1. ప్రభువు దర్శనమున హబక్కూకు ప్రవక్తకు తెలియజేసిన సందేశము ఇది: ప్రవక్తకు దేవునికి మధ్య సంభాషణము - ప్రవక్త అన్యాయమును గూర్చి ఫిర్యాదు చేయుట
2. ప్రభూ! నీవు నా వేడుకోలును ఆలించుటకును, మమ్ము “హింస” నుండి కాపాడుటకును నేనింకను ఎన్నాళ్లు మొర పెట్టవలెను?
3. నీవు నేనిట్టి అన్యాయమును కాంచునట్లు చేయనేల? నీవు ఆ దుష్కార్యములు చూచి ఎట్లు సహింతువు? నాకు కనిపించునది అంతయు వినాశనము, దౌర్జన్యమే. ప్రజలెల్లయెడల జగడములు ఆడుచున్నారు.
4. ధర్మశాస్త్రము బలహీనమై నిష్ప్రయోజనమైనది. న్యాయమెంత మాత్రమును జరుగుటలేదు. దుష్టులు సజ్జనులను అణగదొక్కుచున్నారు. కావున న్యాయము తారుమారు అగుచున్నది.
5. అపుడు ప్రభువు తన ప్రజలతో ఇట్లనెను: మీరు మీ చుట్టుపట్లగల జాతులను పరిశీలించి చూడుడు. మీరు చూచినదానివలన మీకాశ్చర్యము కలుగును. నేనిపుడొక కార్యమును చేయబోవుచున్నాను. దానిని గూర్చి వినినపుడు మీరు నమ్మజాలరు.
6. నేను బబులోనీయులను పురికొల్పుదును. వారు భీకరాకారులు, ఉద్రేకపూరితులు. అన్యదేశములను జయించుటకుగాను వారు లోకము నాలుగుచెరగులగుండ పయనము చేయుదురు.
7. ఆ జనులను గాంచి ప్రజలు భీతిల్లుదురు. వారు పొగరుతో తమ ఇష్టము వచ్చిన నిర్ణయములు చేయుదురు.
8. వారి అశ్వములు చిరుతపులులకంటె వేగముగా పరుగెత్తును. అవి ఆకలిగొనిన తోడేళ్లకంటె భయంకరమైనవి. వారి రౌతులు దూరదేశములనుండి స్వారిచేయుచు వత్తురు. గరుడపక్షి ఎరమీదికి వడిగా దిగివచ్చినట్లుగా హఠాత్తుగా వచ్చిపడుదురు.
9. వారి సైన్యము దౌర్జన్యములతో దోపిడీ చేయుచు వచ్చును. వారిని గాంచి ఎల్లరును భీతిల్లుదురు. వారి బందీలు ఇసుకరేణువులవలె అసంఖ్యాకులుగా ఉందురు.
10. వారు రాజులను గడ్డిపోచలవలె చూతురు. ఉన్నతాధికారులను గేలిచేయుదురు. ఎట్టి కోటయు వారిని అడ్డగింపజాలదు. మట్టి దిబ్బలు పోసి వారు దానిని పట్టుకొందురు.
11. వారు వాయువువలె వచ్చి మీదపడి అతిక్రమము చేసి దిఢీలున అదృశ్యులగుదురు. వారి బలమే వారికి దైవమని విర్రవీగుదురు.
12. ప్రభూ! నీవు ఆదినుండియు ఉన్నవాడవు. నీవు పవిత్రుడవు, నిత్యుడవు. నాకు దేవుడవు నన్ను కాపాడు ప్రభుడవైన దేవా! నీవు బబులోనీయులను ఎన్నుకొని వారిని బలాఢ్యులను చేసితివి. వారిచే మమ్ము దండింపబూనితివి.
13. పవిత్రమైన నీ నేత్రములు చెడును చూడజాలవు. చెడుకు పాల్పడు వారిని చూచి నీవు సహింపజాలవు. నీవు ద్రోహబుద్ధి గలవారిని చూచి ఓర్చుకోజాలవుకదా! అట్లయిన వారు తమకంటె న్యాయవంతులైన ప్రజలను నాశనము చేయుచుండగా నీవు నోరు కదపవేమి?
