ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆమోసు

1. తెకోవకు చెందిన కాపరియగు ఆమోసు పలుకులివి. ఉజ్జీయా యూదాకును, యెహోవాసు కుమారుడైన యరోబాము యిస్రాయేలు రాజ్యమునకును రాజులుగా నున్నపుడు, భూకంపమునకు రెండేండ్లు ముందట, యిస్రాయేలును గూర్చి ఈ సంగతులనెల్ల దేవుడు ఆమోసునకు వెల్లడిచేసెను.

2. ఆమోసు ఇట్లనెను: “ప్రభువు సియోను నుండి గర్జించును. యోరుషలేమునుండి ఆయన ధ్వానము ఉరుమువలె వినిపించును. కాపరులు సంచరించు గడ్డి బీళ్ళు విలపించుచున్నవి. కర్మెలు పర్వతము బీడుగా మారినది".

3. ప్రభువు ఇట్లనుచున్నాడు: “దమస్కు చేసిన మూడు అతిక్రమముల కారణమున, దాని నాలుగవ అతిక్రమము కారణమున దానిని వెనుదీయక శిక్షించి తీరుదును. ఎందుకనగ దాని ప్రజలు నూర్పిడి ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి.

4. కావున నేను హజాయేలు ప్రాసాదముమీదికి, నిప్పును పంపుదును. బెన్హ్ దదు కోటలను తగులబెట్టుదును.

5. దమస్కు నగరద్వారములను బద్దలు చేయుదును. ఆవెను లోయలోని ప్రజలను నిర్మూలింతును. బేతేదెను రాజును తొలగింతును. సిరియావాసులు కీరు దేశమునకు, బందీలుగా వెళ్ళిపోవుదురు.

6. ప్రభువు ఇట్లనుచున్నాడు: గాజా చేసిన మూడు అతిక్రమముల కారణమున, దాని నాలుగవ అతిక్రమము కారణమున నేను దానిని శిక్షించి తీరుదును. గాజా ప్రజలు చెరపట్టిన ఒకజాతినంతటిని కొనిపోయి ఎదోమీయులకు బానిసలనుగా అమ్మిరి.

7. కావున నేను గాజా ప్రాకారముల మీదికి నిప్పును పంపుదును. దాని నగరులను దహించి వేయుదును.

8. అష్టోదు, అష్కేలోనూ నగరముల రాజులను నిర్మూలింతును. ఎక్రోను నగరమును దండింతును. ఫిలిస్తీయులలో మిగిలినవారెల్లరును చత్తురు అని ప్రభువైన యావే సెలవిచ్చుచున్నాడు.

9. ప్రభువిట్లనుచున్నాడు: తూరు చేసిన మూడు అతిక్రమముల కారణమున, దాని నాలుగవ అతిక్రమము కారణమున నేను వారిని శిక్షించి తీరుదును. ఏలయన దాని జనులు సహోదర నిబంధనమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టుబడిన వారినందరిని ఏదోమీయులకు బానిసలనుగా అప్పగించిరి.

10. కావున నేను తూరు ప్రాకారములమీదికి నిప్పును పంపుదును. దాని కోటలను కాల్చివేయుదును”.

11. ప్రభువిట్లనుచున్నాడు: ఎదోము చేసిన మూడు అతిక్రమముల ఉప్పు కారణమున, దాని నాలుగవ అతిక్రమము కారణమున నేను వారిని శిక్షించి తీరుదును. వారు నిర్దయులై ఖడ్గముతో తమ సోదరుల వెంటబడిరి. . తమ కోపమును విడనాడక వారిని తునుమాడిరి.

12. కావున నేను తేమాను మీదికి నిప్పును పంపగా అది బోస్రా నగరులను కాల్చివేయును.

13. ప్రభువు ఇట్లనుచున్నాడు: అమ్మోను చేసిన మూడు అతిక్రమముల కారణమున, దాని నాలుగవ అతిక్రమము కారణమున నేను వారిని దండించి తీరుదును. వారు తమ పొలిమేరలను విస్తరింపచేసికొనుటకు సల్పిన యుద్ధములలో గిలాదు గర్భవతుల కడుపులు చీల్చివేసిరి.

14. కావున నేను రబ్బా నగర ప్రాకారముల మీదికి నిప్పును పంపుదును. రణకేకలతోను, సుడిగాలి వీచునపుడు కలుగు ప్రళయమువలె దాని నగరులను కాల్చివేయుదును.

15. వారి రాజు, అతడి అధిపతులు చెరలోనికి కొనిపోబడుదురు”.

1. ప్రభువిట్లనుచున్నాడు: మోవాబు చేసిన మూడు అతిక్రమముల కారణమున, దాని నాలుగవ అతిక్రమము కారణమున నేను వారిని దండించి తీరుదును. వారు ఎదోము రాజు ఎముకలను బుగ్గి అగునట్లుగా కాల్చి అపవిత్రము చేసిరి.

2. కావున నేను మోవాబు మీదికి నిప్పును పంపుదును. కెరీయోతు నగరులను కాల్చివేయుదును. సైనికులు రణధ్వని చేయుచుండగా, బాకాలనాదము వినిపించుచుండగా మోవాబీయులు యుద్ధనాదమున కూలుదురు.

