయులు గిల్గాలులో దిగిరి. ఆ నెల పదునాలుగవరోజు సాయంకాలము యెరికో మైదానములో పాస్కపండుగ చేసికొనిరి.

11. ఆ మరు నాడు ఆ దేశపు పంటను రుచిచూచిరి. పులియని పిండితో రొట్టెలను చేసికొనితినిరి. కంకులను కాల్చుకొని ఆరగించిరి.

12. ఆ దేశపుపంటను వారు మొట్టమొదటి సారిగా తిన్నప్పటినుండి మన్నా ఆగిపోయెను. ఆ మీదట మన్నా కురియలేదు. కనుక ఆ సంవత్సరము నుండి యిస్రాయేలీయులు కనాను దేశపు పంటతోనే జీవించిరి.

13. యెహోషువ యెరికోచెంత నున్నప్పుడు ఒకనాడు కనులెత్తి చూడగా ఎదుట ఒక మనుష్యుడు కనిపించెను. అతడు చేత కత్తిదూసి నిలబడియుండెను. యెహోషువ అతనిని సమీపించి, “నీవు మా వాడవా, లేక శత్రుపక్షము వాడవా?" అని అడిగెను.

14. “నేను యావే సైన్యమునకు నాయకుడనుగా ఇచ్చటికి వచ్చితిని” అని అతడు సమాధానము చెప్పెను. వెంటనే యెహోషువ నేలపై సాగిలపడి అతనికి నమస్కరించి, “ఈ దాసునకు ప్రభువు ఏమి ఆజ్ఞాపించుచున్నాడు?” అని అడిగెను.

15. “నీవు నిలబడిన ఈ ప్రదేశము పవిత్రమైనది. పాదరక్షలను తీసివేయుము” అని యావే సైన్యాధిపతి పలికెను. యెహోషువ అతడు చెప్పినట్లు చేసెను.

1. అప్పుడు యిస్రాయేలీయుల వలన భయముచే యెరికో పట్టణవాసులు నగరద్వారమును గట్టిగా మూసివేసిరి. లోపలివారు బయటికి పోలేదు, బయటి వారు లోపలికి రాలేదు.

2. అంతట యావే యెహోషువతో “నేనిప్పుడు యెరికో నగరమును, యెరికో రాజును నీకు కైవసము చేసియున్నాను.

3. మీ యోధులు, పరాక్రమశాలులు పట్టణమును ఒక సారి చుట్టిరావలెను. అటుల మీరు ఆరు రోజులు చేయవలెను.

4. ఏడుగురు యాజకులు ఏడు పొట్టేలి కొమ్ము బాకాలను పట్టుకొని దేవుని మందసము ముందు నడువవలెను. ఏడవరోజు యాజకులు బాకాలను ఊదుచుండగా మీరు ఏడుసార్లు పట్టణము చుట్టిరండు.

5. ఆ బాకాల ధ్వని విని మీ జనులందరు యుద్ధనాదములతో కేకలు వేయవలెను. అప్పుడు కోటగోడ దానియంతట అదియే నేలకూలును. వెంటనే మీ జనులు లోనికిపోయి నగరమును వశము చేసికోవలెను” అనిపలికెను.

6. నూను కుమారుడగు యెహోషువ యాజకులను పిలిచి “మీరు నిబంధన మందసమును మోసికొనిపొండు. ఏడుగురు యాజకులు ఏడుబాకాలు పట్టుకొని యావే నిబంధనమందసము ముందువెళ్ళుడు” అని చెప్పెను.

7. ప్రజలతో “మీరు ముందుకు పొండు. పట్టణము చుట్టు నడువుడు. ఆయుధములు ధరించిన వీరులు యావే మందసమునకు ముందుగా నడువుడు” అని పలికెను.

8. ప్రజలు యెహోషువ ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఏడుగురు యాజకులు ఏడు బాకాలు ఊదుచు యావే సాన్నిధ్యమున ముందు సాగుచుండగా యావే నిబంధన మందసము వారిని అనుసరించెను.

9. ఆయుధములను ధరించిన వీరులు బాకాలను ఊదు యాజకులకు ముందుగా నడచిరి. మిగిలిన దండు మందసము వెనుక నడచెను. ఈ రీతిగా బాకాలు మ్రోగుచుండగా జనులు ముందుకు సాగిరి.

10. అప్పుడు యెహోషువ “నేను చెప్పువరకు మీరు కేకలు వేయవలదు. ఒక్కమాట కూడ మాట్లాడవలదు. మీ కంఠమునుండి ఏ శబ్దమును రాకూడదు. నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయవలెను” అని ప్రజలకు ఆనతిచ్చెను.

11. యెహోషువ ఆజ్ఞాపించిన ప్రకారము యావే మందసము నగరమును ఒకసారి చుట్టివచ్చెను. ఆపై ప్రజలు శిబిరమునకు తిరిగి వచ్చి అక్కడ రాత్రి గడపిరి,

12. యెహోషువ ఉదయమున లేచెను. యాజకులు యావే మందసము నెత్తుకొనిరి.

13. ఏడుగురు యాజకులు ఏడుబాకాలను ఊదుచు యావే మందసము ముందునడచిరి. ఆయుధములు ధరించిన వీరులు వారిముందు నడచిరి. మిగిలిన దండు యావే మందసము వెనుక నడచెను. ఈ రీతిగా బాకాలు మ్రోగుచుండగా దండుకదలెను.

14. రెండవరోజు నగరముచుట్టు ఒకసారి తిరిగి వారు శిబిరమునకు మరలివచ్చిరి. అటుల ఆరు రోజులు చేసిరి.

15. ఏడవరోజు ఉదయమున లేచి మునుపటివలె కోటగోడచుట్టు ఏడుసార్లు తిరిగిరి. ఆ రోజు మాత్రమే వారు ఏడుసార్లు కోటచుట్టు తిరిగిరి.

16. ఏడవసారి యాజకులు బాకాలను ఊదు చుండగా యెహోషువ “యావే యెరికో నగరమును మీ వశము చేసెను. యుద్ధనాదము చేయుడు” అనెను.

17. యెహోషువ ప్రజలతో “ఈ నగరము, నగరములోని సమస్తము యావే శాపమునకు గురి అయ్యెను. మనము పంపిన వేగులను దాచి రక్షించినది కావున రాహాబు అను వేశ్యయు, ఆమె ఇంటివారును మాత్రమే బ్రతుకుదురు.

18. మీరు శాపవిషయమున జాగ్రత్తతో నుండుడు. శాపమునకు గురియైన దేనిని మీరు దురాశచే ముట్టరాదు. ముట్టినచో యిస్రాయేలీయుల శిబిరమునకు గూడ ఆ శాపము తగిలి గొప్ప ఆపద సంభవించును.

19. వెండిబంగారములు ఇత్తడి పాత్రలు, ఇనుప పాత్రలు అన్నియు యావేకు చెందును. కావున వానిని యావే ధనాగారములో ఉంచవలెను” అని చెప్పెను.

20. అంతట యాజకులు బాకాలూదగా ప్రజలు కేకలు వేసిరి. బాకాలమ్రోత విని ప్రజలు యుద్ధనాదము చేయగా కోటగోడ కుపు కూలిపడెను. తక్షణమే ప్రజలు నేరుగా పట్టణములో జొరబడి పట్టణమును ఆక్రమించుకొనిరి.

21. స్త్రీలు, పురుషులు, బాలురు, వృద్ధులు, ఎద్దులు, గొఱ్ఱెలు, గాడిదలు - ఇదియదియనక, శ్వాసించు ప్రతిదానిని సంహరించి శాపముపాలు చేసిరి.

22. అప్పుడు యెహోషువ ఆ దేశమున వేగు నడపిన మనుష్యులనిద్దరను పిలిచి “ఆ వేశ్య ఇంట ప్రవేశించి ఆమెను, ఆమెకు సంబంధించిన వారినందరిని తీసికొనిరండు. మీ శపథము నెరవేర్చుకొనుడు” అని చెప్పెను.

23. వేగునడపిన పడుచువారు రాహాబు ఇంటికిబోయి ఆమెను, ఆమె తల్లిదండ్రులను సహోదరులను, ఆమెకు సంబంధించిన వారిని అందరను వెలుపలికి కొనివచ్చిరి. వారు ఆమె బంధువులను అందరను బయటికి తీసికొని వచ్చి సురక్షితముగా యిస్రాయేలీయుల శిబిరమునకు చేర్చిరి.

24. వారు పట్టణమును, పట్టణములోని సమస్తమును తగులబెట్టిరి. వెండి బంగారమును, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రములను మాత్రము యావే మందిరమందలి ధనాగారమునకు చేర్చిరి.

25. కాని రాహాబు అను వేశ్యను, ఆమె తండ్రి కుటుంబము వారిని, ఆమె బంధువులనందరను యెహోషువ రక్షించెను. యెరికోలో వేగు నెరపుటకు యెహోషువ పంపిన వేగులవారిని ఇద్దరను దాచి కాపాడుటచేత రాహాబు నేటివరకు యిస్రాయేలీయుల నడుమ బ్రతుకు చున్నది.

26. అప్పుడు యెహోషువ “యెరికో పట్టణమును మరల కట్టించువాడు యావే శాపమునకు గురియగునుగాక! ఎవడైన దానికి మరల పునాదులు వేసినచో వాని పెద్దకొడుకు మరణించునుగాక! ద్వారములెత్తినచో వాని చిన్నకొడుకు గతించునుగాక!" అని ప్రజలచే యావే ముందు ప్రమాణము చేయించెను.

27. యావే ఇట్లు యెహోషువకు తోడైయుండుట చేత అతని కీర్తి దేశమంతట వ్యాపించెను.

1. కాని యిస్రాయేలీయులు శాపమును లక్ష్య పెట్టక దోషముచేసిరి. యూదా తెగవాడును సెరా మునిమనుమడును, సబ్ది మనుమడును, కర్మీ కుమారుడునైన ఆకాను శపింపబడిన వస్తువులు కొన్నిటిని తీసికొనెను. అందుచే యావే యిస్రాయేలీయులపై కోపించెను.

2. అప్పుడు యెహోషువ బేతేలునకు తూర్పు దిక్కున నున్న 'హాయి' అను పురమునకు పోయి వేగు నడిపి రండని ఇద్దరు మనుష్యులను యెరికో నుండి పంపించెను. వారు హాయి అను పురమునకు పోయి వేగునడపి యెహోషువ యొద్దకు తిరిగివచ్చిరి.

3. “ప్రజలందరు వెళ్ళనక్కరలేదు. రెండు, మూడు వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును. శత్రువుల సంఖ్య స్వల్పము. సైన్యమంతయు శ్రమపడి అక్కడి వరకు పోనక్కరలేదు” అని చెప్పిరి.

4. మూడువేల మంది ప్రజలు హాయి పట్టణమును పట్టుకొనుటకు వెళ్ళిరి. కాని వారు హాయి వీరుల ముందు నిలువజాలక పారిపోయిరి.

5. హాయి ప్రజలు వారిలో ముప్పదియారు మందిని మట్టుపెట్టిరి. మిగిలినవారిని నగర ద్వారమునుండి షేబారీము పల్లము వరకు తరిమి మోరాదు వద్ద సంహరించిరి. అప్పుడు ప్రజల గుండె చెదరిపోయెను.

6. అప్పుడు యెహోషువ తన వస్త్రములు చించుకొనెను. అతడును, యిస్రాయేలీయుల పెద్దలును తమ తలలపై దుమ్ముపోసికొని చీకటి పడువరకు యావే మందసము ముందట సాష్టాంగపడియుండిరి.

7. “అయ్యో ప్రభూ! యావే! నీవు ఈ ప్రజలను యోర్దాను నది ఏల దాటించితివి? అమోరీయులచేతికి అప్పగించి నాశనము చేయుటకా? మేము యోర్దాను నదికి ఆవలి తీరముననే స్థిరపడియుండిన ఎంత బాగుండెడిది.

8. ప్రభూ! యిస్రాయేలీయులు శత్రువునకు వెన్ను చూపిరిగదా! ఇక ఇప్పుడేమనగలను?

9. కనానీయులు, ఈ దేశవాసులందరును ఈ సంగతి విందురు. వారందరు ఒక్కటై మమ్ము ఎదురింతురు. నేల మీది నుండి మా పేరు తుడిచివేయుదురు. నీ పేరు నిలుపు కొనుటకు నీవిక ఏమి చేయుదువు?” అని ప్రార్థించెను.

10. యావే యెహోషువతో “లెమ్ము! ఇట్లు బోరగిలబడియుండనేల? యిస్రాయేలీయులు పాపము చేసిరి. నేను చేసిన నిబంధనను వారు అతిక్రమించిరి.

11. శపింపబడిన వస్తువులు దొంగిలించి దాచుకొని తమ సరకులలో కలుపుకొనిరి.

12. కావుననే యిస్రాయేలీయులు శత్రువులముందు నిలువలేకపోయిరి. శాపవస్తువులను ముట్టి తామును శాపమునకు గురియైరి. అందుచే శత్రువులకు వెన్నుచూపిరి. శాపగ్రస్తులైనవారు మీ మధ్యనుండకుండ మీరు వారిని సంహరించిననే తప్ప నేను మీకు తోడైయుండను.

13. లెమ్ము! ప్రజలను శుద్దీకరించి వారితో ఈ విధముగా చెప్పుము. 'రేపు మీరందరును శుద్ధిచేసి కొనుడు. ఇప్పుడు మీ మధ్య శాపగ్రస్తులైనవారు ఉన్నారు. మీరు ఈ శాపగ్రస్తులను సంహరించిననే తప్ప మీ శత్రువులను ఎదుర్కొనలేరు అని యావే యిస్రాయేలీయులకు సెలవిచ్చుచున్నాడు' అని చెప్పుము.

14. కావున వేకువజామున తెగల క్రమము బట్టి మీరు ముందుకు రావలయును. యావే సూచించు తెగవారు వంశక్రమమున ముందుకు రావలయును. యావే సూచించు వంశము కుటుంబముల ప్రకారము ముందుకు రావలెను. యావే సూచించు కుటుంబములోని పురుషుల వరుస ప్రకారము ఒక్కొక్కరు ముందుకు రావలెను.

15. అప్పుడు శపింపబడిన వస్తువును దొంగిలించినవాడిని తన వారితో కలిపి అగ్నిలో కాల్చి వేయవలయును. ఏలయన, అతడు యావే నిర్ణయమును మీరి యిస్రాయేలీయులలో దుష్కార్యము చేసెను” అని పలికెను.

16. యెహోషువ ఉదయముననే లేచి యిస్రాయేలీయులను వారి తెగల వరుస ప్రకారము చెంతకు రప్పించినపుడు యూదా తెగ పట్టుబడెను.

17. యూదా తెగను వంశముల ప్రకారము చెంతకు రప్పించినపుడు సెరా వంశము చిక్కెను. సెరా వంశములోని కుటుంబములను చెంతకు రప్పించినపుడు సబ్ది కుటుంబము దొరకెను.

18. సబ్ది కుటుంబములోని పురుషులను వరుసగా చెంతకు రప్పించినపుడు యూదా తెగకు చెందిన సెరా మునిమనుమడును, సబ్ది మనుమడును, కర్మీ కుమారుడునైన ఆకాను పట్టుబడెను.

19. అప్పుడు యెహోషువ "కుమారా! యిస్రాయేలు దేవుడైన యావేను స్తుతించి గౌరవింపుము. నీవేమి చేసితివో దాచక నాతో చెప్పుము” అని ఆకానును అడిగెను.

20. అంతట ఆకాను “యిస్రాయేలు దేవుడైన యావే ఎడల నేను పాపముచేసిన మాట నిజమే. నేను చేసిన తప్పు ఇది.

21. దోపిడి వస్తువులందు ఒక మంచి షీనారు ఉత్తరీయమును, రెండువందల తులముల వెండిని, ఏబది తులముల ఎత్తుగల బంగారు కమ్మిని చూచి ఆశించి దొంగిలించితిని. వాటిని నా గుడారమునందు భూమిలో పాతిపెట్టితిని. వెండి కూడ వాటి క్రిందనే ఉన్నది” అని యెహోషువతో చెప్పెను.

22. అతడు మనుష్యులను పంపెను. వారు ఆ డేరా దగ్గరకు పరుగెత్తుకొనిపోయిరి. ఉత్తరీయము దాచబడియుండెను. వెండి ఆ వస్త్రము క్రింద ఉండెను.

23. వారు డేరా మధ్యనుండి వాటిని తీసుకొని యెహోషువ, యిస్రాయేలీయులు సమావేశమైయున్న తావునకు కొనివచ్చి యావే సాన్నిధ్యమున ఉంచిరి.

24. అప్పుడు యెహోషువ సెరా కుమారుడగు ఆకానును, ఆ వెండిని, ఆ ఉత్తరీయమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, అతనికి చెందిన ప్రతి వస్తువును ఆకొరు లోయలోనికి కొనిపోయెను. యిస్రాయేలీయులును యెహోషువతో వెళ్ళిరి.

25. యెహోషువ “నీవు మాకెంత శ్రమ కలిగించితివి! యావేగూడ నేడు నిన్ను శ్రమ పెట్టునుగాక!” అనెను. అంతట యిస్రాయేలీయులందరు అతనిని రాళ్ళతో కొట్టి, తదుపరి అగ్నితో కాల్చివేసిరి.

