ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మీకా

1. యోతాము, ఆహాసు, హిజ్కియా యూదాకు రాజులుగానున్న కాలమున, మోరెషెత్ పురవాసి అయిన మీకాకు ప్రభువు ఈ సందేశమును దర్శనమున తెలియజేసెను. ప్రభువు సమరియా, యెరూషలేములను గూర్చి ఈ సంగతులనెల్ల తెలియపరచెను.

2. సమస్తజాతి ప్రజలారా! ఈ విషయమును ఆలింపుడు. భూమిపై వసించు సమస్త జనులారా! ఈ సంగతి వినుడు. ప్రభువు మీకు ప్రతికూలముగా సాక్ష్యమీయనున్నాడు. ఆయన తన పవిత్రమందిరమునుండి మీ మీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు.

3. ఇదిగో! ప్రభువు తన పవిత్రనివాసమునుండి కదలివచ్చుచున్నాడు. ఆయన క్రిందికి దిగివచ్చి పర్వతములపై నడచును.

4. ఆయన పాదముల క్రింద కొండలు నిప్పుసోకిన మైనమువలె కరిగి, పర్వతము మీదినుండి పారెడు నీళ్ళవలె క్రింది లోయలోనికి పారును.

5. యాకోబు సంతతి పాపముచేసి దేవునిపై తిరుగబడిరి. కావున ఇదంతయు జరుగును. యిస్రాయేలీయుల పాపములకు కారకులెవరు? సమరియా కాదా! యూదాలో ఉన్నత స్థలములుఎక్కడివి? యెరూషలేములోనివికావా!

6. కావున ప్రభువిట్లు చెప్పుచున్నాడు: 'నేను సమరియాను పొలములోని రాళ్ళకుప్పనుగా చేయుదును. ద్రాక్షలు నాటెడు తావునుగా చేయుదును. దాని పునాదులు బయల్పడునట్లు దాని కట్టుడురాళ్ళను పెరికివేసి లోయలో పడవేయుదును.

7. సమరియాయందలి విగ్రహములను పగులగొట్టుదురు. దాని విగ్రహములకిచ్చిన కానుకలు నిప్పుపాలగును. అది పెట్టుకొనిన చెక్కుడు ప్రతిమలు ముక్కలు ముక్కలగును. వేశ్యలకిచ్చిన కానుకలతో సమరియా వీనినెల్ల ప్రోగుజేసెను. కావున విరోధులిపుడు వీనిని కొనిపోయి వేశ్య జీతముగానే వానిని మరల ఇత్తురు.

8. మీకా ఇట్లనెను: ఈ కారణముచే నేను దిగులుతో విలపింతును. ఏమియులేకుండా, దిగంబరుడనై తిరుగుదును. నక్కవలె అరతును, నిప్పుకోడివలె మూల్గుదును.

9. సమరియా గాయములు మానవు. యూదాకును ఇట్టి దుర్గతియే పట్టును. నా ప్రజలు వసించు యెరూషలేము గుమ్మములనే వినాశనము తాకెను.

10. గాతులోని విరోధులకు , మన పరాజయమును ఎరిగింపకుడు అచట ఎంతమాత్రమును ఏడ్వవలదు బేత్లెయాఫ్రలో నేను ధూళిలోపడి పొర్లితిని.

11. షాఫీరు పౌరులారా! . మీరు దిగంబరులై సిగ్గుతో ప్రవాసమునకు పొండు. జానాను పౌరులారా! మీరు నగరమునుండి బయటికిరావలదు. , మీరు బేతేజెలు ప్రజల విలాపమును ఆలించునపుడు మీకు అచట ఆశ్రయము దొరకదని గ్రహింపుడు.

12. ప్రభువు వినాశనమును యెరూషలేము గుమ్మములోనికి కొనివచ్చెను. కనుక మారోతు ప్రజలకిక ఆశలేదు.

13. లాకీషు ప్రజలారా! మీ రథములకు పోరు గుఱ్ఱములను కట్టుడు. మీరు యిస్రాలీయులవలెనే పాపముచేసితిరి. యెరూషలేమునుగూడ పాపమునకు పురికొల్పితిరి.

14. యూదావాసులారా! మీరు మోరెషెత్-గాతుకు వీడ్కోలు చెప్పుడు. యిస్రాయేలు రాజులకు అక్సీబునుండి సాయము లభింపదు.

