1. బెల్షస్సరురాజు పరిపాలనాకాలము మూడవ యేట నేను రెండవ దర్శనమును చూచితిని.
2. ఆ దర్శనమున నేను ఏలాము దేశములోని ప్రాకారములు గల షూషను నగరమున ఉన్నట్లు గ్రహించితిని. నేను ఊలయి నది ఒడ్డున నిలిచియుంటిని.
3. ఆ నది ఒడ్డున ఒక పొట్టేలిని కాంచితిని. దానికి రెండు పొడవైన కొమ్ములు కలవు. వానిలో ఒకటి రెండవదానికంటెను పొడవైనదిగాను, క్రొత్తదిగాను కనిపించెను.
4. నేను ఆ పొట్టేలు తన కొమ్ములతో ఉత్తర దక్షిణ దిక్కులను, పడమటి దిశను పొడుచుటను గాంచితిని. ఏ జంతువును దాని ముందట నిలువజాలదయ్యెను. దాని బారి నుండి తప్పించుకోజాలదయ్యెను. ఆ పొట్టేలు తన ఇష్టము వచ్చినట్లు జరుగుచు, బలమును చూపుచు మిడిసిపడుచుండెను.
5. నేను దీని భావమేమిటాయని ఆలోచించుచుండగా పశ్చిమ దిక్కునుండి ఒక మేకపోతు వచ్చెను. అది భూతలమంతటిమీదను వేగముగా పరుగెత్తుచు వచ్చెను. దాని పాదములు నేలను తాకవయ్యెను. దాని కన్నులనడుమ ప్రముఖమైన కొమ్ము ఒకటి కలదు.
6. అది నేను నదియొడ్డున చూచిన పొట్టేలియొద్దకు వచ్చి మహాబలముతో దానిమీదకు దూకెను.
7. అది పొట్టేలి మీదబడుటను నేను గమనించితిని. అది మహా రౌద్రముతో పొట్టేలిని పడవేసి దాని రెండు కొమ్ములను విరుగగొట్టెను. పొట్టేలు దానినెదిరింపజాలదయ్యెను. మేకపోతు దానిని క్రిందపడవేసి కాళ్ళతో తొక్కెను. దానిని రక్షించువాడెవడును లేడయ్యెను.
8. ఆ మేకపోతు అనతికాలములోనే అత్యధిక బలమును చూపుచూ వచ్చెను. అది పుష్టినొందిన కాలముననే దాని పెద్దకొమ్ము విరిగిపోయెను, విరిగిన దానిస్థానమున ప్రసిద్ధములయిన నాలుగు కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు పెరిగెను.
9. ఆ నాలుగు కొమ్ములలో ఒకదానికి మరియొక చిన్నకొమ్ము పుట్టెను. అది దక్షిణ, తూర్పు దిక్కులకును, మనోహరమైన యిస్రాయేలు దేశము వైపునకును వ్యాపించెను.
10. అది ఆకాశ సైన్యమునంటునంతగ పెరిగి, నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ళతో అణగదొక్కుచుండెను.
11. అది ఆకాశ సైన్యముల అధిపతినే సవాలు చేసెను. అతనికి అర్పించు దైనందిన సమర్పణలను ఆపుచేయించి దేవాలయమును ధ్వంసము చేసెను.
12. దైనందినబలులను నివారించుటకై ఒక సేన దానికీయబడెను. ఆ సేన సత్యమును నేలరాచి, తన ఇష్టానుసారముగ వ్యవహరించుచు విజయము సాధించెను.
13. అంతట పవిత్రుడొకడు మాట్లాడుచుండగ నేను వింటిని. మాట్లాడుచున్న ఆ పవిత్రునితో మరియొక పవిత్రుడు, “దైనందినబలుల విషయములో ఈ దర్శనము ఎంతకాలము వర్తించును? అతిక్రమము వలన సంభవించిన ఈ వినాశకరచర్యల అసహ్యము ఎంత కాలముండును? పరిశుద్ధస్థలమును, అందలి జనసమూహములను కాళ్ళక్రింద తొక్కబడుట ఇంకను ఎన్నాళ్ళు జరుగును?” అని అడిగెను.