26. అతని మీద పెద్ద రాళ్ళగుట్టను పేర్చిరి. అది నేటికిని ఉన్నది. అప్పుడు యావే కోపము చల్లారెను. నాటినుండి నేటివరకు ఆ తావునకు 'ఆకోరులోయ'' అని పేరు.

1. అప్పుడు యావే యెహోషువతో ఇట్లనెను: “భయపడకుము. ధైర్యము వహింపుము. నీ వీరులనందరిని తోడ్కొని హాయి పట్టణము మీదికి పొమ్ము. ఆ పట్టణపు రాజును, అతని ప్రజలను, నగరమును, దేశమును నీకు అప్పగించితిని.

2. యెరికో నగరమును, యెరికోరాజును నాశనము చేసినట్లే హాయి నగరమును, దాని రాజును నాశనముచేయుము. మీరు హాయిప్రజల సంపదను, పశువులను మూకుమ్మడిగా దోచుకొనవచ్చును. మీరు పట్టణము వెనుక పొంచియుండి నగరమును ధ్వంసము చేయవలయును” అని చెప్పెను.

3. యెహోషువ వీరులతో పోయి హాయిని ముట్టడించుటకు సిద్ధపడెను. అతడు ముప్పది వేలమంది మహావీరులను ఎన్నుకొని వారిని రాత్రివేళ పంపించెను.

4. వారితో, “మీరు పట్టణమునకు సమీపమున పడమరన పొంచియుండి సంసిద్ధముగా నుండుడు.

5. నేనును, నాతో ఉన్నవారును పట్టణమును సమీపించెదము. హాయి ప్రజలు మునుపటివలె మమ్ము ఎదుర్కొందురు. అప్పుడు మేము వారి యెదుట నిలు వక పారిపోయెదము.

6. మునుపటివలె వీరు మనయెదుట నిలువజాలక పరుగెత్తుచున్నారను కొని వారు పట్టణమునువీడి బహుదూరము మమ్ము వెంటాడెదరు.

7. అప్పుడు పొంచియున్న మీరు బయటికి వచ్చి పట్టణమును ఆక్రమించుకొనుడు. మీ దేవుడైన యావే దానిని మీ వశము చేయును.

8. మీరు పట్టణమును పట్టుకొని వెంటనే తగులబెట్టుడు. ఇది ప్రభువాజ్ఞ. మీరు నేను చెప్పినట్లు చేయుడు” అని పలికి వారిని పంపించెను.

9. వారు వెళ్ళి హాయి పట్టణమునకు పడమటి వైపున బేతేలుకును, హాయికిని మధ్య పొంచియుండిరి. ఆ రాత్రి యెహోషువ ప్రజల మధ్య బసచేసెను.

10. మరునాడు వేకువజామున లేచి అతడు హాయి పట్టణము మీదికి దాడికి వెడలెను. అతడు, యిస్రాయేలు పెద్దలు ప్రజల ముందు నడచిరి.

11. అతనితోనున్న యుద్ధ వీరులందరు బయలుదేరి నగరము ఎదుటి భాగమునకు కదలి హాయికి ఉత్తరమున డేరా వేసిరి. వారికి హాయికి మధ్య ఒక లోయ కలదు.

12. యెహోషువ సుమారు ఐదువేల మందిని పట్టణమునకు పశ్చిమమందు బేతేలుకును హాయికిని నడుమ పొంచియుండ నియమించెను.

13. నగరమునకు ఉత్తర దిక్కున యెహోషువ, జనులు నిలుచుండిరి. పొంచియున్నవారు పడమటివైపు నుండిరి. యెహోషువ ఆ రాత్రి లోయలోనే గడపెను.

14. హాయిరాజు శత్రువులను చూచిన వెంటనే అతడును, ఆ పట్టణ ప్రజలును పెందలకడనే లేచి వారు ముందుగా నిర్ణయించుకొనిన విధముగా ఆరబాకు అభిముఖముగానున్న పల్లములో యిస్రాయేలీయులను ఎదుర్కొనుటకు త్వరపడి తనవారితో బయలుదేరెను. పట్టణమునకు పడమటివైపున శత్రువులు పొంచియున్న సంగతి అతనికి తెలియదు.

15. యెహోషువ, యిస్రాయేలీయులు వారి యెదుట నిలువజాలనట్లు నటించుచు ఎడారివైపునకు పారిపోయిరి.

16. హాయి ప్రజలు నగరమును అరక్షితముగా వదలిపెట్టి పెనుకేకలతో వారిని తరుముచు చాలదూరము పోయిరి.

17. యిస్రాయేలీయులను వెంటాడుచు పోని వాడొక్కడును హాయిలోనేగాని, బేతేలులోనేగాని లేడు. నగరమును అరక్షితముగా విడిచి, వారు యిస్రాయేలీయుల వెంటబడిరి.

18. అప్పుడు యావే “నీ చేతనున్న ఈటెను హాయివైపు చాపుము. నగరమును నీకు వశము చేసెదను” అని యెహోషువతో చెప్పెను. యెహోషువ తన చేతనున్న బల్లెమును నగరమువైపు చాపెను.

19. అతడు తన చేయిచాపిన వెంటనే పొంచియున్న వారు గబగబ మరుగునుండి వెలువడి పరుగెత్తుకొని పోయి పట్టణమున ప్రవేశించి దానిని ఆక్రమించుకొని తగులబెట్టిరి.

20. హాయి ప్రజలు వెనుదిరిగి చూడగా పట్టణము నుండి పొగ ఆకాశమునకు ఎగబ్రాకుచుండెను. ఎడారివైపు పరుగెత్తిపోవుచున్న యిస్రాయేలీయులు తమను తరుముచున్న వారిపై తిరుగబడుచుండిరి. అందుచే హాయి ప్రజలలో ఒక్కనికిని ఎటుపోవుటకు వీలు కాలేదు.

21. పొంచియున్నవారు పట్టణమును పట్టుకొనుటయు, నగరమునుండి పొగ ఆకాశమునకు లేచుటయు, యెహోషువయు యిస్రాయేలీయులును చూచి హాయి ప్రజలను ముట్టడించి ఎదుర్కొనిరి.

22. నగరమున నున్న యిస్రాయేలు వీరులు వెనుక నుండి వచ్చి హాయి ప్రజలపైబడిరి. ఈ రీతిగా హాయి నగర ప్రజలు అన్నివైపుల శత్రువులచేత ముట్టడింప బడిరి. ఒక్కడిని గూడ ప్రాణములతో మిగులనీయకుండ యిస్రాయేలీయులు అందరిని మట్టు పెట్టిరి.

23. హాయి రాజు మాత్రము ప్రాణములతో పట్టుపడెను. అతనిని యెహోషువ దగ్గరకు తీసికొని వచ్చిరి.

24. ఎడారిలోనికి తమ్ము వెంబడించిన హాయి ప్రజలను మైదానములో పూర్తిగా తమ కత్తులకు ఎరచేసిన తరువాత యిస్రాయేలీయులు హాయి నగరమునకు తిరిగి వచ్చి అందరిని సంహరించిరి.

25. నాడు హతులైన హాయి స్త్రీ పురుషుల సంఖ్య పన్నెండు వేలమంది.

26. హాయి నివాసులందరు శాపగ్రస్తులైన యెరికో ప్రజలవలె నాశనమగువరకు యెహోషువ తాను చాచిపట్టుకొనిన బల్లెమును వెనుకకు తీయలేదు.

27. యావే యెహోషువకు ఆజ్ఞయిచ్చిన ప్రకారము యిస్రాయేలీయులు హాయి పశువులను, కొల్లగొట్టిన సొమ్మును మాత్రము గైకొనిరి.

28. అంతట యెహోషువ హాయిని తగులబెట్టెను. అది పూర్తిగా పాడువడి నేటికిని అట్లే శూన్యప్రదేశముగా నున్నది.

29. యెహోషువ హాయి రాజును చెట్టుకు వ్రేలాడ దీయించెను. మాపటివేళ శవమును చెట్టు నుండి దింప నాజ్ఞాపించెను. పీనుగును నగరద్వారము ముందు పడవేసి దాని మీద పెద్ద రాళ్ళగుట్టను పేర్చిరి. నేటికిని ఆ గుట్ట అచటనున్నది.

30-31. అప్పుడు యెహోషువ యిస్రాయేలు దేవుడైన యావేకు ఏబాలు కొండమీద ఒక బలి పీఠము కట్టించెను. యావే సేవకుడైన మోషే యిస్రాయేలీయులను ఆజ్ఞాపించిన విధంగా, ధర్మశాస్త్రము ప్రకారము, ఇనుప పనిముట్లు తాకని, చెక్కని ముడి రాళ్ళతో ఆ బలిపీఠమును కట్టించెను. ఆ దినమున, వారు ఆ బలిపీఠముపై యావేకు దహనబలులు, సమాధానబలులు సమర్పించిరి.

32. మోషే యిస్రాయేలీయులకు వ్రాసి యిచ్చిన ధర్మశాస్త్రమును యెహోషువ రాళ్ళపై చెక్కించెను.

33. అప్పుడు నిబంధన మందసమునకు ఇరువైపుల, నిబంధన మందసమును మోయు లేవీయ యాజకుల ముందట, తమ పెద్దలతో, నాయకులతో, న్యాయాధిపతులతో, స్వపరభేదము లేకుండ యిస్రాయేలీయులందరును తమ తమ స్థానములలో నిలుచుండిరి. వారిలో సగముమంది గెరిసీముకొండ ఎదుటను, సగము మంది. ఏబాలుకొండ ఎదుటను, తమ తమ స్థానములలో నిలుచుండిరి. యావే సేవకుడైన మోషే యిస్రాయేలీయులు దీవెన పొందునపుడు ఇట్లు నిలువవలెనని మొదటనే ఆజ్ఞాపించియుండెను.

34. తరువాత యెహోషువ ధర్మశాస్త్ర నియమములన్నిటిని ఆశీర్వచనములను, శాపవచనములను కూడ చదివి వినిపించెను.

35. స్త్రీలు, పిల్లలు పరదేశులు వినుచుండగా సర్వజనము ఎదుట యెహోషువ మోషే ఆజ్ఞాపించిన నిబంధనలన్నిటిని ఒక్కమాట కూడ విడువక చదివి వినిపించెను.

1-2. యోర్డానునకు ఈవలి ప్రక్క కొండలలోను, లోయలలోను, లెబానోను వైపునగల మహాసముద్ర తీరమున వసించు హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిస్సీయులు, హివ్వీయులు, యెబూసీయులు మొదలైన జాతులవారి రాజులందరు జరిగిన సంగతులు విని తమలో తాము ఏకమై యెహోషువతోను యిస్రాయేలీయులతోను యుద్ధము చేయ జతకట్టిరి.

3. యెహోషువ యెరికో, హాయి పట్టణములను నాశనము చేసెనని గిబ్యోనీయులు వినినప్పుడు,

4. వారు కపటోపాయమునకు పూనుకొని, రాయబారులమని వేషము వేసుకొని, పాత గోతాములను, పిగిలి పోగా మరలకుట్టిన ద్రాక్షసారాయపు తిత్తులను గాడిదలమీద వేసికొని పయనమై వచ్చిరి.

5. పాత బడిపోయి, కుట్టువడిన చెప్పులను, చినిగి చీలికలైన బట్టలను తొడుగుకొని వచ్చిరి. వారు తెచ్చుకొనిన రొట్టెలుగూడ ఎండి పొడుమగుచుండెను

6. అలా వచ్చి గిబ్యోనీయులు, గిల్గాలు శిబిరమున యెహోషువను కలసికొనిరి. అతనితోను యిస్రాయేలీయులతోను “మేము దూరదేశమునుండి వచ్చితిమి. మీరు మాతో ఒడంబడిక చేసికొనుడు” అని అనిరి.

7. కాని యిస్రాయేలీయులు వారిని “మీరు మా దాపుననే వసించుచున్నారేమో! మరి మీతో ఒడంబడిక చేసికొనుటెట్లు?” అని అడిగిరి.

8. వారు యెహోషువతో “మేము మీ దాసులముకదా!” అని యనిరి. యెహోషువ “మీరెవరు? ఎచటినుండి వచ్చుచున్నారు?” అని ప్రశ్నించెను.

9. వారు అతనితో, “నీ దాసులమైన మేము దూరప్రాంతములనుండి వచ్చితిమి. నీవు కొలుచు యావే పేరు వింటిమి. ఆ దేవుడు ఐగుప్తీయులను ఎట్లు మట్టుపెట్టెనో తెలిసికొంటిమి.

10. యోర్దానునకు ఆవలివైపునున్న అమోరీయ రాజుల నిద్దరను, హెష్బోను రాజగు సీహోనును, అష్టారోతున వసించు బాషాను రాజగు ఓగును ఎట్లు అణగదొక్కెనో తెలిసికొంటిమి.

11. మా పెద్దలు, పౌరులు మాతో 'మీరు దారి బత్తెములు తీసికొని పయనమైపోయి ఆ ప్రజలను కలసికొని, మేము మీ దాసులము కనుక మాతో ఒడంబడిక చేసికొనుడు' అని విన్నవింపుడనిరి.

12. ఇదిగో! మేము తెచ్చుకొనిన రొట్టెలను చూడుడు. మీ యొద్దకు రావలెనని పయనము కట్టిన దినమున వీనిని మా ఇండ్లనుండి తెచ్చుకొంటిమి. అపుడవి వేడిగనే యుండినవి. కాని ఇపుడు ఎండిపోయి పొడుమగుచున్నవి.

13. ఈ తిత్తులును ద్రాక్షసారాయము పోసినపుడు క్రొత్తవియే. కాని ఇప్పుడవి పిగిలిపోవుచున్నవి. ఈ దీర్ఘప్రయాణము వలన మా దుస్తులు, పాదరక్షలు కూడ పాడయిపోయినవి” అని చెప్పిరి.

14. యిస్రాయేలు నాయకులు గిబ్యోనీయులు సమర్పించిన భోజనపదార్థములను పుచ్చుకొని భుజించిరి. వారు యావేను సంప్రదింపలేదు.

15. యెహోషువ గిబ్యోనీయులతో శాంతిని పాటింతునని బాసచేసి వారిని చంపనని ఒడంబడిక చేసికొనెను. యిస్రాయేలు నాయకులు ప్రమాణపూర్వకముగా ఆ ఒడంబడికను ధ్రువపరచిరి.

16. కాని ఒడంబడిక ముగిసిన మూడు రోజులలోనే ఆ వచ్చినవారు ఆ సమీపమున యిస్రాయేలీయుల చెంతనే వసించుచున్నారని తెలియవచ్చెను.

17. యిస్రాయేలీయులు తమ శిబిరమునుండి వెడలి వచ్చి మూడవరోజున గిబ్యోను, కెఫీరా, బెరోతు, కిర్యత్యారీము అను గిబ్యోనీయుల పట్టణములు చేరుకొనిరి.

18. కాని వారు ఆ పట్టణములను ముట్టడింపలేదు. యిస్రాయేలు నాయకులు తమదేవుడైన యావే పేర గిబ్యోనీయులతో శాంతిని పాటింతుమని బాస చేసిరి గదా! కాని యిస్రాయేలు ప్రజలు మాత్రము తమ నాయకులమీద గొణగుకొనిరి.

19. యిస్రాయేలు నాయకులు “మనము యావే పేర ఈ ప్రజలకు ప్రమాణము చేసితిమి. కనుక ఇపుడు వీరిని చంపరాదు,

20. మనము వారితో చేసిన ప్రమాణము వలన మనమీదికి దైవాగ్రహము రాకుండునట్లు ఆ ప్రమాణము ప్రకారము వారిని బ్రతుక నిత్తుము అని నిశ్చయించుకొనిరి.

21. కాని వారు యిస్రాయేలు సమాజమునకు వంటచెరకు నరుకుకొని రావలెను. నీళ్ళు తోడుకొనిరావలయును” అని సంపూర్ణ సమాజమున పలికిరి. సమాజము అందులకు అంగీకరించెను.

22. యెహోషువ గిబ్యోనీయులను పిలువనంపి “మీరు మా సమీపమునే వసించుచు దూరప్రాంతములనుండి వచ్చితిమని చెప్పి మమ్ము మోసగించిరి.

23. నేటి నుండి మీరు శాపగ్రస్తులగుదురు గాక! నేను కొలుచు దేవుని మందిరమున బానిసలైయుండి వంటచెరకు, నీళ్ళుతోడి మోసికొని రండు” అనెను.

24. వారు యెహోషువతో “నీ దాసులమైన మేము ఇట్లు కపటోపాయము పన్నుటకు కారణము కలదు. నీ దేవుడైన యావే యిటవసించు ప్రజలను నాశనముచేసి ఈ దేశమును నీవశము చేయుమని తన సేవకుడైన మోషేకు ఆజ్ఞ ఇచ్చెనని నీ దాసులకు అగత్యముగా తెలియవచ్చినది. మీరు మా సమీపమునకువచ్చిరి. కనుక ఇక మమ్ము చంపి వేయుదురని భయపడితిమి.

25. మేమిపుడు మీ చేతులలోని వారము. మమ్మెట్లు చేయదలచుకొంటిరో అటులనే చేయుడు” అనిరి.

26. యెహోషువ యిస్రాయేలీయుల బారినుండి గిబ్యోనీయులను రక్షించెను గనుక వారు చావు తప్పించుకొనిరి.

