ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

లేవీయకాండము

1.యావే మోషేను పిలిచి, సమావేశ గుడారము నుండి అతనితో ఇట్లు సంభాషించెను.

2. 'నీవు యిస్రాయేలీయులతో ఇట్లు చెప్పుము: మీలో ఎవడైన యావేకు బలి సమర్పింపగోరినచో, మీ మందల నుండి ఎడ్లను, పొట్టేళ్లను, మేకపోతులను అర్పింపవలెను.

3. ఎవడైన మంద నుండి ఎద్దును సంపూర్ణ దహనబలిగా అర్పింపగోరిన యెడల, అవల క్షణములు లేని దానిని కొనిరావలెను. అతడు ఎద్దును సమావేశపు గుడారము వద్దకు కొనిరావలెను. ప్రభువు దానిని అంగీకరించును.

4. అతడు జంతువు తలమీద చేతులు చాచవలెను. అప్పుడది అతని పాపములకు ప్రాయశ్చిత్తపు బలిగా గణింపబడును.

5.పిమ్మట, అతడు యావే సమక్షమున ఎద్దును వధింపవలెను. అహరోను వంశజుల న యాజకులు, దాని నెత్తుటిని దేవునికి అర్పించి, సమావేశ గుడార ప్రవేశ ద్వారము చెంతనున్న పీఠము మీద దాని రక్తమును చిలుకరింతురు.

6.పిమ్మట, అతడు ఎద్దు చర్మమును ఒలిచి, దాని మాంసమును ముక్కలుగా కోయవలెను.

7.అహరోను వంశజులైన యాజకులు పీఠము మీద అగ్నిని రగిల్చి, వంట చెరకును పేర్పుదురు.

8. వారు ఎదుమాంసపు ముక్కలను, తలను, క్రొవ్వును పీఠముపైనున్న నిప్పుమీద పెటుదురు.

9. బలిని అర్పించువాడు ఎద్దు ప్రేవులను, కాళ్లను నీటిలో కడుగ వలెను. యాజకులు దానిని సంపూర్ణముగా పీఠము మీద కాల్చి వేయుదురు. ఆ దహనబలి సువాసన వలన యావే సంతృప్తి చెందును.

10.యెవడైన పొట్టేలిని, మేకపోతును, సంపూర్ణ దహనబలిగా అర్పింపగోరినపుడు అది అవ లక్షణములు లేనిదై ఉండవలెను.

11. అతడు దానిని పీఠమునకు ఉత్తర దిక్కున చంపవలెను. యాజకులు దాని రక్తమును పీఠము చుట్టు చల్లదురు.

12.తరువాత, అతడు దానిని ముక్కలుగా కోయవలెను. యాజకుడు దాని మాంసపు ముక్కలను, తలను, క్రొవ్వును పీఠము పైనున్న అగ్నిమీద పెట్టును.

13. బలి నర్పించువాడు దాని ప్రేవులను, కాళ్లను నీటిలో కడుగవలెను. యాజకుడు ఆ జంతువును సంపూర్ణముగా పీఠము మీద కాల్చివేయును. ఈ సంపూర్ణ దహనబలి సువాసన వలన యావే సంతుష్టి చెందును.

14.కాని, యొవడైన పశువునకు బదులుగా, పక్షిని సంపూర్ణ దహనబలిగా అర్పింపగోరెనేని, గువ్వనుగాని, యువ పావురమును గాని సమర్పింపవలెను.

15. యాజకుడు దానిని పీఠము చెంతకు కొనివచ్చి మెడను నులిమి చంపవలెను. దానిని పీఠము మీద దహింపవలెను. దాని రక్తము బలిపీఠము ప్రక్కన పిండవలెను.

16.మరియు, అతడు దాని ఈకలను కడుపులోని మలమును తీసివేసి, పీఠమునకు తూర్పువైపున బూడిదను కుమ్మరించు తావున పార వేయవలెను.

17.యాజకుడు దాని రెక్కలను రెండు భాగములుగా చీల్చవలెను. కాని, వేరుచేయరాదు. ఆ పిమ్మట, దానిని పీఠముపై నున్న అగ్ని మీద కాల్చి వేయవలెను. ఈ సంపూర్ణ దహన బలి సువాసన వలన యావే సంతుష్టి చెందును.

1. ఎవడైనను ప్రభువునకు ధాన్యబలిని అర్పింపగోరిన గోధుమపిండిని గైకొని దానిమీద ఓలివునూనెను పోసి, సాంబ్రాణిని ఉంచవలయును.

2. అతడు ఆ పిండిని అహరోను కుమారులైన యాజకులవద్దకు కొనిరావలయును. యాజకుడు దానినుండి పిడికెడు పిండిని, చేరెడు ఓలివునూనెను, మొత్తము సాంబ్రాణిని తీసికొని బలిపీఠముమీద దహించును. దహింపబడిన ఈ కొద్దిభాగము అర్పణగా తెచ్చిన పూర్తి భాగమునకు జ్ఞాపకార్థమగును. అది ప్రభువునకు అర్పింపబడిన బలి అగును. ఈ దహనబలి సువాసనవలన ప్రభువు సంతుష్టి చెందును.

3. ధాన్యబలిలో మిగిలిన పిండి అహరోనునకు, అతని కుమారులకు చెందును. ప్రభువునకు అర్పింపబడిన దహనబలిలోనిది కనుక ఆ మిగిలినపిండి పరమపవిత్రమైన నైవేద్యమగును.

4. మీరు పొయ్యిమీద కాల్చి రొట్టెలను బలిగా సమర్పించునపుడు వానిలో పులియజేయు పదార్థమును చేర్పరాదు. నూనె కలిపిన పిండితో తయారైన లావుపాటి రొట్టెలుకాని, నూనె చిలుకరించిన పలుచని రొట్టెలుగాని తయారుచేయవచ్చును.

5. మీరు పెనముమీద కాల్చిన రొట్టెలను బలిగా అర్పించునపుడు ఓలివునూనె కలిపిన మొత్తము గోధుమపిండితో వానిని చేయవలయును. కాని పులియజేయు పదార్థమును చేర్పరాదు.

6. ఆ రొట్టెను ముక్కలుగా చేసి వాటి మీద నూనెపోసి బలిగా అర్పింపుడు.

7. మీరు కుండలో కాల్చిన రొట్టెలను అర్పించునపుడు ఓలివునూనె కలిపిన గోధుమపిండితో వానిని చేయవలయును.

8. ఈ రీతిగ తయారైన బలి వస్తువును కొనివచ్చి యాజకునకు ఇండు. అతడు దానిని బలిపీఠము చెంతకు తీసికొనివచ్చును.

9. యాజకుడు ఆ బలి ప్రభువునకు అర్పితమైనదని సూచించుచు దానిలో కొంతభాగమును తీసికొని బలిపీఠముమీద దహించును. ఆ దహనబలి సువాసనవలన ప్రభువు సంతృప్తి చెందును.

10. ఆ ధాన్యబలిలో మిగిలిన భాగము అహరోనునకును, అతని కుమారులకును చెందును. ప్రభువునకు అర్పింపబడిన దహనబలిలోని భాగము కనుక అది పరమపవిత్రమైన నైవేద్యమగును.

11. మీరు ప్రభువునకు అర్పించు ధాన్యబలులలో పులియజేయు పదార్థమును చేర్పరాదు. పులియజేయు పదార్థమునుగాని, తేనెనుగాని ప్రభువునకు దహన బలిగా అర్పింపరాదు.

12. అయినను ఆ ధాన్యములను ప్రభువునకు ప్రథమఫలములుగా అర్పింపవచ్చును. కాని ప్రభువునకు సంతుష్టి కలిగించు సువాసనగల బలిగా వానిని బలిపీఠముమీద దహింప రాదు.

13. మీరు సమర్పించు ధాన్యబలులు అన్నిటిలోను ఉప్పును చేర్పవలయును. మీ దేవుని నిబంధనములో విధింపబడిన ఉప్పు ప్రతి ధాన్యబలిలో ఉండవలయును. కనుక ప్రతి బలిలో తప్పనిసరిగా ఉప్పును చేర్పుడు.

14. మీరు ప్రభువునకు ధాన్యములో ప్రథమ ఫలములు అర్పించునపుడు పచ్చని వెన్నులనుండి గట్టి ధాన్యమును వేయించి, విసిరి అర్పింపుడు.

15. ఓలివు నూనెను, సాంబ్రాణిని వానిలో చేర్పుడు.

16. ఆ బలి ప్రభువునకు అర్పితమైనదని సూచించుచు యాజకుడు ధాన్యములో కొంత భాగమును, నూనెలో కొంత భాగమును, సాంబ్రాణిని తీసికొని బలిపీఠము మీద దహించును. అది ప్రభువునకు దహనబలిఅగును.

1. ఎవడైన సమాధానబలిని అర్పింపగోరినచో ఆవునిగాని, ఎద్దునుగాని సమర్పింపవచ్చును. కాని అది సలక్షణమైనది, శుచికరమైనదైయుండవలయును.

2. అతడు బలిపశువు తలమీద చేతులు పెట్టి సమావేశపు గుడారము ప్రవేశద్వారముచెంత దానిని వధింపవలయును. అహరోను వంశజులైన యాజకులు దాని నెత్తురును బలిపీఠముపైన మరియు దాని చుట్టు చిలుకరింతురు.

3-4. యాజకుడు బలిపశువు ప్రేవులమీది క్రొవ్వును, మూత్రగ్రంథులను, వానిమీది క్రొవ్వును, కాలేయము మీది క్రొవ్వును ప్రభువునకు దహనబలిగా సమర్పింపవలయును.

5. అహరోను కుమారులు సంపూర్ణదహనబలితో పాటు ఈ భాగములను కూడ బలిపీఠముమీద దహింపవలయును. ఆ దహనబలి సువాసనవలన ప్రభువు సంతుష్టి చెందును.

6. ఎవడైన మేకనుగాని, గొఱ్ఱెనుగాని సమాధాన బలిగా అర్పింపగోరినచో అవలక్షణములు లేని పోతు నైనను, పెంటినైనను సమర్పింపవచ్చును.

7-8. అతడు గొఱ్ఱెను అర్పింపగోరినచో యావే సాన్నిధ్యమున దాని తలమీద చేతులు పెట్టి సమావేశపు గుడారముఎదుట దానిని వధింపవలయును. అహరోను కుమారులు దాని నెత్తురును బలిపీఠముచుట్టు చిలు కరింతురు.

9-10. అతడు గొఱ్ఱెతోకకు అంటుకొని ఉన్న కొవ్వును, దాని ప్రేవులమీది క్రొవ్వును, మూత్ర గ్రంథులను వానిమీది క్రొవ్వును, కాలేయమునందలి క్రొవ్వును ప్రభువునకు దహనబలిగా అర్పింపవల యును.

11. యాజకుడు ఈ భాగములన్నిటిని బలిపీఠముమీద కాల్చి ప్రభువునకు ఆహారరూపమైన దహనబలిగా అర్పింపవలయును.

12-13. అతడు మేకను అర్పింపగోరినచో దాని తలమీద చేతులు పెట్టి యావే సాన్నిధ్యమున సమావేశపు గుడారముఎదుట దానిని వధింపవలయును. అహరోను కుమారులు దాని నెత్తురును బలిపీఠముచుట్టు చల్లుదురు.

14-15. అతడు మేక ప్రేవులమీది క్రొవ్వును, మూత్రగ్రంథులను వానిమీది క్రొవ్వును, కాలేయము నందలి క్రొవ్వును ప్రభువునకు దహనబలిగా అర్పింపవలయును.

16. యాజకుడు ఈ భాగములన్నిటిని బలిపీఠముమీద కాల్చి ప్రభువునకు ఆహారరూపమైన దహనబలిగా అర్పింపవలయును. క్రొవ్వంతయు దేవునికే చెందును. ఇది ప్రభువును సంతుష్ఠపరుచును.

17. యిస్రాయేలీయులు ఎక్కడ వసించినను వారికి ఈ నియమము శాశ్వతముగా వర్తించును.“ వారు కొవ్వునుగాని, రక్తమునుగాని భుజింపరాదు.”

1-2. ప్రభువు మోషేతో ఇట్లు చెప్పెను: “నీవు యిస్రాయేలీయులతో ఇట్లు చెప్పుము. వారిలో ఎవడైన పొరపాటున ప్రభువు ఆజ్ఞను మీరి పాపము కట్టుకొనినయెడల ఈ క్రింది రీతిగా ప్రాయశ్చిత్తము చేసికోవలయును.

3. అభిషిక్తుడైన యాజకుడు పాపముచేసి ప్రజల మీదికి గూడ పాపము రప్పించినయెడల అతడు అవలక్షణము లేని కోడెదూడను ప్రభువునకు పరిహార బలిగా సమర్పింపవలయును.

4. అతడు కోడెను సమావేశగుడారపు ప్రవేశద్వారము వద్దకు కొనివచ్చి అచట దానిమీద చేతులుచాచి ప్రభువు ఎదుట దానిని వధించును.

5. అటుపిమ్మట అతడు దాని నెత్తురులో కొంత సమావేశపు గుడారములోనికి కొనిపోవును.

6. తన వ్రేలిని నెత్తురులో ముంచి గుడారములోని అడు తెర ముందట ప్రభువుముందు ఏడుసార్లు దానిలో కొంచెము చిలుకరించును.

7. ఆ పిమ్మట అతడు కొంత నెత్తురును గుడారములోని ధూపపీఠపు కొమ్ము లకు పూయవలయును. మిగిలిన నెత్తురును గుడారపు ప్రవేశద్వారము వద్దగల దహనబలుల పీఠము క్రింద పోయవలయును.

8-9. అతడు కోడె క్రొవ్వునంతటిని, దాని ప్రేవులమీది క్రొవ్వును, మూత్రగ్రంధులను వానిమీది క్రొవ్వును, కాలేయమునందలి క్రొవ్వును తొలగింప వలయును.

10. సమాధానబలులలోవలె ఈ పాపపరిహార బలులలో కూడ యాజకుడు క్రొవ్వును తొలగించి దహనబలులు అర్పించు బలిపీఠముమీద దానిని కాల్చి వేయవలయును.

11-12. కోడెచర్మము, మాంసము, తల, కాళ్ళు, ప్రేవులు, పేడ వీనినన్నిటిని శిబిరము వెలుపలకు కొనిపోయి అచట బూడిదను ఉంచు శుద్ధస్థలమున కట్టెలమీద కాల్చివేయవలయును.

13. యిస్రాయేలు సమాజమంతయు పొరపాటున ప్రభువుఆజ్ఞ మీరి పాపము కట్టుకొనినయెడల,

14. ఆ పాపమును గుర్తింపగానే అవలక్షణములులేని కోడెదూడను కొనివచ్చి పాపపరిహారబలి సమర్పింప వలయును. ఆ కోడెను సమావేశపుగుడారము ద్వారము యొద్దకు కొనిరావలయును.

15. ప్రభువు సమక్షమున సమాజనాయకులు దాని తలమీద చేతులు చాచి దానిని వధింపవలయును.

16. ఆ మీదట అభిషిక్తుడైన యాజకుడు దాని నెత్తురులో కొంచెము సమావేశపుగుడారములోనికి కొనిపోవును.

17. తన వ్రేలిని నెత్తురులో ముంచి ప్రభువు సమక్షమున గుడారములోని అడ్డుతెర ముందట ఏడుసార్లు చిలుకరింపవలయును.

18. ఆ పిమ్మట అతడు కొంత నెత్తురును గుడారములోని ధూపపీఠము యొక్క కొమ్ములకు పూయవలయును. మిగిలినదానిని సమావేశపు గుడారము ప్రవేశద్వారము వద్ద గల దహనబలుల పీఠము క్రింద పోయవలయును.

19. తరువాత అతడు కోడె క్రొవ్వునంతటిని తొలగించి బలిపీఠము మీద కాల్చివేయును.

20. ఈ కోడెను కూడ పాపపరిహారబలియైన కోడెను చేసినట్లు అతడు అట్లే చేయవలయును. ఈ రీతిగా యాజకుడు ప్రజల పాపములకు ప్రాయశ్చిత్తము చేయగా వారి పాపములు పరిహారమగును.

21. ఈ కోడెను గూడ ఆ మొదటి దానినివలె శిబిరము వెలుపలకు కొనిపోయి అచట దహింపవలయును. ఇది సమాజపు పాపములను తొలగించు పరిహారబలి అగును.

22. ప్రజానాయకులలో ఎవడైనను పొరపాటున దేవుని ఆజ్ఞను మీరి పాపము కట్టుకొనినచో,

23. అతడు తన పాపమును గుర్తింపగనే అవలక్షణములు లేని మేకపోతును కొనిరావలయును.

24. దాని తలమీద చేతులు చాచి దహనబలికి పశువులను వధించుచోటనే దానిని గూడ వధింపవలయును. ఇది పాపపరిహారబలియగును.

25. యాజకుడు దాని నెత్తురును కొద్దిగా వ్రేలితో తీసికొని దహనబలుల పీఠము కొమ్ములకు పూయవలయును. మిగిలిన నెత్తురును ఆ పీఠము అడుగున పోయవలయును.

26. మేకపోతు క్రొవ్వునంతటిని సమాధానబలులలోని క్రొవ్వునువలె బలి పిఠముపై దహింపవలయును. ఈ రీతిగా యాజకుడు ప్రజానాయకుని పాపములకు ప్రాయశ్చిత్తము చేయగా అతని పాపములు పరిహారమగును.

27. సామాన్య ప్రజలలో ఎవడైనను పొరపాటున ప్రభువు ఆజ్ఞమీరి పాపము కట్టుకొనినయెడల,

28. అతడు తన పాపమును గుర్తింపగనే అవలక్షణములు లేని ఆడుమేకను కొనిరావలయును.

29. దాని తలమీద చేతులు చాచి దహనబలికి పశువులను వధించు తావుననే దానినిగూడ వధింపవలయును.

30. యాజకుడు దాని నెత్తురును కొద్దిగా వ్రేలితో తీసికొని దహనబలిపీఠము కొమ్ములకు పూయవలయును. మిగిలిన నెత్తురును బలిపీఠము అడుగున పోయును.

31. సమాధానబలులలోని క్రొవ్వువలె ఈ మేకక్రొవ్వును గూడ తొలగించి బలిపీఠముమీద కాల్చివేయవలయును. దాని సువాసనవలన ప్రభువు సంతుష్టిచెందును. ఈ రీతిగా యాజకుడు పాపియైన నరునికి ప్రాయశ్చిత్తము చేయగా అతని పాపములు పరిహారమగును.

32. కాని వాడు గొఱ్ఱె పిల్లను అర్పింపగోరినచో అవలక్షణములు లేని ఆడుగొఱ్ఱెను కొనిరావలయును.

33. అతడు దాని తలమీద చేతులు చాచి దహనబలికి పశువులను వధించు తావుననే దానిని గూడ వధింప వలయును.

34. యాజకుడు దాని నెత్తురును కొద్దిగా వ్రేలితో తీసికొని దహనబలుల బలిపీఠము కొమ్ములకు పూయును. మిగిలిన రక్తమును బలిపీఠము అడుగున పోయవలయును.

35. సమాధానబలులలోని క్రొవ్వు వలె ఈ గొఱ్ఱెక్రొవ్వును గూడ తొలగింపవలయును. యాజకుడు ఇతర దహనబలులతో పాటు ఈ క్రొవ్వును గూడ పీఠము మీద కాల్చివేయును. ఈ రీతిగా యాజకుడు సామాన్యుని పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగా వాని పాపము పరిహారమగును.

1. ఎవరినైనను న్యాయస్థానమున సాక్ష్యము చెప్పుమని పిలిచినప్పుడు, అతడు దోషము ఎరిగి యుండియు సాక్ష్యము చెప్పనియెడల పాపముకట్టు కొనును.

2. ఎవడైనను పొరపాటున అశుచికరమైన వస్తువును, అపవిత్ర మృగకళేబరమును, అపవిత్ర పశువు లేక ప్రాకెడు జంతువు కళేబరమును ముట్టుకొనినయెడల, తన పొరపాటును గుర్తించకపోయినను వెంటనే అశుద్దుడై పాపము కట్టుకొనును.

3. ఎవడైనను పొరపాటున నరులకు సంబంధించిన అశుచికరమైన వస్తువును ముట్టుకొనినయెడల తన పొరపాటును గుర్తించిన వెంటనే అపరాధి అగును.

4. ఎవడైనను మేలుకైనను, కీడుకైనను, తెలిసి తెలియక మనుజులు మాట్లాడు విధమున, లాభనష్టములు యోచింపక, వ్యర్ధముగా ఒట్టుపెట్టుకున్నచో అది మొదట తెలియకపోయినను, దానిని గ్రహించిన వెంటనే అతడు అపరాధి అగును.

5. పై పాపములలో దేనినైన కట్టుకొనినవాడు తన దోషమును అంగీకరింపవలయును.

6. అతడు తన పాపమునకు ప్రాయశ్చిత్తముగా ఆడుమేకనో లేక గొఱ్ఱెనో పాపపరిహారబలిగా సమర్పింపవలయును. యాజకుడు అతనికి ప్రాయశ్చిత్తము జరిగింపగా అతడు పాపమునుండి విముక్తుడగును.

7. పాపము కట్టుకొనిన నరుడు మేకనుగాని, గొఱ్ఱెనుగాని సమర్పింపలేనిచో రెండు తెల్లగువ్వలనో లేక రెండు యువపావురములనో కొనిరావలయును.

8. వానిలో ఒకదానిని పాపపరిహారబలిగా, మరియొక దానిని దహనబలిగా ప్రభువుసన్నిధికి తేవల యును. యాజకుడు అతనికొరకై పాపపరిహారబలిని మొదట సమర్పించును. అతడు ఆ బలిలో అర్పించు పక్షిని మెడనులిమి చంపవలయును. దాని తలను మాత్రము వేరుచేయరాదు.

9. దాని నెత్తురులో కొంత భాగము బలిపీఠము ప్రక్కన చిలుకరింపవలయును. మిగిలిన రక్తమును బలిపీఠము అడుగుభాగమున పిండవలయును. ఇది పాపపరిహారబలి అగును.

10. యాజకుడు రెండవ పక్షిని నియమము ప్రకారము దహనబలిగా అర్పించును. ఈ రీతిగా యాజకుడు పాపము చేసిన నరునికి ప్రాయశ్చిత్తము చేయగా వాని పాపము పరిహారమగును.

11. కాని రెండు తెల్లగువ్వలను లేక రెండు పావురములను గూడ అర్పింపలేనివాడు కుంచెడు మెత్తని గోధుమపిండిలో పదియవ వంతును పాపపరిహారబలిగా కొనిరావలయును. అది పాపపరిహార బలియగును కాని ధాన్యబలి కానేరదు. కనుక దానిమీద ఓలివుతైలముగాని, సాంబ్రాణిగాని ఉండరాదు.

12. అతడు ఆ పిండిని యాజకునివద్దకు కొనిరావలయును. యాజకుడు ఆ పిండిలో పిడికెడు తీసికొని దహనబలితో పాటు దానిని కూడ బలిపీఠము మీద కాల్చివేయును. అది పాపపరిహారబలి అగును.

13. ఈ రీతిగా యాజకుడు పాపముచేసిన నరునికి ప్రాయశ్చిత్తము చేయగా అతని పాపములు పరిహారమగును. మిగిలిన పిండి, ధాన్యబలులందువలె, యాజకునికే చెందును.”

14. ప్రభువు మోషేతో ఇట్లు ఆజ్ఞాపించెను:

15. “ఎవడైనను పొరపాటున పరిశుద్ధమైన వాటి విషయములలో పాపముచేసినచో ఎట్టి అవలక్షణము లేని పొట్టేలును దోషపరిహారబలిగా కొనిరావలయును. దేవాలయపు నాణెముల విలువను ప్రమాణముగా తీసికొని ఆ పొట్టేలునకు విలువకట్టవలయును.

16. అతడు తాను చెల్లింపవలసిన సొమ్మును మరియు అదనముగా ఐదవవంతు సొమ్మును చేర్చి యాజకునకు ముట్టచెప్పవలయును. యాజకుడు పొట్టేలును దోష పరిహారబలిగా సమర్పింపగా, అతని దోషము తీరును.

17. ఎవడైనను పొరపాటున ప్రభువు ఆజ్ఞ మీరి పాపము కట్టుకొనినయెడల అతనికి తెలియకుండానే అతడు దోషియగును. అతడు తన నేరమును భరించును.

18. అతడు నీవు ఏర్పరిచిన వెలచొప్పున మందనుండి దోషపరిహారబలి కొరకు అవలక్షణములు లేని పొట్టేలును యాజకునివద్దకు కొనిరావలయును. అతడు పొరపాటున చేసిన దోషమునకు యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతని దోషము పరిహారమగును.

