1. ఉజ్జీయా, యోతాము, ఆహాసు, హిజ్కియాలు యూదాకును, యోహావాషు కుమారుడైన యరోబాము యిస్రాయేలునకును రాజులుగా ఉన్నకాలమున, ప్రభువు బేరీకుమారుడైన హోషేయకు తెలియజేసిన సందేశమిది.
2. ప్రభువు మొదట హోషేయ ద్వారా మాట్లాడినపుడు, అతడితో 'నీవు వెళ్ళి వ్యభిచారిణియైన యువతిని పెండ్లియాడి, వ్యభిచారమువలన పుట్టిన పిల్లలను తీసుకొనుము. ఇట్లే ఈ దేశప్రజలును నన్ను విడనాడి వ్యభిచారిణివలె ప్రవర్తించుచున్నారు' అని చెప్పెను.
3. కనుక హోషేయ దిబ్లాయీము కుమార్తెయైన గోమేరును పెండ్లియాడెను. ఆమె గర్భవతియై కుమా రుని కనెను.
4. ప్రభువు హోషేయతో “నీవు శిశువునకు 'యెస్రేయేలు' అని పేరు పెట్టుము. ఎందుకన, యిస్రాయేలు రాజు వంశకర్తయైన యెహూ పూర్వము యెస్రెయేలున హత్యలు జరిగించెను. కనుక నేను అనతికాలముననే ఆ రాజును శిక్షింతును. యెహూ రాజవంశమును తుదముట్టింతును.
5. ఆ సమయమున యెఫ్రాయేలు లోయలో యిస్రాయేలు సైన్యము బలమును అణచివేయుదును” అని చెప్పెను.
6. గోమెరు మరల గర్భవతియై ఆడుబిడ్డను కనెను. ప్రభువు హోషేయతో “ఈ శిశువునకు 'లోరూహామా' అని పేరుపెట్టుము. ఎందుకన నేను ఇక మీదట యిస్రాయేలీయులపై జాలి చూపను. వారితప్పిదములను మన్నింపను.
7. కాని నేను యూదా ప్రజలకు జాలి చూపుదును. ప్రభుడను, వారి దేవుడనైన నేను వారిని రక్షింతును. కాని యుద్దముద్వారా అనగా కత్తులు, విండ్లు, బాణములు, గుఱ్ఱములు, రౌతుల ద్వారా నేను వారిని రక్షింపను" అని చెప్పెను.
8. గోమేరు ఆ పాపకు పాలు మాన్పించిన పిదప మరల గర్భవతియై మగబిడ్డను కనెను.
9. ప్రభువు హోషేయతో “నీవు ఈ శిశువునకు 'లో-అమ్మీ' అని పేరు పెట్టుము. ఎందుకన, యిస్రాయేలీయులు నా ప్రజలుకారు, నేను వారికి దేవుడనుకాను” అని చెప్పెను.
10. అయినను యిస్రాయేలీయులు సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుకరేణువులవలె విస్తరిల్లుదురు. వారు లెక్కలకును, కొలతలకును అందరు. ఏ స్థలమందు మీరు 'నా ప్రజలుకారు' అన్నమాట ప్రజలు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు 'జీవముగల దేవుని కుమారులై ఉన్నారు' అని వారితో చెప్పుదురు.
11. అప్పుడు యిస్రాయేలీయులును, యూదీయులును ఐక్యమగుదురు. ఇరువురును కలిసి ఒక్కనాయకుని ఎన్నుకొందురు. వారు మరల తమదేశమున పెంపు చెందుదురు. అది యెఫ్రాయేలునకు శుభదినమగును.
1. మీరు నా ప్రజలని మీ యిస్రాయేలు సోదరులతోను, జాలినొందినవారని మీ సోదరీమణులతోను మీరు చెప్పుడు.
2. “బిడ్డలారా! మీరు మీ తల్లిని బ్రతిమాలుడు. ఆమె నాకికభార్యకాదు, నేను ఆమెకు భర్తనుకాను. ఆమె తన వ్యభిచారమును, వేశ్యావృత్తిని మానవలెనని చెప్పుడు.
3. మానదేని, ఆమె పుట్టిననాడువలె ఆమెను దిగంబరను చేయుదును. ఆమెను ఎడారిగను, ఎండిన నేలనుగను మార్చెదను. అప్పుడామె దాహముతో చచ్చును.
4. నేనామె బిడ్డలపై నెనరుచూపను. వారు వ్యభిచారిణి సంతానము. వారి తల్లి వ్యభిచారిణిగా ప్రవర్తించెను. ఆమె సిగ్గుమాలిన కులటయై ఆ బిడ్డలను కనెను.
5. ఆమె 'నేను నా విటులవద్దకేగెదను. వారు నాకు అన్నపానీయములు, ఉన్ని, నార, ఓలివుతైలము, ద్రాక్షాసారాయమును ఇచ్చెదరు' అని పలికెను.
6. కనుక నేనామెకు అడ్డముగా ముళ్ళకంచె వేయుదును. ఆమె గమనమును నిరోధించుటకు గోడ కట్టుదును.
7. ఆమె తన విటులవెంటబడునుగాని వారు ఆవిడకు దొరకరు. వారికొరకు ఆమె గాలించునుగాని వారావిడ కంటబడరు. అప్పుడామె 'నేను నా మొదటి భర్తవద్దకేగెదను, ఇప్పటికంటె అప్పుడే నేను సుఖముగానుంటిని' అని పలుకును.
8. తనకు ధాన్యమును, ద్రాక్షాసారాయమును, ఓలివు తైలమును ఇచ్చినది నేనేయనియు, నేనొసగిన వెండిబంగారములనే తాను బాలుపూజకు వినియోగించుకొనెననియు, ఆమె అంగీకరింపదుకదా!
9. కావున కోతకాలము వచ్చినపుడు నేనావిడకు ధాన్యమును, ద్రాక్షాసారాయమును ఈయను. బట్టలు తయారుచేసికొనుటకు ఆమెకిచ్చిన ఉన్నిని, నారను మరల తీసికొందును.
10. ఆమె విటుల ఎదుటనే ఆమెను దిగంబరను చేయుదును. నా బారినుండి ఆమెనెవరును కాపాడజాలరు.
11. ఆమె ఉత్సవములను మాన్పింతును. ఈ అమావాస్యనాడును, విశ్రాంతిదినములందును, సాంవత్సరిక దినములందును, ఆమె చేయు పండుగలను ఆపుదును.
12. ఆవిడ 'నా విటులు నాకు కట్నముగానిచ్చిరి' అని చెప్పుకొను ద్రాక్షతోటలను, అంజూరపుతోటలను నాశనము చేయుదును. ఆ తోటలను బీళ్ళుగా మార్చెదను. వన్యమృగములు వానిని పాడుచేయును.
