1. బెల్షస్సరు రాజు గొప్పవిందు చేయించి వేయి మంది ప్రముఖులను ఆహ్వానించెను. వారితో పాటు తానుకూడ ద్రాక్షారసమును సేవించెను.
2. వారు మధువును సేవించుచుండగా ఆ రాజు పూర్వము తన తండ్రియైన నెబుకద్నెసరు యెరూషలేము దేవాలయము నుండి కొల్లగొట్టి తెచ్చిన వెండి బంగారు పాత్రలను కొనిరండని అజ్ఞాపించెను.
3. తామును, తన ప్రముఖులును, తన భార్యలును, ఉంపుడు కత్తెలును ఆ పాత్రలనుండి రసము త్రాగవలెనని అతని కోరిక. వారు ఆ పాత్రలనుండి ద్రాక్షారసమును త్రాగి,
4. వెండి, బంగారము, కంచు, ఇనుము, కొయ్య, రాతితో చేసిన తమ దైవములను స్తుతించిరి.
5. వెంటనే ఒక హస్తము కనిపించెను. అది సున్నము కొట్టియున్న ప్రాసాదము గోడమీద, దీపపు కాంతి బాగుగా పడుచోట ఏదియో వ్రాయ ఉండెను. అటుల వ్రాయుచున్న హస్తమును రాజు చూచెను.
6. ఆ దృశ్యమును గాంచి అతడు తెల్ల బోయెను. భయమువలన అతని నడుమునందలి కీళ్ళన్ని పట్టుదప్పెను. మోకాళ్ళు గడగడ వణకెను.
7. అతడు శాకునికులను, గారడీవిద్య గలవారిని, సోదెగాండ్రను, కల్దీయులను పిలువుడని కేకలు పెట్టెను. ఆ బబులోనియా జ్ఞానులు రాగానే అతడు వారితో “మీలో ఎవడైనను ఈ వ్రాతను చదివి దాని భావమును వివరింపగలడని అతడు ఊదావన్నె వస్త్రములు తాల్చి, కంఠాభరణమును ధరించి, ఈ రాజ్యమున మూడవ అధికారియగును” అని చెప్పెను.
8. ఆ రాజు జ్ఞానులందరును ముందుకు వచ్చిరిగాని వారిలో ఒక్కరికిని ఆ వ్రాతచదివి దాని భావమును వివరించు సామర్థ్యము లేదయ్యెను.
9. బెల్షస్సరు మిక్కిలి భయపడి మరింత తెల్లబోయెను. అతడు ఆహ్వానించిన ప్రముఖులును కలవరము చెందిరి.
10. రాజు, అతని ప్రముఖులు చేయు శబ్దము విని రాణి విందుగదిలోనికి వచ్చి, “ప్రభువులవారు కలకాలము జీవింతురుగాక! తమరింతగా భయపడి వెలవెలబోనక్కరలేదు.
11. మీ రాజ్య మున ఒక నరుడున్నాడు. పవిత్రులైన దేవతల ఆత్మ అతనిలో వసించుచున్నది. మీ తండ్రి రాజుగానున్నపుడు అతడు దేవతలకు సమానమైన తెలివితేటలను, జ్ఞానమును, వివేకమును ప్రదర్శించెను. మీ తండ్రియైన నెబుకద్నెసరు అతనిని శాకునికులకు, గారడీవిద్య గలవారలకు, జ్యోతిష్కులకు, సోదెగాండ్రకు, కల్దీయులకు నాయకుని చేసెను.
12. అతనికి గొప్ప ప్రజ్ఞ కలదు. స్వప్నార్థమును, కఠిన ప్రశ్నల భావమును, నిగూఢరహస్యములను తెలియజేయు జ్ఞానము, నేర్పు కలదు. అతని పేరు దానియేలు. రాజతనికి బెల్తేషాజరని పేరు పెట్టెను. ఇప్పుడతనిని పిలిపింపుడు. ఈ వ్రాత భావమును మీకు తెలియజేయును”అని చెప్పెను.
13. వెంటనే దానియేలును రాజు సమక్షమునకు కొనివచ్చిరి. రాజతనితో “మా తండ్రి యూదా నుండి కొనివచ్చిన దానియేలను ప్రవాసివి నీవేనా?
14. పవిత్రులైన దేవతల ఆత్మ నీలో వసించుచున్న దనియు, నీకు తెలివితేటలును, విశేషజ్ఞానమును, వివేకమును మిన్నగా కలవనియు వింటిని.
15. నేను ఈ వ్రాతను చదివి దానిభావమును ఎరిగించుటకు జ్ఞానులను, గారడీవిద్యగలవారిని పిలిపించితినిగాని వారికి దాని అర్థము తెలియలేదు.
