ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

జెఫన్యా

1. ఆమోను కుమారుడైన యోషీయా యూదా రాజ్యమునకు రాజుగానున్న కాలమున ప్రభువు జెఫన్యాకు తెలియజేసిన సందేశమిది. కూషి, గెదల్యా, అమర్యా, హిజ్కియా క్రమముగా అతనికి మూల పురుషులు.

2. ప్రభువిట్లనెను: “నేను భూమిమీద ఉన్నవానినెల్ల నాశనము చేయుదును.

3. నరులు, పశువులు, పక్షులు, చేపలన్నియు చచ్చును. నేను దుష్టులను నిర్మూలింతును. నరుల నెల్లరిని నేలమీదినుండి తుడిచిపెట్టుదును. ఇది ప్రభుడనైన నా వాక్కు"

4. నేను యూదావాసులను, యెరూషలేము పౌరులను దండింతును. అచట కనిపించు దబ్బరదేవర బాలు ఆరాధన చిహ్నములెల్ల తొలగింతును. అతని భక్తులలో మిగిలినవారిని, వానికి నివేదింపబడినవారిని, దాని అర్చకులను నాశనము చేయుదును ఎల్లరును వారిని విస్మరింతురు.

5. మిద్దెల మీదికెక్కి సూర్యచంద్ర నక్షత్రములను కొలుచువారిని హతమారును. నా నామము బట్టియు, తమకు రాజను దాని పేరునుబట్టియు మ్రొక్కి బాసచేయువారిని హతమారును.

6. నన్ను విడనాడినవారిని, నా చెంతకు రానివారిని, ఆ నన్ను సంప్రతింపని వారిని కూడ హతమారును".

7. ప్రభువు తీర్పు తీర్చురోజు సమీపించినది. కావున మీరు ఆయన ఎదుట మౌనముగా ఉండుడు. ప్రభువు తన ప్రజలను బలి ఇచ్చుటకు సంసిద్ధుడయ్యెను. ఆయన యూదాపై దండెత్తుటకు శత్రువుల నాహ్వానించెను.

8. ప్రభువిట్లనుచున్నాడు: ప్రభువు బలిదినమున నేను రాజోద్యోగులను, రాజకుమారులను, అన్యదేశాచారములను పాటించు వారిని శిక్షింతును.

9. ఆ రోజున నేను తమ యజమానుని ఇండ్లగడపను దాటి హింసతోను, మోసముతోను ఆ ఇండ్లను నింపిన వారిని దండింతును.

10. ఆ దినము మీరు యెరూషలేములోని మత్స్యద్వారమువద్ద రోదన శబ్దమును, నగరము నూత్నభాగమున శోకాలాపములు ఆలింతురు. కొండల దిక్కునుండి గొప్పనాశనము వచ్చును

11. మక్తేషు లోయలో వసించువారలారా! మీరు ఈ శబ్దములు వినినపుడు అంగలార్పుడు. ఏలయన కనానీయుల (వ్యాపారస్తులు) ప్రజలందరును నశించిరి. వెండిని తూకమువేయు వారందరును నశించిరి.

12. ఆ కాలమున నేను దీపమును తీసికొని యెరూషలేమునెల్ల గాలింతును. తేటబడిన ద్రాక్షరసమువంటివారై ప్రభువు మంచినిగాని, చెడునుగాని చేయడులే అని అనుకొను వారిని శిక్షింతును.

13. శత్రువులు వారిండ్లను నాశనము చేసి, వారి సంపదను కొల్లగొట్టుదురు. ఈ వారు తాము కట్టుకొనిన భవనములలో వసింపజాలరు. తాము నాటుకొనిన ద్రాక్షతోటలనుండి రసమును త్రాగజాలరు.

14. ప్రభువు మహాతీర్పుదినము సమీపించినది. అది వేగముగా వచ్చుచున్నది. ఆ దినము మిగుల సంతాపకరమైనది. ఆనాడు ధైర్యవంతులైన శూరులుకూడ నిట్టూర్పు విడుతురు.