3. నేను మోవాబు రాజును ఆ దేశ నాయకులను ఎల్లరిని వధింతును.”

4. ప్రభువిట్లనుచున్నాడు; యూదా చేసిన మూడు అతిక్రమముల కారణమున, దాని నాలుగవ అతిక్రమము కారణమున నేను వారిని దండించి తీరుదును. వారు ప్రభువు ధర్మశాస్త్రమును తృణీకరించిరి. ఆయన ఉపదేశములు పాటింపరైరి. తమ పితరులనుసరించిన అపమార్గము పట్టిరి.

5. కావున నేను యూదా మీదికి నిప్పును పంపుదును. యెరూషలేము నగరులను కాల్చివేయుదును”.

6. ప్రభువు ఇట్లనుచున్నాడు: యిస్రాయేలీయులు చేసిన మూడు అతిక్రమముల కారణమున, దాని నాలుగవ అతిక్రమము కారణమున నేను వారిని శిక్షించి తీరుదును. వారు బాకీలు తీర్చలేని సజ్జనులను ద్రవ్యమునకు అమ్మివేయుచున్నారు. చెప్పులజోడు కొరకై పేదలను అమ్మివేయు చున్నారు.

7. దుర్బలుల తలలమీద కాళ్ళుపెట్టి నేలకు తొక్కుచున్నారు. దరిద్రులను త్రోవనుండి ప్రక్కకు నెట్టుచున్నారు. తండ్రీ కుమారులు ఒకే యువతిని కూడి నా దివ్యనామమును అపవిత్రము చేయుచున్నారు.

8. తాము పేదలనుండి కుదువ సొమ్ముగా పుచ్చుకొనిన వస్త్రములను పరచుకొని బలిపీఠములన్నింటియొద్ద పవ్వళించుచున్నారు. తమకు అప్పుపడియున్న వారినుండి గైకొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరమునందే పానము చేయుచున్నారు.

9. అయినను జనులారా! నేను మీ మేలుకొరకు దేవదారువలె దీర్ఘకాయులును, సింధూరము వలె బలాడ్యులును మీ ముందర నిలువకుండ నేను నాశనము చేసితిని! పైన వారి ఫలములను క్రింద వారి మూలములను నాశనము చేసితిని.

10. నేను మిమ్ము ఐగుప్తునుండి తోడ్కొనివచ్చి అమోరీయుల నేలను మీకు భుక్తము చేయుటకు నలువది యేండ్లపాటు ఎడారిలో నడిపించితిని.

11. మీ తనయులలో కొందరిని ప్రవక్తలనుగా, మీ యువకులలో కొందరిని నాజరీయులనుగా నియమించితిని, యిస్రాయేలీయులారా! ఇది నిజము కాదా? ఇది ప్రభుడనైన నా వాక్కు

12. అయినను మీరు నాజరీయులచే ద్రాక్షారసము త్రాగించిరి. ప్రవక్తలను ప్రవచనము చెప్పనీయరైరి.

13. కావున నేను మిమ్ము ధాన్యముతోనిండిన బండి నేలను తొక్కివేసినట్లు నేను మిమ్మును అణగదొక్కుదును.

14. అపుడు శీఘ్రముగా పరుగెత్తువారు కూడ తప్పించుకోజాలరు. బలాఢ్యులు సత్తువను కోల్పోదురు. శూరులు స్వీయ ప్రాణములనే కాపాడుకోజాలరు.

15. విలుకాండ్రు నిలువజాలరు. శీఘ్రగాములు పారిపోజాలరు. రౌతులు ప్రాణములతో తప్పించుకోజాలరు.

16. ఆ దినమున ధైర్యవంతులైన మహావీరులు కూడ ఆయుధములు జారవిడచి పారిపోదురు. ఇది ప్రభువు వాక్కు. 

1. యిస్రాయేలీయులారా! ప్రభువు మిమ్ము గూర్చి పలికిన ఈ సందేశము నాలింపుడు. ఆయన ఐగుప్తునుండి కొనివచ్చిన ప్రజలెల్లరిని గూర్చిన ఈ వార్తను వినుడు.

2. భూమిమీద జాతులన్నిటిలోను నేను మిమ్ము మాత్రమే ఎరిగియుంటిని. కావున మీ పాపములన్నిటికిగాను నేను మిమ్ము దండింతును.

3. ఇరువురు నరులు కలిసి ప్రయాణము చేసినచో వారు ముందుగా ఒప్పందము చేసికొని యుండవలెనుగదా!

4. అడవిలో సింగము గర్జించినచో దానికి ఎర దొరికియుండవలెనుగదా! గుహలో సింగపు కొదమ బొబ్బరించినచో దానికి జంతువు చిక్కియుండవలయునుగదా!

5. పక్షి ఉరులలో చిక్కుకొనినచో దానికి ఎవరో ఎరపెట్టియుండవలెనుగదా! ఉచ్చుపైకి లేచినచో పక్షి దానిలో తగుల్కొనియుండవలెనుగదా!

6. నగరమున బాకానూదినచో జనులు భయపడకుందురా? ప్రభువు కీడు పంపనిదే నగరమునకు ఆపదవాటిల్లునా?

