ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

దానియేలు

1. యెహోయాకీము యూదాను పరిపాలించిన కాలము మూడవయేట బబులోనియారాజగు నెబుకద్నెసరు యెరూషలేము మీదికి వచ్చి దానిని ముట్టడించెను.

2. ప్రభువు యూదారాజు యెహోయాకీమును, దేవాలయములోని మిగిలియున్న ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను. అతడు వానిని బబులోనియాకు కొనిపోయి తాను కొలుచు దేవతల మందిరపు ఖజానాలో ఉంచెను.

3. ప్రవాసులుగా వచ్చిన యిస్రాయేలీయుల నుండి రాజవంశమునకును, ఉన్నత కుటుంబముల కును చెందిన యువకులను కొందరిని ఎన్నుకొమ్మని ఆ రాజు తన ప్రధానాధికారియైన ఆష్పెనసు అను నపుంసకుల అధిపతికి ఆజ్ఞ ఇచ్చెను. 

4. వారికి అందమును, తెలివితేటలును, ప్రావీణ్యమును ఉండవలెను. శారీర కములైన లోపములుండరాదు. వారు మంచి శిక్షణ పొందవలెను. తరువాత వారు రాజునకు కొలువు కాండ్రుగా పనిచేయుదురు. ఆష్పెనసే వారికి బబులోనియా భాష, శాస్త్రములు నేర్పవలెను.

5. మరియు ఆ యువకులకు రాజభవనమునుండియే భోజనము, ద్రాక్షసారాయము పంపవలెనని రాజు ఆజ్ఞాపించెను. ఈ రీతిగా వారు మూడేండ్లు తర్పీదు పొందిన పిమ్మట రాజునకు కొలువు చేయవలెను.

6. అట్లు ఎన్నికయిన యువకులలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజరయా అను వారుండిరి. వారెల్లరును యూదా తెగకు చెందినవారు.

7. ఆష్పెనసు దానియేలునకు బెల్తేషాజరు అనియు, హనన్యాకు షడ్రకు అనియు, మిషాయేలునకు మేషకు అనియు, అజరయాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టెను.

8. దానియేలు రాజభవనమునుండి వచ్చిన ఆహారపానీయములను స్వీకరించి తాను అపవిత్రుడు కారాదనియెంచెను.

9. కనుక అతడు తన్ను అపవిత్రత నుండి కాపాడుమని ఆష్ఫెనసును వేడుకొనెను. ప్రభువు ఆష్మెనసునకు అతనిపై దయసానుభూతి కలుగునట్లు చేసెను.

10. కాని ఆ అధికారి రాజునకు వెరచెను. కనుక అతడు దానియేలుతో “మీరేమి భుజింపవలెనో ఏమి త్రాగవలెనో రాజే నిర్ణయించెను. మీరు ఇతర యువకులవలె పుష్టిగానుండనిచో అతడు నా తల తీయించును” అని చెప్పెను.

11. కనుక దానియేలు, ప్రధానాధికారి తనకును, తన ముగ్గురు మిత్రులకును సంరక్షకునిగా నియమించిన వాని యొద్దకుపోయి,

12. "అయ్యా! నీవు మమ్ము పదిరోజులపాటు పరీక్షించిచూడుము. మాకు భుజించుటకు శాకాహారము, త్రాగుటకు నీళ్ళు మాత్రమిమ్ము.

13. అటుపిమ్మట మమ్ము రాజభవనమునుండి వచ్చిన భోజనమును ఆరగించిన యువకులతో పోల్చి చూడుము. అప్పుడు నీవే నిర్ణయము చేసి మాపట్ల తగినట్లుగా వ్యవహరింపుము” అనెను.

14. అతడు వారి పలుకులను అంగీకరించి పదిరోజులపాటు వారిని పరీక్షించి చూచెను.

15. ఆ గడువు కడచిన పిదప వారు రాజభో జనము ఆరగించిన యువకుల కంటె ఆరోగ్యముగను, బలముగను కనిపించిరి.

16. కనుక అప్పటినుండి ఆ సంరక్షకుడు వారిని రాజభోజనమునకు బదులుగా శాకాహారమునే తినని చ్చెను.

17. దేవుడు ఆ నలుగురు యువకులకు భాషయందును, విజ్ఞానమందును తెలివిని, నైపుణ్యమును దయచేసెను. పైగా దానియేలునకు దర్శనములకును, స్వప్నములకును అర్థమును చెప్పు నేర్పునుగూడ ప్రసాదించెను.

18. రాజు పెట్టిన గడువుముగిసిన తరువాత ఆష్ఫెనసు యువకులనందరిని నెబుకద్నెసరు సమక్షమునకు కొనిపోయెను.

19. రాజు వారందరితో సంభాషించెను. కాని ఎల్లరిలోను దానియేలు, హనన్యా, మిషాయేలు, అజరియా మిన్నగానుండిరి. కనుక వారు రాజునకు సేవలు చేయనారంభించిరి.

20. రాజు ఏ విజ్ఞానవిషయమునడిగినను, ఏ సమస్య గూర్చి ప్రశ్నించి నను ఈ నలుగురు యువకులకు అతని రాజ్యము మొత్తములోని జ్యోతిష్కులకంటెను, మాంత్రికుల కంటెను పదిరెట్లు అదనముగా తెలిసియుండెను.

21. కోరెషు చక్రవర్తి బబులోనియాను పరిపాలించిన తొలియేటివరకు రాజు ఆస్థానముననే దానియేలు ఉండెను.

1. నెబుకద్నెసరు పరిపాలనాకాలము రెండవయేట అతనికొక కల వచ్చెను. అది ఆ రాజును కలవర పెట్టుటచే అతడు నిద్రింపజాలడయ్యెను.

2. కనుక అతడు ఆ స్వప్నమును వివరించుటకుగాను తన మాంత్రికులను, శాకునికులను, గారడీవిద్యగలవారిని, కల్దీయులను పిలువనంపెను. వారెల్లరునువచ్చి అతనియెదుట నిలుచుండిరి.

3. అతడు వారితో “నేనొక కలగంటిని. అది నన్ను కలత పెట్టుచున్నది. నేను దాని భావమేమిటో తెలిసికోగోరెదను” అనెను.

4. కల్దీయులు అరమాయికు భాషలో “ప్రభువుల వారు కలకాలము జీవింతురుగాక! మీరు కనిన కలయేమో తెలియజేసినయెడల మేము దాని భావమును వివరింతుము” అనిరి.

5. రాజు వారితో “నేను దానిని మరిచిపోతిని గాని, మీరు నాకు నా కలను దాని భావమునుకూడ తెలియజేయని యెడల నేను మిమ్ము ముక్కలు ముక్కలుగా నరికించి, మీ ఇండ్లను నేలమట్టము చేయింతును.

6. కాని మీరు నా స్వప్నమును దాని అర్థమును తెలియచేయుదురేని నేను మిమ్ము బహుమతులతో సత్కరించి సన్మానింతును. కనుక ఇప్పుడు మీరు నా కలను దాని భావమును తెలియజేయుడు” అని పలికెను.

7. వారు రాజుతో మరల “ప్రభువులవారు తమ కల ఏమో సెలవిచ్చిన మేము దాని భావమును వివరింపగలము” అనిరి.

8. రాజు వారితో “నేను మరిచియుండుట మీరుచూచి, కాలహరణము చేయ జూచు చున్నారు.

9. నా కలను ఎరిగింపలేని మీకెల్లరికిని ఒకటే శిక్షపడును. మనము అబద్దములు చెప్పి కాలము గడపవచ్చునని అంతలో పరిస్థితులు మారునని మీలో మీరు కూడబలుకుకొంటిరి. మీరు నా కల ఏమిటో చెప్పుడు. అప్పుడు మీకు దాని భావమును తెలియజేయుటకు మీకు సామర్ధ్యము కలదని నేను తెలిసికొందును” అనెను.

10. కల్దీయులు రాజుతో “ప్రభువుల వారికి తామెరుగగోరిన విషయమును చెప్పగలవాడెవడును ఈ భూలోకమునలేడు. ఏ రాజును ఏనాడును, ఎంత గొప్పవాడైనను, ఎంత శక్తిమంతుడైనను, తన మాంత్రికులను, శాకునికులను, గారడీవిద్యగలవారిని, కల్దీయులను ఇట్టి ప్రశ్న అడిగియుండలేదు.

11. ప్రభువుల వారడుగునది కష్టమైన ప్రశ్న. దేవతలేగాని నరులెవ్వరును దానికి జవాబు చెప్పలేరు. ఆ దేవతలు నరలోకమున వసింపరు” అని జవాబు చెప్పిరి.

12. ఆ మాటలకు రాజు మహాఆగ్రహముచెంది బబులోనియా జ్ఞానులనెల్ల వధింపుడని ఆజ్ఞాపించెను.

13. కనుక జ్ఞానులనెల్ల వధింపవలెనని శాసనమును ప్రకటించిరి. అందుచే దానియేలును అతని మిత్ర బృందమునుగూడ చంపగోరి వారికొరకు వెతకిరి.

14. అంతట దానియేలు రాజసంరక్షకులకు నాయకుడైన అర్యోకునొద్దకు పోయెను. జ్ఞానులను చంపించువాడతడే. దానియేలు తెలివితోను, నేర్పు తోను మాటలాడుచు,

15. రాజు ఇట్టి కఠినశాసనము ఏల జారీచేసెను” అని అర్యోకు నడిగెను. అతడు జరిగిన సంగతిని చెప్పెను.

16. వెంటనే దానియేలు, రాజు సమక్షమునకు పోయి స్వప్నార్థమును తెలియజేయుటకు కాల వ్యవధిని దయచేయుడని అడిగి, అనుమతి పొందెను.

17. అటుపిమ్మట అతడు ఇంటికిపోయి తన మిత్రులైన హనన్యా, మిషాయేలు, అజరయాలకు జరిగిన సంగతి పూసగ్రూచ్చినట్లు చెప్పెను.

18. అతడు వారితో “మనము పరలోకమందున్న దేవునికి ప్రార్థన చేయుదము. అతడు మనపై దయచూపి ఈ రహస్యమును మనకు తెలియచేయవలెనని వేడుకొందము. అపుడు మనము బబులోనియాలోని జ్ఞానులతోపాటు చావనక్కరలేదు” అని చెప్పెను.

19. ఆ రాత్రియే దేవుడు ఒక దర్శనములో దానియేలునకు ఆ రహస్యమును తెలియజేసెను. కనుక అతడు పరలోకయధిపతియైన దేవుని ఇట్లు స్తుతించెను:

20. “దేవునకు సదాస్తుతి కలుగునుగాక! ఆయన జ్ఞానమును, బలమును కలవాడు.

21. కాలమును, ఋతువులును ఆయన ఆధీనమున ఉండును. ఆయన రాజులను గద్దెనెక్కించును, కూలద్రోయును. నరులకు జ్ఞానమును, వివేకమును దయచేయును.

22. ఆయన నిగూఢమైన రహస్యములను తెలియజేయును. అంధకారమున దాగియున్న సంగతులు ఆయనకు తెలియును. వెలుగు ఆయనను ఆవరించియుండును.

23. మా పితరులదేవా! నేను నిన్ను స్తుతించి కీర్తింతును. నీవు నాకు వివేకమును, బలమును దయచేసితివి. నీవు మా ప్రార్థన ఆలించి రాజు తెలిసికోగోరిన సంగతిని మాకు ఎరిగించితివి”.

24. అంతట దానియేలు అర్యోకువద్దకు వెళ్ళెను. జ్ఞానులనువధింప రాజతనిని ఆజ్ఞాపించియుండెను. దానియేలు అతడితో “మీరు జ్ఞానులను సంహరించనక్కరలేదు. నన్ను రాజు సముఖమునకు కొనిపొండు. నేనతనికి స్వప్నమును, దాని భావమును వివరింతును” అని చెప్పెను.

25. వెంటనే అర్యోకు దానియేలును రాజు సమక్షమునకు కొనిపోయి, “నేను ప్రభువులవారి స్వప్న భావమును వివరింపగల యూదాప్రవాసి నొకనిని కనుగొంటిని” అని చెప్పెను.

26. రాజు బెల్తేషాజరు అను మారుపేరుగల దానియేలుతో “నీవు నా కలను, దాని అర్థమును తెలియజేయగలవా?” అని అడిగెను.

27. దానియేలు రాజుతో దేవరవారడిగిన రహస్యమును జ్ఞానులు, శాకునికులు, మాంత్రికులు తెలియజేయలేరు.

28. కాని రహస్యములెరిగించు దేవుడు పరలోకమున ఉన్నాడు. ఆయన భవిష్యత్తులో ఏమి జరుగునో దేవరవారికి తెలియజేసెను. ఏలినవారు పడుకపై పరుండియున్నప్పుడు కలలోగాంచిన దర్శనమిది.

29. ఏలిక నిద్రించునపుడు భవిష్యత్తును గూర్చి కలగంటిరి. రహస్యములనెరిగించు దేవుడు జరుగబోవు కార్యములను తమకు తెలియజేసెను.

30. నేను ఇతరులకంటె తెలివైనవాడనని దేవుడు నాకు ఈ రహస్యమును తెలియజేయలేదు. ప్రభువులవారు తమ స్వప్నా ర్గమును ఎరుగుటకును, తమ ఆలోచనల భావమును గ్రహించుటకును ఆయన నాకు ఈ సంగతిని వెల్లడి చేసెను.

31. ఏలికదర్శనమున ఒక మహావిగ్రహము తమ ముందట నిలిచియుండుట గాంచితిరి. అది తళతళ మెరయుచు భీతిగొలుపుచుండెను.

32. దాని తలను మేలిమి బంగారముతో చేసిరి. వక్షమును చేతులను వెండితో చేసిరి. ఉదరమును తొడలను కంచుతో చేసిరి.

33. కాళ్ళను ఇనుముతో చేసిరి. పాదములను కొంతవరకు ఇనుముతోను, కొంత వరకు మట్టితోను చేసిరి.

34. తమరు ఆ బొమ్మవైపు చూచుచుండగా, చేతి సహాయము లేకుండగనే తీయ బడిన ఒకరాయి, ఇనుముతో మట్టితో చేసిన ఆ బొమ్మ కాళ్ళకు తగిలి ఆ కాళ్ళను ముక్కలు ముక్కలు చేసెను.

35. వెంటనే ఇనుము, మన్ను, కంచు, వెండి, బంగారములు పిండి అయ్యెను. అవి వేసవిలో కళ్ళమున కనిపించు పొట్టువలెనయ్యెను. గాలికి ఆ పిండి లేచి పోయెను. తరువాత ఆ ప్రతిమ జాడకూడ కనిపింపలేదు. కాని విగ్రహమును పడగొట్టిన ఆ రాయి కొండవలె పెరిగి భూలోకమంతటను వ్యాపించెను.

36. ఇది కల. ఇక ప్రభువుల వారికి ఈ కల భావమును వివరింతుము.

37. ఏలిక రాజులకు రాజు, పరలోకమందున్న దేవుడు తమరిని చక్రవర్తిని చేసెను. మీకు అధికారమును, శక్తిని, కీర్తిని దయచేసెను.

38. ఆయన మిమ్ము నరలోకమునకును, జంతు పక్షికోటులకును రాజును చేసెను. ఆ బొమ్మ బంగారుతల మీరే.

39. మీ తరువాత మీ సామ్రాజ్యముకంటె చిన్నది మరియొకటి వచ్చును. దాని తరువాత మూడవదిగా కంచుసామ్రాజ్యము వచ్చును. అది లోకమంతటిని ఏలును.

40. దాని తరువాత ఇనుమువలె బలమైన నాల్గవ సామ్రాజ్యము వచ్చును. అది అన్నిటిని పడగొట్టి ముక్కలుచేయును. ఇనుము అన్నిటిని బ్రద్దలు చేయు నట్లే అది పూర్వపు సామ్రాజ్యములన్నింటిని పడగొట్టి ముక్కలుచేయును.

41. మీరు విగ్రహము పాదములు కొంతవరకు ఇనుముతోను, కొంతవరకు మట్టితోను చేయబడి యుండుటను చూచితిరి. అట్లే ఆ నాలుగవ సామ్రాజ్యము రెండుగా చీలిపోవును. మట్టిని ఇనుముతో కలిపిరి. కనుక ఆ రాజ్యమునకు ఇనుమునకు ఉన్నంత బలముండును.

42. బొమ్మ పాదాల వ్రేళ్ళలో ఇనుము, మన్ను కలిసియున్నవి కదా! అట్లే సామ్రాజ్యమున కొంతభాగము బలముగ కొంతభాగము దుర్బలముగ ఉండును.

43. మీరు ఇనుము మట్టితోకలసియుండు టను చూచితిరి. అట్లే ఆ సామ్రాజ్యములోని ఉభయ భాగముల రాజులు వివాహసంబంధము ద్వారా ఐక్యము కాగోరుదురు. అయినను ఇనుము మట్టితో కలియనట్లే ఆ ఉభయ రాజ్యముల రాజులు కలియరు.

44. ఆ రాజుల కాలమున పరలోకాధిపతియైన దేవుడు అంతములేని సామ్రాజ్యమును నెలకొల్పును. అది అజేయమై ఆ రాజ్యములన్నిటిని కూలద్రోసి శాశ్వతముగా మనును.