13. నన్ను మరిచిపోయినందులకు బాలుదేవతకు సాంబ్రాణి పొగ వేసినందులకు, నగలతో సింగారించుకొని బయలుదేరి విటుల వెంటబడినందులకు నేనామెను శిక్షింతును. ఇది ప్రభువు వాక్కు
14. నేనామెను మరల ఆకర్షించి ఎడారిలోనికి కొనిపోవుదును. అచటామెతో ప్రేమ సంభాషణములు నడుపుదును.
15. ఆమె ద్రాక్షతోటలను ఆమెకు మరల ఇచ్చివేయుదును. కష్టమయమైన ఆకోరు లోయను ఆమెకు మరల ఆశాజనకమైన దానినిగా చేయుదును. తాను యువతిగానున్నప్పుడువలె, ఐగుప్తునుండి తరలి వచ్చినపుడువలె ఆ ఎడారిలో ఆమె నాపట్ల మరల ప్రేమ చూపును.
16. అంతట ఆమె ఇక 'నేను తన బాలును'' అని కాక, 'నేను తన భర్తను' అని చెప్పును. ఇది ప్రభువు వాక్కు
17. నేనామెను బాలుదేవర అన్న పదమును ఉచ్చరింపకుండునట్లు చేయుదును. ఇక బాలుదేవర అన్న శబ్దమును ఆమె జ్ఞప్తియందుంచుకొనదు.
18. ఆ కాలమున నేను వన్యమృగములతోను, ఆకాశపక్షులతోను, ప్రాకెడిజంతువులతోను నిబంధనము చేసికొందును. కనుక అవి నా ప్రజలను బాధింపజాలవు. నేను దేశమునుండి యుద్ధసామగ్రిని, కత్తులను, విండ్లను తొలగింతును. కావున నా ప్రజలు శాంతిభద్రతలలో జీవింతురు.
19. యిస్రాయేలూ! నేను నిన్ను నా భార్యగా చేసికొందును. నీతితో, న్యాయముతో, కరుణతో, కృపతో నిన్ను కలకాలము నాదానిగా చేసికొందును.
20. నమ్మదగినతనముతో నిన్ను నా భార్యగా చేసికొందును. నేను ప్రభుడనని నీవు గ్రహింతువు.
21-22. ఆ కాలమున నేను నా ప్రజలైన యిస్రాయేలీయుల మనవులను ఆలింతును. ఆకసమునుండి నేలమీదికి వానను పంపుదును. భూమిమీద ధాన్యము, ద్రాక్షలు, ఓలివులు పండును.
23. నేను నా ప్రజలు తమ దేశమున వసించి పెంపుచెందునట్లు చేయుదును. 'జాలినొందనివారు' అనబడువారికి జాలిని చూపుదును. 'నా ప్రజలు కానివారు' అనబడువారితో 'మీరు నా ప్రజలు' అని చెప్పుదును. వారు “నీవు మా దేవుడవు” అని బదులు పలుకుదురు.
1. ప్రభువు నాతో “నీవు మరల వెళ్ళి తన ప్రియునితో వ్యభిచరించు ఆ స్త్రీ పట్ల ప్రేమ చూపుము. యిస్రాయేలీయులు అన్యదైవములను కొలుచుచు, వారికి ఎండిన ద్రాక్షపండ్ల మోదకములు అర్పింప గోరుచున్నారు. అయినను నేను వారిని ప్రేమించుట మానలేదు. అట్లే నీవును ఆమెను ప్రేమింపవలెను”అని చెప్పెను.
2. కనుక నేను పదునైదు వెండినాణెములను, ఏడుకుంచముల యవధాన్యమును ఇచ్చి ఆమెను కొని తెచ్చుకొంటిని.
3. నేనామెతో ఇట్లు చెప్పితిని: “నీవు వేశ్యావృత్తిని, వ్యభిచారమునుమాని. చాలకాలము వరకు నా దానివిగా యుండవలెను. నేనును ఆ విధముగనే ఉందును.
4. ప్రభువు నాతో “నీవు మరల వెళ్ళి తన ప్రియునితో వ్యభిచరించు ఆ స్త్రీ పట్ల ప్రేమ చూపుము. యిస్రాయేలీయులు అన్యదైవములను కొలుచుచు, వారికి ఎండిన ద్రాక్షపండ్ల మోదకములు అర్పింప గోరుచున్నారు. అయినను నేను వారిని ప్రేమించుట మానలేదు. అట్లే నీవును ఆమెను ప్రేమింపవలెను”అని చెప్పెను.
5. కాని ఆ ప్రజలు మరల తమ ప్రభువైన దేవునిచెంతకును, దావీదువంశజుడైన తమ రాజుచెంతకును అన్వేషణతో తిరిగివత్తురు. అప్పుడు వారు దేవుని మంచితనమును గౌరవింతురు. ఆయనకు భయపడి ఆయన దీవెనలు బడయుదురు.”
1. యిస్రాయేలీయులారా! మీరు ప్రభువు పలుకులు ఆలింపుడు. ఆయన ఈ దేశప్రజలపై ఇట్లు నేరము తెచ్చుచున్నాడు. దేశమున సత్యమును, కనికరమును, దైవజ్ఞానమును బొత్తిగాలేవు.
2. ప్రజలు మాటతప్పుచున్నారు, కల్లలాడుచున్నారు. హత్య, చౌర్యము, వ్యభిచారములకు పాల్పడుచున్నారు. నేరములు పెరిగిపోవుచున్నవి. హత్యలు వరుసగా జరిగిపోవుచున్నవి.
3. కావున దేశము బెట్టచే ఎండిపోవును. జీవకోటి నశించును. మృగములు, పక్షులు, చేపలుకూడ చచ్చును.
4. ప్రభువిట్లనుచున్నాడు: ప్రజలనెవరును నిందింపనక్కరలేదు. యాజకులారా! నేను మీపైన నేరముతెచ్చెదను.
5. మీరు రేయింబవళ్ళు తప్పులు చేయుచున్నారు. ప్రవక్తలకూడ మీకంటేనేమియు మెరుగుకాదు. నేను మీ తల్లియైన యిస్రాయేలును నాశనము చేయుదును.
6. నా ప్రజలు దైవజ్ఞానము లేక చెడుచున్నారు. మీరు దైవజ్ఞానమును నిరసించినట్లే నేను మీ యాజకత్వమును నిరసింతును. మీరు నా ఉపదేశమును విస్మరించితిరిగాన, నేను మీ తనయుల యాజకత్వమును విస్మరింతును.
7. యాజకులారా! మీ సంఖ్య పెరిగినకొలది మీ పాపములు కూడ పెరుగుచున్నవి కనుక నేను మీకు కీర్తికి బదులుగా అపకీర్తి రప్పింతును.
8. ప్రజల పాపములవలన మీకు తిండి దొరకుచున్నది. కావున జనులు అధికముగా పాపము చేయవలెనని మీరు కోరుచున్నారు.
9. అందుచే ఆ ప్రజలకువలె మీకును శిక్షపడును. నేను మీ దుష్కార్యములకు తగినట్లుగా మిమ్ము దండింతును. మీ పాపఫలితమును మీరు అనుభవింతురు.
