ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పరమగీతము

1. సొలోమోను పరమగీతము.

2. నీ పెదవులతో నన్ను ముద్దు పెట్టుకొనుము. నీ ప్రేమ ద్రాక్షామధువుకంటె శ్రేష్ఠమైనది.

3. నీ దేహపరిమళముసువాసననుగుబాళించుచున్నది నీ పేరు సుగంధమును జ్ఞప్తికి తెచ్చును. కనుకనే యువతులు నిన్ను వలతురు.

4. నన్ను నీ వెంట కొనిపొమ్ము . మనమిరువురము కలిసి పరుగిడుదము. రాజా! నన్ను నీ నివాసమునకు కొనిపొమ్ము. మాకు ఆనందమును ఒనగూర్చువాడవు నీవే. నీ ప్రేమను మధువుకంటె శ్రేష్ఠమైన దానినిగానెంచి కీర్తింతుము. నిన్ను వలచుటయే మేలు.

5. యెరూషలేము కుమార్తెలారా! నేను నల్లనిదాననైనను, సొగసైనదానను. కేదారు నగర గుడారములవలె, సొలోమోను పుర గుడారముల తెరలవలె నేను సొగసైనదానను.

6. నా వర్ణమునకుగాను మీరు నన్ను చిన్నచూపు చూడవలదు, సూర్యరశ్మి నన్ను మాడ్చివేసినది. నా సోదరులు నామీద కోపించిరి, నన్ను ద్రాక్షతోటకు కావలికాయ ఆజ్ఞాపించిరి. నేను నా సొంత ద్రాక్షతోటను కాయకపోతిని.

7. హృదయేశ్వరా! నీవు నీ గొఱ్ఱెలమందను, మేతకొరకు ఎచటికి తోలుకొని , పోయెదవో చెప్పుము. మధ్యాహ్నము ఆ మంద ఎచట విశ్రమించునో తెలుపుము. నేను నీ స్నేహితుల మందలచుట్టు తిరుగుచు, ఒట్టినే నీ కొరకు గాలింపనేల?

8. అందాలరాశీ! నీకు ఆ తావు తెలియనిచో, గొఱ్ఱెలమంద వెంటనే పొమ్ము, కాపరుల గుడారముల చెంతనే, నీ మేకపిల్లలను మేపుకొనుము.

9. ప్రేయసీ! నిన్ను ఫరో అశ్వములలో ఆడుగుఱ్ఱముతో పోలును.

10. నీ చెక్కిళ్ళు కురులమధ్య అలరారుచున్నవి. నీ కంఠము హారముల నడుమ శోభిల్లుచున్నది.

11. మేము నీకు వెండిపూలు తాపించిన సువర్ణహారము చేయింతుము.

12. రాజు విందుశాలలో ఆసీనుడై ఉండెను. నా దేహపరిమళము సువాసనలు వెదజల్లును.

13. నా ప్రియుడు నా రొమ్ముల మధ్య పరుండి, గోపరసమువలె సువాసనలొలుకును.

14. అతడు ఎంగెడి సీమలోని ద్రాక్షతోటల గట్టులమీద పూచిన కర్పూరపు పూగుత్తుల వంటివాడు.

15. ప్రేయసీ! నీ వెంతసొగసుగానున్నావు! ఎంత సుందరముగానున్నావు! నీ కన్నులు పావురములవలెనున్నవి.

16. ప్రియా! నీ వెంత మనోహరముగా ఉన్నావు! ఎంత మనోజ్ఞముగా ఉన్నావు! నవనవలాడు పచ్చనిగడ్డి మన పడక.

17. మన ఇంటి దూలములను , దేవదారు కలపతో చేసిరి. దాని వాసములను , తమాలవృక్షముల కొయ్యతో చేసిరి.

