ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

దానియేలు చాప్టర్ 6

1. దర్యావేషు తన రాజ్యమును పరిపాలించుటకు నూటఇరువదిమంది అధిపతులను నియమించెను.

2. ఆ అధిపతులను పర్యవేక్షించుటకును, తనకు భద్రత చేకూర్చి పెట్టుటకును అతడు ముగ్గురు పర్యవేక్షకులను గూడ నియమించెను. వారిలో దానియేలొకడు,

3. దానియేలు బుద్ధికుశలతలో అధిపతులను, పర్యవేక్షకు లనుగూడ మించెను. రాజు అతనిని తన రాజ్యమంతటి మీదను అధికారినిగా నియమింపవలెనని ఎంచుచుండెను.

4. అధిపతులును, పర్యవేక్షకులును దానియేలు రాజ్యపాలన విషయములలో తప్పులు పట్టజూచిరి కాని వారికి అతనిలో దోషమేమియు కనిపింపలేదు. అతడు విశ్వాస పాత్రుడుగా మెలగుచు ఎట్టి అక్రమము నకుగాని, అవినీతికిగాని పాల్పడ డయ్యెను.

5. వారు “మనము ఏ అంశమునను దానియేలునందు తప్పులు పట్టజాలము. అతడు తన దేవుని కొలుచుతీరున మాత్రము మనకు చిక్కవచ్చును” అని తమలో తాము కూడబలుకుకొనిరి.

6. కనుక ఆ అధిపతులు, పర్యవేక్షకులు రాజు సమక్షమునకు గుంపుగా వచ్చి ఇట్లనిరి: “దర్యావేషు ప్రభువులవారు కలకాలము జీవింతురు గాక!

7. మీ రాజ్యమును పాలించు పర్యవేక్షకులము, అధిపతులము, మంత్రులము, సేనాధిపతులము, సంస్థానాధిపతులము మేమెల్లరము దేవరవారు ఒక శాసనమును జారీచేసి దానిని ఖండితముగా అమలుపరచవలెనని కోరుచున్నాము. రానున్న ముప్పదినాళ్ళవరకు ఎవడును మీకు తప్ప అన్యదేవతకుగాని, అన్యనరునికి గాని మనవి చేయరాదు. ఈ ఆజ్ఞ మీరిన వానిని సింహముల గుంటలో పడవేయుదుమని శాసనము చేయింపుడు.

8. ఏలిక ఈ శాసనమును జారీచేయుచు దానిపై సంతకము చేయుదురుగాక! అది మాదీయుల, పారశీకుల నియమము ప్రకారము తిరుగులేనిదిగా ఉండునుగాక!”

9. దర్యావేషు రాజు అట్లే శాసనమును జారీచేయించి దానిపై సంతకము పెట్టెను.

10. రాజు శాసనముపై సంతకము చేసెనని విని దానియేలు తన ఇంటికి వెళ్ళెను. అతని ఇంటిమీద గది కిటికీలు యెరూషలేమువైపు తెరచుకొని ఉండెను. అతడు యధాప్రకారము అనుదినము చేయునట్లే ఆ కిటికీల ముందు మోకాళ్ళూని రోజునకు మూడుమార్లు దేవునికి ప్రార్థనచేసి వందనములర్పించెను.

11. దానియేలు శత్రువులు గుమిగూడివచ్చి అతడు దేవునికి ప్రార్థనలర్పించి విన్నపము చేసికొనుటను గాంచిరి.

12. వారెల్లరును రాజు వద్దకుపోయి “రానున్న ముప్పది నాళ్ళవరకు ఎవడును మీకుతప్ప అన్యదేవతలకుగాని, అన్య నరులకుగాని ప్రార్థన చేయరాదనియు, ఈ ఆజ్ఞ మీరినవారిని సింహముల గుంటలో పడవేయుదుమనియు దేవరవారు శాసనము చేయింపలేదా?” అని అడిగిరి. రాజు “ఔను, అది ఖండితమైన శాసనము. మాదీయుల, పారశీకుల నియమము ప్రకా రము అది తిరుగులేనిది” అని చెప్పెను.

13. వారు రాజుతో "యూదా ప్రవాసియైన దానియేలు మిమ్ము లెక్క చేయుటలేదు. అతడు మీరు సంతకముచేసిన శాసనమును ధిక్కరించి రోజునకు మూడుమారులు ప్రార్థన చేయుచున్నాడు” అని చెప్పిరి.