19. అతడు ప్రభువునకు విరోధముగా చేసిన దోషమునకుగాను ఇది పరిహారబలి అగును.”

1. ప్రభువు మోషేతో ఇట్లు నుడివెను:

2. “ఎవడైన తోటి యిస్రాయేలీయుడు తనకు అప్పగింపబడిన దానిని, కుదువ పెట్టిన సొమ్మును అతనికి తిరిగి ఈయక పోవుటవలనగాని, లేక అతని సొమ్మును అపహరించుటవలనగాని, లేక బలవంతముగా లాగు కొనుటవలనగాని,

3. లేక దొరికిన సొమ్ము దొరక లేదని బొంకుటవలనగాని, మనుష్యులు ఏమి చేసిన యెడల పాపులగుదురో వాటన్నింటిలోను దేని విషయమైనను అబద్దపు ప్రమాణము చేసినయెడల

4. అతడు ప్రభువునకు విరోధముగా పాపము కట్టుకొని అపరాధియగును. ఎవడైన పైరీతిగా పాపము కట్టుకొనిన యెడల ఆ సొమ్మును తిరిగి ఇచ్చివేయవలయును.

5. అతడు తన తప్పిదమును గుర్తింపగనే నష్టపడిన వానికి పూర్తిగా సొమ్ము చెల్లింపవలయును. దానిలో ఐదవవంతు భాగము అదనపు సొమ్ముకూడ బలి అర్పించు దినమున ముట్టజెప్పవలయును.

6. అతడు నీవు ఏర్పరచిన వెల చొప్పున మందనుండి అవలక్షణములు లేని పొట్టేలును, యాజకునివద్దకు దోషపరిహారబలిగా కొనిరావలయును.

7. యాజకుడు ప్రభువు సమక్షమున అతనికి ప్రాయశ్చిత్తము చేయగా అతని దోషము పరిహారమగును.”

8. ప్రభువు మోషేతో ఇట్లు చెప్పెను:

9. “దహన బలిని గూర్చి అహరోనును అతని కుమారులను ఇట్లు ఆజ్ఞాపింపుము. ఆ బలిని ఉదయమువరకును, రేయి అంతయు బలిపీఠము మీదనే వదలివేయవలయును. బలిపీఠముమీది అగ్ని దానిని దహించివేయును.

10. యాజకుడు నార బట్టలుతాల్చి బలిపీఠముమీది క్రొవ్వును కాల్చగా ఏర్పడిన బూడిదను తొలగించి బలిపీఠము ప్రక్కన పోయవలయును.

11. పిమ్మట అతడు నారబట్టలు తొలగించి మామూలు దుస్తులు తాల్చి ఆ బూడిదను శిబిరమువెలుపలికి కొనిపోయి శుభ్రమైనస్థలమున పోయవలయును.

12. బలిపీఠముమీది అగ్ని ఆరిపోరాదు. ప్రతి ఉదయము యాజకుడు దానిమీద కట్టెలు పేర్చును. ఆ నిప్పులమీద దహనబలిని అర్పించును. సమాధాన బలులలోని కొవ్వును కాల్చును.

13. బలిపీఠముమీది నిప్పు ఎప్పుడును మండుచునే ఉండవలయును, అది ఆరిపోరాదు.

14. ధాన్యబలి అర్పించు చట్టము ఇది. అహరోను కుమారులు ప్రభువుసన్నిధికి దానిని బలిపీఠము ఎదుటికి కొనివచ్చును.

15. దానిలో పిడికెడు పిండిని, చేరెడునూనెను, మొత్తము సాంబ్రాణిని తీసికొని బలిపీఠము మీద కాల్చివేయును. ఆ బలి సువాసన వలన ప్రభువు సంతుష్టిచెందును. దహింపబడిన ఆ కొద్దిభాగము మొత్తము అర్పణకు సూచికయగును,

16. బలిలో మిగిలిన భాగముతో అహరోను పుత్రులు పొంగనిరొట్టెలు చేసికొని, సమావేశపు గుడారము యొక్క ఆవరణలో పవిత్రస్థలమున భుజింతురు.

17. ఇది పొంగనిరొట్టెలుగా దహనబలినుండి ప్రభువు యాజకులకు ఇచ్చు భాగము. పాపపరిహారబలుల వలె, దోషపరిహార బలులవలె ఈ బలికూడ పరమ పవిత్రమైనది.

18. అహరోను వంశజులైన పురుషులందరు ఈ దహనబలి నైవేద్యమును భుజింపవచ్చును. మీ తరతరములకు ఇది శాశ్వతమైన నియమము. ఈ భోజనమును ముట్టుకొను వారంద రును పవిత్రులగుదురు.”

19. ప్రభువు మోషేతో ఇట్లు చెప్పెను: “అహరోను కుమారులైన యాజకులను అభిషేకించు తీరు ఇది.

20. అభిషేక దినమున యాజకుడు తూమెడు గోధుమపిండిలో పదియవ వంతు, ఉదయమున సగము, సాయంకాలమున సగము అర్పింపవలయును.

21. ఆ పిండిలో నూనెకలిపి దానిని పెనముమీద కాల్చి రొట్టె చేయవలయును. ఆ రొట్టెను ముక్కలు చేసి ప్రభువునకు అర్పింపవలయును. దాని సువాసన వలన ప్రభువు సంతుష్టి చెందును.

22. అహరోను కుమారులైన యాజకులు అభిషేక దినమున ఈ నియమమును కలకాలము పాటింపవలయును. ఈ బలిని పూర్తిగా దహింపవలయును.

23. యాజకుడు స్వయముగా సమర్పించుకొను ధాన్యబలిని సంపూర్ణముగా దహింపవలయునేగాని భుజింపరాదు.”

24. ప్రభువు మోషేతో ఇట్లనెను: “నీవు అహరోను వంశజులైన యాజకులతో పాపపరిహారబలిని గూర్చి ఇట్లు చెప్పుము.

25. పాపపరిహారబలిలో అర్పించు బలిపశువులనుగూడ, దహనబలిలో అర్పించు బలిపశువులను వధించుటనే వధింపవలయును. ఇది మహాపవిత్రమైన బలి అగును.

26. ఈ బలిపశువును అర్పించు యాజకుడు సమావేశపుగుడారము యొక్క ఆవరణలో పవిత్రస్థలమున దానిని భుజింపవలయును.

27. ఈ బలిపశువు మాంసము సోకిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును. దాని నెత్తురువలన బట్టలు మరకలైతే వానిని పవిత్రస్థలమున కడుగుకోవలయును.

28. బలిపశువు మాంసమును మట్టికుండలో వండినయెడల దానిని బ్రలు చేయవలయును. ఇత్తడిపాత్రలో వండినయెడల దానిని తోమి జాగ్రత్తగా శుద్ది చేయవలయును.

29. యాజకవంశజులైన పురుషులు ఈ బలిని భుజింపవచ్చును. ఇది మహా పవిత్రమైన బలి.

30. కాని ఏ పాపపరిహారపుబలిగా అర్పించు పశువునెత్తురును గుడారములోనికి కొనిపోయి పాపములకు ప్రాయశ్చిత్తము చేయుటకు వినియోగింతురో ఆ పశువు మాంసమును మాత్రము భుజింపరాదు. దానిని అగ్నిలో దహింపవలయును.

1. దోషపరిహారబలి పరమపవిత్రమైనది. దానిని అర్పించు విధానము ఇది.

2. సంపూర్ణ దహనబలులు అర్పించునప్పుడు పశువులను వధించుచోటనే దోష పరిహారబలి పశువును వధింపవలయును. దాని రక్తమును పీఠముచుట్టు చల్లవలయును.

3-4. దాని క్రొవ్వునంతటిని తోకకు అంటుకొనియున్న క్రొవ్వును, ప్రేవులమీది క్రొవ్వును, మూత్రగ్రంథులను మరియు వానిమీది క్రొవ్వును, కాలేయమునందలి క్రొవ్వును పీఠముమీద కాల్చివేయవలయును.

5. యాజకుడు ఈ క్రొవ్వునంతటిని కాల్చి దహనబలిగా అర్పింపవలయును. ఇది దోషపరిహారబలి అగును.

6. ఈ బలి నైవేద్యమును యాజకుల కుటుంబములకు చెందిన పురుషులు మాత్రమే పవిత్రస్థలమున భుజింపవలెను. ఇది పరమపవిత్రమైన నైవేద్యము.

7. పాపపరిహారబలికిని, దోషపరిహారబలికిని ఒకే నియమము వర్తించును. బలిపశువు మాంసము ప్రాయశ్చిత్తముచేయు యాజకునికి చెందును.

8. సంపూర్ణదహనబలిగా అర్పింపబడు పశువుచర్మము యాజకునిదే అగును.

9. పొయ్యిమీద వండినగాని, పెనముమీదగాని, బాణలిలోగాని వేయించిన ధాన్యబలి అర్పణచేయు యాజకునికి ముట్టును.

10. కాని అటుల వేయింపని ధాన్యబలి, దానిలో నూనె కలిపినను కలుపకున్నను, అహరోను కుమారులైన యాజకు లందరికి చెందును. వారందరును దానిని సమాన ముగా పంచుకొందురు.

11. ప్రభువునకు సమర్పించు సమాధానబలిని గూర్చిన నియమమిది.

12. ఎవడైనను కృతజ్ఞతా పూర్వకముగా బలిని అర్పింపగోరెనేని బలితోపాటు పొంగనిరొట్టెలుకూడ కొనిరావలయును. ఇవి నూనె  కలిపిన లావుపాటి రొట్టెలైనను కావచ్చును. నూనె రాసిన పలుచని రొట్టెలైనను కావచ్చును, నూనె కలిపిన మామూలు రొట్టెలైనను కావచ్చును.

13. సమాధానబలిరూపమైన కృతజ్ఞతాబలిలో పులిపిడి పదార్ధము కలిపిన పొంగిన రొట్టెలనుకూడ కొని రావలయును.

14. ఈ రొట్టెలలో ఒక్కొక్క రకమునకు ఒక్కొక్క దానిని దేవునికి ప్రతిష్టార్పణముగా అర్పింపవలయును. ఇవి బలిపశువు నెత్తుటిని పీఠముమీద చిలుకరించు యాజకునికి చెందును.

15. బలిపశువు మాంసమును దానిని బలియిచ్చిననాడే భుజింప వలయును. మరునాటికి ఏమియును అట్టి పెట్టు కొనరాదు.

16. ఎవడైనను మ్రొక్కుబడి చేసిగాని, స్వేచ్చా పూర్వకముగాగాని సమాధానబలిని అర్పింపగోరెనేని బలిపశువును అర్పించిననాడే తినవలెను. మిగిలినది మరునాడుగూడ భుజింపవచ్చును.

17. కాని మూడవ నాటికి మిగిలియున్న మాంసమును కాల్చివేయ వలయును.

18. ఎవడైనను బలిపశువు మాంసమును మూడవనాడు కూడ భుజించెనేని వాని బలిచెల్లదు. అతనికి బలిఫలము లభింపదు. అది అపవిత్రమైన బలియగును. అట్టి మాంసమును భుజించినవాడు తన పాపఫలమును అనుభవించును.

19. బలిపశువు మాంసము అపవిత్రమైన వస్తువును తాకెనేని మైలపడును. అట్టి మాంసమును నిప్పులో కాల్చివేయవలయునేగాని భుజింపరాదు. శుద్ధిగానున్నవాడు ఎవడైనను సమాధానబలులందలి మాంసమును భుజింపవచ్చును.

20. కాని శుద్దిలేనివాడు అట్టి మాంసమును భుజించినయెడల ప్రభువుసమాజమునుండి వెలివేయ బడును.

21. ఎవడైన నరులకుగాని, జంతువులకు గాని చెందిన అశుచికరమైన పదార్థములను ముట్టుకొని సమాధాన బలులందలి మాంసమును భుజించిన యెడల సమాజమునుండి వెలివేయబడును.” ,

22. ప్రభువు మోషేతో ఇట్లు చెప్పెను: “నీవు యిస్రాయేలు ప్రజలతో ఇట్లు నుడువుము

23. మీరు ఎద్దు, గొఱ్ఱె, మేకల క్రొవ్వును తినకూడదు.

24. ఏదైన జంతువు చనిపోయినపుడుగాని లేక వన్యమృగములచే చంపబడినపుడుగాని మీరు దాని క్రొవ్వును భుజింప రాదు. అయినను ఆ క్రొవ్వును ఇతర కార్యములకు వాడుకొనవచ్చును.

25. ప్రభువునకు దహనబలిగా అర్పింపబడిన బలిపశువుక్రొవ్వును భుజించువాడు ప్రభువు సమాజము నుండి వెలివేయబడును.

26. యిస్రాయేలీయులు ఎచట వసించినను పక్షి, జంతురక్తమును భోజనము నకు ఉపయోగించుకోరాదు.

27. ఈ నియమమును మీరినవాడు ఎవడైనను ప్రభువు సమాజమునుండి వెలివేయబడును.”

28. ప్రభువు మోషేతో ఇట్లు చెప్పెను: “నీవు యిస్రాయేలీయులతో ఇట్లనుము.

29. ప్రభువునకు సమాధానబలిని అర్పించువాడు ఆ బలిలో కొంతభాగ మును ప్రభువునకు ప్రత్యేకముగా అర్పింపవలయును.

30. ఆ భాగమును అనగా బలిపశువు రొమ్ముమీది క్రొవ్వును దహింప అతడు స్వహస్తములతో కొనిరావలెను. ప్రభువు సాన్నిధ్యమున అల్లాడింపబడు అర్పణగా దానిని అల్లాడించుటకు ఆ రొమ్ముతో దానిని కొనిరావలెను.

31. యాజకుడు ఆ క్రొవ్వును పీఠముమీద దహించును. కాని రొమ్మును మాత్రము తాను తీసికొనును.

32. మీరు సమాధానబలులు అర్పించిన పుడు బలిపశువు కుడితొడను యాజకునకు ఈయవలయును.

33. అహరోను సంతతిలోని ఏ యాజకుడు సమాధానబలిపశువు నెత్తురును, క్రొవ్వును దేవునకు అర్పించునో ఆ యాజకునకే కుడితొడ చెందును.

34. యిస్రాయేలీయులు అర్పించు సమాధానబలులలో బలిపశువు కుడితొడ, రొమ్ము నాకు ప్రత్యేకముగా ముట్టవలసిన భాగములు. నేను వానిని యాజకులకు ఇచ్చితిని. ఇది యిస్రాయేలీయులకు శాశ్వతనియమము కావలయును.

35. దహనబలులందు ప్రభువునకు అర్పింపబడు ప్రత్యేకమైనభాగము ఇది. అహరోను కుమారులు అభిషేకము పొందినపుడు ఈ భాగము వారికి అంకితమైనది.

36. యాజకులు అభిషేకము పొందినపుడు పైన పేర్కొనబడిన భాగము వారికి చెందునని ప్రభువు ఆజ్ఞాపించెను. ఈ ఆజ్ఞ యిస్రాయేలీయులకు తరతరముల వరకు చెల్లును.”

37. సంపూర్ణ దహనబలికి, ధాన్యబలికి, పాపపరిహారబలికి, దోషపరిహారబలికి, యాజకుల అభిషేకమునకు, సమాధానబలికి చెల్లు నియమములు ఇవి.

38. ప్రభువు యిస్రాయేలు ప్రజలను బలులు అర్పింపుడని ఆదేశించినపుడు ఎడారిలోని సీనాయి కొండమీద మోషేకు ఈ ఆజ్ఞలను దయచేసెను.

1. ప్రభువు మోషేతో ఇట్లనెను:

2. అహరోనును, అతని కుమారులను సమావేశపు గుడారము చెంతకు పిలువుము. యాజకులు ధరించువస్త్రములను, అభిషేక తైలమును, పాపపరిహారబలికి ఒక కోడెను, రెండు పొట్టేళ్ళను, గంపెడు పొంగనిరొట్టెలను అచటికి కొనిపొమ్ము.

3. ప్రజలనందరిని అచట ప్రోగుజేయుము.”

4. మోషే ప్రభువు ఆజ్ఞాపించినట్లుగా ప్రజలను సమావేశపుగుడారము వద్ద ప్రోగుచేసెను.

5. అతడు వారితో “నేను ప్రభువు ఆజ్ఞాపించినట్లే ఈ కార్యము చేయుచున్నాను” అని పలికెను.

6. మోషే అహరోనును అతని కుమారులను ముందుకు రండని పిలిచి వారిని జలముతో శుద్ధి చేయించెను.

7. అతడు అహరోనునకు చొక్కాయిని తొడిగించి, దట్టీని కట్టి, నిలువుటంగీని తొడిగించెను. అతనిని యాజకవస్త్రముతో (ఎఫోదు) కప్పి దాని కుచ్చులను ఎఫోదు నడికట్టునకు బిగించెను.

8. అతని రొమ్మున వక్షఃఫలకము నిలిపి దానిలో యాజకత్వ సంబంధిత ఊరీము, తుమ్మీములను ఉంచెను.

9. అతని శిరస్సుమీద తలపాగా పెట్టెను. సువర్ణ ఫలకమును అహరోను నొసటిభాగమున ఉంచెను. ఆ ఫలకమును పెట్టుమని ప్రభువు మోషేను ముందుగనే ఆజ్ఞాపించియుండెను.

10. అంతట మోషే తైలముతో మందిరమును, దానిలోని ప్రతిభాగమును అభిషేకించి వానిని ప్రభువునకు నివేదించెను.

11. అతడు దానిలో కొంచేము డుపర్యాయములు బలిపీఠముమీద చిలుకరించి, బలిపీఠమును దాని ఉపకరణములన్నింటిని, గంగాళము దాని పీటను ప్రభువునకు నివేదించెను.

12. అటుపిమ్మట అహరోను అతని శిరస్సుమీద తైలముపోసి అతనిని అభిషేకించెను.

13. పిమ్మట మోషే అహరోను కుమారులను ముందుకు రప్పించెను. ప్రభువు ఆజ్ఞాపించినట్లే వారికి చొక్కాలు తొడిగించి, దట్టీలు కట్టించి, టోపీలు పెట్టించెను.

14. అటు తరువాత పాపపరిహారబలికి కోడెను కొనివచ్చిరి. అహరోను, అతని కుమారులు దానిమీద చేతులు చాచిరి.

15. మోషే దానిని వధించెను. దాని నెత్తురును కొద్దిగా తీసికొని వేళ్ళతో బలిపీఠము కొమ్ములకు పూసి ఆ బలిపీఠమును దేవునికి నివేదించెను. మిగిలిన నెత్తురును బలిపీఠము అడుగున పోసి దానిని ప్రతిష్ఠించెను. ఆ రీతిగా అతడు బలిపీఠమునకు ప్రాయశ్చిత్తముచేసి దానిని దేవునికి నివేదించెను.

16. ఆ పిమ్మట అతడు కోడె ప్రేవులమీది క్రొవ్వును, కాలేయములోని క్రొవ్వును, రెండు మూత్ర గ్రంథులను, వానిమీది క్రొవ్వును తొలగించి పీఠముమీద కాల్చివేసెను.

17. ప్రభువు ఆజ్ఞాపించినట్లే కోడె చర్మమును, మాంసమును, పేడను శిబిరము వెలుపల కాల్చివేసెను.

18. తరువాత దహనబలిగా పొట్టేలును కొని వచ్చిరి. అహరోను, అతని కుమారులు దాని తలమీద చేతులు చాచిరి.

19. మోషే దానిని వధించెను. దాని రక్తమును బలిపీఠము చుట్టు చల్లెను.

20. పొట్టేలును ముక్కముక్కలుగా కోసెను. దాని ప్రేవులను కాళ్ళను శుభ్రముగా కడిగెను. ఆ మీదట దాని తలను, క్రొవ్వును, ఆ పొట్టేలునంతటిని పీఠము మీద దహించెను.

21. ఇది ప్రభువు మోషేను అర్పించుమనిన దహనబలి. ఆ బలి సువాసనవలన ప్రభువు సంతుష్టిచెందెను.

22. తదనంతరము యాజకాభిషేకబలికి రెండవ పొట్టేలును కొనివచ్చిరి. అహరోను, అతని కుమారులు దాని తలమీద చేతులు చాచిరి.

23. మోషే దానిని వధించెను. దాని నెత్తురును కొద్దిగా తీసికొని అహరోను కుడిచెవి అంచుమీద, కుడిచేతి బొటనవ్రేలిమీద, కుడికాలి బొటన వ్రేలి మీద పూసెను.

24. అహరోను కుమారులనుగూడ ముందుకు రప్పించి ఆ నెత్తురును వారి కుడిచెవి అంచులకు, కుడిచేతి బొటన వ్రేళ్ళకు, కుడికాలి బొటన వ్రేళ్ళకు పూసెను. మిగిలిన నెత్తురును బలిపీఠము చుట్టు చల్లెను.

25. ఆ పిమ్మట పొట్టేలు క్రొవ్వునంతటిని, అనగా దానితోకకు అంటుకొనియున్న క్రొవ్వును, ప్రేవులమీది క్రొవ్వును, కాలేయమునందలి క్రొవ్వును, మూత్రగ్రంథులను, వానిమీది క్రొవ్వును, దాని కుడితొడను తొలగించెను.

26. ప్రభువుయెదుట వుంచిన పొంగని రొట్టెల గంపనుండి ఒక పెద్ద రొట్టెను, నూనెతో కాల్చిన వేరొక రొట్టెను, ఒక పలుచని రొట్టెను గైకొనెను. ఆ రొట్టెలను పొట్టేలు క్రొవ్వు మీద, దాని కుడితొడమీద పేర్చి

27. వానినన్నిటిని అహరోను చేతులలో, అతని కుమారుల చేతులలో ఉంచెను. వారు ఆ పదార్థములన్నింటిని పైకెత్తి ప్రభువునకు అల్లాడించు అర్పణముగా అర్పించిరి.

28. మోషే ఆ పదార్థములన్నింటిని వారి చేతులలో నుండి తీసికొని దహనబలితోపాటు వానిని కూడ బలిపీఠముమీద కాల్చివేసెను. ఇది యాజక అభిషేకబలి. ఈ దహనబలి సువాసనవలన ప్రభువు సంతుష్టి చెందెను.

29. ఆ పిమ్మట మోషే పొట్టేలు రొమ్మును పైకెత్తి ప్రభువునకు అల్లాడించు అర్పణగా అర్పించెను. ప్రభువు ముందుగా ఆజ్ఞాపించినట్లే అభిషేకబలిగా అర్పించిన పొట్టేలు మాంసములో ఈ రొమ్ము మోషేకు లభించెను.

30. మోషే పీఠము మీది కొంతతైలమును, రక్తమును తీసికొని వానిని అహరోనుమీదను, అతని కుమారుల మీదను, వారి దుస్తులమీదను చిలుకరించెను. ఆ రీతిగా. అతడు వారిని, వారి దుస్తులను దేవునికి నివేదించెను.

31. మోషే అహరోనుతో అతని కుమారులతో “ప్రభువు ఆజ్ఞాపించినట్లుగనే మీరు ఈ మాంసము కొనిపోయి సమావేశపు గుడారము ప్రవేశద్వారము చెంత వండుకొనుడు. అభిషేకబలికిగా అర్పించిన రొట్టెలతో అచట దానిని భుజింపుడు.

32. మీరు భుజింపగా మిగిలిన మాంసమును, రొట్టెలను కాల్చి వేయుడు.

33. ఏడుదినములవరకు మీరు సమావేశపు గుడారప్రవేశద్వారము వీడరాదు. అప్పటికి మీ అభిషేక విధి పూర్తియగును.

34. ప్రభువు ఆజ్ఞాపించినట్లే నేడు మీకు ప్రాయశ్చిత్తము జరిపితిని.

35. మీరు ఏడు నాళ్ళపాటు రేయింబవళ్ళు సమావేశపు గుడార ప్రవేశ ద్వారమువద్దనే ఉండి ప్రభువు విధిని పాటింపుడు. ఇట్లు చేయుదురేని మీకు ప్రాణాపాయము కలుగదు. ప్రభువునుండియే నేను ఈ ఆజ్ఞను స్వీకరించితిని” అని చెప్పెను.

36. అహరోను, అతని కుమారులును ప్రభువు మోషే ముఖమున ఆజ్ఞాపించినట్లే చేసిరి.

1. ఎనిమిదవనాడు అహరోనును, అతని కుమారులను, సమాజ పెద్దలను మోషే పిలువనంపెను.