1. నేను షారోనున పూచిన గులాబీని. కొండకోనలో వికసించిన లిల్లీని.
2. ముండ్లతుప్పలలో లిల్లీ పుష్పమెట్లో, యువతులలో నా ప్రియురాలట్లు.
3. తోటలోని చెట్లలో ఆపిలు వృక్షమెట్లో, యువకులలో నా ప్రియుడట్లు. అతని నీడలో విశ్రమించుట నాకిష్టము. అతని ఫలములు కడు మధురముగా ఉండును.
4. అతడు తన విందుశాలకు నన్ను తోడుకొని వచ్చెను. నా మీద తన ప్రేమధ్వజమును నెలకొల్పెను.
5. ఎండుద్రాక్షామోదకములతో మీరు నా సేద తీర్పుడు ఆపిలుపండ్లతో మీరు నా బడలికలు తొలగింపుడు. ప్రేమ వలననే నేను మిక్కిలి సొలసియున్నాను.
6. అతడు తన ఎడమ చేతిని నా తలక్రిందనుంచి తన కుడిచేతితో నన్ను ఆలింగనము చేసికొనును.
7. యెరూషలేము కుమార్తెలారా! జింకల పేరు మీదుగాను, లేళ్ళ పేరు మీదుగాను నేను ఒట్టు పెట్టి చెప్పుచున్నాను. నా ప్రియురాలు స్వయముగా మేలుకొనువరకు, మీరామెకు నిద్రాభంగము కలిగింపవలదు.
8. నా ప్రియుని పిలుపు విన్పించుచున్నది. అతడు పర్వతముల మీదుగా పరుగెత్తుకొని వచ్చుచున్నాడు. కొండల మీదుగా, దుముకుచు వచ్చుచున్నాడు. 
9. నా ప్రియుడు లేడి వంటివాడు. జింకపిల్ల వంటివాడు. అదిగో! అతడు మన గోడచెంతనే నిలుచుండియున్నాడు. గవాక్షముగుండ తొంగిచూచుచున్నాడు,  గోడలోని సందుగుండ లోపలికి పారజూచుచున్నాడు.
10. నా ప్రియుడు నాతో మాట్లాడుచు ఇట్లనుచున్నాడు: “ప్రేయసీ! లెమ్ము! సుందరాంగీ! నా వెంట రమ్ము!
11. హేమంతము గతించినది, వర్షాకాలము దాటిపోయినది, వానలిక కురియవు.
12. పొలమున పువ్వులు పూయుచున్నవి. మధురగీతములు ఆలపించు సమయము ఆసన్నమైనది. పొలమున పావుర స్వరము విన్పించుచున్నవి.
13. అంజూరపు మొదటికాపు పక్వమైనవి. ద్రాక్షపూతబట్టి సువాసనలు గుబాళించుచున్నది. ప్రేయసీ! లెమ్ము! సుందరాంగీ! నా వెంట రమ్ము!
14. నీవు కొండ నెఱ్ఱెలలో బీటలువారిన కొండబండల సందులలో, దాగుకొనిన పావురమువంటిదానవు. నీ ముఖమును నాకు చూపించుము. నీ స్వరమును నాకు విన్పింపుము. నీ ముఖము సుందరమైనది. నీ నాదము మధురమైనది”.
15. మీరు గుంటనక్క పిల్లలను పట్టుకొనుడు. అవి పూతపట్టిన మన ద్రాక్షతోటను పాడుచేయుచున్నవి.
16. నా ప్రియుడు నావాడు, నేనతనిదానను. అతడు లిల్లీ పూలు పూచినచోట తన మందను మేపును.
17. ప్రియా! నీవు లేడివలెను, కొండమీది జింకపిల్లవలెను చూపట్టుము. నీవు నా చెంతకు తిరిగి రమ్ము. ఉదయ వాయువులు వీచినవరకు చీకట్లు గతించినవరకు నాతో ఉండుము.

 1. నేను రాత్రివేళ పడకమీద పరుండి నా హృదయేశ్వరుని కొరకు గాలించితిని. కాని ఎంత వెదకినను అతడు దొరకడయ్యెను.

2. నేను లేచి నగరములోనికి వెళ్ళితిని. పట్టణ వీధులలోను, సందులలోను తిరుగాడితిని. నా హృదయేశ్వరుని కొరకు వెదికితిని. కాని ఎంత వెదకినను అతడు కన్పింపడయ్యెను.

3. నగరమునకు కావలికాయువారు నన్ను చూచిరి. “మీరు నా హృదయేశ్వరుని గాంచితిరా?" అని నేను వారిని ప్రశ్నించితిని.

4. వారు నన్ను దాటి వెడలిపోవగనే హృదయేశ్వరుడు నా కంటబడెను. నేనతనిని గట్టిగా పట్టుకొని వదలి పెట్టనైతిని. మా తల్లి ఇంటికి అతనిని తోడుకొనివచ్చితిని. నేను పుట్టిన గదిలోనికి అతనిని తీసికొని వచ్చితిని.