45. మీరు కొండనుండి చేతిసహాయము లేకయే రాయి తగులుటను చూచితిరి. అది ఇనుము, కంచు, మన్ను, వెండి, బంగారము లతో చేసిన విగ్రహమును పడగొట్టుటను గాంచితిరి. మహాదేవుడు భవిష్యత్తులో ఏమిజరుగునో మీకు తెలియజేయుచున్నాడు. నేను మీకలను దాని భావమును యథాతథముగా తెలియజేసితిని”.

46. అపుడు నెబుకద్నెసరురాజు దానియేలు ముందట సాగిలపడెను. అతనికి బలిని అర్పించి సాంబ్రాణి పొగ వేయవలెనని ఆజ్ఞాపించెను.

47. అతడు దానియేలుతో “నిక్కముగా నీ దేవుడు దేవాధి దేవుడు, రాజాధిరాజు, రహస్యములను బయలు పరచువాడు. నీవు ఈ రహస్యమును వెల్లడి చేయు టయే అందుకు నిదర్శనము” అనెను.

48. అతడు దానియేలునకు ఉన్నతపదవినొసగి ప్రశస్తమైన బహుమతులనిచ్చెను. అతనిని బబులోనియా సంస్థానమునకు అదిపతిగా చేసెను. బబులోనియా జ్ఞానులెల్లరికిని పెద్దను చేసెను.

49. దానియేలు వేడుకోలుపై రాజు షడ్రకును, మేషకును, అబేద్నెగోను బబులోనియా దేశమునకు పర్యవేక్షకులుగా నియమించెను. దానియేలు మాత్రము రాజు ఆస్థానముననే ఉండెను.

1. నెబుకద్నెసరురాజు అరువదిమూరల ఎత్తు, ఆరుమూరల వెడల్పుగల బంగారు విగ్రహమును చేయించెను. బబులోనియా దేశమునందలి దూరా మైదానమున దానిని నెలకొల్పెను.

2. అతడు ఉద్యోగులనందరిని అనగా పాలకులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, కోశాధికారులను, న్యాయమూర్తులను, న్యాయాధికారులను, దేశము నందలి ఇతర అధికారులను పిలిపించెను. వారు నెబుకద్నెసరు రాజు నెలకొల్పిన ప్రతిమ ప్రతిష్ఠకు హాజరుకావలెను.

3. ఆ అధికారులు ఎల్లరును ప్రోగయి ప్రతిషో త్సవములలో పాల్గొనుటకు విగ్రహము ముందు నిలుచుండిరి.

4. అంతట వార్తావహుడు పెద్దస్వరముతో ఇట్లు ప్రకటించెను: “ఎల్ల దేశములకును, జాతులకును, భాషలకును చెందిన ప్రజలారా!

5. బూరలు, పిల్లనగ్రోవులు, తంత్రీవాద్యములు, వీణలు, సుతులు మొదలగు వాద్యముల సంగీతము వినిపింపగనే మీరు నేలమీదికి శిరమువంచి నెబుకద్నెసరు రాజు నెలకొల్పిన సువర్ణప్రతిమను ఆరాధింపవలెను.

6. ఎవడైనను శిరమువంచి ప్రతిమనారాధింపడేని అతనిని గనగనమండు కొలిమిబట్టీలో పడవేయుదుము.”

7. కనుక ఎల్లదేశములకును, జాతులకును, భాషలకును చెందిన ప్రజలు, వాద్యముల సంగీతము వినిపింపగనే శిరము వంచి నెబుకద్నెసరు నెలకొల్పిన ప్రతిమనారాధించిరి.

8. అపుడు కల్దీయులు కొందరు యూదులమీద నేరముతెచ్చిరి.

9. వారు నెబుకద్నెసరు రాజుతో “ప్రభువులవారు కలకాలము జీవింతురుగాక!

10. బూరలు, పిల్లనగ్రోవులు, తంత్రీవాద్యములు, వీణలు సకల విధములగు వాద్యధ్వనులు విన్పించిన వెంటనే ఎల్లరును శిరస్సువంచి సువర్ణప్రతిమను ఆరాధింప వలెనని యేలిక కట్టడచేసితిరి.

11. శిరస్సువంచి దానిని ఆరాధింపని వానిని గనగనమండు అగ్నిగుండమున పడద్రోయుదునని శాసించితిరి.

12. మీరు కొందరు యూదులను బబులోనియా దేశమునకు అధికారులను చేసితిరికదా! షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అనువారు మీ ఆజ్ఞలను ధిక్కరించిరి. వారు మీ దైవములను కొలుచుటలేదు. మీరు నెల కొల్పిన సువర్ణమూర్తిని ఆరాధించుటలేదు” అని చెప్పిరి.

13. ఆ మాటలకు రాజు ఆగ్రహము తెచ్చుకొని ఆ ముగ్గురిని తన సమక్షమునకు పిలిపించెను.

14. వారితో "షడ్రకు, మేషకు, అబేద్నెగోలారా వినుడు! మీరు నా దైవములను కొలువకుండుటయు, నేను నెలకొల్పిన బంగారుమూర్తిని ఆరాధింపకుండుటయు నిజమేనా?

15. ఇపుడు మీరు బూరలు, పిల్లన గ్రేవులు, తంత్రీవాద్యములు, వీణలు, సుతులు మొదలైన వాద్యముల సంగీతము వినగనే శిరము వంచి ప్రతిమను ఆరాధింపుడు. లేదేని మిమ్ము తక్షణమే గనగనమండు కొలిమిబట్టీలో పడ “యింతును. నా బారినుండి మిమ్ము రక్షింపగల దైవము ఎవడునులేడు” అని పలికెను.

16. అందులకు షడ్రకు, మేషకు, అబేద్నెగో “రాజా! ఈ విషయముగూర్చి మేము మీకు జవాబు చెప్పనక్కరలేదు.

17. మేము సేవించు దేవుడు మమ్ము గనగనమండు అగ్నిగుండమునుండియు, మీ బారి నుండియు రక్షింపగల సమర్ధుడు మరియు ఆయన నీవశమున పడకుండా ఆయన మమ్ము రక్షించును.

18. కాని అతడు మమ్ము కాపాడకున్నను, మేము మీ దైవములనుగాని, మీరు నెలకొల్పిన సువర్ణ మూర్తినిగాని ఆరాధింపబోమని దేవరవారు గ్రహింతురుగాక!” అనిరి.

19. ఆ పలుకులకు నెబుకద్నెసరు మండిపడెను. షడ్రకు, మేషకు, అబేద్నెగోలవైపు చూడగానే అతని ముఖకళ మారిపోయెను. అతడు కొలిమిబట్టీని  ఏడురెట్లు అదనముగా వేడిచేయుడని సేవకులను ఆజ్ఞాపించెను.

20. ఆ ముగ్గురు మనుష్యులను బంధించి గనగనమండు కొలిమిబట్టీలో పడవేయుడని తన సైన్యమున బలాడ్యులైన వారితో చెప్పెను.

21. కనుక ఆ సైనికులు వారిని బంధించి గనగనమండు అగ్నిగుండమున పడవేసిరి. వారు చొక్కాయలు, అంగీలు, టోపీలు మొదలైన ఉడుపులతోనే అగ్నిలో పడిరి.

22. అగ్నిగుండము మిక్కిలిగా వేడెక్కవల యును అనెడి రాజాజ్ఞ తీవ్రమైనది. కనుక ఆ మనుష్యులను గుండముదగ్గరకు గొనిపోయిన వారుకూడా దాని జ్వాలలకు మాడిచచ్చిరి.

23. షడ్రకు, మేషకు, అబేద్నెగో బంధితులుగానే భగభగమండు మంటల నడుమపడిరి.

24. వారు దేవునికి స్తుతులు, వందనములు అర్పించుచు మంటలనడుమ నడచిరి.

25. అజరయా నిప్పులు నడుమ నిలుచుండి యిట్లు ప్రార్ధించెను:

26. “మా పితరుల దేవుడవైన ప్రభూ! నీకు కీర్తియు స్తుతియు కలుగునుగాక! నీ నామమునకు సదా గౌరవము కలుగునుగాక!

27. నీవు మాకు తగినట్లుగానే మాతో వ్యవహరించితివి. నీవు మాకు చేసిన కార్యములెల్ల యుక్తమైనవే, మాకు న్యాయముగానే తీర్పు తీర్చితివి.

28. నీవు మమ్మును మా పితరుల పవిత్రనగరమైన యెరూషలేమును నాశనము చేసినప్పుడు, న్యాయముగానే మెలిగితివి. మా పాపములకు మేము శిక్షను పొందవలసియేయున్నది.

29. మేము నీకు లొంగమైతిమి, నిన్ను విడనాడితిమి, ఎల్ల పాపములను చేసితిమి.

30. నీ ఆజ్ఞలను పాటింపమైతిమి. నీ చట్టములను గైకొనినయెడల మేము వృద్ధిలోనికి వచ్చియుండెడివారలము.

31. నేడు నీవు మాకు చేసిన తీర్పు మా పైకి రప్పించిన శిక్షయు యుక్తమైనవే.

32. నీ ఆజ్ఞలను పాటింపనివారును, నిన్ను ధిక్కరించు నీచులైన శత్రువుల చేతికి నీవు మమ్మప్పగించితివి. ప్రపంచమంతటిలోను దుష్టుడైన రాజునకు మమ్ము అప్పగించితివి.

33. నిన్ను పూజించు మేము అవమానము పొందితిమి. మేము సిగ్గుతో నోరువిప్పజాలమైతిమి.

34. నీవు మాతో చేసికొనిన నిబంధనమును రద్దు చేయకుము. మమ్ము సదా విడనాడకుము, అప్పుడు నీ గౌరవము నిలుచును.

35. మాకు నీ కరుణను నిరాకరింపకుము. నీవు ప్రేమించిన అబ్రహామునకు, నీ సేవకుడు ఈసాకునకు, పవిత్రుడగు నీ యాకోబునకు నీవు చేసిన వాగ్దానములను నిలబెట్టుకొనుము.

36. నీవు వారి సంతానమును ఆకసము నందలి చుక్కలవలెను, కడలియొడ్డునందలి యిసుక రేణువులవలెను వృద్ధిచేయుదునని బాసచేసితివి.

37. కాని ప్రభూ! నేడు మేమితర జాతులకంటెను స్వల్ప సంఖ్యాకులమైయున్నాము. మా పాపాలవలన మేమువసించు తావులందెల్ల మాకు అవమానము కల్గుచున్నది.

38. మాకిపుడు రాజుగాని, ప్రవక్తలుగాని, నాయకులుగాని లేరు. నీకు బలులు, దహనబలులు, కానుకలు, సాంబ్రాణి పొగ అర్పించుటకు దేవాలయము లేదు. నైవేద్యములర్పించి, నీ మన్నన బడయుటకు తగిన తావునులేదు.

39. మేము పశ్చాత్తాపహృదయముతో వినయాన్వితమైన మనస్సుతో నీ చెంతకు వచ్చితిమి. పొట్టేళ్ళను, ఎడ్లను, బలిసిన వేలకొలది గొఱ్ఱె పిల్లలను దహనబలిగా గొనివచ్చిన వారినివలె నీవు మమ్ము అంగీకరింపుము.

40. నేడు మా పశ్చాత్తాపమునే బలిగా స్వీకరింపుము. మేము పూర్ణమనస్సుతో నిన్ను అనుసరింతుముగాక! నిన్ను నమ్మినవారు ఏనాటికిని భంగపాటునొందరు.

41. మేము పూర్ణహృదయముతో నిన్ను అనుసరించి, నిన్ను ఆరాధించి, నీకు ప్రార్థన చేయుదుము.

42. నీవు మమ్ము దయతో, ఆదరముతో చూడుము. మేము భంగపాటును , పొందకుండునట్లు చేయుము.

43. నీ అద్భుత కార్యములతో నీవు మమ్ము రక్షించి నీ నామమునకు కీర్తి తెచ్చుకొనుము.

44. నీ దాసులకు కీడుతలపెట్టువారికి సిగ్గు, అవమానము కలుగుగాక! నీవు వారి బలమును, దర్పమును వమ్ముచేయుము. వారి శక్తిని రూపుమాపుము.

45. నీవు మాత్రమే దేవుడవు. ప్రభుడవనియు, వైభవముతో లోకమంతటిని ఏలుదువనియు వారు గుర్తింతురుగాక!”

46. రాజసేవకులు చమురును, కీలును, నార పీచును, కట్టెలను అగ్నిగుండములో పడవేసి దానిని అధికముగ మండించిరి.

47. దానిమంటలు డెబ్బది ఐదు అడుగుల ఎత్తువరకు లేచెను.

48. అవి చుట్టును వ్యాపించి చేరువలోనున్న బబులోనీయులను మాడ్చి చంపెను.

49. కాని ప్రభువుదూత అగ్ని గుండము లోనికి దిగివచ్చి, అజరయ్య మరియు అతని సహచరు లతో ఉండి, అగ్నిజ్వాలలను గుండమునుండి బయటకు త్రోలెను.

50. అగ్నిగుండమున తేమతో కూడిన చల్లని గాలి విసరుచున్నదో అన్నట్లు చేసెను. కనుక నిప్పు మంటలా నరులకు సోకలేదు, వారికి బాధ కలిగింపను లేదు.

51. ఆ అగ్నిగుండమున ముగ్గురు యువకులు ఏక స్వరముతో ప్రభువునిట్లు స్తుతించి కీర్తించిరి:

52. “మా పితరుల దేవుడవైన ప్రభూ! "మేము నిన్ను కీర్తించి సన్నుతింతుము.

53. నీ దివ్యనామమునకు సదా గౌరవమును కలుగునుగాక!

54. జనులు కీర్తనలతో నీ మహిమను సదా నుతింతురుగాక! దేవళములో నీ దివ్య సాన్నిధ్యమునకు కీర్తికలుగునుగాక!

55. నీవు దేవదూతలనెడు సింహాసనముపై ఆసీనుడవై క్రింది పాతాళలోకమువైపు పారజూతువు. నీకు సదా కీర్తి గౌరవములు కలుగునుగాక!

56. రాజసింహాసనముపై కూర్చుండియున్న నీకు నుతికలుగునుగాక! జనులు కీర్తనలతో నీ మహిమను సదా నుతింతురుగాక!

57. ఆకాశ గోళమున నీకు నుతికలుగునుగాక! జనులు కీర్తనలతో నీ మహిమను సదా నుతింతురుగాక!

58. సకల సృష్టి! ప్రభువును స్తుతింపుము. ఆయనను స్తుతించి సదా కీర్తింపుము.

59. ఆకాశమా! ప్రభువును స్తుతింపుము. ఆయనను స్తుతించి సదా కీర్తింపుము.

60. ప్రభువు దూతలారా! ఆయనను స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

61. ఆకాశము మీది జనులారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

62. స్వర్గశక్తులారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

63. సూర్యచంద్రులారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

64. ఆకాశమందలి నక్షత్రములారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

65. వర్ష హిమములారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

66. సకల వాయువులారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

67. అగ్ని ఉష్ణములారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

68. శీతోష్ణములారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

69. మంచు, పొగమంచులారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

70. రేయింబవళ్ళారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

71. చీకటి వెలుగులారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

72. నూగు మంచు, శీతలములారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

73. పేరిన మంచు, హిమములారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

74. మబ్బులు, మెరపులారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

75. భూమీ! ప్రభువును స్తుతింపుము. ఆయనను స్తుతించి సదా కీర్తింపుము.

76. కొండలారా! తిప్పలారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

77. భూమిపై పెరుగు వృక్షములారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

78. సరస్సులు, నదులారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

79. నీటి బుగ్గలారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

80. జలచరములు తిమింగిలములారా! ప్రభువును స్తుతింపుడు.  ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

81. సకల పక్షులారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

82. సాధుజంతువులు వన్యమృగములారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

83. భూమిమీది సకలనరులారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

84. యిస్రాయేలు ప్రజలారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

85. ప్రభువు యాజకులారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

86. ప్రభువు సేవకులారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

87. భక్తిమంతులారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

88. వినయాత్ములు, పవిత్రులునైన వారలారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

89. హనన్యా, మిషాయేలు అజరయలారా! ప్రభువును స్తుతింపుడు. ఆయన మనలను మృతలోకము నుండియు, మృత్యువు శక్తినుండియు కాపాడెను. గనగనమండు అగ్నిగుండమునుండియు, అగ్నిజ్వాలలనుండియు మనలను రక్షించెను.

90. ప్రభువు మంచివాడు. కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన కరుణ కలకాలముండును. ప్రభువును పూజించుభక్తులారా! ఆయనను నుతింపుడు. దేవాధిదేవుని వినుతించి ఆయనకు వందనములర్పింపుడు. ఆయన కరుణ కలకాలమునుండును”.

91. అంతట నెబుకద్నెసరు రాజు ఆశ్చర్యముతో లేచినిలుచుండి, “మనము ముగ్గురు నరులను బంధించి అగ్నిగుండమున బడవేయలేదా?” అని తన ఉద్యోగులనడిగెను. వారు “ఔను ప్రభూ!” అని జవాబు చెప్పిరి.

92. అతడు “అట్లయినచో నాకు నలుగురు మనుష్యులు అగ్నిచుట్టు తిరుగుచున్నట్లు కన్పించు చున్నారేమి? వారికి బంధనములు లేవు. ఎట్టిబాధలు కలిగినట్లు లేదు. నాలుగవవాడు దైవకుమారునివలె ఉన్నాడు” అనెను.

93. నెబుకద్నెసరు మండుచున్న కొలిమిబట్టీ ద్వారమువద్దకు వచ్చి "షడ్రకు, మేషకు, అబేద్నెగోలారా! మీరు బయటికిరండు” అనెను. వారు వెంటనే వెలుపలికి వచ్చిరి.