27. కాని నాటినుండి యెహోషువ వారిని యిస్రాయేలు సమాజమునకు వంట చెరకు నరుకుకొని రావలయుననియు, నీళ్ళుతోడుకొని రావలెననియు ఆజ్ఞాపించెను. పైగా యావే ఎక్కడ ఆరాధింపబడినను అక్కడ వారు యావే బలిపీఠమునకు పై రీతిగనే ఊడిగము చేయవలెనని ఆజ్ఞాపించెను. నేటివరకును ఆ నియమము చెల్లుచునే యున్నది.

1. యెహోషువ హాయి పట్టణమును జయించి, దానిని శాపముపాలు చేసెననియు, ఆ పట్టణమునకు దాని రాజునకు, యెరికో పట్టణమునకు దాని రాజునకు పట్టినగతియే పట్టెననియు యెరూషలేము రాజైన అదోనిసెదెకు వినెను. గిబ్యోను నివాసులు యిస్రాయేలీయులతో సంధి చేసికొని వారితో చేతులు కలిపిరని తెలిసికొనెను.

2. గిబ్యోను పెద్దపట్టణము రాజనగరము వంటిది. హాయి పట్టణముకంటె పెద్దది. ఆ నగర వాసులందరు శూరులు. అటువంటి పట్టణమే లొంగి పోవుట చూచి ఎల్లరును మిక్కిలి భయపడిరి.

3-4. కనుక యెరూషలేమురాజగు అదోనిసెదెకు, హెబ్రోను రాజగు హోహామునకు, యార్మూతురాజగు పీరామునకు, లాకీషురాజగు యాఫియాకు, ఎగ్లోను రాజగు దెబీరునకు “మీరు నాకు సహాయముగారండు. గిబ్యోను యెహోషువతోను, యిస్రాయేలీయులతోను సంధిచేసి కొనెను. గనుక మనమందరము కలసి గిబ్యోను పట్టణమును జయింతము” అని వార్త పంపెను.

5. ఆ రీతిగా అమోరీయరాజులు ఐదుగురు అనగా యెరూషలేము, హెబ్రోను, యార్మూతు, లాకీషు, ఎగ్లోను రాజులు ఏకమై సైన్యములతో వచ్చి గిబ్యోను వద్ద దండుదిగి పట్టణమును ముట్టడించిరి.

6. గిబ్యోను పౌరులు గిల్గాలు శిబిరముననున్న యెహోషువకు కబురంపి "మమ్ము గాలికి వదలవలదు. నీవు వెంటనే వచ్చి మమ్ము రక్షింపుము. మాకు సాయపడుము. పర్వత ప్రాంతములలో నివసించుచున్న అమోరీయరాజులందరు మాకు విరోధముగా ఏకమై వచ్చియున్నారు” అని వర్తమానము పంపిరి.

7. ఆ కబురు వినగానే యెహోషువ తన వీరులనెల్ల ప్రోగు చేసికొనివచ్చెను.

8. యావే యెహోషువతో “నీవు శత్రువులకు భయపడవలదు. నేను వారిని నీ వశము చేసితిని. వారిలో ఏ ఒక్కరును నిన్ను ఎదిరింపజాలరు” అని సెలవియ్యగా,

9. యెహోషువ గిల్గాలు నుండి రాత్రి అంతయు నడచివచ్చి అకస్మాత్తుగా శత్రువుల మీదపడెను.

10. యావే శత్రువులకు యిస్రాయేలీయులనిన భయము పుట్టించెను. ఆయన గిబ్యోనున వారిని నిర్మూలించెను. బేతహోరోను పల్లము వరకు శత్రువులను తరిమెను. అసేకా, మక్కేడా నగరముల వరకు వెంటాడి యోధులు వారిని చిత్రవధ చేసిరి.

11. అమోరీయులు యిస్రాయేలీయులకు జడిసి బేత్ హోరోను పల్లము మీదుగా పారిపోవుచుండగా, యావే అసెకా వరకు వారిపై పెద్ద వడగండ్లవాన కురిపించెను. యిస్రాయేలీయుల కత్తివాతబడి చచ్చినవారికంటె ఆ వడగండ్ల వానవలన చచ్చినవారే ఎక్కువ.

12. యావే అమోరీయులను యిస్రాయేలీయుల చేతికి అప్ప గించిన దినముననే యెహోషువ యావేను ప్రార్ధించెను. అతడు యిస్రాయేలీయులు వినుచుండగా ఇట్లనెను: “సూర్యుడా! నీవు గిబ్యోను పట్టణముపై నిలువుము; చంద్రుడా! నీవు అయ్యాలోను లోయమీద ఆగుము.”

13. ఆ రీతిగనే యిస్రాయేలు శత్రువుల మీద బడి పగతీర్చుకొనునంత వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ఈ సంగతి 'నీతిమంతుల గ్రంథము' లో వ్రాయబడియున్నది. ఆ విధముగా సూర్యుడు మింటి నడుమ ఆగిపోయి, ఒక రోజు వరకు అస్తమించ లేదు. 

14. దేవుడు నరుని ఆజ్ఞకు బద్దుడైన ఆ దినము వంటిదినము మరియొకటిలేదు. ఇక ఉండబోదు. నాడు యావే యిస్రాయేలీయుల పక్షమున యుద్ధము చేసెను.

15. అటు తరువాత యెహోషువ తన సైన్యముతో గిల్గాలు శిబిరమునకు తిరిగివచ్చెను.

16. శత్రురాజులు ఐదుగురు పారిపోయి మక్కేడా గుహలో జొరబడిరి.

17. వారు మక్కేడా గుహలో దాగుకొనియున్నారని యెహోషువకు తెలుపబడినపుడు

18. అతడు గుహముఖమున పెద్దరాళ్ళను దొర్లించి భటులను కాపు పెట్టుడని ఆజ్ఞాపించెను.

19. పైగా యెహోషువ తన జనముతో “మీరు ఊరకుండక శత్రువుల వెంటబడి తరుముడు. పారిపోవుచును వారిని పట్టి చంపుడు. వారిని మరల పట్టణములలో ప్రవేశింపనీయకుడు. యావే వారిని మీ చేతికి అప్పగించెను” అని చెప్పెను.

20. యెహోషువ యిస్రాయేలీయులు, అమోరీయులను చాలమందిని మట్టుబెట్టి, వారిలో కట్టకడపటి వారిని వధించుచుండగా తప్పించుకొనిపోయిన వారు కొంతమంది తమ కోటలలో దూరిరి.

21. యిస్రాయేలీయులందరు చెక్కుచెదరకుండ మక్కేడా వద్ద విడిదిచేసియున్న యెహోషువ వద్దకు మరలివచ్చిరి. శత్రువులెవరును వారిని పల్లెత్తిమాట అనుటకైన సాహసింపలేదు.

22. యెహోషువ అనుచరులతో “మక్కేడా గుహ ముఖమున పెద్దరాళ్ళను తొలగించి ఆ ఐదుగురు రాజులను నా కడకు కొనిరండు” అని చెప్పెను.

23. వారు యెరూషలేము, హెబ్రోను, యార్మూతు, లాకీషు, ఎగ్లోను రాజులు ఐదుగురను యెహోషువ కడకు కొనివచ్చిరి.

24. యెహోషువ ప్రజలందరిని సమావేశపరచి తనతో నిలిచి యుద్ధముచేసిన ప్రజా నాయకులతో “మీరిటువచ్చి వీరి మెడలపై పాదములు మోపుడు” అని చెప్పెను. వారు ముందుకు వచ్చి శత్రురాజుల మెడలపై పాదములు పెట్టిరి.

25. యెహోషువ వారితో “మీరు భయపడవలదు. ఆశ్చర్యపడవలదు. ధైర్యముతో, బలముతో పోరాడుడు. మీరు ఎదిరించి పోరాడు శత్రువులనందరిని ప్రభువు ఈ రీతిగనే నాశనము చేయును” అని చెప్పెను.

26. యెహోషువ ఆ ఐదుగురు రాజులను వధించి, ఐదు చెట్లకు వ్రేలాడదీయించెను. సాయంకాలమగువరకు, వారు ఆ చెట్లనుండి వ్రేలాడిరి.

27. ప్రొద్దుగ్రుంకిన పిదప యెహోషువ ఆనతి యీయగా రాజుల శవములను చెట్లనుండి క్రిందికి దింపి మునుపు వారు దాగుకొనిన కొండగుహలో పడవేసిరి. గుహముఖమున పెద్దరాళ్ళను దొర్లించిరి. ఆ రాళ్ళు నేటికిని అచటనే యున్నవి.

28. ఆ దినముననే యెహోషువ మక్కేడాను జయించెను. ఆ పట్టణ ప్రజలను, దానిని ఏలు రాజును కత్తివాదరకు ఎరచేసెను. అచటనున్న ప్రతి ప్రాణిని శాపముపాలు చేసెను. కనుక ఎవరును తప్పించు కోలేదు. మక్కేడా రాజుకును యెరికో రాజునకు పట్టిన గతియే పట్టెను.

29. యెహోషువ అతని అనుచరులు మక్కేడానుండి లిబ్నాకు వచ్చి ఆ పట్టణమును ముట్టడించిరి.

30. యావే ఆ పట్టణమును దానిని పాలించు రాజును యిస్రాయేలు వశముచేసెను. యిస్రాయేలీయులు అచటనున్న ప్రతి ప్రాణిని కత్తివాదరకు ఎర చేసిరి. కనుక ఎవరును తప్పించుకోలేదు. ఆ పట్టణపు రాజునకును యెరికో రాజునకు పట్టిన గతియేపట్టెను.

31. యెహోషువ తన అనుచరులతో లిబ్నా నుండి లాకీషుకు వచ్చి అచట దండు విడిచి పట్టణమును ముట్టడించెను.

32. యావే ఆ పట్టణమును యిస్రాయేలీయుల వశముచేయగా వారు రెండవ రోజున దానిని జయించిరి. లిబ్నా యందువలె లాకీషున కూడ ప్రతి ప్రాణిని కత్తివాదరకు ఎరచేసిరి.

33. గేసేరు రాజు హోరాము, లాకీషుకు తోడ్పడవచ్చెను. కాని యెహోషువ ఆ రాజును ససైన్యముగా మట్టుపెట్టెను. వారిలో ఒక్కరును మిగులలేదు.

34. యెహోషువ అతని అనుచరులు లాకీషు నుండి ఎగ్లోనునకు వెళ్ళి ఆ పట్టణమును ముట్టడించిరి.

35. ఆ రోజుననే పట్టణమును స్వాధీనము చేసికొని సర్వనాశనము చేసిరి. లాకీషునవలె అచట నున్న ప్రతిప్రాణియు శాపముపాలయ్యెను.

36. యెహోషువ అతని అనుచరులు ఎగ్లోను నుండి హెబ్రోనునకు వచ్చి ఆ పట్టణమును ముట్టడించిరి.

37. నగరమును స్వాధీనము చేసికొని రాజును, ప్రజలను, దాని అధీనములోనున్న గ్రామములను కత్తివాదరకు ఎరచేసిరి. ఎగ్లోనులోవలె హెబ్రోనున గూడ ఎవరిని మిగులనీయలేదు. పట్టణమును, అందు వసించు ప్రాణులను సర్వనాశనము చేసిరి.

38. యెహోషువ అనుచరులతో దెబీరునకు వచ్చి పట్టణమును ముట్టడించెను.

39. ఆ పట్టణమును, దానిని పాలించు రాజును, దాని అధీనముననున్న గ్రామములను వశముచేసికొని కత్తివాదరకు ఎర చేసెను. అందువసించు ప్రాణులన్నియు శాపము పాలయ్యెను. హెబ్రోనునకు పట్టిన గతియే మరియు లిబ్నాకును దాని రాజునకును పట్టినగతియే దెబీరునకు దాని రాజునకు కూడ పట్టెను.

40. ఈ రీతిగా యెహోషువ పీఠభూములను, దక్షిణ భూభాగములను, పల్లపునేలలను, మన్యపు నేలలను వానిని పాలించు రాజులను స్వాధీనము చేసికొనెను. యిస్రాయేలు దేవుడైన యావే ఆజ్ఞాపించినట్లే ఎవ్వరిని తప్పించుకోనీయకుండ అందరిని శాపము పాలుచేసెను.

41. కాదేషుబార్నెయా నుండి గాసా వరకు, గిబ్యోను వరకు గల గోషేను మండలమును యెహోషువ స్వాధీనము చేసికొనెను.

42. యావే యిస్రాయేలీయుల పక్షమున పోరాడెను గనుక యెహోషువ పైరాజులను వారి రాజ్యములను ఒక్క దండయాత్రలోనే జయించెను.

43. అటుపిమ్మట అతడు, అతని అనుచరులు గిల్గాలునందలి శిబిరమును చేరుకొనిరి.

1-3. హాసోరు రాజగు యాబీను యెహోషువ విజయమునుగూర్చి విని, మాడోను రాజగు యోబాబు నకు, షిమ్రోను రాజునకు, అక్షాపు రాజునకు, ఉత్తర దేశపు పీఠభూములందలి రాజులకు, కిన్నెరోత్తుకు దక్షిణమున నున్న లోయలోని రాజులకు, డోరుసీమకు ప్రక్క మన్యములలో పల్లములలో పరిపాలించు రాజులకు, తూర్పు పడమరలందు వసించు కనానీయులకు, పీఠభూములందు వసించు అమోరీయులకు, హివ్వీయులకు, పెరిస్సీయులకు, యెబూసీయులకు, మిస్ఫాయందలి హెర్మోనున వసించు హిత్తీయులకు కబురు పంపెను.

4. వారందరు తమ సైన్యములతో, రథములతో, గుఱ్ఱములతో సముద్రతీరమునందలి ఇసుక రేణువులవలె అసంఖ్యాకులుగా కదలివచ్చిరి.

5. ఆ రాజులందరు విడిది తావును నిర్ణయించుకొని మేరోము సరస్సునొద్ద దండు దిగి, యిస్రాయేలీయులతో పోరాడుటకు సంసిద్ధులైరి.

6. యావే యెహోషువతో “నీవు ఈ జనమును జూచి భయపడవలదు. రేపు ఈపాటికి వీరెల్లరు యిస్రాయేలీయుల చేతికి చిక్కిచత్తురు. నీవు వారి గుఱ్ఱముల గుదికాలి నరములు తెగగొట్టి వారి రథములను కాల్చివేయుదువు” అని చెప్పెను.

7. యెహోషువ అతని వీరులు మేరోము సరస్సు నొద్దకు వచ్చి అకస్మాత్తుగా శత్రువుల మీదపడిరి.

8. యావే వారిని యిప్రాయేలీయులకు అప్పగించెను. యిస్రాయేలీయులు శత్రువులను ఓడించి తరిమిరి. పెద్దసీదోను వరకు, పడమట మిస్రేఫోత్తుమాయీము వరకు, తూర్పున మిస్పాలోయ వరకు శత్రువులను తరిమికొట్టిరి. వారిలో ఒక్కరిని గూడ మిగులనీయకుండ అందరిని మట్టుపెట్టిరి.

9. యావే ఆజ్ఞాపించినట్లే యెహోషువ వారి గుఱ్ఱముల గుదికాలి నరములను తెగగొట్టి రథములను కాల్చి వేసెను.

10. అంతట యెహోషువ తిరిగివచ్చి హాసోరును జయించి దానిని ఏలు రాజును కత్తికి బలిచేసెను. పై రాజ్యములన్నిటికి పూర్వము హాసోరే రాజధాని.

11. వారు అచటి ప్రాణులనెల్ల శాపముపాలుచేసి వధించి నగరమును కాల్చివేసిరి.

12. యెహోషువ ఆ రాజనగరములను వానినేలు రాజులను ఓడించెను. దేవుని సేవకుడగు మోషే ఆజ్ఞాపించినట్లుగనే వారిని అందరను శాపముపాలు చేసి కత్తివాదరకెరచేసెను.

13. అయితే యెహోషువా హాసోరును కాల్చి వేసెను గాని, మెట్ట ప్రాంతములలో ఉన్న నగరములను వేనిని గూడ యిస్రాయేలీయులు కాల్చివేయలేదు.

14. ఈ నగరములనుండి వచ్చిన కొల్లసొమ్మును, పశువులను యిస్రాయేలీయులు చేకొనిరి. కాని అచటి జనులనందరిని కత్తివాదరకెరచేసి సర్వనాశనము చేసిరి. ఊపిరియున్న ప్రాణియేదియు మిగులలేదు.

15. యావే మోషేకిచ్చిన ఆజ్ఞలనెల్ల మోషే యెహోషువ కొసగెను. అతడు ఆ ఆజ్ఞలనన్నిటిని వీసమెత్తుకూడ మీరలేదు.

16. ఆ దేశమంతయు యెహోషువనకు స్వాధీనమయ్యెను. పీఠభూములు, దక్షిణసీమలు, గోషెను మండలము, పల్లపు నేలలు, ఎడారి, ఎగువనేలలు, దిగువనేలలన్నియు యెహోషువ వశమయ్యెను.

17. సెయీరు వైపుగా పోవు హాలాకు కొండల నుండి హెర్మోను కొండల క్రిందనున్న బాలాదు లోయ లోని లెబానోను వరకుగల రాజులందరిని జయించి వధించెను.