2. అతడు అహరోనుతో “ప్రభువునకు పాపపరిహారబలికి గాను ఒక కోడెను, దహనబలికిగాను ఒక పొట్టేలును కొనిరమ్ము. వానికి అవలక్షణములు ఏమియు ఉండరాదు.

3. యిస్రాయేలీయులతో పాపపరిహార బలికిగాను ఒక మేకపోతును కొనిరమ్మని చెప్పుము. దహనబలికిగాను దోషములేని ఏడాది కోడెదూడను, గొఱ్ఱెపిల్లను తీసికొనిరమ్మని చెప్పుము.

4. సమాధాన బలికిగాను ఒక కోడెను, పొట్టేలును గైకొని రమ్మనుము. ధాన్యబలికిగాను నూనె కలిపిన పిండి తేవలయును. ప్రభువు నేడు మీకు దర్శనమిచ్చును” అని చెప్పెను.

5. మోషే ఆజ్ఞాపించినట్లే వారు వానినన్నిటిని సమావేశపుగుడారము చెంతకు కొనివచ్చిరి. ప్రజలందరును అచట ప్రభువు సమక్షమున ప్రోగైరి.

6. మోషే వారితో “మీరు ఈ కార్యములన్నిటిని నెరవేర్చినచో ప్రభువు తన తేజస్సుతో మీకు దర్శనమిచ్చును” అని చెప్పెను.

7. ఆ పిమ్మట అతడు అహరోనుతో “నీవు బలిపీఠము చెంతకుపోయి పాపపరిహారబలిని, దహనబలిని సమర్పింపుము. ఆ బలులవలన నీ పాపములకు, ప్రజల పాపములకు ప్రాయశ్చిత్తము జరుగును. ప్రభువు ఆజ్ఞాపించినట్లే ప్రజల పాపములకు ప్రాయశ్చిత్తము చేయుటకు బలులను అర్పింపుడు” అని చెప్పెను.

8. అహరోను బలిపీఠము వద్దకు పోయి మొదట సొంత పాపములకుగాను ప్రాయశ్చిత్తముగా కోడెను వధించెను.

9. కుమారులు నెత్తురును అందింపగా అతడు దానిని వ్రేలితో బలిపీఠము కొమ్ములకు కొద్దిగా పూసెను. మిగిలిన రక్తమును బలిపీఠము అడుగున పోసెను.

10. ప్రభువు ఆజ్ఞాపించినట్లే ఆ కోడె క్రొవ్వును, మూత్రగ్రంథులను వానిమీదనున్న కొవ్వును, కాలేయము మీదనున్న కొవ్వును బలిపీఠముమీద సువాసనాభరితముగా దహించగా ప్రభువు సంతుష్టి చెందెను.

11. దాని చర్మమును, మాంసమును శిబిరము వెలుపల కాల్చివేసెను.

12. పిమ్మట అహరోను దహనబలిగా పొట్టేలును వధించెను. కుమారులు నెత్తురును అందీయగా, అతడు దానిని బలిపీఠము కొమ్ములమీద పూసెను.

13. ఆ పిమ్మట వారు దాని మాంసపుముక్కలను, తలను అందించిరి. అహరోను వానిని బలిపీఠముమీద దహించెను.

14. అతడు పొట్టేలు ప్రేవులు, కాళ్ళు శుభ్రముగా కడిగి, వానినికూడ దహనబలిలో భాగముగా కాల్చివేసెను.

15. తరువాత ప్రజల పాపపరిహారబలిగా ఎన్నుకొనిన మేకను వధించి మొదటిదానివలెనె సమర్పించెను.

16. దహనబలిగా ఉద్దేశింపబడిన పశువును గూడ నియమపూర్వకముగా సమర్పించెను.

17. అటు పిమ్మట ధాన్యబలిని గైకొని గుప్పెడుపిండిని బలిపీఠముమీద కాల్చివేసెను. ఈ దహనబలి దినదినము సమర్పించు దహనబలికంటె భిన్నమైనది.

18. అతడు ప్రజల సమాధానబలులైన కోడెను, పొట్టేలును వధించెను. కుమారులు రక్తమును అందీయగా, దానిని పీఠముపై చుట్టుచల్లెను.

19-20. ఆ పశువులక్రొవ్వును, అనగా తోకకు అంటుకొని ఉన్న క్రొవ్వును, మూత్రగ్రంథులను వాని మీది క్రొవ్వును, కాలేయము మీది క్రొవ్వును, వాని రొమ్ముల మీద పేర్చి, ఆ భాగములన్నిటిని బలిపీఠము చెంతకు కొనిపోయెను. క్రొవ్వును మాత్రము బలిపీఠముమీద కాల్చివేసెను.

21. ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లే వాని రొమ్ములను, కుడితొడను ప్రభువుముందట అల్లాడించు అర్పణముగా సమర్పించెను.

22. అహరోను పాపపరిహారబలిని, దహనబలిని, సమాధానబలిని సమర్పించిన పిదప చేతులెత్తి ప్రజలను దీవించెను. అటుపిమ్మట బలిపీఠము చెంత నుండి క్రిందికి దిగివచ్చెను.

23. మోషే, అహరోనులు సమావేశపుగుడారములోనికి వెళ్ళిరి. అటనుండి వెలుపలికి వచ్చిన తరువాత ప్రజలను దీవించిరి. అప్పుడు ప్రభువు తేజస్సు ప్రజలకు ప్రత్యక్షమయ్యెను.

24. ప్రభువు సమక్షము నుండి ఒక నిప్పుమంట వెలువడి బలిపీఠముమీది దహనబలిని క్రొవ్వును దహించెను. ఆ దృశ్యమునుగాంచి ప్రజలెల్లరు ఉత్సాహముతో కేకలు వేయుచు నేలపై సాగిలబడిరి.

1. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమతమ ధూపపాత్రలను గైకొని, వానిలో అపవిత్రమైన నిప్పువేసి ప్రభువాజ్ఞను ఉల్లంఘించి ప్రభువునకు సాంబ్రాణిపొగ వేసిరి. వారు అట్టి నిప్పుతో సాంబ్రాణి పొగ వేయవలయునని ప్రభువు ఆజ్ఞాపింపలేదు.

2. కనుక ప్రభువు సన్నిధినుండి ఒక అగ్నిజ్వాల వెడలివచ్చి వారిని నిలువున కాల్చిచంపెను.

3. మోషే అహరోనుతో, “నాకు సేవచేయువారు నా పావిత్య్రమును గుర్తింపవలయును. నా ప్రజలల్లెరు నన్ను గౌరవింపవలయును అని ప్రభువు నుడివెనుకదా! దాని భావమిదియే” అని చెప్పెను. ఆ మాటలకు అహరోను మౌనము వహించెను.

4. మోషే, అహరోనునకు పినతండ్రియగు ఉజ్జీయేలు కుమారులైన మీషాయేలు, ఎల్సాఫాను అను వారిని పిలిచి “ఇటువచ్చి మీ సోదరుల శవములను గుడారము నుండి బయటకు కొనిపోయి శిబిరము వెలుపలికి చేర్పుడు” అని చెప్పెను.

5. మోషే ఆజ్ఞాపించినట్లే వారు చొక్కాయలతోనున్న మృతదేహములను శిబిరము వెలుపలికి కొనిపోయిరి.

6. మోషే అహరోనుతో, అతని కుమారులు ఎలియెజెరు, ఈతామారులతో “మీరు సంతాపసూచకముగా జుట్టు విరబోసికొనకుడు. బట్టలు చించుకొనకుడు. అటుల చేయుదురేని మీరును చత్తురు. ప్రభువు మన సమాజమంతటి మీద ఆగ్రహించును. ప్రభువు అగ్నికి ఆహుతులైనవారి కొరకు యిస్రాయేలీయులు అందరు సంతాపము వెలిబుచ్చవచ్చును.

7. మీరు గుడారమును వీడుదురేని తప్పక చత్తురు. ప్రభువు అభిషేకతైలముతో మీరు అభిషేకింపబడితిరి గదా!” అనెను. వారు మోషే ఆజ్ఞ పాటించిరి.

8. ప్రభువు అహరోనుతో ఇట్లు సెలవిచ్చెను. “నీవు గాని, నీ కుమారులుగాని సమావేశపు గుడారమునకు వచ్చునపుడు ద్రాక్షసారాయమునుగాని, ఘాటయిన మద్యమునుగాని సేవింపరాదు.

9. ఈ నియమము మీరుదురేని మీరు చత్తురు. మీ వంశజులందరికి ఇది శాశ్వతనియమము.

10. మీరు పవిత్ర వస్తువేదో, సామాన్యవస్తువేదో, శుచికరమైన వస్తువేదో, అశుచికరమైన వస్తువేదో గుర్తింపవలయును.

11. నేను మోషే ద్వారా మీకనుగ్రహించిన నియమములనెల్ల మీరు యిస్రాయేలీయులకు బోధింపవలయును” అని చెప్పెను,

12. మోషే అహరోనుతో, మిగిలిన అతని ఇద్దరు కుమారులు ఎలియెజెరు, ఈతామారు అనువారితో “మీరు ప్రభువునెదుట దహింపగా మిగిలిన ధాన్య బలిని గైకొని, దానితో పొంగనిరొట్టెలను తయారు చేసికొని పీఠము చేరువలో భుజింపుడు. అది పరమ పవిత్రమైన బలి.

13. నైవేద్యమును పవిత్రస్థలముననే ఆరగింపుడు. ప్రభువునకు అర్పింపబడిన ధాన్యబలినుండి ఈ భాగము మీకును, మీ కుమారులకును చెందును. ప్రభువే ఈ నియమమును జారీ చేసెను.

14. ప్రభువు ఎదుట అల్లాడింపబడిన రొమ్మును, దాని కుడితొడను, మీరు మీ కుటుంబములు కలిసి పవిత్ర స్థలమున భుజింపవచ్చును. యిస్రాయేలీయులు అర్పించు సమాధానబలులనుండి ఈ భాగములు మీకును, మీ కుమారులకును చెందును.

15. బలిపశువు క్రొవ్వును పీఠముమీద దహించు నపుడు ప్రభువునకు అల్లాడింపబడిన ఆ పశువు రొమ్మును దాని కుడితొడను శాశ్వతముగా మీకును, మీ కుమారులకును చెందును. ఇది ప్రభువు ఆజ్ఞ” అని చెప్పెను.

16. మోషే పాపపరిహారబలిగా అర్పింపబడిన మేకను గూర్చి విచారింపగా దానిని బలిపీఠముమీద సంపూర్తిగా కాల్చివేసిరని తెలియవచ్చెను. అతడు ఎలియెజెరు, ఈతామారులపై కోపించెను.

17. “మీరు ఆ పాపపరిహార బలిపశువును పవిత్ర స్థలమున ఏల భుజింపరైతిరి? అది పరమపవిత్రమైన నైవేద్యము కనుక దానిని భుజించుటవలన యిస్రాయేలీయుల పాపములకు ప్రాయశ్చిత్తము చేసియుందురుకదా?

18. ఆ పశువు నెత్తురును పవిత్రస్థలములోకి కొని పోలేదుకదా! కనుక నేను ఆజ్ఞాపించినట్లే మీరు దానిని పవిత్రస్థలములో భుజించియుండవలసినది” అనెను.

19. అందుకు అహరోను “పాపపరిహారబలిగా మరియు దహనబలిగా వారు అర్పించినబలి అర్పణను నేను భుజించిన మాత్రముననే ప్రభువు అధికముగా సంతుష్టి చెందియుండునా? మన ప్రజలు నేడు పాపపరిహారబలిని, సంపూర్ణదహనబలిని అర్పించిరి. అయినను ఇట్టి ఆపద కలిగినదికదా?” అని అనెను.

20. మోషే ఆ సమాధానమును అంగీకరించెను.

1-3. ప్రభువు మోషే, అహరోనులతో ఇట్లు నుడివెను: “మీరు యిస్రాయేలీయులకు ఇట్లు ఆజ్ఞా పింపుడు. మీరు భూమిమీది జంతువులలో గిట్టలు చీలియుండి, నెమరువేయు వానినెల్ల భుజింపవచ్చును.

4-6. ఈ క్రింది జంతువులకు గిట్టలు చీలియుండుట లేక నెమరువేయుట అను ఏదో ఒక లక్షణము మాత్రమే కలదు. కనుక మీరు వానిని భుజింపరాదు. ఒంటె, పొట్టికుందేలు, కుందేలు నెమరువేయునుగాని వానికి గిట్టలు చీలియుండవు. కనుక అవి అశుచికరమైనవి.

7. పందికి గిట్టలు చీలియుండునుగాని అది నెమరువేయదు. కనుక అది అశుచికరమైనది.

8. ఇట్టి జంతువుల మాంసమును మీరు భుజింపరాదు. వాని శవములనుకూడ ముట్టుకోరాదు. అవి అశుచికరమైనవి.

9. జలచరములలో పొలుసులు, రెక్కలు గల వానిని మీరు భుజింపవచ్చును. అవి నదులలోగాని, సముద్రములలోగాని జీవించుచుండవచ్చును.

10. కాని జలచరములలో రెక్కలు, పొలుసులులేని వానిని మీరు భుజింపరాదు.

11. అవి అశుచికరమైనవి. మీరు వానిని ఆరగింపరాదు, వాని కళేబరములను గూడ ముట్టుకోరాదు.

12. పొలుసులు, రెక్కలు లేని జలచరములును అశుచికరమైనవి.

13-19. పక్షులలో ఈ క్రిందివి మీకు హేయమైనవి. కనుక మీరు వానిని భక్షింపరాదు. రాబందు, పెద్దబోరువ, క్రౌంచము, గ్రద్ద, రకరకముల తెల్ల గ్రద్దలు, రకరకముల కాకులు, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, రకరకముల డేగలు, పైడికంటె, చెరువుకాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ, సంకుబుడి కొంగ, రకరకములైన కొంగలు, కుకుడుగువ్వ, గబ్బిలము.

20-21. నాలుగుకాళ్ళతో నడచు కీటకములు అశుచికరమైనవి. కీటక జాతిలో నేలమీద గెంతుచు పోవుటకు కాళ్ళమీద తొడలుగలవి మాత్రమే మీకు భుజింపదగినవి.

22. అనగా రకరకముల మిడుతలు, టిట్టిభములు, గొల్లభామపురుగులు.

23. మిగిలిన నాలుగుకాళ్ళ కీటకములనెల్ల అశుచికరమైన వానినిగా భావింపుడు.

24-28. ఈ క్రింది జంతువులను ముట్టుకొనిన వారు సాయంకాలమువరకు శుద్ధిని కోల్పోవుదురు. వాని కళేబరములను తొలగించువారు సాయంకాలము వరకు శుద్ధినికోల్పోవుదురు. పైపెచ్చు వారు తమ బట్టలనుగూడ ఉతుకుకొనవలయును. చీలినగిట్టలును, నెమరువేయు గుణమునులేని నాలుగు కాళ్ళ జంతువులు, పంజాలుగల ప్రాణులు అశుచికరములు. ,

29-30. నేలమీద ప్రాకెడి చిన్న జంతువులలో ఈ క్రిందివి మీకు అశుచికరమైనవి. చిన్న ముంగిస, ఎలుక, తాబేలు, బల్లులు, నేలముసలి, అడవి ఎలుక, తొండలు.

31. ఈ ప్రాణుల కళేబరములను ముట్టుకొనిన వారు సాయంకాలమువరకు శుద్ధిని కోల్పోవుదురు.

32. వాని కళేబరములు పడిన వస్తువులు అనగా కొయ్యపనిముట్లు, దుస్తులు, చర్మములు, గోనెలు మొదలగునవి అశుచికరములగును. అట్టి వస్తువులను నీటిలో ముంచవలయును. అవి సాయంకాలము వరకు శుద్ధినికోల్పోవును. తదుపరి శుద్ధియగును.

33. ఈ ప్రాణుల కళేబరములు, కుండలోపడిన యెడల దానిలోని పదార్ధములన్నియు అశుచికరములగును. ఆ కుండను బద్దలు చేయవలయును.

34. ఆ కుండలోని నీళ్ళుసోకిన భోజనము అశుచికరమగును. దానిలో పోసిన ద్రవపదార్ధములు కలుషిత మగును.

35. మృతజంతువు దేనిమీద పడినను అది అశుచికరమగును, అది పొయ్యిమీదగాని కుంపటి మీదగాని పడినచో వానిని పగులగొట్టవలయును.

36. కాని చెలమలు, బావులు, కుంటలు మాత్రము మృతజంతువులు పడగా నీరు ఎక్కువగా ఉండుట వలన శుద్ధి నికోల్పోవు. కాని మృతదేహమునకు తగిలినది అపవిత్రమగును.

37. మృతదేహములు పడిన విత్తుకట్టు విత్తనములు కూడ శుద్దిని కోల్పోవు.

38. కాని నానియున్న విత్తనములమీద కళేబరములు పడెనేని అవి అశుద్ధి అగును.

39. మీరు తినదగిన జంతువేదైన చనిపోయిన యెడల దానిని ముట్టుకొనువాడు సాయంకాలము వరకు శుద్ధినికోల్పోవును.

40. దాని మాంసము భుజించువాడు బట్టలు ఉతుకుకోవలయును. అతడు సాయంకాలము వరకు శుద్ధినికోల్పోవును. దాని కళేబరమును తొలగించువాడు బట్టలు ఉతుకుకోవలయును. అతడు సాయంకాలము వరకును శుద్ధిని కోల్పోవును.

41. నేలమీద ప్రాకెడు జంతువులు హేయమైనవి కనుక మీరు వానిని భుజింపరాదు.

42. కడుపుతో ప్రాకెడు జంతువులును, నాలుగుకాళ్ళతో గాని మరి ఎక్కువ కాళ్ళతోగాని నేలమీద ప్రాకెడు జంతువులును హేయమైనవి.

43. ప్రాకుజీవరాసులలో దేనినైనను తిని మిమ్మును మీరు అశుద్ధపరచుకొనగూడదు. మీరు అపవిత్రులగునట్లు వాటివలన అపవిత్రతను కలుగజేసి కొనగూడదు.

44. యావేనైన నేను మీకు ప్రభుడను. నేను పవిత్రుడను కనుక నా వలన మీరును పవిత్రులైతిరి. కనుక మీరు ఈ ప్రాకెడు జంతువులవలన శుద్ధిని కోల్పోవలదు.

45. ప్రభుడనైన నేను మిమ్ము ఐగుప్తు నుండి తోడ్కొనివచ్చినది మీకు దేవుడనగుటకే. నేను పవిత్రుడను గనుక మీరుకూడ పవిత్రులై యుండుడు.”

46. భూచరములు, జలచరములునైన సమస్త జంతువులను, పక్షులను గూర్చిన నియమములు ఇవి. 

47. శుచికరమైన వానిని అశుచికరమైన వానినుండి వేరుపరచుటకును, తినదగినవానిని, తినగూడని వానినుండి విభజించుటకును ఈ నియమములు ఉద్దేశింపబడినవి.

1-2. ప్రభువు మోషేను యిస్రాయేలీయులతో చెప్పుమనిన సంగతులివి: “ఏ స్త్రీయైనను ప్రసవించి మగబిడ్డను కనినయెడల, తాను అయినప్పటివలె, ఏడురోజులు శుద్ధినికోల్పోవును.

3. ఎనిమిదవనాడు శిశువునకు సున్నతి చేయవలయును.

4. ఆమె రక్తము శుద్ధిచెందుటకు ఇంకను ముప్పది మూడుదినములు వటును. తన రక్త శుద్ధియగు కాలము ముగియువరకు ఆమె పవిత్ర వస్తువు లను ముట్టరాదు, దేవాలయమునకు వెళ్ళరాదు.

5. కాని ఆమె ఆడుబిడ్డను కనినచో, తాను ఋతుమతియైనప్పటివలె, పదునాలుగు దినములు శుద్ధిని కోల్పోవును. ఆ పిమ్మట ఆమె రక్తము శుద్ధిచెందుటకు ఇంకను అరువదియారు దినములు పట్టును.

6. ఆమె మగబిడ్డను కనినను, ఆడుబిడ్డను కనినను శుద్దికాలము ముగియగనే సంపూర్ణదహనబలికి ఏడాది గొఱ్ఱెపిల్లను, పాపపరిహారబలికి ఒక తెల్ల గువ్వను లేక పావురమును సమావేశపుగుడారము ప్రవేశముద్వారము వద్ద పరిచర్యచేయు యాజకుని యొద్దకు తీసుకొనిరావలయును.

7. యాజకుడు వానిని బలియిచ్చి ఆమె శుద్ధిని బడయుటకు విధిని నిర్వహించును. అప్పుడు ఆమె శుద్ధినిబడయును. ప్రసవించిన స్త్రీని గూర్చిన నియమమిది.

8. కాని ఆమె పేదరాలైయుండి గొఱ్ఱె పిల్లను సమర్పింపలేని యెడల రెండు పావురములనో లేక రెండు తెల్లగువ్వలనో అర్పింపవచ్చును. వానిలో ఒకటి సంపూర్ణ దహనబలికి మరియొకటి పాపపరిహారబలికి వినియోగింపబడును. యాజకుడు ఆమె శుద్ధిని పొందు విధిని నిర్వహింపగా ఆమె శుద్ధినిబడయును.”

1. ప్రభువు మోషే, అహరోనులతో ఇట్లనెను:

2. "ఎవని శరీరము మీదనైనా వాపుగాని, పొక్కులు గాని, నిగనిగలాడు పొడగాని కనిపించి కుష్టయేమో అను శంక కలిగించినయెడల అతనిని అహరోను వంశపు యాజకుని యొద్దకు కొనిపోవలయును.

3. యాజకుడు అతని చర్మవ్యాధిని పరిశీలించును. వ్యాధి సోకినచోట వెంట్రుకలు తెల్లబారినను, లేక దేహ చర్మముకంటె ఆ చోటు పల్లముగా కనబడినను అది కుష్ఠమే. యాజకుడు అట్టి నరుని అశుద్ధునిగా నిర్ణయించవలయును.

4. కాని దేహముమీద తెల్లని మచ్చమాత్రము కనిపించి, చర్మముక్రుంగుట, వెంట్రుకలు తెల్లబారుట అను లక్షణములు కనిపింపవేని యాజకుడు రోగిని ఏడునాళ్ళపాటు కడన ఉంచవలయును.

5. ఏడవనాడు రోగిని మరల పరిశీలింపవలయును. ఆ పొడ ఆలాగునే యుండి దేహమునందు వ్యాపింపకుండ ఉండినయెడల రోగిని మరి ఏడు దినములపాటు కడన ఉంచవలయును.

6. ఏడవనాడు మరల రోగిని పరీక్షింపవలయును. క్షీణించిన పొడ దేహమునందు వ్యాపింపక ఉండిన యెడల యాజకుడు రోగిని శుద్దునిగా నిర్ణయింపవలెను. అది వట్టి పొక్కు మాత్రమే. రోగిబట్టలు ఉతుకుకొని శుద్ధినిపొందును.

7. కాని యాజకుడు రోగిని పరీక్షించి శుద్ధునిగా నిర్ణయించిన పిదప అతని దేహమందు పొడ వ్యాపించేనేని అతడు మరల యాజకుని చూడవలయును.

8. యాజకుడు రోగిని పరీక్షించి పొడ వ్యాపించియుండిన యెడల అతనిని అశుద్ధునిగా నిర్ణయించవలెను. అది కుష్ఠమే.

9. ఎవరికైనను కుష్ఠసోకినయెడల వానిని యాజకుని వద్దకు కొనిపోవలయును.

10-11. యాజకుడు రోగిని పరీక్షించును. అతని దేహము మీద తెల్లనివాపు, తెల్లబారిన వెంట్రుకలు, పచ్చిగ కన్పించెనేని దానిని పూర్వమునుండే ఉన్న కుష్ఠగా నిర్ణయింపవలయును. రోగిని అశుద్ధునిగా నిర్ణయింపవలయును. అట్టి రోగిని పరీక్షార్థము ఊరినుండి వెలుపలికి పంపనక్కరలేదు. అతడు నిస్సందేహముగా అశుద్దుడు.

12-13. కాని రోగి దేహమంతట శిరస్సునుండి పాదమువరకు కుష్ఠ వ్యాపించియుండెనేని యాజకుడు అతనిని పరిశీలింపవలయును. రోగి దేహమంతట కుష్ఠ వ్యాపించియుండెనేని యాజకుడు అతనిని శుద్ధునిగా నిర్ణయింపవలయును. రోగి దేహమందంత తెల్లబారెను కనుక అతడు శుద్దుడు.

14. కాని ఆ రోగి చర్మముమీద పుండు లేవగనే అతడు అశుద్దుడు అగును.