5. యెరూషలేము కుమార్తెలారా! జింకల పేరు మీదుగాను, లేళ్ళ పేరుమీదుగాను, నేను మీకానవెట్టి చెప్పుచున్నాను. నా ప్రియురాలు స్వయముగా మేలుకొనువరకు మీరామెకు నిద్రాభంగము కల్పింపవలదు.

6. ఎడారినుండి ధూమస్థంభమువలె కదలి వచ్చుచున్న ఇది యేమి? దానియందు సాంబ్రాణి, గోపరసముల సువాసనలు ఉన్నవి. అది వర్తకులమ్ము పరిమళ ద్రవ్యముల సువాసనలను గుబాళించుచున్నది.

7. అదిగో! సొలోమోనును పల్లకీలో ఎక్కించుకొని తీసికొని వచ్చుచున్నారు. ఈ యిస్రాయేలీయులలో శ్రేష్ఠులైన సైనికులు అరువదిమంది అతనికి అంగరక్షకులుగా నుండి బరాబరులు చేయుచున్నారు.

8. వారందరును ఖడ్గవిద్యలో నిపుణులు.  యుద్ధమున కాకలుతీరిన యోధులు. వారిలో ప్రతివాడును ఖడ్గము ధరించి, రాత్రియందెట్టి అపాయము వాటిల్లకుండునట్లు జాగ్రత్త పడును.

9. అది సొలోమోను స్వయముగా , తయారు చేయించుకొనిన పల్లకి. దానిని లెబానోను కొయ్యతో చేసిరి.

10. దాని గడెలను వెండితో చేసిరి. బంగారు దారముతో కుట్టిన వలువను దానిమీద కప్పిరి. యెరూషలేము మహిళలు అనురాగముతో నేసిన ఊదారంగు బట్టతో దానిలోని ఆసనమును కప్పిరి.

11. సియోను కుమార్తెలారా! సొలోమోను రాజును చూచుటకు రండు! ఆ రాజునకు ఆనందదాయకమైన అతని వివాహ దినమున రాజమాత అతడి శిరస్సును అలంకరించిన కిరీటమును అతడిప్పుడు ధరించియున్నాడు. ఆరోజు బహు సంతోషకరమైన రోజు.

 1. ప్రేయసీ! నీవు మిక్కిలి సుందరాంగివి, మిక్కిలి కోమలాంగివి. మేలిముసుగు మాటున దాగియున్న నీ కన్నులు పావురములవలె ఉన్నవి. నీ కురులు గిలాదు కొండల మీదినుండి క్రిందికి దుముకు మేకలమందవలె ఉన్నవి.

2. నీ దంతములు, ఉన్ని కత్తిరించి కడిగి శుభ్రము చేసిన గొఱ్ఱె పిల్ల లవలె నున్నవి. అవి అన్ని రెండురెండుగా వరుసలు తీరి పొందికగా అమరియున్నవి.

3. నీ పెదవులు ఎఱ్ఱని పట్టబంధములవలె ఉన్నవి. నీవు మాట్లాడునప్పుడు అవి కడు సొబగుగా నుండును. మేలిముసుగు మాటున దాగియున్న నీ చెక్కిళ్లు దానిమ్మ ఫలముల అర్థభాగములవలె ఉన్నవి.

4. నీ కంఠము గుండ్రముగా కట్టిన దావీదు బురుజువలె నున్నది. నీ గళ హారములు ఆ బురుజు చుట్టు వ్రేలాడు వేలాది వీరుల కవచములవలె ఉన్నవి.

5. నీ కుచములు లిల్లీ పూల నడుమ మేసెడి కవలలైన జింక పిల్లలను పోలియున్నవి.

6. ఉదయ వాయువులు వీచిన వరకు, చీకట్లు గతించినవరకు నేను గోపరస పర్వతముమీద వసించెదను. అగరు కొండమీద నివసించెదను.

7. ప్రేయసీ! నీవు సంపూర్ణసౌందర్యవతివి. నీయందు కళంకమేమియు లేదు.

8. వధువా! నీవు లెబానోను కొండల మీది నుండి దిగిరమ్ము. లెబానోను కొండమీదినుండి దిగిరమ్ము, సింగములు, చిరుతపులులు వసించెడి అమాన పర్వత శిఖరమునుండి, సెనీరు, హెర్మోను కొండకొమ్ముల మీదినుండి క్రిందికి దిగిరమ్ము.