7. ప్రభువైన దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు తెలుపకుండ ఎట్టి కార్యమును చేయడు.

8. సింహము గర్జించినచో భయపడనివాడెవడు? ప్రభువైన దేవుడు ఆనతిచ్చినచో ప్రవచనము చెప్పనివాడెవడు?

9. అష్ణోదు ప్రాసాదములలో నివసించువారికిని ఐగుప్తు రాజభవనములలో వసించువారికిని ఇట్లు చెప్పుడు. “మీరెల్లరును సమరియా కొండలపై ప్రోగై ఆ నగరమున జరుగు అక్రమములను, పీడనలను గమనింపుడు”.

10. ప్రభువు ఇట్లనుచున్నాడు: ఈ ప్రజలు నేరములు, దౌర్జన్యములు చేసి తెచ్చుకొనిన సొమ్ముతో తమ భవనములను నింపుకొనిరి. వీరికి న్యాయవర్తనమెట్టిదో కూడ తెలియదు.

11. కావున విరోధి ఒకడు వీరి దేశమును చుట్టుముట్టి వీరి కోటలను నాశనము చేయును. వీరి భవనములను కొల్లగొట్టును.

12. ప్రభువు ఇట్లనుచున్నాడు: గొఱ్ఱెల కాపరి సింహము నోటనుండి రెండు కాళ్ళనైనను, చెవి, ముక్కునైనను విడిపించుకొనినట్లుగా ఇపుడు సుఖప్రదమైన బుట్టాలువేసిన శయ్యలపై కూర్చుండియున్న సమరియా పౌరులు రక్షింపబడుదురు”.

13. సర్వోన్నతుడు ప్రభువు ఇట్లనుచున్నాడు: “వినుడు, యాకోబు వంశజులను హెచ్చరింపుడు.

14. నేను యిస్రాయేలీయులను వారి పాపములకు గాను దండించునపుడు బేతేలులోని బలిపీఠములనుగూడ కూల్చివేయుదును ఆ బలిపీఠపుకొమ్ములు తెగవేయబడి నేలపై బడును.

15. నేను శీతకాలపు విడిది భవనములు, గ్రీష్మకాలపు విడిది గృహములను నాశనము చేయుదును. దంతము పొదిగిన మేడమిద్దెలును నేలమట్టమగును. ఇది ప్రభుని వాక్కు 

1. “బాషాను గోవులవలె బలిసియున్న సమరియా మహిళలారా వినుడు! మీరు దుర్బలులను బాధించి, దరిద్రులను పీడించుచున్నారు. మీ భర్తలను వేధించుచున్నారు.

2. సర్వోన్నతుడైన ప్రభువు తన పావిత్య్రము మీదిగా బాసచేసెను. శత్రువులు మీకు కొక్కెములు తగిలించి, మిమ్ము లాగుకొనిపోవు రోజులు వచ్చును. మీరెల్లరును గాలమున చిక్కిన చేపలవంటివారగుదురు.

3. మిమ్ము చేరువలోని ప్రాకారపు గండ్లయొద్దకు ఈడ్చుకొనిపోయి, హెర్మోను మార్గమున తోలుకొనిపోవుదురు. ఇది ప్రభువు వాక్కు

4. సర్వోన్నతుడైన ప్రభువిట్లనుచున్నాడు: “యిస్రాయేలీయులారా! బేతేలునకు వెళ్ళి పాపము చేయుడు. గిల్గాలునకుపోయి మీ శక్తికొలది పాపము కట్టుకొనుడు. ప్రతి ఉదయకాల బలులు తెచ్చి అర్పింపుడు. ప్రతి మూడవరోజు పదియవ వంతు పంటను అర్పింపుడు.

5. వెళ్ళి కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి పులిసిన పిండితో రొట్టెనర్సింపుడు. మీ స్వేచ్ఛార్పణలను గూర్చి గొప్పలు చెప్పుకొనుడు. ఇట్లు చేయుట మీకిష్టముకదా!

6. నేను మీ నగరములన్నిటిలోను మీకు దంతశుద్ధిని కలుగజేసి, తినుటకు మీ స్థలములన్నిటిలో ఆహారము లేకుండ చేసితిని, అయినను మీరు నా చెంతకు మరలి రాలేదు.

7. మీ కోతకాలమునకు ముందు మూడునెలలు వానలు లేకుండ చేసితిని. మీ నగరములలో ఒకదానిపై వాన కురిపించి మరియొకదానిపై కురిపింపనైతిని. మీ పొలములలో ఒకదానిపై వర్షము పడి మరియొక దానిపై పడనందున అది ఎండిపోవును.

8. దప్పికవలన డస్సిపోయి చాల నగరముల ప్రజలు నీటికొరకు మరియొక నగరమునకు ఎగబడిరి. కాని అచటను వారికి వలసినంత నీరు దొరకదయ్యెను. అయినను మీరు నా చెంతకు తిరిగిరారైతిరి.

9. నేను వేడిగాలులు పంపి మీ పైరులను మాడ్చివేసితిని. మిడుతలు మీతోటలను, ద్రాక్షలను, అత్తిచెట్లను, ఓలివుచెట్లను మ్రింగివేసెను. అయినను మీరు నా చెంతకు మరలిరారైతిరి.