15. మారేషా వాసులారా! ప్రభువు మిమ్ము శత్రువుపాలుచేయగా ఆయన మీ నగరమును స్వాధీనము చేసికొనును. యిస్రాయేలు నాయకులు వెడలిపోయి అదుల్లాము గుహలో దాగుకొందురు.

16. యూదా ప్రజలారా! మీకు ప్రీతిపాత్రులైన బిడ్డలకొరకు దుఃఖించుచు తల గొరిగించుకొనుడు. మీ బిడ్డలను ప్రవాసమునకు కొనిపోవుదురు కాన మీరు రాబందువలె తలలు బోడిచేసికొనుడు. 

 1. పడకలపై మేల్కొనియుండి చెడుపన్నాగమును పన్నువారికి అనర్థము తప్పదు. ప్రొద్దు పొడువగనే, సమయము దొరకగనే వారు తాము సంకల్పించుకొనిన దుష్కార్యమును చేయుదురు.

2. వారు పొలములను కోరుకొందురేని, వానినపహరింతురు. ఆ ఇండ్లను కోరుకొందురేని, వానిని కాజేయుదురు. ఒక మనుష్యుని, వాని కుటుంబమును ఇంటివానిని, వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు.

3. కావున ప్రభువిట్లు చెప్పుచున్నాడు: నేను మీకు వినాశనమును తలపెట్టితిని. మీరు ఆ విపత్తును తప్పించుకోజాలరు. మీకు చెడుకాలము వచ్చును. అప్పుడు మీరింత పొగరు బోతుతనముతో తిరుగరు.

4. ఆకాలము వచ్చినపుడు, ప్రజలు మిమ్ము దెప్పిపొడుచుచు ఈ శోకగీతమును ఆలపింతురు: . 'మా ఆస్తి అంతయు పోయినది. ప్రభువు మా పొలమును తీసికొని మమ్ము దోచుకొనిన వారికి పంచియిచ్చెను'

5. కనుక దేవుని ప్రజలకు భూమిని మరల పంచుటకు ఓట్లు వేయగా మీ భాగమునొందునట్లు నూలువేయువాడు ఒకడును ఉండడు.

6. ప్రజలు నన్నెదిరించుచు ఇట్లందురు: నీవు ప్రవచనములు ప్రవచింపవలదని వారు ప్రకటన చేయుదురు. ప్రవచింపనియెడల అవమానము తధ్యము.

7. యిస్రాయేలీయులకు శాపము సోకినదా? ప్రభువు సహనమును కోల్పోయెనా? ఆయనిట్టి కార్యము చేయునా? ఆయన న్యాయవర్తనులతో మృదువుగా మాటలాడడా?

8. కాని ప్రభువిట్లు బదులు చెప్పును: మీరు శత్రువులవలె నా ప్రజలపై పడుచున్నారు. ఇంటి యుద్ధమునుండి తిరిగి పడుచున్నారు. ఇంటియొద్ద క్షేమముగా నుందురని తలంచుచుండగా, మీరు వారి ఒంటిమీద దుస్తులను అపహరించుచున్నారు.

9. మీరు నా ప్రజలలోని స్త్రీలను తమకు ప్రీతికరములైన ఇండ్లనుండి నెట్టివేయుచున్నారు. వారి బిడ్డలకు నేనిచ్చిన స్వాతంత్య్రమును శాశ్వతముగా దోచుకొనుచున్నారు.

10. ఈ దేశము మీ విశ్రాంతిస్థలముకాదు మీరు లేచి వెళ్ళిపొండు, మీకిచట భద్రతలేదు. మీ పాపములవలన ఈ తావు నాశమునకు గురియైనది.

11. మీకు మధువు, సారాయము లభించునని నేను ప్రవచించుచున్నానని, కల్లలాడు ప్రవక్త ఎవడైనను వచ్చి వారితో బొంకులు చెప్పెనేని, అతడు వారికి నచ్చిన ప్రవక్తయగును.

12. ఓ యాకోబూ! నేను మీలో మిగిలియున్నవారినందరిని ప్రోగుజేయుదును. దొడ్డికిచేరిన గొఱ్ఱెలవలె మిమ్ము ప్రోగుచేయుదును. గొఱ్ఱెలతో నిండిన గడ్డిబీడులవలె మీ దేశము మరల జనులతో నిండియుండును.