15. యాజకుడు రోగి పుండును పరీక్షించి అతనిని అశుద్దునిగా నిర్ణయింపవలయును. పుండు కుష్ఠకు గుర్తు. పుండు కలవాడు అశుద్దుడు.

16. కాని ఆ పుండు తెల్లబారెనేని రోగి యాజకునివద్దకు వెళ్ళవలయును.

17. యాజకుడు రోగిని పరీక్షించి కుష్ఠ తెల్లబారినదని గుర్తించెనేని అతనిని శుద్దునిగా నిర్ణయింపవలయును. అతడు శుద్ధుడే.

18-19. ఎవరికైన బొబ్బలేచి అది నయమైన పిదప ఆ తావున తెల్లని వాపుకాని, ఎరుపు, తెలుపు రంగుల పొడ గాని కనిపించినయెడల అతడు యాజకుని వద్దకు వెళ్ళవలయును.

20. యాజకుడు రోగిని పరీక్షించి చూచి, తెల్లని రోమములు, చర్మము పల్లముగా ఉండుట అను లక్షణములు కనిపించినచో అతనిని అశుద్ధునిగా నిర్ణయింపవలయును. అతనికి బొబ్బమీద కుష్ఠ సోకినట్లు.

21. కాని పై రెండు లక్షణములు కన్పింపక వ్యాధి సోకిన తావున రంగు మాత్రమే మారియుండెనేని యాజకుడు రోగిని ఏడు నాళ్ళపాటు వేరుగా ఉంచవలయును.

22. పొడ వ్యాపించునేని యాజకుడు రోగిని అశుద్ధునిగా నిర్ణయింపవలయును. అతనికి కుష్ఠ సోకినది.

23. కాని పొడ వ్యాపింపదేని అది బొబ్బమచ్చ మాత్రమే. కనుక యాజకుడు రోగిని శుద్ధునిగానే నిర్ణయింప వలయును.

24. ఎవరికైనను దేహము కాలి, ఆ కాలిన భాగమున తెల్లనిమచ్చగాని లేక తెలుపు, ఎరుపు రంగుల మచ్చ గాని ఏర్పడినచో,

25. యాజకుడు అతనిని పరీక్షింపవలయును. వెంట్రుకలు తెల్లబడుట, చర్మము క్రుంగుటయను లక్షణములు కనిపించెనేని కుష్ఠ సోకినట్లే. యాజకుడు అతనిని అశుద్ధునిగా నిర్ణయింపవలయును. అది కుష్ఠయే.

26. కాని పై రెండు లక్షణములు కన్పింపక వ్యాధి సోకిన తావున రంగుమాత్రమే మారియుండెనేని యాజకుడు రోగిని ఏడునాళ్ళపాటు వేరుగ ఉంచవలయును.

27. ఏడవనాడు, రోగిని మరల పరీక్షించి చూచి పొడ వ్యాపించియున్నచో అతనిని అశుదునిగా నిర్ణయింపవలయును. అది కుష్ఠయే.

28. కాని పొడ వ్యాపింపక రంగును కోల్పోవుచుండెనేని దానిని కాలుపులవలన వచ్చిన వాపుగా నిర్ణయింపవలయును. యాజకుడు రోగిని శుద్ధునిగా గణింపవలయును. అది కేవలము వాపువలన కలిగినమచ్చ.

29-30. స్త్రీ పురుషులలో ఎవరికైన తలమీదనైనను, గడ్డముమీదనైనను పొడలేచినచో యాజకుడు ఆ వ్యక్తిని పరీక్షింపవలయును. అచట చర్మము క్రుంగి యుండి వెంట్రుకలు సన్నబారి పసుపురంగు కలిగియుండిన యాజకుడు రోగిని అశుద్ధునిగా నిర్ణయింపవలయును. అది తలమీదనో, గడ్డము మీదనో వచ్చెడి కుష్ఠ.

31. కాని యాజకుడు పరీక్షింపగా పై రెండు లకణములు కన్పింపవేని రోగిని ఏడునాళ్ళపాటు వేరుగ ఉంచవలయును.

32-33. ఏడవనాడు రోగిని మరల పరీక్షింపవలయును. పొక్కిన పుండు వ్యాపింపక, చర్మము క్రుంగక, వెంట్రుకలు పసుపురంగు పొందక ఉండెనేని రోగి ఆ కురుపు లేచిన భాగము చుట్టు వెంట్రుకలు గొరిగించుకోవలెను. అతడు ఇంకను ఏడునాళ్ళపాటు ఊరికి వెలుపల వసింపవలయును.

34. యాజకుడు రోగిని మరల ఏడవనాడు పరీక్షింప వలయును. కురుపు దేహమునందు వ్యాపింపక, చర్మము క్రుంగక ఉండెనేని యాజకుడు రోగిని శుద్ధునిగనే గణింపవలయును. అతడు దుస్తులు ఉతుకుకొని శుద్ధినిపొందును.

35-36. కాని రోగిని శుద్దునిగా నిర్ణయించిన పిమ్మట కురుపు వ్యాపించెనేని యాజకుడు అతనిని మరల పరీక్షింపవలయును. అది వ్యాపించియుండెనేని ఇక వెంట్రుకలు పసుపుగానున్నవా లేవా అని పరీక్షింపనక్కరలేదు. అతడు అశుద్దుడే.

37. కాని యాజకుని దృష్టిలో కురుపు వ్యాపింపకయుండి ఆ తావున నల్లని వెంట్రుకలు పెరుగుచుండెనేని రోగికి వ్యాధినయమైనట్లే. యాజకుడు అతనిని శుద్ధునిగా నిర్ణయింపవలయును.

38-39. స్త్రీ పురుషులలో ఎవరి చర్మముమీదనైన తెల్లని పొడలు ఏర్పడినచో యాజకులు ఆ వ్యక్తిని పరీక్షింపవలయును. ఆ పొడలు మసకగానున్న తెల్ల మచ్చలు మాత్రమే అగునేని అవి వట్టి దద్దులు. ఆ రోగి శుద్దుడు.

40. ఎవరికైనను తలమీద వెంట్రుకలు రాలి పోయినచో అది బట్టతల మాత్రమే అగును. అతడు అశుద్దుడు కాడు.

41. అతని తల ముందటిభాగమున వెంట్రుకలు రాలిపోయినచో ఆ భాగము బట్టతల అగును. అతడు అశుద్దుడు కాడు.

42. కాని అతని బట్టతల మీద తెలుపు, ఎరుపు రంగులుగల కురుపు లేచెనేని అది కుష్ఠ.

43-44. యాజకుడు రోగిని పరీక్షించి అతని తలమీద ఎరుపు, తెలుపు రంగులు గల వాపును గుర్తించెనేని అతనిని అశుద్ధునిగా నిర్ణయింపవలయును. అది తలమీద వచ్చెడు కుష్ఠ.

45. కుష్ఠరోగి చినిగిన బట్టలు తాల్చి, తల విరబోసి కొనవలయును. అతడు పై పెదవి మీద చేయి మోపి “అశుద్దుడను, అశుద్ధుడను” అని కేకలిడవలయును.

46. కుష్ఠరోగిగా ఉన్నంతకాలము అతడు అశుద్దుడే. అతడు ఏకాంతముగా శిబిరము వెలుపల జీవింపవలయును.

47-49. ఉన్ని, నూలు దుస్తులకుగాని, చర్మ సామాగ్రికి కాని కుష్ఠసోకి వాని మీదపచ్చనిపొడ కనిపించిన యెడల వానిని యాజకునికి చూపింపవలయును.

50. యాజకుడు ఆ వస్తువుల మీది బూజును పరీక్షించి, వానిని ఏడు రోజులపాటు ఒక ప్రక్కన పెట్టించును.

51. అతడు ఏడవనాడు మరల పరీక్షించినపుడు ఆ వస్తువులమీద బూజు వ్యాపించియుండెనేని అది కుష్ఠయే. ఆ వస్తువులు అశుద్ధములు.

52. కనుక యాజకుడు వానిని దహింపవలయును. అది వ్యాప్తి చెందు కుష్ఠ కనుక దానిని నిప్పుతో కాల్చివేయవలయును.

53-54. కాని ఆ వస్తువులమీద బూజు వ్యాపింపదేని వానిని కడిగి ఏడునాళ్ళపాటు ఒక ప్రక్కన పెట్టవలయును.

55. అతడు వానిని మరల పరీక్షించినపుడు బూజు వ్యాపింపకపోయినను, అవి పూర్వపు రంగుతోనే యుండినయెడల ఆ వస్తువులను అశుద్ధములుగా గణింపవలయును. బూజు పూర్తిగా లోపటను, వెలుపటను సోకినది కనుక వానిని నిప్పుతో కాల్చి వేయవలయును.

56. కాని యాజకుడు మరల పరీక్షించినపుడు బూజు తగ్గియుండెనేని ఆ బూజుపట్టిన భాగమును మాత్రము కోసివేయవలయును.

57. ఆ వస్తువుల మీద బూజు మరల కన్పించెనేని కుష్ఠ ప్రబలమైనట్లు. కనుక యాజకుడు వానిని కాల్చివేయవలయును.

58. కాని ఆ వస్తువులను ఒకమారు కడిగిన తరువాత వానిమీది బూజు పోయెనేని వానిని మరల కడుగవలయును. అప్పుడు అవి శుద్ధములగును.

59. ఉన్ని, నూలు దుస్తులకు, చర్మసామాగ్రికి సోకిన కుష్ఠను గూర్చిన నియమములివి.”

1. ప్రభువు మోషేతో ఇట్లు చెప్పెను:

2. "కుష్ఠనయమైనవానిని శుద్ధిచేయు విధానమిది. శుద్ధిని పొందుదినమున అతనిని యాజకునివద్దకు కొని రావలయును.

3-4. యాజకుడు అతనిని శిబిరము వెలువలికి కొనిపోయి అచట పరీక్ష చేయును, రోగికి కుష్ఠ నయమయ్యెనేని యాజకుడు అతనిచే రెండు శుద్ధమైన పక్షులు, కొంచెము దేవదారు కొయ్య, ఒక ఎఱ్ఱదారము, హిస్సోపురెమ్మ తెప్పించును.

5. అటు పిమ్మట యాజకులు శుభ్రమైన ప్రవాహ జలముపై మట్టిపాత్రలో ఒక పక్షిని చంపించును.

6. రెండవ పక్షిని, కొయ్యను, దారమును, హిస్సోపురెమ్మను మొదటి పక్షి నెత్తురులో ముంచును.

7. యాజకుడు శుద్ధిని పొందవలసిన వానిమీద పక్షినెత్తురును ఏడు సార్లు చిలుకరించి అతడు శుద్దుడయ్యెనని పలుకును. రెండవపక్షిని వదలివేయగా అది పొలములోనికి ఎగిరిపోవును.

8. రోగి దుస్తులు ఉతుకుకొనును. వెంట్రుకలన్ని గొరిగించుకొని స్నానము చేయును. అప్పుడతడు శుద్ధినిపొందును. ఆ పిమ్మట అతడు శిబిరములోనికి ప్రవేశింపవచ్చును. కాని ఏడునాళ్ళ పాటు తన గుడారము వెలుపల ఉండి పోవలయును.

9. ఏడవనాడు మరల తల, గడ్డము, కనుబొమ్మలు, మిగిలిన రోమములు గొరిగించుకొని, దుస్తులు ఉతుకుకొని, స్నానము చేయవలయును. అప్పుడతడు శుద్ధిని పొందును.

10. ఎనిమిదవనాడు అతడు ఏడాది ఈడుగలవి, అవలక్షణములు లేనివి రెండు మగగొఱ్ఱెపిల్లలను, ఒక ఆడుగొఱ్ఱెపిల్లను, నూనెతో కలిపిన మూడు కుంచముల గోధుమపిండిని, ఒక గిన్నెడు ఓలివునూనెను కొని రావలయును.

11. యాజకుడు అతనిని అతని కానుకలను సమావేశపుగుడార ప్రవేశ ద్వారము వద్దకు కొనిపోవును. 

12. యాజకుడు ఒక మగగొఱ్ఱెపిల్లను ఓలివుతైలమును దోషపరిహారబలిగా వానిని తెచ్చి ప్రభువునెదుట అల్లాడింపబడు అర్పణగా అర్పించును.

13. పాపపరిహారబలులు, దహనబలులు సమర్పించు పవిత్రస్థలముననే ఆ గొఱ్ఱెపిల్లను వధింపవలయును. పాపపరిహారబలివలె ఈ దోషపరిహారబలిలో చంపబడిన గొఱ్ఱెపిల్ల యాజకునికే చెందును. అది పరమ పవిత్రమైన నైవేద్యము.

14. యాజకుడు ఆ గొఱ్ఱె పిల్లనెత్తుటిని కొద్దిగా తీసికొని శుద్ధి పొందువాని కుడిచెవి అంచుమీదను, కుడిచేతి బొటనవ్రేలి మీదను, కుడికాలి బొటనవ్రేలి మీదను పూయవలయును. 

15. అతడు నూనెబుడ్డిని తీసికొని తన ఎడమ అరచేతిలో కొంచెము తైలము పోసికోవలయును.

16. కుడిచేతి వ్రేలితో ఆ ఎడమచేతిలోని తైలమును కొద్దిగా తీసికొని ఏడుసార్లు దేవుని సన్నిధిలో చిలుకరింపవలయును.

17. ఎడమ అరచేతిలోని తైలమును కొద్దిగా తీసికొని శుద్ధినిపొందువాని కుడిచెవి అంచుమీద, కుడిచేతి బొటన వ్రేలిమీద, కుడికాలి బొటనవ్రేలి మీద పూయవలయును. దోషపరిహారార్ధబలి నెత్తురును పూసినట్లే ఈ తైలమును పూయవలయును.

18. యాజకుడు తన చేతిలో మిగిలియున్న తైలమును, శుద్ధిని పొందువాని తలమీద పోయును. ఈ రీతిగా అతడు ప్రభువు సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయవలయును.

19-20. అటుపిమ్మట యాజకుడు పాపపరిహార బలిని అర్పించి శుద్ధిజరుపును. కడన దహనబలికి ఉద్దేశింపబడిన గొఱ్ఱెపిల్లను వధించి దానిని ధాన్యబలితోపాటు పీఠముమీద దహించును. ఈ రీతిగా ప్రాయశ్చిత్తము చేయగా కుష్ఠనయమయినవాడు శుద్ధినిబడయును.

21. శుద్ది పొందువాడు పేదవాడైనచో దోష పరిహారబలికిగాను ఒక్క మగగొఱ్ఱెపిల్లను కొనివచ్చిన చాలును. దానిని ప్రభువు ఎదుట అల్లాడింపబడు అర్పణగా అర్పింపవలయును. నూనె కలిపిన ఒక కుంచెడు గోధుమపిండిని, ఒక బుడ్డిలో మూడవ వంతు ఓలివునూనెను కొనివచ్చిన చాలును.

22. ఇంకను అతడు తన తాహతుకు తగినట్లుగా రెండు తెల్లగువ్వలనో లేక రెండు పావురపుపిల్లలనో కొని రావలయును. వానిలో ఒకటి పాపపరిహారబలికి మరియొకటి దహనబలికి.

23. అతడు శుద్ధిచేయించు కొనమొదలు పెట్టిన ఎనిమిదవనాడు వానినన్నిటిని గుడార ప్రవేశద్వారమునొద్ద ఉండు యాజకుని వద్దకు కొనితేవలయును.

24. యాజకుడు దోషపరిహార గొఱ్ఱె పిల్లను, ఒక గిన్నెలో నూనెను గైకొని ప్రభువు ముందట అల్లాడింపబడు అర్పణగా అర్పించును.

25. గొఱ్ఱెపిల్లను వధించి దాని నెత్తుటిని కొంత తీసుకొని శుద్ధిని బడయువాని కుడిచెవి అంచునకు, కుడిచేతి బొటనవ్రేలికి, కుడికాలి బొటనవ్రేలికి పూయవలయును.

26-27. యాజకుడు నూనెను తన ఎడమ అరచేతిలో పోసికొని, కుడిచేతి వ్రేలితో దానిని ఏడుసార్లు ప్రభువు సన్నిధిలో చిలుకరించును.

28. ఆ నూనెను కొంత శుద్ది పొందువాని కుడిచెవి అంచుమీదను, కుడిచేతి బొటనవ్రేలి మీదను, కుడికాలి బొటనవ్రేలిమీదను పూయును. దోషపరిహారబలి రక్తమును పూసినట్లే ఈ నూనెను కూడ పూయవలయును.

29. యాజకుడు తన ఎడమచేతిలో మిగిలి యున్న నూనెను శుద్ధిని బడయువాని తలమీద పోసి అతనికి ప్రాయశ్చిత్తము చేయవలయును.

30-31. తరువాత అతడు తన తాహతుకు తగినట్లుగా ఒక పావురమునుగాని లేక ఒక తెల్లగువ్వనుగాని పాప పరిహారబలిగా సమర్పించును. రెండవ దానిని ధాన్యబలితో పాటు దహనబలిగా అర్పించును. ఈ రీతిగా యాజకుడు ప్రాయశ్చిత్తము చేయును.

32. కుష్ఠనుండి విముక్తి చెందిన పిదప ప్రాయశ్చిత్తమునకు గాను పశువులను అర్పింపలేని పేదవానిని గూర్చిన, నియమములివి.”

33. ప్రభువు మోషే అహరోనులతో ఇట్లనెను:

34-35. "మీరు నేను వారసత్వముగా ఈయనున్న కనాను మండలమును చేరుకొనిన తరువాత నేనట మీలో ఎవరి ఇంటికైన కుష్ఠ సోకునట్లు చేయుదునేని ఆ ఇంటి యజమానుడు యాజకునివద్దకు వెళ్ళి తన ఇంటికి కుష్ఠ సోకినదని తెలియజేయవలయును.

36. యాజకుడు ఆ ఇంటిని పరీక్షించుటకు వెళ్ళకముందు ఆ ఇంటియందలి వస్తువులన్నిటిని వెలుపల పెట్టించును. లేదేని ఆ ఇంటిలోని వస్తువులన్ని అశుద్ధములగును. అటుతరువాత అతడు ఆ ఇంటిలోనికి పోవును.

37-38. ఆ ఇంట ఎఱ్ఱని పొడలుగాని లేక తెల్లని పొడలు గాని గోడలను తినివేయుచున్నచో, అతడు ఆ ఇంటినుండి వెలుపలికి వచ్చి, దానిని ఏడునాళ్ళపాటు మూయించును.

39. ఏడవనాడు ఆ ఇంటిని మరల పరీక్షించును. పొడలు గోడలమీద వ్యాపించి ఉన్నచో,

40. ఆ పొడలు సోకిన రాళ్ళను గోడలలోనుండి తొలగించి పట్టణము వెలుపల ఏదైన అశుద్ధమైన తావున పడవేయుడని ఆజ్ఞాపింపవలయును.

41. అటుపిమ్మట గోడల లోపలి భాగములను గోకివేసి ప్రోగైన అలుకుడు మట్టిని నగరము వెలుపల ఏదైన అశుద్ధమైన తావున పోయింప వలయును.

42. తొలగించిన రాళ్ళకు బదులుగా క్రొత్త రాళ్ళను పేర్చి గోడలను మరల అలుకవలయును.

43. రాళ్ళను తొలగించి గోడలను గోకి క్రొత్తగా అలికిన తరువాతకూడ పొడలు మరల కన్పించెనేని

44. యాజకుడు వచ్చి ఇంటిని పరీక్షింపవలయును. పొడలు మరల వ్యాపించియుండెనేని ఆ ఇంటికి కుష్ఠ సోకినట్లు. అది అశుద్ధమైన ఇల్లు.

45. కనుక ఆ ఇంటిని పడగొట్టవలయును. దాని రాళ్ళను, కొయ్యను, అలుకుడు మట్టిని ఎత్తి నగరము వెలుపల ఏదైన అశుద్ధమైన తావున పడవేయవలయును.

46. అశుద్ధముగా ఉన్నందున మూసివేయబడి యున్న ఇంటిలో ఎవడైనను అడుగుపెట్టెనేని అతడు సాయంకాలము వరకు అశుద్దుడగును.

47. దానిలో నిద్రించువాడుకాని, అన్నము తినువాడు కాని బట్టలు ఉతుకు కోవలయును.

48. కాని యాజకుడు ఇంటిని పరీక్షింపవచ్చినప్పుడు, కొత్తగా అలికిన తరువాత అందలి పొడలు వ్యాపించియుండవేని అతడు దానిని శుద్ధముగా నిర్ణయింపవలయును. ఎందుకన గోడల మీది కుష్ఠ సమసిపోయినది.

49. యజమానుడు ఇంటిని శుద్ధి చేయించుటకు గాను దోషపరిహారార్ధబలికి రెండు పక్షులను, దేవదారు కొయ్యను, ఎల్లని దారమును, హిస్సోపు రెమ్మను కొనిరావలయును.

50.. స్వచ్చమైన ప్రవాహజలము మీద ఒక పక్షిని మట్టిపాత్రలో చంపవలయును.

51. దేవదారు కొయ్యను, హిస్సోపురెమ్మను, దారమును, బ్రతికియున్న పక్షిని అన్నిటిని ప్రవహించు జలముపై చంపిన పక్షి నెత్తురులో మరియు ప్రవాహజలములో ముంచి, వాటితో ఇంటిని ఏడుసార్లు చిలుకరింపవలయును.

52. ఈ రీతిగా అతడు పక్షిరక్తముతో, స్వచ్చమైన నీటితో, బ్రతికియున్న పక్షితో, దేవదారు కొయ్య, ఎఱ్ఱని దారము, హెస్సోపురెమ్మతో ఇంటిని శుద్ధి చేయవలయును.

53. తరువాత వెలుపలి పొలములోనికి ఎగిరిపోవుటకు రెండవపక్షిని వదలి వేయవలయును. ఈ రీతిగా కుష్ఠసోకిన ఇంటికి ప్రాయశ్చిత్తముచేయగా నిర్మలమగును.

54-56. నరులకు, ఇండ్లకు, బట్టలకు సోకెడు కుష్ఠను గూర్చి, వాపులు, పొక్కులు, నిగనిగలాడు పొడలు మొదలగువానిని గూర్చి నియమములివి.

57. ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో, ఎప్పుడు పవిత్రుడగునో తెలియజేయుటకు కుష్ఠమును గూర్చిన విధి యిదియే.

1-2. ప్రభువు మోషే అహరోనులతో ఇట్లు నుడివెను: “మీరు యిస్రాయేలీయులతో ఇట్లు చెప్పుడు.

3. మీలో ఎవరికైనను (వ్యా ధివలన) రేతఃస్ఖలనము కలిగెనేని అది అశుచికరము. అది దేహము నుండి వెలుపలికి వచ్చినను, రాకుండినను అశుచికరమైనదే. 

4. రేతఃస్ఖలనము కలిగిన మనుష్యుడు పండుకొనిన పడక, కూర్చుండిన ఆసనము కూడ అశుచికరములగును.

5-6. అతడు పండుకొనిన మంచమునుగాని, కూర్చుండిన ఆసనమునుగాని ముట్టుకొనినవాడు బట్టలు ఉతుకుకొని స్నానము చేయవలయును. సాయంత్రమువరకును అతడు మైలపడి యుండును.

7. అతనిని ముట్టుకొనువాడు బట్టలు ఉతుకుకొని స్నానము చేయవలయును. అతడు సాయంత్రమువరకు మైలతోనుండును.

8. అట్టి మనుష్యుని ఉమ్మి శుద్ధి చేసికొనియున్న వానిమీద పడినను అతడు బట్టలు ఉతుకుకొని స్నానము చేసి సాయంత్రమువరకు మైలపడి ఉండును.

9. అతడు ఎక్కి ప్రయాణించు ఎట్టి ఆసనమైనను మైలపడును.

10. అతడు కూర్చుండిన వస్తువు దేనినైన ముట్టుకొనిన వాడు సాయంత్రమువరకు మైలపడి ఉండును. అట్టి వస్తువులను తీసికొనిపోవువాడు బట్టలు ఉతుకుకొని స్నానముచేసి సాయంకాలమువరకు మైలపడి ఉండును.

11. అట్టి మనుష్యుడు చేతులు కడుగుకొనకయే ఎవనిని అంటుకొన్నను వాడుకూడా బట్టలు ఉతుకు కొని స్నానముచేసి సాయంత్రమువరకు మైలతో నుండును.

12. అతడు అంటుకొనిన మట్టికుండలను పగులగొట్టవలయును. కొయ్య సామగ్రిని కడుగవలయును.