10. ఐగుప్తీయులకువలె మీకును అంటురోగము కలిగించితిని. మీ యువకులను పోరున చంపితిని. మీ గుఱ్ఱములను నాశనము చేసితిని. మీ శిబిరములలోని శవములు వ్యాపింపచేయు దుర్గంధమును మీ ముక్కు పుటములు భరింపజాలవయ్యెను. అయినను మీరు నా చెంతకు మరలిరారైతిరి.

11. సొదొమ గొమొఱ్ఱా ప్రజలనువలె మీలో కొందరిని చంపితిని. నిప్పుమంటలలో నుండి తీసిన కొరివివలె మీలో కొందరు బ్రతికిరి. అయినను మీరు నా చెంతకు మరలిరారైతిరి. ఇది ప్రభువు వాక్కు.

12. కావున యిస్రాయేలీయులారా! నేను మిమ్ము దండింతును. నేనిట్లు చేయుచున్నానుగాన మీరు దేవుని కొలుచుటకై సిద్ధపడుడు.

13. దేవుడే పర్వతములను చేసెను. వాయువులను కలిగించెను. ఆయన తన ఆలోచనలను నరులకు ఎరిగించును. పగటిని రేయిగా మార్చును. ఉన్నతస్థలములపై నడయాడును. సైన్యములకధిపతియైన ప్రభువని ఆయనకు పేరు. 

1. యిస్రాయేలీయులారా! నేను మీ మీద పాడబోవు ఈ శోకగీతమును ఆలింపుడు:

2. కన్యకయైన యిస్రాయేలు నేలకొరిగినది, ఇక పైకి లేవలేదు. ఆమె ఒంటరిగా నేలపై పడియున్నది. లేవనెత్తువారెవరును లేరు.

3. సర్వోన్నతుడైన ప్రభువిట్లనుచున్నాడు: యిస్రాయేలు నగరములలో ఒకటి, వేయిమందిని పోరునకు పంపగా వందమంది మాత్రమే తిరిగివత్తురు. మరియొకటి నూరుగురిని పంపగా పదిమంది మాత్రమే తిరిగివత్తురు.

4. ప్రభువు యిస్రాయేలీయులతో ఇట్లు చెప్పుచున్నాడు: మీరు నా చెంతకు రండు, జీవమును బడయుడు.

5. మీరు నన్ను ఆరాధించుటకు బేర్షేబాకు వెళ్ళకుడు. బేతేలున నన్ను వెదకకుడు, అది శూన్యమగును. గిల్గాలునకు పోవలదు, ఆ పురవాసులకు ప్రవాసము తప్పదు.

6. మీరు ప్రభువునొద్దకు రండు, తన జీవమును బడయుడు. లేదేని ఆయన యిస్రాయేలీయులపై  అగ్నివలె దిగివచ్చును. ఆ అగ్ని బేతేలు పౌరులను దహించును. దానినెవ్వడును ఆర్పజాలడు.

7. న్యాయమును తారుమారు చేసి, నీతిని మంటగలుపువారికి అనర్ధము తప్పదు.

8. ప్రభువు సప్తర్షి మండలమును, మృగశీర్షను సృజించెను.. ఆయన రేయిని పగటిగను, పగటిని రేయిగను మార్చును. సాగరజలములను తన చెంతకు పిలిచి " నేలపై పొర్లిపారజేయును. ప్రభుడని ఆయనకు పేరు.

9. ఆయన బలశాలులను, వారి కోటలను కూల్చివేయును.

10. ప్రజలారా! న్యాయస్థానమున అన్యాయమునెదిరించి యథార్థము చెప్పువానిని మీరు అసహ్యించుకొనుచున్నారు.

11. దోషనివృత్తికి లంచములు తీసుకొనుచు సజ్జనులను పీడించుచున్నారు, నగరద్వారమువద్ద పేదలహక్కులను కాలరాచి వారికి న్యాయము జరగనీయకున్నారు.

12. మీ పాపములు ఘోరమైనవి. మీ దోషములు అసంఖ్యాకములు.పేదల పంటమోపులను లాగుకొనుచు వారిని అణగదొక్కుదురు, కనుక చెక్కినరాళ్ళతో మీరు ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపురముండరు. మీరే స్వయముగా నాటుకొనిన సుందరమైన ద్రాక్షతోటల ద్రాక్షారసమును మీరు పానము చేయజాలరు.

13. ఇట్టి దుష్టకాలమున నోరెత్తకుండుటయే మేలని వివేకవంతులు భావించుచున్నారు.

14. చెడును చేయుటకుకాదు. మంచిని చేయుటయే మీ పనిగా పెట్టుకొనుడు. అప్పుడు మీరు జీవమును పొందుదురు. సైన్యములకధిపతియు, ప్రభువునైన దేవుడు మీరు కోరుకొనినట్లుగా మీకు తోడుగా నుండును.

15. చెడును ఏవగించుకొని మంచిని చేపట్టుడు. నగర ద్వారములవద్ద న్యాయము నెగ్గునట్లు చూడుడు. అప్పుడు సైన్యములకధిపతియు ప్రభువైన దేవుడు యోసేపు సంతతిలో మిగిలియున్నవారిని కరుణించిన కరుణింపవచ్చును.