94. పాలకులు, దేశాధి పతులు, సామంతులు, ఇతర అధికారులు ఆ ముగ్గురి చుట్టు గుమికూడి వారిని పరిశీలించిచూచిరి. నిప్పు వారికెట్టి హానియు చేయలేదు. వారి తలవెంట్రుకలు కమలలేదు. బట్టలు కాలలేదు. వారి దేహములపై పొగవాసన కూడ లేదు.

95. అప్పుడు రాజు ఇట్లనెను: “షడ్రకు, మేషకు, అబేద్నెగోల దేవునికి స్తుతికలుగును గాక! ఆయన తన దేవదూతనుపంపి తనను విశ్వ సించి, సేవించువారిని కాపాడెను. వారు నా ఆజ్ఞను మీరి తమ శరీరములకు ముప్పుతెచ్చుకొనికూడ తమ దేవునికి తప్ప అన్యదైవములకు మ్రొక్కరైరి.

96. కనుక నేను ఈ ఆజ్ఞను జారీచేయుచున్నాను. ఏ దేశమున కైనను, ఏ జాతికైనను, ఏ భాషకైనను చెందిన ప్రజలెల్ల రును ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోల దేవుని తూలనాడుదురేని నేను వారిని కండతుండెములుగా నరికింతును. వారి ఇండ్లను దిబ్బలు కావింతును. ఏ దేవుడు కూడ ఇట్లు రక్షింపజాలడుకదా!”

97. అటుపిమ్మట రాజు షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు బబులోనియాదేశమున పెద్ద పదవులు ఒసగెను.

1. నెబుకద్నెసరురాజు సకలదేశములకును, జాతులకును, భాషలకును చెందిన ప్రజలకు ఈ సందేశము పంపెను: “మీకు పరిపూర్ణశుభములు కలుగునుగాక!

2. మహోన్నతుడైన దేవుడు నాకు చేసిన మహాక్రియలను, అద్భుతకార్యములను నేను మీకు ఎరిగింప గోరెదను.

3. దేవుని అద్భుతకార్యములు ఎంత గొప్పవి! ఆయన ఆశ్చర్యకార్యములు ఎంత మహత్తరమైనవి! ఆయన సదా రాజుగా పరిపాలనము చేయును. ఆయన రాజ్యము ఎల్లకాలము నుండును.

4. నేను సకల ఐశ్వర్యములతో నా రాజభవనమున సుఖముగా జీవించుచుంటిని.

5. కాని నేనొక భయంకర స్వప్నమును గాంచితిని. నిద్రలో భీకర దృశ్యములను చూచి కలతచెందితిని.

6. కనుక నేను బబులోనియా జ్ఞానులెల్లరును నా చెంతకువచ్చి ఆ కల భావమును వివరింపవలెనని ఆజ్ఞాపించితిని.

7. అట్లే మాంత్రికులును, శాకునికులును, కల్దీయులును, సోదెగాండ్రును నా దగ్గరకురాగా నేను వారికి స్వప్నమును తెలియజేసితిని. కాని వారు దాని అర్థమును వివరింపజాలరైరి.

8. అంతట 'బెల్తేషాజరు' అను నా దేవత పేరును బిరుదుగా పొందిన దానియేలు అనువాడు నా సమక్షమునకు వచ్చెను. పవిత్రదేవతల ఆత్మ అతనియందుండెను. నేను అతనికి నా కలను ఇట్లు ఎరిగించితిని:

9. “బెల్తేషాజరూ! నీవు మాంత్రికుల కందరికిని నాయకుడవు. పవిత్ర దేవతల ఆత్మ నీలో ఉన్నదనియు, నీకు రహస్యములెల్ల తెలియుననియు నేనెరుగుదును. నా స్వప్నమిది, నీవు దీనిభావమును నాకు తెలియజెప్పుము.

10. నేను పడుకపై నిద్రించుచు ఈ దృశ్యము గాంచితిని. నేను చూచుచుండగా భూలోకమధ్యమున అత్యున్నతమైన వృక్షము కనిపించెను.

11. అది అంతకంతకు పెద్దదై ఆకాశమును తాకెను. లోకములోని నరులెల్లరును దానిని చూడగలిగిరి.

12. దాని ఆకులు అందమైనవి. అది లోకములోని జనులెల్లరికిని సరి పోవునన్ని పండ్లుకా సెను. వన్యమృగములు దాని నీడలో పరుండెను. పక్షులు దానికొమ్మలలో గూళ్ళు కట్టెను. ఎల్లప్రాణులును దాని ఫలములనారగించెను.

13. నేను పడుకపై పరుండి, ఆ దృశ్యమును గూర్చి తలంచుచుండగా దేవదూత ' ఆకాశమునుండి దిగి వచ్చి,

14. పెద్ద స్వరముతో ఇట్లు పలికెను: ఈ చెట్టును పడగొట్టి దాని కొమ్మలను నరుకుడు. దాని ఆకులను దులిపి పండ్లను ఆవల పారవేయుడు. పశువులను దానినీడనుండి తరిమివేయుడు, పక్షులను దానికొమ్మలనుండి పారద్రోలుడు.

15. దాని మొద్దును మాత్రము నేలలో మిగిలియుండనిండు. దానిచుట్టు ఇనుముకంచు కట్టుకట్టి, గడ్డిపాలగునట్లు దానిని పొలమున నుండనిండు. ఈ నరుడు మంచులో తడియునుగాక! ఇతడు గడ్డిమేయుచు పశువులమధ్య వసించునుగాక!

16. ఏడేండ్లపాటు ఇతనికి మనుష్యుల మనస్సు తొలగిపోయి, పశువుల మనస్సు అలవడునుగాక!

17. దేవదూతలు ప్రకటించు నిర్ణయమిది: కావున మహోన్నతుడైన దేవునికి నరుల రాజ్యములపై అధికారము కలదనియు, ఆయన ఆ రాజ్యములను తనకిష్టము వచ్చినవారికి ఇచ్చుననియు, ఊరుపేరు లేనివారికి గూడ వానిని దయచేయుననియు ఎల్లజనులు గ్రహింతురుగాక!

18. నేను గాంచిన కలయిది. బెత్తెషాజరూ! నీవు దీని భావమేమిటో తెలియజెప్పుము. నా రాజ్యములోని జ్ఞానులెవరును దీని అర్థమును ఎరిగింపజాలరైరి. కాని పవిత్రులైన దేవతల ఆత్మ నీలోనున్నది కనుక నీవు దీని భావమును తెలియజేయగలవు.”

19. ఆ మాటలకు బెత్తెషాజరు అను మారు పేరు కల దానియేలు భయముతో నోరు విప్పజాల డయ్యెను. రాజు “ఓయి! నీవు స్వప్నమును దాని భావమును గూర్చి భయపడవలదు” అని అనెను. బెల్తేషాజరు ఇట్లనెను: “ఈ కలయు దీని భావమును ప్రభువునకుగాక అతని విరోధులకు అన్వయించిన ఎడల బాగుండెడిది.

20. నీవు చూచిన చెట్టు అంతకంతకు పెద్దదై పై ఆకాశమును తాకెను. లోకములోని నరులెల్లరును దానిని చూడగలిగిరి.

21. దాని ఆకులందమైనవి. అది లోకములోని జీవకోటికి చాలినంత ఆహారమును కలిగియుండెను. వన్యమృగములు దానినీడలో పరుండినవి. పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకొనినవి.

22. రాజా! ఆచెట్టు బలముగను, ఉన్నతముగను ఎదిగిన నీవే. నీవు బ్రహ్మాండముగా ఎదిగి ఆకాశము ను తాకుచున్నావు. భూమియందంతట నీ ప్రాభవము చెల్లుచున్నది.

23. తమరు చూచుచుండగనే దేవదూత రహరించబడినది. దీనిని 'దేవదూత' అని కూడ అనువదింపవచ్చునని పవిత్రగ్రంథ ఆకాశము నుండి క్రిందికి దిగివచ్చి 'ఈ చెట్టును నరికి నాశనము చేయుడు. దాని మొద్దును మాత్రము నేలలో మిగిలియుండనిండు. దానికి ఇనుము కంచు కట్టు కట్టుడు. గడ్డితోపాటు దానిని పొలమున ఉండనిండు. ఈ నరుడు మంచులో తడియునుగాక! ఇతడు ఏడేండ్ల పాటు మృగములతో కలిసి వసించునుగాక!' అని పలికెను.

24. రాజా! దీని భావమిది. మహోన్నతుడైన దేవుడు నీకు నిర్ణయించిన కార్యమిది.

25. నిన్ను మనుష్యుల చెంతనుండి తరిమివేయుదురు. నీవు వన్య మృగముల నడుమవసింతువు. ఏడేండ్లపాటు ఎద్దువలె గడ్డిమేయుచు బయటి పొలముననే నిద్రింతువు. మంచులో తడియుదువు. అప్పుడు నీవు మహోన్నతుడైన దేవుడు నరుల రాజ్యములన్నిటిపైన అధికారియై యున్నాడనియు, ఆయన వానిని తనకు ఇష్టమొచ్చిన వారికిచ్చుననియు గ్రహింతువు.

26. చెట్టు మొద్దును నేలలోనే వదలివేయుడని దేవదూతలు ఆజ్ఞాపించిరి. దానిభావమిది. నీవు మహోన్నతుడైన దేవుడు ప్రపంచమంతటికిని అధిపతియని అంగీకరించిన పిదప నీ రాజ్యమును మరల స్వీకరింతువు.

27. రాజా! నా సలహా మీకు అంగీకారమగునుగాక! నీవు పాపములను మాని, నీతిన్యాయమును అనుసరించుచు, నీవు బాధపెట్టిన వారియందు కరుణ చూపినయెడల నీవు దీర్ఘకాలము క్షేమముగా జీవింతువు.”

28. ఈ సంగతులన్నియు నెబుకద్నెసరు రాజునకు జరిగినవి.

29. పండ్రెండునెలల తర్వాత అతడు బబులోనియాలోని రాజభవనము మీద పచార్లు చేయుచు,

30. “బబులోనియా ఎంత పెద్దది! నేనే దీనిని నా రాజధాని నగరముగా నిర్మించితిని. నాశక్తి సామర్థ్యములను కీర్తి ప్రాభవములను ప్రకటించితిని” అని పలికెను.

31. ఆ మాటలతని నోటనుండగనే ఆకాశము నుండి ఒక స్వరము ఇట్లు వినిపించెను: “నెబుకద్నెసరు రాజా! నా పలుకులాలింపుము: నేను నీరాజ్యమును నీనుండి తొలగించితిని.

32. నిన్ను మనుష్యులచెంత నుండి తరిమివేయుదురు. నీవు ఏడేండ్లపాటు ఎద్దు వలె గడ్డితిందువు. అప్పుడు నీవు మహోన్నతుడైన దేవుడు నరుల రాజ్యములన్నిటిని అధికారియై యున్నాడనియు, వానిని తన కిష్టము వచ్చిన వానికి ఇచ్చుననియు అంగీకరింతువు.”

33. ఆ పలుకులు వెంటనే నెరవేరెను. నెబుకద్నెసరును నరులచెంతనుండి తరిమివేసిరి. అతడు ఎద్దువలె గడ్డితినెను. అతని దేహము మంచులో తడిసెను. అతని వెంట్రుకలు గరుడపక్షి ఈకలంత పొడవుగను, గోళ్ళు పక్షిగోళ్లంత పొడవుగా పెరిగెను.

34. .ఆ రాజు ఇట్లనెను: “ఏడేండ్లు కడచిన తరువాత నేను ఆకాశమువైపు చూచితిని. నాకు మరల వివేకము కలిగెను. నేను మహోన్నతుడైన దేవుని స్తుతించితిని. సదాజీవించు దేవుని కీర్తించి స్తుతించితిని. ఆయన నిత్యము పరిపాలనము చేయును. ఆయన రాజ్యము శాశ్వతముగా నుండును.

35. ఆయనకు భూమిమీదినున్న నరులు అమలు శూన్యముతో సమానము. పరమండలములోని దేవదూతలను, భూమిమీది నరులను ఆయన తన యిష్టము వచ్చినట్లు చేయును. ఆయన చేయిపట్టుకొని 'నీవు చేయునదేమి?' అని ఎవరును ఆయనను ఆపజాలరు, ప్రశ్నింపజాలరు.

36. నాకు వివేకముకలిగిన తరువాత నా రాజ్యము, వైభవము, గౌరవము నాకు మరలదక్కెను. నా మంత్రులును ప్రముఖులైన నా ప్రజలును నన్ను ఆహ్వానించిరి. నా రాజ్యము నాకు లభించెను. నేను పూర్వముకంటెను అధికవైభవమును బడసితిని.

37. ఇప్పుడు నెబుకద్నెసరునైన నేను పరలోక రాజును స్తుతించి, కీర్తించి, కొనియాడుచున్నాను. ఆయన కార్యములెల్లయుక్తమైనవి. న్యాయమైనవి. ఆయన గర్వాత్ముల గర్వమును అణచును.”

1. బెల్షస్సరు రాజు గొప్పవిందు చేయించి వేయి మంది ప్రముఖులను ఆహ్వానించెను. వారితో పాటు తానుకూడ ద్రాక్షారసమును సేవించెను.

2. వారు మధువును సేవించుచుండగా ఆ రాజు పూర్వము తన తండ్రియైన నెబుకద్నెసరు యెరూషలేము దేవాలయము నుండి కొల్లగొట్టి తెచ్చిన వెండి బంగారు పాత్రలను కొనిరండని అజ్ఞాపించెను.

3. తామును, తన ప్రముఖులును, తన భార్యలును, ఉంపుడు కత్తెలును ఆ పాత్రలనుండి రసము త్రాగవలెనని అతని కోరిక. వారు ఆ పాత్రలనుండి ద్రాక్షారసమును త్రాగి,

4. వెండి, బంగారము, కంచు, ఇనుము, కొయ్య, రాతితో చేసిన తమ దైవములను స్తుతించిరి.

5. వెంటనే ఒక హస్తము కనిపించెను. అది సున్నము కొట్టియున్న ప్రాసాదము గోడమీద, దీపపు కాంతి బాగుగా పడుచోట ఏదియో వ్రాయ ఉండెను. అటుల వ్రాయుచున్న హస్తమును రాజు చూచెను.

6. ఆ దృశ్యమును గాంచి అతడు తెల్ల బోయెను. భయమువలన అతని నడుమునందలి కీళ్ళన్ని పట్టుదప్పెను. మోకాళ్ళు గడగడ వణకెను.

7. అతడు శాకునికులను, గారడీవిద్య గలవారిని, సోదెగాండ్రను, కల్దీయులను పిలువుడని కేకలు పెట్టెను. ఆ బబులోనియా జ్ఞానులు రాగానే అతడు వారితో “మీలో ఎవడైనను ఈ వ్రాతను చదివి దాని భావమును వివరింపగలడని అతడు ఊదావన్నె వస్త్రములు తాల్చి, కంఠాభరణమును ధరించి, ఈ రాజ్యమున మూడవ అధికారియగును” అని చెప్పెను.

8. ఆ రాజు జ్ఞానులందరును ముందుకు వచ్చిరిగాని వారిలో ఒక్కరికిని ఆ వ్రాతచదివి దాని భావమును వివరించు సామర్థ్యము లేదయ్యెను.

9. బెల్షస్సరు మిక్కిలి భయపడి మరింత తెల్లబోయెను. అతడు ఆహ్వానించిన ప్రముఖులును కలవరము చెందిరి.

10. రాజు, అతని ప్రముఖులు చేయు శబ్దము విని రాణి విందుగదిలోనికి వచ్చి, “ప్రభువులవారు కలకాలము జీవింతురుగాక! తమరింతగా భయపడి వెలవెలబోనక్కరలేదు.

11. మీ రాజ్య మున ఒక నరుడున్నాడు. పవిత్రులైన దేవతల ఆత్మ అతనిలో వసించుచున్నది. మీ తండ్రి రాజుగానున్నపుడు అతడు దేవతలకు సమానమైన తెలివితేటలను, జ్ఞానమును, వివేకమును ప్రదర్శించెను. మీ తండ్రియైన నెబుకద్నెసరు అతనిని శాకునికులకు, గారడీవిద్య గలవారలకు, జ్యోతిష్కులకు, సోదెగాండ్రకు, కల్దీయులకు నాయకుని చేసెను.

12. అతనికి గొప్ప ప్రజ్ఞ కలదు. స్వప్నార్థమును, కఠిన ప్రశ్నల భావమును, నిగూఢరహస్యములను తెలియజేయు జ్ఞానము, నేర్పు కలదు. అతని పేరు దానియేలు. రాజతనికి బెల్తేషాజరని పేరు పెట్టెను. ఇప్పుడతనిని పిలిపింపుడు. ఈ వ్రాత భావమును మీకు తెలియజేయును”అని చెప్పెను.

13. వెంటనే దానియేలును రాజు సమక్షమునకు కొనివచ్చిరి. రాజతనితో “మా తండ్రి యూదా నుండి కొనివచ్చిన దానియేలను ప్రవాసివి నీవేనా?

14. పవిత్రులైన దేవతల ఆత్మ నీలో వసించుచున్న దనియు, నీకు తెలివితేటలును, విశేషజ్ఞానమును, వివేకమును మిన్నగా కలవనియు వింటిని.