13. అతనికి జబ్బు నయమయ్యెనేని ఏడు రోజులు ఆగి శుద్ది చేయించుకొనవలయును. అతడు బట్టలు ఉతుకుకొని స్వచ్చమైన నీటిలో స్నానముచేసి శుద్ధిని పొందును.

14. ఎనిమిదవనాడు రెండు పావురములనో లేక రెండు తెల్లగువ్వలనో గైకొని ప్రభువు సమావేశపుగుడారము ప్రవేశద్వారమునొద్ద నుండు యాజకుని చెంతకు రావలయును.

15. యాజకుడు ఆ పక్షులలో ఒక దానిని పాపపరిహారబలిగా, మరియొకదానిని సంపూర్ణదహనబలిగా సమర్పించును. ఈరీతిగా యాజకుడు అతని రేతఃస్ఖలనమునకుగాను ప్రభువు సమక్షమున ప్రాయశ్చిత్తము చేయవలయును.

16. ఎవనికైన సహజపద్ధతిలో రేతఃస్ఖలనము కలిగిన యెడల అతడు సర్వాంగసహితముగా స్నానము చేసి సాయంత్రమువరకు మైలపడి ఉండును.

17. ఆ రేతస్సు సోకిన బట్టలను, చర్మసామాగ్రినిగాని కడుగవలయును. అవి సాయంత్రమువరకు మైలపడి ఉండును.

18. వీర్యస్కలనమగునట్లు పురుషుడు స్త్రీని కూడినచో వారిరువురు స్నానము చేయవలయును. ఇరువురు సాయంకాలమువరకు మైలపడియుందురు.

19. స్త్రీ తన ఋతుకాలమున ఏడురోజులపాటు కడగాయుండును. ఆమెను ముట్టుకొనువారికి మరుసటి దినమువరకు మైలసోకును.

20. ముట్టుత పండుకొనిన మంచము, కూర్చుండిన ఆసనము మైలపడును.

21-22. ఆమె పరుండిన మంచమును కూర్చుండిన ఆసనమును ముట్టుకొనినవారు, వారి బట్టలు ఉతుకుకొని స్నానము చేయవలయును. వారు సాయంకాలమువరకు మైలపడియుందురు.

23. ఆమె పరుపుమీదగాని, ఆసనముమీదగాని ఉన్నప్పుడు వాటిని తాకిన వారికి గూడ సాయంత్రము వరకు మైలసోకును.

24. మైలపడిన దానిని కూడినవాడు ఏడునాళ్ళవరకు మైలపడును. అతడు పండుకొనిన మంచమునకు మైలసోకును.

25. ఏ స్త్రీకైనను వ్యాధివలన ఋతువు కాని కాలమునగూడ చాలనాళ్ళవరకు రక్తస్రావము జరుగుచుండినను, లేక ఋతువు ముగిసిన పిదపగూడ రక్తస్రావము కొనసాగుచుండినను, ఆమె రక్తము స్రవించినంత కాలము ఋతుమతియై ఉన్నప్పటివలెనే మైలపడి ఉండును.

26. అట్టి స్త్రీ పరుండిన మంచము కాని, కూర్చుండిన ఆసనముకాని తాను ముట్టుతయై ఉన్నప్పుడు వాడుకొనినమంచము, ఆసనములవలె మైలపడును.

27. ఆ వస్తువులను ముట్టుకొనిన వానికిని మైలసోకును. అతడు బట్టలు ఉదుకుకొని స్నానము చేయవలయును. సాయంకాలము వరకు మైలతోనుండును.

28. రక్తస్రావము ఆగిపోయినపిమ్మట ఏడురోజుల తరువాత ఆమె శుద్ధినిపొందును.

29. ఎనిమిదవనాడు ఆమె రెండు తెల్లగువ్వలనో లేక రెండు పావురములనో తీసికొని ప్రభువు సమావేశపు గుడార ప్రవేశద్వారమువద్దనున్న యాజకునిచెంతకు రావలయును.

30. యాజకుడు వానిలో నొకదానిని పాపపరిహారబలి గాను, మరియొక దానిని సంపూర్ణ దహనబలిగాను సమర్పించును. ఈ రీతిగా యాజకుడు ముట్టుతకు ప్రభువు సమక్షమున ప్రాయశ్చిత్తము చేయును.

31. కనుక మీరు మైలపడుటను గూర్చి యిస్రాయేలీయులను హెచ్చరించి, వారు శిబిరము మధ్యనున్న నా గుడారమును అమంగళము చేసి, ఆ అపవిత్రతవలన, వారు చావకుండునట్లు మీరు వారిని కాపాడవలయును.

32-33. రేతఃస్ఖలనము కలిగిన పురుషుని గూర్చి, ముట్టుతయైయున్న స్త్రీనిగూర్చి, మైలపడియున్న స్త్రీనికూడిన పురుషుని గూర్చిన నియమములివి.

1-2. ప్రభువునకు అపవిత్రమైన అగ్నిని సమర్పించి అహరోనుని ఇద్దరు కుమారులు ప్రాణములు కోల్పోయిన పిదప ప్రభువు మోషేతో ఇట్లు నుడివెను: “నీ సోదరుడైన అహరోనుతో ఇట్లు చెప్పుము. అతడు ప్రత్యేక కాలమున మాత్రమే అడ్డుతెర దాటి లోపలి గర్భగృహముననున్న మందసము మీది కరుణా పీఠము చెంతకుపోవచ్చును. ఈ ఆజ్ఞ మీరెనేని అతడు చచ్చును. నేను కరుణాపీఠము మీద మేఘములో సాక్షాత్కరింతును.

3. పాపపరిహారబలికిగాను కోడెను, సంపూర్ణ దహనబలికిగాను పొట్టేలును కొనివచ్చిన పిదప వాటితో అతడు గర్భగృహములోనికి ప్రవేశింప వచ్చును.

4. అటుల ప్రవేశింపకముందు అతడు స్నానముచేసి పవిత్రములయిన నారచొక్క ఒంటికి ఆనియుండు నారలాగు, నారకడికట్టు, నార తలపాగా ధరింపవలయును.

5. యిస్రాయేలు సమాజము పాపపరిహారబలి కొరకు రెండుమేకపోతులను, సంపూర్ణదహన బలి కొరకు ఒక పొట్టేలును కొనివచ్చి అహరోనునకు ఈయవలయును. 

6. అతడు తన స్వంత పాపములను తొలగించుటకై మొదట కోడెను పాపపరిహారబలిగా అర్పించుచూ తనకును, తన కుంటుంబమునకును ప్రాయశ్చిత్తము చెల్లించును.

7. పిమ్మట రెండు మేకపోతులను సమావేశపుగుడార ప్రవేశద్వారమువద్ద, ప్రభువు సాన్నిధ్యమున నిలబెట్టవలెను.

8. అపుడు అహరోను, ప్రభువు నిమిత్తము మరియు అసాసేలు' నిమిత్తము రెండుమేకలమీద రెండుచీట్లు వేయవలయును,

9. ప్రభువు నిమిత్తము చీటిపడిన మేకను అహరోను తీసుకొనివచ్చి పాపపరిహారబలిగా అర్పింవలయును. 

10. అసానేలు నిమిత్తము చీటిపడిన మేకను ప్రజలపాపములకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని ఎడారిలోనికి తోలివేయుటకు ప్రభువు సమక్షమున దానిని ప్రాణములతో ఉంచవలయును.

11. అహరోను తన పాపములకును, తన ఇంటి వారి పాపములకును పరిహారముగా కోడెను బలియిచ్చిన పిదప,

12. ప్రభువు సన్నిధిలోనున్న ధూపపీఠముమీది నిప్పుకణికలతో నింపబడిన ధూప పాత్రమును, తన గుప్పిళ్ళతో మేలిమి సాంబ్రాణిని గైకొని అడ్డుతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావ కుండునట్లు

13. అతడు ప్రభువు ఎదుట సాంబ్రాణి పొగవేసి ఆ పొగమబ్బుతో మందసముమీది కరుణా పీఠమును కప్పివేయవలయును.

14. అటు తరువాత అతడు చేతివ్రేలితో కోడెనెత్తురును కొంత తీసికొని కరుణాపీఠము మీద తూర్పువైపు చిలుకరింపవలయును. కరుణాపీఠము ఎదుట నేలమీద ఏడు మార్లు చిలుకరింపవలయును.

15. ఆ తరువాత అతడు ప్రజల పాపపరిహార బలికొరకు నియమింపబడిన మేకను వధించి దాని నెత్తురును గూడ అడుతెర లోపలికి కొనిపోవలయును. కోడె నెత్తురునువలె ఈ మేకనెత్తురునుగూడ కరుణా పీరముమీదను, దానిముందటను చిలుకరింపవలయును.

16. ప్రజల పాపమువలనను, వారి అపవిత్రతవలనను, అతిక్రమములవలనను మైలపడిపోయిన పరిశుద్ధస్థలమునకు అతడు ఈరీతిగా నిష్కృతి చేయవలయును. శిబిరము మధ్యలోనుండు సమావేశపుగుడారము ప్రజల అపవిత్రతవలన మైలపడిపోయినది. దానికిని అహరోను పై రీతిగానే ప్రాయశ్చిత్తము చేయవలయును.

17. పవిత్రస్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోయినది మొదలు, అతడు తన నిమిత్తమును, తన ఇంటివారి నిమిత్తమును, యిస్రాయేలీయుల సమస్తసమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తముచేసి బయటకు వచ్చువరకు ఏ మనుష్యుడును సాన్నిధ్యపు గుడారములో ఉండరాదు. 

18. అంతట అహరోను ప్రభువు సాన్నిధ్యమునున్న బలిపీఠము చెంతకువచ్చి దానికి కూడ ప్రాయశ్చిత్తము చేయవలయును. ఎద్దునెత్తురును, మేకనెత్తురును కొద్దిగా తీసికొని ఆ పీఠము కొమ్ములకు పూయవలయును.

19. చేతి వ్రేలితో ఆ నెత్తురును ఏడుమార్లు పీఠముమీద చిలుకరింపవలయును. ఈ రీతిగా అతడు యిస్రాయేలీయుల అపవిత్రతనుండి బలిపీఠమును శుద్ధిచేసి దానిని పవిత్రము చేయును.

20. పవిత్రసలమునకును, సమావేశపు గుడారమునకును, బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసిన పిదప అహరోను అసాసేలు కొరకు ఉద్దేశింపబడిన రెండవమేకను కొనిరావలయును.

21. అతడు ఆ మేక మీద చేతులు చాచి యిస్రాయేలీయుల అక్రమములను, నేరములను, పాపములను ఒప్పుకొని వానినెల్ల దాని తలమీద మోపవలయును. ఆ పిమ్మట ముందుగానే నియమింపబడిన ఒక మనుష్యునిచే దానిని ఎడారికి తోలింపవలయును.

22. ఆ మేక ప్రజల పాపముల నెల్ల తనపై వేసికొని ఎడారికి మోసికొనిపోవును.

23. తదుపరి అహరోను గుడారమునకు తిరిగి వచ్చి మునుపు గర్భగృహమున ప్రవేశించుటకు గాను తాను తాల్చియున్న నారవస్త్రములను తొలగించి వానిని అచట వదలివేయును.

24. అతడు పవిత్ర స్థలమున స్నానముచేసి సొంతబట్టలను తాల్చి వెలుపలికి వచ్చి తన పాపములకును, ప్రజలపాపములకును నిష్క్రతిగా దహనబలులు అర్పింపవలయును.

25. ఆ పశువుల క్రొవ్వును పాపపరిహారబలిగా పీఠముమీద కాల్చి వేయవలయును.

26. అసాసేలు నిమిత్తము చీటిపడిన మేకను తోలివచ్చినవాడు బట్టలు ఉతుకుకొని స్నానముచేసి శిబిరమునకు రావచ్చును.

27. పరిహారబలిగా అర్పింపబడిన కోడెనెత్తురును, మేకనెత్తుటిని పాపములకు ప్రాయశ్చిత్తము చేయుటకు గర్భగృహములోనికి కొనిపోయిరిగదా! వాని కళేబరములను శిబిరము వెలుపలికి కొనిపోవలయును. అచట వానిచర్మమును, మాంసమును, పేడను కాల్చివేయవలయును.

28. వానిని దహించినవాడు బట్టలు ఉతుకుకొని స్నానము చేసిన తరువాత శిబిరమునకు తిరిగివచ్చును.

29. ఇవి మీకు శాశ్వతనియమములు కావలయును. ఏడవనెల పదియవదినము యిస్రాయేలీయులును, వారితో వసించు పరదేశులును పనిని విరమించుకొని ఉపవాసము ఉండవలయును.

30. ఆ దినమున మిమ్ము శుద్ది చేయుటకుగాను మీ పాపములకు ప్రాయశ్చిత్తము చేయబడును. దాని వలన మీ పాపములెల్ల తొలగి మీరు దేవుని ఎదుట దోషములేని వారగుదురు.

31. అది మీకు విశ్రాంతి దినము, ఉపవాసదినము. ఈ నియమములు మీకు కలకాలము వర్తించును.

32. అభిషేకము పొంది తన తండ్రికి అనుయాయిగా నియమింపబడిన ప్రధానయాజకుడు మాత్రమే పై ప్రాయశ్చిత్తము జరుపుటకు అర్హుడు. అతడు పవిత్ర నారవస్త్రములను ధరించి,

33. పవిత్ర స్థలమునకును, సమావేశపు గుడారమునకును, పీఠమునకును, యాజకులకును, ప్రజలకును ప్రాయశ్చిత్తము చేయును.

34. ఈ నియమములు మీకు కలకాలము వర్తించును. యిస్రాయేలీయుల పాపములకు ప్రాయశ్చిత్తము చేయుటకు ఈ కట్టడను ఏడాదికి ఒకమారు జరిపింపవలయును.” మోషే ప్రభువు ఆజ్ఞాపించినట్లే చేసెను.

1. ప్రభువు మోషేతో ఇట్లు నుడివెను:

2. “నీవు అహరోనునకును, అతని కుమారులకును, యిస్రాయేలు ప్రజలకును నా ఆజ్ఞలను ఎరిగింపుము.

3-4. యిస్రాయేలీయులలో ఎవడైన ఎద్దునుగాని, మేకనుగాని, గొఱ్ఱెనుగాని బలిగా సమర్పింపగోరెనేని తన శిబిరమునగాని లేక ఆ శిబిరమునకు వెలుపల గాని వధింపరాదు. మొదట దానిని సమావేశపు గుడారపు ప్రవేశద్వారమువద్దకు కొనివచ్చి అచట ప్రభువునకు అర్పింపవలయును. ఈ నియమము మీరినవాడు నెత్తురును చిందించినట్లే. అతనిని యిస్రాయేలు సమాజమునుండి వెలివేయవలయును.

5. అనగా యిస్రాయేలీయులు ఇంతకుముందు పొలముననే చంపెడు పశువులను ఇకమీదట ప్రభువు సన్నిధికి కొనిరావలయును. వానిని సమావేశపు గుడార ప్రవేశద్వారము చెంతనున్న యాజకుని వద్దకు కొని వచ్చి అచ్చట సమాధానబలిగా అర్పింపవలయును.

6. యాజకుడు ఆ పశువుల నెత్తురును గుడార ప్రవేశ ద్వారముచెంతనున్న బలిపీఠము కొమ్ములపై చిలుకరించును. వాని క్రొవ్వును పీఠముపై దహింపగా ఆ సువాసనవలన ప్రభువు సంతృప్తి చెందును.

7. యిస్రాయేలీయులు మేకల రూపముననున్న దబ్బర దేవత 'సతేరు''నకు పొలములలో పూర్వమువలె బలులు అర్పింపరాదు. అటుల చేసినచో వ్యభిచరించినట్లగును. ఇది తరతరములవరకు యిస్రాయేలీయులకు శాశ్వతనియమము కావలయును.

8-9. వారికి ఈ విధముగా చెప్పుము: యిస్రాయేలీయులు, వారిచెంత వసించు పరదేశులు దహనబలినైనను మరి ఏ బలినైనను సమావేశపు గుడారము ప్రవేశద్వారమునొద్ద తప్ప మరి ఎచ్చటనైనను అర్పించెదరేని సమాజమునుండి వెలివేయబడుదురు.

10. యిస్రాయేలీయులుగాని, వారితో వసించు పరదేశులుగాని నెత్తుటిని భుజింతురేని నేను వారికి విము ఖుడనై వారిని శిక్షించి సమాజమునుండి వెలివేయుదును.

11. రక్తము దేహమునకు ప్రాణము. కనుకనే ఈ నెత్తురును బలిపీఠముమీద చిలుకరించి మీ పాపములకు ప్రాయశ్చిత్తము చేయుటకుగాను, దానిని మీకు ఇచ్చితిని. నెత్తురు దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును.

12. కావుననే యిస్రాయేలీయులు కాని, వారితో వసించు పరదేశులుకాని నెత్తురును భుజింపరాదని నేను కట్టడచేసితిని..

13. యిస్రాయేలీయులు, వారితో వసించు పరదేశులు శుచికరమైన జంతువునైనను, పక్షినైనను వేటాడి పట్టుకొందురేని మొదట దాని నెత్తురును నేలమీదపిండి మట్టితో కప్పివేయవలయును.

14. ప్రతిప్రాణి ప్రాణము దాని నెత్తురులో ఉన్నది. కనుకనే నేను యిస్రాయేలీయులు నెత్తురును భుజింపరాదనియు, అటుల చేయువారు సమాజమునుండి వెలి వేయబడుదురనియు ఆజ్ఞాపించితిని.

15. యిస్రాయేలీయులు, వారితో వసించు అన్యదేశీయులు, సహజముగా చనిపోయిన జంతువును లేక క్రూరమృగములచే చంపబడిన జంతువును భుజింతురేని సాయంకాలమువరకు మైలపడియుందురు. బట్టలు ఉతుకుకొని స్నానముచేసిన పిమ్మట వారు పవిత్రులగుదురు.

16. ఈ నియమము. మీరినవారు దాని దోషమును భరింతురు.”

1-2. యిప్రాయేలీయులకు ఈ ఆజ్ఞలు వినిపింపుమని ప్రభువు మోషేతో చెప్పెను.

3. "నేను మీ ప్రభుడనైన దేవుడను. మీరు ఐగుప్తున వసించితిరి కదా! ఆ ప్రజలవలె ప్రవర్తింపకుడు. ఇప్పుడు నేను మిమ్ము కనాను మండలమునకు తోడ్కొనిపోనున్నాను. మీరు అచటి ప్రజలవలె వర్తింపకుడు. వారి ఆచారములను పాటింపకుడు.

4. మీరు నా ఆజ్ఞలను చేకొని వాని ప్రకారము నడచుకొనుడు. నేను మీ ప్రభుడనైన దేవుడను.

5. మీరు నా ఆజ్ఞలను, చట్టములను అనుసరింతురేని వానివలన జీవమును బడయుదురు. నేను ప్రభుడను.

6. మీలో ఎవరు తమ రక్తసంబంధులను వివస్త్రులను చేయరాదు. నేను మీ ప్రభుడను.

7. నీ తండ్రిని దిగంబరుని చేయరాదు. అతడు నీ తండ్రి. నీ తల్లిని వివస్త్రను చేయరాదు. ఆమె నీ తల్లి.

8. నీ తండ్రియొక్క ఇతర భార్యలను కూడి అతనిని అవమానపరుపవలదు.

9. నీ సోదరినికాని, మారు సోదరిని కాని కూడరాదు. ఆమె మీ ఇంట పెరిగినను, పెరగ కున్నను ఈ నియమము వర్తించును.

10. నీ మనుమ రాలిని కూడరాదు. అది నీకే అవమానకరము.

11. నీ తండ్రికి మరియొక భార్యవలన పుట్టిన యువతిని కూడరాదు. ఆమె నీకు మారుచెల్లెలు.

12. నీ మేనత్తను కూడరాదు. ఆమె నీ తండ్రికి బంధువు.

13. నీ తల్లి సోదరిని కూడరాదు. ఆమె నీ తల్లికి బంధువు.

14. నీ పినతండ్రి భార్యను కూడరాదు. ఆమె నీకు పినతల్లి.

15. నీ కోడలిని కూడరాదు. ఆమె నీ కుమారునకు భార్య.

16. నీ మరదలిని కూడరాదు. ఆమె నీ సోదరుని భార్య. 

17. నీవొక స్త్రీనికూడినచో మరల ఆమె కుమార్తెనో మనుమరాలినో కూడరాదు. వారు నీకు రక్తసంబంధులు అగుదురు. గనుక అది వావి వరుసలు లేని లైంగిక సంబంధమగును.

18. నీ భార్య బ్రతికియుండగా ఆమె సోదరిని పరిగ్రహింప రాదు, కూడరాదు.

19. ముట్టుతను కూడ రాదు.

20. పరుని భార్యను కూడరాదు. అట్టి కార్యమువలన నీవు అశుచిమంతుడవు అగుదువు.

21. మీ పిల్లలను మోలెకు దేవతకు దహనబలిగా అర్పింపరాదు. అట్టి చెయిదమువలన మీరు మీ ప్రభువైన దేవుని నామ మును అమంగళము చేయుదురు. నేను మీ ప్రభువును.

22. మీరు. స్వలింగ మైథునమునకు పాల్పడరాదు. అది జుగుప్స కలిగించు కార్యము.

23. స్త్రీ పురుషులు ఎవరైనను జంతుసంపర్కము చేయరాదు. అట్టి వైపరీత్యమునకు పాల్పడువారు అశుచిమంతులు అగుదురు.”

24. ఇట్టి క్రియల ద్వారా మీరు అపవిత్రులు కావలదు. ఇట్టి చెయిదములకు పాల్పడుటవలననే నేను మీ చెంతనుండి వెళ్ళగొట్టిన జనులు అపవిత్రులైరి.

25. వారి పాపములవలన ఈ నేల అపవిత్రమైనది. కనుక ప్రభువు ఈ నేలను శిక్షించి అది తనమీద వసించువారిని విసర్జించునట్లు చేసెను.

26-27. వారు హేయమైన కార్యములు చేసి ఈ దేశమును అపవిత్రము చేసిరి. కాని మీరట్లు చేయరాదు. మీరు యిస్రాయేలీయులైనను, మీ చెంతవసించు అన్యజాతి వారైనను ప్రభువు ఆజ్ఞలను, చట్టములను పాటింపవలెను.

28. అప్పుడు ఈ దేశము పూర్వము తన యందు వసించినవారిని విసర్జించినట్లుగా మిమ్ము విసర్జింపదు. 

29. ఇట్టి ఏహ్యమైన పనులు చేయువారు దైవప్రజల నుండి వెలివేయబడుదురు.

30. మీరు నా ఆజ్ఞలు పాటింపుడు. మీకు పూర్వము ఇచట వసించిన ప్రజలవలె మీరు నీచమైన పనులు చేయకుడు. ఇట్టి చెయిదములకు పాల్పడి అపవిత్రులు కావలదు. నేను మీ దేవుడనైన ప్రభుడను.”

1-2. ప్రభువు మోషేతో యిస్రాయేలీయులకు ఈ రీతిగా చెప్పుమనెను. “మీ దేవుడను ప్రభుడనైన నేను పవిత్రుడను. కనుక మీరును పవిత్రులైయుండుడు.

3. మీలో ప్రతివాడు తన తల్లిదండ్రులను గౌరవింపవలయును. విశ్రాంతిదినమును పాటింపవలయును. నేను మీ దేవుడనైన ప్రభుడను.

4. మీరు విగ్రహములను ఆరాధింపరాదు. లోహముతో విగ్రహములనుచేసి వానిని పూజింపరాదు. నేను మీ దేవుడనైన ప్రభుడను.

5. మీరు ప్రభువునకు సమాధానబలిని అర్పించునపుడు మొదట నేను ఆజ్ఞాపించిన బలి నియమములను పాటించి దానిని యోగ్యముగా సమర్పింపుడు.

6. ఆ బలినైవేద్యమును మొదటినాడో లేక రెండవనాడో భుజింపవలయును. మూడవనాటికి మిగిలియున్న దానిని కాల్చివేయవలెను.

7. ఆ నైవేద్యమును మూడవ నాడు కూడ భుజింతురేని అది అశుచికరమగును. అట్టి బలిని నేను అంగీకరింపను.

8. దానిని మూడవ నాడు భుజించువాడు నాకు అర్పింపబడిన పవిత్ర వస్తువును సామాన్య వస్తువువలె చూచినట్లగును. కనుక అతడు నా ప్రజలనుండి వెలివేయబడును.

9. మీరు పండిన పైరును కోసికొనునపుడు, గట్టుదాక కోయకుడు. పొలములోని పరిగలను అట్లే వదలివేయుడు.

