1. యెరూషలేము పౌరులారా! . అది మీ సైన్యములను సిద్ధము చేసికొనుడు. శత్రువులు మనలను ముట్టడింతురు. వారు యిస్రాయేలు న్యాయాధిపతిని కర్రతో చెంపపై కొట్టుచున్నారు.
2. ప్రభువు ఇట్లనుచున్నాడు: బేత్లెహేము ఎఫ్రాతా! నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు అయినను యిస్రాయేలును ఏలబోవువాడు నీ నుండియే ఉద్భవించును పురాతనకాలము మొదలుకొని శాశ్వతకాలము వరకు ఆయన సాక్షాత్కరించువాడు.
3. ప్రసవమగు స్త్రీ శిశువును కనువరకు ప్రభువు తన ప్రజలను శత్రువుల అధీనముననుంచును. అటుపిమ్మట అతని సహోదరులలో శేషించినవారు ప్రవాసమునుండి తిరిగివచ్చి యిస్రాయేలు ప్రజలతో కలియుదురు.
4. అతడు ప్రభువు బలముతోను, ప్రభువైన దేవుని ప్రభావముతోను . తన మందను మేపును. లోకములోని నరులెల్లరును అతని ప్రాభవమును అంగీకరింతురు. కనుక వారు క్షేమముగా జీవింతురు.
5. అతడు శాంతిని కొనివచ్చును. అస్పిరియా మన దేశముపై దాడిచేసి మన కోటలను ముట్టడించెనేని మనము ఏడుగురు గొఱ్ఱెల కాపరులను, ఎనమండుగురు ప్రధానులను నియమింతుము.
6. వారు ఆయుధములతో నిమ్రోదు దేశమైన అస్సిరియాను గెలుతురు. మనపైకి ఎత్తివచ్చిన అస్సిరియానుండి మనలను కాపాడుదురు.
7. జాతులమధ్య మిగిలియున్న యిస్రాయేలీయులు ప్రభువు పంపిన చల్లని మంచువలె అలరారుదురు. మొక్కలపై కురిసిన జల్లువలె ఒప్పుదురు. వారు ప్రభువు పైనేగాని నరులపై ఆధారపడరు.
8. జాతులమధ్య మిగిలియున్న యిస్రాయేలీయులు అడవిలో వన్యమృగములను వేటాడుసింగమువలె ఉందురు. గడ్డి బీళ్ళలో గొఱ్ఱెలను చంపు కొదమసింగమువలె నుందురు. అది గొఱ్ఱెలను కాళ్ళతో తొక్కి ముక్కలు ముక్కలుగా చీల్చును. ఇక వానినెవడును రక్షింపజాలడు.
9. నీ హస్తము నీ విరోధులమీద ఎత్తబడియుండునుగాక! నీ శత్రువులందరు నశింతురుగాక!
10. ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు: ఆ కాలమున నేను మీనుండి మీ గుఱ్ఱములను, రథములను తొలగింతును.
11. మీ దేశములోని నగరములను నిర్మూలించి, మీ కోటలను కూలద్రోయుదును.
12.మీ మంత్రవిద్యను, మీ సోదెకాండ్రను నిర్మూలింతును.
13. మీ విగ్రహములను, దేవతాస్తంభములను పడగొట్టుదును. ఆ మీదట మీరు స్వయముగా చేసికొన్న ప్రతిమలను ఆరాధింపరు.
14. మీ దేశములోని అషీరాదేవత కొయ్యలను ఊడబీకుదును. మీ పట్టణములను ధ్వంసము చేయుదును.
15. నాకు లొంగని జాతులపై కోపముతో పగతీర్చుకొందును.