14. చేపలను, నేలపై ప్రాకు పురుగులను నడిపించు నాయకుడు లేడు. నీవు మమ్ములను ఆ ప్రాణులవలె చూడనేల?
15. వారు గాలములు వేసి నరులను చేపలవలె పట్టుకొందురు. " వారిని తమ వలలో చిక్కించుకొని లాగుకొని పోవుదురు. " తాము పట్టుకొనిన వారిని చూచి హర్షధ్వానము చేయుదురు.
16. వారి వలలు వారికి శ్రేష్ఠమైన వానిని అందించును కావున వారు బలులతోను, సాంబ్రాణి పొగతోను తమ వలలను ఆరాధింతురు.
17. వారు సదా తమ వలలను కుమ్మరించి ఖాళీ చేయవలసిదేనా? నిరంతరము నిర్దయతో జాతులను సంహరింపవలసినదేనా?
1. ప్రభువు నాతో ఏమి చెప్పునో వినుటకును, అతడు నా ఫిర్యాదులకేమి బదులుచెప్పునో తెలిసికొనుటకును నేను కావలి బురుజునెక్కిన వేచియుందుననుకొనగా
2. ప్రభువు నాకు ఈ క్రింది జవాబు నొసగెను: “నేను నీకు తెలియజేయు దర్శన వివరమును నీవు స్పష్టముగ వ్రాత పరికరములపై వ్రాయుము. సులువుగా చదువుటకు వీలుగా ఉండునట్లు వ్రాయుము.
3. నేను నీకు వెల్లడిచేయు సంగతి నిర్ణీతకాలమున జరుగును. కాలపరిసమాప్తిన అది నిక్కముగా జరుగును, ఆ సంగతి నెరవేరి తీరును. అది ఆలస్యముగా నెరవేరునట్లు కనిపించినను నీవు దానికొరకు వేచియుండుము. అది తప్పక జరుగును, ఇక ఆలస్యము జరుగదు.
4. ఆ సంగతి యిది. సత్యవంతులుగాక, స్వాతిశయులైన దుష్టులు కొనసాగరు. అయితే నీతిమంతులు భక్తి విశ్వాసములవలన జీవింతురు. పీడకులకు ఐదు శాపములు
5. సంపదలు మోసముతో కూడినవి, ఆశబోతులు, గర్వాత్ములు మనశ్శాంతి లేనివారు మృత్యువువలె వారికిని సంతృప్తి ఉండదు అట్టివారు పాతాళమంత విశాలముగ ఆశపెట్టుకునియుండి సకలజనములను వశపరచుకొందురు, సకలజాతులను చెరపట్టుకుందురు.
6. తమవి కాని సంపదలను కూడబెట్టుకొను వారికనర్థము తప్పదు. తాకట్టుసొమ్మును విపరీతముగా ప్రోగుజేసికొను వారికనర్ధము తప్పదు. వారు ఎంతకాలము నిలుచుదురు? అని చెప్పుకొనుచూ మీరు ఉపమానరీతిగా వీరినిగురించి అపహాస్యపు సామెతలు వాడుదురుకదా!
7. మీరూహింపక మునుపే మీ వడ్డీదారులు మీపై పడుదురు. మిమ్ము హింసించువారు మెలకువతో వచ్చి మిమ్ము కొల్లగొట్టుదురు.
8. మీరు చాలజాతులను దోచుకొంటిరి. మీరు హత్యలుచేసిన కారణమున, లోకమునందును, దాని నగరములందును వసించుజనులను హింసించిన కారణమున, ఇపుడు మిగిలియున్న జాతులు మిమ్ము దోచుకొనును.
9. దౌర్జన్యము చేసి ఇతరులనుండి దోచుకొని వచ్చిన సొత్తుతో తమ కుటుంబములను సంపన్నము చేసికొనినవారికిని, ఆపదలనుండి తమ కుటుంబమును కాపాడుకోగోరిన వారికిని అనర్గము తప్పదు.