10. మీ తోటలలో ద్రాక్షాపండ్లను కోయునపుడు రాలిన పండ్లను ఏరుటకు మరలి పోకూడదు. పేదలకు, పరదేశులకు వానిని వదలి వేయుడు. నేను మీ ప్రభుడనైన దేవుడను.

11. మీరు దొంగతనము, మోసము చేయకుడు. అబద్దమాడకుడు.

12. నా నామమున అసత్య ప్రమాణమును చేయకుడు. నా నామమును అమంగళము చేయకుడు, నేను ప్రభుడను.

13. మీ పొరుగువానిని వేధింపకుడు. వాని సొత్తు దోచుకొనకుడు, దొంగి లింపకుడు. మరునాటికి మునుపే మీరు కూలికి కుదుర్చుకొనినవాని కూలి చెల్లింపుడు.

14. మూగ వానిని శపింపకుడు. గ్రుడ్డివాడు నడచు త్రోవలో దేనినైనను అడ్డము పెట్టి అతడు పడునట్లు చేయకుడు. మీరు మీ ప్రభువునకు భయపడుడు. నేను మీ ప్రభుడను.

15. మీరు తగవులు తీర్పుచెప్పునప్పుడు న్యాయమును పాటింపుడు. పేదలకు పక్షపాతము చూపకుడు. సంపన్నులను అభిమానింపకుడు. న్యాయము ప్రకారము తీర్పుచెప్పుడు.

16. ఇరుగుపొరుగుయెడల వ్యతిరేకముగా తిరుగాడుచు చాడీలు చెప్పకుడు. నీ సోదరునికి ప్రాణహానిచేయకుడు. నేను ప్రభుడను.

17. నీ హృదయములో పొరుగువానిమీద ద్వేషము పెట్టుకొనకుడు. అతని తప్పిదమును గూర్చి అతనిని మందలింపుడు. అప్పుడు అతని మూలమున నీవు పాపము మూటకట్టు కొనకుందువు.

18. పొరుగువారి మీద పగతీర్చు కొనకుడు. వైరము పెట్టుకొనకుడు. నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపుడు. నేను ప్రభుడను.

19. మీరు నా ఆజ్ఞలను పాటింపుడు. ఒక రకపు జంతువుతో మరియొక రకపు జంతువును కలయ నీయకుడు. ఒకే పొలములో రెండురకముల విత్తనములు వెదజల్లకుడు. నూలు ఉన్ని కలిపి నేసిన బట్టలు తాల్పకుడు.

20. ఒకనికి ఒక బానిసపిల్ల ప్రధానము చేయబడినదనుకొనుము. ఆమెకు ఇంకను స్వాతంత్య్రము లభింపలేదు. అట్టి యువతిని మరియొకడు కూడెనేని వారిరువురిని శిక్షింపవచ్చునుగాని వధింపరాదు. ఆమె స్వేచ్చలేని బానిసకదా!

21. ఆమెను కూడినవాడు పాపపరిహారబలిగా ఒక పొట్టేలును సమావేశపు గుడార ప్రవేశద్వారము వద్దకు కొనిరావలయును.

22.యాజకుడు ఆ పొట్టేలును బలి ఇచ్చి అతని పాపమునకు ప్రాయశ్చిత్తము చేయును. ప్రభువు అతని తప్పిదమును మన్నించును.

23. మీరు ఆ వాగ్దాన దేశమున ప్రవేశించి, అచట మేలైన ఫలవృక్షములు నాటినచో, మూడేండ్ల పాటు వానిఫలములను అశుచికరముగా భావింపుడు. కనుక మూడేండ్లవరకు వానిని భుజింపవలదు.

24. నాలుగవయేడు కాచిన పండ్లన్నిటిని ప్రభువునకు సమర్పించి స్తుతింపుడు.

25. ఐదవయేడు మీరు ఆ పండ్లు ఆరగింపవచ్చును. ఇట్లు చేయుదురేని మీ చెట్లు అధికముగా కాయును. నేను మీ ప్రభుడనైన దేవుడను.

26. నెత్తురు ఉన్న మాంసమును భుజింపకుడు. మంత్రతంత్రములను వాడకుడు.

27. మీ తలకు ముందు గుండ్రముగా జుట్టు గొరిగించుకొనకుడు. అట్లే గడ్డపుపక్కలు కత్తిరించుకొనకుడు.

28. మృతుల కొరకు మీ శరీరములను కత్తులతో కోసికొనకుడు, పచ్చలు పొడిపించుకొనకుడు. నేను ప్రభుడను.

29. మీ దేశము వ్యభించరింపకయు, దుష్కామ ప్రవర్తనతో నిండకయు ఉండునట్లు, నీ కుమార్తె వ్యభిచారిణి అగుటకై ఆమెను వేశ్యగా చేయకుడు.

30. మీరు నేను నియమించిన విశ్రాంతిదినములను పాటింపుడు. నా మందిరమును గౌరవింపుడు. నేను ప్రభుడను.

31. చచ్చినవారితో సఖ్యసంబంధములు పెట్టుకొను భూతవైద్యులను సంప్రదింపకుడు. సోదెగాండ్లను వెదకి వారివలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు. అటులచేయుదురేని మీరు అశుచిమంతులగుదురు. నేను మీ ప్రభుడనైన దేవుడను.

32. వృద్ధులను సన్మానించి గౌరవింపుడు. ప్రభువు పట్ల భయభక్తులతో మెలగుడు. నేను ప్రభుడను.

33. మీ చెంత వసించు పరదేసులను హింసింపకుడు.

34. వారిని స్వజాతీయులవలె ఆదరింపుడు. మిమ్ము మీరు ప్రేమించుకొనునట్లే వారిని గూడ ప్రేమింపుడు. మీరు కూడ ఐగుప్తున పరదేశులై యుంటిరికదా! నేను మీ ప్రభుడనైన దేవుడను.

35. మీరు సరియైన కొలమానములను వాడుడు, కొలుచునపుడు కాని, తూకము వేయునపుడు కాని ఎవరిని మోసగింపకుడు.

36. సరియైన తక్కెడలను, తూనికరాళ్ళను, మానికలను ఉపయోగింపుడు. నేను మిమ్ము ఐగుప్తునుండి తోడ్కొనివచ్చిన ప్రభుడను.

37. మీరు నా ఆజ్ఞలను, చట్టములను పాటింపుడు. నేను ప్రభుడను.”

1-2. ప్రభువు మోషేను యిస్రాయేలీయులతో ఇట్లు చెప్పుమనెను: “మీలోగాని మీతో వసించు పరదేశులలోగాని ఎవడైన తన పిల్లలను మోలెకు దేవతకు అర్పించెనేని, సమాజమంతయు అతనిని రాళ్ళతో కొట్టి చంపవలయును.

3. అతడు తన పిల్లలను మోలెకునకు అర్పించుట వలన నా మందిరమును అపవిత్రము చేయును. నా నామమును అమంగళపరచును. కనుక నేనతనికి విరోధినై అతనిని నా సమాజమునుండి వెలివేయుదును.

4-5. యిస్రాయేలు సమాజము అతని చెయిదమును ఉపేక్షించి అతనిని సంహరింపదేని నేను స్వయముగా అతనికిని అతని కుటుంబమునకు విరోధిని అగుదును. నన్ను విడనాడి అతనితోగూడి మోలెకును ఆరాధించిన వారికందరికి నేను శత్రువును అగుదును. వారిని వారి సమాజమునుండి వెలివేయుదును.

6. ఎవరైన చనిపోయిన వారితో ఆవాహనము చేయు మాంత్రికులను సంప్రదింతురేని నేను వారికి విరోధిని అగుదును. అట్టివారిని వారి సమాజమునుండి వెలివేయుదును.

7. కనుక మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడు. నేను మీ ప్రభుడనైన దేవుడను.

8. నా ఆజ్ఞలను పాటింపుడు. మిమ్ము పవిత్రులనుగా చేయునది నేనే.

9. తల్లినిగాని తండ్రినిగాని శపించువాడు చంపదగినవాడు. అతని చావునకు అతడే బాధ్యుడగును.

10. ఎవడైన ఇతరుని భార్యతో వ్యభిచరించెనేని ఆ ఇరువురిని చంపవలసినదే.

11. ఎవడైన తన తండ్రి భార్యను కూడెనేని ఆ తండ్రిని అవమాన పరిచినట్లే. కనుక అతనిని అమెను ఇద్దరిని చంపవల యును. వారి మరణమునకు వారే పూచీపడుదురు.

12. ఎవడైన కోడలిని కూడెనేని వారిరువురిని చంపవలయును. అది వావివరసలులేని లైంగిక సంబంధము. వారి చావునకు వారే బాధ్యులు.

13. ఎవడైన తోడి వానితో స్వలింగమైథునమునకు పాల్పడెనేని వారు జుగుప్సాకరమైన కార్యము చేసినట్లగును. కనుక వారిరువురిని చంపవలయును. వారి చావునకు వారే పూచీపడుదురు.

14. ఎవడైన ఒక పడుచును, ఆమె తల్లినిగూడ పెండ్లియాడెనేని అది దుష్క్రియ. కావున ఆ మువ్వురిని అగ్నిలో కాల్చివేయవలయును. అది వావివరసలు లేని సంబంధము. ఇట్టి దుష్ప్రవర్తన మీకు తగదు.

15. ఎవడైన జంతుసంపర్కము చేసిన అతనిని, దానినికూడ చంపవలసినదే.

16. ఏ స్త్రీ అయినను జంతువును కూడుటకు దానిని సమీపించిన ఇరువురిని చంపవలసినదే. వారి చావునకు వారే బాధ్యులగుదురు.

17. ఎవడైన సొంత తండ్రికిగాని, తల్లికిగాని పుట్టిన మారుసోదరిని పెండ్లియాడి పరస్పర దిసమొలలను చూచినయెడల వారిరువురు ఒకరినొకరు అవమానపరచుకొన్నట్లగును. ఆ ఇద్దరిని అందరి ఎదుట బహిరంగముగా, చంపవలయును. మానాచ్చా దనము తీసి సోదరిని కూడినవాడు తన దోషమునకు తగిన ప్రతిఫలము అనుభవింపవలయును.

18. ఎవడైన ముట్టుతనుకూడెనేని అనగా, ఆమె రక్తమునకు ఆధారమైన ఆమె మర్మాంగముమీది బట్టలు అతడు తొలగించెనేని, అందులకు ఆమె అంగీకరించెనేని వారిరువురిని సమాజము నుండి వెలివేయవలయును.

19. ఎవడైన తన మేనత్తనుగాని, పినతల్లిని గాని కూడెనేని రక్తసంబంధులను అవమానపరచినట్లగును. కనుక వారిరువురు ఆ పాపఫలమును అనుభవింతురు. 

20. ఎవడైన పినతల్లిని కూడెనేని పినతండ్రినే అవమానపరచినట్లగును. వారిరువురును ఆ పాపఫలమును అనుభవింతురు. ఆ ఇరువురు సంతాన హీనులై మరణింతురు.

21. ఎవడైన తన సోదరుని భార్యను పెండ్లియాడెనేని అది అశుచితమగును. అతడు తన సోదరుని అవమానపరచినట్లగును. అతనికి ఆమెకు సంతానము కలుగదు.

22. మీరు నా ఆజ్ఞలను, చట్టములను తు.చ. తప్పకుండ పాటింపవలయును. అప్పుడు నేను మిమ్ము కొనిపోనున్న దేశమున మీరు నిలుతురు.

23. నేను మీ చెంతనుండి వెళ్ళగొట్టిన అన్యజాతి ప్రజల ఆచారములను మీరు పాటింపరాదు. వారు హేయమైన కార్యములు చేసి నాకు అసహ్యము పుట్టించిరి. కనుక నేను వారిని వెడలగొట్టితిని.

24. పాలు తేనెలు జాలువారు వారి దేశమును మీకిత్తునని మాట యిచ్చితిని. నేనే దానిని మీకు భుక్తము చేయుదును. నేను మీ దేవుడనైన ప్రభుడను. నేనే మిమ్ము అన్య జాతులనుండి వేరుచేసితిని.

25. కనుక మీరు జంతువులలోను, పక్షులలోను శుచికరమైనవేవో, అశుచికరమైనవేవో గుర్తింపవలయును. మీరు అశుచికరములైన జంతువులను, పక్షులను, కీటకములను వేరుచేయవలయును. వాటివలన మీరు అశుద్దులు కాకూడదు. నేనే వానిని అశుచికరములైన ప్రాణులుగా నిర్ణయించితిని.

26. మీరు పవిత్రులైయుండుడు. ప్రభుడనైన నేను పవిత్రుడను. నేను మిమ్ము వివిధ జాతులనుండి వేరుపరిచి నావారిని చేసికొంటిని. నా ప్రజలై యుండుడు.

27. మీలో ఏ పురుషుడైన, ఏ స్త్రీ అయినా చచ్చినవారి భూతములను ఆవాహము చేసెనేని, సోదెగాండ్రునైననేమి వారిని రాళ్ళతో కొట్టి చంపుడు. వారి చావునకు వారే పూచీపడుదురు.”

1. ప్రభువు మోషేను అహరోను కుమారులైన యాజకులతో ఇట్లు చెప్పుమనెను: “ఏ యాజకుడైన తన కుటుంబసభ్యులలో ఎవడైన చనిపోయినప్పుడు, అతని శవము చెంతకుపోయి శుచిత్వమును కోల్పో రాదు.

2-3. కాని అతడు. దగ్గరి బంధువైన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సోదరుడు, ఇంకను పెళ్ళికాక పుట్టినింటనే వసించుచున్న సోదరి శవములను మాత్రము సమీపింపవచ్చును.

4. అతడు తన ప్రజలలో ప్రధానుడు గనుక తనను అపవిత్రపరచుకొని శుచిత్వమును కోల్పోరాదు.

5. ఏ యాజకుడు శోకమును వెలిబుచ్చుచు తన తలగొరిగించుకోరాదు. గడ్డము ప్రక్కలను కత్తిరించు కోరాదు. శరీరమున కత్తితో గంట్లు పెట్టుకొనరాదు.

6. అతడు పవిత్రుడై ఉండవలయును. నా నామమును అమంగళము చేయరాదు. నైవేద్యములగు దహనబలులను నాకు అర్పించునది అతడే. కనుక అతడు పవిత్రుడై ఉండవలయును.

7. యాజకుడు కులటను గాని, విడాకులు పొందిన స్త్రీనిగాని పెండ్లియాడరాదు. అతడు దేవునికి పవిత్రమైనవాడు.

8. ప్రజలును యాజకుని పవిత్రునిగా ఎంచవలయును. ప్రభువునకు నైవేద్య ములు అర్పించునది అతడే. నేను పవిత్రుడనైన ప్రభుడను, మిమ్ము పవిత్రులను చేయువాడను.

9. ఏ యాజకుని పుత్రికయైన కులటయైనచో ఆమె తండ్రికి తలవంపులు తెచ్చును. కనుక ఆమెను నిలువున కాల్చివేయవలయును.

10. ప్రధానయాజకుని శిరస్సును అభిషేక తైలముతో అభిషేకింతురు. అతడు పవిత్రుడై నివేదిత యాజకవస్త్రములు తాల్చును. అట్టివాడు శోకసూచికముగ తల విరబోసికోరాదు. బట్టలుచించుకోరాదు.

11-12. అతడు అభిషిక్తుడై నాకు అర్పింపబడినవాడు. అట్టివాడు శుచిత్వమును కోల్పోరాదు. అతడు నా గుడారమునువీడి శవమున్న ఇంట ప్రవేశించెనేని, అది తనతండ్రి లేక తనతల్లి శవమైనను, నా గుడారమును అపవిత్రము చేసినట్లే అగును. నేను ప్రభుడను.

13. ప్రధానయాజకుడు కన్యను మాత్రమే పెండ్లి యాడవలయును.

14. వితంతువును గాని, వేశ్యను గాని, విడాకులు పొందిన స్త్రీనిగాని పెండ్లియాడరాదు. యాజక కుటుంబమునకు చెందిన కన్యను మాత్రమే చేపట్టవలయును.

15. ప్రభుడనైన నేను అతనిని పవిత్రునిగా చేయువాడను. కావున తన ప్రజలలో తన సంతతిని అపవిత్రపరచరాదు అని వారితో చెప్పుము.”

16. ఇంకను ప్రభువు మోషేకు ఈలాగు చెప్పెను.

17. నీవు అహరోనుతో ఇట్లు చెప్పుమనెను: “నీ వంశజులలో అంగవైకల్యము కలవారెవరును నాకు నైవేద్యములు అర్పింపరాదు. కలకాలము వారికి ఈ నియమము వర్తించును.

18-20. వికలాంగులు అనగా కుంటివారు, గ్రుడ్డివారు, ముఖమునందుగాని, శరీరమునందుగాని కురూపులు, చేయికాలు లేని అవిటివారు, గూనివారు, మఱుగుజ్జులు, నేత్రవ్యాధి, చర్మవ్యాధి కలవారు, నపుంసకులు నాకు నైవేద్యములు అర్పింపరాదు.

21. అహరోను వంశజులు ఎవరైనను వికలాంగులైనచో నాకు నైవేద్యములు అర్పింపదగ్గరకు రాకూడదు.

22. అట్టివారు నాకు అర్పింపబడిన పవిత్ర నైవేద్యములను అతిపవిత్ర నైవేద్యములను కూడ భుజింపవచ్చును.

23. కాని వారు వికలాంగులు కనుక అడ్డుతెర ఎదుటకును, బలిపీఠముచెంతకును రాకూడదు. వారు ప్రభుడనైన నేను పునీతము చేసిన ఈ పవిత్ర సామాగ్రిని అమంగళపరపకూడదు.” ,

24. ఈ సంగతులన్నిటిని మోషే అహరోనునకును, అతని కుమారులకును, యిస్రాయేలు ప్రజలకును తెలియజేసెను.

1. ప్రభువు మోషేతో ఇట్లనెను. అహరోను తోను, అతని కుమారులతోను ఇట్లు చెప్పుమనెను:

2. “మీరు పవిత్రమైన నా నామమును అమంగళము చేయకూడదు. యిస్రాయేలీయులు నాకు అర్పించు నైవేద్యములను పవిత్రముగా ఎంచవలయును. నేను ప్రభుడను.

3. నీ వంశజులలో అశుచిమంతుడైనవాడు ఎవడైనను యిస్రాయేలీయులు నాకర్పించు పవిత్ర నైవేద్యములు భుజించెనేని, అతనిని నా సన్నిధినుండి శాశ్వతముగా బహిష్కరింపవలయును. ఈ నేను ప్రభుడను.

4-5. అహరోను వంశజులలో కుష్ఠవ్యాధిగల వాడుగాని, పుండునుండి రసికారువాడుగాని, తాను శుచిమంతుడగువరకు నా నైవేద్యములను భుజింపరాదు. శవమును తాకిన వస్తువులు అంటుకొనినవాడు, రేతఃస్ఖలనము కలిగినవాడు, శుచిత్వములేని పురుగును, నరుని ముట్టుకొనినవాడు అశుచిమంతుడగును.

6. అట్టి యాజకుడు సాయంకాలమువరకు అశుచిమంతుడుగనేయుండును. కనుక అతడు సాయంత్రమున స్నానముచేయువరకు నైవేద్యములను భుజింపరాదు.

7. ప్రొద్దుగ్రుంకిన పిదప అతడు శుద్దుడగును. అప్పుడు మాత్రమే పవిత్రనైవేద్యములను ఆరగింపవచ్చును. 

8. యాజకుడు సహజముగా చనిపోయిన, లేక వన్యమృగములు చంపిన పశువును భుజింపరాదు. ఈ నియమము మీరినవాడు అశుద్దుడగును.

9. యాజకులెల్లరును నా ఆజ్ఞలు పాటింపవలయును. లేదని వారు పాపము మూటకట్టుకొని ప్రాణములు కోల్పోవుదురు. ప్రభుడనైన నేను వారిని పవిత్రులను చేసితిని.

10. యాజకులు కాని గృహస్థులు ఎవరును నైవేద్యములను ఆరగింపరాదు. యాజకుని ఇంటికి వచ్చిన అతిథిగాని అతని సేవకుడుగాని వానిని ముట్టుకోరాదు.

11. కాని యాజకుడు డబ్బుతో కొనితెచ్చు కొన్న బానిస అయిన లేక అతని ఇంట పుట్టిన బానిస అయినను వానిని భుజింపవచ్చును.

12. యాజకుని కుమార్తె ఎవరైన అన్యుడిని పెండ్లియాడెనేని ఆమె నైవేద్యములను ఆరగింపరాదు.

13. కాని ఆమె వితంతువైనను లేక విడాకులు పొందినదైనను సంతాన భాగ్యములేక బాల్యమున ఉన్నప్పటివలె పుట్టినింట వసించుచూ తండ్రి కొనివచ్చిన నైవేద్యములను భుజింపవచ్చును. అన్యులెవరును నైవేద్యములను ముట్టుకోరాదు.

14. ఎవరైన ప్రమాదవశమున వానిని తినిన యెడల ఆ భోజనము వెలను, మరి అదనముగా దాని ఐదవవంతు సొమ్మును కూడ కలిపి యాజకునకు ముట్టజెప్పవలయును.

15. యిస్రాయేలీయులు ప్రభువునకు అర్పించు పవిత్ర నైవేద్యములను వారు అపవిత్రపరుపరాదు.

16. అటుల చేసినవారు దోషపరిహార బలిని అర్పింపవలయును. ప్రభుడనైన నేను వాటిని పవిత్రము చేసితిని”.

17-19. ప్రభువు మోషేకు అహరోనుతోను, అతని కుమారులతోను, యిస్రాయేలీయులందరితోను ఇట్లు చెప్పుమనెను: “యిస్రాయేలీయులైనను, వారి చెంత వసించు పరదేశులైనను, మ్రొక్కుబడిగానైన లేక స్వేచ్చగాయైన దహనబలులను అర్పింతురేని ఆ బలిపశువులు అవలక్షణములులేని గోవులలో, గొఱ్ఱెలలో, మేకలలో మగదానిని అర్పింపవలయును.

20. లేదేని ప్రభువు వానిని అంగీకరింపడు.

21. ఎవరైన మ్రొక్కుకొనిగాని, స్వేచ్చగాగాని ప్రభువునకు ఎడ్లను, గొఱ్ఱెలను, మేకలను సమాధాన బలిగా అర్పింతురేని ఆ బలిపశువులు అవలక్షణములులేనివై యుండవలయును. లేనిచో ప్రభువు వానిని అంగీకరింపడు.

22. ప్రభువునకు అర్పించు జంతువులు కుంటివి, అవిటివి, అంగచ్చేదనము చేయబడినవి, గజ్జికురుపులు కలవియైయుండరాదు. అట్టివానిని ప్రభువు పీఠముపై బలిఈయరాదు.

23. మీరు స్వేచ్ఛాబలులు అర్పించునపుడు సరిగా పెరుగని పశువులనుగాని, వికృతరూపము కలవానినిగాని అర్పించిన అర్పింపవచ్చును. కాని మ్రొక్కుబడి బలులు అర్పించునపుడు మాత్రము అటుల చేయరాదు.

24. వృషణములు నలిగిన, గాయపడిన, కోసిన పశువులను ప్రభువునకు అర్పింపరాదు. మీ దేశమున ఈ పద్దతి చెల్లదు.

25. ప్రభువునకు బలిగా అర్పించుటకై పరదేశులు అట్టివానిని కొనివచ్చినను మీరు అంగీకరింపరాదు. అవయవలోపము ఉన్నందున అవి అంగీకారయోగ్యములుకావు.”

26. ప్రభువు మోషేతో ఇట్లు చెప్పెను:

27. “దూడయేగాని, గొఱ్ఱెపిల్లయేగాని, మేకపిల్లయేగాని పుట్టిన తరువాత వానిని ఏడు రోజులపాటు తల్లితో ఉండనీయవలయును. ఎనిమిదవనాటినుండి వానిని ప్రభువునకు బలిగా అర్పింపవచ్చును.

28. కాని తల్లిని, వాని పిల్లలతో కలిపి మీరు ఒకేనాడు ప్రభువునకు బలి ఈయరాదు.

29. మీరు ప్రభువునకు కృతజ్ఞతాబలిని అర్పించుబలి అంగీకారయోగ్యమైనదై యుండవలయును.

30. బలిపశువు మాంసమును మరునాటికి మిగులనీయకుండ ఆనాడే భుజింప వలయును. నేను ప్రభుడను.

31. మీరు నా ఆజ్ఞలను పాటింపుడు. నేను ప్రభుడను.