10. నన్ను విడనాడి పరదైవములను ఆశ్రయించితిరి. కాన మీరు బలి అర్పణలను భుజింతురుగాని మీ ఆకలితీరదు. మీరు దేవతల పేరిట వ్యభిచరింతురు. గాని సంతానము బడయజాలరు.
11. ప్రభువు ఇట్లనుచున్నాడు: క్రొత్తది ప్రాతదినైన మద్యమువలన నా ప్రజలకు మతిపోయినది.
12. వారు కొయ్యముక్కలనుండి దైవసందేశము అడుగుచున్నారు. నేలలో పాతిన కఱ్ఱలు వారి ప్రశ్నలకు జవాబు చెప్పుచున్నవి. వారు వ్యభిచారమువలన త్రోవతప్పిరి. రంకువలన నానుండి వైదొలగిరి.
13. వారు పర్వతములపైన బలులర్పింతురు. కొండమీది సింధూరముల, చీనారుల, మస్తకి వృక్షముల పసందైన నీడలో సాంబ్రాణి పొగ వేయుదురు. కావుననే మీ కుమార్తెలు వేశ్యలగుచున్నారు. మీ కోడండ్రు పడుపుగత్తెలగుచున్నారు.
14. అయినను నేను వారిని దండింపను. ఎందుకన మీరే వేశ్యలతో వ్యభిచరించి, వారితో కలిసి బలులు అర్పించుచున్నారు. మతిలేని ప్రజలకు గతిలేదుకదా!
15. యిస్రాయేలీయులు వ్యభిచారములో మునిగినను, యూదా ప్రజలు పాపము చేయకుందురుగాక! మీరు ఆరాధనకు గిల్గాలునకును, బేతావెనునకును పోవలదు.
16. యిస్రాయేలీయులు మొండి పెయ్యలవంటి వారైరి కనుక నేను వారిని గడ్డిమైదానములలో గొఱ్ఱెపిల్లలనువలె మేపజాలను.
17. ఎఫ్రాయిము విగ్రహములపాలయ్యెను. వానిని అటులనే ఉండనిమ్ము.
18. వారు మధువును సేవించి మత్తెక్కి వ్యభిచారము మరిగి గౌరవమునకు మారుగా అగౌరవమును తెచ్చుకొనిరి.
19. వారు గాలికి కొట్టుకొని పోయినట్లుగా కొట్టుకొని పోవుదురు. తామర్పించిన బలులవలన అవమానము తెచ్చుకొందురు.
1. యాజకులారా! ఈ పలుకులాలింపుడు. యిస్రాయేలీయులారా! సావధానముగా వినుడు. రాజవంశజులారా! చెవియొగ్గి వినుడు. మీరు న్యాయము నెలకొల్పవలసినవారు కావున దేవుడు మీకు తీర్పువిధించును. మీరు మిస్పావద్ద జనులకు బోనుగా తయారైతిరి. తాబోరువద్ద జనులకు ఉచ్చుగా తయారైతిరి.
2. మీరు ప్రజలకు గోతివలెనున్నారు. కనుక నేను మిమ్మెల్లరిని శిక్షింతును.
3. ఎఫ్రాయీము ప్రజలగూర్చి నాకు బాగుగా తెలియును. వారు నా నుండి దాగుకోజాలరు. యిస్రాయేలు విగ్రహారాధనతో తమను తాము అపవిత్రము చేసికొనిరి.
4. ప్రజలు తాము చేసిన దుష్కార్యములవలన తిరిగి దేవుని వద్దకు రాలేకపోవుచున్నారు. వారు విగ్రహారాధనమున తలమున్కలైయున్నారు. కావున ప్రభువును తెలిసికోజాలకున్నారు.
5. యిస్రాయేలీయుల గర్వమే వారు దోషులని నిరూపించుచున్నది. వారి పాపములే వారిని కూలద్రోయుచున్నవి. ఎఫ్రాయీముతోపాటు యూదా ప్రజలు కూడ కూలుదురు.
6. వారు ఎడ్లను గొఱ్ఱెలను దేవునికి బలి యిచ్చినను ప్రభువు వారికి దొరకడు. అతడు వారిని విడనాడెను.
7. వారు ప్రభువునకు ద్రోహము చేసిరి, వారి బిడ్డలు అన్యులబిడ్డలు, కనుక వారు తమపొలములతో పాటు నాశనమగుదురు.
8. గిబియాలో బాకానూదుడు. రామాలో బూరనూదుడు. బేతావెనున యుద్ధనాదము చేయుడు. బెన్యామీనీయులారా! పోరునకు సన్నద్దులుకండు.
9. శిక్షాదినము వచ్చుచున్నది. ఎఫ్రాయీము చెడిపోవును. యిస్రాయేలూ! నేనెరిగించు ఈ కార్యము జరిగితీరును.
10. ప్రభువు ఇట్లనుచున్నాడు: యూదానాయకులు యిస్రాయేలుపై దండెత్తి వారి భూమిని ఆక్రమించుకొనిరి. కావున నా శిక్ష వారిపై వరదవలెపారును.
11. ఎఫ్రాయీమీయులు సాయము చేయలేని వారివద్దకు సాయముకొరకు పోయిరిగాన పీడనమునకు గురియైరి. న్యాయముగా తమకు చెందియున్న భూమిని కోల్పోయిరి.
12. నేను ఎఫ్రాయీమునకు చెదపురుగువంటి వాడనగుదును. యూదా ప్రజకు కొరుకుడు పురుగువంటి వాడనగుదును.
13. ఎఫ్రాయీము తన జబ్బును తెలిసికొనెను. యూదా తన గాయములను గమనించెను. ఎఫ్రాయీము అస్సిరియాకు పోయి ఆ దేశపు రాజైన యారేబును సాయమడిగెను. కాని అతడు వారి వ్యాధిని నయము చేయలేకపోయెను. వారి గాయములను మాన్పలేకపోయెను.
14. నేను సింహమువలె యిస్రాయేలీయుల మీదికి దూకుదును. కొదమసింగమువలె యూదాజనుల మీదికి లంఘింతును, వారిని ముక్కలు ముక్కలుగా చీల్చి వెళ్ళిపోవుదును. నేనాజనులను ఈడ్చుకొని పోవుదును. ఎవరును వారిని రక్షింపజాలరు.
15. నా ప్రజలు తమ పాపములకు తగిన శ్రమలనుభవించి, నన్ను వెదకుకొనుచు వచ్చువరకును నేను వారిని విడనాడి నా తావునకు వెళ్ళిపోవుదును. వారు తమ బాధలోనైన నా కొరకు గాలింపవచ్చును.
1. ప్రజలిట్లందురు: “మనము మరల ప్రభువునొద్దకు పోవుదము. అతడు మనలను చీల్చివేసెను, కాని ఇపుడు మనలను బాగుచేయును. అతడు మనలను గాయపరచెను. కాని ఇపుడు మన గాయములకు కట్టుకట్టును.