14. నేను వినుచుండగా ఆ రెండవ దేవదూత ఇట్లు బదులు చెప్పెను. “రెండువేలమూడువందల సాయంకాలములు, ఉదయములు అటుల సంభ వించును. అటుపిమ్మట దేవళము పవిత్రమైనదిగా పునరుద్ధరింపబడును”.
15. నేను ఈ దృశ్యభావమును అర్ధము చేసి కొనుటకు ప్రయత్నించుచుండగా, దిషీలున నరుని వంటివాడు ఒకడు నాయెదుట నిలుచుండెను.
16. “ గబ్రియేలూ! నీవు ఈ నరుడు చూచిన సంగతులను ఇతనికి వివరింపుము” అని ఊలయి నదిపై నాకొక శబ్దము వినిపించెను.
17. గబ్రియేలు వచ్చి నా చెంత నిలుచుండుటను చూచి నేను భీతితో కంపించి నేలపై బోరగిల బడితిని. అతడు నాతో నరపుత్రుడా! దీని భావమిది. ఈ దర్శనము లోకాంతము గూర్చినది” అని చెప్పెను.
18. అతడు మాట్లాడుచుండగా నేను స్పృహ కోల్పోయి నేలపై బడితిని. కాని అతడు నన్నుపట్టుకొని నా కాళ్ళమీద నిలబెట్టెను.
19. అతడు నాతో ఇట్లనెను: “దేవుని ఆగ్రహము యొక్క ఫలితమెట్టిదో నేను నీకు చూపించుచున్నాను. ఈ దర్శనము లోకాంతమును గురించినది.
20. నీవు చూచిన పొట్టేలి రెండుకొమ్ములు మాదీయ, పారశీక రాజ్యములను సూచించును.
21. మేకపోతు గ్రీకు రాజ్యమునకు గుర్తు. దాని కన్నుల నడుమగల ప్రముఖమైన కొమ్ము మొదటిరాజు,
22. ఆ మొదటి కొమ్ము విరిగినప్పుడు పుట్టిన నాలుగు కొమ్ములు ఆ రాజ్యము నాలుగు భాగములుగా విభక్త మగుననుటకు గురు. అవి మొదటి రాజ్యమంత బలముగా ఉండజాలవు.
23. ఆ రాజ్యములు ధ్వంసమగు కాలము వచ్చి నప్పుడు, వాని పాపములుపండి అవి శిక్షకు గురి కానున్నప్పుడు దుర్మార్గుడును, మొండివాడును, మోస గాడునైన రాజు పొడచూపును.
24. అతడు తన శక్తి వలనగాక, ఇతరుని శక్తివలన బలాఢ్యుడగును. అతడు ఘోరవినాశము తెచ్చిపెట్టును. తాను చేపట్టిన కార్యము లందెల్ల విజయముబడయును. అతడు బలవంతులను, పవిత్ర ప్రజలనుగూడ నాశనము చేయును.
25. కపటాత్ముడు గనుక అతని వంచనలు సఫలమగును. అతడు గర్వాత్ముడై ముందుగా హెచ్చరింపకయే పెక్కు మందిని వధించును.రాజాధిరాజునుగూడ ఎదిరించును. కాని కడకు నరబలముతో అవసరము లేకుండనే అతనిని మట్టుపెట్టుదురు.
26. సాయంకాల, ఉదయ కాల బలులను గూర్చిన ఈ దర్శనమును నేను నీకు వివరించితినిగదా! ఇది నెరవేరితీరును. కాని దీనిని గోప్యముగా నుంచుము. ఇది నెరవేరుటకు ఇంకను చాలకాలము పట్టును.”
27. నేను ఈ దర్శనము కలుగగా విషాదమునకు గురియై కొన్నిరోజుల వరకు జబ్బుగానుంటిని. అటు తరువాత లేచి రాజుకొరకు చేయవలసిన పని చూచు కోనారంభించితిని. ఈ దర్శనమును గూర్చి విస్మయమునొందితిని. కాని దాని భావమును తెలుపగలవాడు ఎవడును లేకపోయెను.