9. సోదరీ! వధువా! ఒక్క వాలు చూపుతోనే, ఒక్క కంఠహారముతోనే నీవు నా హృదయము దోచుకొంటివి.

10. సోదరీ! వధువా! నీ ప్రేమ నాకు పరమానందము కలిగించుచున్నది. నీ అనురాగము ద్రాక్షారసముకంటెను శ్రేష్ఠమైనది. నీవు పూసికొనిన సుగంధముల సౌరభము, సకల పరిమళద్రవ్యముల సువాసనను మించినది.

11. ప్రేయసీ! నీ పెదవులనుండి తేనెలు జాలువారుచున్నవి. నీ జిహ్వ పాలుతేనెలతో నిండియున్నది. నీ దుస్తులు లెబానోను సురభిళమును గుబాళించుచున్నవి.

12. నా సోదరి, నా వధువు అన్యులు ప్రవేశింపరాని సొంత ఉద్యానవనము వంటిది. అన్యులు సేవింపరాని సొంత జలధారవంటిది.

13. ఆ తోటలో మొక్కలు పెరుగును. అవి దానిమ్మ చెట్లవలె ఎదిగి శ్రేష్ఠమైన పండ్లు ఫలించును.

14. అచట జటామాంసి, కుంకుమపువ్వు, నిమ్మగడ్డి, లవంగము మరియు సాంబ్రాణి చెట్లు పెరుగును. గోపరసపుమొక్కలు, గంధరసపు మొక్కలు పెరిగి నానాపరిమళములు గుబాళించుచుండును.

15. నా సోదరీ! వధువా! నీవు ఉద్యానవనములోని జలాశయమువంటిదానవు. నీవు నీటి బుగ్గలున్న బావివంటిదానవు. లెబానోను కొండలనుండి పారు సెలయేరువంటిదానవు. ఈ జలములు ఆ తోటను తడుపుచుండును.

16. ఉత్తరవాయువు మేలుకొనునుగాక! దక్షిణవాయువు వీచునుగాక! అవి నా వనముమీద వీచి దాని సువాసనలను ఎల్లయెడల విరజిమ్మునుగాక! నా ప్రియుడు తన వనమున కేతెంచి దానిలోని శ్రేష్ఠఫలములు భుజించునుగాక!

 1. సోదరీ! వధువా! నేను నా వనమున ప్రవేశించితిని. ఇచట గోపరసమును, సాంబ్రాణి తైలమును సేకరించుకొంటిని. మధుకోశమునుండి తేనెనారగించితిని. ద్రాక్షారసము, పాలు సేవించితిని. చెలికత్తెలు ప్రేయసీ ప్రియులారా! మీరు ప్రేమ వలన మత్తెక్కినవరకు భుజింపుడు, పానీయములు సేవింపుడు.

2. నేను నిద్రించుచున్నానేగాని, నా హృదయము మేలుకొనియున్నది. అదిగో! నా ప్రియుడు తలుపు తట్టుచున్నాడు. సోదరీ! ప్రేయసీ! పావురమా! నిష్కళంక సుందరీ! నాకు తలుపు తెరువుము. నా తల మంచులో తడిసియున్నది. నా శిరోజములు రేయి కురిసిన మంచు బిందువులవలన తడిసి ఉన్నవి.

3. నేను వస్త్రములను తొలగించితిని. వానిని మరల ధరింపనేల? పాదములను కడుగుకొంటిని, వానిని మరల మురికి చేసికోనేల?

4. నా ప్రియుడు తలుపుసందులో చేయిపెట్టెను. నా హృదయము ఆనందముతో పొంగిపోయినది.

5. అపుడు నా ప్రియునికి తలుపు తీయుటకుగాను నేను లేచితిని. నేను తలుపుగడె తీయబోగా, గోపరసము నా చేతులమీదినుండి, వ్రేళ్ళ మీదినుండి కారి ఆ గడెమీద పడెను.

6. నేను ద్వారమును తెరచితిని. కాని అతడు వెనుదిరిగి వెళ్ళిపోయెను. అతడు వెడలిపోగా, నా హృదయము క్రుంగిపోయెను. నేను అతని కొరకు గాలించితినిగాని, అతడు కనిపింపలేదు. అతనిని పిలిచితినిగాని, అతడు జవాబు చెప్పలేదు.