18. ఈ రాజులతో యెహోషువ చాల కాలము యుద్ధము చేసెను.

19. హివ్వీయుల గిబ్యోను నగరము తప్ప ఒక్కపట్టణము కూడా యిస్రాయేలీయులతో సంధిచేసికొనలేదు. ఆ పట్టణములన్నిటిని వారు యుద్ధమున జయించిరి.

20. ఈ ప్రజలందరు యిస్రాయేలీయులతో యుద్ధమునకు పూనుకొన చేయనెంచి యావే వారి గుండెలను రాయిచేసెను. ప్రభువు మోషేతో సెలవిచ్చినట్లు ఆ ప్రజలను కనికరింపక సర్వనాశనము చేయవలయుననియే యావే తలంపు.

21. తరువాత యెహోషువ పీఠభూముల నుండియు, హెబ్రోను, దెబీరు, ఆనాబు నగరముల నుండియు యూదా యిస్రాయేలు పీఠభూముల నుండి అనాకీయులనందరను తుడిచివేసెను. వారిని వారి పట్టణములను శాపముపాలు చేసెను.

22. గాజా, గాతు, ఆష్దోదులందు తప్ప యిస్రాయేలు దేశమున అనాకీయులలో ఒక్క పురుగైనను మిగులలేదు.

23. యావే మోషేతో సెలవిచ్చినట్లే యెహోషువ ఆ దేశమునంతటిని వశపరచుకొనెను. అతదు ఆ దేశమును యిస్రాయేలీయులకు తెగలవారిగా వారసత్వభూమిగా పంచియిచ్చెను. దానితో యుద్ధములు సమసిపోయి, దేశమున శాంతి నెలకొనెను.

1. యిస్రాయేలీయులు ఈ క్రింది రాజులను జయించి, వారి రాజ్యములను స్వాధీనము చేసికొనిరి. యోర్దానునకు ఆవలిప్రక్క తూర్పుదిశను, అర్నోను వాగునుండి హెర్మోను కొండవరకును, తూర్పున ఎడారి వరకును వారు జయించిన రాజుల పేరులివి:

2. హెష్బోనున వసించిన అమోరీయురాజు సీహోను. అతని రాజ్యము అర్నోను యేటి అంచుల నున్న అరోయేరునుండి అనగా ఆ యేటిలోయ మధ్య భాగమునుండి గిలాదు సగముభాగమును కలుపుకొని అమ్మోనీయుల సరిహద్దు యబ్బోకు నది వరకును వ్యాపించియుండెను.

3. ఇంకను ఆరబానుండి కిన్నెరోతు సరస్సు తూర్పువరకును, బేత్ యెషిమోతు దిశగా ఆరబా సముద్రము అనగా మృతసముద్రము వరకును, దక్షిణ దిక్కున పిస్గా కొండ చరియల దిగువనున్న బేత్ యెషిమోతు వరకును వ్యాపించియుండెను.

4. అష్దారోతున ఎద్రేయి నందు వసించుచుండిన రేఫా వంశీయుడైన బాషానురాజగు ఓగు.

5. అతడు హెర్మోను, సలేకా సీమలను, గెషూరీయుల, మాకాతీయుల సరిహద్దుల వరకును గల బాషాను సీమను, హెష్బోను రాజగు సీహోను రాజ్యము సరిహద్దు వరకును, సగము గిలాదు ప్రాంతమును పరిపాలించు చుండెను.

6. యావే సేవకుడుగు మోషే, యిప్రాయేలీయులు ఈ రాజులను జయించిరి. యావే సేవకుడుగు మోషే, ఆ రాజ్యములను రూబేను తెగవారికి, గాదు తెగ వారికి, మనష్షే అర్ధతెగవారికి ఇచ్చివేసెను.

7. యెహోషువ, యిస్రాయేలీయులు యోర్దానునకు పడమటి దిక్కున లెబానోను లోయలోని బాల్గాదు నుండి సేయీరువైపు సాగిపోవు హాలకు కొండవరకును పరిపాలించు రాజులను జయించిరి. ఆ రాజుల రాజ్యములను యెహోషువ యిస్రాయేలు తెగలవారికి పంచి యిచ్చెను.

8. పీఠభూములందు, పల్లపునేలలందు, ఆరబా కొండగుట్టలందు, ఎడారియందు, నేగెబునందుండిన హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిన్సీయులు, హివ్వీయులు, యెబూసీయులు మొదలగు జాతులవారి సీమలందు యెహోషువ జయించిన రాజుల పేరులివి:

9-24. యెరికో, బేతేలు వద్దగల హాయి, యెరూషలేము, హెబ్రోను, యార్మూతు, లాకీషు, ఎగ్లోను, గేసేరు, దెబీరు, గెదెరు, హార్మా, అరదు, లిబ్నా, అదుల్లాము, మక్కేడా, బేతేలు, తాప్పువా, హేఫేరు, ఆఫెకు, షారోను, మాదోను, హాసోరు, షిమ్రోను, ఆక్షపా, తానాకు, మెగిద్ధో, కెదేషు, కర్మెలులో యోక్నియాము, దోరు కొండ సీమలలోని దోరు, గిల్గాలులోని గొయ్యీము, తీర్సా అను నగరములను ఏలినరాజులు; వీరందరునుకలిసి ముప్పది యొక్కరు. ఈ రాజులు ఒక్కొక్క నగరమునకు ఒక్కొక్కరు చొప్పున జయింపబడిరి.

1. యెహోషువ యేండ్లు గడచి ముదుసలి అయ్యెను. యావే అతనితో “నీవు యేండ్లు గడచి ముదుసలివైతివి. ఇంకను జయింపవలసిన దేశములు చాల కలవు.

2. అవి ఏవనగా: ఫిలిస్తీయుల దేశము, గెషూరీయుల దేశము.

3. ఐగుప్తునకు తూర్పున ఉన్న షీహారు నది నుండి ఉత్తరమున ఎక్రోను సరిహద్దు వరకుగల కనానీయుల దేశము. గాజా, అష్దోదు, అష్కేలోను, గాతు, ఎక్రోను అను ఐదు ఫిలిస్తీయ మండలములు. దక్షిణముననున్న అవ్వీయుల దేశము.

4-5. సీదోనీయుల అధీనముననున్న ఆరా నుండి అమోరీయుల సరిహద్దగు అఫేకా వరకు గల కనానీయుల దేశము, లెబానోనునకు తూర్పున, హెర్మోను ప్రక్కన గల బాలాదు నుండి హమతు కనుమ వరకు గల గెబాలీయుల దేశము.

6. లెబానోను నుండి పడమరన మిస్రేఫోత్తు వరకు గల కొండసీమలలో వసించువారినందరను, నీదోనీయులనందరను, నేనే యిస్రాయేలీయుల కన్నుల యెదుటినుండి తరిమివేసెదను. నీవు మాత్రము నేనాజ్ఞాపించినట్లే ఈ నేలను వారసత్వభూమిగా యిస్రాయేలీయులకు పంచియిమ్ము.

7. తొమ్మిది తెగలకు, మనష్షే అర్ధతెగకు ఈ నేలను వారసత్వ భూమిగా పంచియిమ్ము.

8-9. రూబేను, గాదు తెగల వారికి యోర్దానునకు ఆవలివైపున తూర్పు దిక్కున మోషే వారికిచ్చిన నేల లభించెను. అర్నోను ఏటిలోయ అంచుల నున్న అరోయేరు మొదలుకొని, ఆ లోయ మధ్యనున్న పట్టణమునుండి దీబోను వరకు మేడెబా పీఠభూమి నంతయు,

10-12. అమ్మోనీయుల సరిహద్దుదాక హెష్బోనున పరిపాలనము చేసిన అమోరీయుల రాజైన సీహోను సమస్త పట్టణములు గిలాదు, గెషూరీయులయు, మాకాతీయులయు మండలములు, హెర్మోను కొండసీమలు, సలేకా బాషాను దేశమంతయు వారికే లభించెను. రేఫా వంశము వారిలో చివరివాడు మరియు అష్టారోతు, ఎద్రేయి నగరములందు పరిపాలనము చేసిన ఓగు రాజు రాజ్యము కూడ వారికే లభించెను. మోషే ఈ రాజులందరను ఓడించి వారి రాజ్యములను చేకొనెను.

13. అయినను యిస్రాయేలీయులు గెషూరీయులను, మాకాతీయులను పారద్రోలలేదు. కనుక ఆ జాతులవారు నేటికిని యిస్రాయేలీయుల నడుమ జీవించుచునే యున్నారు.

14. లేవీ తెగకు మాత్రము వారసత్వభూమి ఏమియు లభింపలేదు. యిస్రాయేలు దేవుడైన యావే సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు బలులే వారి వారసత్వము.

15. మోషే రూబేను తెగ వారికి వారివారి కుటుంబములను అనుసరించి వారసత్వభూమిని పంచియిచ్చెను.

16. వారికి వచ్చిన భాగము అర్నోను వాగు ఒడ్డుననున్న అరోయేరు నుండి పీఠభూముల లోని పట్టణముమీదుగా మేడెబా వరకు వ్యాపించి యుండెను.

17-21. హెబ్రోను పీఠభూములలోని దీబోను, బమోత్బాలు, బెత్బాల్ మెయోను, యాహసు, కెడెమోతు, మేఫాత్తు, కిర్యతాయిము, సిబ్మా కొండలలోని సేరెత్-షాహారు, బెత్పెయోరు, పిస్గా  కొండ పల్లములు, బెత్-యెషిమోతు పీఠభూమిలోని పట్టణములు, హెష్బోనున వసించు అమోరీయరాజు సీహోను రాజ్యము వారికే వచ్చెను. మోషే ఈ సీహోనును అతనితోపాటు మిద్యాను, ఎవి, రేకెము, సూరు, హూరు, రేబాలను గూడ జయించెను. వీరందరు సీహోనునకు సామంతులై ఆ దేశమున వసించెడివారు.

22. బేయోరు కుమారుడు సోదెగాడు బిలామును మిగిలినవారితోపాటు వధించిరి.

23. రూబేనీయుల భూమి యోర్దానువరకు వ్యాపించి యుండెను. పల్లెలతోను, పట్టణములతోను కలుపుకొని రూబేను వంశముల వారికి లభించిన వారసత్వ భూమియిదియే.

24-27. గాదు తెగకు వారి వారి కుటుంబముల ననుసరించి మోషే భూమి పంచియిచ్చెను. వారికి వచ్చిన భాగములివి: యాసేరు, గిలాదు పట్టణములు, రబ్బాకు తూర్పున అరోయేరు వరకు వ్యాపించిన అమ్మోనీయుల దేశమున సగభాగము, హెష్బోను నుండి రామత్మిస్పే వరకు బెటోనియము వరకుగల భాగములు, మహనాయీము నుండి లోడెబారు వరకు గల భాగములు, లోయలోని బెత్-హారాము, బెత్-నిమ్రా, సుక్కోతు, సాపోను, హెష్బోను రాజు సీహోను రాజ్యమున శేషించిన భాగములు.

28. వారికి పడమటి వైపున యోధాను, ఉత్తరమున కిన్నెరోతు సరస్సు క్రింది భాగములు ఎల్లలు.

29. మనష్షే అర్ధతెగ వారికి వారివారి కుటుంబముల ననుసరించి మోషే వారసత్వభూమిని పంచి ఇచ్చెను.

30. వారిభాగము మహనాయీము, బాషాను ఓగు రాజ్యము. బాషానునందలి యాయీరు మండలమున గల అరువది పట్టణములు.

31. గిలాదున సగము భాగము, బాషానున ఓగు రాజు రాజధానులగు అష్టారోతు, ఎద్రేయి మనష్షే కుమారుడు మాకీరు సంతతి వారికి వచ్చెను. ఈ భూములు మాకీరు సంతతి వారిలో సగము మందికి కుటుంబముల వారిగా సంక్రమించెను.

32. యెరికో ఎదురుగా యోర్దానునకు తూర్పున మోవాబు మైదానములో మోషే యిస్రాయేలు తెగల వారికి పంచి యిచ్చిన భూములివి.

33. కాని లేవీ తెగకు మాత్రము మోషే వారసత్వభూమిని ఈయ లేదు. యిస్రాయేలు దేవుడైన యావే ప్రభువే వారికి వారసత్వమని మోషే చెప్పెను.

1. యిస్రాయేలీయులకు కనాను దేశమున లభించిన వారసత్వభూములివి. యాజకుడగు ఎలియెజెరు, నూను కుమారుడగు యెహోషువ, యిస్రాయేలు తెగల పెద్దలు ఈ పంపిణి చేసిరి.

2. యావే మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు తొమ్మిది తెగలకు, పదియవ తెగ అర్ధభాగమునకు ఓట్లు వేసి వంతులవారిగా వారు పంపిణి చేసిరి.

3. యోర్దానుకు తూర్పుననున్న రెండున్నర తెగలకు మోషే ముందుగనే వారసత్వ భూమినిచ్చివేసెను. లేవీ తెగకు మాత్రము ఏ వారసత్వమును లేదు. యోసేపు కుమారులు మనష్షే, ఎఫ్రాయీము అని రెండు తెగలుగా నేర్పడిరి.

4. లేవీ తెగకు భూములేమియు సంక్రమింపలేదు. కాని వారు వసించుటకు కొన్ని పట్టణములు, మందలను మేపుకొనుటకు కొన్ని బయళ్ళు మాత్రము ఈయబడెను.

5. యావే మోషేకు ఆజ్ఞాపించినట్టుగనే యిస్రాయేలీయులు భూమిని పంచుకొనిరి.

6. యూదీయులు గిల్గాలుననున్న యెహోషువను చూడ వచ్చిరి. అపుడు యెఫున్నె కుమారుడును కెనిస్పీయుడునగు కాలేబు యెహోషువతో “కాదేషుభార్నెయా వద్ద యావే నిన్నును, నన్నును గూర్చి యావే సేవకుడైన మోషేతో ఏమి చెప్పెనో నీకు తెలియును గదా!

7. నాకు నలువదియేండ్ల ప్రాయములోనే యావే సేవకుడు మోషే కాదేషుబార్నెయో నుండి నన్నీ దేశమును వేగుచూచి రమ్మనిపంపెను. నేను చూచిన దానిని చూచినట్టు మోషేకు తెలిపితిని.

8. అపుడు నాతో వచ్చినవారు మన ప్రజలకు నిరుత్సాహము కలుగునట్లు మాట్లాడిరి. కాని నేను మాత్రము నీ దేవుడైన యావే చిత్తముచొప్పున నడుచుకొంటిని.

9. నాడే మోషే 'నీవు అడుగు పెట్టిన నేల నీకును నీ సంతతి వారికిని సదా వారసత్వభూమిగా లభించును. నీవు నా దేవుడైన యావే చిత్తముచొప్పున నడుచుకొంటివి' అని ప్రమాణముచేసెను.

10. ఆ వాగ్దానము ప్రకారము దేవుడింతకాలము నాకు ఆయువునిచ్చెను. నలువది ఐదేండ్లనాడు యిస్రాయేలీయులు ఎడారిలో ప్రయాణము చేయుకాలమున యావే మోషేతో ఈ వాగ్దానము చేసెను. ఇప్పుడు నాకు ఎనుబది ఐదేండ్లు,

11. నాడు మోషే పంపినపుడు ఉన్న జవసత్త్వములు నేటికిని ఉడిగిపోలేదు. నాటివలె నేడును శత్రువులతో పోరాడుటకు వారిని జయించుటకు సమర్థుడను.

12. కనుక యావే వాగ్దానముచేసిన ఆ కొండసీమలను నా కిచ్చి వేయుము. ఆ ప్రాంతమున అనాకీయులు నిండియున్నారనియు, అచటి పట్టణములు చాల పెద్దవనియు నీవును వినియేయున్నావు. ప్రభువు నాకు తోడ్పడినచో ఆ ప్రభువు సెలవిచ్చినట్లే వారిని జయింపగలను” అనెను.

13. యెహోషువ యెవున్నె కుమారుడగు కాలెబును దీవించి అతనికి హెబ్రోను సీమను వారసత్వభూమిగా ఇచ్చివేసెను.

14. కనుకనే నేటికిని ఆ సీమ కెనిస్సీయుడును, యెఫున్నె కుమారుడునగు కాలేబు అధీనముననే యున్నది. అతడు యిస్రాయేలు దేవుడగు యావే చిత్తముచొప్పున నడచుకొనినందులకు అది బహుమానము.

15. పూర్వము హెబ్రోను పేరు కిర్యతార్బా, అనాకీయులందరిలోను మహా ప్రసిద్ధుడు ఆర్బా. అటు పిమ్మట ఆ దేశమున యుద్ధములు సమసిపోయి శాంతినెలకొనెను.

1. యూదా తెగవారికి వారివారి కుటుంబముల ప్రకారముగా చీట్ల వలన వచ్చిన వారసత్వ భూమి ఎదోము సరిహద్దునగలదు. ఆ భూమి సీను ఎడారి నుండి దక్షిణమున కాదేషువరకు వ్యాపించియుండెను.

2-3. వారి దక్షిణపు సరిహద్దు మృతసముద్రము నొద్ద దక్షిణపు అఖాతము నుండి ప్రారంభమై అక్రిబీము శిఖరమునకు దక్షిణముగా సీను మీదుగా సాగిపోయెను. అచటినుండి కాదేషు బార్నెయాకు దక్షిణముగా వెడలిపోయి హెస్రోను మీదుగా ఆడ్డారు వరకు అచటి నుండి కార్కా వరకు సాగిపోయెను.