15. అది ఆగ్రహపూరితమైన దినము. శ్రమను, శోకమును తెచ్చి పెట్టు దినము. వినాశమును, విధ్వంసమును కొనివచ్చుదినము. అంధకార బంధురమును విషాదమయమునైన దినము. మబ్బులు కమ్మి చిమ్మచీకట్లు ఆవరించియుండు దినము.

16. అది యుద్ధమునకు బాకానూదెడి దినము. సైనికులు సురక్షిత నగరముల చెంతను, బురుజుల చెంతను యుద్ధ ఘోషణ చేయుదినము.

17. ప్రభువు ఇట్లనుచున్నాడు: నేను ప్రజలను ఘోరవిపత్తునకు గురిచేయుదును. నరులు గ్రుడ్డివారివలె తడవుకొనుచు తిరుగుదురు. వారు నాకు ద్రోహము చేసిరి. కాన శత్రువులు వారి నెత్తుటిని నీటివలె చల్లుదురు. వారి శవములు పెంటప్రోవులవలె నేలపై పడియుండును.

18. ప్రభువు తన ఆగ్రహమును ప్రదర్శించు దినమున వారి వెండి బంగారములు కూడ వారిని రక్షింపజాలవు. ఆయన రోషాగ్నిచే, ఆయన కోపాగ్నివలన భూమి అంతయు భస్మమగును. ఆ ఆయన భూమిపై వసించువారినందరిని హఠాత్తుగా హతమార్చును.

1-2. సిగ్గుమాలిన ప్రజలారా! మీరు కళ్ళములోని పొట్టువలె ఎగిరిపోకమునుపే, ఆ ప్రభువు కోపాగ్ని మీపై దిగిరాక మునుపే, ఆయన తన అగ్రహమును ప్రదర్శింపక మునుపే బుద్దితెచ్చుకొనుడు.

3. దేశములోని వినయవంతులైన ప్రజలారా! దేవుని ఆజ్ఞలు పాటించుజనులారా! మీరు ప్రభువు వద్దకురండు, న్యాయమును పాటింపుడు. వినయమును అలవర్చుకొనుడు. ప్రభువు తన కోపమును ప్రదర్శించు దినమున మీరు శిక్షను తప్పించుకొనిన తప్పించుకోవచ్చును.

4. గాజా ఎడారి అగును. అష్కేలోను నిర్మానుష్యమగును. అష్దోదును మిట్టమధ్యాహ్నము ముట్టడింతురు. ఎక్రోను నిర్మూలమగును.

5. సముద్ర తీరమునవసించు ఫిలిస్తీయులారా! మీకు వినాశనము తప్పదు. ప్రభువు మీపై శిక్షను ప్రకటించెను. ఆయన మిమ్ము తుడిచిపెట్టును మీలో ఒక్కడును బ్రతుకడు.

6. సముద్రతీరమునందలి మీ భూమి గొఱ్ఱెల మేతస్థలమగును. అచట కాపరుల గుడిసెలు, గొఱ్ఱెలదొడ్లు వెలయును.

7. ప్రభువే యూదావారిని కటాక్షించి, చెరనుండి విడిపింపగ వారిలో శేషించినవారికి అచట ఒక స్థలముండును వారు అచట తమ గొఱ్ఱెలు మేపుకొనుచు అస్తమయమున వారు అష్కేలోను గృహములలో నిదురింతురు.

8. సర్వోన్నతుడైన ప్రభువిట్లనుచున్నాడు: నేను మోవాబీయులును, అమ్మోనీయులును నా ప్రజలను అవమానించి, నిందించుట చూచితిని. తాము వారి భూమిని ఆక్రమించుకొందుమని ప్రగల్భములు పలుకుటను వింటిని.

