1. మాదీయుడైన అహష్వేరోషు కుమారుడైన దర్యావేషు బబులోనియా రాజమ్యును పాలించుచుండెను.
2. అతని పరిపాలనాకాలము మొదటియేట నేను పవిత్ర గ్రంథములు చదివి, ప్రభువు తన ప్రవక్త యగు యిర్మీయాకు చెప్పినట్లు యెరూషలేము డెబ్బది ఏండ్ల పాటు శిథిలముగానుండుటను గూర్చి ఆలో చించుచుంటిని.
3. నేను ప్రభువునకు భక్తితో ప్రార్ధన చేయుచు అతనికి మనవిచేసికొని ఉపవాసముండి గోనె తాల్చి బూడిదలో కూర్చుంటిని.
4. నేను నా ప్రభువైన దేవునికి ప్రార్థనచేసి మా ప్రజల పాపములను అతని ఎదుట ఇట్లు ఒప్పుకొంటిని: “ప్రభువైన దేవా! నీవు మహితాత్ముడవు. నీ ఆజ్ఞలను అనుసరించి జీవించువారియెడల నీ నిబంధనమును, నీ కృపను పాటింతువు.
5. మేము నీ దాసులగు ప్రవక్తలు నీ పేరుమీదిగా మా రాజులకును, మా అధిపతులకును, మా తండ్రులకును, యూదాదేశ జనులందరికిని చెప్పిన మాటలను ఆలకింపక
6. నీ ఆజ్ఞలను, విధులను అనుసరించుటమాని, పాపులమును దుష్టులమై చెడుగా ప్రవర్తించుచు తిరుగుబాటు చేసినవారము.
7. ప్రభూ! నీవు నీతిమంతుడవు. కాని మేముమాత్రము ఎల్లపుడు తలవంపులే తెచ్చుకొంటిమి. యూదయాలోను, యెరూషలేమునను వసించువారికిని, నీకు దోహము చేసినందున నీవు దూరదేశములకును, దగ్గరిదేశములకును చెల్లాచెదరు చేసినవారికిని, ఈ అవమానమే చెల్లును.
8. ప్రభూ! మారాజులు, పాలకులు, పూర్వులు నీకు ద్రోహముగా పాపముచేసి లజ్జాకరముగా ప్రవర్తించిరి.
9. మేము నీపై తిరుగబడినను, నీవు మాపై దయచూపి మమ్ము రక్షింపగోరితివి.
10. మా ప్రభుడవైన దేవా! నీవు నీ సేవకులైన ప్రవక్తల ద్వారా దయచేసిన శాసనములను మేము పాటింపవలెనని కోరితివి. కాని మేము నీ మాటవినమైతిమి.
11. యిస్రాయేలీయులెల్లరును నీ కట్టడలనుమీరి నీ పలుకులను లెక్కచేయరైరి. మేము నీకు ద్రోహముగా అపరాధములు చేసితిమి. కనుక నీవు నీ సేవకుడైన మోషే ధర్మశాస్త్రమున లిఖింపబడిన శాపములకు మమ్ము గురిచేసితివి.
12. నీవు మాకును, మా పాలకులకును నీవు చేయుదునన్న కార్యములేచేసితివి. నీవు లోకములోని నగరములన్నిటికంటెను యెరూషలేమును అధికముగా శిక్షించితివి.
13. మోషే ధర్మశాస్త్రములోని శిక్షలన్నింటిని మామీదికి రప్పించితివి. మా ప్రభుడవైన దేవా! ఇప్పుడుకూడ మేము మా పాపములనుండి వైదొలగి నీ సత్యమును అనుసరించి నీకు ప్రీతికలిగింపజాలమైతిమి. నీవు ఎల్లపుడు న్యాయమునే పాటించువాడవు కనుకను,
14. మేము నీమాట వినలేదుకనుకను, నీవు మమ్ము దండింపకోరితివి, దండించితివి.
15. మా ప్రభుడవైన దేవా! నీవు నీ ప్రజలను ఐగుప్తునుండి , తోడ్కొనివచ్చుట ద్వారా నీ బలము ప్రదర్శించితివి. నేటికిని నీకు కీర్తి చెల్లుచున్నది. మేము పాపములు అపరాధములు చేసితిమి.