4. ఆ మీదట ఆస్మాను చుట్టుతిరిగి ఐగుప్తునది మీదుగా సముద్రము వరకు వచ్చెను. ఇది వారి దక్షిణపు సరిహద్దు.

5. వారి తూర్పు సరిహద్దు మృతసముద్రమును యోర్దాను నది కలియుచోటు వరకు ఉండెను.

6. ఉత్తర దిక్కున ఎల్ల యోర్దాను నది మృతసముద్రమును కలియు అఖాతమునొద్ద ప్రారంభమై బేత్-హోగ్లా మీదుగా బేతహరబ్బాకు ఉత్తరముగా సాగిపోయి, రూబేను కుమారుడు బోహాను పేరుమీదుగా పిలువబడు శిలవరకు వ్యాపించెను.

7. ఆ సరిహద్దు ఆకోరు లోయలోని దెబీరు వరకు పోయి, ఉత్తరదిక్కు మరలి ఆదుమ్మీము శిఖరమునకు ఎదుట నదికి దక్షిణముగా నున్న గిలాలుమీదుగా తిరిగి ఎన్-షెమెషు సరస్సు గుండ వచ్చి ఎన్-రోగేలు వద్ద ఆగిపోయెను.

8. అచటి నుండి బెన్-హీన్నోము లోయ మీదుగా యెరూషలేము లేక యెబూసీయుల కొండపల్లము వరకు వచ్చి పశ్చిమమున హిన్నోము లోయను అడ్డుపరచు కొండ శిఖరము వరకు పోయెను. ఈ శిఖరము రేఫాయీము లోయ ఉత్తరాగ్రమున ఉన్నది.

9. ఆ శిఖరము నుండి ఆ ఎల్ల నెఫ్తోవా సరస్సు వరకు వెడలిపోయి ఏఫ్రోను కొండపురములను దాటి అచటినుండి కిర్యత్యారీము లేక బాలా వైపునకు తిరిగెను. 

10-11. అచటినుండి ఆ సరిహద్దు సేయీరు కొండకు పడమటగా పోయి ఖేసలోను లేక యెయారీము కొండకు ఉత్తరముగా తిరిగి బేత్-షెమేషు తిమ్నాల మీదుగా దిగివెళ్ళి ఎక్రోను ఉత్తరమును జేరి షిక్కారోను వైపు మరలి బాలా కొండను దాటి యాబ్నీలు మీదుగా సముద్రము వరకు పోయెను.

12. వారి పడమటి ఎల్లయేమో మహా సముద్రమే. యూదా తెగలవారి కుటుంబములకు వచ్చిన నేలయిదియే.

13. యావే యెహోషువాను ఆజ్ఞాపించినట్లే యెఫున్నె కుమారుడగు కాలెబునకుగూడ యూదా తెగవారు ఆక్రమించుకొనిన నేలలో భాగమిచ్చిరి. అనాకీయుల ప్రధాననగరమగు కిర్యతార్బాను యెహోషువ కాలేబునకు ఇచ్చెను. ఇదియే నేటి హెబ్రోను.

14. అచటినుండి కాలేబు, అనాకు యొక్క ముగ్గురు కుమారులైన షేషయి, అహీమాను, తల్మాయి అను వారిని తరిమివేసెను.

15. అక్కడినుండి కాలెబు, దెబీరు నివాసులపై దండెత్తిపోయెను. ఈ పట్టణమునకు పూర్వనామము కిర్యత్సేఫేరు.

16. కాలేబు “కిర్యత్సేఫేరును ముట్టడించి దానిని పట్టుకొనిన వీరునకు నా కూతురు అక్సా నిచ్చి పెండ్లి చేసెదను” అనెను.

17. కాలేబు సోదరుడును కేనాసు కుమారుడగు ఒత్నీయేలు నగరమును ముట్టడించి పట్టుకొనెను. కాలేబు అతనికి అక్సా నిచ్చి వివాహము చేసెను.

18. ఆమె కాపురమునకు వచ్చినపుడు ఒత్నీయేలు “మీ తండ్రిని పొలము అడుగుము” అని ప్రేరేపించెను. ఆమె గాడిదమీద నుండి త్వరగా దిగి నిలుచుండెను. కాలేబు "తల్లీ! నీకేమి కావలయును?” అని అడిగెను.

19. అక్సా తండ్రితో “నాయనా! నాకు ఒక్కకోరిక తీర్చుము. నన్ను నేగేబు ఎడారి సీమకు వెడలగొట్టితివి గదా! ఇక నీటి బుగ్గలు గల నేలనైనను ఇప్పింపుము” అనెను. కాలేబు కుమార్తెకు ఎగువ నీటిబుగ్గలను, దిగువ నీటిబుగ్గలను ఇచ్చివేసెను.

20. యూదా తెగల వారికి వారివారి కుటుంబముల ప్రకారము సంక్రమించిన వారసత్వభూమి యిదియే.

21-32. ఎడారిలోని ఎదోము వైపునగల యూదా వంశీయుల దూర నగరములివి: కబ్సేలు, ఎదేరు, యాగురు, కీనా, దిమోను, ఆదదా, కేదేషు, హాసోరు, ఈత్నాను, సీపు, తేలెము, బెయాలోతు, హాసోరు-హడట్టా, కెర్యోతు-హెస్రోను లేక హాసోరు, ఆమాము, షేమా, మోలదా, హాసార్-గడ్డా, హెష్మోను, బేత్-పాలేతు, హాసార్-షువాల్, బేర్షెబా మరియు బిసియోతియా, బాలా ఇయీము, ఏసేము, ఎల్తోలదు, కేసీలు, హోర్మా, సీక్లగు, మద్మానా, సన్సానా, లెబావోతు, షిల్హీము, ఆయిన్, రిమ్మోను. ఈ పట్టణములన్నియు పల్లెలతో కలసి ఇరువది తొమ్మిది.

33-36. పల్లపు నేలలలోని పట్టణములివి: ఏష్టవోలు, సోరా, ఆష్నా, సానోవా, ఎన్-గన్నీము, తప్పూవా, ఏనాము, యార్మూతు, అదుల్లాము, సోకో, అసేకా, షారాయీము, అదితాయీము, గెదెరా. గదెరోయీతాము. ఇవి అన్నియు వాటి పల్లెలతో కలసి పదునాలుగు పట్టణములు.

37-41. సేనాను, హదాషా, మిగ్ధాల్గ్-గాదు, దిలాను, మిస్పె, యోక్తీలు, లాకీషు, బోస్కాతు, ఎగ్లోను. కాబ్బోను, లాహ్మాసు, కిత్లీషు, గదెరోతు, బేత్-దగోను, నామా, మక్కేడా. ఇవన్నియు వాటి పల్లెలతో కలిసి పదునారు పట్టణములు.

42-44. లిబ్నా, ఏతేరు, ఆషాను, ఇఫ్తా, ఆస్నా, నేసీబు, కెయిలా, ఆక్సీబు, మరేషా. ఇవన్నియు వానివాని పల్లెలతో జేరి తొమ్మిది పట్టణములు.

45-47. చుట్టుపట్లగల పల్లెలతో పట్టణములతో జేరి ఎక్రోను, ఎక్రోను నుండి సముద్రము వరకును, అష్దోదు వరకును గల పల్లెలు. చుట్టుపట్లగల పల్లెలతో పట్టణములతో చేరి అష్దోదు, చుట్టుపట్లగల పల్లెలతో పట్టణములతో ఐగుప్తునదివరకును గల గాజా. మహా సముద్రమే వీనికన్నిటికి సరిహద్దు.

48-57. పీఠభూములలోని పట్టణములివి: షామీరు, యాత్తీరు, సోకో, దానా, కిర్యత్-సాన్నా లేక దెబీరు, ఆనబు, ఎస్తమో, ఆనీము, గోషెను, హోలోను, గీలో. ఇవియన్నియు వానివాని పల్లెలతో జేరి పదునొకండు పట్టణములు. ఆరబు, రూమా లేక దూమా, ఏషాను, యానీము, బేత్-తపూవా, అఫేకా, హుమ్తా, కిర్యత్బాలు లేక నేటి హెబ్రోను, సియోరు. ఇవి యన్నియు వానివాని పల్లెలతోగూడి తొమ్మిది పట్టణములు. మావోను, కర్మెలు, సీపు, యుత్తా, ఎస్రేయేలు, యోక్దేయాము, సనోవా, కయీను, గిబియా మరియు తిమ్నా-వానివాని పల్లెలతో కలసి పది పట్టణములు.

58-59. హల్హులు, బేత్-సూరు, గెదోరు, మారతు, బేత్-అనోతు, ఎల్తేకోను వానివాని పల్లెలతో జేరి ఆరు పట్టణములు. తేకోవా, ఏప్రతా లేక నేటి బేత్లెహేము, పెయోరు, ఏతాము, కులోను, తాతాము, సోరెసు, కారెము, గల్లీము, బేతేరు, మనాకా వాని వాని పల్లెలతో చేరి పదునొకండు పట్టణములు'.

60. కిర్యత్బాలు లేక నేటి కిర్యాత్యారీము, రబ్బా వాని వాని పల్లెలతో జేరి రెండు పట్టణములు.

61-62. ఎడారి సీమయందు బేత్-అరబా, మిద్దీను, సెకాకా, నిబ్షాను, యీరె-మెల్లాహు, ఎన్-గెదీ వానివాని పల్లెలతోగూడి ఆరు పట్టణములు.

63. కాని యూదా తెగవారు యెరూషలేమున వసించు యెబూసీయులను వెడలగొట్టలేకపోయిరి. యెబూసీయులు నాటినుండి నేటివరకు యూదీయులతో పాటు యెరూషలేముననే వసించుచున్నారు.

1. చీట్లు వేయగా యోసేపు తెగవారికి వచ్చిన వంతుగా యోర్దాను నుండి యెరికో జలముల వరకు తూర్పు వైపుగల నేల లభించెను. వారి సరిహద్దు యెరికో నుండి పీఠభూముల మీదుగా బేతేలు పీఠ భూముల వరకు వ్యాపించెను.

2. అచటినుండి బేతేలు లూసు మీదుగా అటారోతు చెంతగల ఆర్కి వరకు వ్యాపించెను.

3. అచటినుండి క్రిందివైపుగా, పడమటి వైపుగాపోయి యాఫ్లెతీయుల దిగువనున్న బేత్-హోరోను వరకును, గేసేరు వరకును వ్యాపించి సముద్రమును చేరెను.

4. యోసేపు కుమారులైన మనష్షే, ఎఫ్రాయీములకు లభించిన వారసత్వభూమి యిదియే.

5. ఎఫ్రాయీము తెగవారికి వంశముల ప్రకారము లభించిన వారసత్వభూమి తూర్పు సరిహద్దు అటారోతు -అద్దారు వరకు, ఎగువన బేత్-హోరోను వరకును వ్యాపించి సముద్రమును చేరెను.

6. ఉత్తరమున మిక్మేతాతు వరకును వ్యాపించెను. అక్కడి నుండి తూర్పు నకు తిరిగి తానాత్-షిలో వరకును, యానోవా వరకును వ్యాపించెను.

7. అచటినుండి దిగువకు మరలి అటారోతు, నారాల వరకు పోయి యెరికో మీదుగా వచ్చి యోర్దాను చేరెను.

8-9. ఆ సరిహద్దు తాపువా మీదుగా పడమటికి తిరిగి కానా వాగుమీదుగా సముద్రమును చేరెను. ఎఫ్రాయీము తెగ వారికి వారివారి కుటుంబములను అనుసరించి వచ్చిన వారసత్వభూమి యిదియే. మనష్షే తెగవారికి లభించిన వారసత్వ భూమియందును ఎఫ్రాయీమీయులకు ఈయబడిన పట్టణములు, పల్లెలు కలవు.

10. ఎఫ్రాయీము జనులు గేసేరున వసించు కనానీయులను వెడలగొట్ట లేకపోయిరి. కనుక వారు నేటికిని ఎఫ్రాయీమీయులతో వసించుచున్నారు. అయినను వీరు వారిచేత వెట్టి చాకిరి చేయించుకొనిరి.

1. యోసేపు జ్యేష్ఠపుత్రుడు మనష్షే అతనికి లభించిన భూమి యిది: మనష్షే జ్యేష్ఠపుత్రుడు మాకీరు పోరాటవీరుడు కనుక అతనికి గిలాదు, బాషాను మండలములు లభించెను.

2. మనష్షే ఇతర కుమారులకు వారివారి కుటుంబములను అనుసరించి భూములిచ్చిరి. వారు అబియెజెరు, హేలేకు, ఆస్రియేలు, షెకెము, హేఫేరు, మెమిదా. వీరందరు యోసేపు కుమారుడు మనష్షే పుట్టిన కుమారులు.

3. మనష్షే కుమారుడు మాకీరు. అతని కుమారుడు గిలాదు. గిలాదు కుమారుడైన హేఫేరు కుమారుడగు సేలోఫెహాదునకు కుమార్తెలు మాత్రమే కలరు. వారి పేర్లు మహ్లా, నోవా, హోగ్లా, మిల్కా, తీర్సా.

4. వీరందరు నూను కుమారుడు యెహోషువను, యాజకుడగు ఎలియెజెరును, ప్రజల పెద్దలను సమీపించి “మా బంధువులతో పాటు మాకును భాగము ఈయవలెనని యావే మోషేకు ఆజ్ఞయిచ్చెను గదా!" అనిరి. కనుక యావే ఆజ్ఞను అనుసరించి ఆ ఆడుపడుచులకు వారి పినతండ్రులతో పాటు భూములను పంచియిచ్చిరి.

5. ఈ రీతిగా యోర్దానునకు ఆవలనున్న గిలాదు, బాషాను మండలములు కాక మనకు పదివంతులు అదనముగా వచ్చెను.

6. ఏలయనగా, మనష్షే కుమార్తెలు అతని కొడుకులతో పాటు భాగములు పంచుకొనిరి. గిలాదు మనష్షే కుమారులకు సంక్రమించెను.

7. మనష్షే వచ్చిన భాగమునకు సరిహద్దు ఆషేరు వైపున షెకెమునకు ఎదురుగా నున్న మిక్మేతాతు వరకుపోయి అచటినుండి దక్షిణమున తాపువా చెలమ చెంతగల యాషీబు వరకు వ్యాపించెను.

8. తాపువా మండలము మనష్షేది. కాని తాపువా పట్టణము మాత్రము మనష్షే మండలము సరిహద్దున ఉన్నందున ఎఫ్రాయీమీయులకు చెంది యుండెను.

9. ఆ సరిహద్దు దిగువవైపున కానా ఏటివరకు పోయి సముద్రము చేరెను. ఈ ఏటికి దక్షిణమున ఎఫ్రాయీము పట్టణములు కలవు. ఇవిగాక మనష్షే పట్టణములందు ఎఫ్రాయీము ప్రజలకు కొన్ని నగరములు కలవు. మనష్షే తెగవారి భూమి ఈ ఏటికి ఉత్తరమున సముద్రము వరకు వ్యాపించి ఉన్నది.

10. ఈ రీతిగా దక్షిణమున ఎఫ్రాయీము, ఉత్తరమున మనష్షే ఉండిరి. వారిమధ్య సరిహద్దు సముద్రము వరకు ఉండెను. వారికి ఉత్తరమున ఆషేరు, తూర్పున యిస్సాఖారు కలరు.

11. యిస్సాఖారు, ఆషేరు మండలములలో మనష్షేనకు పట్టణములు కలవు. బేత్-షెయాను దాని పల్లెలు, ఈబ్లెయాము దాని పల్లెలు, దోరు, ఎన్-దోరు వాని పల్లెలు, తానాకు, మెగిద్ధో వాని పల్లెలు, నెఫేత్తు మూడవవంతు మనష్షేవి.

12. కాని మనష్షే ఈ పట్టణములను ఆక్రమించుకోలేదు. కనానీయులే వానినేలిరి.

13. కాని యిస్రాయేలీయులు బలవంతులైన కొలది కనానీయులను పూర్తిగా వెళ్ళగొట్టలేక పోయినను వారిచేత వెట్టిచాకిరి చేయించుకొనిరి.

14. యోసేపు సంతతివారు యెహోషువతో “నీవు మాకు ఒక్కభాగమే ఇచ్చితివిగదా! యావే దీవెనవలన మేము చాలమందిమైతిమి” అనిరి.

15. యెహోషువ వారితో “మీరు చాల మందియైనచో ఎఫ్రాయీము పీఠభూములు మీకు చాలనిచో, అరణ్య ప్రాంతమునకు పొండు. పెరిస్సీయులు, రేఫీయులు వసించు దేశములోని అడవులను నరికివేసి ఆ నేలను ఆక్రమించుకొనుడు” అని చెప్పెను.

16. యోసేపు సంతతివారు “ఈ పీఠభూమి మాకు చాలదు. ఈ మైదానమున వసించు కనానీయులందరకు ఇనుపరథములు కలవు. అట్లే బేత్-షెయానుకు, దాని ఏలుబడిలోనున్న పట్టణములకు, యెస్రెయేలు మైదానములోనున్న వారికి ఇనుప రథములున్నవి” అనిరి.