15. నేను ఈ వ్రాతను చదివి దానిభావమును ఎరిగించుటకు జ్ఞానులను, గారడీవిద్యగలవారిని పిలిపించితినిగాని వారికి దాని అర్థము తెలియలేదు.

16. నీవు గూఢార్థములను, రహస్యములను వివరింపగలవని వింటిని. నీవు ఆ వ్రాతను చదివి దాని భావమును నాకు తెలుపగలవేని ఊదా వన్నె వస్త్రములుతాల్చి, కంఠాభరణమును ధరించి, రాజ్యమున మూడవ అధికారివి అగుదువు” అని పలికెను.

17. దానియేలు రాజుతో ఇట్లనెను: “నీ దానములను నీవే ఉంచుకొనుము. లేదా వానిని మరియొకనికి ఇమ్ము. నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు విన్నవింతును.

18. సర్వోన్నతుడైన దేవుడు నీ తండ్రియైన నెబుకద్నెసరునకు రాజ్యమును, కీర్తివైభవములను ప్రసాదించెను.

19. దేవుడు అతనిని మహాప్రభువును చేయగా సకలదేశములకును, జాతులకును, భాషలకును చెందిన జనులెల్లరును అతనిని చూచి గడగడలాడిరి. అతడు తాను చంపగోరినవారిని చంపెను. బ్రతికియుండవలెనని నిశ్చయించిన వారిని బ్రతికి యుండనిచ్చెను. తాను పైకి తీసికొనిరాగోరిన వారిని తీసికొనివచ్చెను. అణచివేయగోరిన వారిని అణచి వేసెను.

20. కాని అతడు గర్విష్టియు, మొండివాడును, క్రూరుడును అయ్యెను. కనుక దేవుడు అతడిని తన సింహాసనమునుండి తొలగించి అతని కీర్తిని రూపుమాపెను.

21. కనుక అతనిని నరలోకము నుండి తరిమివేసిరి. అతని మనస్సు మృగముల మనస్సు వంటిదయ్యెను. అతడు అడవి గాడిదల నడుమ వసించెను. ఎద్దువలె గడ్డి తినెను. అతని దేహము బయట మంచులోతడిసెను. కట్టకడన అతడు సర్వోన్నతుడైన దేవుడు నరుల రాజ్యములన్నిటిని తన స్వాధీనమున ఉంచుకొనుననియు, వానిని తనకిష్టము వచ్చిన వారికి ఇచ్చుననియు గ్రహించెను.

22. ఆ రాజు తనయులైన మీరు ఈ సంగతులన్నియు తెలిసియుండియు వినయమును అలవర్చుకోరైతిరి.

23. మీరు పరలోకమునకు అధిపతియైన దేవుని ధిక్కరించి దేవాలయము నుండి కొనివచ్చిన పాత్రములను తెప్పించితిరి. మీరు, మీ ప్రముఖులు, మీ భార్యలు, ఉంపుడుకత్తెలు ఆ పాత్రములనుండి ద్రాక్షారసమును త్రాగితిరి. బంగారము, వెండి, కంచు, ఇనుము, కొయ్య, రాతితో చేసిన దైవములను స్తుతించితిరి. ఆ దైవములకు చూపు, వినికిడి యెరుకలేవు. కాని మీ ప్రాణములను, మీ కార్యములన్నిటిని తన గుప్పిటనుంచుకొను దేవుని మాత్రము మీరు గౌర వింపరైతిరి.

24. కనుకనే దేవుడు ఈ హస్తమును పంపి ఈ మాటలను వ్రాయించెను.

25. ఈ వ్రాత యిదియే. 'మెనే మెనే తెకేల్ వుపార్సీన్' (సంఖ్య సంఖ్య, తూకము, విభజనము).

26. దీని భావమిది. మెనే (సంఖ్య) అనగా దేవుడు నీ పరిపాలనా దినములను లెక్కపెట్టి వానిని తుద ముట్టించెను.

27. తెకెల్ (తూకము) అనగా ఆయన నిన్ను త్రాసులో పెట్టి తూచగా నీవు చాల తేలికగా నుంటివి.

28. పార్సీన్ (విభజనము) అనగా దేవుడు నీ రాజ్యమును విభజించి మాదీయులకును, పారశీకులకును ఇచ్చివేసెను.”

29. వెంటనే బెల్షస్సరు ఆజ్ఞపై దానియేలునకు ఊదావన్నె వస్త్రమును తొడిగించి, కంఠాభరణము పెట్టి, అతనిని రాజ్యమున మూడవ అధికారియని ప్రకటించిరి.

30. ఆ రాత్రియే బబులోనియారాజైన బెల్షస్సరును వధించిరి.

31. మాదీయుల రాజు దర్యావేషు తన అరువది రెండవయేట రాజ్యమును ఆక్రమించుకొనెను.

1. దర్యావేషు తన రాజ్యమును పరిపాలించుటకు నూటఇరువదిమంది అధిపతులను నియమించెను.

2. ఆ అధిపతులను పర్యవేక్షించుటకును, తనకు భద్రత చేకూర్చి పెట్టుటకును అతడు ముగ్గురు పర్యవేక్షకులను గూడ నియమించెను. వారిలో దానియేలొకడు,

3. దానియేలు బుద్ధికుశలతలో అధిపతులను, పర్యవేక్షకు లనుగూడ మించెను. రాజు అతనిని తన రాజ్యమంతటి మీదను అధికారినిగా నియమింపవలెనని ఎంచుచుండెను.

4. అధిపతులును, పర్యవేక్షకులును దానియేలు రాజ్యపాలన విషయములలో తప్పులు పట్టజూచిరి కాని వారికి అతనిలో దోషమేమియు కనిపింపలేదు. అతడు విశ్వాస పాత్రుడుగా మెలగుచు ఎట్టి అక్రమము నకుగాని, అవినీతికిగాని పాల్పడ డయ్యెను.

5. వారు “మనము ఏ అంశమునను దానియేలునందు తప్పులు పట్టజాలము. అతడు తన దేవుని కొలుచుతీరున మాత్రము మనకు చిక్కవచ్చును” అని తమలో తాము కూడబలుకుకొనిరి.

6. కనుక ఆ అధిపతులు, పర్యవేక్షకులు రాజు సమక్షమునకు గుంపుగా వచ్చి ఇట్లనిరి: “దర్యావేషు ప్రభువులవారు కలకాలము జీవింతురు గాక!

7. మీ రాజ్యమును పాలించు పర్యవేక్షకులము, అధిపతులము, మంత్రులము, సేనాధిపతులము, సంస్థానాధిపతులము మేమెల్లరము దేవరవారు ఒక శాసనమును జారీచేసి దానిని ఖండితముగా అమలుపరచవలెనని కోరుచున్నాము. రానున్న ముప్పదినాళ్ళవరకు ఎవడును మీకు తప్ప అన్యదేవతకుగాని, అన్యనరునికి గాని మనవి చేయరాదు. ఈ ఆజ్ఞ మీరిన వానిని సింహముల గుంటలో పడవేయుదుమని శాసనము చేయింపుడు.

8. ఏలిక ఈ శాసనమును జారీచేయుచు దానిపై సంతకము చేయుదురుగాక! అది మాదీయుల, పారశీకుల నియమము ప్రకారము తిరుగులేనిదిగా ఉండునుగాక!”

9. దర్యావేషు రాజు అట్లే శాసనమును జారీచేయించి దానిపై సంతకము పెట్టెను.

10. రాజు శాసనముపై సంతకము చేసెనని విని దానియేలు తన ఇంటికి వెళ్ళెను. అతని ఇంటిమీద గది కిటికీలు యెరూషలేమువైపు తెరచుకొని ఉండెను. అతడు యధాప్రకారము అనుదినము చేయునట్లే ఆ కిటికీల ముందు మోకాళ్ళూని రోజునకు మూడుమార్లు దేవునికి ప్రార్థనచేసి వందనములర్పించెను.

11. దానియేలు శత్రువులు గుమిగూడివచ్చి అతడు దేవునికి ప్రార్థనలర్పించి విన్నపము చేసికొనుటను గాంచిరి.

12. వారెల్లరును రాజు వద్దకుపోయి “రానున్న ముప్పది నాళ్ళవరకు ఎవడును మీకుతప్ప అన్యదేవతలకుగాని, అన్య నరులకుగాని ప్రార్థన చేయరాదనియు, ఈ ఆజ్ఞ మీరినవారిని సింహముల గుంటలో పడవేయుదుమనియు దేవరవారు శాసనము చేయింపలేదా?” అని అడిగిరి. రాజు “ఔను, అది ఖండితమైన శాసనము. మాదీయుల, పారశీకుల నియమము ప్రకా రము అది తిరుగులేనిది” అని చెప్పెను.

13. వారు రాజుతో "యూదా ప్రవాసియైన దానియేలు మిమ్ము లెక్క చేయుటలేదు. అతడు మీరు సంతకముచేసిన శాసనమును ధిక్కరించి రోజునకు మూడుమారులు ప్రార్థన చేయుచున్నాడు” అని చెప్పిరి.

14. ఆ మాటలువిని రాజు మిగులచింతించెను. అతడు దానియేలును రక్షింపగోరి ప్రొద్దుగ్రుంకువరకును ఉపాయముకొరకు తీవ్రముగా ఆలోచించెను.

15. అప్పుడు ఆ నరులు మరల రాజునొద్దకు గుంపుగా వచ్చి “ఏలికా! మాదీయుల, పారశీకుల నియమము ప్రకారము రాజుచేసిన శాసనమును మార్చరాదని జ్ఞప్తికి తెచ్చుకొనుడు” అని అనిరి.

16. కనుక రాజు దానియేలును కొనిపోయి సింహములగుంటలో పడవేయుడని ఆజ్ఞఇచ్చెను. అతడు దానియేలుతో “నీవు ఇంతటి విశ్వాసముతో సేవించు దేవుడు నిన్ను కాపాడునుగాక!” అనెను.

17. అంతట ఒక బండను కొనివచ్చి సింగములగుంట కన్నముపై పెట్టిరి. దానియేలునకు సంబంధించిన నియమమును ఎవరును మార్చకుండుటకుగాను ఆ బండపై రాజ ముద్రను ప్రముఖులముద్రను వేసిరి.

18. అంతట రాజు ప్రాసాదమునకు వచ్చి నిద్రలేకయే ఆ రాత్రి గడపెను. అతడు ఆహారములను పుచ్చుకొనలేదు. వినోదములను తిలకింపలేదు.

19. మరునాడు వేకువనే రాజు నిద్రలేచి గబగబ సింహముల గుంటకడకు వెళ్ళెను.

20. దాని చెంతకు రాగానే అతడు “సజీవుడైన దేవుని సేవించు దానియేలూ! నీవింతటి విశ్వాసముతో కొలుచు దేవుడు సింహముల బారినుండి నిన్ను రక్షించెనా?" అని ఆందోళనముతో అడిగెను.

21. దానియేలు “ప్రభువులవారు కలకాలము జీవింతురుగాక!

22. దేవుడు దేవదూతనుపంపి సింగముల నోళ్ళను మూయించెను. కనుక అవి నాకు హానియు చేయలేదు. దేవుడు నన్ను నిర్దోషిగా గణించెనుగనుక, మీకు నేనెట్టి అపరాధమును చేయలేదుగనుక ఆయన ఇట్లు చేసెను” అనెను.

23. ఆ మాటలకు రాజు మిగుల సంతసించి దానియేలును సింగములగుంటనుండి వెలుపలికి తీయుడని ఆజ్ఞా పించెను. అట్లే అతనిని బయటికి తీసిరి. దానియేలు దేవుని నమ్మెనుగనుక అతనికెట్టి హానియు కలుగలేదు.

24. రాజు దానియేలుపై నేరము తెచ్చినవారిని పిలిపించెను. వారినందరిని ఆలుబిడ్డలతో సింగముల గుంటలోనికి త్రోయించెను. గుంట అడుగుభాగమును చేరుకొనకపూర్వమే సింహములు వారి పైకి దూకి వారి ఎముకలను ముక్కలు ముక్కలు చేసెను.

25. అంతట దర్యావేషు రాజు లోకములోని ఎల్ల దేశములకును, జాతులకును, భాషలకునుచెందిన ప్రజలకు ఇట్లు లేఖలు పంపెను: “మీకు శాంతి శుభములు సమృద్ధిగా కలుగునుగాక! "

26. నా రాజ్యములోని జనులెల్లరును దానియేలు యొక్క , దేవునిపట్ల భయభక్తులు చూపవలెనని నా ఆజ్ఞ: "ఆయన సజీవుడైన దేవుడు, కలకాలము పరిపాలించువాడు. ఆయన రాజ్యమెన్నడును నాశనము కాదు. ఆయన పరిపాలనమునకు అంతముండదు.

27. ఆయన తన ప్రజలను రక్షించి కాపాడును, భూమ్యాకాశములందు అద్భుతకార్యములు చేయును. ఆయన దానియేలును సింగముల బారినుండి విడిపించెను.”

28. దర్యావేషు పరిపాలనాకాలమునను, పారశీక ప్రభువైన కోరెషు కాలమునను దానియేలు వృద్దిలోనికి వచ్చెను.

1. బెల్షస్సరు బబులోనియాను ఏలిన మొదటియేట దానియేలు పడుకపై పరుండి కలగనెను. రేయి దర్శన మును చూచెను. ఆ కలను సంక్షేపముగా వ్రాసి పెట్టెను. దాని వృత్తాంతమిది:

2. “ఆ రేయి నేను చూచిన దృశ్యమిది. నాలుగు దిక్కులనుండి వాయు వులు బలముగా వీచుచు మహాసాగరమును అల్లకల్లోలము చేయుచుండెను.

3. ఆ సాగరము నుండి వేరువేరు ఆకారములుగల గొప్పమృగములు నాలుగు వెలుపలికి వచ్చెను.

4. మొదటిది సింహము వలె నుండెను. కాని దానికి గరుడపక్షి రెక్కలు కలవు. నేను చూచుచుండగనే దాని రెక్కలు విరిగిపోయెను. ఆ మృగమును పైకెత్తగా అది నరునివలె నిలుచుండెను. దానికి నరునివంటి మనస్సు ఇవ్వబడెను.

5. రెండవమృగము వెనుకటి కాళ్ళపై నిలుచున్న ఎలుగుబంటివలె నుండెను. దాని కోరల మధ్య మూడు ప్రక్కటెముకలుండెను. ఒక శబ్దము దానితో “నీవు నీ ఇష్టము వచ్చినంత మాంసమును భక్షింపుము” అని చెప్పెను.

6. నేను చూచుచుండగా మరియొక మృగము కనిపించెను. అది చిరుతపులివలె నుండెను. కాని దాని వీపుపై పక్షిరెక్కల వంటి రెక్కలు నాలుగుండెను. దానికి నాలుగు శిరస్సులుండెను. ఆ మృగము అధికారమును బడసెను.

7. నేను చూచుచుండగా నాలుగవ మృగము కనిపించెను. అది మిక్కిలి బలముగను, భీకరముగను, ఘోరముగను ఉండెను. అది ఇనుపపండ్లతో తన యెరలను చీల్చితినెను. మిగిలిన భాగములను నజ్జు నజ్జుచేసి కాళ్ళతో తొక్కెను. ఇతర మృగములవలె గాక దానికి పదికొమ్ములుండెను.

8. నేను ఆ కొమ్ములవైపు పారజూచుచుండగా వాని నడుమ మరియొక చిన్నకొమ్ము పుట్టెను. అది అంతకు పూర్వమున్న కొమ్ము లను మూడింటిని సమూలముగా పెరికివేసెను. ఈ కొమ్మునకు నరుల కన్నులును, ప్రగల్భములు పలుకు నోరును ఉండెను.

9. నేను చూచుచుండగా సింహాసనములను అమర్చిరి. శాశ్వతజీవి ఒకడు సింహాసనముపై ఆసీనుడయ్యెను. అతని వస్త్రములు మంచువలె తెల్లగా నుండెను. తలవెంట్రుకలు తెల్లని ఉన్నివలె నిర్మలముగా నుండెను. అగ్నివంటి చక్రములపైనున్న అతని సింహాసనము అగ్నివంటి జ్వాలలతో మండుచుండెను.

10. ఆ సింహాసనమునుండియు, అతని ఎదుటినుండియు అగ్నివంటి ప్రవాహము పారుచుండెను. వేనవేలుబంటులు అతనికి ఊడిగము చేయుచుండిరి. లక్షలకొలది సేవకులు అతని ఎదుట నిలిచియుండిరి. అంతట న్యాయస్థానమున పని ప్రారంభముకాగా గ్రంథములను విప్పిరి.

11. నేను చూచుచుండగా ఆ చిన్నకొమ్ము ఇంకను గొప్పలు చెప్పుకొనుచుండెను. నేను చూచుచుండగా వారు ఆ నాలుగవ మృగమును చంపినట్లు కనబడెను. దాని కళేబరమును మంటలలోపడవేసి నాశనము చేసిరి.

12. మిగిలిన ఆ మృగములు తమ అధికారమును కోల్పోయెను. కాని సమయము ఆసన్నమగువరకు అవి సజీవుల మధ్య ఉండవలెనని, నిర్ణయింపబడెను.

13. నేను ఆ రాత్రి కలిగిన దృశ్యమును ఇంకనూ చూచుచుండగ మేఘారూఢుడైన మనుష్య కుమారుని పోలినవాడు వచ్చుటను గాంచితిని. అతడు ఆ శాశ్వతజీవి' సన్నిధిని ప్రవేశింపగా అతడిని ఆ శాశ్వతజీవి సముఖమునకు కొనిపోయిరి.