7. పట్టణమునకు గస్తీ కాయువారు నాకు ఎదురు వచ్చిరి. వారు నన్ను కొట్టి గాయపరచిరి. నగరద్వారముచెంత కావలి కాయువారు, నా పై వస్త్రమును లాగుకొనిరి.

8. యెరూషలేము కుమార్తెలారా! నేను మీకానవెట్టి చెప్పుచున్నాను. మీరు నా ప్రియుని చూచెదరేని, నేను ప్రేమవలన జబ్బుపడియున్నానని చెప్పుడు.

9. స్త్రీలలో కెల్ల సొగసైనదానా! నీ ప్రియునిలోని విశిష్టగుణమేమిటి? నీవు మాకిట్లు ఆన పెట్టుటకు నీ ప్రియుని గొప్పతనమేమిటి?

10. నా ప్రియుడు సొగసైనవాడు, ఎఱ్ఱనివాడు, పదివేలమందిలోను మెరుగైనవాడు.

11. అతని తల మేలిమి బంగారమువలె నుండును. అతని శిరోజములు ఖర్జూరపు గెలలవలె వ్రేలాడుచు, కాకి నలుపుతో నిగనిగ లాడుచుండును.

12. అతని కన్నులు పాలలో స్నానమాడి పారునీటిచెంత వాలియున్న కపోతములవలె నుండును.

13. అతని చెక్కిళ్ళు సుగంధమూలికలు పెరుగు మడులవలె సువాసనలొలుకుచుండును. అతని పెదవులు గోపరసమున తడిసిన లిల్లీ పూలవలెనున్నవి.

14. అతని హస్తములు రత్నములు తాపించిన బంగారు కడ్డీలు, అతని వక్షము నీలమణులు పొదిగిన దంతపుదిమ్మె.

15. అతని పాదములు బంగారపు పాదులో నెలకొల్పిన చలువరాతి స్తంభములు. అతడు లెబానోను కొండలవలె, తమాల వృక్షములవలె చూపట్టును.

16. అతని సంభాషణము మహామధురముగా ఉండును. అతడు అన్నివిధముల కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా! నా ప్రియుడు, నా స్నేహితుడు, ఇట్టి గుణములు కలవాడు.

 1. స్త్రీలలోకెల్ల సొగసైనదానా! నీ ప్రియుడు ఎచటికి వెళ్ళెను? అతడేదారిన వెళ్ళెనో చెప్పుము. అతనిని వెదకుటకు మేము సాయపడుదుము.

2. నా ప్రియుడు సుగంధమూలికలు పెరుగు తన వనమునకు వచ్చెను. అతడు ఆ తోటలో తన మందను మేపును. అచట లిల్లీ పూలు కోయును.

3. నా ప్రియుడు నావాడు, నేను అతనిదానను. అతడు లిల్లీ పూల నడుమ తన మందను మేపును.

4. ప్రియమైన దానా! నీవు తీర్సాపట్టణమువలె సుందరమైదానవు. యెరూషలేము నగరమువలె సొగసైనదానవు. బారులుతీరిన సైన్యమువలె భయంకరమైనదానవు.

5. నీ నేత్రములు నన్ను బందీని చేయుచున్నవి. వానిని నానుండి ప్రక్కకు త్రిప్పుకొనుము.  నీ కురులు గిలాదు కొండల మీదినుండి క్రిందికి దుముకు మేకలమందలవలె ఉన్నవి.

6. నీ దంతములు, ఉన్ని కత్తిరించి కడిగి శుభ్రము చేసిన గొఱ్ఱెపిల్లలవలెనున్నవి. అవి అన్ని రెండు రెండుగా వరుసలు తీరి పొందికగా అమరియున్నవి.

7. మేలిముసుగు మాటున దాగియున్న నీ చెక్కిళ్ళు దానిమ్మ ఫలముల అర్థభాగములవలె ఉన్నవి.

8. రాణులు అరువదిమంది ఉండవచ్చును.