17-18. కనుక యెహోషువ యోసేపు సంతతివారగు ఎఫ్రాయీము, మనలతో “మీరు చాలమంది అయితిరి. చాల బలవంతులు కూడ. మీకు ఒక్క భాగము చాలదు. కనుక ఈ పర్వతసీమను ఆక్రమించుకొనుడు. దానిని ఆవరించియున్న అడవులను నరికివేయుడు. ఈ సీమయెల్లలే మీ యెల్లలు. ఇచటి కనానీయులు బలవంతులైనను, ఇనుపరథములు ఉపయోగించుచున్నను మీరు వారిని వెడలగొట్టగలరు.” అని చెప్పెను.

1. యిస్రాయేలీయులందరు షిలో వద్ద ప్రోగై సమావేశపు గుడారమును నెలకొల్పిరి. వారు అప్పటికే తమ నేలనంతటిని స్వాధీనము చేసికొనిరి.

2. అయినను యిస్రాయేలీయులలో ఏడుతెగలవారికి ఇంకను వారసత్వభూమి లభింపలేదు.

3. యెహోషువ వారితో “మన పితరులదేవుడైన యావే మీకు అను గ్రహించిన భూమిని స్వాధీనముచేసికొనకుండ ఇంకను ఎంతకాలము జాగుచేసెదరు?

4. ఒక్కొక్క తెగనుండి ముగ్గురు మనుష్యులను ఎన్నుకొనుడు. వారు ఈ నేల నాలుగుచెరగులు పరిశీలించి దానిని ఎట్లు విభజింపవలెనో నిశ్చయించి నా యొద్దకు వచ్చెదరు.

5. వారు ఈ భూమిని ఏడుభాగములుగా విభజింపవలెను. యూదా తెగవారు దక్షిణ భాగమున, యోసేపు తెగ వారు ఉత్తరభాగమున ఉందురు.

6. మీరు ఈ నేలను పరిశీలించి, ఏడుముక్కలుగా విభజించి నాకు వర్తమానము కొనిరండు. నేను ప్రభువు ఎదుట మీకు వంతుచీట్లు వేసెదను.

7. లేవీయులకు మీతోపాటు భాగము లేదు. యావే యాజకులుగా పనిచేయుటయే వారి వారసత్వము. గాదు, రూబేను, మనష్షే అర్ధ తెగవారు యోర్దానునకు ఆవలి దరిని, తూర్పువైపున తమ వారసత్వభూమిని గైకొనిరి. యావే సేవకుడైన మోషే వారికి ఆ భాగమునిచ్చెను” అనెను.

8. అంతట ఆ మనుష్యులు లేచి పయనమైరి, యెహోషువ వారితో “మీరు వెడలిపోయి ఈ దేశము గుండ నడచి, నేలను పరిశీలించి దాని వివరములను వ్రాసి నా యొద్దకురండు. నేను షిలోవద్దనే యావే ఎదుట మీకు చీట్ల ప్రకారము వంతులు వేసెదను” అని చెప్పెను. 

9. ఆ మనుష్యులు వెడలిపోయి నేల నాలుగు ప్రక్కలు గాలించి అందలి పట్టణములన్నిటిని ఏడు పట్టికలుగా వ్రాసి షిలో వద్ద విడిది చేయుచున్న యెహోషువ చెంతకు కొనివచ్చిరి.

10. అతడు షిలో యందే యావే ఎదుట వంతులువేసి యిస్రాయేలీయులలో ఆయా తెగలవారికి భూములు పంచియిచ్చెను.

11. వంతులు వేయగా చీటి చొప్పున వచ్చిన మొదటి వంతు బెన్యామీను కుటుంబములకు లభించెను. వారి భాగము యూదా, యోసేపు తెగలవారి భాగములకు మధ్యనుండెను.

12. వారి ఉత్తరపు సరిహద్దు యోర్దాను నుండి ప్రారంభమై యెరికో ఉత్తరభాగము మీదుగా పోయి పడమటనున్న పీఠభూములను దాటి బెతావెను అరణ్యమును చేరెను.

13. అక్కడి నుండి దక్షిణముగా పోయి లూసు లేక నేటి బేతేలును చేరెను. అక్కడి నుండి క్రిందికి పోయి దిగువనున్న బేత్-హోరోను దక్షిణమునగల కొండమీది అటారోతు-అడ్డారును సమీపించెను.

14. అక్కడినుండి ఆ సరిహద్దు వంకర తిరిగి పడమరగా దక్షిణమునకు మరలి బేత్-హోరోనుకు దక్షిణమున నున్న కొండ వద్దగల కిర్యత్బాలు చెంత ముగిసెను. ఈ కిర్యత్బాలు నగరమే నేడు యూదీయుల అధీనముననున్న కిర్యత్యారీము పట్టణము. ఇది వారి పడమటి సరిహద్దు.

15-16. ఆ సరిహద్దు దక్షిణమున కిర్యత్యారీము నుండి (గాసీను చేరి,) నెఫ్తోవా సరస్సును దాటి, రేఫాయీము మైదానమునకు ఉత్తరమున బెహెన్నోము లోయకు ఎదుటనున్న కొండ దాపునజేరి, యెబూసీయుల సీమకు దక్షిణముననున్న హిన్నోము లోయజొచ్చి, ఎన్-రోగేలు చేరెను.

17-19. అక్కడి నుండి ఉత్తరముగా వంకదిరిగి ఎన్-షెమేషు చేరి, అదుమ్మీము శిఖరమునకు అభిముఖముగాను గిల్గాదు చేరెను. రూబేను కుమారుడు బోహాను శిల వరకును క్రిందికి దిగి బేత్-హరాబా ఉత్తర అంచున ఉన్న కెటేపు చేరి బేత్-హోగ్లా ఉత్తరాంచున సరిహద్దు చుట్టి, ఉప్పు సముద్రపు ఉత్తర అఖాతమునొద్ద యోర్దానుకు దక్షిణాగ్రమున ఆగిపోయెను. ఇది వారి దక్షిణపు సరిహద్దు. యోర్దానే తూర్పు సరిహద్దు.

20. ఈ ఎల్లలలో గల నేలయే బెన్యామీనీయుల వారసత్వ భూమి.

21-28. వారివారి కుటుంబముల ననుసరించి బెన్యామీను తెగలవారి పట్టణములు ఇవి: యెరికో, బేత్-హోగ్లా, ఏమెక్కేసీసు, బేత్-అరబ్బా,సేమరాయీము, బేతేలు, అవ్వీము, పారా, ఓఫ్రా, కేఫరమ్నోని, ఓఫ్ని, గేబా-ఇవియన్నియు వానివాని పల్లెలతో కూడి పండ్రెండు పట్టణములు. గిబ్యోను, రామా, బేరోత్తు, మీస్పే, కేఫీరా, మోసా, రేకెము, ఇర్పీలు, తరల, సేలా ఏలెపు, యెరూషలేము, గిబియా, కిర్యతు వానివాని పల్లెలతో కలసి ఇవియన్నియు పదునాలుగు పట్టణములు. వారివారి కుటుంబములతో కలసి బెన్యామీను తెగ వారికి లభించిన వారసత్వభూమి యిదియే.

1. చీట్లు వేయగా వచ్చిన రెండవవంతు చీటి షిమ్యోను కుటుంబముల వారికి లభించేను. వారి వంతు భూమి యూదీయుల వారసత్వభూమి మధ్య నుండెను.

2-6. వారికి లభించిన పట్టణములు బేర్షెబా, షేబ, మోలడా, హాసారు-షువాలు, బాలా, ఏజెము, ఏల్తోలాదు, బేతూలు, హోర్మా, సిక్లగు, బేత్-మార్కబోతు, హాసారు-సూసా, బేత్-లెబావోతు, షారుహేను వానివాని పల్లెలతో కూడి మొత్తము పదుమూడు నగరములు.

7. అలాగే ఆయిన్, రెమ్మోను, ఏతేరు, ఆషాను వానివాని పల్లెలతో గూడి నాలుగు నగరములు.

8. వీనితో పాటు బాలత్-బేయేరు వరకు నేగెబురామా వరకు వ్యాపించియున్న పల్లెలు అన్నియు వారివే.

9. షిమ్యోను కుటుంబముల వారికి లభించిన వారసత్వభూమి ఇదియే. యూదా తెగవారికి లభించిన భాగము చాల పెద్దది. కనుక షిమ్యోను వారస భూమి యూదా నుండే పంపిణీచేయబడెను. కనుకనే షిమ్యోను తెగకు వచ్చిన వంతు యూదా వారసత్వభూమి మధ్య నున్నది.

10. ఓట్లు వేయగా వచ్చిన మూడవ చీటి సెబూలూను తెగకు లభించెను. వారి నేల సరీదు వరకు వ్యాపించెను.

11. వారి సరిహద్దు తూర్పు వైపున మరాలతు వరకును పోయి దబ్బెషేత్తును యోక్నెయామునకు ఎదుటనున్న వాగును దాటెను.

12. తూర్పు వైపున ఆ సరిహద్దు సరీదు నుండి ఖిస్లోత్తు-తాబోరు వరకు అక్కడి నుండి దాబ్రత్తు వరకును యాఫియా వరకు వ్యాపించెను.

13. అక్కడి నుండి తూర్పుగా బోయి గత్-హెఫెరు ఎత్కాకాసీను చేరెను. అక్కడి నుండి రిమ్మోను దాటిపోయి నేయా చేరెను.

14. ఉత్తరమున హన్నతోను వైపు వంగి యిఫ్తాయేలు మైదానము చేరెను.

15. పైగా కత్తాతు, నహలాలు, షిమ్రోను, ఇదలా, బేత్లెహేము అను పన్నెండు పట్టణములు వాని పల్లెలు వారివే.

16. ఈ పట్టణములు వాని పల్లెలు సెబూలూను తెగవారి వారసత్వభూమి లోనివే.

17. చీట్లు వేయగా నాలుగవవంతు చీటి యిస్సాఖారు తెగవారు పొందిరి.

18. వారి మండలము యెస్రెయేలు వరకు వ్యాపించెను. 

19-21. కేసుల్లోతు, షూనెము, హాఫరాయీము, షియోను, అనహారతు, రబ్బీతు, కిషియోను, ఏబేసు, రేమేతు, ఎన్గన్నీము, ఎన్హద్దా, బెత్పాసేసు నగరములు వారివే.

22. వారి సరిహద్దు తాబోరు మీదుగా పోయి షహసుమా, బేత్- షెమేషు దాటి యోర్దాను చేరెను. అవి యన్నియు వానివాని పల్లెలతో జేరి పదునారు నగరములు.

23. ఈ నగరములు పల్లెలు వారివారి కుటుంబముల ప్రకారము యిస్సాఖారు తెగలకు చెందినవి.

24. చీట్లువేయగా ఐదవవంతు ఆషేరు తెగవారు పొందిరి.

25-26. హెల్కాత్తు, హాలి, బేతెను, అక్షాపు, అల్లమ్మేలెకు, ఆమదు, మిషాలు వారి మండలము లోనివే. పడమట కర్మేలు, లిబ్నాత్తు ఎల్లలు.

27. వారి సరిహద్దు తూర్పువైపున బేత్-దాగోను వరకు పోయి, సెబూలూను చేరి, ఉత్తరమున ఇఫ్తాయేలు లోయచొచ్చి, అటుమీద బెతేమెకు, నెయీయేలుచేరి, ఉత్తరమున కాబూలు వరకును పోయెను.

28. ఎబ్రోను, రేహోబు, హమ్మోను, కానా కలుపుకొని పెద్దసీదోను వరకు పోయెను.

29. ఆ సరిహద్దు అక్కడి నుండి వెనుకకు తిరిగి రామా చేరి తూరు, హాషా దుర్గములను కలుపుకొని సముద్రము చేరెను. మహలబు, అక్సీబు, ఉమ్మ, ఆఫెకు, రహోబు అను ఇరువది రెండు పట్టణములను వారి పల్లెలను గూడ కలుపుకొనెను.

30-31. ఈ పట్టణములు పల్లెలు ఆషేరు తెగకు చెందినవే.

32. చీట్లు వేయగా ఆరవ వంతు చీటి నఫ్తాలి తెగలవారు పొందిరి.

33. వారి మండలము హెరేపు నుండి సనాన్నీము సింధూరము మీదుగా ఆదమీ నేగెబు చేరి యాబ్నీలు నందలి లాక్కూము వరకు పోయి యోర్దాను చేరెను.

34. వారి పడమటి సరిహద్దు ఆస్నోత్తు తాబోరు మీదుగా, హక్కోకు మీదుగా పోయి దక్షిణమున సెబూలూనును, పడమట ఆషేరును, తూర్పున యోర్దానును చేరెను.

35-38. వారి రక్షితపట్టణములు సిద్దీము, సేరు, హమ్మతు, రక్కాత్తు, కిన్నెరెతు, ఆదమా, రామా, హాసోరు, కేదేషు, ఎద్రెయి, ఎన్-హాసోరు, యిరోను, మిగ్ధావేలు, హోరెము, బేత్-అనాతు, బేత్-షెమేషు అనునవి వానివాని పల్లెలతో పాటు పందొమ్మిది

39. ఈ పట్టణములు, పల్లెలు వారివారి పట్టణముల ననుసరించి నఫ్తాలి తెగకు చెందినవి.

40. చీట్లు వేయగా ఏడవవంతు చీటి దానుతెగ వారు పొందిరి.

41-46. సోరా, ఏష్టవోలు, ఈర్షెమేషు, షాలబీను, అయ్యాలోను, ఈత్లా, ఏలోను, తిమ్నా, ఏక్రోను, ఎల్తేకే, గిబ్బెతోను, బాలతు, యెహూదా, బెన్బేరెకు, గాత్రిమ్మోను, మెయార్కోను, యెప్పా వైపుగల నేలతోపాటు రక్కోను వారి మండలముననే కలవు.

47. దానీయులు వారి భూభాగము కోల్పోవుటచే, ఆ తెగవారు బయలుదేరి లేషేము మీద యుద్ధము చేసి, దానిని పట్టుకొని కొల్లగొట్టి, స్వాధీన పరుచుకొని దానిలో వసించి తమ వంశకర్తయగు దాను పేరు మీదుగా ఆ నగరమునకు దాను అని పేరు పెట్టిరి

48. ఈ పట్టణములు పల్లెలు వారివారి కుటుంబముల ననుసరించి దానుతెగకు చెందినవి.

49. ఇంతటితో వంతులువేసి నేలను పంచుకొనుట ముగిసెను. నూను కుమారుడు యెహోషువకు కూడ యిస్రాయేలీయులు తమతోపాటు వారసత్యము నిచ్చిరి.

50. యెహోషువ ఎఫ్రాయీము పీఠభూములలోని తిమ్నాత్-సెరా పట్టణమునడుగగా, యావే ఆజ్ఞ చొప్పున ఆ నగరమును అతనికిచ్చివేసిరి. యెహోషువ పట్టణమును మరల నిర్మించి దానియందు వసించెను.

51. షిలో నగరమున యావే ఎదుట సమావేశపు గుడారము గుమ్మమునొద్ద యాజకుడైన ఎలియెజెరు, నూను కుమారుడగు యెహోషువ, ఆయా కుటుంబముల పెద్దలు కలసి వంతులువేసి యిస్రాయేలు తెగలకు పంచియిచ్చిన వారసత్వభూములివియే. ఈ రీతిగా భూవిభజన ముగిసెను.

1-2. ఆ తదుపరి యావే యెహోషువతో “నీవు యిస్రాయేలీయులతో ఆశ్రయపట్టణములను ఎన్నుకొనుమని చెప్పుము. నేను ముందుగనే ఈ సంగతి మోషే ద్వారా తెలియజేసితిని.

3. తెలియకయే పొరపాటున ఎవరినైన చంపినచో, వారు ఈ పట్టణములలో తలదాచుకోవచ్చును. పగతీర్చుకోగోరిన వారినుండి ఈ నగరములు రక్షణ కల్పించును.

4. ఇతరులను చంపినవాడు ఈ పట్టణములలో శరణు పొందవచ్చును. అతడు మొదట నగరద్వారమువద్ద నిలిచి పెద్దలకు తన సంగతి తెలుపవలెను. వారతనిని నగరమునకు తోడ్కొనిపోయి, ఉండుటకు వసతినీయవలెను.

5. పగతీర్చుకోగోరిన హతుని తరుపు వారు హంతకుని వెన్నాడివత్తురేని మీరతనిని పట్టి ఈయరాదు. అతడు పగపట్టి చంపవలెనని తలంపకయే, అనుకోకుండ పొరుగువానిని చంపి వచ్చెనుగదా!

6. అట్లు పారివచ్చిన హంత నగర సమాజము తనకు తీర్పు చెప్పువరకును, తాను వచ్చినపుడు పదవిలో నున్న ప్రధానయాజకుడు మరణించు వరకును, ఆశ్రయ నగరముననే ఉండవలెను. అటు పిమ్మటగాని అతడు స్వీయనగరమునందలి తన ఇంటికి పయనమై పోరాదు” అని పలికెను,

7. కనుక నఫ్తాలి పర్వతసీమయందలి గలలీలోని కేదేషు, ఎఫ్రాయీము మన్నెములోని షెకెము, యూదా కొండ సీమలోని కిర్యతార్బా అనబడిన హెబ్రోను నగరములను ఆశ్రయపట్టణములుగా నిర్ణయించిరి.