16. కావున సైన్యములకధిపతియు, మహోన్నతుడును, ప్రభువునైన దేవుడు ఇట్లు చెప్పుచున్నాడు: నేను మీ మధ్యగుండా పోబోవుచున్నాను. ప్రజలు పురవీధులలో శోకించుచు విలపింతురు. రూకలకు రోదించువారితోపాటు సేద్యము చేయువారినిగూడ ఏడ్చుటకు పిల్తురు.

17. ద్రాక్షతోటలన్నింటియందును రోదన వినబడును ఇది ప్రభువు వాక్కు

18. ప్రభువుదినము కొరకు కాచుకొని ఉన్నవారికి అనర్ధము తప్పదు. ఆ దినము మీకేమి మేలు చేయును? అది మీకు అంధకార దినమగును గాని ప్రకాశదినము కాదు.

19. ఒకడు సింగమును తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్లు, వాడు ఇంటిలోనికి పోయి గోడపై చేయిపెట్టగా పాము కరచినట్లు ఆ దినముండును.

20. ప్రభువుదినము అంధకారమునేగాని ప్రకాశమును కొనిరాదు. అది తమోమయముగా ఉండునేగాని జ్యోతిర్మయముగా నుండదు.

21. ప్రభువు ఇట్లనుచున్నాడు: మీ పండుగలు నాకు గిట్టవు. మీ ఉత్సవదినములను నేనసహ్యించుకొందును.

22. మీరు నాకు దహనబలులను ధాన్యబలులను అర్పించినచో నేను వానిని అంగీకరింపను. క్రొవ్విన పశువులను సమాధానబలిగా అర్పించినచో నేను వానిని అంగీకరింపను.

23. మీ పాటలతో నా ఎదుట గోలచేయకుడు. మీ తంత్రీవాద్యముల నాదమును నేను ఆలింపను.

24. న్యాయమును ఏరులై పారనీయుడు నీతిని జీవనదివలె ప్రవహింపనీయుడు.

25. యిస్రాయేలీయులారా! ఎడారిలో నలువదియేండ్ల పొడవున మీరు నాకు బలులను, నైవేద్యములను అర్పించితిరా?

26. మీరిపుడు మీ రాజదైవమైన సక్కూతు విగ్రహమును, మీ నక్షత్ర దైవమైన కైవాను ప్రతిమను సేవించుచున్నారుగాన,

27. నేను మిమ్ము దమస్కునకు ఆవలనున్న దేశమునకు ప్రవాసులనుగా కొనిపోయినపుడు, మీరు ఆ విగ్రహములను గూడ మీతో మోసికొని పోవలెను. ఇది ప్రభువు వాక్కు సైన్యములకధిపతియైన దేవుడని ఆయనకు పేరు. 

1. “సియోనున సుఖజీవనము గడపువారికి, సమరియా యందు సురక్షితముగా ఉన్నాము అనుకొనువారికి, యిస్రాయేలు మహాజాతిలో ప్రముఖులనబడువారికి, యిస్రాయేలీయులకు ఆలోచన చెప్పువారికి అనర్థము తప్పదు.

2. మీరు కల్నే పట్టణమునకు వెళ్ళి పరిశీలింపుడు. అచటినుండి హమాతు మహానగరమునకు పొండు. అచటినుండి ఫిలిస్తీయులదైన గాతునకు దిగిపొండు. అవి యూదా యిస్రాయేలు రాజ్యములకంటే మెరుగైనవికావా? అవి మీకంటె ఎక్కువ వైశాల్యముగల రాజ్యములుకావా?

3. మీరు ఉపద్రవదినమును దూరముగా నుంచుటకు ప్రయాసపడుచున్నారు. కాని మీ చర్యలవలన ఆ దినము దాపులోనికి వచ్చినది.

4. దంతముపొదిగిన మంచాలపై పరుండి, పాన్పులపై తమను చాచుకొనుచు మందలో మేలిమి గొఱ్ఱెపిల్లలను, శాలలలోని లేదూడలను వధించి మెక్కు మీకు అనర్థము తప్పదు.

5. మీరు దావీదువలె పాటలు కట్టి తంత్రీవాద్యము మీటుచు పిచ్చిపాటలు గానము చేయుచున్నారు.

6. పానపాత్రములనిండ ద్రాక్షారసము త్రాగి మేలైన పరిమళ తైలములు పూసికొనుచున్నారు. కాని యోసేపు సంతతికి కలిగిన వినాశమును గూర్చి విచారించుటలేదు

7. కావున మీరు ప్రవాసమునకు పోవువారిలో మొదటివారగుదురు. మీ విందులు, వినోదములు తుదముట్టును.  యిస్రాయేలీయుల పొగరు నాకు నచ్చదు. వారి మేడలను నేను అసహ్యించుకొందును. వారి నగరములను, దానిలోని సమస్త వస్తువులను శత్రువులకు అప్పగింతునని

8. ప్రభువైన దేవుడు తనతోడని ప్రమాణము చేసెను. ఇదియే సైన్యములకధిపతియు ప్రభువైన దేవునివాక్కు

9. ఒక కుటుంబమున పదిమంది మిగిలియుందురేని వారెల్లరును చత్తురు.