2. రెండు దినములయిన తరువాత ఆయన మనకు తిరిగి జీవమును దయచేయును. మూడవరోజున ఆయన మనలను తిరిగి నిలబెట్టును. మనము ఆయన సముఖమునందు బ్రతుక గలుగుదుము.
3. మనము ప్రభువును తెలిసికొనుయత్నము చేయుదము వేకువవచ్చునంత నిశ్చయముగా, వసంతకాలపు వానలు వచ్చునంత నిక్కముగా ఆయన మనచెంతకు వచ్చును”
4. కాని ప్రభువు ఇట్లనుచున్నాడు: ఎఫ్రాయీమూ! నేను మిమ్మేమి చేయుదును? యూదా ప్రజలారా! నేను మిమ్ము ఏమి చేయుదును? మీకు నాపట్ల గల ప్రేమ ఉదయకాలపు మంచువలెను, వేకువన విచ్చిపోవు పొగమంచువలెను క్షణికమైనది.
5. కావుననే నేను నా ప్రవక్తలను మీ చెంతకు పంపితిని. నేను విధించు తీర్పునుగూర్చియు, నేనుపంపు శిక్షనుగూర్చియు, వారిచే మీకు సందేశము చెప్పించితిని.
6. నేను మీ నుండి కోరునది కారుణ్యమునేగాని, బలులు కాదు. దేవునిగూర్చిన జ్ఞానమునేగాని, దహనబలులు కాదు.
7. ఆదాము నిబంధనము మీరినట్లే, ఆ ప్రజలును నాయెడల నమ్మకద్రోహులై నా నిబంధనము మీరియున్నారు.
8. గిలాదు నగరము దుష్టవర్తనులతోను నరహంతకులతోను నిండిపోయెను.
9. యాజకులు దాగియున్న దొంగలగుంపువలె యాత్రికుల కొరకు పొంచియున్నారు. ఈ షెకెమునకు పోవుమార్గముననే వారు హత్యలు చేయుచున్నారు. బుద్ధిపూర్వకముగనే వారు ఈ దుష్కార్యములు చేయుచున్నారు.
10. నేను యిస్రాయేలు దేశమున ఘోరకార్యమును చూచితిని. ఎఫ్రాయీము విగ్రహములను కొలిచి అపవిత్రులైరి.
11. యూదాప్రజలారా! చెరలోనికి వెళ్ళిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినపుడు, ఆయన నీకు కోతకాలము నిర్ణయించును.
1. నేను యిస్రాయేలీయుల వ్యాధిని నయము చేసినపుడెల్ల ఎఫ్రాయీము పాపములును, సమరియా దోషములును బట్టబయలగుచున్నవి. ఎందుకన వారుచేయునదంతయు మోసము. దొంగలు ఇండ్లలో జొరబడుచున్నారు. ముఠాలు వీధులలో దోపిడి చేయుచున్నారు.
2. ఈ దుష్క్రియలన్నియు నేను జ్ఞప్తియందుంచు కొందునని వారు గ్రహించుటయేలేదు. వారి పాపములు వారి చుట్టును క్రమ్ముకొనినవి. అవి నా కంటికి కనిపింపకుండ ఉండజాలవు.
3. ప్రభువు ఇట్లనుచున్నాడు: వారి దుష్టత్వముతో తమ రాజునకు ఆనందము కలిగించుచున్నారు. వారి కల్లలాడుతనముతో అధిపతులను సంతోషపెట్టుచున్నారు.
4. జనులెల్లరును వేడెక్కిన ఒక ఆవమువలె ఉన్నారు. రొట్టెలు కాల్చువాడు పిండినిపిసికిన తరువాత ముద్దంతయు పొంగువరకు ఆ ఆవమును అధికముగ వేడిచేసి ఊరకుండునట్లు జనులెల్లరును మానని మోహావేశులైయున్నారు.
5. ఆ ప్రజలు రాజోత్సవదినమున రాజును, అధిపతులను తప్పత్రాగించి మత్తులను చేసిరి.
6. వారు తమ కుట్రలతో పొయ్యివలె మండుచుండిరి. రొట్టెలు కాల్చువాడు నిదురించునట్లు, రాత్రంతయు మాటునుంచిన వారి ద్వేషము మరల వేకువనే తీవ్రముగా మండుచున్న అగ్నివలె చెలరేగును.
7. ఆ జనులు కోపాగ్నితో తమ పాలకులను హత్యజేసిరి. వారి రాజులెల్లరును హత్యకు గురియైరి.. కాని వారిలో నన్ను స్మరించుకొనువాడు ఒక్కడును లేడు.
8. ప్రభువు ఇట్లనుచున్నాడు: యిస్రాయేలీయులు ఒక ప్రక్క మాత్రమే కాలిన రొట్టెవంటివారు '. వారు ఇరుగుపొరుగు జాతులపై, అధారపడుచున్నారు.
9. కాని ఈ చెయిదమువలన, తమ బలమును కోల్పోవుచున్నారని, వారు గ్రహించుటలేదు. వారికి కాలము సమీపించినది. శిరముపై జుట్టు నెరసినది, అయినను ఆ విషయమును వారు అర్థము చేసికొనుటలేదు.
10. యిస్రాయేలీయుల గర్వము వారు దోషులని చాటిచెప్పుచున్నది. ఇంత జరిగినను వారు తమ దేవుడను, ప్రభుడనైన నా చెంతకు తిరిగి వచ్చుటలేదు.
11. ఎఫ్రాయీము తెలివిలేని పాపురమువలె అటునిటు ఎగురుచున్నది. అది మొదట ఐగుప్తును శరణువేడెను. అటుపిమ్మట అస్సిరియా వద్దకు పరుగెత్తెను.
12. కాని ఎగిరిపోవుపక్షులను వలపన్ని పట్టుకొనునట్లు నేను వారిని పట్టుకొందును. వారి దుష్కార్యములకుగాను వారిని దండింతును.
13. ప్రజలు నన్ను విడనాడిరిగాన నాశనమునకు గురియగుదురు. నాకెదురు తిరిగిరి, కనుక చత్తురు. నేను వారిని రక్షింపగోరుచున్నాను. గాని వారి ఆరాధనలో చిత్తశుద్దిలేదు.
14. ఆ జనులు నాకు హృదయపూర్వకముగా ప్రార్థన చేయుటలేదు. కాని క్రిందబడి విలాపములు మాత్రము చేయుచున్నారు. ద్రాక్షాసారాయము కొరకు ధాన్యము కొరకు మొరపెట్టునపుడు శరీరమును గాయపరచు కొనుచున్నారు. వారు నిజముగా తిరుగుబాటుదారులు.
15. వారిని పైకి తీసికొనివచ్చినది నేను. బలాఢ్యులను చేసినది నేను. అయినను వారు నా పైనే కుట్రపన్నిరి.