9. ఉపపత్నులు ఎనుబదిమంది ఉండవచ్చును. యువతులు అసంఖ్యాకముగా ఉండవచ్చును. కాని నా పావురము, నా నిష్కళంక సుందరి, ఒక్కతెయే. ఆమె తన తల్లికి ఏకైక కుమార్తె, గారాలపట్టి. ఆ యువతులెల్లరు ఆమెను చూచి ధన్యురాలని స్తుతించిరి. రాణులు, ఉపపత్నులు ఆమెను కీర్తించిరి.

10. ఉషస్సువలె చూపట్టుచు, చంద్రబింబమువలె సుందరముగాను, సూర్యబింబమువలె తేజోవంతముగాను బారులుతీరిన సైన్యములవలె భీకరముగానున్న ఈమె ఎవరు?

11. నేను బాదము తోటకు వెళ్ళితిని. ఆ లోయలో ఎదుగు లేత మొక్కలను చూడబోతిని. ద్రాక్షలు చిగురులు వేయుటను, దానిమ్మలు పూతపట్టుటను చూడబోయితిని.

12. నేను గ్రహించుకొనక మునుపే సారథి యుద్ధమునకు ఎట్లు ఉత్సహించునో, నేనును ప్రేమకొరకు అటుల ఉత్సహించునట్లు చేసితిని.

13. షూలాము యువతీ! వెనుదిరుగుము! వెనుదిరుగుము! మేము నీ సౌందర్యమును చూడగోరెదము.

1 షూలాము యువతి రెండు నాట్యబృందముల మధ్య నాట్యమాడుచుండగా మీరు ఆమెవైపు చూడనేల? 1. రాజకుమారీ! నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడచుచున్నావు?  నీ ఊరువుల వంపులు నేర్పరియైన కళాకారుడు చేసిన హారముల వంపులవలెనున్నవి.

2. నీ నాభి పానపాత్రమువలె వర్తులముగా నున్నది. అది సుగంధము కలిపిన ద్రాక్షరసముతో నిండియున్నది. నీ ఉదరము లిల్లీ పూలతో కూడిన గోధుమకట్టవలె నున్నది.

3. నీ కుచములు కవలలైన జింకపిల్లలను పోలియున్నవి.

4. నీగళము దంతమయమైన గోపురమువలెనున్నది. నీ నేత్రములు హెషోను మహానగరము ద్వారములచెంత మెరయు రెండు కోనేరు జలాశయములను తలపించుచున్నవి. నీ నాసిక దమస్కు నగరమువైపు తిరిగి, కోట బురుజువలె నిలిచియున్న లెబానోను శిఖరమును పోలియున్నది.

5. నీ శిరస్సు కర్మెలు కొండవలె ఉన్నతముగా నిలిచియున్నది. నీ జడలు నలుపు మించిన ఎరుపు రంగుతో మెరయుచున్నవి. వాని సొబగుకు రాజు బందీయయ్యెను.

6. ప్రేయసీ! నీ వెంత సుందరాంగివి! ఎంత మనోహరమైనదానవు! ఎంత ఆనందదాయినివి!

7. నీవు ఖర్జూరవృక్షమువలె సొగసైనదానవు. నీ కుచములు ఆ చెట్టు పండ్లగుత్తులవలె ఉన్నవి.

8. నేను ఆ చెట్టును ఎక్కి దాని పండ్లగుత్తులు కోసికొందుననుకొంటిని.

9. నీ స్తనములు నాకు ద్రాక్షగుత్తులగుగాక! నీ శ్వాసము నాకు ఆపిలు పండ్ల సువాసన అగుగాక! నీ అధరములు నాకు మేలైన ద్రాక్షారసమగుగాక!

10. ఇక ద్రాక్షాసవము నా ప్రియుని మీదికి పారునుగాక! అతని పెదవుల మీదికిని, దంతముల మీదికిని కారునుగాక! 10. నేను నా ప్రియునిదానను. అతడు నా మీద మరులు గొనును.

11. ప్రియా! మనము పొలమునకు పోవుదమురమ్ము! చేలలోని పూబొదల నడుమ రేయి గడుపుదము రమ్ము!

12. మనము వేకువనే లేచి ద్రాక్షావనమునకు పోవుదము. ద్రాక్షలు చిగిర్చి పూలు పూచినవేమో చూతము. దానిమ్మలకు పూతపట్టినదేమో పరీక్షింతము. అచట నేను నీకు నా ప్రేమను కానుక పెట్టెదను.