16. నీవు పూర్వము మమ్ము ఆదుకొంటివి. కనుక నగరముమీద ఇకమీదట ఆగ్రహము చెందకుము. అది నీ నగరము, నీ పవిత్రపర్వతము మేమును, మా పూర్వులును పాపము చేసినందులకుగాను . లోకములోని నరులెల్లరును యెరూషలేమును, నీ ప్రజలను చిన్నచూపు చూచుచున్నారు.
17. ప్రభూ! దీనిని బట్టి మీ దాసుడుచేయు ప్రార్థనను, విజ్ఞాపనలనాలకించి, ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన మీ పరిశుద్ధస్థలముమీదికి, మీ ముఖ ప్రకాశమును రానిమ్ము.
18. ప్రభూ! మా వేడుకోలును ఆలింపుము. మా కష్టములు పరికింపుము. నీ పేరున వెలయుచున్న ఈ నగరపు ఇక్కట్టులను చూడుము. మేము ఏమేమో ధర్మకార్యములు చేసితిమనికాదు, నీవు దయామయుడవు కనుక మేము నీకు మనవిచేయుచున్నాము.
19. ప్రభూ! మా మొరవినుము, మమ్ము క్షమింపుము. ఆలస్యముచేయక మా వేడికోలును చిత్తగింపుము. ఈ నగరమును, ఈ ప్రజలును నీ నామమును వహించినవారు, నీ ఘనతను గ్రహించినవారు.”
20. నేనింకను ప్రార్ధన కొనసాగించుచుంటిని. నా తప్పిదములను, మా ప్రజలైన యిస్రాయేలీయుల తప్పిదములను దేవుని ముందట ఒప్పుకొనుచుంటిని. నా ప్రభువైన దేవుడు తన పవిత్రమందిరమును పునరుద్దరింపవలెనని వేడుకొంటిని.
21. నేనట్లు ప్రార్ధన చేయుచుండగా, నేను పూర్వదర్శనమున చూచిన గబ్రియేలు, నేనున్న చోటికి దిగివచ్చెను. అది సాయంకా లము. బలినర్పించు సమయము.
22. అతడు నాతో ఇట్లనెను: “దానియేలూ! నేను నీకు ప్రవచనమును నెరిగింపవచ్చితిని.
23. నీవు దేవునికి మొరపెట్టినపుడు ఆయన నీ వేడుకోలును ఆలించెను. ఆయన నిన్ను ప్రేమించెను. కనుక నేను నీకు ఆయన జవాబు నెరిగింప వచ్చితిని. నేను దర్శనభావమును వివరింతును. సావధానముతో వినుము.
24. “ప్రభువు మీ ప్రజలను బానిసత్వమునుండి విడిపించుటకును, మీ పవిత్రనగరమును పాపము నుండి రక్షించుటకును డెబ్బదివారములు నిర్ణయించెను. ఆయన పాపములు మన్నించి శాశ్వతమైన న్యాయమును నెలకొల్పును. కావున ఈ దర్శనమును, ప్రవచనమును నెరవేరితీరును. పవిత్ర మందిరమును పునరంకితము చేయుదురు.
25. ఈ విషయము సావధానముగా విని గ్రహింపుము. యెరూషలేమును పునర్నిర్మింపుడని ఆజ్ఞ యిచ్చినప్పటినుండి అభిషిక్తుడైన ప్రజాపతి వచ్చు వరకును ఏడువారములు గడచును. యెరూషలేమును వీధులతోను, బలమైన కోటలతోను పునర్నిర్మింతురు. అది అరువది రెండువారములు పట్టును. కాని యిది శ్రమలతో నిండినకాలము.
26. ఆ కాలాంతమున ప్రభువు ఎన్నుకొనిన అభిషిక్తుడైన నాయకుని అన్యాయముగా హత్యచేయుదురు. బలాఢ్యుడైన రాజు సైన్యములు దాడి చేసి నగరమును, దేవాలయమును నాశనము చేయును. ఆ అంతము ప్రళయమువలె వచ్చును. అది ప్రభువు నిర్ణయించిన యుద్ధమును, వినాశమును కొనివచ్చును.
27. అతడొక వారము వరకు అనేకులతో సుస్థిర నిబంధన నేర్పరచును. అర్థవారమువరకు బలిని, నైవేద్యమును నిలిపివేయ కారకుడగును. హేయమైనది నిలుచువరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించువరకు ఇట్లు జరుగును”.