10. చచ్చినవానిని పాతిపెట్టు బాధ్యతగల బంధువు మృతుని శవమును ఇంటినుండి బయటికి కొనిపోవును. అతడు ఇంటిలోనున్నవానిని నీతో ఇంకనెవరైన ఉన్నారా? అని అడుగగా అతడు లేడని చెప్పును. అప్పుడా బంధువు 'నీవిక మౌనముగా ఉండుము, ప్రభువు నామమును మనము ఎత్తరాదు' అనును.

11. ఏలయన ప్రభువు ఆజ్ఞ ఈయగానే గొప్పకుటుంబములేమి, చిన్నకుటుంబములేమి అన్నియు కూలిపోవును.

12. గుఱ్ఱములు బండలమీద స్వారీచేయునా? అట్టిచోట ఎద్దులతో దున్నుదురా? మా స్వశక్తిచేతనే బలమునొందియున్నాము అని చెప్పుకొను మీరు, వ్యర్ధమైన విషయాలను గూర్చి సంతోషించు మీరు

13. న్యాయమును ఘోరమైన అన్యాయముగాను, నీతిఫలమును దుర్మార్గముగాను మార్చితిరి.

14. కాని సైన్యములకధిపతియైన యావే దేవుడు ఇట్లు పలుకుచున్నాడు: యిస్రాయేలీయులారా! మీ దేశమును ఆక్రమించుటకు నేను పరజాతి సైన్యమును పంపుదును. ఉత్తరమున హమాతు కనుమనుండి దక్షిణమున అరబా నదివరకును కూడ ఆ దండు మిమ్ము పీడించి పిప్పిచేయును”. 

1. మహోన్నతుడైన ప్రభువు నాకు ఈ దర్శనము చూపించెను: రాజునకు ఈయవలసిన గడ్డిని కోసిన తదుపరి కడవరి గడ్డి పెరుగు సమయమున ప్రభువు మిడుతల దండును సృజించెను.

2. ఆ దండు నేలమీది పచ్చని మొక్కలనెల్ల తినివేయుచుండెను. అప్పుడు నేను 'సర్వోన్నతుడవైన ప్రభూ! నీవు దయచేసి మన్నింపుము. యాకోబు కొద్ది జనము గలవాడు, అతడేలాగు నిలుచును” అని మనవి చేసితిని.

3. అప్పుడు ప్రభువు మనసు మార్చుకొని “ఈ కార్యము జరుగదు” అనెను.

4. మహోన్నతుడైన ప్రభువు నాకీదర్శనము చూపించెను: అతడు తన ప్రజలను శిక్షించుటకు అగ్నిని రప్పించెను. ఆ అగ్ని పాతాళమందలి మహాసముద్రమును కాల్చివేసి భూమిని కూడ మాడ్చివేయ మొదలుపెట్టెను.

5. అప్పుడు నేను “సర్వోన్నతుడైన ప్రభూ! నీవు ఈ అగ్నిని ఆపుము. యాకోబు బహుకొద్దిజనము' గలవాడు. అతడేలాగు నిలుచును?” అని మనవి చేసితిని.

6. అప్పుడు ప్రభువు మనసు మార్చుకొని “ఈ కార్యము జరుగదు” అనెను.

7. ప్రభువు నాకు మరియొక దర్శనము చూపెను; ఆయన లంబసూత్రము సహాయముతో నిర్మించిన గోడ ప్రక్కనే నిలుచుండియుండెను. ఆయన చేతిలో లంబ సూత్రముండెను.

8. ఆయన నన్ను "ఆమోసు! నీకేమి కనిపించుచున్నది?" అని అడిగెను. “లంబ సూత్రము” అని నేను జవాబు చెప్పితిని. ఆయన “నేను నా ప్రజలైన యిస్రాయేలీయులను దీనితో కొలుతును. వారు కొలత తప్పిన గోడవలెనున్నారు. నేను మరల మనసు మార్చుకొనను, వారిని శిక్షింపకమానను.

9. ఈసాకు వంశజులు పూజలుచేయుచున్న ఉన్నతస్థలములు పాడగును. యిస్రాయేలీయుల దేవాలయములు నాశనమగును. నేను యరోబాము రాజవంశమును తుదముట్టింతును” అని అనెను.

10. అపుడు బేతేలు దేవళమున యాజకుడుగా నున్న అమస్యా యిస్రాయేలు రాజైన యరోబామునకు ఇట్లు వర్తమానము పంపెను: “ఆమోసు ప్రజల నడుమ నీపై కుట్రలు పన్నుచున్నాడు.

11. 'యరోబాము పోరున కూలుననియు, యిస్రాయేలీయులను తమ దేశమునుండి ప్రవాసమునకు కొనిపోవుదురనియు' చెప్పుచున్నాడు. అతడి పలుకులను దేశమిక సహింప జాలదు."

12. అంతట అమస్యా ఆమోసుతో “దీర్ఘదర్శీ! నీవిక యూదాకు వెడలిపొమ్ము. అచట ప్రవచనము చెప్పి, పొట్టపోసికొనుము.

