1. ఎంత నిరాశ! నేను ఆకలిగొని పండ్లు కోసికోగోరితిని కాని చెట్లమీద పండ్లులేవు. ద్రాక్షలమీద ఫలములులేవు. ద్రాక్ష ఫలములనెల్ల, రుచికరములైన అంజూరపు పండ్లనెల్ల కోసిరి.
2. దేశమున భక్తిగలవారెవరును లేరు. ఋజువర్తనులెవరును కనిపింపరు. ఎల్లరును ఇతరులను హత్య చేయుటకు కాచుకొనియున్నారు. ప్రతివాడును పొరుగువానిని వేటాడుచున్నాడు.
3. ఎల్లరును దౌష్ట్యమున ఆరితేరినవారే. అధికారులు న్యాయాధిపతులు లంచములు అడుగుచున్నారు. పలుకుబడి కలవారు తమ కోర్కెలు వారికి ఎరిగించుచున్నారు. వారెల్లరును కూడి కుతంత్రములు పన్నుచున్నారు.
4. ఆ జనులలో ఉత్తములు, సజ్జనులైనవారు కూడ, ముండ్లకంపవలె అయోగ్యులుగానున్నారు. ప్రభువు కావలివారైన ప్రవక్తల ద్వారా ఆ ప్రజను హెచ్చరించినట్లే వారికి శిక్షపడుకాలము ఆసన్నమైనది. కనుక వారిపుడు కలవరము చెందుచున్నారు.
5. మీ పొరుగువారినిగాని, స్నేహితులనుగాని నమ్మకుడు. నీ కౌగిటిలో పండుకొనియున్న నీ భార్యయెదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుడు.
6. కుమారుడు తండ్రిని తృణీకరించుచున్నాడు. కుమార్తె తల్లిని ఎదిరించుచున్నది. కోడలు అత్తమాట వినుటలేదు. సొంత కుటుంబములోనివారే శత్రువులగుదురు.
7. అయినను నా మట్టుకు నేను ప్రభువు కొరకు వేచియుందును. నన్ను రక్షించు దేవునికొరకు కాచుకొనియుందును. నా దేవుడు నా మొరవినును.
8. నా శత్రువులు నా పతనముగాంచి ఉప్పొంగనక్కరలేదు. నేను క్రిందపడినను మరల లేతును. నేనిపుడు చీకటిలోనున్నను ప్రభువు నాకు వెలుగునొసగును.
9. నేను ప్రభువునకు ద్రోహముగా పాపము చేసితిని కాన కొంతకాలము ఆయన ఆగ్రహమునకు గురికాకతప్పదు. కాని కడన ఆయన నా కోపు తీసికొని నాకు జరిగిన అన్యాయమును చక్కదిద్దును. ఆయన నన్ను వెలుగులోనికి కొనివచ్చును. నేను ఆయన రక్షణమును గాంచితీరుదును.
10. మీ దేవుడెక్కడున్నాడని నన్ను గేలిచేసిన శత్రువులు ఈ రక్షణముచూచి సిగ్గుతో వెలవెలబోవుదురు. నేను వారి ఓటమిగాంచి సంతోషింతును. వారు వీధిలోని బురదవలె తొక్కబడుదురు.
11. యెరూషలేము పౌరులారా! మీ నగరప్రాకారములు పునర్నిర్మించుకాలము వచ్చినది. అప్పుడు మీ దేశము విశాలమగును.
12. మీ జనులు ఎల్లతావులనుండి మీ చెంతకు తిరిగి వత్తురు. అస్సిరియా ఐగుప్తులనుండి, యూఫ్రటీసు నది తీరాలనుండి, దూర సాగరముల నుండి, పర్వతముల నుండి వారు మరలివత్తురు.
13. కాని జనుల దుష్టవర్తన వలన వారు వసించు నేల ఎడారియగును.
14. ప్రభూ! నీవు ఎన్నుకొనిన ప్రజలను నీవే కాపరివై మేపుము. వారు అరణ్యమున ఒక మూలన వసించుచున్నను, వారి చుట్టు పాలుతేనెలు జాలువారు నేలకలదు. కావున ఆ జనులు పూర్వకాలమునందువలె బాషాను, గిలాదు మైదానముల లోనికిపోయి మేయుదురుగాక!
15. నీవు మమ్ము ఐగుప్తునుండి తోడ్కొని వచ్చినప్పుడువలె ఇప్పుడును మా కొరకు అద్భుతకార్యములు చేయుము.
16. తాము ఎంతటి బలసంపన్నులైనను, అన్యజాతి జనులు ఈ చెయిదము చూచి సిగ్గు చెందుదురు. వారు అచ్చెరువొంది చేతులతో తమ నోటిని, చెవులను మూసికొందురు.
17. పాముల వలెను, ప్రాకెడు ప్రాణులవలెను నేలపైబడి మన్ను కరుతురు. గడగడ వణకుచు తమ కోటలనుండి వెడలివత్తురు. భయకంపితులై మన ప్రభువైన దేవుని యొద్దకు వత్తురు.
18. ప్రాణములతో మిగిలియున్న నీ స్వకీయ ప్రజల తప్పులను మన్నించు నీవంటి ప్రభుడెవరు? నీ ప్రజల తప్పులు మన్నింతువు. మా మీద సదా కోపింపవు. మమ్ముల కరుణించుటయే నీకు ఆనందము.
19. మాపై మరల నెనరు చూపుము. మా పాపములను నీ కాళ్ళతో తొక్కి సముద్ర గర్భమున పడవేయుము.
20. నీవు పూర్వము మా పితరులైన అబ్రహాము, యాకోబులకు వాగ్దానము చేసిన సత్యమును, దయను నీవు చూపింతువు.