8. యోర్దానునకు ఆవల యెరికోకు తూర్పు వైపుననున్న ఎడారి పీఠభూములలోని రూబేను తెగలో బేసేరును, గాదు తెగలో రామోత్-గిలాదును, మనష్షే తెగలో బాషాను మండలపు గోలానును ఆశ్రయపట్టణములుగా నిర్ణయించిరి.

9. యిస్రాయేలీయులుగాని, వారితో జీవించుచున్న అన్యదేశీయులు గాని ఎవరినైనను తెలియక పొరపాటున చంపినపుడు ఈ నగరములలో శరణు పొందవచ్చును. నగర సమాజముల నుండి తీర్పు పొందువరకు పగ తీర్చుకోగోరిన హతునివైపు వారి నుండి తప్పించుకోవచ్చును.

1-2. ఆ పిమ్మట యాజకుడైన ఎలియెజెరు, నూను కుమారుడగు యెహోషువ, యిస్రాయేలు ప్రజల పెద్దలు కనాను మండలములోని షిలో నగరమున నుండగా లేవీయుల పెద్దలు వారలయొద్దకు వచ్చి “మేము నివసించుటకు పట్టణములను, మా గొడ్లను మేపుకొనుటకు గడ్డి బీళ్ళను ఈయవలెనని యావే మోషే ద్వారా ఆజ్ఞాపించెను గదా?” అని అడిగిరి.

3. కనుక యావే ఆజ్ఞ చొప్పున యిస్రాయేలీయులు తమతమ వారసత్వభూముల నుండి ఆయా పట్టణములను, వాని నంటియున్న గడ్డి బీళ్ళను లేవీయులకు ఇచ్చివేసిరి.

4. లేవీయులలో ఒక వంశమువారగు కోహతీయులకు చీట్ల చొప్పున మొదట వంతులువేసిరి. అటుల అహరోను పుత్రులైన లేవీయులకు యూదా, షిమ్యోను, బెన్యామీను తెగలవారి నుండి పదుమూడు పట్టణములు వచ్చెను.

5. మిగిలిన కోహతీయులకు ఎఫ్రాయీము, దాను తెగల నుండి మనష్షే అర్థతెగ నుండి కుటుంబముల వరుసన పది పట్టణములు లభించెను.

6. యిస్సాఖారు, ఆషేరు, నఫ్తాలి తెగలనుండి, బాషానునందలి మనష్షే అర్ధతెగనుండి గెర్షోనీయులకు కుటుంబముల వరుసన పదుమూడు పట్టణములు వచ్చెను.

7. రూబేను, గాదు, సెబూలూను తెగల వారినుండి మెరారీయులకు కుటుంబముల వరుసన పండ్రెండు పట్టణములు వచ్చెను.

8. యావే మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లే యిస్రాయేలీయులు ఈ పట్టణములను, వానినంటియున్న గడ్డి బీళ్ళను లేవీయులకు ఇచ్చివేసిరి.

9. యూదా షిమ్యోను తెగల వారి నుండి ఈ క్రింది నగరములు లభించెను.

10. లేవీయులైన కోహాతు వంశము వారిలో అహరోను పుత్రులకు జ్యేష్ఠభాగము లభించెను. వారి భాగమిది.

11. నేటి యూదా పర్వతసీమలోని హెబ్రోను అనబడు అనాకీయుల ముఖ్యనగరము కిర్యతార్బాను, దాని చుట్టుపట్ల గల గడ్డి బీళ్ళను యిస్రాయేలీయులు వారికిచ్చివేసిరి.

12. ఈ పట్టణమునకు చెందిన పొలములు పల్లెలు మాత్రము యెఫున్నె కుమారుడగు కాలెబునకు ఇచ్చిరి.

13-16. యాజకుడు అహరోను పుత్రులకు హెబ్రోనును, దానిని అంటియున్న గడ్డి బిళ్ళను ఇచ్చిరి. ఈ పట్టణము పొరుగువారిని చంపిన హంతకులకు ఆశ్రయపట్టణము కూడ. ఇంకను లిబ్నా, యాత్తీరు, ఎష్టేమోవా, హోలోను, దెబీరు, ఆయిను, యుత్తా, బేత్-షెమేషు అను పట్టణములను, వాని గడ్డి బీళ్ళను ఇచ్చివేసిరి. ఈ రీతిగా పై రెండుతెగల వారు తొమ్మిది పట్టణములనిచ్చిరి.

17-18. బెన్యామీను తెగ నుండి గిబ్యోను, గేబా, అనాతోతు, అల్మోను పట్టణములు వాని గడ్డి బీళ్ళు లభించెను. ఇవి నాలుగు పట్టణములు.

19. ఈ విధముగా అహరోను పుత్రులును, యాజకులునగు లేవీయులకు లభించినవి మొత్తము పదుమూడు పట్టణములు, వాని గడ్డి బీళ్ళు.

20. మిగిలిన కోహాతువంశము వారికి అట్లే వంతులువేయగా ఎఫ్రాయీము తెగ వారి పట్టణములు వచ్చెను.

21-22. ఎఫ్రాయీము అరణ్యసీమయందలి ఆశ్రయ పట్టణమగు షెకెము మరియు గేసేరు, కిబ్షాయీము, బేత్-హోరోను పట్టణములు, వాని గడ్డి బీళ్ళు వారికి లభించెను. ఇవి నాలుగు పట్టణములు.

23-25. దాను తెగనుండి ఎల్తేకె, గెబ్బోతోను, అయ్యాలోను, గాత్-రిమ్మోను అను నాలుగు పట్టణములు వాని గడ్డి బీళ్ళు వచ్చెను. మనష్షే అర్థతెగనుండి తానాకు, ఈబ్లేయాము అను రెండు పట్టణములు, వాని గడ్డి బీళ్ళు వచ్చెను.

26. ఈ రీతిగా మిగిలిన కోహాతు వంశము వారికి లభించిన పట్టణములు మొత్తము పది.

27. లేవీయులలో మరియొక వంశపు వారగు గెర్షోనీయులకు బాషాను నందలి ఆశ్రయపట్టణమగు గోలాను, బెయేస్తెరా వాని గడ్డి బీళ్ళు లభించెను. ఇవి రెండును మనష్షే అర్ధతెగ వారి వారసత్వములోనివి.

28-29. యిస్సాఖారు తెగనుండి కీషియోను, దాబెరతు, యార్మూతు, ఎన్గన్నీము అను నాలుగు పట్టణములు వాని గడ్డి బీళ్ళు లభించెను.

30-31. ఆషేరు తెగనుండి మిషాలు, అబ్దోను, హెల్కాత్తు, రెహోబు అను నాలుగు పట్టణములు, వాని గడ్డిబీళ్ళు లభించెను.

32. నఫ్తాలి తెగనుండి గలిలీలోని ఆశ్రయ పట్టణమైన కేదేషు, హమ్మోతుదొరు, కార్తను అను మూడుపట్టణములు, వాని గడ్డి బీళ్ళు లభించెను.

33. ఆయా కుటుంబముల సంఖ్య చొప్పున గెర్షోనీయులకు లభించిన పట్టణములు వాని గడ్డి బీళ్ళు మొత్తము పదుమూడు.

34. లేవీయులలో మిగిలినవారగు మెరారీయుల వంశములకు సెబూలూను తెగ వారి వారసత్వభూమి నుండి యోక్నెయాము, కర్తా, దిమ్నా, నహలాలు అను నాలుగు పట్టణములు, వాని గడ్డి బీళ్ళు లభించెను.

35-37. యోర్దానునకు ఆవలనున్న రూబేను తెగవారి వారసత్వమునుండి పీఠభూములలోని అరణ్యసీమ యందలి ఆశ్రయపట్టణము బేసేరు, యాహాసు, కెడెమోతు, మెఫాత్తు అను నాలుగుపట్టణములు, వాని గడ్డి బీళ్ళు లభించెను.

38-39. గాదు తెగవారి నుండి ఆశ్రయ పట్టణమగు రామోత్-గిలాదు, మహ్నయీము, హెష్బోను, యాసేరు అను నాలుగు పట్టణములు, వాని గడ్డి బీళ్ళు లభించెను.

40. లేవీయుల తెగలలో మిగిలినవారగు మెరారీయులకు కుటుంబముల సంఖ్య చొప్పున లభించిన పట్టణములు మొత్తము పండ్రెండు.

41. ఈ రీతిగా యిస్రాయేలు దేశమున లేవీయులకు మొత్తము నలువది ఎనిమిది పట్టణములు, వాని గడ్డి బీళ్ళు లభించెను.

42. ఈ పట్టణములు ఒక్కొక్కటి దాని చుట్టుపట్లగల గడ్డి బీళ్ళతో కలిపి లేవీయులకు లభించెను.

43. ఈ రీతిగా యావే పితరులకు వాగ్దానము చేసిన నేల అంతటిని యిస్రాయేలీయులకు ఇచ్చి వేసెను. వారు ఆ నేలను స్వాధీనము చేసికొని, నివాసములు ఏర్పరచుకొనిరి.

44. యావే పితరులకు వాగ్దానము చేసినట్లే వారి సరిహద్దులన్నింట శాంతిని నెలకొల్పెను. యిప్రాయేలు శత్రువులలో ఒక్కడును వారిని ఎదిరించుటకు సాహసింపలేదు. శత్రువుల నందరిని ప్రభువు వారి వశము చేసెను.

45. యావే యిస్రాయేయులకు చేసిన వాగ్దానములలో ఒక్కటియు తప్పిపోలేదు. అన్నియు నెరవేరెను.

1-2. అంతట యెహోషువ రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధతెగవారిని పిలిపించి "యావే సేవకుడు మోషే మిమ్మాజ్ఞాపించినదెల్ల పాటించితిరి.

3. మనము ఈ నేలను ఆక్రమించుకొనుటకు ఇంతకాలము పట్టినను, ఇన్నాళ్ళు మీరు మీ సోదరులను విడనాడి వెళ్ళిపోలేదు. మీ దేవుడైన యావే ఆజ్ఞలను తు.చ. తప్పకుండ అనుసరించిరి.

4. యావే మాట యిచ్చినట్లే మీ సోదరులకిపుడు విశ్రాంతి లభించినది. కనుక ఇక మీరు మీ నివాసములకు వెడలిపోవచ్చును. యావే సేవకుడగు మోషే యోర్దానునకు ఆవలివైపున మీకిచ్చిన భూమికి వెడలిపొండు.

5. కాని యావే సేవకుడగు మోషే యిచ్చిన ఆజ్ఞలను మాత్రము శ్రద్ధతో పాటింపుడు. ప్రభువు మార్గములలో నడువుడు. ఆయన ఆజ్ఞలు పాటింపుడు. ఆయనకు అంటిపెట్టుకొని యుండుడు. నిండుమనసుతో, పూర్ణాత్మతో ఆ ప్రభువును సేవింపుడు” అని చెప్పెను.

6. అట్లు యెహోషువ తూర్పు తెగల వారిని దీవించి పంపివేయగా, వారు తమతమ నివాసములకు వెడలిపోయిరి.

7. మోషే మనష్షే అర్ధతెగవారికి, బాషాను మండలమున ఒక భాగమునిచ్చెను. మిగిలిన అర్ధ తెగ వారికి యోర్దానునకు పడమట, ఇతర యిస్రాయేలీయుల భూములదగ్గరే భాగమునిచ్చెను.

8. ఆ ప్రజలు తమతమ నివాసములకు వెడలి పోవు చుండగా యెహోషువ వారిని దీవించి “మీరు సిరి సంపదలతో తిరిగిపోవుచున్నారు. గొడ్డుగోదలతో, వెండిబంగారములతో, ఇనుము, కంచులతో, చాల దుస్తులతో మరలిపోవుచున్నారు. ఈ కొల్లసొమ్మును మీరును, మీ సహోదరులును కలసి పంచుకొనుడు” అని చెప్పెను.

9. రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధ తెగవారు వారివారి నివాసములకు వెడలిపోయిరి. వారు యిస్రాయేలీయులను కనాను మండలము నందలి షిలో వద్ద వదలివేసి గిలాదు మండలమునకు వెడలిపోయిరి. యావే మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ఆ భాగము వారిదే. అక్కడనే వారు స్థిరపడిరి.

10. కాని రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధ తెగవారు కనానీయుల దేశమున యోర్దాను చెంతనున్న రాళ్ళగుట్ట యొద్దకు వచ్చి అక్కడ ఒక పెద్దబలిపీఠమును నిర్మించిరి.

11. రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధతెగ వారు కనానుదేశములో రాళ్ళగుట్టవద్ద యోర్దాను నదీతీరమున యిస్రాయేలు వైపున ఒక బలిపీఠమును నిర్మించిరి అను వార్త యిస్రాయేలీయుల చెవినపడెను.

12. ఆ విషయము తెలియగనే యిస్రాయేలీయులందరు షిలోవద్ద ప్రోగై వారి మీదికి దండెత్తి వెడలుటకు సంసిద్ధులైరి.

13. యిస్రాయేలీయులు యాజకుడైన ఎలియెజెరు కుమారుడైన ఫీనెహాసును తూర్పు తెగల వారి వద్దకు పంపిరి.

14. ఒక్కొక్క తెగనుండి ఒక్కొక్క నాయకుని చొప్పున పది తెగలనుండి పదిమంది నాయకుల నెన్నుకొని వారిని కూడ ఫీనెహాసుతో పంపిరి.

15-16. వారు పోయి గిలాదుమండలములోని రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధతెగ వారిని కలసికొని “యావే సమాజము మీతో చెప్పుడని పలికిన మాటలివి: మీరు యిస్రాయేలు దేవునకు ద్రోహము తలపెట్టనేల? మీకు మీరే ఈ పీఠమును నిర్మించుకొని యావే మార్గమునుండి వైదొలగితిరేల? ఇది యావే మీద తిరుగుబాటుచేయుట కాదా?

17. పేయోరు వద్ద మనము చేసిన పాపమునకు ప్రభువు మనలను అంటురోగములతో పీడింపలేదా? ఆ పీడ మనలనింకను వదలనూలేదు. అది చాలదని ఈ దుష్కార్యము కూడ చేయవలయునా?

18. మీరు నేడు యావేకు ఎదురు తిరిగి అతనిననుసరించుటకు నిరాకరించిరి. రేపతడు యిస్రాయేలు సమాజము మొత్తము మీద మండిపడకుండునా?

19. మీరు వసించు నేల అపవిత్రమైనది అనుకొందురేని ప్రభు మందసమున్న యావే మండలమునకొచ్చి మాతో పాటు భాగముపొందుడు. కాని యావే మీద తిరుగబడవద్దు. యావే బలిపీఠమునకు వ్యతిరేకముగా మరియొక బలిపీఠము నిర్మించి మీ తిరుగుబాటులో మమ్మునుకూడా భాగస్వాములను చేయవలదు.

20. సేరా కుమారుడు ఆకాను ప్రతిష్టితములైన వాని విషయములో తిరుగబడినపుడు, ఆ దుష్కార్యమును అతడొక్కడే చేసినను దేవుని ఉగ్రత యిస్రాయేలు సమాజమునెల్ల పీడింపలేదా? ఆ పాపము బలిగొనినది అతని యొక్కని ప్రాణములనే కాదుగదా?" అనిరి.

21-22. అపుడు రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధతెగవారు యిస్రాయేలు పెద్దలతో "మా సంగతి ప్రభువు, దేవాధిదేవుడైన యావేకు తెలియును. యిస్రాయేలీయులైన మీరును తెలిసికొందురుగాక! మేము ద్రోహమునుగాని, తిరుగుబాటునుగాని తలపెట్టితిమేని నేడు యావే మమ్ము కాపాడకుండును గాక!

23. మేము యావే మార్గమునుండి వైదొలగి ఈ పీఠము మీద దహనబలులు, సమాధానబలులు, సమర్పణ బలులు, అర్పింపగోరియే దానిని నిర్మించి నచో ప్రభువు మమ్ము శిక్షించునుగాక!

24. రేపు మీ సంతతివారు మా సంతతివారితో యిస్రాయేలు దేవుడైన యావేతో మీకేమి సంబంధము కలదని వాదింపవచ్చునని భయపడి ఈ పీఠమును నిర్మించితిమి. 

25. ప్రభువు రూబేను, గాదు తెగలవారికి మాకు మధ్య యోర్దానునే హద్దుగా నియమించెననియు, వారికి యావే ఆరాధనలో భాగము లేదనియు మీవారు మావారితో అనవచ్చుగదా! ఈ విధముగా యావేను ఆరాధింపనీయకుండ మీ సంతతివారు మా సంతతి వారికి అడ్డుపడ వచ్చును.

26. కనుక మాలో మేము కలియబలుకుకొని మనము ఒక పీఠము నిర్మింతము. అది బలులను, దహనబలులను సమర్పించుటకు కాదుగాని, వారికిని మనకును, వారి సంతతికిని, మనసంతతికిని సాక్ష్యముగా నిలువగలదు అని అనుకొంటిమి.

27. మేమును దహనబలులతోను, సమర్పణబలులతో, సమాధానబలులతో యావేను కొలుతుమనుటకు ఈ పీఠమే గురుతు. దీనినిబట్టి రేపు మీ సంతతివారు మా సంతతి వారిని చూచి మీకు యావే ఆరాధనలో భాగములేదని చెప్పజాలరుగదా!