14. ఆ మనుష్యకుమారుడు పరిపాలనమును,  మహిమను, రాజ్యాధికారమును బడసెను. సకల దేశములకును, జాతులకును, భాషలకును చెందిన ప్రజలెల్లరును ఆయనను సేవించిరి. ఆయన పరిపాలన శాశ్వతమైనది. - అది ఎన్నటికిని తొలగిపోదు. ఆయన రాజ్యమునకు అంతములేదు.

15. ఆ దర్శనమును చూచి నేను భీతితో కంపించితిని.

16. నేనచట నిలుచున్న వారిలో ఒకని చెంతకుపోయి వీని భావమును వివరింపుమంటిని. అతడు ఆ దృశ్యముల అర్ధమును వివరించుచు నాతో ఇట్లనెను:

17. 'ఈ నాలుగు గొప్పమృగములను భూమిమీద నెలకొననున్న నలుగురు రాజులు.

18. అయితే మహోన్నతుని పవిత్ర ప్రజలే రాజ్యాధికారమును స్వీకరింతురు. వారు ఆ రాజ్యమును యుగ యుగములవరకు శాశ్వతముగా ఏలుదురు.'

19. అంతట నేను ఇతర మృగములకంటెను భిన్నముగానున్న ఆ నాలుగవ మృగమును గూర్చి ఎక్కువగా తెలిసికోగోరితిని. ఆ భయంకరమృగము కంచు గోళ్ళతోను, ఇనుపపండ్లతో తన ఎరలను చీల్చి తినుచుండెను. తినగా మిగిలిన భాగములను నజ్జునజ్జు చేసి కాళ్ళతో తొక్కుచుండెను.

20. ఇంకను నేను దాని తలమీది పదికొమ్ములను గూర్చి తెలిసికో గోరితిని. వాని తరువాత మరియొక కొమ్ము ఎందుకు పుట్టినదో, అది మూడు కొమ్ములనెందుకు పెరికి వేసినదో యెరుగగోరితిని. ఆ కొమ్మునకు కన్నులు, ప్రగల్భములు పలుకు నోరును ఉన్నది. అది ఇతర కొమ్ములకంటె భీకరముగా కన్పించినది.

21. నేను చూచుచుండగా ఆ కొమ్ము దేవుని పవిత్రప్రజపై యుద్ధముచేసి వారినోడించెను.

22. అంతటా శాశ్వతజీవివచ్చి మహోన్నతుని పవిత్ర ప్రజ లకు అనుకూలముగా తీర్పుచెప్పెను. దేవుని పవిత్ర ప్రజలు రాజ్యాధికారమును స్వీకరించు సమయము ఆసన్నమైనదని నేను గ్రహించితిని.

23. నేనడిగిన వ్యక్తి నా ప్రశ్నకిట్లు బదులు చెప్పెను: 'ఈ నాలుగవ మృగము నేలపై నెలకొననున్న నాలుగవ రాజ్యము. అది ఇతర రాజ్యములకంటెను భిన్నముగా నుండును. అది భూమినంతటిని నలగగొట్టి తన కాళ్ళతో తొక్కును.

24. పదికొమ్ములు ఆ రాజ్యమునేలు పదిమంది రాజులను సూచించును. అటు పిమ్మట మరియొక రాజు వచ్చును. అతడు పూర్వ రాజులకంటే భిన్నముగా నుండును. ఆ రాజులలో ముగ్గురిని కూల్చివేయును.

25. అతడు మహోన్న తుడైన దేవునికి వ్యతిరేకముగా మాటలాడును. ఆ ప్రజల నియమములను పండుగలను మార్చజూచును. పవిత్ర ప్రజలు మూడున్నర ఏండ్లపాటు అతని ఆధీన మున ఉందురు.

26. అంతట దేవుడు న్యాయసభను జరిపి అతని అధికారమును రూపుమాపి అతనిని మట్టుపెట్టును.

27. మహోన్నతుడైన దేవుని పవిత్ర ప్రజలు ఆ రాజ్యమును, అధికారమును, భూమిమీది సకల రాజ్యముల వైభవమును స్వీకరింతురు. వారి రాజ్యము శాశ్వతముగా నిలిచియుండును. భూమిమీది పాలకులు వారిని సేవించి వారికి విధేయులగుదురు'.

28. ఆ వృత్తాంతముయొక్క ఆంతర్యమిది. దానియేలు అయిన నాకు సంబంధించినంత వరకు, నేను మిక్కిలిగా భీతిల్లి వెలవెలపోతిని. ఈ సంగతిని నా మనస్సులోనే ఉంచుకొంటిని”.

1. బెల్షస్సరురాజు పరిపాలనాకాలము మూడవ యేట నేను రెండవ దర్శనమును చూచితిని.

2. ఆ దర్శనమున నేను ఏలాము దేశములోని ప్రాకారములు గల షూషను నగరమున ఉన్నట్లు గ్రహించితిని. నేను ఊలయి నది ఒడ్డున నిలిచియుంటిని.

3. ఆ నది ఒడ్డున ఒక పొట్టేలిని కాంచితిని. దానికి రెండు పొడవైన కొమ్ములు కలవు. వానిలో ఒకటి రెండవదానికంటెను పొడవైనదిగాను, క్రొత్తదిగాను కనిపించెను.

4. నేను ఆ పొట్టేలు తన కొమ్ములతో ఉత్తర దక్షిణ దిక్కులను, పడమటి దిశను పొడుచుటను గాంచితిని. ఏ జంతువును దాని ముందట నిలువజాలదయ్యెను. దాని బారి నుండి తప్పించుకోజాలదయ్యెను. ఆ పొట్టేలు తన ఇష్టము వచ్చినట్లు జరుగుచు, బలమును చూపుచు మిడిసిపడుచుండెను.

5. నేను దీని భావమేమిటాయని ఆలోచించుచుండగా పశ్చిమ దిక్కునుండి ఒక మేకపోతు వచ్చెను. అది భూతలమంతటిమీదను వేగముగా పరుగెత్తుచు వచ్చెను. దాని పాదములు నేలను తాకవయ్యెను. దాని కన్నులనడుమ ప్రముఖమైన కొమ్ము ఒకటి కలదు.

6. అది నేను నదియొడ్డున చూచిన పొట్టేలియొద్దకు వచ్చి మహాబలముతో దానిమీదకు దూకెను.

7. అది పొట్టేలి మీదబడుటను నేను గమనించితిని. అది మహా రౌద్రముతో పొట్టేలిని పడవేసి దాని రెండు కొమ్ములను విరుగగొట్టెను. పొట్టేలు దానినెదిరింపజాలదయ్యెను. మేకపోతు దానిని క్రిందపడవేసి కాళ్ళతో తొక్కెను. దానిని రక్షించువాడెవడును లేడయ్యెను.

8. ఆ మేకపోతు అనతికాలములోనే అత్యధిక బలమును చూపుచూ వచ్చెను. అది పుష్టినొందిన కాలముననే దాని పెద్దకొమ్ము విరిగిపోయెను, విరిగిన దానిస్థానమున ప్రసిద్ధములయిన నాలుగు కొమ్ములు  ఆకాశపు నలుదిక్కులకు పెరిగెను.

9. ఆ నాలుగు కొమ్ములలో ఒకదానికి మరియొక చిన్నకొమ్ము పుట్టెను. అది దక్షిణ, తూర్పు దిక్కులకును, మనోహరమైన యిస్రాయేలు దేశము వైపునకును వ్యాపించెను.

10. అది ఆకాశ సైన్యమునంటునంతగ పెరిగి, నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ళతో అణగదొక్కుచుండెను.

11. అది ఆకాశ సైన్యముల అధిపతినే సవాలు చేసెను. అతనికి అర్పించు దైనందిన సమర్పణలను ఆపుచేయించి దేవాలయమును ధ్వంసము చేసెను.

12. దైనందినబలులను నివారించుటకై ఒక సేన దానికీయబడెను. ఆ సేన సత్యమును నేలరాచి, తన ఇష్టానుసారముగ వ్యవహరించుచు విజయము సాధించెను.

13. అంతట పవిత్రుడొకడు మాట్లాడుచుండగ నేను వింటిని. మాట్లాడుచున్న ఆ పవిత్రునితో మరియొక పవిత్రుడు, “దైనందినబలుల విషయములో ఈ దర్శనము ఎంతకాలము వర్తించును? అతిక్రమము వలన సంభవించిన ఈ వినాశకరచర్యల అసహ్యము ఎంత కాలముండును? పరిశుద్ధస్థలమును, అందలి జనసమూహములను కాళ్ళక్రింద తొక్కబడుట ఇంకను ఎన్నాళ్ళు జరుగును?” అని అడిగెను.

14. నేను వినుచుండగా ఆ రెండవ దేవదూత ఇట్లు బదులు చెప్పెను. “రెండువేలమూడువందల సాయంకాలములు, ఉదయములు అటుల సంభ వించును. అటుపిమ్మట దేవళము పవిత్రమైనదిగా పునరుద్ధరింపబడును”.

15. నేను ఈ దృశ్యభావమును అర్ధము చేసి కొనుటకు ప్రయత్నించుచుండగా, దిషీలున నరుని వంటివాడు ఒకడు నాయెదుట నిలుచుండెను.

16. “ గబ్రియేలూ! నీవు ఈ నరుడు చూచిన సంగతులను ఇతనికి వివరింపుము” అని ఊలయి నదిపై నాకొక శబ్దము వినిపించెను.

17. గబ్రియేలు వచ్చి నా చెంత నిలుచుండుటను చూచి నేను భీతితో కంపించి నేలపై బోరగిల బడితిని. అతడు నాతో నరపుత్రుడా! దీని భావమిది. ఈ దర్శనము లోకాంతము గూర్చినది” అని చెప్పెను.

18. అతడు మాట్లాడుచుండగా నేను స్పృహ కోల్పోయి నేలపై బడితిని. కాని అతడు నన్నుపట్టుకొని నా కాళ్ళమీద నిలబెట్టెను.

19. అతడు నాతో ఇట్లనెను: “దేవుని ఆగ్రహము యొక్క ఫలితమెట్టిదో నేను నీకు చూపించుచున్నాను. ఈ దర్శనము లోకాంతమును గురించినది.

20. నీవు చూచిన పొట్టేలి రెండుకొమ్ములు మాదీయ, పారశీక రాజ్యములను సూచించును.

21. మేకపోతు గ్రీకు రాజ్యమునకు గుర్తు. దాని కన్నుల నడుమగల ప్రముఖమైన కొమ్ము మొదటిరాజు,

22. ఆ మొదటి కొమ్ము విరిగినప్పుడు పుట్టిన నాలుగు కొమ్ములు ఆ రాజ్యము నాలుగు భాగములుగా విభక్త మగుననుటకు గురు. అవి మొదటి రాజ్యమంత బలముగా ఉండజాలవు.

23. ఆ రాజ్యములు ధ్వంసమగు కాలము వచ్చి నప్పుడు, వాని పాపములుపండి అవి శిక్షకు గురి కానున్నప్పుడు దుర్మార్గుడును, మొండివాడును, మోస గాడునైన రాజు పొడచూపును.

24. అతడు తన శక్తి వలనగాక, ఇతరుని శక్తివలన బలాఢ్యుడగును. అతడు ఘోరవినాశము తెచ్చిపెట్టును. తాను చేపట్టిన కార్యము లందెల్ల విజయముబడయును. అతడు బలవంతులను, పవిత్ర ప్రజలనుగూడ నాశనము చేయును.

25. కపటాత్ముడు గనుక అతని వంచనలు సఫలమగును. అతడు గర్వాత్ముడై ముందుగా హెచ్చరింపకయే పెక్కు మందిని వధించును.రాజాధిరాజునుగూడ ఎదిరించును. కాని కడకు నరబలముతో అవసరము లేకుండనే అతనిని మట్టుపెట్టుదురు.

26. సాయంకాల, ఉదయ కాల బలులను గూర్చిన ఈ దర్శనమును నేను నీకు వివరించితినిగదా! ఇది నెరవేరితీరును. కాని దీనిని గోప్యముగా నుంచుము. ఇది నెరవేరుటకు ఇంకను చాలకాలము పట్టును.”

27. నేను ఈ దర్శనము కలుగగా విషాదమునకు గురియై కొన్నిరోజుల వరకు జబ్బుగానుంటిని. అటు తరువాత లేచి రాజుకొరకు చేయవలసిన పని చూచు కోనారంభించితిని. ఈ దర్శనమును గూర్చి విస్మయమునొందితిని. కాని దాని భావమును తెలుపగలవాడు ఎవడును లేకపోయెను.

1. మాదీయుడైన అహష్వేరోషు కుమారుడైన దర్యావేషు బబులోనియా రాజమ్యును పాలించుచుండెను.

2. అతని పరిపాలనాకాలము మొదటియేట నేను పవిత్ర గ్రంథములు చదివి, ప్రభువు తన ప్రవక్త యగు యిర్మీయాకు చెప్పినట్లు యెరూషలేము డెబ్బది ఏండ్ల పాటు శిథిలముగానుండుటను గూర్చి ఆలో చించుచుంటిని.

3. నేను ప్రభువునకు భక్తితో ప్రార్ధన చేయుచు అతనికి మనవిచేసికొని ఉపవాసముండి గోనె తాల్చి బూడిదలో కూర్చుంటిని.

4. నేను నా ప్రభువైన దేవునికి ప్రార్థనచేసి మా ప్రజల పాపములను అతని ఎదుట ఇట్లు ఒప్పుకొంటిని: “ప్రభువైన దేవా! నీవు మహితాత్ముడవు. నీ ఆజ్ఞలను అనుసరించి జీవించువారియెడల నీ నిబంధనమును, నీ కృపను పాటింతువు.

5. మేము నీ దాసులగు ప్రవక్తలు నీ పేరుమీదిగా మా రాజులకును, మా అధిపతులకును, మా తండ్రులకును, యూదాదేశ జనులందరికిని చెప్పిన మాటలను ఆలకింపక

6. నీ ఆజ్ఞలను, విధులను అనుసరించుటమాని, పాపులమును దుష్టులమై చెడుగా ప్రవర్తించుచు తిరుగుబాటు చేసినవారము.

7. ప్రభూ! నీవు నీతిమంతుడవు. కాని మేముమాత్రము ఎల్లపుడు తలవంపులే తెచ్చుకొంటిమి. యూదయాలోను, యెరూషలేమునను వసించువారికిని, నీకు దోహము చేసినందున నీవు దూరదేశములకును, దగ్గరిదేశములకును చెల్లాచెదరు చేసినవారికిని,  ఈ అవమానమే చెల్లును.

8. ప్రభూ! మారాజులు, పాలకులు, పూర్వులు నీకు ద్రోహముగా పాపముచేసి లజ్జాకరముగా ప్రవర్తించిరి.

9. మేము నీపై తిరుగబడినను, నీవు మాపై దయచూపి మమ్ము రక్షింపగోరితివి.

10. మా ప్రభుడవైన దేవా! నీవు నీ సేవకులైన ప్రవక్తల ద్వారా దయచేసిన శాసనములను మేము పాటింపవలెనని కోరితివి. కాని మేము నీ మాటవినమైతిమి.

11. యిస్రాయేలీయులెల్లరును నీ కట్టడలనుమీరి నీ పలుకులను లెక్కచేయరైరి.  మేము నీకు ద్రోహముగా అపరాధములు చేసితిమి. కనుక నీవు నీ సేవకుడైన మోషే ధర్మశాస్త్రమున లిఖింపబడిన శాపములకు మమ్ము గురిచేసితివి.

12. నీవు మాకును, మా పాలకులకును నీవు చేయుదునన్న కార్యములేచేసితివి. నీవు లోకములోని నగరములన్నిటికంటెను యెరూషలేమును అధికముగా శిక్షించితివి.

13. మోషే ధర్మశాస్త్రములోని శిక్షలన్నింటిని మామీదికి రప్పించితివి. మా ప్రభుడవైన దేవా! ఇప్పుడుకూడ మేము మా పాపములనుండి వైదొలగి నీ సత్యమును అనుసరించి నీకు ప్రీతికలిగింపజాలమైతిమి. నీవు ఎల్లపుడు న్యాయమునే పాటించువాడవు కనుకను,

14. మేము నీమాట వినలేదుకనుకను, నీవు మమ్ము దండింపకోరితివి, దండించితివి.

15. మా ప్రభుడవైన దేవా! నీవు నీ ప్రజలను ఐగుప్తునుండి , తోడ్కొనివచ్చుట ద్వారా నీ బలము ప్రదర్శించితివి. నేటికిని నీకు కీర్తి చెల్లుచున్నది. మేము పాపములు అపరాధములు చేసితిమి.

16. నీవు పూర్వము మమ్ము ఆదుకొంటివి. కనుక నగరముమీద ఇకమీదట ఆగ్రహము చెందకుము. అది నీ నగరము, నీ పవిత్రపర్వతము మేమును, మా పూర్వులును పాపము చేసినందులకుగాను . లోకములోని నరులెల్లరును యెరూషలేమును, నీ ప్రజలను చిన్నచూపు చూచుచున్నారు.

17. ప్రభూ! దీనిని బట్టి మీ దాసుడుచేయు ప్రార్థనను, విజ్ఞాపనలనాలకించి, ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన మీ పరిశుద్ధస్థలముమీదికి, మీ ముఖ ప్రకాశమును రానిమ్ము.

