1. బెల్షస్సరు బబులోనియాను ఏలిన మొదటియేట దానియేలు పడుకపై పరుండి కలగనెను. రేయి దర్శన మును చూచెను. ఆ కలను సంక్షేపముగా వ్రాసి పెట్టెను. దాని వృత్తాంతమిది:
2. “ఆ రేయి నేను చూచిన దృశ్యమిది. నాలుగు దిక్కులనుండి వాయు వులు బలముగా వీచుచు మహాసాగరమును అల్లకల్లోలము చేయుచుండెను.
3. ఆ సాగరము నుండి వేరువేరు ఆకారములుగల గొప్పమృగములు నాలుగు వెలుపలికి వచ్చెను.
4. మొదటిది సింహము వలె నుండెను. కాని దానికి గరుడపక్షి రెక్కలు కలవు. నేను చూచుచుండగనే దాని రెక్కలు విరిగిపోయెను. ఆ మృగమును పైకెత్తగా అది నరునివలె నిలుచుండెను. దానికి నరునివంటి మనస్సు ఇవ్వబడెను.
5. రెండవమృగము వెనుకటి కాళ్ళపై నిలుచున్న ఎలుగుబంటివలె నుండెను. దాని కోరల మధ్య మూడు ప్రక్కటెముకలుండెను. ఒక శబ్దము దానితో “నీవు నీ ఇష్టము వచ్చినంత మాంసమును భక్షింపుము” అని చెప్పెను.
6. నేను చూచుచుండగా మరియొక మృగము కనిపించెను. అది చిరుతపులివలె నుండెను. కాని దాని వీపుపై పక్షిరెక్కల వంటి రెక్కలు నాలుగుండెను. దానికి నాలుగు శిరస్సులుండెను. ఆ మృగము అధికారమును బడసెను.
7. నేను చూచుచుండగా నాలుగవ మృగము కనిపించెను. అది మిక్కిలి బలముగను, భీకరముగను, ఘోరముగను ఉండెను. అది ఇనుపపండ్లతో తన యెరలను చీల్చితినెను. మిగిలిన భాగములను నజ్జు నజ్జుచేసి కాళ్ళతో తొక్కెను. ఇతర మృగములవలె గాక దానికి పదికొమ్ములుండెను.
8. నేను ఆ కొమ్ములవైపు పారజూచుచుండగా వాని నడుమ మరియొక చిన్నకొమ్ము పుట్టెను. అది అంతకు పూర్వమున్న కొమ్ము లను మూడింటిని సమూలముగా పెరికివేసెను. ఈ కొమ్మునకు నరుల కన్నులును, ప్రగల్భములు పలుకు నోరును ఉండెను.
9. నేను చూచుచుండగా సింహాసనములను అమర్చిరి. శాశ్వతజీవి ఒకడు సింహాసనముపై ఆసీనుడయ్యెను. అతని వస్త్రములు మంచువలె తెల్లగా నుండెను. తలవెంట్రుకలు తెల్లని ఉన్నివలె నిర్మలముగా నుండెను. అగ్నివంటి చక్రములపైనున్న అతని సింహాసనము అగ్నివంటి జ్వాలలతో మండుచుండెను.
10. ఆ సింహాసనమునుండియు, అతని ఎదుటినుండియు అగ్నివంటి ప్రవాహము పారుచుండెను. వేనవేలుబంటులు అతనికి ఊడిగము చేయుచుండిరి. లక్షలకొలది సేవకులు అతని ఎదుట నిలిచియుండిరి. అంతట న్యాయస్థానమున పని ప్రారంభముకాగా గ్రంథములను విప్పిరి.
11. నేను చూచుచుండగా ఆ చిన్నకొమ్ము ఇంకను గొప్పలు చెప్పుకొనుచుండెను. నేను చూచుచుండగా వారు ఆ నాలుగవ మృగమును చంపినట్లు కనబడెను. దాని కళేబరమును మంటలలోపడవేసి నాశనము చేసిరి.
12. మిగిలిన ఆ మృగములు తమ అధికారమును కోల్పోయెను. కాని సమయము ఆసన్నమగువరకు అవి సజీవుల మధ్య ఉండవలెనని, నిర్ణయింపబడెను.
13. నేను ఆ రాత్రి కలిగిన దృశ్యమును ఇంకనూ చూచుచుండగ మేఘారూఢుడైన మనుష్య కుమారుని పోలినవాడు వచ్చుటను గాంచితిని. అతడు ఆ శాశ్వతజీవి' సన్నిధిని ప్రవేశింపగా అతడిని ఆ శాశ్వతజీవి సముఖమునకు కొనిపోయిరి.