10. మీ పన్నాగములు మీ కుటుంబమునకు అవమానము తెచ్చెను. మీరు చాల జాతులను నాశనము చేయుటవలన మీ వినాశనము మీరే కొనితెచ్చుకొంటిరి.
11. మీ గోడలలోని రాళ్ళే మీకు వ్యతిరేకముగా మొరపెట్టును. ఆ మొర మీ యింటి వాసములనుండి ప్రతిధ్వనినిచ్చును.
12. నేరములతో నగరమును స్థాపించినవారికి హత్యలతో పట్టణమును నిర్మించినవారికి అనర్థము తప్పదు.
13. మీరు జయించిన జాతులు కష్టపడి కట్టినదంతయు అగ్గిచే బుగ్గిపాలు కావలెననియు, వారు అలసిసొలసి చేసిన శ్రమ , నిరకము కావలెననియు, సైన్యములకధిపతియైన ప్రభువు నిర్ణయించెను.
14. కాని సముద్రము నీటితో నిండియుండునట్లే, భూమి ప్రభువు కీర్తిని గూర్చిన జ్ఞానముతో నిండియుండును.
15. ప్రభువు ఘోర ఉగ్రతాపాత్రమును తమ పొరుగువానికి త్రాగనిచ్చి, వారి నగ్నత్వమును కాంచుటకు వారిని తప్ప త్రాగించి, మత్తులుగా చేయువారికి అనర్ధము తప్పదు.
16. మీ తరపున మీరు కీర్తికి బదులుగా, అపకీర్తి తెచ్చుకొందురు. మీరు కూడ త్రాగి మీ నగ్నత్వమును ప్రదర్శింతురు. మీ శిక్షయను మద్యమును ప్రభువు మీకు అందించును. మీ కీర్తి అపకీర్తిగా మారిపోవును.
17.మీరు లెబానోనునకు చేసిన హింస మీ మీదకే వచ్చును మీరు దాని పశువులను బెదిరించితిరి , కాన ఇప్పుడు ఆ పశువులు మీకు భీతి పుట్టించును. మీరు హత్యలు చేసి, దేశములందు, దాని నగరములందు, వసించు ప్రజలను హింసించిరి కాన మీకు ఇది సంభవించును.
18. వడ్రంగి విగ్రహమును చెక్కుటవలన ప్రయోజనమేమి? కళాకారుడు మూగబొమ్మను చేసి, దానియందు నమ్మిక ఉంచుటవలన ప్రయోజనమేమి? అబద్దములను బోధించు పోతవిగ్రహములందు విశ్వాసము ఉంచుటవలన ప్రయోజనమేమి?
19. కొయ్యముక్కతో నీవు మేల్కొనుమని మూగ రాతిబండతో నీవు లెమ్మని పలుకు వారికి అనర్థము తప్పదు. ఆ బొమ్మ మీకు సందేశము చెప్పగలదా? వెండిబంగారములతో కప్పినను విగ్రహమునకు ప్రాణము లేదు కదా! ప్రతిమవలన ప్రయోజనమేమి?
20. కాని ప్రభువు తన పవిత్రమందిరమున ఉన్నాడు. లోకమంతయు ఆయనెదుట మౌనముగా ఉండునుగాక!
1. హబక్కూకు ప్రవక్త ప్రార్థన: షిగ్యనోతు' రాగములో పాడదగినది.
2. ప్రభూ! నేను నీ కార్యములను గూర్చి వినగా నాకు వెరగు పుట్టినది. కాలగమనములో నీ కార్యములను పునరుజ్జీవింపచేయుము ఆయా కాలగమనములను (మాకు) తెలియజేయుచూ కోపించుచూనే నీ కనికరమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము.
3. దేవుడు తేమానునుండి కదలి వచ్చుచున్నాడు. పవిత్రుడైన దేవుడు పారాను కొండలనుండి తరలి వచ్చుచున్నాడు. ఆయన తేజస్సు ఆకసమునందంతట కనపడుచున్నద. భూమి ఆయన ప్రభావముతో నిండియున్నది.