18. ప్రభూ! మా వేడుకోలును ఆలింపుము. మా కష్టములు పరికింపుము. నీ పేరున వెలయుచున్న ఈ నగరపు ఇక్కట్టులను చూడుము. మేము ఏమేమో ధర్మకార్యములు చేసితిమనికాదు, నీవు దయామయుడవు కనుక మేము నీకు మనవిచేయుచున్నాము.

19. ప్రభూ! మా మొరవినుము, మమ్ము క్షమింపుము. ఆలస్యముచేయక మా వేడికోలును చిత్తగింపుము. ఈ నగరమును, ఈ ప్రజలును నీ నామమును వహించినవారు, నీ ఘనతను గ్రహించినవారు.”

20. నేనింకను ప్రార్ధన కొనసాగించుచుంటిని. నా తప్పిదములను, మా ప్రజలైన యిస్రాయేలీయుల తప్పిదములను దేవుని ముందట ఒప్పుకొనుచుంటిని. నా ప్రభువైన దేవుడు తన పవిత్రమందిరమును పునరుద్దరింపవలెనని వేడుకొంటిని.

21. నేనట్లు ప్రార్ధన చేయుచుండగా, నేను పూర్వదర్శనమున చూచిన గబ్రియేలు, నేనున్న చోటికి దిగివచ్చెను. అది సాయంకా లము. బలినర్పించు సమయము.

22. అతడు నాతో ఇట్లనెను: “దానియేలూ! నేను నీకు ప్రవచనమును నెరిగింపవచ్చితిని.

23. నీవు దేవునికి మొరపెట్టినపుడు ఆయన నీ వేడుకోలును ఆలించెను. ఆయన నిన్ను ప్రేమించెను. కనుక నేను నీకు ఆయన జవాబు నెరిగింప వచ్చితిని. నేను దర్శనభావమును వివరింతును. సావధానముతో వినుము.

24. “ప్రభువు మీ ప్రజలను బానిసత్వమునుండి విడిపించుటకును, మీ పవిత్రనగరమును పాపము నుండి రక్షించుటకును డెబ్బదివారములు నిర్ణయించెను. ఆయన పాపములు మన్నించి శాశ్వతమైన న్యాయమును నెలకొల్పును. కావున ఈ దర్శనమును, ప్రవచనమును నెరవేరితీరును. పవిత్ర మందిరమును పునరంకితము చేయుదురు.

25. ఈ విషయము సావధానముగా విని గ్రహింపుము. యెరూషలేమును పునర్నిర్మింపుడని ఆజ్ఞ యిచ్చినప్పటినుండి అభిషిక్తుడైన ప్రజాపతి వచ్చు వరకును ఏడువారములు గడచును. యెరూషలేమును వీధులతోను, బలమైన కోటలతోను పునర్నిర్మింతురు. అది అరువది రెండువారములు పట్టును. కాని యిది శ్రమలతో నిండినకాలము.

26. ఆ కాలాంతమున ప్రభువు ఎన్నుకొనిన అభిషిక్తుడైన నాయకుని అన్యాయముగా హత్యచేయుదురు. బలాఢ్యుడైన రాజు సైన్యములు దాడి చేసి నగరమును, దేవాలయమును నాశనము చేయును. ఆ అంతము ప్రళయమువలె వచ్చును. అది ప్రభువు నిర్ణయించిన యుద్ధమును, వినాశమును కొనివచ్చును.

27. అతడొక వారము వరకు అనేకులతో సుస్థిర నిబంధన నేర్పరచును. అర్థవారమువరకు బలిని, నైవేద్యమును నిలిపివేయ కారకుడగును. హేయమైనది నిలుచువరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించువరకు ఇట్లు జరుగును”.

1. కోరెషు పారశీకమునకు రాజుగానున్న కాలమున మూడవయేట బెల్తేషాజరు అను మారుపేరు గల దానియేలునకు ఒక సందేశము తెలియపరపపడెను. అది నిజమైనదేగాని దానిభావమును గ్రహించుట మాత్రము చాలకష్టము. దాని భావము అతనికి దర్శనమున తెలియచేయబడెను.

2. ఆ సమయమున నేను మూడువారముల కాలము శోకించుచుంటిని.

3. మంచి భోజనమును గాని, మాంసమునుగాని భుజింపలేదు. ద్రాక్షాసారాయమును సేవింపలేదు. అభ్యంగనము చేసికోలేదు.

4. సంవత్సరము మొదటి నెల ఇరువది నాలుగవ దినమున నేను తిగ్రీసు నదిఒడ్డున నిలిచియుంటిని.

5. నేను పైకి చూడగా నారబట్టలు తాల్చి, మేలిమి బంగారపు నడికట్టు ధరించిన నరుడొకడు కనిపించెను.

6. అతని శరీరము రత్నమువలె మెరయుచుండెను. ముఖము మెరుపువలె మెరయుచుండెను. కన్నులు అగ్నివలె వెలుగుచుండెను. కాలుచేతులు మెరుగు పెట్టిన కంచువలె ప్రకాశించుచుండెను. స్వరము పెద్ద జనసమూహము స్వరమువలెనుండెను.

7. దర్శనమును చూచినవాడను నేనొక్కడినే. నాతోనున్న వారికేమియు కనిపింపలేదు. కాని వారు భయపడి పారిపోయి దాగుకొనిరి.

8. నేను ఒక్కడనే మిగిలియుండి ఆ మహాదర్శనమును చూచితిని. నా బలము సన్నగిల్లెను.నా ముఖరూపము పూర్తిగా మారెను.

9. నేను అతని స్వరమువిని నేలపై బోరగిలపడి స్పృహ కోల్పోతిని.

10. అంతట ఒక చేయి నన్ను పట్టుకొని క్రిందపడియున్న నన్ను మోకాళ్ళ మీదికి, చేతుల మీదికి లేపెను. నేనింకను వణకుచునే యుంటిని.

11. అతడు “దానియేలూ! దేవునికి నీవనిన ఇష్టము. నీవు పైకి లేచి నేను చెప్పునది జాగ్రత్తగా వినుము. దేవుడు నన్ను నీ చెంతకు పంపెను” అనెను. అతడిట్లు పలుకగా నేను లేచి నిలుచుంటిని. కాని యింకను వణకుచునే యుంటిని.

12. అంతటతడు నాతో “దానియేలూ! భయపడకుము. జ్ఞానమును బడయుటకుగాను నీవు దేవుని ఎదుట వినయము ప్రదర్శించిన మొదటినాటి నుండియు ప్రభువు నీ మొరవినెను. నీ ప్రార్థననుబట్టి నేను వచ్చితిని.

13. పారశీక రాజ్యమునకు కావలికాయు దేవదూత ఇరువది ఒక్క దినములు నన్ను ఎదిరించెను. నేను పారశీక దేశమున ఒంటరిగా నుండుట చూచి మిఖాయేలు అను దేవదూత నాకు సాయము చేసెను.

14. నీ ప్రజలకు భవిష్యత్తులో ఏమి జరుగునో నీవు గ్రహించుటకుగాను నేను ఇచ్చటికి వచ్చితిని. ఇది భవిష్యత్తును గూర్చిన దర్శనము” అని అనెను.

15. అతడిట్లు చెప్పగా నేనేమియు బదులు పలుకక నేలవైపు చూడసాగితిని.

16. అంతట నరాకృతిలో నున్న ఆ దేవదూత చేయిచాచి నా పెదవులు ముట్టెను. నేనతనితో అయ్యా! ఈ దర్శనము నన్ను మిక్కిలి బలహీనుని చేసెను. నేను నా వణకును ఆపుకోజాలకున్నాను.

17. నాస్థితి బానిస తన యజమాని ముందు నిలిచియున్నట్లున్నది. నాకు ఊపిరాడుటలేదు. బలమును లేదు. ఇక నేను నీతో ఎట్లు మాట్లాడగలను?” అంటిని.

18. మరల అతడు నన్ను తాకెను. నాకు బలము వచ్చెను.

19. అతడు “దేవునికి నీవు అనిన ఇష్టము కనుక నీవు దేనికి భయపడకుము. చింతింపకుము” అని చెప్పెను. అతడట్లు పలుకగా నాకెక్కువ సత్తువ కలిగెను. నేనతనితో "అయ్యా! నీవు నన్ను ధైర్యపరచితివి, కనుక ఇపుడు నీవు ఆజ్ఞ ఇమ్ము” అని అంటిని.

20-21. అతడిట్లనెను: “నేను నీ చెంతకెందుకు వచ్చితినో నీకు తెలియునా? సత్య గ్రంథమున ఏమి వ్రాయబడియున్నదో నీకు తెలియజేయుటకొరకే. నేనిపుడు తిరిగిపోయి పారశీకదేశమునకు కావలి కాయు దేవదూతతో పోరాడవలెను. తరువాత గ్రీకు దేశమునకు కావలికాయు దేవదూతతో పోరాడవలెను. యిస్రాయేలు దేశమునకు కావలికాయు మిఖాయేలు తప్ప నాకు తోడ్పడువారు ఎవరును లేరు.

1. మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరమందు నేను స్థిరపరచబడుటకును, బలపరచ బడుటకును అతనియొద్ద నిలబడితిని. 

2. ఇపుడు నేను నీతో చెప్పబోవు సంగతులు నిజమైనవి. ఆ దేవదూత మరియు ఇట్లనెను: “ఇంకను ముగ్గురు రాజులు పారశీక దేశమును పాలింతురు. అటుపిమ్మట నాలుగవరాజు వచ్చును. అతడు అందరికంటెను ధనవంతుడు. అతడు సంపదలను బలమును మిక్కుటముగా బడసి గ్రీకు రాజ్యమును సవాలుచేయును.

3. అటుతరువాత పరా క్రమశాలియైన రాజు ఉద్భవించును. అతడు పెద్ద రాజ్య మును పాలించును. తనకిష్టము వచ్చిన కార్యములెల్ల చేయును.

4. అతని రాజ్యాధికారము ఉత్కృష్టదశను అందుకొనిన వెంటనే అతని సామ్రాజ్యము ముక్కలు ముక్కలై నాలుగు భాగములగును. అది అతని వంశపు వారికిగాని, తాను నియమించిన పరిపాలనాధిపతు లకుగాని విభాగింపబడదు. అతని అధికారము వ్రేళ్ళతో పెరికివేయబడును. అతని వంశపువారు దానిని పొందరు. కాని అన్యులు పొందుదురు.

5. అయితే దక్షిణదేశపు (ఐగుప్తు) రాజు బలశాలి అగును. కాని అతని సైన్యాధిపతి అతనికంటెను బలాడ్యుడై అతనికంటెను పెద్ద రాజ్యమునేలును.

6. చాల ఏండ్ల తరువాత దక్షిణదేశపురాజు, ఉత్తరదేశపు (సిరియా) రాజుతో పొత్తు కుదుర్చుకొని తన కుమార్తెనతనికిచ్చి పెండ్లి చేయును. కాని ఆ పొత్తు దీర్ఘకాలము నిలువదు. ఆ కుమార్తెను, ఆమె పెనిమిటిని, కుమారుని, ఆమెతో వెళ్ళిన సేవకులను వధింతురు.

7. తదనంతర మామె బంధువులలో ఒకడు రాజగును. అతడు ఉత్తర దేశపు సైన్యము మీదికి దాడిచేయును. వారి కోటలో ప్రవేశించి వారినోడించును.

8. అతడు సిరియనుల దేవతావిగ్రహమును ఐగుప్తునకు కొనిపోవును. ఆ దేవతలకు అర్పించిన వెండి, బంగారు పరికరములు తీసికొనిపోవును. చాల ఏండ్లు శాంతి నెలకొనిన తరువాత,

9. సిరియారాజు ఐగుప్తురాజు మీదికి దాడిచేయును. కాని అతడు ఓడిపోయి వెనుకకు తిరిగి వచ్చును.

10. సిరియారాజు కుమారులు యుద్ధమునకు సన్నద్దులై పెద్దసైన్యమును ప్రోగుచేసికొందురు. వారిలో నొకడు ఉప్పొంగు ప్రవాహమువలె వచ్చి శత్రువుల కోటను ముట్టడించును.

11. కాని ఐగుప్తురాజు ఆగ్రహము చెంది, సిరియారాజు మీదికి దండెత్తి అతని మహాసైన్యమును పట్టుకొనును.

12. అతడు తన విజయమును, తాను చంపిన అసంఖ్యాక సైన్య మును చూచి గర్వించును. కాని అతని విజయ మెక్కువ కాలము కొనసాగదు.

13. సిరియారాజు వెడలిపోయి పూర్వముకంటె పెద్ద సైన్యమును ప్రోగుచేసికొనును. తగిన తరుణము లభించినపుడు అతడు ఆయుధములతో కూడిన మహా సైన్యముతో తిరిగివచ్చును.

14. అప్పుడు చాలమంది ఐగుప్తురాజు మీద తిరుగబడుదురు. దానియేలూ! మీ జాతినుండి కూడ కొందరు హింసాప్రియులు తాము చూచిన ఒకానొకదర్శనము కారణముగా తిరుగు బాటు చేయుదురు. కాని వారెల్లరును ఓడిపోదురు.

15. సిరియారాజు సురక్షితపట్టణమును ఆక్రమించి దానిని పట్టుకొనును. ఐగుప్తు సైనికులు పోరును కొన సాగింతురు. వారిలో శూరులుకూడ బలమును కోల్పోవుదురు.

16. కనుక సిరియారాజు శత్రు సైనికులను తన ఇష్టము వచ్చినట్లు చేయును. వారతడిని ఎదిరింపరు. అతడు యిస్రాయేలు దేశమున గూడ ప్రవేశించి దానిని పూర్ణముగా స్వాధీనము చేసికొనును.

17. సిరియారాజు తన సర్వసైన్యముతో దండ యాత్ర చేయజూచును. అతడు తన శత్రువు రాజ్యమును నాశముచేయగోరి అతడితో పొత్తు కుదుర్చుకొనును. అతనికి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేయగోరును. కాని అతని పన్నాగములు నెరవేరవు.

18. తరువాత అతడు సముద్రమార్గమున వచ్చి అన్యజాతులమీద దాడి చేయును. చాల జాతులను గెల్చును. కానీ అన్యజాతి  నాయకుడు ఒకడు అతనిని ఓడించి అతని గర్వము నణచును. అతడు సిరియారాజు పొగరును అతని మీదికే త్రిప్పికొట్టును.

19. సిరియారాజు తన దేశములోని కోటకు తిరిగివచ్చును. కాని అతడచట ఓడి పోవును. దానితో అతడు కనుమరుగగును.

20. అతని తరువాత మరియొక రాజు రాజ్య మునకు వచ్చును. అతడు తన ఉద్యోగిని పంపి ప్రజలపై భారమైన పన్నులు విధించును. తన సంపదలను అధికము చేసికోవలెనని అతని కోరిక. కాని ఆ రాజును కొద్దికాలముననే హత్య చేయుదురు. అతనిని బహిరంగముగాగాని, యుద్ధమునగాని చంపరు.

21. అతనికి బదులుగా నీచుడొకడు సిరియాకు రాజగును. అతనికి రాజగు హక్కులేదు. కాని అతడు తలవని తలంపుగా వచ్చి మోసముతో అధికారమును కైవసము చేసికొనును.

22. అతనిని ఎదిరించువారిని ఎవరినైనను, దేవుని ప్రధానయాజకుని గూడ, అతడు రూపుమాపును.

23. అతడు ఒప్పందములద్వారా అన్యజాతులను మోసగించును. తాను చిన్న రాజ్యములనే ఏలినను క్రమముగా బలాఢ్యుడు అగును.

24. ముందుగా హెచ్చరిక చేయకయే అతడొక సంపన్న దేశముపై దాడిచేయును. తన పూర్వులు ఏనాడును చేయని కార్యములను అతడు చేయును. యుద్ధమున దొరికిన కొల్లసొమ్మును, సొత్తును తన అనుచరులకు పంచిఇచ్చును. అతడు కోటలను స్వాధీనము చేసికొనుటకు యత్నము చేయునుగాని, అతనికాలము త్వరగానే ముగియును.

25. అతడు సాహసముతో పెద్ద సైన్యమును ప్రోగుచేసికొని ఐగుప్తురాజుపై దాడిచేయును. ఆ రాజు మహాబలముగల గొప్ప సైన్యములతో ఇతడిని ఎదిరించును. కాని ఆ ఐగుప్తురాజు మోసమునకు లొంగి విజయమును బడయజాలడు.

26. అతనితో భుజించు వారే అతడిని నాశనము చేయుదురు. అతని సైనికులు చాలమంది చత్తురు. అతని సేన హతమగును.

27. అంతట ఇద్దరు రాజులు ఒకే పొత్తున కూర్చుండి భోజనము చేయుదురు. కాని వారి ఉద్దేశములు దుష్టములైయుండును. వారు ఒకరితోనొకరు కల్లలాడుదురు. తగిన కాలమింకను రాలేదు కనుక వారు తమ కోర్కెలను సాధింపజాలరు.

28. సిరియారాజు తాను దోచుకున్న కొల్లసొమ్ముతో తిరిగివచ్చును. మరియు అతడు పవిత్ర నిబంధనమునకు విరోధముగా ఇష్టానుసారముగా వ్యవహరించి తన స్వీయ దేశమునకు తిరిగివచ్చును.

29. అటుపిమ్మట అతడు ఐగుప్తుమీదికి మరల దాడిచేయును. కాని ఈ మారు ఫలితము భిన్నముగా నుండును.