32. మీరు నా పవిత్రనామమును అమంగళము చేయకుడు. యిస్రాయేలీయులెల్లరును నన్ను పవిత్రునిగా గణింపవలయును. మిమ్ము పవిత్రులను చేయు ప్రభుడను నేనే.

33. నేను మిమ్ము ఐగుప్తునుండి తోడ్కొనివచ్చి మీకు దేవుడనైతిని. నేను ప్రభుడను.”

1-2. ప్రభువు మోషేను యిస్రాయేలీయులతో ఇట్లు చెప్పుమనెను: “ప్రభువు పండుగను, నియమిత దినములను కొనియాడుటకు ప్రోగైన జనులెల్లరును పవిత్రసమాజముగా ఒనగూడుదురు. నా పండుగలు ఇవి:

3. మీరు ఆరునాళ్ళు శ్రమించి పనిచేయవచ్చును. కాని ఏడవనాడు విశ్రాంతిదినము. ఆనాడు పనిచేయకుడు. ఆరాధనమునకు సమావేశముకండు. మీరు ఎచట వసించుచున్నను, ఆ దినమును ప్రభువునకు చెందిన దానినిగా భావింపుడు.

4. ఈ క్రింది ఉత్సవములను గూర్చి ప్రజలకు సకాలమున సమావేశమునకై ప్రకటింపుడు.

5. మొదటినెల పదునాలుగవనాటి సాయంత్రము పాస్క పండుగ ప్రారంభమగును.

6. అదే నెల పదునైదవనాడు పొంగని రొట్టెలపండుగ మొదలగును. ఏడుదినముల పాటు మీరు భుజించు రొట్టెలలో పులిపిడి ద్రవ్యమును కలుపరాదు.

7. మొదటిరోజున ప్రజలను ఆరాధనమునకు ప్రోగుజేయుడు. ఆనాడు మీరు జీవనోపాధికైన ఏ పనియుచేయకూడదు.

8. ఏడుదినములపాటు దహనబలులు అర్పింపుడు. ఏడవ నాడు ప్రభువును ఆరాధించుటకు సమావేశము కండు. ఆదినమున మీ జీవనోపాధికైన ఏ పనియు చేయరాదు.”

9-10. ప్రభువు మోషేను యిస్రాయేలీయులతో ఇట్లు చెప్పుమనెను: “ప్రభువు మీకు ఈయనున్న దేశము చేరుకొని, అచట పంటకోయునపుడు, తొలి వెన్నులను యాజకునిచెంతకు కొనిపొండు.

11. అతడు ఆ వెన్నులను ప్రభువునెదుట అల్లాడింపు అర్పణగా అర్పించును. అప్పుడు ప్రభువు మిమ్ము అంగీకరించును. విశ్రాంతిదినమునకు మరుసటినాడు యాజకుడు ఈ కానుక అర్పించును.

12. ఈ ధాన్యమును అర్పించు రోజుననే అవలక్షణములులేని ఏడాది ఈడుగల పొట్టేలును దహనబలిగా అర్పింపుడు.

13. దానితోపాటు రెండు కుంచముల గోధుమపిండిని నూనెతో కలిపి దహనబలిగా అర్పింపుడు. దాని సువాసనవలన ప్రభువు సంప్రీతుడగును. మరియు ముప్పావుబుడ్డి ద్రాక్షసారాయము కూడ అర్పింపుడు.

14. ఈ బలులన్నింటిని సమర్పించువరకు మీరు క్రొత్త ధాన్యమును రొట్టెగా చేసికొని, పచ్చిగాగాని, వేయించిగాని భుజింపరాదు. మీరు ఎచట నివసించినను, మీ వంశజులెల్లరును ఈ నియమములను కలకాలము పాటింపవలయును.

15. విశ్రాంతిదినమున తరువాతినాడు వెన్నులు అర్పింతురుగదా! ఆ వెన్నులు అల్లాడింపు అర్పణగా సమర్పించిన రోజునుండి ఏడువారములు లెక్క పెట్టుడు.

16. అటుల ఏడు విశ్రాంతిదినములు గడచిన పిదప ఏబదియవనాడు ప్రభువునకు నూతన ధాన్యబలిని అర్పింపుడు.

17. ప్రతి కుటుంబము రెండు రొట్టెలుకొని వచ్చి ప్రభువునెదుట అల్లాడింపు అర్పణగా అర్పింపవలయును. ఒక్కొక్క రొట్టెను రెండు కుంచముల గోధుమపిండితో పులిసిన ద్రవ్యము కలిపియే తయారు చేయవలయును. ఇవి ఆ యేటి పంటలోని ప్రథమ ఫలమునుండి తయారైన రొట్టెలు.

18. మీరు ఈ రొట్టెలతో పాటు ఏడాది ఈడుగల ఏడుగొఱ్ఱె పిల్లలను, ఒక కోడెదూడను, రెండు పొట్టేళ్ళను దహనబలిగా అర్పింపవలయును. వీనికి అవలక్షణములు ఏమియు ఉండరాదు. ఇంకను ధాన్యబలిని, ద్రాక్షసారాయబలిని కూడ అర్పింపవలయును. ఈ దహనబలి సువాసన వలన ప్రభువు సంతృప్తుడగును.

19. ఇదే సమయమున పాపపరిహారారబలిగా ఒక మేకపోతును, సమాధానబలిగా ఏడాది ఈడుగల రెండుగొఱ్ఱెపిల్లలను కూడ అర్పింపుడు.

20. తొలివెన్నులతో చేసిన రొట్టెలతోపాటు యాజకుడు వానిని కూడ ప్రభువునెదుట అల్లాడింపు అర్పణగా అర్పించును. ఈ రొట్టెలు, ఈ రెండు గొఱ్ఱెపిల్లలు పవిత్రనైవేద్యములు. అవి యాజకులకే చెందును.

21. ఆ దినమున మీ జీవనోపాధియైన ఏ పనియు చేయకుడు. ఆరాధనకై ప్రజలెల్లరు ప్రోగుకండు. మీ వంశజులు ఎచటవసించుచున్నను ఈ నియమమును కలకాలము పాటింపుడు.

22. మీరు పొలమున పండిన పంట కోయునపుడు, గట్టువరకు కోయకుడు. తప్పిపోయిన వెన్నులను కోయుటకు మరల వెనుకకుపోవలదు. పేదలకొరకు, పరదేశులకొరకు ఆ పరిగలను వదిలి వేయుడు. నేను మీ దేవుడనైన ప్రభుడను.”

23-24. ప్రభువు మోషేను యిస్రాయేలీయులతో ఇట్లు చెప్పుమనెను: “ఏడవనెల మొదటినాడు మీరు విశ్రాంతిదినమును పాటింపవలయును. బూరలు ఊదినపుడు ప్రజలెల్లరు ఆరాధనమునకు ప్రోగుకండు.

25. ఆనాడు మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయరాదు. ప్రభువునకు దహనబలి అర్పింపుడు.”

26. ప్రభువు మోషేతో ఇట్లు నుడివెను:

27. “ఈ ఏడవనెల పదియవనాడు ప్రాయశ్చిత్తదినము. ఉపవాసముండి ప్రభువును ఆరాధించుటకు ప్రోగుకండు. దహనబలిని అర్పింపుడు.

28. ఆ రోజున మామూలు పని ఏమియు చేయరాదు. మీ పాపములను తొలగించుటకుగాను ఆనాడు దేవుని ఎదుట మీకు ప్రాయశ్చిత్తము జరుపబడును.

29. ఆ రోజు ఉపవాసము ఉండనివాడు సమాజము నుండి వెలి వేయబడును.

30. ఆ రోజున పనిచేసిన వానిని ప్రజలలో లేకుండ నేను నాశనము చేయుదును.

31. మీ వంశజులు ఎచట వసించినను ఆ దినమున పని చేయకూడదను నియమము కలకాలము వర్తించును.

32. ఈ నెల తొమ్మిదవనాటి సాయంత్రమునుండి పదియవనాటి సాయంత్రము వరకు ఉపవాసము ఉండి విశ్రాంతి దినమును పాటింపుము. అది మహా విశ్రాంతి దినము. ఈ దినము ఉపవాసము ఉండి పనిని విరమించుకొనుడు.”

33-34. ప్రభువు మోషేను యిస్రాయేలీయులతో ఇట్లు చెప్పుమనెను. “గుడారముల పండుగ ఏడవనెల పదునైదవ రోజున ప్రారంభమై. వారము రోజులపాటు కొనసాగును.

35. మీరు మొదటి రోజున సమావేశమై ప్రభువును ఆరాధింపుడు. ఆ రోజున జీవనోపాధియైన ఏ పనియు చేయకూడదు.

36. ఏడునాళ్ళపాటు ప్రభువునకు దహనబలులు అర్పింపుడు. ఎనిమిదవనాడు మరల ఎల్లరును సమావేశమై ప్రభువును ఆరాధింపుడు. దహనబలిని అర్పింపుడు. అది ఆరాధనరోజు కనుక ఆనాడు జీవనోపాధియైన ఏ పనియు చేయరాదు.

37. ప్రభువు నియమించిన విశ్రాంతిదినములతో పాటు మీరెల్లరును సమావేశమై ప్రభువును ఆరాధింపవలసిన ఉత్సవదినములు ఇవియే. ఈ తరుణమున ఆయాదినముల నియమిత పరిచర్యననుసరించి దహనబలులు, సంపూర్ణదహనబలులు ధాన్యబలులు, ద్రాక్ష సారాయబలులు, సామాన బలులను అర్పింపవలయును.

38. ఇంకను మీరు మామూలుగా ఆచరించు విశ్రాంతి దినములు: సమర్పించు కానుకలు, స్వేచ్ఛార్పణలు, మ్రొక్కు చెల్లించు అర్పణలు మాత్రమేకాక పై ప్రత్యేకబలులు కూడ అర్పింపుడు.

39. మీ పొలమున పండినపంటను కూర్చు కొనిన తరువాత, ఏడవనెల పదునైదవ రోజున ఈ ఉత్సవమును ప్రారంభించి ఏడునాళ్ళపాటు కొనసాగింపుడు. మొదటినాడు, ఎనిమిదవనాడు విశ్రాంతి దినములు.

40. మొదటినాడు మీ చెట్లమీద కాచిన మేలిపండ్లను, ఖర్జూరముల మట్టలను, గుబురు ఆకులుగల చెట్ల కొమ్మలను, వాగులపక్కన పెరుగు చెట్లకొమ్మలను చేతబట్టుడు. ఏడుదినములపాటు ప్రభువు పేరిట ఉత్సవముచేసికొని ఆనందింపుడు.

41. ఈ రీతిగా మీరు ప్రతియేడు ఏడవనెల ప్రభువు పేరిట ఏడుదినములు పండుగ చేసికోవలయును. ఇది మీ వంశజులకు శాశ్వతనియమము కావలయును.

42. మీరు ఈ పండుగను ఏడవ నెలలో జరుపుకోవలయును. అప్పుడు యిస్రాయేలీయులెల్లరు ఏడుదినములు పర్ణశాలలలో వసింపవలయును.

43. దీనివలన నేను మిమ్ము ఐగుప్తునుండి తరలించుకొని వచ్చినపుడు మీరు పర్ణశాలలలో వసించితిరని మీ సంతతివారెల్లరును తెలిసికొందురు. నేను మీ దేవుడనైన ప్రభుడను.”

44. ఈ రీతిగా మోషే యిస్రాయేలు ప్రజలు ప్రభువు పేరిట జరుపవలసిన ఉత్సవములగూర్చి తెలియజేసెను.

1. ప్రభువు మోషేతో ఇట్లు చెప్పెను:

2. “దీపములు వెలిగించుటకు శ్రేష్ఠమైన ఓలివు తైలమును కొనిరమ్మని యిస్రాయేలీయులతో చెప్పుము. అచట ఒక దీపము నిత్యము వెలుగుచుండవలయును.

3. గర్భగృహములోని నిబంధన మందసమునకు ముందట నున్న అడ్డుతెర ఎదుట అహరోను ఈ దీపమును వెలిగించుచుండవలయును. అది నిత్యము ప్రభువు ఎదుట సాయంకాలమునుండి ఉదయము వరకు వెలుగుచుండవలయును. ఇది శాశ్వతనియమము కావలయును.

4. అతడు పరిశుద్ధమైన దీపస్తంభము పైనున్న ప్రదీపములను నిత్యము ప్రభునియెదుట వెలుగునట్లు చక్కదిద్దవలయును.

5. గోధుమపిండితో పండ్రెండు రొట్టెలు చేయుడు. ఒక్కొక్క రొట్టెకు శేరుపిండి ఉండవలయును.

6. ఒక్కొక్క వరుసలో ఆరేసి రొట్టెల చొప్పున వానిని రెండువరుసలుగా ప్రభువు సన్నిధిలోనున్న బంగారు బల్లపై పేర్చుడు.

7. ఆ రెండు వరుసలమీద మేలిమి సాంబ్రాణిని పోయుడు. ఈ సాంబ్రాణి ప్రభువునకు అర్పించు నైవేద్యమునకు చిహ్నముగా నుండును. రొట్టెలకు మారుగా దానిని ప్రభువునకు దహనబలిగా అర్పింపవలయును.

8. కలకాలము ప్రతి విశ్రాంతి దినమున యిస్రాయేలీయుల సమాజమునుండి యాజకుడు ఈ రొట్టెలను తీసుకొని ప్రభువునెదుట ఉంచవలయును. యిస్రాయేలీయులు ఈ నిబంధనను శాశ్వతముగా పాటింపవలయును.

9. ఈ అహరోనునకు అతని సంతతి వారలకు చెందును. ఇవి ప్రభువునకు అర్పింపబడిన నైవేద్యములలో అతిపవిత్రములైనవి. కనుక యాజకులు వీనిని పవిత్రస్థలముననే భుజింపవలయును.”

10-11. ఒక యిస్రాయేలు వనితకు ఐగుప్తీయుని వలన పుట్టిన కుమారుడు ఒకడుండెను. ఆ వనిత పేరు షెలోమీతు, దాను వంశజుడైన దిబ్రి కుమార్తె. అతడు శిబిరమున ఎల్లరును చూచుచుండగా తోటి యిస్రాయేలీయునితో పోట్లాడెను. ఆ కలహమున అతడు దేవుని నామమును దూషించెను. కనుక అతనిని మోషే యొద్దకు కొనివచ్చిరి.

12. ప్రభువు చిత్తము తెలియువరకు అతనిని కావలిలో ఉంచిరి.

13. అప్పుడు ప్రభువు మోషేతో ఇట్లు నుడివెను.

14. 'ఆ దైవదూషకుని శిబిరము వెలుపలికి కొని పొండు. అతని దూషణమును వినినవారందరు వాని తలమీద చేతులుమోపి అతడు దోషియని నిర్ధారింపుడు. అటుపిమ్మట సమాజమంతయు వానిని రాళ్ళతో కొట్టి చంపవలయును.

15. నీవు యిస్రాయేలీయులతో ఇట్లు చెప్పుము. దేవుని దూషించువాడు తన తప్పునకు తాను బాధ్యుడగును.

16. అట్టివానిని పట్టి చంపవలయును. సమాజమంత అతనిని రాళ్ళతో కొట్టి చంపవలయును. యిస్రాయేలీయులు కాని, వారితో వసించు పరదేశులు కాని ప్రభునామమును దూషింతురేని వారిని తప్పక వధింపవలయును.

17. నరహత్యచేసిన వానిని వధింపవలయును.

18. కాని ఇతరుని పశువును చంపినవాడు, మరియొక పశువును పరిహారముగా ఈయవలయును. ప్రాణికి బదులుగా ప్రాణిని యిచ్చుట విధి.

19. ఎవడైన ఇతరునిమీద చేయిచేసికొనినచో, అతని మీదకూడ అట్లే చేయిచేసికోవలెను.

20. అతడు విరుగగొట్టినచో, అదేవిధమున అతనిని విరుగగొట్ట వలయును. ఇతరుని కంటినిగాని, పంటిని గాని పోగొట్టినచో, వాని కంటికిని, పంటికిని అదే గతి పట్టింపవలయును. అతడు చేసిన హానికి ప్రతిహాని చేయవలయును.

21. పశువును చంపినవాడు మరియొక పశువును ఈయవలయును. కాని మనుష్యుని చంపినవానిని చంపవలయును.

22. యిస్రాయేలీయులకును, వారిచెంత వసించు పరదేశులకును ఇదే నియమము చెల్లును. నేను మీ దేవుడనైన ప్రభుడను.”

23. మోషే ఈ మాటలను యిస్రాయేలీయులకు వినిపింపగా వారు దైవదూషకుని శిబిరము వెలుపలికి కొనిపోయి రాళ్ళతో కొట్టి చంపిరి. ఈ రీతిగా యిస్రాయేలీయులు ప్రభువు మోషేకు ఆజ్ఞాపించినట్లు పాటించిరి.

1-2. ప్రభువు సీనాయి కొండమీద మోషేతో మాట్లాడి యిస్రాయేలీయులకు ఈ రీతిగా చెప్పుమని చెప్పెను. “మీరు నేను మీకు ఈయనున్న దేశమును ప్రవేశించిన తరువాత నా గౌరవార్థముగా అచటి భూమిని ప్రతి ఏడేండ్లకు ఒకసారి సాగుచేయకుండ వదలివేయుడు.

3. ఆరేండ్లపాటు మీరు అచట భూములను సేద్యము చేయవచ్చును. ద్రాక్షలను పెంచవచ్చును. పంటను సేకరింపవచ్చును.

4. కాని ఏడవయేడు భూమికి పూర్ణవిశ్రాంతి లభింపవలెను. అది ప్రభువునకు నివేదితమైన వత్సరము. ఆ యేడు మీరు పొలమున పైరువేయరాదు, ద్రాక్షలను కాయింపరాదు.

5. దానియంతట అది పడి మొలచిన పైరును కూడ ఆయేడు కోయరాదు. మీరు సాగుచేయక వదలివేసిన ద్రాక్షలకుకాసిన కొలదిపాటి పండ్లనుకూడ సేకరింపరాదు. అది భూమికి పూర్ణవిశ్రాంతివత్సరము కావలయును.

6-7. మీరు ఆ యేడు పొలమును సాగుచేయకున్నను అది మీకును, మీ బానిసలకును, మీ కూలీలకును, మీ చెంత వసించు పరదేశులకును, మీ పెంపుడు జంతువులకును, మీ పొలమున తిరుగాడు వన్యమృగములకును చాలినంత పంట నిచ్చును. ఆ పొలమున పండినపంట అంతయు మీకు ఆహారమగును.

8. మీరు ఏడుసారులు ఏడేండ్లను లెక్క పెట్టుడు. అవి నలువది తొమ్మిది యేండ్లగును.

9. ఆ యేండ్లు గడచిన తరువాత ఏడవనెల పదియవ రోజున వచ్చు ప్రాయశ్చిత్త దినమున దేశమందంతట బూరలను ఊదింపుడు.

10. ఈ రీతిగా ఏబదియవయేటిని పవిత్రవత్సరముగా గణింపుడు. ఆ యేడు మీ దేశమున వసించు జనులందరికి స్వేచ్ఛ లభించునని చాటింపుడు. ఇది హితవత్సరము. ఈ యేడు ప్రతివాడు తనభూమిని తాను స్వాధీనము చేసికొనును. ప్రతిబానిస స్వేచ్చతో తన ఇంటికి వెడలిపోవును.

11. ఈ హితవత్సరమున మీరు విత్తనములు వేయరాదు. దానియంతట అది పడి మొలచిన పైరుకూడ కోయరాదు. మీరు సాగుచేయక వదలివేసిన ద్రాక్షలకు కాచినపండ్లు సేకరింపరాదు.

12. ఈ హితవత్సరమంత మీకు పవిత్రవత్సరము. ఈ యేడు మీరు పొలమున దానియంతట అది పండిన పంటనే భుజింపవలెను.

13. మీరు పూర్వము ఇతరులకు అమ్ముకొనిన భూములు ఈ యేడు మరల మీ పరమగును.

14. కనుక మీరు ఇతరులకు ఏది అమ్మినను, ఇతరుల నుండి ఏది కొనినను న్యాయసమ్మతముగా ప్రవర్తింపుడు.

15. మీరు పొరుగువానినుండి పొలమును కొనునపుడే హితవత్సరము ఇంక ఎన్ని యేండ్లు ఉన్నదాయని ఆలోచింపుడు. అప్పుడు ఎన్ని యేండ్ల పంట లభించునో తెలియును. దానిని బట్టి పొలమునకు ధర నిర్ణయింపుడు.

16. పంట యేండ్లు అధికముగా నున్నచో పొలము వెలకూడ అధికముగా నుండును. తక్కువగానున్నచో వెలకూడ తక్కువగా నుండును. పొలమును అమ్మువాడు అమ్మునది కొన్నియేండ్ల పంటయే.

17. మీలో ఎవడును తోటి యిస్రాయేలీయుని మోసగింపరాదు. నేను మీ దేవుడైన ప్రభుడను. నా పట్ల భయభక్తులు కలిగియుండుడు.

18. మీరు నా విధులను పాటింపుడు. అప్పుడు మీరు ఆ దేశమున సురక్షితముగా జీవింతురు.

19. ఆ దేశము సుభిక్షముగా ఫలించును, మీరు అట తృప్తిగా తిని చీకు చింతలేకుండ మనుదురు.

20. ఏడవయేడు విత్తనములు వేయక పంటను కోయకయున్నచో మరి మేమేమి భుజింతుమని మీరు అడుగవచ్చును.

21. నేను ఆరవయేడు మీ పొలమును దీవింతును. అది మీకు మూడేండ్లు పంటనిచ్చును.

22. మీరు ఎనిమిదవయేడు విత్తనములు వేయుచుండగా ఆరవయేటిపంటను తిందురు. పైగా తొమ్మిదవ యేడువరకు కూడ దానినే తిందురు. మీరు ఎనిమిదవయేటి పంటకొరకు ఎదురు చూచునపుడు పూర్వపుపంటను భుజింపవచ్చును. పొలము పూర్వయజమానికి ముట్టవలెను

23. మీలో ఎవడు భూమిని శాశ్వతముగా విక్రయింపరాదు. అది మీది కాదు, నాది. మీరు కేవలము దానిని వినియోగించుకొను అధికారము గల విదేశీయులవంటివారు.

24. మీకు స్వాస్థ్యమయిన ప్రతిపొలము మరల విడిపింపబడినట్లుగా దానిని అమ్ముకొనవలయును.

25. మీ సోదరుడు పేదవాడై తన పొలమును అమ్ముకొనినచో అతని సమీప బంధువు దానిని విడిపింపవచ్చినయెడల తన సోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును,

26. అట్టి సమీప బంధువులేని పేదవాడు తాను మరల సంపన్నుడైన పుడు ఆ పొలమును కొనవచ్చును.

27. అప్పుడు అతడు హితవత్సరమునకు ఇంక ఎన్ని ఏండ్లున్నవో లెక్కపెట్టి అన్నియేండ్ల పంటకు సరిపడిన సొమ్మును పొలము కొన్నవానికి చెల్లించి ఆ భూమిని స్వాధీనము చేసికొనవచ్చును.

28. కాని అతనికి ఆ సొమ్ము చెల్లించు తాహతు లేనిచో అది హితవత్సరము వచ్చు వరకు కొన్నవాని అధీనముననే ఉండును. హితవత్సరమున ఆ ఫొలము పూర్వ యాజమానికి ముట్టును.

29. ఎవడేని సురక్షిత పట్టణమునగల తన గృహమును అమ్ముకొనెనేని, తొలియేడు ముగియు లోపల దానిని తిరిగికొనవచ్చును.

30. కాని మొదటి యేడు ముగిసెనేని ఆ హక్కును కోల్పోవును. ఆ ఇల్లు శాశ్వతముగా దానిని కొనినవానికి, అతని తరతరములకు అది స్థిరముగా ఉండును. హితవత్సరము వచ్చినపుడు నూతన యజమానుడు ఆ ఇంటిని వదలి పెట్టనక్కరలేదు.

31. కాని అరక్షిత పట్టణములలో నున్న ఇండ్లు, బయలులోనున్న ఇండ్లతో సమానము. వానిని అమ్మినవానికి తిరిగి వానినెప్పుడైనను కొను హక్కుకలదు. అట్టి ఇండ్లను మొదట కొనినవాడు హితవత్సరము రాగానే వదలి పెట్టవలయును.

32. లేవీయులు వసించు నగరములలో వారు తమ ఆస్తిపాస్తులను ఎప్పుడైన తిరిగి విడిపించుకొన వచ్చును. ఇది శాశ్వతమైనది.

