ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పరమగీతము చాప్టర్ 4

 1. ప్రేయసీ! నీవు మిక్కిలి సుందరాంగివి, మిక్కిలి కోమలాంగివి. మేలిముసుగు మాటున దాగియున్న నీ కన్నులు పావురములవలె ఉన్నవి. నీ కురులు గిలాదు కొండల మీదినుండి క్రిందికి దుముకు మేకలమందవలె ఉన్నవి.

2. నీ దంతములు, ఉన్ని కత్తిరించి కడిగి శుభ్రము చేసిన గొఱ్ఱె పిల్ల లవలె నున్నవి. అవి అన్ని రెండురెండుగా వరుసలు తీరి పొందికగా అమరియున్నవి.

3. నీ పెదవులు ఎఱ్ఱని పట్టబంధములవలె ఉన్నవి. నీవు మాట్లాడునప్పుడు అవి కడు సొబగుగా నుండును. మేలిముసుగు మాటున దాగియున్న నీ చెక్కిళ్లు దానిమ్మ ఫలముల అర్థభాగములవలె ఉన్నవి.

4. నీ కంఠము గుండ్రముగా కట్టిన దావీదు బురుజువలె నున్నది. నీ గళ హారములు ఆ బురుజు చుట్టు వ్రేలాడు వేలాది వీరుల కవచములవలె ఉన్నవి.

5. నీ కుచములు లిల్లీ పూల నడుమ మేసెడి కవలలైన జింక పిల్లలను పోలియున్నవి.

6. ఉదయ వాయువులు వీచిన వరకు, చీకట్లు గతించినవరకు నేను గోపరస పర్వతముమీద వసించెదను. అగరు కొండమీద నివసించెదను.

7. ప్రేయసీ! నీవు సంపూర్ణసౌందర్యవతివి. నీయందు కళంకమేమియు లేదు.

8. వధువా! నీవు లెబానోను కొండల మీది నుండి దిగిరమ్ము. లెబానోను కొండమీదినుండి దిగిరమ్ము, సింగములు, చిరుతపులులు వసించెడి అమాన పర్వత శిఖరమునుండి, సెనీరు, హెర్మోను కొండకొమ్ముల మీదినుండి క్రిందికి దిగిరమ్ము.

9. సోదరీ! వధువా! ఒక్క వాలు చూపుతోనే, ఒక్క కంఠహారముతోనే నీవు నా హృదయము దోచుకొంటివి.

10. సోదరీ! వధువా! నీ ప్రేమ నాకు పరమానందము కలిగించుచున్నది. నీ అనురాగము ద్రాక్షారసముకంటెను శ్రేష్ఠమైనది. నీవు పూసికొనిన సుగంధముల సౌరభము, సకల పరిమళద్రవ్యముల సువాసనను మించినది.

11. ప్రేయసీ! నీ పెదవులనుండి తేనెలు జాలువారుచున్నవి. నీ జిహ్వ పాలుతేనెలతో నిండియున్నది. నీ దుస్తులు లెబానోను సురభిళమును గుబాళించుచున్నవి.

12. నా సోదరి, నా వధువు అన్యులు ప్రవేశింపరాని సొంత ఉద్యానవనము వంటిది. అన్యులు సేవింపరాని సొంత జలధారవంటిది.

13. ఆ తోటలో మొక్కలు పెరుగును. అవి దానిమ్మ చెట్లవలె ఎదిగి శ్రేష్ఠమైన పండ్లు ఫలించును.

14. అచట జటామాంసి, కుంకుమపువ్వు, నిమ్మగడ్డి, లవంగము మరియు సాంబ్రాణి చెట్లు పెరుగును. గోపరసపుమొక్కలు, గంధరసపు మొక్కలు పెరిగి నానాపరిమళములు గుబాళించుచుండును.

15. నా సోదరీ! వధువా! నీవు ఉద్యానవనములోని జలాశయమువంటిదానవు. నీవు నీటి బుగ్గలున్న బావివంటిదానవు. లెబానోను కొండలనుండి పారు సెలయేరువంటిదానవు. ఈ జలములు ఆ తోటను తడుపుచుండును.

16. ఉత్తరవాయువు మేలుకొనునుగాక! దక్షిణవాయువు వీచునుగాక! అవి నా వనముమీద వీచి దాని సువాసనలను ఎల్లయెడల విరజిమ్మునుగాక! నా ప్రియుడు తన వనమున కేతెంచి దానిలోని శ్రేష్ఠఫలములు భుజించునుగాక!