13. పుత్రదాత చెట్టు పూచి సువాసనలు విరజిమ్ముచున్నది. మన గుమ్మమునొద్ద ప్రశస్తమైన ఫలములున్నవి. ప్రియా! ప్రాతవియు క్రొత్తవియునైన పండ్లను నేను నీ కొరకు దాచియుంచితిని.

 1. నీవు నాకు సోదరుడవైన ఎంత బాగుగానుండెడిది! మాతల్లి స్తన్యములను గ్రోలినవాడవైన ఎంతబాగుగా నుండెడిది! అప్పుడు, నిన్ను వీధిలో కలిసికొనినప్పుడు నేను నిన్ను ముద్దు పెట్టుకొనినను ఎవరును తప్పుపట్టెడివారు కారు.

2. నేను నిన్ను మాతల్లి ఇంటికి కొనిపోయెడిదానను. అచట నీవు నాకు ఉపదేశము చేసియుండెడివాడవు. నేను నీకు సుగంధము కలిపిన ద్రాక్షారసమును, దానిమ్మ పండ్ల రసమును అందించియుండెడిదానను.

3. నీవు నీ ఎడమచేతిని నా తలక్రిందనుంచి నీ కుడిచేతితో నన్ను ఆలింగనము చేసికొనెడివాడవు.

4. యెరూషలేము కుమార్తెలారా! నేను మీకు ఆన పెట్టి చెప్పుచున్నాను. నా ప్రియురాలు స్వయముగా మేలుకొనువరకు మీరు ఆమెకు నిద్రాభంగము కలిగింపవలదు.

5. ప్రియునిమీద వాలి ఎడారినుండి వచ్చు ఈమె ఎవరు? ప్రియుడు ఆపిలుచెట్టు క్రింద, మీ అమ్మ నిన్ను గర్భము తాల్చిన తావుననే నేను నిన్ను మేలుకొలిపితిని.

6. నన్ను నీ హృదయము మీద, నీ హస్తముమీద ముద్రవలె ధరింపుము. ప్రేమ మృత్యువంత బలమైనది. అనురాగము పాతాళలోకము వలె తాను పట్టినవారిని విడువనిది. ప్రేమజ్వాలలు అగ్నిజ్వాలలవంటివి, నిప్పు మంటలవలె గనగనమండునవి.

7. అగాధ సముద్ర జలములు ప్రేమనార్పలేవు. నదీప్రవాహములు ప్రేమను ముంచివేయలేవు. ఒకడు తన పూర్తి స్వాస్థ్యమునంత ఇచ్చినను ప్రేమను కొనజాలడు. అవమానమును మాత్రమే కొనితెచ్చుకొనును.

8. మాకొక చిన్నచెల్లెలు కలదు. ఆమెకింక చనుకట్టు ఏర్పడలేదు. ఆమెకు వివాహము చేయుకాలము వచ్చినప్పుడు మనము ఏమి చేయుదము? ఆమె ప్రాకారము వంటిదైనచో, దానిని కాపాడుటకు మనము వెండి బురుజును నిర్మింతము.

9. ఆమె ద్వారము వంటిదైనచో దానిని రక్షించుటకు మనము దేవదారు వాసములను అమర్చుదము.

10. నేను ప్రాకారమువంటిదానను. నా కుచములే నా బురుజులు. నా ప్రియుడు నన్ను చల్లనిచూపున చూడగా నాకు శాంతి సౌభాగ్యములు సిద్ధించెను.

11. బాలుహామోను అను తావున సొలోమోనునకు ఒక ద్రాక్షతోటయున్నది. అతడు దానిని కాపులకు గుత్తకిచ్చెను. వారిలో ఒక్కొక్కడు అతనికి వేయి వెండినాణెములు చెల్లించును.

12. సొలోమోనునకు వేయి వెండినాణెములు ముట్టునుగాక! కాపులకు రెండువందల వెండినాణెముల ఆదాయము లభించుగాక! నా ద్రాక్షతోట మాత్రము నాకే కలదు.

13. ఉద్యానవనములందు వసించు ప్రేయసీ! నా చెలికాండ్రు నీ పలుకులు వినగోరుదురు. నేనును నీ స్వరమును వినగోరెదను.

14. ప్రియా! నీవు శీఘ్రముగా రమ్ము! సుగంధపుమొక్కలు పెరిగెడి కొండమీద, లేడివలెను, జింకపిల్లవలెను చూపట్టుము.