13. (ప్రాకారములు) పడగొట్టువాడు గొఱ్ఱెలకు ముందుగా నడచును వారు ద్వారములు పడగొట్టి వానిద్వారా దాటిపోవుదురు వారి రాజు వారికి ముందుగా నడచును. ప్రభువైన యావే దేవుడే వారికి నాయకుడు 

1. మీకా ఇట్లు ప్రకటించెను: యిస్రాయేలు అధికారులారా! వినుడు! మీరు న్యాయము నెరిగియుండవలసినవారుకాదా?
2. కాని మీరు మంచిని నిరాకరించి, చెడును చేపట్టుచున్నారు. నా ప్రజల చర్మమును ఒలిచి " వారి ఎముకలనుండి మాంసమును ఊడబీకుచున్నారు.
3. మీరు నా జనులను దిగమ్రింగుచున్నారు. వారి చర్మమును ఒలిచి, వారి ఎముకలను విరుగగొట్టి, ముక్కలు ముక్కలుగ నరికి వంటపాత్రములో వేయుచున్నారు.
4. మీరు దేవునికి మొరపెట్టుకాలము వచ్చును. కాని ఆనాడు ఆయన మీ మనవినాలింపడు. మీరు చెడుకు పాల్పడితిరి కనుక ఆయన మొగమును చాటుచేసికొనును.
5. నా ప్రజలను అపమార్గమును పట్టించు ప్రవక్తను గూర్చి ప్రభువిట్లు నుడువుచున్నాడు: తమకు దొరికిన ఆహారమును నములుచూ సమాధానమని ప్రకటించుచున్నారు ఎవడైనను తమనోట ఆహారము పెట్టనియెడల యుద్ధము సంభవించునని చెప్పుచున్నారు.
6. ప్రవక్తలారా! మీ దినము గతించినది. మీ సూర్యుడు అస్తమించెను. మీరిక దర్శనములు కనజాలరు. భవిష్యత్తును తెలియజేయజాలరు.
7. అప్పుడు ప్రవక్తలు అవమానమునకు గురియగుదురు. భవిష్యత్తును ఎరిగించువారు తెల్లబోవుదురు. ప్రభువు వారికి జవాబీయడు కాన వారు భంగపడుదురు.
8. కాని ప్రభువు నన్ను తన ఆత్మతోను, బలముతోను నింపెను. నేను యిస్రాయేలీయులకు వారి పాపములు ఎరిగించుటకుగాను ఆయన నాకు న్యాయదృష్టిని, ధైర్యమును ఒసగెను.
9. న్యాయమును ఏవగించుకొని, మంచిని చెడుగా మార్చెడు యిస్రాయేలు అధికారులారా! నా పలుకులు ఆలింపుడు.
10. మీరు సియోనును రక్తపాతముతోను, యెరూషలేమును అన్యాయముతోను నిర్మించుచున్నారు.
11. పట్టణాధికారులు లంచము పట్టి తీర్పులు చెప్పుచున్నారు. యాజకులు సొమ్ము తీసికొని ధర్మశాస్త్ర అర్థమును ఎరిగించుచున్నారు. ప్రవక్తలు డబ్బు తీసికొని భవిష్యత్తును తెలియజేయుచున్నారు. అయినను వారెల్లరును ప్రభువుమీదనే ఆధారపడుచున్నారు. ప్రభువు మనతోనున్నాడు కనుక మనకెట్టి కీడును కలుగదని వాకొనుచున్నారు.
12. కావున మీ దోషములబట్టి సియోనును పొలమువలె దున్నుదురు. యెరూషలేము పాడువడి రాళ్ళగుట్టయగును. దేవళమున్న పర్వతము అరణ్యమగును. 

1. కడవరి దినములలో ప్రభువు మందిరమున్న పర్వతము,  శైలములన్నిటిలోను ఉన్నతమైనదగును. కొండలన్నిటిలోను ఎత్తయినదగును. సకలజాతి జనులును దానిచెంతకు వత్తురు.

2. ఆ ప్రజలు ఇట్లందురు: మనము ప్రభువు పర్వతమునకు వెళ్ళుదము యాకోబు దేవుని దేవళమునకు పోవుదము ఆయన తన మార్గములను మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడచుదము. ధర్మశాస్త్రము సియోను నుండి వచ్చును. యెరూషలేము నుండి బయల్వెడలును.

