1. “సియోనున సుఖజీవనము గడపువారికి, సమరియా యందు సురక్షితముగా ఉన్నాము అనుకొనువారికి, యిస్రాయేలు మహాజాతిలో ప్రముఖులనబడువారికి, యిస్రాయేలీయులకు ఆలోచన చెప్పువారికి అనర్థము తప్పదు.
2. మీరు కల్నే పట్టణమునకు వెళ్ళి పరిశీలింపుడు. అచటినుండి హమాతు మహానగరమునకు పొండు. అచటినుండి ఫిలిస్తీయులదైన గాతునకు దిగిపొండు. అవి యూదా యిస్రాయేలు రాజ్యములకంటే మెరుగైనవికావా? అవి మీకంటె ఎక్కువ వైశాల్యముగల రాజ్యములుకావా?
3. మీరు ఉపద్రవదినమును దూరముగా నుంచుటకు ప్రయాసపడుచున్నారు. కాని మీ చర్యలవలన ఆ దినము దాపులోనికి వచ్చినది.
4. దంతముపొదిగిన మంచాలపై పరుండి, పాన్పులపై తమను చాచుకొనుచు మందలో మేలిమి గొఱ్ఱెపిల్లలను, శాలలలోని లేదూడలను వధించి మెక్కు మీకు అనర్థము తప్పదు.
5. మీరు దావీదువలె పాటలు కట్టి తంత్రీవాద్యము మీటుచు పిచ్చిపాటలు గానము చేయుచున్నారు.
6. పానపాత్రములనిండ ద్రాక్షారసము త్రాగి మేలైన పరిమళ తైలములు పూసికొనుచున్నారు. కాని యోసేపు సంతతికి కలిగిన వినాశమును గూర్చి విచారించుటలేదు
7. కావున మీరు ప్రవాసమునకు పోవువారిలో మొదటివారగుదురు. మీ విందులు, వినోదములు తుదముట్టును. యిస్రాయేలీయుల పొగరు నాకు నచ్చదు. వారి మేడలను నేను అసహ్యించుకొందును. వారి నగరములను, దానిలోని సమస్త వస్తువులను శత్రువులకు అప్పగింతునని
8. ప్రభువైన దేవుడు తనతోడని ప్రమాణము చేసెను. ఇదియే సైన్యములకధిపతియు ప్రభువైన దేవునివాక్కు
9. ఒక కుటుంబమున పదిమంది మిగిలియుందురేని వారెల్లరును చత్తురు.
10. చచ్చినవానిని పాతిపెట్టు బాధ్యతగల బంధువు మృతుని శవమును ఇంటినుండి బయటికి కొనిపోవును. అతడు ఇంటిలోనున్నవానిని నీతో ఇంకనెవరైన ఉన్నారా? అని అడుగగా అతడు లేడని చెప్పును. అప్పుడా బంధువు 'నీవిక మౌనముగా ఉండుము, ప్రభువు నామమును మనము ఎత్తరాదు' అనును.
11. ఏలయన ప్రభువు ఆజ్ఞ ఈయగానే గొప్పకుటుంబములేమి, చిన్నకుటుంబములేమి అన్నియు కూలిపోవును.
12. గుఱ్ఱములు బండలమీద స్వారీచేయునా? అట్టిచోట ఎద్దులతో దున్నుదురా? మా స్వశక్తిచేతనే బలమునొందియున్నాము అని చెప్పుకొను మీరు, వ్యర్ధమైన విషయాలను గూర్చి సంతోషించు మీరు
13. న్యాయమును ఘోరమైన అన్యాయముగాను, నీతిఫలమును దుర్మార్గముగాను మార్చితిరి.
14. కాని సైన్యములకధిపతియైన యావే దేవుడు ఇట్లు పలుకుచున్నాడు: యిస్రాయేలీయులారా! మీ దేశమును ఆక్రమించుటకు నేను పరజాతి సైన్యమును పంపుదును. ఉత్తరమున హమాతు కనుమనుండి దక్షిణమున అరబా నదివరకును కూడ ఆ దండు మిమ్ము పీడించి పిప్పిచేయును”.