28. ఇకమీదట వారు మాతోగాని, మా తరముల వారితో గాని ఎప్పుడైనా అట్టి మాటలాడుదురేని, మేము “ఈ పీఠము యొక్క ఆకారమును చూడుడు. దహనబలులు, సమర్పణబలులు అర్పించుటకుకాదు గాని మీకును, మాకును మధ్య సాక్షిగానుండుటకై మా పితరులు ఈ పీఠమును నిర్మించిరి” అని చెప్పుదమని అనుకొంటిమి.

29. యావేను ఎదిరింపవలయునని గాని అతని ఊడిగము మానుకోవలయుననిగాని, మేము ఈ పీఠము కట్టలేదు. దాని మీద దహనబలులు, సమర్పణబలులు, సమాధానబలులు, సమర్పింపవలె నను కోరికయు మాకు లేదు. యావే మందసము ఎదుటనున్న బలిపీఠముతో పోటీ పడవలెననియు మా తలంపుకాదు” అని చెప్పిరి.

30. యాజకుడగు ఫీనెహాసు, అతనివెంట వచ్చిన యిస్రాయేలు నాయకులగు సమాజపు పెద్దలు గాదు, రూబేను, మనష్షే అర్ధ తెగలవారు పలికిన పలుకులువిని సంతుష్టులైరి.

31. అంతట యాజకుడగు ఎలియెజెరు కుమారుడైన ఫీనెహాసు, రూబేను, గాదు, మనష్షే అర్ధ తెగలవారిని చూచి “మీరు ప్రభువునకు ద్రోహము తలపెట్టలేదు కనుక అతడు మనకు తోడైయున్నాడనియే మా నమ్మకము. మీరు యిస్రాయేలు ప్రజను ప్రభు శిక్షనుండి కాపాడితిరి” అనెను.

32. అంతట యాజకుడగు ఎలియెజెరు కుమారుడైన ఫీనెహాసు, ప్రజానాయకులు రూబేనీయులు, గాదీయులను వీడ్కోలునిచ్చి, గిలాదునుండి పయనమై కనానునందలి యిస్రాయేలు మండలము చేరి జరిగిన దంతయు తమవారికి విన్పించిరి.

33. ఆ వార్తలకు సంతసించి యిస్రాయేలీయులు దేవునికి వందనములర్పించిరి. వారు తమ సోదరులమీదికి దండెత్తి పోవుటకు గాని రూబేను, గాదు తెగలవారు స్థిరపడిన మండలమును నాశనముచేయుటకుగాని పూనుకొనలేదు.

34. రూబేనీయులు, గాదీయులు “ఈ పీఠము 'యావేదేవుడు' అనుటకు సాక్ష్యముగా ఉండును” అనుకొని, దానికి 'సాక్ష్యము' అని పేరిడిరి.

1. ప్రభువు చుట్టుపట్లనున్న శత్రువుల వలన యిస్రాయేలీయులకు ఏ బాధ లేకుండ చేసిన పిదప చాలకాలమునకు యెహోషువ యేండ్లు గడచి వృద్దుడయ్యెను.

2. అతడు యిస్రాయేలు ప్రజలను, వారి పెద్దలను, నాయకులను, న్యాయాధిపతులను, ముఖ్యులను పిలిపించి “నేను యేండ్లుచెల్లిన ముదుసలిని.

3. ఈ శత్రుజాతులన్నిటిని యావే ఎట్లు అణగదొక్కెనో మీరు కన్నులార చూచిరి. మీ దేవుడైన యావే స్వయముగా మీ పక్షమున యుద్ధము చేసెను.

4. నేను ఈ జాతులనన్నిటిని రూపుమాపి వారి భూములను మీ తెగలకు వారసత్వభూములుగా పంచియిచ్చితిని. అటు యోర్దానునకు, ఇటు పడమటి మహాసముద్రమునకు మధ్యనున్న జాతులనన్నిటిని రూపుమాపితిని.

5. మీ దేవుడైన యావే స్వయముగా వారిని తరిమివేసెను. ఆ ప్రభువు వారిని తరిమివేయగా మీరు వారి భూములను ఆక్రమించుకొంటిరి.

6. అందుకని మోషే ధర్మశాస్త్రమున వ్రాయబడిన నియమములన్నిటిని శ్రద్ధతో పాటింపుడు. మీరు ఆ నియమముల నుండి కుడికిగాని, ఎడమకుగాని తొలగిపోకుండ వాటిని దృఢసంకల్పముతో పాటింపుడు.

7. మీ చెంత జీవించుచున్న అన్యజాతులతో కలసి పోవలదు. వారిదేవతల పేరులను ఉచ్చరింపకుడు. వారి పేరు మీదుగా ప్రమాణము చేయకుడు. వారిని సేవింపకుడు. పూజింపకుడు.

8. ఇప్పటివరకు వలెనే ఇకమీదట గూడ మీ దేవుడైన యావేను అంటి పెట్టు కొనియుండుడు.

9. కనుకనే ప్రభువు మహాబలముగల పెద్దజాతులను మీ ఎదుటినుండి వెడలగొట్టెను. నేటివరకు మిమ్మెవడైన ఎదిరించి నిలిచెనా?

10. మీలో ఒక్కొక్కడు వారిలో వేయిమందిని పారద్రోలగలడు. ఏలయనగా, ప్రభువు వాగ్దానము చేసినట్లు స్వయముగా తానే మన పక్షమున పోరాడెను.

11. కనుక ప్రభువును పరిపూర్ణహృదయముతో సేవింపుడు.

12-13. కాని మీరు ఈ నియమములను పాటింపరేని, మీతో వసించు ఈ అన్యజాతీయులతో కలసిపోయెదరేని, వారితో వియ్యములు అందుకొని సఖ్యతసంబంధములు పెంపొందించుకొందురేని, ప్రభువు వారిని మీ చెంతనుండి వెడలగొట్టడు. పైగా వారు, మీరు చిక్కుకొను వలలుగాను, కూలిపోవు గోతులుగాను పరిణమింతురు. యావే మీకు ప్రసా దించిన ఈ మంచినేలనుండి మీరందరు అడపొడకాన రాకుండ పోవువరకు మిమ్ము మోదు కొరడాలుగాను, మీ కన్నులను బాధించు ముండ్లుగాను పరిణమింతురు.

14. నా మట్టుకు నేను జీవితయాత్ర చాలించుటకు సిద్ధముగానున్నాను. యావే మీకు మంచిని చేకూర్చెదనని చేసిన వాగ్దానములలో ఒక్కటియు తప్పిపోలేదని పూర్ణాత్మతోను, పూర్ణహృదయముతోను విశ్వసింపుడు, ఆ వాగ్దానములన్నియు నెరవేరినవి.

15. కాని యావే మీకు మంచిని చేకూర్చెదనని చేసిన వాగ్దానములన్నియు నెరవేరినట్లే, అతడు మీకు కీడు చేయుదునని పలికిన పలుకులును నెరవేరును. దేవుడు మీకిచ్చిన ఈ మంచినేల మీదినుండి మిమ్ము గెంటి వేయుటయు నిక్కము.

16. ప్రభువు మీతో చేసికొనిన నిబంధనను మీరు మీరెదరేని, అన్యదైవములను పూజింతురేని, అతని కోపము మీపై రగుల్కొనును. అపుడు ప్రభువు మీకిచ్చిన ఈ మంచినేల నుండి మీరును అడపొడ కానరాకుండ నాశనమైపోవుదురు.

1. యెహోషువ యిస్రాయేలు తెగలన్నిటిని షెకెము వద్ద సమావేశపరచెను. వారి పెద్దలు, నాయకులు, న్యాయాధిపతులు, ముఖ్యులు యావే సమక్షమున పోగైరి.

2. యెహోషువ వారితో ఇట్లనెను: “యావే పలుకులివి. 'పూర్వము అబ్రహాము, నాహోరు, వారి తండ్రియగు తెరా యూఫ్రటీసు నదికి ఆవల నివసించుచు అన్యదైవములను కొలిచిరి.

3. అంతట నేను మీ పితరుడైన అబ్రహామును నదికి ఆవలినుండి తోడ్కొని వచ్చి ఈ కనాను మండలమునందంతట సంచరించునట్లు చేసితిని. అతని సంతానమును వృద్ది చేయగోరి ఈసాకును కలుగజేసితిని.

4. ఈసాకునకు యాకోబు, ఏసావులను కలుగజేసితిని. ఏసావునకు సేయీరు పర్వతసీమను వారసత్వభూమిగా కలుగ జేసితిని. తరువాత యాకోబు అతని కుమారులు ఐగుప్తునకు వలసపోయిరి.

5. అటుతరువాత మోషే అహరోనులను పంపితిని. ఐగుప్తున అద్భుతకార్యములు చేసి, ఉత్పాతములు పుట్టించి మిమ్ము ఈవలకు నడిపించుకొనివచ్చితిని.

6. నేను మీ పితరులను ఐగుప్తునుండి తోడ్కొని వచ్చితిని. వారు రెల్లుసముద్రమును చేరిరి.

7. అచట వారు యావేకు మొరపెట్టగా ప్రభువు వారికిని, ఐగుప్తీయులకు మధ్య దట్టమైన చీకటిని నిలిపి, సముద్రము ఐగుప్తీయుల మీదికి పొర్లివచ్చి వారిని ముంచివేయునట్లు చేసెను. నేను ఐగుప్తున చేసిన అద్భుతకార్యములన్నిటిని మీరు కన్నులార చూచితిరి. అటుపిమ్మట మీరు చాలకాలము వరకు అరణ్యముననే వసించితిరి.

8. తరువాత మిమ్ము యోర్దానునకు ఆవల వసించు అమోరీయుల మండలమునకు కొనివచ్చితిని. వారు మీమీదికి యుద్ధమునకు రాగా నేను వారిని మీ వశముచేసితిని. నేను వారిని నాశనముచేసితిని గనుక మీరు వారి దేశమును స్వాధీనముచేసికొంటిరి.

9. పిమ్మట మోవాబు రాజైన సిప్పోరు కుమారుడు బాలాకు యిస్రాయేలీయుల మీదికి దండెత్తివచ్చి బెయోరు కుమారుడగు బిలామును మిమ్ము శపింపపురికొల్పెను.

10. కాని నేను బిలాము పన్నుగడను సాగనీయలేదు. కనుక మిమ్ము శపింపవచ్చినవాడు దీవించి పోవలసివచ్చెను. ఈ విధముగా మిమ్ము అతని బారినుండి కాపాడితిని.

11. అంతట మీరు యోర్దానునది దాటి యెరికో పట్టణమునకు రాగా ఆ నగర పౌరులు మిమ్మెదిరించి పోరాడిరి. అట్లే అమోరీయులు, పెరిస్సీయులు, కనానీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, యెబూసీయులు మీతో పోరాడిరిగాని నేను వారి నందరిని మీ చేతికి అప్పగించితిని.

12. నేను మీకు ముందుగా కందిరీగలను పంపగా అవి అమోరీయుల రాజులు ఇద్దరిని మీ ఎదుటినుండి తరిమివేసెను. ఆ విజయము మీరు కత్తివలన గాని, వింటివలన గాని సాధించినది కాదు.

13. మీరు సేద్యముచేయని సాగునేలను నేను మీకిచ్చితిని. మీరు కట్టుకొనని పట్టణములను మీకు నివాసములు గావించితిని. మీరు నాటని ద్రాక్షతోటలనుండి, ఓలివు తోటలనుండి నేడు మీరు పండ్లను భుజించుచున్నారు.' "

14. “కనుక ఇకమీదట యావేకు భయపడి ఆ ప్రభువును చిత్తశుద్ధితో కొలువుడు. యూఫ్రటీసు నదికి ఆవలివైపునను, ఐగుప్తులోను మీ పితరులు కొలిచిన అన్యదైవములను విడనాడి యావేను మాత్రమే పూజింపుడు.

15. కాని మీరు యావేను సేవింపనొల్ల నిచో మరియెవరిని సేవింపగోరుదురో, యూఫ్రటీసు నదికి ఆవల మీ పితరులు కొలచిన దేవతలను కొలిచెదరో, మీరిపుడు నివసించుచున్న అమోరీయుల దేశమున వారు పూజించు దైవములను కొలిచెదరో నేడే నిర్ణయించుకొనుడు. నేను, నా కుటుంబము మాత్రము యావేను ఆరాధింతుము” అనెను.

16. ఆ మాటలువిని యిస్రాయేలీయులు “ఎంత మాట! మేము యావేను విడనాడి అన్యదైవములను కొలుతుమా?

17. మమ్ము మా పితరులను దాస్య గృహమైన ఐగుప్తునుండి ఈవలకు కొనివచ్చినది యావే కాదా? మాకొరకై అద్భుతకార్యములను చేసినది ఆయనకాదా? మేము నడచిన త్రోవలందు, మేము ప్రయాణముచేసిన వివిధ జాతుల మండలములందు మమ్ము కాపాడినది ఆయనకాదా?

18. పైగా ప్రభువు ఆ జాతులనన్నిటిని, ఈదేశమును ఏలుచున్న అమోరీయులనుగూడ మా యెదుటి నుండి వెడల గొట్టెను. కనుక మేమును యావేను సేవింతుము. ఆయనయే మాకును దేవుడు" అని ప్రత్యుత్తరమిచ్చిరి.

19. యెహోషువ వారితో “మీరు యావేను సేవింప జాలరేమో! యావే పరమపవిత్రుడైన దేవుడు. ఆయన అసూయాపరుడైన దేవుడు. గనుక మీ తిరుగుబాటులను, మీ పాపములను సహింపజాలడు.

20. మీరు అన్యదైవములను ఆరాధింపగోరి యావేను పరిత్యజింతురేని, ఆయన మీమీద విరుచుకొనిపడి, మిమ్ము బాధించి తీరును. మీకింతవరకు ఉపకారము చేసినను ఇక మీదట మిమ్ము సర్వనాశనము చేయును” అని చెప్పెను.

21. వారు అతనితో “మేము యావేనే సేవింతుము, సందేహము వలదు” అనిరి.

22. అందుకు యెహోషువ "యావేనెన్నుకొని, ఆయననే పూజింతుమని మాట యిచ్చితిరనుటకు మీకు మీరే సాక్షులు” అనెను. వారు “అవును, మాకు మేమే సాక్షులము" అనిరి.

23. యెహోషువ అటులయినచో “మీరు అన్యదైవములను విడనాడుడు. యిస్రాయేలు దేవుడైన యావేకు మీ హృదయములు అర్పించు కొనుడు” అనెను.

24. వారతనితో "మేము మా దేవుడైన యావేనే నేవింపగోరితిమి. ఆయన ఆజ్ఞలను తప్పక పాటించెదము" అనిరి.

25. యెహోషువ నాడు ప్రజలతో నిబంధనచేసి షెకెమునొద్ద వారికొక శాసనము చేసెను.

26. అతడు తన అనుశాసనములను దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయించి, పెద్దరాతిని తెప్పించి యావే పవిత్రస్థలములో ఉన్న సింధూరవృక్షము క్రింద దానిని నిలువ బెట్టి ప్రజలందరితో ఇట్లనెను.

27. “ఈ శిల మనకు సాక్ష్యముగా నుండును. యావే మనతో చెప్పిన మాటలన్నియు ఈ రాయి విన్నది. అది మీ మీద సాక్షిగా నుండును. మీరు యావేను నిరాకరింతురేని, ఇది మీకు వ్యతిరేకముగా సాక్ష్యము పలుకును" అని చెప్పెను.

28. అంతట యెహోషువ ప్రజలను వీడ్కొనగా, వారు తమతమ నివాసములకు వెడలిపోయిరి.

29. ఈ సన్నివేశములు జరిగిన తరువాత నూను కుమారుడును యావే సేవకుడైన యెహోషువ కన్నుమూసెను. అతడు నూటపది ఏండ్లు జీవించెను.

30. యెహోషువ వారసత్వముగా పొందిన తిమ్నాత్-సెరా యందే అతనిని ఖననము చేసిరి. ఆ పట్టణము గాషు కొండలకు ఉత్తరముగానున్న ఎప్రాయీము అరణ్యనీమయందున్నది.

31. యెహోషువ కాలమునను, అతని సమకాలికులు అయిఉండి యావే యిస్రాయేలీయులకు చేసిన అద్భుతకార్యములను కన్నులార చూచిన పెద్దల కాలమంతయు, యిస్రాయేలీయులు యావేను సేవించుచూ వచ్చిరి.

32. యిస్రాయేలీయులు ఐగుప్తునుండి కొని వచ్చిన యోసేపు అస్థికలను షెకెమునొద్ద ఒక పొలమున పాతిపెట్టిరి. షెకెము తండ్రియైన హామోరుని కుమారులనుండి యాకోబు ఆ పొలమును నూరు కాసులకు కొనెను. కనుక ఈ నేల యోసేపు కుమారులకు వారసత్వ భూమి అయ్యెను.

33. అంతట అహరోను కుమారుడైన ఎలియెజెరు కూడ చనిపోయెను. అతనిని అతని కుమారుడగు ఫీనెహాసుని పట్టణమైన గిబియా నందు పాతిపెట్టిరి. ఎఫ్రాయీము అరణ్యసీమయందు ఫీనెహాసునకు ఈ పట్టణము వారసత్వముగా లభించెను.