14. ఆ మనుష్యకుమారుడు పరిపాలనమును, మహిమను, రాజ్యాధికారమును బడసెను. సకల దేశములకును, జాతులకును, భాషలకును చెందిన ప్రజలెల్లరును ఆయనను సేవించిరి. ఆయన పరిపాలన శాశ్వతమైనది. - అది ఎన్నటికిని తొలగిపోదు. ఆయన రాజ్యమునకు అంతములేదు.
15. ఆ దర్శనమును చూచి నేను భీతితో కంపించితిని.
16. నేనచట నిలుచున్న వారిలో ఒకని చెంతకుపోయి వీని భావమును వివరింపుమంటిని. అతడు ఆ దృశ్యముల అర్ధమును వివరించుచు నాతో ఇట్లనెను:
17. 'ఈ నాలుగు గొప్పమృగములను భూమిమీద నెలకొననున్న నలుగురు రాజులు.
18. అయితే మహోన్నతుని పవిత్ర ప్రజలే రాజ్యాధికారమును స్వీకరింతురు. వారు ఆ రాజ్యమును యుగ యుగములవరకు శాశ్వతముగా ఏలుదురు.'
19. అంతట నేను ఇతర మృగములకంటెను భిన్నముగానున్న ఆ నాలుగవ మృగమును గూర్చి ఎక్కువగా తెలిసికోగోరితిని. ఆ భయంకరమృగము కంచు గోళ్ళతోను, ఇనుపపండ్లతో తన ఎరలను చీల్చి తినుచుండెను. తినగా మిగిలిన భాగములను నజ్జునజ్జు చేసి కాళ్ళతో తొక్కుచుండెను.
20. ఇంకను నేను దాని తలమీది పదికొమ్ములను గూర్చి తెలిసికో గోరితిని. వాని తరువాత మరియొక కొమ్ము ఎందుకు పుట్టినదో, అది మూడు కొమ్ములనెందుకు పెరికి వేసినదో యెరుగగోరితిని. ఆ కొమ్మునకు కన్నులు, ప్రగల్భములు పలుకు నోరును ఉన్నది. అది ఇతర కొమ్ములకంటె భీకరముగా కన్పించినది.
21. నేను చూచుచుండగా ఆ కొమ్ము దేవుని పవిత్రప్రజపై యుద్ధముచేసి వారినోడించెను.
22. అంతటా శాశ్వతజీవివచ్చి మహోన్నతుని పవిత్ర ప్రజ లకు అనుకూలముగా తీర్పుచెప్పెను. దేవుని పవిత్ర ప్రజలు రాజ్యాధికారమును స్వీకరించు సమయము ఆసన్నమైనదని నేను గ్రహించితిని.
23. నేనడిగిన వ్యక్తి నా ప్రశ్నకిట్లు బదులు చెప్పెను: 'ఈ నాలుగవ మృగము నేలపై నెలకొననున్న నాలుగవ రాజ్యము. అది ఇతర రాజ్యములకంటెను భిన్నముగా నుండును. అది భూమినంతటిని నలగగొట్టి తన కాళ్ళతో తొక్కును.
24. పదికొమ్ములు ఆ రాజ్యమునేలు పదిమంది రాజులను సూచించును. అటు పిమ్మట మరియొక రాజు వచ్చును. అతడు పూర్వ రాజులకంటే భిన్నముగా నుండును. ఆ రాజులలో ముగ్గురిని కూల్చివేయును.
25. అతడు మహోన్న తుడైన దేవునికి వ్యతిరేకముగా మాటలాడును. ఆ ప్రజల నియమములను పండుగలను మార్చజూచును. పవిత్ర ప్రజలు మూడున్నర ఏండ్లపాటు అతని ఆధీన మున ఉందురు.
26. అంతట దేవుడు న్యాయసభను జరిపి అతని అధికారమును రూపుమాపి అతనిని మట్టుపెట్టును.
27. మహోన్నతుడైన దేవుని పవిత్ర ప్రజలు ఆ రాజ్యమును, అధికారమును, భూమిమీది సకల రాజ్యముల వైభవమును స్వీకరింతురు. వారి రాజ్యము శాశ్వతముగా నిలిచియుండును. భూమిమీది పాలకులు వారిని సేవించి వారికి విధేయులగుదురు'.
28. ఆ వృత్తాంతముయొక్క ఆంతర్యమిది. దానియేలు అయిన నాకు సంబంధించినంత వరకు, నేను మిక్కిలిగా భీతిల్లి వెలవెలపోతిని. ఈ సంగతిని నా మనస్సులోనే ఉంచుకొంటిని”.