3. ఆయన జాతుల తగవులు పరిషరించును. దూరమున నున్న మహాజాతులకు తీర్పుచెప్పును. వారు తమ కత్తులను నాగటికఱ్ఱులుగా, తమ ఈటెలను సేద్యకొడవళ్ళుగా మార్చుకొందురు. ఒకజాతి మరియొక జాతిమీద కత్తిదూయదు. ప్రజలు యుద్ధమునకు శిక్షణ పొందరు.

4. ప్రతివాడు తన ద్రాక్షల నడుమను, అత్తి చెట్ల నడుమను సురక్షితముగా జీవించును. వానినెవడును భయపెట్టజాలడు. ఇది' సైన్యములకధిపతియైన ప్రభువు వాగ్దానము.

5. ప్రతిజాతియు తన దైవమునారాధించి అతనికి లొంగుచున్నది. కాని మేము కలకాలమువరకు మా ప్రభువైన దేవుని ఆరాధించి ఆయనకు లొంగియుందుము.

6. ప్రభువు ఇట్లనుచున్నాడు: ఆ దినము నేను, నా శిక్షకు గురియై, ప్రవాసమున బాధలనుభవించువారిని ప్రోగుజేయుదును. వారు కుంటివారై స్వీయదేశమునకు దూరముగానున్నను

7. ఆ కుంటివారిలో శేషముగానున్నవారితో నూతన ప్రజను ప్రారంభింతును. వారు మహాజాతి అగుదురు. అప్పటి నుండి కలకాలము వరకును సియోను కొండ మీదినుండి నేను వారిని పాలింతును.

8. యెరూషలేమూ! ప్రభువు నీ బురుజు మీది నుండి కాపరి గొఱ్ఱెలనువలె తన ప్రజలను పర్యవేక్షించును. నీవు నీ పూర్వ రాజ్యమునకు మరల రాజధానివగుదువు.

9. నీవు గొంతెత్తి అరవనేల? ప్రసవించు స్త్రీవలె వేదనచెందనేల? నీకు రాజులేడు గనుకనా? నీ సలహాదారులు గతించిరి గనుకనా?

10. యెరూషలేము ప్రజలారా! మీరు ప్రసవించు స్త్రీవలె వేదనతో కొట్టుకొనుడు. మీరిపుడు నగరమువీడి బయట వసింపవలెను. మీరు బబులోనియాకు వెళ్ళిపోవలెను. కాని శత్రువుల బారినుండి ప్రభువు అచట మిమ్ము కాపాడును.

11. పెక్కుజాతులు ఏకమై నీపై దాడి చేయగోరుచున్నవి వారు 'యెరూషలేము నాశనము కావలెను మనము దాని వినాశనమును కన్నులార చూతము' అని పలుకుచున్నారు.

12. కాని ప్రభువు మనసులోని తలపులు వారికి తెలియవు. కళ్ళమున కంకులవలె తొక్కించుటకే ప్రభువు వారినచట ప్రోగుజేయును.

13. ప్రభువు ఇట్లనుచున్నాడు: యెరూషలేము పౌరులారా! ఇనుప కొమ్ములు, కంచుగిట్టలు గల ఎద్దువలె నేను మిమ్ము బలాఢ్యులను చేయుదును లేచి కళ్ళమును తొక్కుము. మీరు చాలజాతులను అణగదొక్కుదురు. ఆ ప్రజలు దౌర్జన్యముతో కూడబెట్టిన సొత్తును సర్వలోకాలకధిపతినైన నాకు నివేదింతురు.

1. యెరూషలేము పౌరులారా! . అది మీ సైన్యములను సిద్ధము చేసికొనుడు. శత్రువులు మనలను ముట్టడింతురు. వారు యిస్రాయేలు న్యాయాధిపతిని కర్రతో చెంపపై కొట్టుచున్నారు.

2. ప్రభువు ఇట్లనుచున్నాడు: బేత్లెహేము ఎఫ్రాతా! నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు అయినను యిస్రాయేలును ఏలబోవువాడు  నీ నుండియే ఉద్భవించును పురాతనకాలము మొదలుకొని శాశ్వతకాలము వరకు ఆయన సాక్షాత్కరించువాడు.

