ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నహూము

1. నీనెవె నగరమును గూర్చిన దైవోక్తి, ఎల్కోఘు నివాసియైన నహూము చూచిన దర్శన వృత్తాంతము.

2. ప్రభువు రోషము గలవాడై పగ తీర్చుకొనువాడు. ఆయన ప్రతీకారముచేయువాడు, కోపపూరితుడు. ఆయన తన శత్రువులను దండించును, వారిపై ఆగ్రహము వెళ్ళగ్రక్కును.

3. ప్రభువు సులభముగా కోపింపడు. కాని మహా బలసంపన్నుడు. ఆయన దోషులను శిక్షింపక వదలడు. ప్రభువు నడచునపుడు తుఫాను చెలరేగును. ఆయన నడచునపుడు రేగుపాదధూళియే మేఘములు.

4. ఆయనాజ్ఞనీయగా సాగరము ఎండిపోవును. ఆయన నదులు ఇంకి పోవునట్లు చేయును. బాషాను పొలములెండి పోవును. కర్మేలుకొండ మాడిపోవును. లెబానోను పూవులు వాడిపోవును.

5. ప్రభువును చూచి పర్వతములు కంపించును. కొండలు కరగును. ఆయనయెదుట భూమి గడగడవణకును. లోకము, దానిలోని ప్రజలును భీతిల్లుదురు.

6. ఆయన ఆగ్రహమును ఎవడు తట్టుకొనగలడు? ఆయన ఉగ్రకోపమునెవడు సహింపగలడు? ఆయన తన కోపాగ్నిని క్రుమ్మరించును. ఆయన ఎదుట బండలు పొడుమగును.

7. ప్రభువు మంచివాడు. అతడు తన ప్రజలను ఆపదలనుండి కాపాడును. తనను నమ్మువారిని ఆదుకొనును.

8. ఆయన మహాప్రవాహమువలె తన శత్రువులను తుడిచిపెట్టును. తననెదిరించువారిని మృతలోకమునకు పంపును.

9. మీరు ప్రభువునకు విరోధముగా ఏమి యోచించుచున్నారు? ఆయన మిమ్ము సర్వనాశనము చేయును. రెండవమారు ఉపద్రవము కలుగకుండ ఆయన దానిని పూర్తిగా నివారించగలడు.

10. శత్రువులు ముండ్లపొదలవలె చుట్టినను, ద్రాక్షరసము త్రాగి మత్తులైనను, వారు ఎండిన గడ్డివలె భస్మమై పోవుదురు

11. నీనెవె నగరమా! నీ నుండి ప్రభువుపై కుట్రలుపన్ను దుష్టుడు బయలుదేరెను.

12. ప్రభువు తన ప్రజలైన యిస్రాయేలీయులకు ఇట్లు చెప్పెను: “అస్సిరియనులు అనేకులైనను, బలాడ్యులైనను ఆయన వారిని దాటిపోవుచుండగ వారు కోతవలె కోయబడి నిర్మూలమగుదురు నా ప్రజలారా! నేను మిమ్ము శ్రమలపాలు చేసితిని. కాని ఇకమీదట మీకు బాధలు కలుగవు.

13. మీమీదనున్న అస్సిరియనుల కాడిమ్రానును విరిచివేసెదను. వారి కట్లను తెంపుదును.

14. ప్రభువు అస్సిరియనులను గూర్చి ఈ నిర్ణయము చేసెను: ఆ జాతి పేరు నిలబెట్టు సంతానమేమియు వారికి మిగులదు. నేను వారి దైవముల మందిరములందలి పోతవిగ్రహములను చెక్కినబొమ్మలను నాశనము చేయుదును. నేను వారికి సమాధి సిద్ధము చేయుచున్నాను. ఆ ప్రజలిక బ్రతుకుటకు అర్హులు కారు”.

15. అదిగో! శుభవర్తమానము తెచ్చుదూత కొండల మీదినుండి పరుగెత్తుకొని వచ్చుచున్నాడు. అతడు విజయవార్తల నెరిగించును.యూదా ప్రజలారా! మీరు ఉత్సవములు చేసికొనుడు. మీ మ్రొక్కుబడులు తీర్చుకొనుడు. దుష్టులు మీపై మరల దాడిచేయరు. వారు అడపొడ కానరాకుండ పోవుదురు.

1. నీనెవే! నిన్ను నాశము చేయువాడు నీ మీదికి ఎత్తివచ్చుచున్నాడు. నీ బురుజులను సంరక్షించుకొనుము. నీ త్రోవకు కావలివారిని కాపు పెట్టుము. నీ సైన్యమును ప్రోగుజేసికొని పోరునకు సిద్ధము కమ్ము.