16. నీవు గూఢార్థములను, రహస్యములను వివరింపగలవని వింటిని. నీవు ఆ వ్రాతను చదివి దాని భావమును నాకు తెలుపగలవేని ఊదా వన్నె వస్త్రములుతాల్చి, కంఠాభరణమును ధరించి, రాజ్యమున మూడవ అధికారివి అగుదువు” అని పలికెను.
17. దానియేలు రాజుతో ఇట్లనెను: “నీ దానములను నీవే ఉంచుకొనుము. లేదా వానిని మరియొకనికి ఇమ్ము. నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు విన్నవింతును.
18. సర్వోన్నతుడైన దేవుడు నీ తండ్రియైన నెబుకద్నెసరునకు రాజ్యమును, కీర్తివైభవములను ప్రసాదించెను.
19. దేవుడు అతనిని మహాప్రభువును చేయగా సకలదేశములకును, జాతులకును, భాషలకును చెందిన జనులెల్లరును అతనిని చూచి గడగడలాడిరి. అతడు తాను చంపగోరినవారిని చంపెను. బ్రతికియుండవలెనని నిశ్చయించిన వారిని బ్రతికి యుండనిచ్చెను. తాను పైకి తీసికొనిరాగోరిన వారిని తీసికొనివచ్చెను. అణచివేయగోరిన వారిని అణచి వేసెను.
20. కాని అతడు గర్విష్టియు, మొండివాడును, క్రూరుడును అయ్యెను. కనుక దేవుడు అతడిని తన సింహాసనమునుండి తొలగించి అతని కీర్తిని రూపుమాపెను.
21. కనుక అతనిని నరలోకము నుండి తరిమివేసిరి. అతని మనస్సు మృగముల మనస్సు వంటిదయ్యెను. అతడు అడవి గాడిదల నడుమ వసించెను. ఎద్దువలె గడ్డి తినెను. అతని దేహము బయట మంచులోతడిసెను. కట్టకడన అతడు సర్వోన్నతుడైన దేవుడు నరుల రాజ్యములన్నిటిని తన స్వాధీనమున ఉంచుకొనుననియు, వానిని తనకిష్టము వచ్చిన వారికి ఇచ్చుననియు గ్రహించెను.
22. ఆ రాజు తనయులైన మీరు ఈ సంగతులన్నియు తెలిసియుండియు వినయమును అలవర్చుకోరైతిరి.
23. మీరు పరలోకమునకు అధిపతియైన దేవుని ధిక్కరించి దేవాలయము నుండి కొనివచ్చిన పాత్రములను తెప్పించితిరి. మీరు, మీ ప్రముఖులు, మీ భార్యలు, ఉంపుడుకత్తెలు ఆ పాత్రములనుండి ద్రాక్షారసమును త్రాగితిరి. బంగారము, వెండి, కంచు, ఇనుము, కొయ్య, రాతితో చేసిన దైవములను స్తుతించితిరి. ఆ దైవములకు చూపు, వినికిడి యెరుకలేవు. కాని మీ ప్రాణములను, మీ కార్యములన్నిటిని తన గుప్పిటనుంచుకొను దేవుని మాత్రము మీరు గౌర వింపరైతిరి.
24. కనుకనే దేవుడు ఈ హస్తమును పంపి ఈ మాటలను వ్రాయించెను.
25. ఈ వ్రాత యిదియే. 'మెనే మెనే తెకేల్ వుపార్సీన్' (సంఖ్య సంఖ్య, తూకము, విభజనము).
26. దీని భావమిది. మెనే (సంఖ్య) అనగా దేవుడు నీ పరిపాలనా దినములను లెక్కపెట్టి వానిని తుద ముట్టించెను.
27. తెకెల్ (తూకము) అనగా ఆయన నిన్ను త్రాసులో పెట్టి తూచగా నీవు చాల తేలికగా నుంటివి.
28. పార్సీన్ (విభజనము) అనగా దేవుడు నీ రాజ్యమును విభజించి మాదీయులకును, పారశీకులకును ఇచ్చివేసెను.”
29. వెంటనే బెల్షస్సరు ఆజ్ఞపై దానియేలునకు ఊదావన్నె వస్త్రమును తొడిగించి, కంఠాభరణము పెట్టి, అతనిని రాజ్యమున మూడవ అధికారియని ప్రకటించిరి.
30. ఆ రాత్రియే బబులోనియారాజైన బెల్షస్సరును వధించిరి.
31. మాదీయుల రాజు దర్యావేషు తన అరువది రెండవయేట రాజ్యమును ఆక్రమించుకొనెను.