4. ఆయన ప్రకాశము సూర్యకాంతివలెనున్నది. ఆయన హస్తమునుండి జ్యోతి వెలువడును. ఆయన బలము ఆ హస్తమున నిక్షిప్తమై ఉన్నది.
5. అంటు రోగము ఆయనముందట నడచును. అగ్నిమెరుపులు ఆయన వెంటవచ్చును.
6. ఆయన నిలుచుండినపుడు భూమి కంపించును. ఆయన కన్నెత్తిచూడగా జాతులు గడగడ వణకును శాశ్వత నగరములు పునాదులనుండి కదలును ఆయన ప్రాచీనకాలమున నడచిన సనాతన పర్వతములు నేలలోనికి క్రుంగును.
7. నేను కూషాను గుడారములలో వ్యధనుచూచితిని. మిద్యాను తెరలు గజగజలాడుటను గాంచితిని.
8. ప్రభూ! నీ ఉగ్రత ప్రజ్వరిల్లినది నదులపైనా? నదులపై నీకు ఆగ్రహము కలిగినందులకా? నీకు సాగరముపై ఉగ్రత కలిగినందులకా నీవు గుఱ్ఱములను కట్టుకుని రధముల నెక్కి రక్షణార్ధమై వచ్చుచున్నావు?
9. నీవు నీ విల్లును ఒరనుండి బయటకు తీసితివి. నీ వాక్కుతోడని ప్రమాణముచేసి, బాణమును వింటినారిమీద పెట్టితివి నీవు భూమిని పగులగొట్టి నదులను కలుగజేసితివి
10. పర్వతములు నిన్ను చూచి గడగడవణకెను. ఆకసమునుండి జలములు వర్షించెను. పాతాళజలములు హోరెత్తెను వాని అలలు ఉవ్వెత్తుగా లేచెను.
11. వేగముగా పరుగిడు నీ బాణముల కాంతిని గాంచి, తళతళ మెరయు నీ బల్లెపు తేజస్సు చూచి సూర్యచంద్రులు తమ తావున తాము నిశ్చలముగా నిలిచిరి.
12. నీవు రౌద్రముతో భూమిపై నడచితివి. ఆగ్రహముతో జాతులను నీ కాలితో తొక్కితివి.
13. నీవు నీ ప్రజలను రక్షించుటకు బయలుదేరి వెళ్ళితివి. నీవు ఎన్నుకొనిన అభిషిక్తుని కాపాడుటకు పయనమైపోతివి. దుష్ఠుల నాయకుని హతమార్చితివి అతని అనుచరులను పట్టి నిర్మూలించితివి.
14. పేదలను రహస్యముగ కబళించవలెనని ఉత్సాహముతో, నన్ను ధూళివలె చెదరగొట్టుటకు, తుఫానువలె వచ్చు యోధుల తలలలో ఈటెలను నాటుచున్నావు.
15. నీవు నీ గుఱ్ఱముల కాళ్ళతో సముద్రమును తొక్కింపగా దాని మహాజలములు నురగలు క్రక్కెను.
16. ఈ ధ్వనులెల్ల విని నేను కంపించుచున్నాను. నా పెదవులు గడగడ వణకుచున్నవి. నా మేను సత్తువను కోల్పోయినది. నా కాళ్ళు కూలబడుచున్నవి. అయినను దేవుడు మాపై దాడిచేయువారిని శిక్షించుకాలము వచ్చువరకును. నేను నెమ్మదిగ ఓపికగా వేచియుందును.
17. అంజూరము పూత పట్టకుండినను, ద్రాక్షతీగ కాయలు కాయకుండినను, ఓలివుపంట నాశనమైనను, . పొలము పండకపోయినను, గొఱ్ఱెలు దొడ్డిలో లేకపోయినను, కొట్టములోని పశువులు లేకపోయినను,
18. నేను ప్రభువునందు ఆనందించెదను. నా రక్షకుడైన దేవునియందు సంతసించెదను.
19.సర్వోన్నతుడైన ప్రభువు నాకు బలము నొసగును. నా పాదములకు జింక కాళ్ళకువలె లాఘవమును ఒసగి నేను కొండలపై నడయాడునట్లు చేయును.