2. ప్రభువు యిస్రాయేలీయుల ఐశ్వర్యమును పునరుద్దరించును. శత్రువులు నాశనము చేయక మునుపు ఉన్న వైభవమును తిరిగి నెలకొల్పును.

3. నీ విరోధులు ఎఱ్ఱని డాళ్ళను చేబూనియున్నారు. ఎఱ్ఱని దుస్తులు ధరించియున్నారు.  వారు నీ మీద పడుటకు తయారుగా ఉన్నారు. వారి రథములు నిప్పువలె మెరయుచున్నవి. వారి అశ్వములు పోరునకు ఉత్సాహించుచున్నవి.

4. రథములు పురవీథులలో పరుగెత్తుచున్నవి. రాజమార్గమున ఇటునటు ఉరుకుచున్నవి. అవి దివిటీలవలె మెరయుచున్నవి. మెరుపులవలె ఇటునటు దుముకుచున్నవి.

5. సైనిక నాయకులను పిలుచుచున్నారు. వారు తడబడుచు వచ్చుచున్నారు. శత్రు సైనికులు ప్రాకారముచెంతకు పరుగెత్తుచున్నారు. ఆ గోడలను కూల్చు యంత్రమును అమర్చి దానికి కప్పు వేయుచున్నారు.

6. నదికెదురుగానున్న ద్వారములు తెరచుకొనినవి. రాజప్రాసాదము భయముతో నిండిపోయినది.

7. ఇది నిశ్చయము! రాణి దిగంబరియై కొనిపోబడుచున్నది ఆమె దాసీలు గువ్వలవలె ఆర్తనాదముచేయుచు, సంతాపముతో రొమ్ముబాదుకొనుచు మూలుగుచున్నారు,

8. పూర్వము నుండి నీనెవె నీటి కొలను వంటిది అయినను, ప్రజలు నీనెవె నుండి పరుగెత్తుచున్నారు. ఆగుడు! ఆగుడు! అను కేకలు వినిపించుచున్నవి. కాని ఎవరును వెనుకకు తిరిగి చూచుటలేదు.

9. వెండిని దోచుకొనుడు, బంగారమును కొల్లగొట్టుడు. నగరమున సంపదలు అనంతముగా ఉన్నవి. ప్రశస్తవస్తువులు అనేకములున్నవి.

10. నీనెవెను నాశనముచేసి కొల్లగొట్టిరి, అది పాడువడెను. ప్రజలగుండెలు భీతితో కంపించుచున్నవి. మోకాళ్ళు వణకుచున్నవి, సత్తువ నశించినది. మొగములు తెల్లబోయినవి.

11. సింహముల గుహవలె అలరారిన నగరము ఇపుడేది? సింగపు కొదమల మేతస్థలమేమాయెను? అచట పోతుసింగము, పెంటిసింగము వేటకు వెళ్ళగా వాని పిల్లలు, నిర్భయముగా మనుస్థలము ఏమాయెను?

12. ఎరను చంపి ముక్కలు ముక్కలుగా చీల్చి పెంటిసింగమునకు, పిల్లలకు నిచ్చుచూ తన గుహను చీల్చిన మాంసముతో వేటాడిపట్టిన ఎరతోను నింపిన పోతుసింహమేమాయెను?

13. సైన్యములకధిపతియైన ప్రభువిట్లనుచున్నాడు: నేను నీకు శత్రువునగుదును. నీ రథములను కాల్చివేయుదును. నీ సైనికులు పోరున చత్తురు. నీవు కొల్లగొట్టి తెచ్చిన సొత్తును నేను కొల్లగొట్టుదును.నీ దూతల బెదరింపులను ఇక ఎవరును లెక్కచేయరు.

1. నెత్తురు నొలికించిన పట్టణమునకు, కల్లలాడిన నగరమునకు వినాశము తప్పదు. ఆ పురము కొల్లసొమ్ముతో నిండియున్నది. అది కొల్లగొట్టుటను ఎన్నడును మానలేదు.

2. అదిగో! సారధి కొరడాల ఝుళిపింపు, చక్రముల ధ్వానము, గుఱ్ఱములదౌడు ధ్వని, రథముల నాదము.

3. రౌతులు ప్రాకారముల మీదికి దుముకుచున్నారు. కత్తులు మెరయుచున్నవి, ఈటెలు తళతళలాడుచున్నవి, శవములు కుప్పలుగా పడుచున్నవి, పీనుగులకు అంతములేదు. పీనుగులు కాలికి తగిలి జనులు తొట్రిల్లుచున్నారు

4. తన వ్యభిచారములకుగాను నీనెవె శిక్షనొందుచున్నది. ఆమె అందగత్తె, మంత్రవిద్యలో ఆరితేరినది. ఆమె తన రంకులతోను, మంత్రమహిమలతోను సంసారులను అమ్మివేసినది.