9. సజీవుడను, యిస్రాయేలు దేవుడనైన నేను బాస చేయుచున్నాను. మోవాబు, అమ్మోను సొదొమ గొమొఱ్ఱాలవలె నాశనమగును. అవి శాశ్వతముగా నాశనమై ఉప్పు గుంటలగును. అచట ముండ్ల తుప్పలెదుగును. నా జనులలో శేషించినవారు ఆ నగరములను దోచుకొని, వాని భూములను ఆక్రమింతురు. ఇది సైన్యములకధిపతియగు ప్రభువు వాక్కు.

10. మోవాబు, అమ్మోను ప్రజలకు పొగరెక్కినది. వారు సర్వోన్నతుని ప్రజలను నిందించిరి. కావున వారికీ శిక్షపడును.

11. ద్వీపములలో నివసించు ప్రజలందరును తమతమ స్థానములనుండి తనకే నమస్కారము చేయునట్లు అతడు భూమిమీది అన్యదైవములనెల్ల నాశనము చేయును. ప్రభువు వారికి భయంకరుడుగా ఉందును.

12. ప్రభువు కూషీయులను గూడ కత్తితో సంహరించును.

13. ప్రభువు ఉత్తరదిక్కున తన హస్తమునుచాపి అస్సిరియాను నాశనము చేయును. అతడు నీనెవెను ఎడారి చేయును. నీరులేని మరుభూమిని చేయును.

14. అచట పశులమందలు, వన్యమృగములు పండుకొనును. గుడ్లగూబలు అచటి శిథిలగృహములలో వసించుచు కిటికీలనుండి కూతలు పెట్టును. కాకులు వాని ద్వారబంధముల మీదినుండి అరచును. జనులు ఆ గృహముల దేవదారు కొయ్యను అపహరింతురు.

15. తమ బలమును తలంచుకొని పొంగిపోయి నేను సురక్షితముగా ఉన్నాననుకొనిన నగరమునకిట్టి గతిపట్టును. అది తనకు సాటి నగరము లేదని ఎంచుచున్నది. కాని అది సర్వనాశనమై వన్యమృగములకు ఆటపట్టగును. దారినబోవు జనులందరు దానిని గాంచి భీతిల్లుదురు. 

1. తిరుగుబాటు చేయునదియు, భ్రష్టురాలును, తన ప్రజలను తానే పీడించునదియునైన యెరూషలేమునకు అనర్ధము తప్పదు.

2. అది ప్రభువు పలుకును ఆలింపదయ్యెను. ఆయన క్రమశిక్షణకు లొంగదయ్యెను. ఆయనను నమ్మదయ్యెను, ఆయనచెంతకు రాదయ్యెను.

3. దాని అధికారులు గర్జించు సింహములవంటివారు న్యాయాధిపతులు ఆకలిగొనిన తోడేళ్ళ వంటివారు. వారు తమ ఎరలో ఒక్క ఎముకనైనను, ఉదయమువరకు మిగిలియుండనీయరు.

4. దాని ప్రవక్తలు బాధ్యత తెలియనివారు, నిజాయితీ లేనివారు. యాజకులు పవిత్ర వస్తువులను అపవిత్రము చేయుదురు. ధర్మశాస్త్రమును తమకు అనుకూలముగా మార్చుకొందురు.

5. అయినను ప్రభువింకను ఆ నగరముననే ఉన్నాడు. అతడు అన్యాయమునకుగాక మన న్యాయమునకు పూనుకొనును. ప్రతి ఉదయము తన ప్రజలకు తప్పక న్యాయము తీర్చును. ఆయనకు మరుగైయున్నదేదియులేదు. అయినను అచటి అవినీతిపరులు , సిగ్గుమాలినవారై చెడుచేయుచునేయున్నారు.

6. ప్రభువిట్లనుచున్నాడు: నేను జాతులను సంపూర్ణముగా నాశనము చేసితిని. వారి నగరములను నేలమట్టము చేసితిని. వారి ప్రాకారములను బురుజులను కూలద్రోసితిని. వారి పట్టణములు నిర్మానుష్యమయ్యెను. వారి వీధులు నిర్జనములయ్యెను.