16. ఆ ప్రజలు మరలుదురుగాని, సర్వోన్నతుని వైపు మరలరు. వారు మోసకరమైన వింటివలె నమ్మదగనివారు. వారి నాయకులు గర్వోక్తులు పలుకుచున్నారు కావున కత్తివాత పడుదురు. ఐగుప్తీయులు వారిని చూచి నవ్వుదురు. "
1. ప్రభువు ఇట్లనుచున్నాడు: బాకానూది యుద్ధనాదము చేయుడు. నా ప్రజలు నేను వారితో చేసికొనిన నిబంధనమును మీరి నా ధర్మశాస్త్రమును నిరాకరించిరి. కనుక శత్రువులు నా దేశముపై గరుడపక్షివలె దిగివత్తురు.
2. యిస్రాయేలీయులు నేను తమ దేవుడననియు, తాము నన్నెరుగుదుమనియు వాకొనుచున్నారు.
3. కాని వారు తమకు హితమైన దానిని నిరాకరించిరి. కనుక శత్రువులు వారిని వెన్నాడుదురు.
4. నా ప్రజలు నాకు అనుకూలురుకాని రాజుల నెన్నుకొనిరి. నేనెరుగని అధిపతులను నియమించిరి. వారు తమవెండి, బంగారములతో ప్రతిమలను చేసికొని తమ వినాశనమును తామే కొనితెచ్చుకొనిరి.
5. సమరియా ప్రజలు కొలుచు కోడెదూడను నేను ఏవగించుకొందును. నేను నా ప్రజలపై ఆగ్రహము చెందితిని. వారు ఎంతకాలము పవిత్రతనొందకుండ ఉందురు?
6. అది యిస్రాయేలువారి చేతిపనియేకదా! ఒక కంసాలి దానిని చేసెను. ఆ బొమ్మ దైవము కాజాలదుకదా! సమరియా ప్రజలు కొలుచు కోడెదూడ ముక్కలు ముక్కలగును.
7. గాలిని విత్తువారు తుఫానును కోసికొందురు. విత్తనిదే పైరు, వెన్ను ఎట్లు పండును? ఒకవేళ పండినను, అన్యజాతివారు దానిని అపహరింతురు.
8. యిస్రాయేలీయులును అన్యజాతుల వంటివారైరి. పగిలిపోయిన కుండవలె నిష్ప్రయోజకులైరి.
9. అడవిగాడిద తనకోరిక తీర్చుకోబోయినట్లు యిస్రాయేలు అస్సిరియా ఆశ్రయమునకు అర్రులు చాచినది. ఏలయన ఎఫ్రాయీము బాడుగకు ప్రియులను రప్పించుకొనుచున్నది.
10. ఆ జనులు అన్యజాతులకు సొమ్ము చెల్లించినను, నేను వారినెల్లరిని ప్రోగుజేసి దండింతును. అస్సిరియా చక్రవర్తి తమను పీడింపగా వారు త్వరలోనే తగ్గిపోవుదురు.
11. ఎఫ్రాయీము పాపనిర్మూలమునకు పెక్కు బలిపీఠములు నిర్మించెను. కాని ఆ బలిపీఠములే అతడు పాపము చేయుటకు ఆధారములయ్యెను.
12. నేను ప్రజల కొరకు పెక్కు ధర్మశాసనములు వ్రాసితిని. కాని వారు వానిని అన్యుల శాసనములవలె యెంచి తృణీకరించిరి.
13. వారు నాకు బలిపశువులను అర్పించి ఆ పశువుల మాంసమును భుజించుచున్నారు. కాని యావే ప్రభుడనైన నేను వారివలన ప్రీతి చెందనైతిని. నేను వారి పాపములను జ్ఞప్తికి తెచ్చుకొని వారిని శిక్షింతును. వారు మరల ఐగుప్తునకు వెళ్ళిపోవలసినదే.
14. యిస్రాయేలీయులు ప్రాసాదములను నిర్మించిరి. కాని తమ సృష్టికర్తను విస్మరించిరి. యూదాప్రజలు సురక్షిత నగరములను కట్టిరి. కాని నేను పంపు అగ్ని వారి ప్రాసాదములను, వారి నగరములను కాల్చివేయును.
1. యిస్రాయేలీయులారా! మీరు అన్యజాతులవలె ఉత్సవము చేసికోరాదు. మీరు ప్రభువును విడనాడి అన్యదైవముల కొలిచిరి. ప్రతి కళ్ళమునను బాలుదేవతనుండి పడుపుసొమ్ము గైకొంటిరి. అతడు మీకు ధాన్యమునిచ్చునని ఆశించితిరి.
2. కాని త్వరలోనే మీకు ధాన్యము, తైలము కొరతపడును. క్రొత్త ద్రాక్షాసారాయము లోపించును.
3. యిస్రాయేలీయులు ప్రభువు దేశమున మనజాలరు. వారు ఐగుప్తునకు వెళ్ళిపోవలెను. అస్సిరియాయందు నిషిద్ధాహారము భుజింపవలెను.
4. ఆ అన్యదేశములలో వారు ప్రభువునకు పానీయము, బలులు అర్పింపజాలరు. శవముల పాతి పెట్టునప్పుడువలె అపవిత్రాహారము భుజించి, ఎల్లరును మైలపడుదురు. ఆ ఆహారము వారి ఆకలితీర్చునేగాని ప్రభువు మందిరమున అర్పించుటకు ఉపయోగపడదు.
5. ప్రభువుపండుగ మహోత్సవము వచ్చినపుడు వారేమి చేయుదురు?
6. వినాశనము దాపురించినపుడు ఆ జనులు చెల్లాచెదరగుదురు. ఐగుప్తీయులు వారిని ప్రోగుజేసి నోపు పట్టణమునందు పాతిపెట్టుదురు. వారు తమ వెండిని దాచి పెట్టుకొన్న తావులలో, పూర్వము తాము వసించిన గృహములలో, కలుపు మొక్కలు, ముండ్లపొదలు ఎదుగును.
7. శిక్షాకాలము సమీపించినది. జనులు తమ చేతలకు ప్రతిఫలము అనుభవించు రోజులు వచ్చినవి. ఆ దినములు వచ్చినప్పుడు యిస్రాయేలీయులు గ్రహింతురు. ఆ ప్రవక్త బుద్దిహీనుడు. ఈ దీర్ఘదర్శి ఉన్మత్తుడని మీరు పలుకుచున్నారు. మీ పాపములు పెచ్చు పెరుగుటచే నేను మీకు గిట్టనైతిని.
8. యిస్రాయేలునకు కావలివాడుగానుండుటకు ప్రభువు నన్ను పంపెను. కాని నేను ఎటుపోయినను మీరు నాకు ఉచ్చులు పన్నుచున్నారు. దేవుని దేశముననే ప్రజలు నన్ను ద్వేషించుచున్నారు.
9. పూర్వము గిబియాలోవలె ఈ జనులిప్పుడు కూడ దుష్టవర్తనకు పాల్పడుచున్నారు. ప్రభువు వారి పాపములను, జ్ఞప్తికి దెచ్చుకొని వారిని దండించును.