30. కిత్తీయద్వీప (సైప్రస్) ప్రజలు ఓడలతో అతనిమీదికి వచ్చుటవలన అతడు ఓడిపోవును. అంతటతడు పరిశుద్ధ నిబంధనము విషయములో అత్యంత ఆగ్రహముగలవాడై తన ఇష్టానుసారముగా వ్యవహరించును. అతడు వెనుకకు మరలి పరిశుద్ధ నిబంధనమును విడనాడినవారి సలహాను పాటించును.

31. అతని సైనికులు పవిత్రస్థలపు కోటను అపవిత్రపరచి బలి అర్పణలను నిషేధించి దానిలో నాశనముకలుగజేయు హేయమైన విగ్రహమును నెలకొలుపుదురు.

32. అందుకతడు ప్రీతిగొలుపు మాటలతో పవిత్రనిబంధనమును విడనాడినవారిని వశపరచుకొని, వారి మద్దతుబడయును. అయితే దేవునినెరుగువారు బలముకలిగి, అతనితో పోరాడుదురు.

33. ప్రజలలో విజ్ఞానముగల నాయకులు ఇతరులకు ఉపదేశము చేయుదురు. కాని కొంత కాలము వరకు వారిలో కొందరు పోరున కూలుదురు. కొందరిని సజీవముగా దహింతురు. కొందరి ఆస్తులను స్వాధీనము చేసికొని వారిని బందీలను చేయుదురు.

34. ఈ రీతిగా శత్రువులు దైవ ప్రజలను హతమార్చు చుండగా ఆ ప్రజలకు ఒకపాటి సాయము లభించును. కాని చాలమంది స్వార్ధముతో ఆ దైవప్రజల పక్షమును అవలంబింతురు.

35. నియమితకాలము ఇంకను ఆసన్నము కాలేదు కనుక ఆ అంత్యకాలమువరకు దైవ ప్రజలను పరిశీలించుటకును, పవిత్రపరచుటకును వివేకవంతులలో కొందరు హతులగుదురు.

36. సిరియారాజు తన ఇష్టమువచ్చినట్లు ప్రవ ర్తించును. అతడు తాను దైవములందరికంటెను, మహోన్నతుడైన దేవునికంటెను గొప్పవాడనని ప్రగల్బ ములు పలుకును. దేవుడు తనను శిక్షించువరకును అటులనే చేయును. దేవుడు తాను సంకల్పించిన కార్య మును ఖండితముగా నేరవేర్చును.

37. రాజు తన పూర్వులు కొలిచిన దేవతను, స్త్రీలు కొలుచుటకు ఇష్ట పడు దేవతను ఉపేక్షించును. ప్రతి దేవతను నిర్లక్ష్య ముచేసి తానే దేవతలందరికంటెను గొప్పవాడనని ఎంచును.

38. వారికి బదులుగా అతడు కోటలను రక్షించుదేవతను పూజించును. తన పూర్వులు కొలవని దేవతకు వెండి బంగారములను, ఆభరణములను విలువగల కానుకలను అర్పించును.

39. అతడు తన కోటలను రక్షించుటకు పరదేవతలను కొలుచు వారిని వినియోగించును. తనను రాజుగా అంగీ కరించు వారిని మిగుల సత్కరించును. వారికి గొప్ప పదవులిచ్చి, భూములను బహుమతిగానిచ్చును.

40. సిరియా రాజునకు అంత్యకాలము దాపురించినపుడు ఐగుప్తు రాజు అతని మీదికి దాడిచేయును. సిరియారాజు తనగుఱ్ఱములను, రథములను, నావల సమూహములను వినియోగించుకొని, శక్తి కొలది శత్రువు నెదిరించును. అతడు వరద పొంగివచ్చినదో అన్నట్లు చాల దేశముల మీదికి దాడిచేయును.

41. యిస్రాయేలు దేశము మీదికి కూడ దండెత్తి వేలకొలది ప్రజలను సంహరించును. కాని ఎదోము, మోవాబు, అమ్మోనున మిగిలియున్న భాగము మాత్రము అతని దాడిని తప్పించుకొనును.

42. అతడా రాజ్యముల మీదికి దాడిచేసినపుడు ఐగుప్తును కూడ వదలడు.

43. ఐగుప్తున గుప్తమైయున్న వెండిబంగారములను ఇతర విలువగల వస్తువులను అపహరించును. ఇంకను అతడు లిబియాను, కూషు దేశములను గూడ జయించును.

44. అంతట అతడు తూర్పునుండియు, ఉత్తరమునుండియు వచ్చు వార్తలకు కలవరపడి, ఆగ్రహముతో పోరాడి చాలమందిని చంపును.

45. అతడు సముద్ర మునకును, దేవాలయమున్న పర్వతమునకును మధ్య రాజకార్యములను నడుపుటకు , పెద్ద గుడారములు పన్నును. కాని కడకు దిక్కులేని చావు చచ్చును.

1. ఆ కాలమున మీ జాతిని కాపాడు మహాదూత మిఖాయేలు ప్రత్యక్షమగును. అపుడు విపత్కాలము ప్రాప్తించును. జాతులు పుట్టినప్పటి నుండియు అంతటి విపత్కాలమెన్నడును సంభవించి యుండలేదు. ఆ కాలము సమీపించినపుడు మీ జాతిలో దేవుని జీవగ్రంథమున తమ పేర్లు వ్రాయబడినవారు జీవింతురు.

2. అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించు వారిలో చాలమంది సజీవులగుదురు. వారిలో కొందరు నిత్యజీవముబడయుదురు. మరికొందరు శాశ్వత అవమానమునకు గురియగుదురు.

3. జ్ఞానులైన నాయకులు ఆకాశము నందలి జ్యోతులవలె వెలుగుదురు. పెక్కుమందికి ధర్మమును పాటించుట నేర్పినవారు కలకాలము వరకును నక్షత్రములవలె ప్రకాశింతురు.

4. ఆ దేవదూత నాతో “దానియేలూ! నీవు ఇపుడు ఈ గ్రంథమును మూసివేసి దానికి ముద్ర వేయుము. ఆ ముద్ర లొకాంతమువరకును ఉండును. ఈ మధ్య కాలమున చాలమంది విషయమును అర్థము చేసి కోగోరి వ్యర్థప్రయత్నము చేయుదురు” అనెను.

5. అంతట నేను నది ఈవలి ఒడ్డు మీద ఒకనిని ఆవలి ఒడ్డు మీద ఒకనిని అనగా ఇద్దరు నరులు నిలుచుండియుండుట చూచితిని.

6. వారిలో నొకడు నారబట్టలుతాల్చి, నది ఎగువభాగమున నిలిచియున్న దేవదూతను కాంచి "అయ్యా! ఈ అద్భుత సంఘటనములు ముగియుటకు ఇంకను ఎంతకాలము అని అడిగెను.

7. ఆ దేవదూత చేతులు ఆకాశమునకెత్తి నేను వినుచుండగా నిత్యుడైన దేవుని పేరుమీదుగా బాస చేసి ఇట్లనెను: “ఇంకను ఒకకాలము, రెండుకాలములు, అర్థకాలము పట్టును. దేవుని ప్రజలను హింసించుట పూర్తియైనపుడు ఈ కార్యములెల్ల ముగియును.” ,

8. నేను అతని పలుకులు వింటినిగాని వాని భావమునర్థము చేసికోజాలనైతిని. కనుక "అయ్యా! ఈకార్యములెట్లు ముగియును?” అని అతడినడిగితిని.

9. అతడు నాతో “దానియేలూ! నీవిక వెడలి పొమ్ము. అంతము వచ్చువరకు ఈ పలుకులను రహస్యముగను, గోప్యముగను ఉంచవలెను.

10. చాల మంది ప్రజలు శుద్ధిని పొందుదురు. దుష్టులు ఈ సంగతులను అర్థము చేసికొనక దుష్కార్యములు చేయుచునే యుందురు. జ్ఞానులు మాత్రము ఈ విషయములను అర్థము చేసికొందురు.

11-12. ప్రతిదినము అర్పించుబలిని ఆపివేసిన నాటినుండి, అనగా దేవాలయమున హేయమైన విగ్రహమును నెలకొల్పిన నాటినుండి వెయ్యిన్ని రెండు వందల తొంబది దినములు గడచును. వెయ్యిన్ని మూడు వందల ముప్పది ఐదు దినములు గడచు వరకును విశ్వాసపాత్రులుగా ఉండువారు ధన్యులు.

13. దానియేలూ! నీవు చివరివరకు విశ్వాస పాత్రుడవుగానుండుము. అటుపిమ్మట నీవు మరణింతువు. తదనంతరము మరల లేపబడి నీ వంతులో నిలువబడి లోకాంతమున బహుమతిని పొందుదువు" అని చెప్పెను.

1. బబులోనియాలో యోవాకీము అను నరుడుండెడివాడు.

2. అతడు హిల్కియా కుమార్తెయైన సూసన్నను వివాహమాడెను. ఆమె మిగుల అందగత్తె. దైవభక్తికలది.

3. ఆమె తల్లిదండ్రులు భక్తిపరులు కనుక తమ కుమార్తెకు మోషే ధర్మశాస్త్రనియమముల ప్రకారము జీవింపవలెనని నేర్పిరి.

4. యోవాకీము చాల సంపన్నుడు. అతనికి తన ఇంటి ప్రక్కన చక్కని తోట కలదు. యూదులు పలుమారులు ఆ తోటలో ప్రోగయ్యెడివారు. వారు యోవాకీమును మిగుల గౌరవముతో చూచెడివారు.

5-6. వ్యాజ్యములు కలవారు యోవాకీము ఇంటికి వచ్చెడివారు. అచట ఇద్దరు న్యాయమూర్తులు తీర్పుచెప్పెడివారు. ఆ సంవత్సరము యూదులనుండి ఇద్దరు పెద్దలను న్యాయమూర్తులుగా ఎన్నుకొనిరి. వారినిగూర్చి ప్రభువు “బబులోనియాలో దుష్టత్వ మున్నది. న్యాయాధిపతులు న్యాయము చెప్పి ప్రజలను నడిపింపజాలకున్నారు” అని ముందే పలికియుండెను.

7. ప్రతిదినము మధ్యాహ్నము ప్రజలు భోజనమునకు పోయిన తరువాత సూసన్న తన భర్తతోటలో పచార్లు చేసెడిది.

8. న్యాయాధిపతులు ఇద్దరును ఆమె ప్రతిదినము తోటలో సంచరించుటను గమనించు చుండిరి. వారికి ఆమె మీద కోరిక పుట్టెను.

9. వారికి ప్రార్ధనమీద ప్రీతిపోయెను. న్యాయమూర్తులుగా తమ బాధ్యతలను విస్మరించిరి.

10.వారిరువురికిని సూసన్నపై మరులు పుట్టెను. కాని ఒకరికొకరు తమ కోరికలను తెలియనీయరైరి.

11. సూసన్నను కూడవలెనను కోరికను వెలిబుచ్చుటకు వారు సిగ్గుపడిరి.

12. వారు ప్రతిదినము ఆమెను చూచుటకు ఆశతో కనిపెట్టుకొని యుండెడివారు.

13. వారు ఒక రోజు మధ్యాహ్నము 'భోజనమునకు వేళయైనది, ఇక యింటికి పోవుదుము'. అని ఒకరితో నొకరు చెప్పుకొని,

14. ఎవరిదారిన వారు వెళ్ళిపోయిరి. కాని ఇరువురును సూసన్నను చూచుటకు తిరిగివచ్చి, తలవని తలంపుగా ఒకరినొకరు కలిసి కొనిరి. మొదట ఇద్దరును తామచటికి వచ్చుటకు ఏదో ఒక దొంగ కారణమును చెప్పిరి. అటుపిమ్మట ఇద్దరును తమకు సూసన్నమీద కోరిక కలదని ఒప్పుకొనిరి. వారు సూసన్న ఒంటరిగా దొరకు వరకు వేచియుందుమని నిశ్చయించుకొనిరి.

15-17. కావున తగిన సమయము కొరకు కాచుకొనియుండిరి.

18. ఒకదినమున సూసన్న అలవాటు ప్రకారము ఇద్దరు చెలికత్తెలతో తోటలోనికి పోయెను. అపుడచట ఆ ఇద్దరు న్యాయాధిపతులుతప్ప మరిఎవరును లేరు. వారు దాగుకొనియుండి సూసన్నను పొంచిచూచుచుండిరి. ఆ దినము చాలవేడిగా ఉన్నందున ఆమె స్నానము చేయగోరెను. కనుక తన పనికత్తెలతో “మీరు నాకు కొంచెము చమురును, పరిమళతైలమును తెచ్చి పెట్టుడు. నేను స్నానము చేయుచుండగా తోట తలుపులు మూసిఉంచుడు” అని చెప్పెను. వారు తోట తలుపులను మూసివేసి సూసన్న కోరిన సామగ్రిని తెచ్చుటకై ప్రక్కదారిగుండ వెలుపలికి వెళ్ళిరి. ఆ ఇద్దరు పెద్దలు తోటలో దాగియున్నారని వారికి తెలియదు.

19. ఆ పనికత్తెలు వెళ్ళగానే న్యాయాధిపతులు తాము దాగియున్న తావునుండి వెలుపలికి వచ్చి సూసన్నయొద్దకు పరుగెత్తిరి.

20. ఆమెతో, “ద్వారములు మూసిఉన్నవి. మనలనెవరును గమనింపరు. మేము నీపై మరులుకొని కామాగ్నితో మాడిపోవు చున్నాము. కావున నీవు మా కోర్కె తీర్చుము.

21. నీవిందులకు అంగీకరింపవేని మేము న్యాయస్థానమున నీపై నేరము తెచ్చెదము. ఎవడో యువకుడు నీతోనుండెననియు, కావుననే నీవు పనికత్తెలను పంపి వేసితివనియు కూటసాక్ష్యము పలుకుదుము” అనిరి.

22. సూసన్న నిట్టూర్పు విడచుచు "నేను ఇరకాటమున చిక్కితిని. నేను మీకు లొంగెదనేని, వ్యభిచార దోషమునకుగాను నాకు మరణదండనము విధింతురు. మీకు లొంగనేని, మీ చేతికి చిక్కుదును.

23. కాని ప్రభువునకు ద్రోహముగా పాపము చేయుటకంటె నిర్దోషిగా మీ చేతికి చిక్కుటయే మేలు” అని అనెను.

24. కనుక ఆమె గొంతెత్తి పెద్దగా కేకలు వేసెను. ఇద్దరు న్యాయాధిపతులు కూడ ఆమెపై నేరము మోపుచు బిగ్గరగా కేకలు పెట్టిరి.

25. వారిలో ఒకడు పరుగెత్తు కొనిపోయి తోట తలుపులు తెరచెను.

26. ఇంటిలోని సేవకులు ఆ కేకలువిని సూసన్నకేమైన ప్రమాదము కలిగినదేమోయని తలంచి ప్రక్కదారిగుండ తోట లోనికి పరుగెత్తిరి.

27. న్యాయాధిపతులు తమ కథనమును వినిపింపగా నౌకరులు నిశ్చేష్టులై సిగ్గుపడిరి. వారామెనుగూర్చి అట్టి సుద్దులెన్నడును విని ఎరుగరు.

28. ఆ మరునాడు ప్రజలు యోవాకీము ఇంటి వద్ద గుమిగూడిరి. ఇద్దరు న్యాయాధిపతులు సూసన్నను చంపింపవలెనను చెడు పన్నాగముతో అచటికి వచ్చిరి.

29. ప్రజలందరును, వినుచుండగా వారు “యోవాకీము భార్యయు, హిల్కియా కుమార్తెయునైన సూసన్నను పిలిపింపుడు” అని పలికిరి.

30. జనులు సూసన్నను పిలిపింపగా ఆమె తన తల్లితండ్రులతోను బిడ్డలతోను, బంధువులతోను వచ్చెను.

31. సూసన్న మిగుల అందగత్తె, సుకుమారి.

32. ఆమె ముసుగు వేసికొనియుండెను. ఆ దుర్నార్గులిదరు ఆమె సౌందర్యమును తనివిదీర చూచుటకు ఆ ముసుగును తొలగింప ఆజ్ఞాపించిరి.

33. ఆమె బంధువులును, ఆమెను చూచిన వారందరును కంటతడి పెట్టుకొనిరి.

34. అంతట ఆ ఇరువురు న్యాయాధిపతులును ప్రజలముందట నిలిచి సూసన్న తలపై తమ హస్త ములనుంచిరి.

35. ఆమె కన్నీరు కార్చుచు దేవుని నమ్మి ఆకాశమువైపు పారజూచెను.

36. ఆ ఇరువురు ఆమెను గూర్చి ఇట్లు కూటసాక్ష్యము పలికిరి. “మేము తోటలో పచార్లు చేయుచుండగా ఈమె తన ఇద్దరు చెలికత్తెలతో అచటికి వచ్చెను. ఈమె తోట తలుపులను మూపించి ఆ పనికత్తెలను బయటికి పంపెను.

37. అంతట తోటలో దాగియున్న యువకుడొకడు ఈమె చెంతకురాగా వారు ఇరువురును కలిసి శయనించిరి.

38. మేమప్పుడు తోటలో ఒక మూలనుంటిమి. ఆ ఘోర కార్యమును చూచి మేము వారిచెంతకు పరుగెత్తితిమి.

39. మేము వారిద్దరు కలిసియుండుటను చూచినను, ఆ యువకుని పట్టుకోజాలమైతిమి. అతడు మాకంటె బలవంతుడు కనుక తోట తలుపులు తెరచుకొని ఉడాయించెను.