7. అది చూచి వారు నా పట్ల భయభక్తులు చూపుదురనియు, నా క్రమశిక్షణను అంగీకరింతురనియు, నేను నేర్పిన గుణపాఠమును గుర్తుంచుకొందురనియు నేనాశించితిని. కాని వారు అనతికాలముననే తాము పూర్వముచేసిన దుష్కార్యములు తిరిగి ప్రారంభించిరి.

8. కనుక మీరు కొంచెము తాళుడు. నేను జాతులమీద నేరముమోపు కాలమువరకు వేచియుండుడు. నేను జాతులను, రాజ్యములను ప్రోగుచేసి వారు నా కోపప్రభావమును గుర్తించునట్లు చేయుదును.  నా క్రోధాగ్నివలన భూమియంతయు భస్మమగును.

9. "అపుడు నేను అన్యజాతి ప్రజలకు హృదయములు మార్చెదను. అది వారు పరదైవములను విడనాడి నాకు ప్రార్ధన చేయుదురు, నన్నే సేవింతురు.

10. కూషుదేశ నదులకు ఆవలనుండియు , చెల్లాచెదరైయున్న నా ప్రజలు నాకు కానుకలు కొనివత్తురు.

11. యిస్రాయేలీయులారా! అపుడు మీరు మేము పూర్వము ప్రభువునకెదురు తిరిగితిమికదా'! అని సిగ్గుపడనక్కరలేదు. అపుడు నేను మీనుండి , గర్వాత్ములనెల్ల తొలగింతును. నా పవిత్ర నగరముపైని మీరు మరల పొగరుతో విఱ్ఱవీగరు.

12. దుఃఖితులగు దీనులను ప్రభువు నామమును ఆశ్రయించువారిగను మీ నడుమ శేషముగా ఉండనిత్తును,

13. యిస్రాయేలీయులలో శేషించినవారు ఎవరికిని కీడుచేయరు, కల్లలాడరు, మోసము చేయరు. వారెవరి భయమును లేక సురక్షితముగా మనుచు వృద్ధిలోనికి వత్తురు.

14. సియోను కుమారీ! ఆనందనాదము చేయుము. యిస్రాయేలూ! హర్షధ్వానము చేయుము. యెరూషలేము కుమారీ నిండుహృదయముతో సంతసించి గంతులు వేయుము.

15. ప్రభువు నీ దండనము తొలగించెను. నీ శత్రువులను చెల్లాచెదరు చేసెను. యిస్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమనున్నాడు. కావున నీవు ఇక ఏ కీడునకును భయపడనక్కరలేదు.

16. ప్రజలు యెరూషలేముతో ' సియోనూ! నీవు భయపడకుము. భీతివలన నీ చేతులు క్రిందికి వ్రేలాడనక్కరలేదు'" అని పలుకు రోజులు వచ్చుచున్నవి.

17. నీ దేవుడైన ప్రభువు నీ నడుమనున్నాడు. ఆయన బలము వలన నీకు విజయము కలుగును. ఆయన నిన్ను గాంచి ఆనందించును. ప్రేమతో నీకు నూత్నజీవమును ఒసగును. నిన్ను తలంచుకొని సంతసముతో పాటలు పాడును.

18. ఉత్సవదినమునవలె ఆనందించును. ప్రభువిట్లనుచున్నాడు: నేను నీ వినాశమును తొలగించితిని. నీ అవమానమును తుదముట్టించితిని.

19. నేను త్వరలోనే నీ పీడకులను శిక్షింతును. కుంటివారిని రక్షింతును. ప్రవాసులను ఇంటికి కొనివత్తును. వారికి కలిగిన అవమానమును కీర్తిగా మారును. అపుడు లోకమంతయు వారిని స్తుతించును.

20. నేను చెదరిపోయిన మీ ప్రజలను మరల ఇంటికి కొనివచ్చుకాలము వచ్చుచున్నది. అపుడు మీరు ప్రపంచమందంతట కీర్తిని బడయుదురు. మరల వృద్దిలోనికి వత్తురు.  ఇది ప్రభువు వాక్కు