3. ప్రసవమగు స్త్రీ శిశువును కనువరకు ప్రభువు తన ప్రజలను శత్రువుల అధీనముననుంచును. అటుపిమ్మట అతని సహోదరులలో శేషించినవారు ప్రవాసమునుండి తిరిగివచ్చి యిస్రాయేలు ప్రజలతో కలియుదురు.

4. అతడు ప్రభువు బలముతోను, ప్రభువైన దేవుని ప్రభావముతోను . తన మందను మేపును. లోకములోని నరులెల్లరును అతని ప్రాభవమును అంగీకరింతురు. కనుక వారు క్షేమముగా జీవింతురు.

5. అతడు శాంతిని కొనివచ్చును. అస్పిరియా మన దేశముపై దాడిచేసి మన కోటలను ముట్టడించెనేని మనము ఏడుగురు గొఱ్ఱెల కాపరులను, ఎనమండుగురు ప్రధానులను నియమింతుము.

6. వారు ఆయుధములతో నిమ్రోదు దేశమైన అస్సిరియాను గెలుతురు. మనపైకి ఎత్తివచ్చిన అస్సిరియానుండి మనలను కాపాడుదురు.

7. జాతులమధ్య మిగిలియున్న యిస్రాయేలీయులు ప్రభువు పంపిన చల్లని మంచువలె అలరారుదురు. మొక్కలపై కురిసిన జల్లువలె ఒప్పుదురు. వారు ప్రభువు పైనేగాని నరులపై ఆధారపడరు.

8. జాతులమధ్య మిగిలియున్న యిస్రాయేలీయులు అడవిలో వన్యమృగములను వేటాడుసింగమువలె ఉందురు. గడ్డి బీళ్ళలో గొఱ్ఱెలను చంపు కొదమసింగమువలె నుందురు. అది గొఱ్ఱెలను కాళ్ళతో తొక్కి ముక్కలు ముక్కలుగా చీల్చును. ఇక వానినెవడును రక్షింపజాలడు.

9. నీ హస్తము నీ విరోధులమీద ఎత్తబడియుండునుగాక! నీ శత్రువులందరు నశింతురుగాక!

10. ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు: ఆ కాలమున నేను మీనుండి మీ గుఱ్ఱములను, రథములను తొలగింతును.

11. మీ దేశములోని నగరములను నిర్మూలించి, మీ కోటలను కూలద్రోయుదును.

12.మీ మంత్రవిద్యను, మీ సోదెకాండ్రను నిర్మూలింతును.

13. మీ విగ్రహములను, దేవతాస్తంభములను పడగొట్టుదును. ఆ మీదట మీరు స్వయముగా చేసికొన్న ప్రతిమలను ఆరాధింపరు.

14. మీ దేశములోని అషీరాదేవత కొయ్యలను ఊడబీకుదును. మీ పట్టణములను ధ్వంసము చేయుదును.

15. నాకు లొంగని జాతులపై కోపముతో పగతీర్చుకొందును. 

1. ప్రభువు యిస్రాయేలీయులను గూర్చి చెప్పునది వినుడు. పర్వతముల సాక్షిగా నీవు లేచి నీ అభియోగము వినిపింపుము. కొండలు, తిప్పలు నీ పలుకులు ఆలించునుగాక!

2. భూమికి శాశ్వతపునాదులగు పర్వతములారా! మీరు ప్రభువు అభియోగమును వినుడు ప్రభువు తన ప్రజలపై నేరము తెచ్చెను. వారిమీద ఫిర్యాదు చేసెను.

3. ప్రభువు ఇట్లనుచున్నాడు: నా ప్రజలారా! నేను మీకేమి కీడు చేసితిని? నేను మిమ్మెట్లు విసిగించితినో చెప్పుడు

4. నెను మిమ్ము ఐగుప్తునుండి తోడ్కొనివచ్చితిని. బానిసత్వమునుండి మిమ్ము విడిపించితిని.  మిమ్ము నడిపించుటకు మోషే, అహరోను, మిర్యాములను పంపితిని.

5. నా ప్రజలారా! మోవాబు రాజైన బాలాకు మీకేమి కీడు చేయగోరెనో, షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును సంభవించినదానిని బేయేరు పుత్రుడైన బలాము అతనికి ఏమి చెప్పెనో జ్ఞప్తికి తెచ్చుకొనుడు. అప్పుడు మిమ్ము రక్షించుటకు నేనేమి చేసితినో మీరు గ్రహింతురు.