14. ఆ మాటలువిని రాజు మిగులచింతించెను. అతడు దానియేలును రక్షింపగోరి ప్రొద్దుగ్రుంకువరకును ఉపాయముకొరకు తీవ్రముగా ఆలోచించెను.

15. అప్పుడు ఆ నరులు మరల రాజునొద్దకు గుంపుగా వచ్చి “ఏలికా! మాదీయుల, పారశీకుల నియమము ప్రకారము రాజుచేసిన శాసనమును మార్చరాదని జ్ఞప్తికి తెచ్చుకొనుడు” అని అనిరి.

16. కనుక రాజు దానియేలును కొనిపోయి సింహములగుంటలో పడవేయుడని ఆజ్ఞఇచ్చెను. అతడు దానియేలుతో “నీవు ఇంతటి విశ్వాసముతో సేవించు దేవుడు నిన్ను కాపాడునుగాక!” అనెను.

17. అంతట ఒక బండను కొనివచ్చి సింగములగుంట కన్నముపై పెట్టిరి. దానియేలునకు సంబంధించిన నియమమును ఎవరును మార్చకుండుటకుగాను ఆ బండపై రాజ ముద్రను ప్రముఖులముద్రను వేసిరి.

18. అంతట రాజు ప్రాసాదమునకు వచ్చి నిద్రలేకయే ఆ రాత్రి గడపెను. అతడు ఆహారములను పుచ్చుకొనలేదు. వినోదములను తిలకింపలేదు.

19. మరునాడు వేకువనే రాజు నిద్రలేచి గబగబ సింహముల గుంటకడకు వెళ్ళెను.

20. దాని చెంతకు రాగానే అతడు “సజీవుడైన దేవుని సేవించు దానియేలూ! నీవింతటి విశ్వాసముతో కొలుచు దేవుడు సింహముల బారినుండి నిన్ను రక్షించెనా?" అని ఆందోళనముతో అడిగెను.

21. దానియేలు “ప్రభువులవారు కలకాలము జీవింతురుగాక!

22. దేవుడు దేవదూతనుపంపి సింగముల నోళ్ళను మూయించెను. కనుక అవి నాకు హానియు చేయలేదు. దేవుడు నన్ను నిర్దోషిగా గణించెనుగనుక, మీకు నేనెట్టి అపరాధమును చేయలేదుగనుక ఆయన ఇట్లు చేసెను” అనెను.

23. ఆ మాటలకు రాజు మిగుల సంతసించి దానియేలును సింగములగుంటనుండి వెలుపలికి తీయుడని ఆజ్ఞా పించెను. అట్లే అతనిని బయటికి తీసిరి. దానియేలు దేవుని నమ్మెనుగనుక అతనికెట్టి హానియు కలుగలేదు.

24. రాజు దానియేలుపై నేరము తెచ్చినవారిని పిలిపించెను. వారినందరిని ఆలుబిడ్డలతో సింగముల గుంటలోనికి త్రోయించెను. గుంట అడుగుభాగమును చేరుకొనకపూర్వమే సింహములు వారి పైకి దూకి వారి ఎముకలను ముక్కలు ముక్కలు చేసెను.

25. అంతట దర్యావేషు రాజు లోకములోని ఎల్ల దేశములకును, జాతులకును, భాషలకునుచెందిన ప్రజలకు ఇట్లు లేఖలు పంపెను: “మీకు శాంతి శుభములు సమృద్ధిగా కలుగునుగాక! "

26. నా రాజ్యములోని జనులెల్లరును దానియేలు యొక్క , దేవునిపట్ల భయభక్తులు చూపవలెనని నా ఆజ్ఞ: "ఆయన సజీవుడైన దేవుడు, కలకాలము పరిపాలించువాడు. ఆయన రాజ్యమెన్నడును నాశనము కాదు. ఆయన పరిపాలనమునకు అంతముండదు.

27. ఆయన తన ప్రజలను రక్షించి కాపాడును, భూమ్యాకాశములందు అద్భుతకార్యములు చేయును. ఆయన దానియేలును సింగముల బారినుండి విడిపించెను.”

28. దర్యావేషు పరిపాలనాకాలమునను, పారశీక ప్రభువైన కోరెషు కాలమునను దానియేలు వృద్దిలోనికి వచ్చెను.