10. ప్రభువు ఇట్లనుచున్నాడు: నేను మొదట యిస్రాయేలీయులను చూచినపుడు వారు ఎడారిలో ద్రాక్షపండ్లు దొరికినట్టు వారు నాకు దొరికిరి. నేను మొదట మీ పితరులను గాంచినపుడు వారు అత్తిచెట్టుపై తొలికాపు పండ్లవలె కనిపించిరి, కాని వారు పెయోరు కొండకు రాగానే బాలును కొలిచిరి. తాము కొలుచు దేవతవలె తామును నీచులైరి.
11. ఎఫ్రాయీము కీర్తి పక్షివలె ఎగిరిపోవును. వారికిక సంతానము కలుగదు. వారి స్త్రీలు గర్భము ధరింపరు.
12. ఒకవేళ వారు బిడ్డలను పెంచినను, ఒక్కరిని గూడ మిగులనీయకుండ నేను వారిని వధింతును. నేనీ ప్రజలను విడనాడినపుడు వారికి శ్రమ, అనర్గము తప్పదు.
13. ఎఫ్రాయీము తన పిల్లలను బోనులోనికి నడిపించుట చూచుచుంటిని. ఇట్లు నరహంతలకు అప్పగించుటకై అది దాని పిల్లలను బయటకు తెచ్చెను.
14. ప్రభూ! వారికి ప్రతీకారము చేయుము. వారికి నీవేమి ప్రతీకారము చేయదువు? వారి స్త్రీలు గొడ్రాళ్ళుగాను, ఎండురొమ్ములు గలవారినిగాను చేయుము.
15. ప్రభువు ఇట్లనుచున్నాడు: ప్రజల పాపము గిల్గాలువద్ద ప్రారంభమయ్యెను. అచట నేను వారిని అసహ్యించుకొంటిని. వారి దుష్కార్యములకుగాను నేను వారిని నా దేశమునుండి వెళ్ళగొట్టుదును. నేను వారిపై ఇక ప్రేమ చూపను. వారి నాయకులెల్లరును నాకు ఎదురుతిరిగిరి.
16. ఎఫ్రాయీము వేరులు ఎండిపోయిన చెట్టువంటివారు. ఆ చెట్టు ఇక పండుకాయదు. వారికిక బిడ్డలు పుట్టరు. ఒకవేళ పుట్టినను, నేను వారి ముద్దుబిడ్డలను చంపుదును.
17. ప్రభువు ప్రజలు అతని మాటవినరైరి. కనుక నేను కొలుచు దేవుడు వారిని పరిత్యజించును. వారు జాతులమధ్య తిరుగాడుదురు.
1. యిస్రాయేలీయులు విస్తారముగా పండిన ద్రాక్షతీగవంటివారు. కాని సంపదలు పెరిగిన కొలది వారు బలిపీఠములను అధికముగా నిర్మించిరి. పంట విస్తారముగా పండినకొలది దేవతా స్తంభములను ఎక్కువ సుందరముగా తయారుచేసిరి.
2. వారు కపటాత్ములు కావున తమ పాపములకు ప్రతిఫలము అనుభవింతురు. దేవుడు వారి బలిపీఠములను కూలద్రోయును. వారి దేవతా స్తంభములను పడగొట్టును.
3. ఈ ప్రజలు ఇట్లు పలుకుదురు: “మేము దేవుని లక్ష్యము చేయలేదుగాన మాకు రాజులేడయ్యెను. కాని రాజుండి మాత్రము మాకేమి చేయగలడు?”
4. వారి మాటలు నిరర్ధకములు, ప్రమాణములు అబద్ధపూరితములు, ఒడంబడికలు నిష్ప్రయోజనములు, న్యాయము అన్యాయముగా మారినది. అది విషపూరితమైన కలుపు మొక్కలవలె దున్నిన చేనిలో పెరుగుచున్నది.
5. బేతావెను కోడెదూడ బొమ్మ నాశనమైనందులకు సమరియా పౌరులు భీతిని చెందుదురు. ఆ ప్రజలు దానికొరకు శోకింతురు. కనుమరుగైపోయిన ఆ బంగారు బొమ్మకొరకు దానిని కొలుచు యాజకులు విలపింతురు.
6. ఆ విగ్రహమును అస్సిరియాకు కొనిపోయి మహాచక్రవర్తికి కానుకగా ఇత్తురు. తాము పాటించిన సలహాలకుగాను ఎఫ్రాయీమీయులు తలవంపులు నగుబాట్లు తెచ్చుకొందురు.
7. సమరియా ధ్వంసమగును, దాని రాజు విరిగి నీటిమీదపడిన కొమ్మతో సమానము.
8. యిస్రాయేలీయులు విగ్రహములను కొలిచిన బేతావెను కొండలమీది గుళ్ళు నాశనమగును. అచటి బలిపీఠములపై ముళ్ళు, కలుపు మొక్కలు నెదుగును. ప్రజలు మమ్ము దాచియుంచుడని పర్వతములకు మనవి చేయుదురు. మమ్ము కప్పివేయుడని కొండలకు మొర పెట్టుకొందురు.
9. ప్రభువు ఇట్లనుచున్నాడు: యిస్రాయేలీయులు గిబియావద్ద పాపము చేసినప్పటినుండియు నాకు ద్రోహము చేయుచునేయున్నారు. కావున గిబియావద్దనే వారు పోరును చవిచూతురు.
10. నేను వారి మీదికి దండెత్తి వారిని శిక్షింతును. జాతులు ఏకమై వచ్చి వారిపై దాడిచేసి వారి నానాపాపములకుగాను వారిని దండించును.
11. పూర్వము ఎఫ్రాయీమీయులు బాగుగా తర్ఫీదుపొంది కళ్ళమును తొక్కుటకు సిద్ధముగానున్న పెయ్యవలెనుండిరి. కాని నేను ఆ పెయ్య సొగసైన మెడమీద కాడిమోపి దానిచే పొలము దున్నింపగోరితిని. యూదాచే నాగలి దున్నించితిని. యాకోబుచే దానిని చదును చేయించితిని.
12. నేను ఇట్లంటిని: మీరు క్రొత్త పొలమును దున్నుకొనుడు. న్యాయమను విత్తనములు వేసి దైవప్రేమ అను పంటకోసికొనుడు. మీరు ప్రభుడనైన నా చెంతకు తిరిగిరావలెను. నేను వచ్చి మీపై నీతివర్షమును కురియింతును.
13. కాని మీరు దుష్టత్వమను విత్తనములువేసి పాపమను పంటకోసికొంటిరి. మీ అనృతములు పండించిన ఫలములను భుజించితిరి. మీరు మీ రథములను, మీ సైన్యమును నమ్ముకొంటిరి.
14. కావున మీ మీదికి యుద్ధమువచ్చును. మీ కోటలన్నియు ధ్వంసమగును. పూర్వము షల్మాను రాజు యుద్ధమున బేతర్బేలును నాశనముచేసి తల్లులను, పిల్లలను నేలకు విసరికొట్టినట్లుగానే జరుగును.