13. బేతేలు రాజుకట్టిన ప్రతిష్టిత స్థలమును, రాజధాని పట్టణము అయి యున్నందున దీనిలో నీవిక ప్రవచింపవలదు” అనెను.

14. ఆ మాటలకు ఆమోసు ఇట్లు బదులు చెప్పెను: “నేను ప్రవక్తను కాను. ప్రవక్తల సమాజమునకు చెందిన వాడనైనను కాను. నేను మందలు కాయువాడను. అత్తిచెట్లను సాగుచేయువాడను.

15. కాని ప్రభువు మందలకాపరినైన నన్ను పిలిచి 'నీవు వెళ్ళి యిస్రాయేలీయులకు ప్రవచనము చెప్పుము' అని ఆజ్ఞాపించెను.

16. కావున నీవు ప్రభువు మాటవినుము. 'యిస్రాయేలీయులకు ప్రతికూలముగా ప్రవచనము చెప్పవలదనియు, దైవోక్తులు పలుకవలదనియు' నీవు నాతో చెప్పుచున్నావు.

17. కావున అమస్యా! ప్రభువు నీతో ఇట్లు చెప్పుచున్నాడు. 'నీ భార్య నగరమున వేశ్యయగును. నీ బిడ్డలు పోరున చత్తురు. అన్యులు నీ పొలమును విభజించి పంచుకొందురు. నీ మట్టుకు నీవు అపవిత్రమైన పరదేశమున చత్తువు. యిస్రాయేలీయులను తప్పక తమ దేశమునుండి బందీలుగా కొనిపోవుదురు'. 

1. సర్వోన్నతుడైన ప్రభువు నాకు ఇంకొక దర్శనము చూపించెను. నేనొక పండిన వేసవికాలపుపండ్ల గంపను చూచితిని.

2. ప్రభువు “ఆమోసూ! నీకేమి కనిపించుచున్నది?" అని నన్నడిగెను. నేను “పండిన వేసవికాల పుపండ్లగంప” అని చెప్పితిని. ఆయన ఇట్లనెను: “నా ప్రజల అంతము వచ్చియేయున్నది. నేనిక మనసు మార్చు కొనను, వారిని శిక్షింపక దాటిపోను.

3. ఆ దినమున దేవాలయమునందలి పాటలు శోకగీతములుగా మారును. ఎల్లెడల శవములు కనిపించును. ప్రతి స్థలమందు అవి పారవేయబడును. మౌనము వహింపుడు!”

4. దీనుల తలమీద కాలుమోపుచు పేదలను నాశనము చేయువారలారా వినుడు!

5. అమావాస్య ఎప్పుడు ముగియును? మనము ధాన్యము అమ్ముకోవలెనుగదా! విశ్రాంతి దినమెప్పుడు దాటిపోవును? మనము మరల గోధుమలను అమ్ముకోవలెనుగదా! అప్పుడు మనము కొలమానములను , తగ్గింపవచ్చును. తూకములను హెచ్చింపవచ్చును. దొంగ త్రాసులతో జనులను మోసగింపవచ్చును.

6. తాలు గోధుమలను గూడ ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చును. బాకీలు చెల్లింపలేని పేదలను ద్రవ్యమునకు, చెప్పులజోడు వెలకూడ చెల్లింపలేని దరిద్రులను కొనవచ్చును. అట్లే చచ్చుధాన్యమును కూడా అమ్ముకోవచ్చునని మీరెంచుచున్నారు.

7. కాని యిస్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లు బాస చేసెను: నేను వారి పాపకార్యములను విస్మరింపను.

8. వారి చెయిదములకుగాను నేలదద్దరిల్లును. దేశములోని ప్రజలెల్ల శోకింతురు. దేశమెల్ల అతలాకుతలమై నైలునదివలె . ఆటుపోటులకు గురియగును”.

9. సర్వోన్నతుడైన ప్రభువిట్లనుచున్నాడు: ఆ దినము మిట్టమధ్యాహ్నమే ప్రొద్దుక్రుంకగా పట్టపగలే నేలపై చీకట్లు అలుముకొనునట్లు చేయుదును.

10. నేను మీ ఉత్సవములను అంత్యక్రియలుగా మార్చెదను. మీ పాటలను శోకగీతములుగా చేసెదను. అందరిని మొలలమీద గోనెపట్ల కట్టుకొన చేసెదను. అందరి తలలు బోడి చేసెదను. తల్లిదండ్రులు తమ ఏకైకపుత్రుని మృతికి విలపించినట్లే మీరు కూడ శోకింతురు. దాని అంత్యదినము ఘోరమైన శ్రమదినముగా ఉండును.

11. సర్వోన్నతుడైన ప్రభువిట్లనుచున్నాడు: నేను దేశము మీదికి కరువును పంపుకాలము వచ్చుచున్నది.. అది కూటికి, నీటికి కలుగు కరువుకాక, ప్రభువు వాక్కును వినకపోవుటయను కరువు వచ్చును.

12. ప్రజలు ఈ సముద్రమునుండి ఆ సముద్రము వరకును, ఉత్తరమునుండి తూర్పు వరకును ఇటునటు తిరుగాడుచుకు ప్రభువు సందేశము కొరకు గాలింతురు. కాని అది వారికి లభింపదు.