6. మహోన్నతుడైన దేవుని పూజించుటకు వచ్చినపుడు నేనేమి తీసికొని రావలెను? ఏడాది దూడలను దహనబలిగా కొనిరావలెనా?

7. వేల కొలది పొట్టేళ్లను, పదివేల నదుల ఓలివు తైలమును కొనివచ్చినచో అతడు సంతుష్టి చెందునా? నేను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తముగా నా జ్యేష్ఠకుమారుని బలిగా అర్పింపవలెనా?

8. ఓయి! మేలైనదేదో ప్రభువు నీకు తెలియజేసియే ఉన్నాడు. నీవు న్యాయమును పాటింపుము, కనికరముతో మెలగుము. నీ దేవునిపట్ల వినయముతో ప్రవర్తింపుము. ఇదియేగదా! ప్రభువు నీ నుండి కోరుకొనునది.

9. ప్రభువునకు భయపడుటయే జ్ఞానము. అతడు పట్టణముతో ఇట్లు చెప్పుచున్నాడు: నగరమున ప్రోగైన జనులారా! వినుడు!

10. దుష్టులు అన్యాయముగా సొమ్మునార్జించి తమ ఇండ్లలో భద్రపరుచుకొనిరి. వారి దొంగ కొలతలను నేను ఏవగించుకొందును.

11. తప్పుడు త్రాసులను తూకపురాళ్ళనువాడెడి వారిని నేను దోషులనుగా గణింపకుందునా?

12. మీలోని ధనవంతులు పేదలను పీడించుచున్నారు. మీరెల్లరును బొంకులాడువారు, మీ నాలుక కపటములాడును.

13. మీరు చేసిన పాపములకుగాను నేను ఇదివరకే మీకు వినాశనము తలపెట్టితిని.

14. కావున మీరు భుజింతురుగాని, మీ ఆకలి తీరదు. వస్తువులు కొనిపోవుదురుగాని, వానిని పదిలపరచుకోలేరు. మీరు కూడబెట్టుకొనునదెల్ల నేను పోరున నాశనము చేయుదును.

15. మీరు పైరు వేయుదురుగాని కోత కోయజాలరు. ఓలివు పండ్లనుండి నూనె తీయుదురుగాని, దానిని వాడుకోజాలరు. ద్రాక్షపండ్లనుండి రసము తీయుదురుగాని దానిని త్రాగజాలరు.

16. మీరు దుష్టరాజులైన ఒమ్రీ అహాబుల ఇంటివారల పోకడలు పోవుచు, వారి పద్ధతులను అనుసరించుచున్నారు. కావున నేను మిమ్ము నాశనము చేయుదును. ఎల్లరును మిమ్ముచూచి నవ్వుదురు. సమస్తజనులు మిమ్ము చిన్నచూపు చూచెదరు.

1. ఎంత నిరాశ! నేను ఆకలిగొని పండ్లు కోసికోగోరితిని కాని చెట్లమీద పండ్లులేవు. ద్రాక్షలమీద ఫలములులేవు. ద్రాక్ష ఫలములనెల్ల, రుచికరములైన అంజూరపు పండ్లనెల్ల కోసిరి.

2. దేశమున భక్తిగలవారెవరును లేరు. ఋజువర్తనులెవరును కనిపింపరు. ఎల్లరును ఇతరులను హత్య చేయుటకు కాచుకొనియున్నారు. ప్రతివాడును పొరుగువానిని వేటాడుచున్నాడు.

3. ఎల్లరును దౌష్ట్యమున ఆరితేరినవారే. అధికారులు న్యాయాధిపతులు లంచములు అడుగుచున్నారు. పలుకుబడి కలవారు తమ కోర్కెలు వారికి ఎరిగించుచున్నారు.  వారెల్లరును కూడి కుతంత్రములు పన్నుచున్నారు.

4. ఆ జనులలో ఉత్తములు, సజ్జనులైనవారు కూడ, ముండ్లకంపవలె అయోగ్యులుగానున్నారు. ప్రభువు కావలివారైన ప్రవక్తల ద్వారా ఆ ప్రజను హెచ్చరించినట్లే వారికి శిక్షపడుకాలము ఆసన్నమైనది. కనుక వారిపుడు కలవరము చెందుచున్నారు.