15. బేతేలు ప్రజలారా! మీరుచేసిన ఘోరపాపమునకుగాను నేను మీకిట్టి కార్యమునే చేయబూనితిని. యుద్ధము ప్రారంభము కాగానే యిస్రాయేలు రాజు చచ్చును.
1. ప్రభువు ఇట్లనుచున్నాడు: యిస్రాయేలు బాలుడైయుండగా నేనతడిని ప్రేమించితిని. ఐగుప్తునుండి నా కుమారుని పిలిచితిని.
2. కాని నేనతనిని పిలిచినకొలది అతడు నా నుండి వైదొలగెను. నా ప్రజలు బాలుదేవతకు బలులు అర్పించిరి. విగ్రహములకు సాంబ్రాణిపొగ వేసిరి.
3. ఎఫ్రాయీము చేయిపట్టుకుని వానికి నడక నేర్పినవాడను నేనే, వారిని కౌగిలించుకొనిన వాడను నేనే. అయినను నేను తమను కరుణించితినని వారు గ్రహింపరైరి.
4. గాఢమైన ప్రేమానురాగములతో నేను వారిని నా చెంతకు రాబట్టుకొంటిని. వారిని పైకెత్తి నా బుగ్గల కానించుకొంటిని. క్రిందికి వంగి వారిచే అన్నము తినిపించితిని.
5. అయినను వారు నాయొద్దకు వచ్చుటకు అంగీకరింపరైరి. కావున వారు ఐగుప్తునకు వెళ్ళిపోవలెను. అస్సిరియా వారిని పరిపాలించును.
6. ఆ జనుల నగరములు యుద్ధమునకు గురియగును. వారి పట్టణ ద్వారములు కూలిపోవును. నా ప్రజలు తమకిష్టము వచ్చినట్లు ప్రవర్తించుచున్నారుగాన పోరున కూలుదురు.
7. నా ప్రజలు నా చెంతనుండి వైదొలగ తీర్మానించిరి. మహోన్నతునివైపు తిరుగవలెనని (ప్రవక్తలు) పిలిచినను చూచుటకు ఎవ్వడును యత్నింపడు.
8. యిస్రాయేలూ! నేను నిన్నెట్లు విసర్జింతును? నిన్నెట్లు పరిత్యజింతును? నేను నిన్ను అద్మానువలె నాశనము చేయగలనా? సెబోయీమునకు చేసినట్లు చేయగలనా? నా హృదయము అందుకు అంగీకరించుటలేదు. నా యెడద జాలితో కంపించుచున్నది.
9. నా కోపాగ్నిని బట్టి నాకు కలిగిన ఆలోచనను నేను నెరవేర్చను. ఎఫ్రాయీమును మరల నాశనముచేయను. నేను మీ మధ్య దేవుడనుగాని, నరుడనుగాను. నేను మీ నడుమనున్న పవిత్రమూర్తిని. మిమ్మును దహించునంతగా నేను కోపింపను.
10. నేను నా ప్రజల శత్రువులనుగాంచి సింహమువలె గర్జింపగా, నా జనులు నా వెంటవత్తురు. వారు పడమటినుండి శీఘ్రమే నా చెంతకు వత్తురు.
11. ఐగుప్తునుండి పక్షులవలెను, అస్సిరియానుండి పావురములవలెను వేగముగా వత్తురు. నేను వారిని మరల తమ నివాసములకు కొనివత్తును. ఇది ప్రభుడనైన నా వాక్కు
12. యిస్రాయేలీయులు బొంకులతో, మోసముతో నా చుట్టునుతిరుగుచున్నారు. యూదా ప్రజలు విశ్వాసపాత్రుడను, పవిత్రుడనైన దేవుడనగు నాకు ఎదురు తిరుగుచున్నారు.
1. ఎఫ్రాయీమీయులు రోజంతా చేయుకార్యములు నిరుపయోగములు, వినాశకరములు. వారియందు మోసము, హింస పెచ్చు పెరుగుచున్నది. వారు అస్సిరియాతో ఒడంబడికలు చేసికొందురు. ఐగుప్తునకు తైలమును పంపించెదరు.
2. ప్రభువు యూదావాసులమీద నేరము తెచ్చుచున్నాడు. ఆయన యాకోబును కూడ వారి క్రియలకు తగినట్లు దండించును. వారు తమ దుష్కార్యములకు తగిన ప్రతిఫలమును అనుభవింతురు.
3. వారి పితరుడు యాకోబు మాతృగర్భమున ఉండగనే తన సోదరునితో కలహించెను. పెరిగి పెద్దవాడైన పిదప దేవునితో పోరాడెను.
4. అతడు దేవదూతతో పెనుగులాడి గెలిచెను. ఏడ్పులతో దీవెనను అర్థించెను. బేతేలువద్ద దేవుడు అతనిని కలిసికొని అతనితో మాటలాడెను.
5. ఆ దేవుడు సైన్యములకు అధిపతి, యావే అనునది ఆయనను స్మరించునామము.
6. కావున యాకోబు వంశజులారా! మీరిపుడు మీ దేవుని చెంతకు మరలిరండు. అతనిపట్ల నమ్మికను, నీతిన్యాయములను ప్రదర్శింపుడు. ఆ ప్రభువు దయకొరకు ఓపికతో వేచియుండుడు.
7. ప్రభువు ఇట్లనుచున్నాడు: యిస్రాయేలీయులు కనానీయులవలె వంచకులు. తప్పుడు త్రాసులతో ప్రజలను మోసగించువారు.
8. మేము సంపదలు కూడబెట్టుకొని ధనికులమైతిమి. కాని మేము అక్రమముగా ధనమార్జించితిమని ఎవరును మమ్ము నిందింపజాలరు అని వారు తలంచుచున్నారు.
9. కాని ఐగుప్తునుండి మిమ్ము తోడ్కొనివచ్చిన మీ దేవుడను ప్రభుడనైన నేను, పూర్వము ఎడారిలో మిమ్ము కలిసికొనినప్పుడువలె, మీరు మరల గుడారములలో వసించునట్లు చేయుదును.
10. నేను ప్రవక్తలతో మాట్లాడి వారికి పెక్కుదర్శనములు దయచేసితిని. వాని ద్వారా నా ప్రజలను హెచ్చరించితిని.
11. అయినను జనులు గిలాదున విగ్రహములను కొలుచుచున్నారు. ఆ ప్రతిమలు నిష్ప్రయోజనమైనవి. ప్రజలు గిల్గాలున ఎడ్లను బలియిచ్చుచున్నారు. అచటి బలిపీఠములు రాళ్ళకుప్పలవలె పొలమున ప్రోగువడును.
12. మన పితరుడైన యాకోబు ఆరామునకు పారిపోయి అచట భార్యను బడయుటకుగాను, ఇతరునికి చాకిరిచేసి అతని గొఱ్ఱెలు కాచెను.
13. కాని ప్రభువు ఐగుప్తులోని యిస్రాయేలీయులను దాస్యమునుండి విడిపించి వారిని కాపాడుటకుగాను ఒక ప్రవక్తను పంపెను.