13. ఆ దినమున బలముగల యువతీయువకులు గూడ దప్పికవలన సొమ్మసిల్లిపోవుదురు.

14. సమరియా విగ్రహముల పేరుమీద బాసచేయువారును, దాను దేవత పేరుమీద ప్రమాణము చేయువారును, బె౦బా దైవము పేరుమీద ఒట్టు పెట్టుకొనువారును, నేలపై కూలి మరల పైకి లేవకుందురు. 

1. నేను ప్రభువు బలిపీఠముపైగా నిల్చుండి యుండుటను గాంచితిని. ఆయనిట్లు ఆజ్ఞాపించెను: దేవాలయాల స్తంభముల పైభాగమును గట్టిగా మోది, దేవాలయ పునాదులు కంపించునట్లు చేయుము. ఆ స్తంభముల పై భాగములను విరుగగొట్టి అవి ప్రజల తలలపై పడునట్లు చేయుము. ప్రజలలో మిగిలియున్నవారిని నేను పోరున చంపుదును. ఎవ్వడును తప్పించుకొని పారిపోజాలడు.

2. వారు బొరియలు త్రవ్వుకొని పాతాళలోకమునకు పోయినను నా హస్తము వారిని పట్టుకొనును. ఆకాశమునకెక్కిపోయినను, నేను వారిని క్రిందికి లాగుకొని వత్తును.

3. వారు కర్మేలు కొండకొమ్మున దాగుకొనినను నేను వారిని వెదకి పట్టుకొందును. నాకు కనిపింపకుండ సముద్రగర్భమున దాగుకొనినను, వారిని కరువమని సముద్రభూతమును ఆజ్ఞాపింతును. అది వారిని కరుచును.

4. శత్రువులు వారిని బందీలనుగా కొనిపోయినచో వారిని వధింపుడని ఆ శత్రువులను ఆజ్ఞాపింతును. నేను వారికి సాయము చేయను. వారిని నాశనము చేయుటకే తలపడితిని.

5. సర్వోన్నతుడును, ప్రభువునైన దేవుడు భూమిని తాకగానే అది కంపించును. దానిపై వసించు వారెల్లరును విలపింతురు. లోకమంతయు నైలునదివలె ఆటుపోటులకు గురియగును.

6. ప్రభువు ఆకాశమందు తన నివాసము నిర్మించుకొనెను. నేలకుపైగా ఆకాశగోళమును ఏర్పరచెను. ఆయన సముద్రజలములను రప్పించి నేలపై చల్లును. 'ప్రభువు' అని ఆయనకు పేరు.

7. ప్రభువు ఇట్లనుచున్నాడు: యిస్రాయేలీయులారా!  మీరును, కూషీయులును నాకు సరిసమానమే. నేను మిమ్ము ఐగుప్తునుండి తీసికొనివచ్చినట్లే ఫిలిస్తీయులను కఫ్తోరు నుండియు, సిరియనులను కీరు నుండియు తోడ్కొని వచ్చితిని.

8. ప్రభుడనైన నేను పాపభూయిష్టమైన ఈ యిస్రాయేలు రాజ్యమును పరీక్షించి చూచుచున్నాను. నేను దీనిని భూమిమీది నుండి తుడిచిపెట్టుదును. అయినను యాకోబు సంతతినంతటిని నాశనము చేయను.

9. నా ఆజ్ఞ ప్రకారము ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు, అన్యజాతులన్నింటిలోను యిస్రాయేలీయులను జల్లింతును. కాని ఒక్క చిన్నగింజయైనను నేలరాలదు.

10. దేవుడు మాకెట్టి కీడును కలిగింపడనెడి దుష్టులనందరిని, నా ప్రజలలోని పాపులనందరిని పోరున చంపుదును.

11. ఆ దినమున నేను కూలిపోయిన కుటీరమువలెనున్న దావీదు రాజవంశమును పునరుద్దరింతును. ఆ ఇంటిగోడలను బాగుచేసి దానిని తిరిగి కట్టి పూర్వస్థితికి కొనివత్తును.

12. కావున యిస్రాయేలీయులు ఎదోమున మిగిలియున్న భాగమును, పూర్వము నాకు చెందిన జాతులన్నింటిని తిరిగి జయింతురు.

13. ప్రభువు ఇట్లనుచున్నాడు: పొలము దున్నగనే పంటపండు కాలము వచ్చును. విత్తనములు చల్లగనే ద్రాక్షపండ్లు తొక్కించు కాలము వచ్చును. పర్వతమునుండి తీయని ద్రాక్షరసము ప్రవహించును. కొండలనుండి ద్రాక్షారసము పారును.

14. నేను నా ప్రజలను మరల తమ దేశమునకు కొనివత్తును. వారు శిథిలమైయున్న తమ నగరములను పునర్నిర్మించుకొని వానిలో వసింతురు. ద్రాక్షలునాటి ద్రాక్షారసము గ్రోలుదురు. తోటలువేసి పండ్లు భుజింతురు.

15. నా ప్రజలను నేను వారికిచ్చిన నేలపై నాటుదును. ఇకమీదట వారినెవరును పెల్లగింపజాలరు. ఇది మీ దేవుడనైన ప్రభువు వాక్కు”