5. మీ పొరుగువారినిగాని, స్నేహితులనుగాని నమ్మకుడు. నీ కౌగిటిలో పండుకొనియున్న నీ భార్యయెదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుడు.

6. కుమారుడు తండ్రిని తృణీకరించుచున్నాడు. కుమార్తె తల్లిని ఎదిరించుచున్నది. కోడలు అత్తమాట వినుటలేదు. సొంత కుటుంబములోనివారే శత్రువులగుదురు.

7. అయినను నా మట్టుకు నేను ప్రభువు కొరకు వేచియుందును. నన్ను రక్షించు దేవునికొరకు కాచుకొనియుందును. నా దేవుడు నా మొరవినును.

8. నా శత్రువులు నా పతనముగాంచి ఉప్పొంగనక్కరలేదు. నేను క్రిందపడినను మరల లేతును. నేనిపుడు చీకటిలోనున్నను ప్రభువు నాకు వెలుగునొసగును.

9. నేను ప్రభువునకు ద్రోహముగా పాపము చేసితిని కాన కొంతకాలము ఆయన ఆగ్రహమునకు గురికాకతప్పదు. కాని కడన ఆయన నా కోపు తీసికొని నాకు జరిగిన అన్యాయమును చక్కదిద్దును. ఆయన నన్ను వెలుగులోనికి కొనివచ్చును. నేను ఆయన రక్షణమును గాంచితీరుదును.

10. మీ దేవుడెక్కడున్నాడని నన్ను గేలిచేసిన శత్రువులు ఈ రక్షణముచూచి సిగ్గుతో వెలవెలబోవుదురు. నేను వారి ఓటమిగాంచి సంతోషింతును. వారు వీధిలోని బురదవలె తొక్కబడుదురు.

11. యెరూషలేము పౌరులారా! మీ నగరప్రాకారములు పునర్నిర్మించుకాలము వచ్చినది. అప్పుడు మీ దేశము విశాలమగును.

12. మీ జనులు ఎల్లతావులనుండి  మీ చెంతకు తిరిగి వత్తురు. అస్సిరియా ఐగుప్తులనుండి, యూఫ్రటీసు నది తీరాలనుండి, దూర సాగరముల నుండి, పర్వతముల నుండి వారు మరలివత్తురు.

13. కాని జనుల దుష్టవర్తన వలన వారు వసించు నేల ఎడారియగును.

14. ప్రభూ! నీవు ఎన్నుకొనిన ప్రజలను నీవే కాపరివై మేపుము. వారు అరణ్యమున ఒక మూలన వసించుచున్నను, వారి చుట్టు పాలుతేనెలు జాలువారు నేలకలదు. కావున ఆ జనులు పూర్వకాలమునందువలె బాషాను, గిలాదు మైదానముల లోనికిపోయి మేయుదురుగాక!

15. నీవు మమ్ము ఐగుప్తునుండి తోడ్కొని వచ్చినప్పుడువలె ఇప్పుడును మా కొరకు అద్భుతకార్యములు చేయుము.

16. తాము ఎంతటి బలసంపన్నులైనను, అన్యజాతి జనులు ఈ చెయిదము చూచి సిగ్గు చెందుదురు. వారు అచ్చెరువొంది చేతులతో తమ నోటిని, చెవులను మూసికొందురు.

17. పాముల వలెను, ప్రాకెడు ప్రాణులవలెను నేలపైబడి మన్ను కరుతురు. గడగడ వణకుచు తమ కోటలనుండి వెడలివత్తురు. భయకంపితులై మన ప్రభువైన దేవుని యొద్దకు వత్తురు.

18. ప్రాణములతో మిగిలియున్న నీ స్వకీయ ప్రజల తప్పులను మన్నించు నీవంటి ప్రభుడెవరు? నీ ప్రజల తప్పులు మన్నింతువు. మా మీద సదా కోపింపవు. మమ్ముల కరుణించుటయే నీకు ఆనందము.

19. మాపై మరల నెనరు చూపుము. మా పాపములను నీ కాళ్ళతో తొక్కి సముద్ర గర్భమున పడవేయుము.

20. నీవు పూర్వము మా పితరులైన అబ్రహాము, యాకోబులకు వాగ్దానము చేసిన సత్యమును, దయను నీవు చూపింతువు.