40. మేమీ స్త్రీని పట్టుకొని ఆ యువకుడెవడో చెప్పుమని అడిగితిమి. కాని ఈమె చెప్పలేదు. ఇది మా సాక్ష్యము.”

41. ఆ ఇరువురు పెద్దలు మాత్రమే కాక న్యాయాధిపతులైయుండిరి. కనుక ప్రజలు వారి పలుకులు నమ్మి సూసన్నకు మరణదండన విధించిరి.

42. అంతట సూసన్న గొంతెత్తి బిగ్గరగా ఏడ్చుచు “నిత్యుడవైన దేవా! నీకు రహస్యములెల్ల తెలియును. నీవు ప్రతికార్యమును అది జరుగకముందే తెలిసికొందువు.

43. నాకిపుడు మరణశిక్ష పడినది. కాని నేను నిర్దోషిననియు, ఈ నరులు దుష్టబుద్ధితో కల్లలాడి నామీద నేరముమోపిరనియు నీకు తెలియును. మరి నేను చనిపోవలసినదేనా?"అని పలికెను.

44. ప్రభువు ఆమె మొరాలించెను.

45. జనులామెను వధించుటకు కొనిపోవుచుండగా దేవుడు దానియేలు అను యువకుని ప్రేరేపించి అతనిచే మాట్లాడించెను.

46. అతడు “ఈమె మరణము నాకు సమ్మతముగాదు” అని బిగ్గరగా అరచెను.

47. అపుడు జనులెల్లరు అతనివైపు తిరిగి, 'మీమాటల భావము ఏమిటి?' అని అడిగిరి.

48. దానియేలు ప్రజలయెదుట నిలుచుండి “యిస్రాయేలీయులారా! మీరెంత మూర్ఖులు! సరిగా విచారణ జరుపకయే యిస్రాయేలు మహిళకు మరణ దండన విధింతురా? మీరు సత్యమును తెలిసికొను ప్రయత్నము గూడ చేయరైతిరి.

49. కనుక ఈ నేరమును తిరిగి పరిశీలింపుడు, ఈ జనులు పలికిన సాక్ష్యము అబద్దము” అని అనెను.

50. కనుక జనులందరు గబగబ మొదట విచారణ జరిగినచోటికి తిరిగివచ్చిరి. అధికారులు దానియేలుతో “దేవుడు నీకు పెద్దల వివేచనము నొసగెను. నీవు మా సరసన కూర్చుండి నీ భావమును మాకు వివరించి చెప్పుము” అని అనిరి. .

51. దానియేలు “మీరు ఆ ఇరువురు న్యాయాధిపతులను వేరుచేయుడు. నేను వారిలో ఒకొక్కరిని ప్రత్యేకముగా ప్రశ్నింతును” అని చెప్పెను.

52. వారిని వేరుపరచిన తరువాత దానియేలు మొదటి న్యాయాధిపతిని పిలిచి “ఓయి! నీకు చెడ్డతనముననే ఏళ్ళు చెల్లినవి. నీవు పూర్వముచేసిన పాపములన్నియు ఇప్పుడు నీ నెత్తిమీదికి వచ్చినవి.

53. నీవు అన్యాయపు తీర్పులు చెప్పుచుంటివి. నిర్దోషికి మరణదండనము విధింపరాదని ప్రభువా జ్ఞాపించినను, నీవు నిరపరాధులను శిక్షించి, అపరాధులను వదలిపెట్టితివి.

54. నీవీ స్త్రీని స్పష్టముగా చూచితినని చెప్పుచున్నావు గదా! అట్లయిన ఆ ఇరువురిని ఏ చెట్టు క్రింద చూచితివో చెప్పుము” అని అడిగెను. అతడు “మస్తకి వృక్షము క్రింద” అని చెప్పెను.

55. దానియేలు “సరే, నీ అబద్దమే నీ ప్రాణములు తీయును. దేవుడు నిన్ను రెండు ముక్కలుగా నరికివేయుమని తన దూతకు ఆజ్ఞ ఇచ్చెను” అని పలికెను.

56. అంతట మొదటి న్యాయాధిపతిని వెలుపలికి కొనిపోయి రెండవ న్యాయాధిపతిని దానియేలు ఎదుటికి కొనివచ్చిరి. దానియేలు అతనిని చూచి "నీవు యూదజాతికి కాక కనానీయులజాతికి చెందినవాడవు. ఈమె సౌందర్యము నిన్ను చెరచెను. కామము నిన్ను పెడత్రోవ పట్టించెను.

57. నీవు యిస్రాయేలు వనితలను చెరచుచుంటివి. వారు భయపడి నీకు లొంగిపోయిరి. కాని ఈ యూదావనిత నీ దౌష్ట్యమునకు లొంగదయ్యెను.

58. నీవు వీరిని ఏ చెట్టు క్రింద చూచితివో చెప్పుము" అని పలికెను. అతడు 'సింధూరము క్రింద' అని జవాబు చెప్పెను.

59. దానియేలు “సరే, ఇట్టి బొంకుపలికి నీ కుత్తికమీదికి తెచ్చుకొంటివి. దేవదూత తన కత్తితో నిన్ను రెండుముక్కలుగా తరుగుటకు సిద్ధముగానున్నాడు. అప్పుడు మీ ఇద్దరి పీడ వదలును” అని అనెను.

60. అంతట జనులందరు కోలాహలము చేసి తన్ను నమ్మినవారిని రక్షించు దేవుని కొనియాడిరి.

61. దానియేలు ఆ ఇద్దరు న్యాయాధిపతులు కూట సాక్ష్యము పలికిరని రుజువు చేసెను కనుక ప్రజలు వారిమీద విరుచుకుపడిరి.

62. కూట సాక్ష్యము పలికినవారు నిందితునికెట్టి శిక్షపడునో అట్టి శిక్షనే అనుభవింపవలెనని మోషే ధర్మశాస్త్రము శాసించు చున్నది. కనుక వారు ఆ ఇద్దరికిని మరణదండన విధించిరి. ఆ రీతిగా ఆనాడు నిరపరాధియైన వనిత ప్రాణములు దక్కెను.

63. సూసన్న నిర్దేషియని రుజువయ్యెను. కనుక ఆమె తల్లిదండ్రులు, భర్త దేవుని స్తుతించిరి.

64. నాటినుండి దానియేలు కీర్తి పెరిగి పోయెను.

1. అస్తువాగేసురాజు మరణానంతరము పారశీకుడైన కోరెషు అతని రాజ్యమునేలెను.

2. దానియేలు అతడి ఆప్తమిత్రులలోనొకడు. రాజు తన సలహాదారులందరిలోను దానియేలును ఉత్తమునిగా గణించెను.

3. బబులోనీయులకు బేలు అను విగ్రహము కలదు. ప్రతిదినము ప్రజలు ఆ ప్రతిమకు పండ్రెండు కుంచముల మేలిమిపిండిని నలువది గొఱ్ఱెలను, ఏబది కూజాల ద్రాక్షారసమును అర్పింపవలెను.

4. కోరెషు బేలుని దేవునిగా గణించి ప్రతిదినము అతడిని ఆరాధించుటకు వెళ్ళేడివాడు. కాని దానియేలు తన దేవుని మాత్రమే పూజించుచుండెను.

5. ఒకనాడు రాజు “నీవు బేలునెందుకు పూజింపవు?" అని దానియేలునడిగెను. అతడు “నేను నరమాత్రులు చేసిన బొమ్మలను కొలువను. భూమ్యా కాశములను సృజించినవాడును, నరులందరికి అధి పతియును, సజీవుడైన దేవుని మాత్రమే ఆరాధింతును” అని బదులు చెప్పెను.

6. అందుకు రాజు "బేలు సజీవుడైన దేవుడని నీవు నమ్మవా? అతడు ప్రతిదినమును ఏపాటి అన్న పానీయములు పుచ్చుకొనునో నీకు తెలియదా?” అని ప్రశ్నించెను.

7. దానియేలు ఫక్కున నవ్వి “ప్రభువుల వారు మోసపోకుందురుగాక! మీరు సేవించు ఈ బేలు బండారము లోపలమన్ను బయటకంచు మాత్రమే. అతడేనాడును అన్నపానీయములను ముట్టుకొని యెరుగడు” అని పలికెను.

8-10. ఆ మాటలకు రాజు కోపము తెచ్చుకొని : బేలు పూజారులను పిలిపించి వారితో “వినుడు! ఈ అర్పణములన్నిటిని బేలుదేవత ఆరగించుచున్నాడని రుజువు చేయలేని మీరెల్లరును చత్తురు. వీనిని బేలు దేవతయే భుజించుచున్నాడని నిరూపింతురేని, అతడు దేవుడుకాడని పలికినందుకు నేను దానియేలును : చంపింతును”అని చెప్పెను. దానియేలు ఆ షరతుకు అంగీకరించెను. బేలు పూజారులు, వారి ఆలుబిడ్డలు కాకయే డెబ్బదిమంది ఉండిరి.

11. రాజు దానియేలుతో బేలుగుడిలో ప్రవేశించెను. అచట పూజారులు రాజుతో “ఏలికా! మేమందరము బయటికి పోయెదము. మీరే భోజనమును బల్లపై పెట్టుడు. ద్రాక్షారసమును కలుపుడు. మీరు బయటికి వెళ్ళిన పిదప గుడి తలుపులు బిగించి వానికి రాజముద్ర వేయింపుడు.

12. ఉదయము మీరు తిరిగివచ్చిన పిమ్మట బేలు ఆ పదార్థము లన్నింటిని భక్షించియుండడేని మీరు మా తలలు తీయింపుడు, కాని అతడు వానిని భక్షించియుండెనేని, మామీద నేరములు మోపినందులకు దానియేలు తల కొట్టింపుడు” అని అనిరి.

13. ఈ మాటలు చెప్పుటకు పూజారులు ఏ మాత్రమును భయపడలేదు. ఎందుకన, వారు దేవళములోని బల్లక్రింద రహస్య ద్వారమును తయారు చేసి కొని ప్రతిరాత్రి దేవాలయములోనికి పోయి నైవేద్య ములను ఆరగించుచుండిరి.

14. పూజారులు వెళ్ళిపోయిన తరువాత రాజు బేలు దేవతకు భోజనమర్పించెను. అంతట దానియేలు బూడిదను తెచ్చి దేవళములోపల చల్లుడని తన సేవకులను ఆజ్ఞాపించెను. సేవకులు బూడిద చల్లుటను రాజుతప్ప మరియెవరును చూడలేదు. అటుపిమ్మట అందరు వెలుపలికి పోయి దేవాలయ ద్వారమును మూసి రాజముద్రవేసి వెళ్ళిపోయిరి. -

15. ఆ రేయి పూజారులు అలవాటు ప్రకారము తమ ఆలుబిడ్డలతో రహస్యద్వారముగుండ దేవాల యములోనికి వచ్చి దేవతకర్పింపబడిన భోజనము నారగించి పానీయమును త్రాగిరి.

16. మరుసటిరోజు వేకువనే రాజు, దానియేలును మందిరమునకు పోయిరి.

17. రాజు “రాజముద్రలు భద్రముగానున్నవా?” యని దానియేలు నడిగెను. 'ఉన్నవి' అని అతడు జవాబు చెప్పెను.

18. గుడి తలుపులు తెరువగనే రాజు ఖాళీ బల్లలను చూచి “బేలు దైవమా! నీవు నిక్కముగా గొప్ప వాడవు. నీ యందు మోసమేమియు లేదు” అని బిగ్గరగా అరచెను.

19. కాని దానియేలు నవ్వి “ప్రభువుల వారు దేవళములోనికి పోవుటకు ముందు ఈ నేలవైపు పార జూచి ఇచటి పాదముద్ర లెవరివో గుర్తింపుడు” అనెను.

20. రాజు “ఇచట పురుషుల, స్త్రీల, పిల్లల పాదముద్రలు కనిపించుచున్నవి” అని చెప్పెను.

21. అంతట అతడు మిగుల ఆగ్రహము చెంది పూజారులను, వారి కుటుంబసభ్యులను బంధించి నా యెదు టికి కొనిరండని ఆజ్ఞాపించెను. వారు తాము ప్రతి రాత్రి బల్లమీద పెట్టిన భోజనమును తినుటకు దేవళములోనికి ప్రవేశించు రహస్యద్వారమును రాజునకు చూపించిరి.

22. రాజు ఆ పూజారులను చంపించి బేలుదేవత విగ్రహమును దానియేలు వశము చేసెను. అతడు ఆ ప్రతిమను, దేవళమును గూడ నాశనము చేయించెను.

23. బబులోనియా దేశములో పెద్ద సర్పమొకటి యుండెను. ఆ దేశ ప్రజలు దానిని ఆరాధించెడివారు.

24. రాజు దానియేలుతో “నీవు ఈ సర్పము సజీవమైన దైవముకాదని అనజాలవుకదా! కావున దీనిని పూజింపుము” అని అనెను.

25. దానియేలు “నేను ప్రభువును ఆరా ధించెదను. ఆయన మాత్రమే సజీవుడైన దేవుడు.

26. ఏలినవారు అనుమతినిత్తురేని నేను ఖడ్గమును గాని, దండమునుగాని వినియోగింపకయే ఈ సర్పమును చంపుదును” అని పలికెను. రాజు “నేను నీకు అనుమతిని ఇచ్చితిని” అని అనెను.

27. దానియేలు కీలును క్రొవ్వును వెంట్రుకలను కలిపి ఉడుకబెట్టెను. ఆ పదార్థమును ఉండలుచేసి పాముచే తినిపించెను. ఆ ఉండలను తినగా ఘటసర్పము పొట్టపగిలెను. అంతట దానియేలు రాజుతో “మీరు పూజించు దైవములిట్టివారే” అనెను.

28. బబులోనీయలు ఈ సంగతి తెలిసికొని ఆగ్రహముతో రాజు పై తిరుగబడిరి “ఈ రాజు యూదుడయ్యెను. ఇతడు మొదట బేలుదేవతను నాశనముచేసి పూజారులను చంపించెను. ఇప్పుడు మన ఘటసర్పమునుగూడ చంపించెను” అని అరచిరి.

29. వారు రాజును సమీపించి “నీవు దానియేలును మాకు అప్పగింపుము. లేదేని మేము నిన్నును, నీ కుటుంబ మును హతము చేయుదుము” అని బెదరించిరి.

30. వారు రాజును ఒత్తిడి చేయగా అతడు తప్పించు కోజాలక దానియేలును వారికప్పగించెను.

31. ఆ ప్రజలు దానియేలును సింహముల గుంటలో పడద్రోయగా అతడు ఆరురోజులపాటు అందే ఉండెను.

32. ఆ గుంటలో ఏడు సింహము లుండెను. వానికి ప్రతిరోజు ఇద్దరు నరులను, రెండు గొఱ్ఱెలను ఆహారముగా వేసెడివారు. కాని ఈ ఆరు దినములు వానికి ఎట్టితిండియు పెట్టరైరి. అవి దానియేలును తప్పక మ్రింగివేయవలెనని అట్లు చేసిరి.

33. ఆ కాలమున హబక్కూకు ప్రవక్త యూద యాలో నుండెను. అతడు పులుసు వండి రొట్టెను ముక్కలుగాత్రుంచి దానిలో పడవేసెను. ఆ పులుసును పాత్రములో పోసికొని పొలమున పంటకోయు పని వారికి వడ్డించుటకు తీసికొని పోవుచుండెను.

34. అపుడు దేవదూత అతడితో “ఓయి! నీవీ పులుసును తీసికొనిపోయి బబులోనియా దేశమున సింహముల గుంటలోనున్న దానియేలున కిమ్ము” అని చెప్పెను.

35. హబక్కూకు “అయ్యా! నేనెప్పుడును బబులోనియాను చూడలేదు. ఆ సింహముల గుంట జాడయే నాకు తెలియదు” అని పలికెను. )

36. దేవదూత ప్రవక్త తలవెంట్రుకలు పట్టుకొని అతనిని వాయువేగముతో బబులోనియాకు కొని పోయి సింహముల గుంటప్రక్కన దింపెను.

37. హబక్కూకు “దానియేలూ! దానియేలూ! నీవు దేవుడు పంపిన ఈ భోజనమును ఆరగింపుము” అనెను.

38. ఆ మాటలు విని దానియేలు “దేవా! నీవు నన్ను స్మరించుకొంటివి. నిన్ను ప్రేమించువారిని నీవేనాడును చేయి విడువవుగదా!” అని ప్రార్థించెను.

39. అంతటతడు లేచి ఆ పులుసును ఆరగించెను. వెంటనే దేవదూత హబక్కూకును స్వీయదేశమునకు చేర్చెను.

40. దానియేలును సింహములకు మేతగా వేసిన తరువాత ఏడుదినముల పిమ్మట రాజు అతనికొరకు శోకించుటకుగాను సింగములగుంట యొద్దకు వెళ్ళెను. అతడు ఆ గుంటలోనికి తొంగిచూడగా దానియేలు దానిలో కూర్చుండియుండెను.

41. ఆ రాజు “దానియేలు దేవుడవైన ప్రభూ! నీవెంత గొప్పవాడవు! నీవుతప్ప మరియొకదేవుడు లేడు” అని అరచెను.

42. అతడు దానియేలును బయటికి లాగెను. దానియేలు పై కుట్రపన్నినవారిని ఆ గుంటలోనికి త్రోయించెను. అతడు. చూచు చుండగనే సింహములు వారిని మ్రింగివేసెను.