5. సైన్యములకధిపతియైన ప్రభువు ఇట్లనుచున్నాడు: నీనెవె! నేను నిన్ను శిక్షింతును. నీ వస్త్రపుటంచులు నీ ముఖముమీదికెత్తి జనమునకు నీ మానమును, జాతులకు నీ నగ్నత్వమును బయల్పరుతును

6. నీ మీదికి మాలిన్యమువేసి పదుగురియెదుట నిన్ను అవమానమున ముంచుదును. జనులు నిన్ను గాంచి వెరగందుదురు.

7. నిన్ను చూచిన వారెల్లరు వెనుకకు పరుగిడి 'నీనెవె నాశమైనది, ఆమెపై ఎవరు సానుభూతి చూపుదురు? ఆమెను ఓదార్చువారిని ఎటనుండి కొనిరాగలము?” అని పలుకుదురు.

8. నీనెవే! నీవు నో (తేబెసు) నగరముకంటె మెరుగైనదానవు కాదు. అదియు నీ వలె నది ప్రక్కనే ఉండెను. నైలునది జలములు దానిని ప్రాకారమువలె రక్షించుచుండెను.

9. అది కూషు, ఐగుప్తుల నేలెను. దానికి అనంతమైన బలముండెను. పూతు, లిబియా దేశములు దానికి సాయపడుచుండెను.

10. అయినను శత్రువులు ఆ నగరవాసులను బందీలుగా కొనిపోయిరి. ప్రతి త్రోవ మలుపులో దాని పసిగందులను బండలకు విసరికొట్టి చంపిరి. దాని ప్రముఖులను గొలుసులతో బంధించి తీసికొనిపోయి తమలో తాము చీట్లు వేసి పంచుకొనిరి.

11. నీనెవే! ప్రభువు శిక్ష అను పానీయము త్రాగుటవలన నీకును మత్తెక్కును. నీవును శత్రువులనుండి తప్పించుకోగోరుదువు.

12. నీ కోటలన్నియు తొలికాపుపండ్లుగల అత్తిచెట్ల వంటివి. ఒకడు ఆ చెట్లను పట్టి ఊపినచో ఆ పండ్లురాలి, వాని నోటిలో పడును.

13. నీ సైనికులు స్త్రీల వంటివారు. శత్రువులు దాడిచేసినపుడు నీ దేశమునకు రక్షణములేదు. నీ ద్వారముల అడ్డుగడెలు అగ్నికాహుతి అగును.

14. నీవు ముట్టడికిగాను నీరు తోడుకొని ఉంచుకొనుము. నీ కోటలను పటిష్టము చేసికొనుము. ఇటుకలను చేయుటకు జిగటమట్టిని తొక్కుము. ఇటుక మూసలను, ఆవమునుసిద్ధము చేసికొనుము.

15. నీవు ఎన్ని యత్నములు చేసినను అగ్ని నిన్ను దహింపక మానదు. ఖడ్గములు నిన్ను వధింపక మానవు. నీవు మిడుతల వాతబడిన పైరువలె నాశనమగుదువు.

16. నీ పౌరులు మిడుతలవలె వృద్ధిజెందిరి. నీ వర్తకులు ఆకసమునందలి చుక్కల కంటెను నెక్కువగా వ్యాపించిరి. కాని వారిపుడు ఎగిరిపోయిన మిడుతలవలె అదృశ్యమైరి.

17. నీ అధికారులు చలిగానున్నపుడు గోడలమీద వాలియుండు మిడుతల వంటివారు. కాని సూర్యుడు ఉదయింపగనే ఆ మిడుతలెగిరిపోవును. అవి ఎచటికి పోయినవో ఎవరికిని తెలియదు.

18. అస్సిరియా రాజా! నీ కాపరులు చచ్చిరి. నీ నాయకులు దీర్ఘనిద్ర చెందిరి. నీ ప్రజలు కొండలపై చెల్లాచెదరైరి. వారిని మరల ప్రోగుజేయువాడు ఎవడును లేడు.

19. నీకు తగిలిన దెబ్బలకు మందులేదు. నీ గాయములు ఇక నయముకావు. నీ వినాశనము గూర్చి వినినవారెల్లరును సంతసముతో చప్పట్లు కొట్టుదురు. హద్దులేని నీ క్రూరత్వమునకు బలిగాని వారు ఎవరైనా ఉన్నారా?