14. ఎఫ్రాయీమీయులు ప్రభువునకు తీవ్రకోపము రప్పించిరి. వారి దోషములకుగాను వారు మరణశిక్షను అనుభవింపవలెను. వారు ప్రభువును అవమానించిరి కనుక ఆయన వారిని దండించితీరును.
1. పూర్వము ఎఫ్రాయీము తెగవారు మాటలాడినప్పుడు యిస్రాయేలులోని ఇతర తెగలవారు భయపడెడివారు. వారి ఖ్యాతి అట్టిది. కాని బాలును కొలిచిరి కాన ఆ తెగవారికి చావుమూడును.
2. ఆ ప్రజలింకను పాపము మూటకట్టుకొనుచునే ఉన్నారు. వారు పోత విగ్రహములు చేసి పూజించుచున్నారు. నరమాత్రులు చేసిన వెండిబొమ్మలను కొలుచుచున్నారు. వానికి బలులర్పింపుడని చెప్పుచున్నారు. దూడలను ముద్దు పెట్టుకొనుచున్నారు.
3. కావున ఆ ప్రజలు ప్రొద్దునపట్టిన మంచువలెను, వేకువనే విచ్చిపోవు పొగమంచువలెను కనుమరుగు అగుదురు. కళ్ళమున గాలికెగిరిపోవు పొట్టువలె కొట్టుకొని పోవుదురు. కిటికీలోగుండా పోవు పొగవలె అంతర్థానమగుదురు.
4. ప్రభువు ఇట్లనుచున్నాడు: మీ ప్రభుడను దేవుడనైన నేను మిమ్ము ఐగుప్తునుండి తోడ్కొనివచ్చితిని. నేనుతప్ప మీకు అన్యదైవములేడు. మీ రక్షకుడను నేనే.
5. నీరులేని మరుభూమిలో నేను మిమ్మాదరించితిని.
6. కాని మీరు మంచినేలను చేరుకొనగానే సంతుష్టిజెంది గర్వాత్ములై నన్ను విస్మరించితిరి.
7. కావున నేను సింహమువలె మీపై పడుదును. చిరుతపులివలె మీ త్రోవ ప్రక్కన పొంచియుందును.
8. పిల్లలను కోల్పోయిన ఎలుగుబంటివలె మీ పైబడి మిమ్ము చీల్చివేయుదును. సింగమువలె మిమ్ము మ్రింగివేయుదును. వన్యమృగమువలె మిమ్ము ముక్కలు ముక్కలుగా చీల్చెదను.
9. యిస్రాయేలీయులారా! నిన్ను ఆదుకొను నాకు విరోధివై నిన్నునీవే పతనము చేసుకొనుచున్నావు.
10. మీరు "మాకు రాజు, అధిపతులు కావలెను” అని కోరితిరి. కాని ఇపుడు మీ రాజులేమైరి?
11. నేను కోపముతో మీకు రాజులనొసగినట్లే, ఆగ్రహముతో వారిని నిర్మూలింతును.
12. యిస్రాయేలీయుల దోషము మూటకట్టబడియున్నది. వారి పాపములు దాచబడినవి.
13. ప్రసవకాలమున వేదన కలిగినట్లు అతనికి వేదనకలుగును. బిడ్డపుట్టు సమయమున , బయటకురాని శిశువువలె అతడు బుదిహీనుడై వృద్దిలోనికి రాడయ్యెను
14. అయినను నేను వారిని పాతాళమునుండి రక్షింపగోరితిని, మృత్యువునుండి వారిని విమోచింపనాశించితిని. మరణమా! నీ అరిష్టములు ఎక్కడున్నవి? పాతాళమా! నీ వినాశనము ఎచటనున్నది? అయినను నాకు వారియెడల సానుభూతి కలుగుటలేదు.
15. యిస్రాయేలీయులు రెల్లువలె ఎదిగినను, నేను వారిపై ఎడారినుండి తూర్పు వేడిగాలి తోలింతును. ఆ గాలివలన వారి చెలమలును, నీటి బుగ్గలును వట్టిపోవును. అది విలువగల వారి వస్తువులనెల్ల అపహరించును
16. తన దేవుడనైన నాపై తిరుగుబాటు చేసెనుగాన సమరియా శిక్షననుభవించును. ఆ నగర పౌరులు పోరున చత్తురు. అందలి చంటిబిడ్డలను నేలకు విసరికొట్టుదురు. గర్భవతుల కడుపు చీల్చివేయుదురు.
1. యిస్రాయేలీయులారా! మీరు మీ దేవుడైన ప్రభువుచెంతకు మరలిరండు. మీ పాపమే మీ పతనమునకు కారణమైనది.
2. మీ విన్నపములను సిద్ధపరుచుకొని ప్రభువు చెంతకు మరలివచ్చి ఇట్లు విన్నవింపుడు. మా పాపములన్నింటిని పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగిన మాకున్నవి అవియే.
3. అస్సిరియనులచేత రక్షణనొందగోరము. మేమిక యుద్ధాశ్వములను ఎక్కము. మేమికమీదట విగ్రహములను మా దైవములుగానెంచము. దిక్కులేనివానికి జాలి చూపువాడవు నీవేకదా!
4. ప్రభువు ఇట్లనుచున్నాడు: నేను నా ప్రజల ద్రోహబుద్దిని కుదుర్తును. నిండుహృదయముతో వారిని ప్రేమింతును. వారిపైన ఇక కోపింపను.
5. ఎండిన నేలపై కురియు మంచువలె నేను యిస్రాయేలును ఆదరింతును వారు పూవులవలె వికసింతురు. లెబానోను చెట్లవలె దృఢముగా వేరుదన్నుదురు.
6. వారికి క్రొత్త చిగుళ్ళుపుట్టగా ఓలివుచెట్లవలె సుందరముగా అలరారుదురు. లెబానోను దేవదారులవలె పరిమళములు వెదజల్లుదురు.
7. ఆ జనులు మరల నా నీడన బ్రతుకుదురు. పొలములలో పంటలు పండించుకొందురు. వారు ద్రాక్షతోటవలె ఫలింతురు. లెబానోను ద్రాక్షారసమువలె ఖ్యాతి తెచ్చుకొందురు.
8. ఎఫ్రాయీమీయులు మరల విగ్రహాల జోలికి పోరు. నేను వారి మనవులాలించి వారిని కరుణింతును. ఎల్లపుడు పచ్చగానుండు చెట్టువలె వారికి నీడనిత్తును. వారు నానుండి దీవెనలు బడయుదురు.
9. జ్ఞానముగలవారు ఇందలి విషయములను గ్రహింతురుగాక! వివేకము గలవారు ఈ సంగతులను అర్ధము చేసికొందురుగాక! ప్రభువు మార్గములు ఋజువైనివి. సజ్జనులు వానివెంట నడతురు. కాని దుష్టులు వానినుండి వైదొలగి కాలుజారి పడిపోవుదురు.