33. కాని ఏ లేవీయుడైన అట్టి నగరములోని ఆస్తిపాస్తులను విడిపింపజాలని యెడల హితవత్సరము వచ్చినపుడు అది లేవీయ నగరముననున్న లేవీయస్వంతదారునికి చెందును. లేవీయ నగరములోని లేవీయగృహములు శాశ్వత ముగా వారికే చెందును.

34. ఈ నగరములకు చుట్టుపట్టనున్న గడ్డిమైదానములు శాశ్వతముగా లేవీయులకే చెందును. కనుక అట్టి వానిని అమ్మరాదు.

35. తోటి యిస్రాయేలీయుడు ఎవడైన పేదవాడై పొట్టపోసికొనజాలనిచో నీవే అతనిని పరదేశునిగా పోషింపవలయును. అప్పుడు అతడు నీ ఇంటిపట్టుననే జీవించును.

36. కాని నీవు అతనినుండి వడ్డీ పుచ్చు కొనరాదు. నీ దేవునికి వెరచి అతనిని మీ మధ్య జీవింపనిమ్ము

37. వడ్డీ పుచ్చుకొను షరతుమీద నీవు అతనికి బాకీ. ఈయరాదు. అతనికి అమ్మిన భోజన పదార్ధముల మీదగూడ లాభము గణింపరాదు.

38. కనానుమండలమును మీకు భుక్తముగా నిచ్చుటకు నేను మిమ్ము ఐగుప్తునుండి తోడ్కొనివచ్చి మీకు దేవుడనైతినిగదా!

39. నీ తోటి యిస్రాయేలీయుడు ఎవడైన పేదవాడై నీకు అమ్ముడుపోయినచో నీవు అతనిచే బానిస పనులు చేయించుకోరాదు.

40. అతడు కూలి వానివలె లేదా పరదేశునివలె నీ ఇంటనుండి హిత వత్సరము వచ్చువరకు నీకు పనిచేయును.

41. తరువాత అతడు అతని పిల్లలు నిన్ను విడనాడి వెళ్ళిపోవుదురు. అతడు తన తెగవారియొద్దకు తిరిగిపోయి తన పూర్వులు ఆర్జించియిచ్చిన ఆస్తిని తిరిగి స్వాధీనము చేసికొనును.

42. యిస్రాయేలీయులు నేను ఐగుప్తునుండి తోడ్కొని వచ్చినవారు, నాకు సేవకులు కనుక వారిని ఇతరులకు బానిసలుగా అమ్మ రాదు.

43. నీవు నాకు భయపడి అతనిపై దయా దాక్షిణ్యములు చూపవలయును.

44. నీకు దాసదాసీలు కావలసివచ్చినచో చుట్టు పట్లనున్న అన్యజాతులనుండి కొనితెచ్చుకొమ్ము.

45. మీచెంత వసించు పరదేశుల పిల్లలను గూడ మీరు బానిసలుగా కొనవచ్చును. మీ దేశమున పుట్టిన ఇతరజాతుల సంతానము కూడ మీసొత్తు కావచ్చును.

46. అట్టివారిని మీరు గతించిన తరువాత మీ పిల్లలు కూడా శాశ్వతమైనసొత్తుగా వాడుకోవచ్చును. అట్టి జనము మీకు బానిసలు కావచ్చును. కాని మీ తోటి యిస్రాయేలీయులను మాత్రము మీరు కఠినముగా చూడరాదు. వారిని పాలింపరాదు.

47. మీ చెంత వసించు పరదేశి ఎవడైనను సంపన్నుడు అయ్యెననుకొందము. మీ తోటి యిస్రాయేలీయులలో ఎవడైనను దరిద్రుడై ఈ సంపన్నునికో లేక అతని అనుయాయికో బానిసగా అమ్ముడు పోయెననుకొందము.

48-49. అప్పుడు మీకు ఆ యిస్రాయేలీయుని బానిసత్వమునుండి విడిపించు బాధ్యత కలదు. అతని సోదరుడుగాని, అతని తండ్రికి తోబుట్టువుగాని, ఆ తోబుట్టువు కుమారుడుగాని, అతని కుటుంబసభ్యుడు ,ఎవడైననుగాని సొమ్ము చెల్లించి అతనిని బానిసత్వము నుండి విడిపింపవలయును. డబ్బున్నచో యజమానునికి సొమ్ము చెల్లించి అతడే స్వయముగా దాస్యవిముక్తి  పొందవచ్చును.

50. అతడు, అతని యజమానుడు ఇద్దరు కలిసి అతడు అమ్ముడుపోయిన సంవత్సరమునుండి రానున్న హితవత్సరము వరకుగల యేండ్లను లెక్కింపవలయును. ఈ యేండ్లకు జీతగానికి ఎంతసొమ్ము చెల్లింతురో అంతసొమ్ము అతడు యజమానునికి చెల్లించి బానిసత్వమును త్రేంచుకోవచ్చును.

51. అతని బానిసత్వము తీరుటకు ఇంక చాలయేండ్లు మిగిలియున్నచో, అన్నియేండ్లకు తగినంత సొమ్మును, అతడు తొలుత యజమానునినుండి పుచ్చుకొన్న ధనమునుండి తిరిగి ఇచ్చివేయవలయును.

52. అట్లే అతని బానిసత్వము తీరుటకు ఇంకను కొద్దియేండ్లు మాత్రమే మిగిలియున్నచో, ఆ యేండ్లకు తగినంత సొమ్ము మాత్రమే చెల్లింపవలెను.

53. ఈ లెక్కలు కట్టునపుడు బానిస ఏడాది జీతము, జీతగాని ఏడాది జీతముతో సమానము అనుకొనవలయును. అతని యజమానుడు అతనిపట్ల కటువుగా ప్రవర్తింపకుండు నట్లు జాగ్రత్తపడవలయును.

54. పైన చెప్పినరీతిగా అతడు విముక్తి పొందడేని హితవత్సరము వచ్చినపుడు అతడు, అతనిపిల్లలు తప్పక విడుదల పొందవల యును.

55. యిస్రాయేలీయులను నేను ఐగుప్తునుండి తోడ్కొనివచ్చితిని. కనుక వారు నాకే దాసులు. వారు నేను ఐగుప్తునుండి తోడ్కొని వచ్చిన నా దాసులే. నేను మీ దేవుడనైన ప్రభుడను.

1. మీరు విగ్రహములను చేయకుడు. చెక్కిన శిలలను గాని ఆరాధనస్తంభములనుగాని నెలకొల్పకుడు. వానికి పూజలు చేయకుడు. నేను మీ ప్రభుడనైన దేవుడను.

2. మీరు నా విశ్రాంతిదినములను పాటింపడు. నా మందిరమును గౌరవింపుడు. నేను ప్రభుడను.

3-4. మీరు నా ఆజ్ఞలను పాటించి నా చట్టములకు విధేయులగుదురేని, నేను మీకు సకాలమున వానలు కురియింతును. ఫలితముగా మీ పొలములు చక్కగా పండును, మీ చెట్లు కాయును.

5. మీ భూములు ఎంతసమృద్ధిగా ఫలించుననగా, ద్రాక్షపండ్లు కోతకువచ్చు కాలమువరకు మీరు కళ్ళములలో ధాన్యము తొక్కించుచునే యుందురు. విత్తనములు వెదజల్లుకాలము వచ్చువరకు ద్రాక్ష పండ్లను కోయు చునేయుందురు. మీరు బాగుగా భుజించి మీ దేశమున చీకుచింతలేకుండ జీవింతురు.

6. నేను మీదేశమున శాంతినెలకొల్పగా మీరు భయమనునది యెరుగక సుఖముగా నిద్రింతురు. నేను వన్యమృగముల నెల్ల రూపుమాపుదును. ఇక మీ భూమిమీద యుద్ధములు జరుగవు.

7. మీరు శత్రువులను వెన్నాడగా వారు మీ కత్తికి బలియగుదురు.

8. మీవారు ఐదుగురు వందమంది శత్రువులను, వందమంది పదివేలమంది శత్రువులను తరుముదురు. మీ పగవారు మీ కండ్లముందు కత్తిదెబ్బకు కూలిపోవుదురు.

9. నేను మిమ్ము దీవింతును. మీకు సంతానము నొనగి. మిమ్ము వృద్ధి చేయుదును. నేను మీతో చేసికొనిన నిబంధనము కొనసాగింతును.

10. మీరు పాతపంటను శుష్ఠుగా భుజింతురు. మీరు క్రొత్తపంట చేతికి వచ్చినను పాతపంట మీకు మిగిలియుండును. మీరు కొత్తపంటకు వలయు స్థలమును కలిగించుటకు గాను పాతపంటను పారవేయవలసియుండును.

11. నేను మీ నడుమవసింతును. మిమ్ము చేయివిడువను.

12. మీకు బాసటయైయుందును. నేను మీకు దేవుడను కాగా మీరు నా ప్రజలగుదురు.

13. మీ దేవుడనైన నేను మిమ్ము ఐగుప్తునుండి తోడ్కొనివచ్చి మీ బానిసత్వమును తొలగించితిని. మిమ్ములను మీ కాడిబంధములను త్రెంచి, మిమ్ములను విముక్తులను చేసి, మీరు మరల తలఎత్తుకొని తిరుగునట్లు చేసితిని.

14-16. కాని మీరు నామాటలను పెడచెవినిబెట్టి నా ఆజ్ఞలు పాటింపరేని, నా విధులను, చట్టములను అనాదరముచేసి నా నిబంధనమును మీరుదురేని, నేను మిమ్మును తప్పక శిక్షింతును. జ్వరములతో, కుదరని రోగములతో మిమ్ము పీడింతును. వానివలన మీరు గ్రుడ్డివారగుదురు. నవిసిపోవుదురు. మీరు పొలమున విత్తనము వేయుదురుగాని శత్రువులు వచ్చి ఆ పంటను కోసికొని పోవుదురు.

17. నేను మిమ్ము అణగద్రోక్కగా శత్రువులు వచ్చి మిమ్ము అవలీలగా జయింతురు. మీ పగవారు మిమ్ము ఏలుదురు. ఎవరును మిమ్ము వెన్నాడకున్నను, మీరు పిరికితనముతో పారిపోయెదరు.

18. ఇంత జరిగిన పిదపగూడ మీరు నామాట వినరేని, నేను మీ దోషములకు గాను మిమ్ము ఏడంతలు మరల శిక్షింతును.

19. మీ పొగరు అణిగింతును. ఆకాశము ఇనుమువలెను, భూమి ఇత్తడివలెను గట్టిపడునట్లు చేసెదను.

20. మీరు ప్రేగులు తెంచుకొన్నను మీ పొలముపండదు, మీ చెట్లుకాయవు.

21. ఇంత జరిగినను మీరు నామాట వినరేని నేను మీ దోషములకుగాను మిమ్మింకను ఏడురెట్లు మరల శిక్షింతును.

22. వన్యమృగములను మీ మీదికి ఉసికొల్పుదును. అవి మీసంతానమును, మీ పశువులను ఎత్తుకొని పోవును. మీసంఖ్య పూర్తిగా తగ్గిపోగా, మీ త్రోవలవెంట నడచుటకు జనమే ఉండరు.

23-24. ఇంత జరిగినను మీరు బుద్ధి తెచ్చు కొనక నన్నెదిరింతురేని, నేను మిమ్మెదిరించి మీ అపరాధములకు మిమ్ము ఏడురెట్లు శిక్షింతును.

25. నేను మీ నేలమీద యుద్ధములు జరిపించి నా నిబంధనము మీరినందులకుగాను మిమ్ము దండింతును. మీరు పారిపోయి మీ నగరములలో దాగుకొనినచో, నేను మీ మీదికి అంటురోగములు పంపింతును. మిమ్ము శత్రువుల వశముగావింతును.

26. నేను మీ నోటికూడు పడగొట్టుదును. కాగా పది కుటుంబముల స్త్రీలు రొట్టెలు కాల్చుకొనుటకు ఒక్క పొయ్యి సరి పోవును. వారు ఆ రొట్టెను మీకు తూచి ఇచ్చెదరు. మీరు దానిని తిందురుగాని తృప్తి చెందరు.

27-28. ఇంత జరిగినను మీరు నామాట వినక నాకెదురుతిరుగుదురేని, నేనును మీకు ఎదురు తిరిగి కోపముతో మిమ్ము ఏడంతలు అదనముగా శిక్షింతును.

29. మీరు ఆకలిబాధతో మీ కుమారుల, కుమార్తెల మాంసమునే తిందురు.

30. నేను పర్వతములపై మీరు నిర్మించిన మందిరములను, మీరు సాంబ్రాణి పొగ వేసిన పీఠములను కూలద్రోయుదును. మీ శవములను ఆ కూలిపోయిన విగ్రహములపై పడవేయుదును. నేను మిమ్ము అసహ్యించు కొందును.

31. మీ పట్టణములను దేవాలయములను నేలమట్టము చేయుదును. మీ బలుల సువాసనను ఆఘ్రాణింపను.

32. మీ దేశమును ఎంతగా నాశనము చేయుదుననగా, మీ భూమిని ఆక్రమించుకొనిన శత్రువులుకూడ ఆ వినాశమును చూచి ఆశ్చర్యపడు దురు.

33. మీరు అన్యజాతుల మధ్య చెల్లా చెదరగుదురు. మీ దేశము బీడువడును. మీ నగరములు పాడువడును.

34. అప్పుడు మీ దేశము పాడైయున్న దినములలో నిజముగనే దానికి విశ్రాంతిదినములు లభించును. మీరు అచట మీ శత్రువుల దేశములో చిక్కి మూల్గుచుండగా ఇచట మీ దేశము పూర్ణ విశ్రాంతిని అనుభవించును.

35. అటుల పాడు పడిపోయిన మీ దేశము, మీరట వసించినపుడు విశ్రాంతి దినములయందు పొందని విశ్రాంతిని పొందును.

36. ప్రవాసముననున్నవారిని నేను భయముతో కంపించిపోవునట్లు చేయుదును. మీరు గాలికి రాలి పోవు ఆకుసవ్వడికి కూడ, యుద్ధమున శత్రువులను చూచి పారిపోవువారివలె పరుగుతీయుదురు. శత్రువులు మీదపడకున్నను మీరు కూలిపోవుదురు.

37. పగవారు వెన్నాడకున్నను మీరు ఒకరినొకరు తట్టుకొని పడిపోవుదురు. అసలు మీరు శత్రువులను ఎదిరింపజాలరు.

38. మీరు ఆ ప్రవాసముననే చత్తురు. శత్రువులదేశము మిమ్మును మ్రింగివేయును.

39. అచట చావక మిగిలియున్నకొద్దిమందిగూడ తమ యొక్కయు, తమ పూర్వులయొక్కయు పాపములకు గాను క్షీణించిపోవుదురు.

40. అప్పుడు వారు తామును, తమ పూర్వులును నాకు ఎదురుతిరిగితిమనియు, నామీద తిరుగుబాటుసల్పి తప్పుచేసితిమనియు ఒప్పు కొనినయెడల

41. నాకు కోపము రప్పించి నా వలన ప్రవాసము పాలైతిమని చెప్పుకొనినయెడల, సున్నతి పొందని వారి హృదయములులొంగి, వారి దోషములను సరిచేసుకొనినయెడల

42. అప్పుడు యాకోబు, ఈసాకు, అబ్రహాములతో పూర్వము నేను చేసికొనిన నిబంధనమును జ్ఞప్తికి తెచ్చుకొని, ఆ దేశమును జ్ఞాపకము చేసుకొందును.

43. కాని మొదట ఆ జనము నా భూమిమీదినుండి వెళ్ళిపోవలయును. వారిచే విడవబడినపుడే ఆ నేల పూర్ణవిశ్రాంతిని అనుభవింపవలయును. నా ఆజ్ఞలను, చట్టములను అసహ్యించుకొని మీరినందులకుగాను ఆ జనులు శిక్షను అనుభవింపవలయును.

44. కాని వారు ప్రవాసముననున్నపుడు నేను వారిని పూర్తిగా పరిత్యజింపను, ద్వేషింపను. వారిని సర్వనాశనము చేయను. వారితో చేసికొనిన నిబంధనమును విడనాడను. నేను వారి ప్రభుడనైన దేవుడను.

45. నేను వారి పూర్వులతో చేసికొనిన నిబంధనమును గుర్తుకు తెచ్చుకొందును. ఎల్లజాతులు చూచుచుండగా నేను ఆ ప్రజను ఐగుప్తునుండి తోడ్కొనివచ్చి వారికి దేవుడనైతిని. నేను ప్రభుడను.”

46. ప్రభువు సీనాయి కొండమీద మోషే ద్వారా యిస్రాయేలీయులకు ప్రసాదించిన ఆజ్ఞలు, చట్టములు ఇవియే.

1 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను

2 నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఒకడు విశేషమైన మ్రొక్కుబడి చేసినయెడల నీవు నిర్ణయించిన వెలచొప్పున వారు యెహోవాకు దాని చెల్లింపవలెను.ఒ

3 నీవు నిర్ణయింపవలసిన వెల యేదనగా, ఇరువది ఏండ్లు మొదలుకొని అరువది ఏండ్ల వయస్సు వరకు మగవానికి పరిశుద్ధస్థలముయొక్క తులమువంటి యేబది తులముల వెండి నిర్ణయింపవలెను.

4 ఆడుదానికి ముప్పది తులములు నిర్ణయింపవలెను.

5 అయిదేండ్లు మొదలుకొని యిరువది ఏండ్లలోపలి వయస్సుగల మగవానికి ఇరువది తులముల వెలను, ఆడుదానికి పది తులముల వెలను నిర్ణయింపవలెను.

6 ఒక నెల మొదలుకొని అయిదేండ్లలోపలి వయస్సుగల మగవానికి అయిదు తులముల వెండి వెలను ఆడుదానికి మూడు తులముల వెండి వెలను నిర్ణయింపవలెను.

7 అరువది ఏండ్ల ప్రాయముదాటిన మగవానికి పదునైదు తులముల వెలను ఆడుదానికి పది తులముల వెలను నిర్ణ యింపవలెను.

8 ఒకడు నీవు నిర్ణయించిన వెలను చెల్లింపలేనంత బీదవాడైన యెడల అతడు యాజకుని యెదుట నిలువవలెను; అప్పుడు యాజకుడు అతని వెలను నిర్ణయించును. మ్రొక్కుకొనిన వాని కలిమి చొప్పున వానికి వెలను నిర్ణయింపవలెను.

9 యెహోవాకు అర్పణముగా అర్పించు పశువులలో ప్రతిదానిని యెహోవాకు ప్రతిష్ఠితముగా ఎంచవలెను.

10 అట్టిదానిని మార్చకూడదు; చెడ్డదానికి ప్రతిగా మంచిదాని నైనను మంచిదానికి ప్రతిగా చెడ్డదానినైనను, ఒకదానికి ప్రతిగా వేరొకదానిని ఇయ్యకూడదు. పశువుకు పశువును మార్చినయెడల అదియు దానికి మారుగా ఇచ్చినదియు ప్రతిష్ఠితమగును.

11 జనులు యెహోవాకు అర్పింప కూడని అపవిత్ర జంతువులలో ఒకదానిని తెచ్చినయెడల ఆ జంతువును యాజకుని యెదుట నిలువబెట్టవలెను.

12 అది మంచిదైతేనేమి చెడ్డదైతేనేమి యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను; యాజకుడవగు నీవు నిర్ణయించిన వెల స్థిరమగును.

13 అయితే ఒకడు అట్టిదానిని విడిపింప గోరినయెడల నీవు నిర్ణయించిన వెలలో అయిదవవంతు వానితో కలుపవలెను.

14 ఒకడు తన యిల్లు యెహోవాకు ప్రతిష్ఠితమగుటకై దానిని ప్రతిష్ఠించినయెడల అది మంచిదైనను చెడ్డ దైనను యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను; యాజకుడు నిర్ణయించిన వెల స్థిరమగును.

15 తన యిల్లు ప్రతిష్ఠించిన వాడు దాని విడిపింపగోరినయెడల అతడు నీవు నిర్ణయించిన వెలలో అయిదవవంతు దానితో కలుపవలెను; అప్పుడు ఆ యిల్లు అతనిదగును.

16 ఒకడు తన పిత్రార్జితమైన పొలములో కొంత యెహో వాకు ప్రతిష్ఠించినయెడల దాని చల్లబడు విత్తనముల కొల చొప్పున దాని వెలను నిర్ణయింపవలెను. పందుము యవల విత్తనములు ఏబది తులముల వెండి వెలగలది.

17 అతడు సునాదసంవత్సరము మొదలుకొని తన పొలమును ప్రతి ష్ఠించినయెడల నీవు నిర్ణయించు వెల స్థిరము.

18 ​సునాద సంవత్సరమైన తరువాత ఒకడు తన పొలమును ప్రతిష్ఠిం చినయెడల యాజకుడు మిగిలిన సంవత్సరముల లెక్క చొప్పున, అనగా మరుసటి సునాదసంవత్సరమువరకు వానికి వెలను నిర్ణయింపవలెను. నీవు నిర్ణయించిన వెలలో దాని వారడి తగ్గింపవలెను.

19 ​​పొలమును ప్రతిష్ఠించినవాడు దాని విడిపింపగోరినయెడల నీవు నిర్ణయించిన వెలలో అయిదవ వంతును అతడు దానితో కలుపవలెను. అప్పుడు అది అతనిదగును.

20 అతడు ఆ పొలమును విడిపింపనియెడ లను వేరొకనికి దాని అమి్మనయెడలను మరి ఎన్నటికిని దాని విడిపింప వీలుకాదు.

21 ఆ పొలము సునాదసంవత్సరమున విడుదలకాగా అది ప్రతిష్ఠించిన పొలమువలె యెహోవాకు ప్రతిష్ఠితమగును; ఆ స్వాస్థ్యము యాజకునిదగును.

22 ఒకడు తాను కొనిన పొలమును, అనగా తన స్వాస్థ్యములో చేరనిదానిని యెహోవాకు ప్రతిష్ఠించినయెడల

23 యాజ కుడు సునాదసంవత్సరమువరకు నిర్ణయించిన వెల చొప్పున అతనికి నియమింపవలెను. ఆ దినమందే నీవు నిర్ణయించిన వెల మేరచొప్పున యెహోవాకు ప్రతిష్ఠితముగా దాని చెల్లింపవలెను.

24 ​సునాదసంవత్సరమున ఆ భూమి యెవని పిత్రార్జితమైనదో వానికి, అనగా ఆ పొలమును అమి్మన వానికి అది తిరిగిరావలెను.

25 ​నీ వెలలన్నియు పరిశుద్ధ స్థలముయొక్క వెలచొప్పున నిర్ణయింపవలెను. ఒక తులము ఇరువది చిన్నములు.

26 అయితే జంతువులలో తొలిపిల్ల యెహోవాది గనుక యెవడును దాని ప్రతిష్ఠింపకూడదు; అది ఎద్దయిననేమి గొఱ్ఱమేకల మందలోనిదైననేమి యెహోవాదగును.

27 అది అపవిత్రజంతువైనయెడల వాడు నీవు నిర్ణయించు వెలలో అయిదవవంతు దానితో కలిపి దాని విడిపింపవచ్చును. దాని విడిపింపనియెడల నీవు నిర్ణయించిన వెలకు దాని అమ్మవలెను.

28 అయితే మనుష్యులలోగాని జంతువులలోగాని స్వాస్థ్య మైన పొలములలోగాని తనకు కలిగినవాటన్నిటిలో దేని నైనను ఒకడు యెహోవాకు ప్రతిష్టించినయెడల ప్రతి ష్ఠించినదానిని అమ్మకూడదు, విడిపింపను కూడదు, ప్రతి ష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును.

29 మనుష్యులు ప్రతిష్ఠించు వాటిలో దేని నైనను విడిపింపక హతము చేయవలెను.

30 భూధాన్యములలోనేమి వృక్షఫలములోనేమి భూఫల ములన్నిటిలో దశమభాగము యెహోవా సొమ్ము; అది యెహోవాకు ప్రతిష్ఠితమగును.

31 ఒకడు తాను చెల్లింపవల సిన దశమభాగములలో దేనినైనను విడి పింప గోరినయెడల దానిలో అయిదవ వంతును దానితో కలుపవలెను.

32 గోవులలోనేగాని గొఱ్ఱ మేకల లోనేగాని, కోలక్రింద నడుచునన్నిటిలో దశమభాగము ప్రతిష్ఠితమగును.

33 అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాని మార్చ కూడదు. దాని మార్చినయెడల అదియు దానికి మారుగా నిచ్చినదియు ప్రతిష్ఠితములగును; అట్టిదాని విడిపింపకూడదని చెప్పుము.

34 ఇవి యెహోవా సీనాయికొండమీద ఇశ్రాయేలీయుల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు.